వెళ్ళిరా నేస్తం
అసలే కాలం పరిమితం
వీడ్కోళ్లకీ, కన్నీళ్ళకీ
వ్యవధేదీ?
మనల్ని కలిపిన కాలం
మళ్లా విడదీస్తే
ఏముందీ ఫిర్యాదుకీ?
మనిషి, మనిషి ఒక ద్వీపం
ద్వీపాలను కలిపే తంత్రి ఈ స్నేహం
కాలాన్ని అనుభవాల కత్తెరతో విభజిస్తే
ఏ ఏ వేళల
ఏ ఏ ద్వీపాల నడుమ
అనుసంధానాలు వెలుస్తాయో
ఎన్నాళ్లు నిలుస్తాయో
నికరంగా ఎవరం
ఎలా అంచనా వేయగలం?
కాలం పామై
మనిద్దరి మధ్యా ప్రవహిస్తే
నేను నిందించనూ లేను.
ఎందుకంటే
ఒక పడవై కొన్నాళ్లైనా
మనల్ని ఒకచోట చేర్చింది తానే.
చెప్పొచ్చేదేమంటే
నువ్వూ నేనూ కరగిపోతాం
పదిలంగా మిగిలేది
ఒకటో అరో అభుభూతులే.
కాలం మంచుపొరల వెనకాల
పొద్దు పొడవని ముందు ఎరుపు రంగులా
నిన్నలన్నీ కొద్దో గొప్పో
కనపడుతూనే ఉంటాయి.
అంత మాత్రానికే
నీ స్మృతి
శాశ్వతంగా నిలుస్తుందని
అనృతాలాడలేను
బహుశా ఒంటరి నక్షత్రం
ఆకాశపు కాసారాన్ని
కాపలా కాస్తున్నప్పుడు
గుర్తొస్తావు నువ్వూ.
వెళ్లిరా నేస్తం
అసలే సమయం
పరిమితం!
***
సేకరణః కర్లపాలెం హనుమంతరావు
09= -08 -2020
No comments:
Post a Comment