Saturday, August 29, 2020

బాపూజీ పట్ల ఇంత అపచారమా? -కర్లపాలెం హనుమంతరావు-సూర్య దినపత్రిక ఆదివారం ప్రచురణ




'అసంఖ్యాకమైన భారతీయులకు నేనివాళ ప్రతినిధిగా నిలిచానంటే .. అదిఆయాచితంగా నాకు దక్కిన స్థానం కాదు. కష్టించి నేను సాధించుకున్న గౌరవం'అన్నాడు గాంధీజీ. వినేందుకు డంబంగా అనిపించినా తనను గురించి  తానా హాఫ్నేకెడ్ ఫకీర్ బాహాటంగా చెప్పుకున్న మాటల్లో వీసమెత్తైనా అసత్యం లేదు.

బాపూజీ తనకు తానుగా సంకల్పించుకుని ఉత్తమ మానవుడుగా ఎదిగేందుకు సర్వశక్తులూ ఒడ్డి చిత్తశుద్ధితో కృషిచేసిన రుషితుల్యుడు! ఆయన సత్యంతో చేసిన ప్రయోగాలు పుస్తకం నిజానికి ఒక విశిష్టమైన వ్యక్తిత్వ వికాస పాఠ్యగ్రంథం. జీవితంలో మనిషి మనీషిగా ఉన్నత దశ వైపుకు ఎదగాలంటే, ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో ఆయన ఎక్కడా పాఠంలాగా చెప్పకపోయివుండవచ్చు. కానీ ఆ మహాత్ముడు తనలో తానుగా ఎచెప్పుకున్న నా జీవితమే నా సందేశం అన్న ఆ



ఒక్క ముక్కలోనే అన్ని అర్థాలు దాగి ఉన్నాయి.   ఎవరికి కావాల్సిన అర్థాలు వాళ్లు సులభంగా వెదుక్కోనేందుకు వీలైన నిండు ప్రయోగశాల  బాపూజీ జీవితం.



గాంధీజీ ద్వారా సాధించబడిన స్వాత్రంత్ర్యం ఒక్కటే కాదు, కొల్లాయిగుడ్డ, మేకపాలు, బాదంపప్పు, ప్రకృతివైద్యం, అల్పాహారం, నిరాడంబరత, అహింసావాదం, పేదరికం ఇత్యాదులన్నింటికి భారతీయుల వరకు బాపూజీనే తిరుగులేని అంబాసిడర్.. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ. ఆయన జనంమనిషి అన్న మాట అసత్యం  కాదు.  కానీ, సాధారణ జనం అయన దాకా చేరుకునేందుకు ఎన్నో అసాధారణ

శక్తులు అడ్డుండేవి ఆ రోజుల్లో. బడా బడా వ్యాపారవేత్తలను, బడాయిలు పోయేరాజకీయనేతలను, అసంఖ్యామైన కుబేరులను దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి

మామూలు మనిషికి ఇబ్బందిగా ఉండేది. గాంధీజీ కోరుకుంటే తప్ప ఆయన దర్శనం సామాన్యులకు అంత సులభంగా సాధ్యమయ్యే వ్యవహారంగా ఉండేది కాదన్న మాట నిజం. అయినా  భరతజాతికి ఆయన మీద ఉన్న అభిమానం కాలం గడిచే కొద్దీ పెరిగిందే తప్పించి తగ్గుముఖం పట్టిన దశ ఎన్నడూ లేదు. గుళ్లో దేవుడి దర్శనం కాలేదని దేవుడి నెవరూ తప్పుపట్టరు కదా! గాంధీజీ విషయంలోనూ అదే ప్రభ సాగింది

చివరి రోజు వరకు.


గాంధీజీ సిద్ధాంతాలు గాజు అద్దాలు బిగించిన షో కేసుల్లో అందంగా అమర్చిన కళాఖండాల స్థాయికి ఎదిగి చాలా కాలమయింది. కేవలం వాటిని కళ్లతో చూసి ఆనందించడమే తప్పించి, చేతిలోకి పుచ్చుకుని వాడుకునే సౌకర్యం లేకుండా పోయిందన్న నిష్ఠురం ఉండనే ఉంది. నాడు గాంధీజీ చుట్టూ చేరినవారు గాని,

నేడు గాంధీజీ  జపం చేస్తున్నవారిలో గాని, ఆయన భావజాలం పట్ల ఏ మేరకు అవగాహన ఉందో .. అనుమానమే! బాపూజీ బతికున్న రోజుల్లోనే ఆయన ఆదర్శభావాల పట్ల అంతులేని అయోమయం ప్రదర్శించిన నేతాగణం, ఇన్ని తరాలు గడచిన తరువాతనా ఇహ ఆయన చెప్పిన మాటలను అర్థం చేసుకొనే ప్రయత్నం చేసేది? బాపూజీ చేసిన ఆఖరు పోరాటం ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యం  ఇన్ని తరాలుగా మనం అనుభవిస్తున్నాం.  అయినా ఇంకా 'గాంధీయిజం   రెలెవెన్స్' ను గురించి దేశం ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రాలేకపోవడం ప్రపంచంలో మరెక్కడా జరగని వింతగానే చెప్పుకోవాలి గదా!  బాపూజీ నిరాడంబరతను గురించి కథలు కథలుగా చెప్పుకునే మనమే, ఆయన  జీవన శైలి ఎందువల్ల ఎందుకంత ఖరీదైన సింప్లిసిటీ చట్రంలో బంధించివుంచామో చెప్పగలమా?  పుట్టపర్తి సాయిబాబా చుట్టూ చేరిన భక్తబృందానికి, బాపూజీ చుట్టూ ఆనాడు చేరిన భజనబృందానికి వేష భాషలలోనే తప్ప ఆచరణ వ్యవహారాలలో ఆట్టే తేడా లేదంటే నొచ్చుకునేవారే ఎక్కువగా ఉండవచ్చు. బాబా చెప్పిన ఆచరణీయ సాధ్యంకాని ఆధ్యాత్మిక సిద్ధాంతాల వల్లెవేతకు బాపూజీ నోట పలికిన అభ్యుదయ భావజాలానికి ట్యాగులోనే తప్ప

స్వభావంలో ఆట్టే తేడాలేదంటే కొట్టొస్తారేమో కూడా మూఢభక్తులు. నిజానికి ఖరీదైన జీవితం గడిపేవారూ, జనాలను రకరకాల మార్గాల ద్వారా          దోపిడీచేసేవారు,

అధికారదాహార్తులు బాపూజీ భజన బృందంలో ఆనాడు ఎక్కువగా కనిపించేవాళ్లు. అట్లాంటి వాళ్లని దూరంగా పెట్టాలని బాపూజీ అంతరంగం ఎంతలా కొట్టుమిట్టులాడినా అది బాపూజీకే స్వయంగా సాధ్యంకాని పరిస్థితి.

గాంధీజీలోని ప్రధాన లోపం.. ఆయన తన జీవించివుండగానే బహుశా మానవమాత్రుడెవరూ ఊహించనైనా లేనంత అపారమైన అద్భుత జనాకర్షణ  కూడగట్టుకోవడం. దేవుడిని నిందించినా ఏ కొద్ది మందో కొంతయిన సద్దుకుపోయేవారేమో గానీ, బాపూజీ మీద ఈగ

వాలినా సరే భరించలేనంత ఉద్వేగం  ప్రదర్శించిన  జనాభిమానం ఉన్న ఒకానొక కాలం కద్దు. అతనిపై ఉన్నతవర్గాల ఆకర్షణకు స్వార్థం కారణమైతే, కింది వర్గాల వారి ఆకర్షణకు కేవలం అమాకమైన అభిమానమే కారణం. వీధిలో నిప్పంటుకుంటే ఎంత అసూర్యంపశ్యజాతి వారైనా ఒకసారి అటుకేసి తొంగిచూడకుండా ఉండలేరు. నిప్పుకున్న ఆకర్షణ శక్తి బాపూజీ వ్యక్తిత్వానికి సమకూరడం కాకతాళీయమేమీ కాదు. అసలే మేలిమి బంగారం. ఆ పైన అద్భుత ప్రచారం. మహాత్ముడు సమకూర్చుకున్న అశేష అమితాకర్షణ శక్తికి జంకే తెల్లవాడు ఠారుకుని  భరతగడ్డ మీద నుంచి తారుకున్నది కూడా.



బాపూజీ పై 1948, జనవరి, ముఫ్ఫై నాడు జరిగిన అఘాయిత్యం కాకతాళీయమేమీ కాదు. అంత ఊహించకుండా వచ్చిపడిన ఉపద్రవమూ కాదు. చరిత్రలో ఆ తరహా పాఠాలు ఏ వైరుధ్య వర్గాల మధ్య సామరస్యం కోసం చేర్చడం తప్పించారో అప్పడున్న పరిస్థితుల్లో నిగ్గుతేల్చడం కష్టతరమయివుండవచ్చు గాని.. ఇప్పుడంతా నీళ్లకు నీళ్లు. పాలకు పాలుగా తేటతెల్లమవుతూనే ఉన్నమాట నిజం.  బాపూజీ

దరిద్రకోటి ఉద్ధరణకై తన జీవితాన్ని మీదు కట్టినమాట ఎంత వాస్తవమో, ఆయన ముద్ర చూపించి ధనవంతులు, బలవంతులు మరింత ధనం, బలం సాధించుకున్న మాటా అంతే వాస్తవం. ఇందులో బాపూజీ ప్రమేయం ఏమీ ఉండకపోవచ్చును గానీ, తన పరంగా జరుగుతున్న అవాంఛనీయ పరిణామాల పట్ల ఆయన కేవలం ప్రేక్షకపాత్ర వహించడం మాత్రం విమర్శనార్హమే అవుతుంది కదా సమానమానవత్వకాంక్షాపరుల దృష్టికి!గాంధీమతం అభివృధ్ధి చెందుతున్న దశకు ముందు నుంచే దేశంలో ఎక్కువ మంది విశ్వసించే మతం అంతకు మించిన స్థాయిలో   చెలరేగిపోతోంది. స్వాతంత్ర్యపోరాటంలోకి ఆ విశ్వాసులు కేవలం దినదినప్రవర్థమానమయే 'గాంధీ'తేజం నిలవరించే ముఖ్యోద్దేశంతోనే లాగబడ్డారనే వాదానికి ఆధారాలులేకపోలేదు. అప్పటికే గాంధీ ప్రవచిత హరిజనోద్ధరణ,  మతసామరస్యం  వంటి సగుణాత్మక భావజాలం ప్రజాకోటి గుండెలను పట్టేసున్న పరిణామం. సంకుచిత మతతత్వ శక్తులకు  మింగుడుపడని విపరిణామం. బాపూజీ సైతం హిందూ ధర్మోద్ధరణకై పంతగించినవాడే అయినప్పటికి, ఆయనది ఉదారవాదం, సంస్కరణకోణం. నేరుగా బాపూని ఎదుర్కొనే పరిస్థితులు రాను రాను మరింత దుర్భరమయ్యే పరిణామాలను ముందే ఊహించి, ఆ మతవాదులు సహజంగానే అందుకు అడ్డుకట్టవేసే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. బాపూజీకి దేశం మూలమూలలా పూజలు అందే కాలంలోనే, అదే దేశంలో ఆయనను అంతమొందించే పథకాలకు దేశమంతటా ఆలోచనలు చేయబడ్డాయి. 'ఒక మహాపురుషుడి కోసం దేశమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది' అన్న బాపూజీ హత్యనాటి నెహ్రూజీ విషాదప్రకటనలో ఉన్నదంతా 'శుద్ధసత్యం' అంటే ఒప్పుకోలేం. శాంతిదూత చావు ఆవశ్యకతపై ముందు నుంచే  రహస్య కరపత్రాలు పంచబడ్డాయని వినికిడి. ఆ 'శుభ' వార్త వినేందుకు కొంతమంది 'విశ్వాసులు' టెలిఫోన్ల వద్ద కాచుకుని కూర్చున్నట్లు రికార్డులు తరువాత బైటపడ్డాయి. బాపూజీ 'హే..రామ్' అంటూ  నేలకొరిగిన రోజున వేలాదిమంది సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారంటే.. 'బాపూజ్యోతి' మలిగిపోవడం భారతీయం వంకన జరిగే ఒక మతప్రాభవానికి ఎంత

అగత్యమయిందో అర్థంచేసుకోవచ్చు.



భజనల ద్వారా, కల్లిబొల్లి కన్నీళ్ల ద్వారా ఒక సత్యాన్ని మరుగుపరిచే ప్రయత్నం ఇప్పటికీ కొనసాగడమే జుగుప్సాకరం. నీచశక్తుల పెత్తనానికి ఒక వైయక్తిక శక్తి  అడ్డంకి అయిన  ప్రతీ సందర్భంలోనూ చరిత్రలో ఏం జరిగిందో, మహాత్ముని జీవితంలోనూ అదే జరిగింది. మనిషిని మట్టిలో కలిపేసి, మట్టి విగ్రహాలను నెలకొల్పడం జాతి పట్ల చేసే ద్రోహానికి కొనసాగింపే తప్ప మరోటి కాదు. విశ్వాస పునరుద్ధరణ మిషన స్వార్థశక్తుల పెత్తనం అప్రతిహతంగా కొనసాగేందుకే బాపూజీ బలికావలసొచ్చిందన్న మాట పచ్చి నిజం.  బాపూజీని గొప్పచేసి ఇప్పటి వరకూ బతికేసిన వారి పాత్రా ఈ వంచనాత్మక రూపకంలో తక్కువేమీ లేదు.



ఏటేటా మహాత్ముడి జయంతులు, వర్థంతులు దశాబ్దాల తరబడి మహా ఆర్భాటంగా  జరుగుతున్నా .. ఆయన అహర్నిశలు కలవరించిన బడుగుజీవుల ఉద్ధరణల వంటి

సంస్కరణలు ఒక్కరడుగైనా ముందుకు పడ్డాయా? స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దరిద్రుల బతుకు మరీ దుర్భరమయిందని నిస్పృహచెందేవారు ఇన్ని దశాబ్దాలు

గడిచినా తగ్గుముఖం పట్టడంలేదంటే ఏమిటర్థం?



తుపాకీల నీడన పాలన ఇప్పుడు సర్వసామాన్యమైపోయింది. అహింసాసూత్రమయితే ఏనాడో చేవచచ్చిపోయింది. సత్యంతో సమాజం, రాజకీయం ఇప్పుడు చేసే తమాషా ప్రయోగాలు బహుశా బాపూజీ బతికున్నా ఊహించగలిగివుండునా? తెల్లవాళ్లను మించినన్ప్రన్జాకంటకులు ఇప్పుడు ఎన్నికల నెచ్చెనలేసి జాతి నెత్తినెక్కి మొత్తేస్తున్నారు. గ్రామస్వరాజ్యం గుత్తకు ఇచ్చే పెత్తందారీల వ్యవహారమయిపోయింది. వంటికి నిండుగా బట్ట, కడుపుకు నిండుగా తిండి కోరడమే ఇప్పుడే పెద్ద దేశద్రోహం. సాంఘిక దోపిడీ అనేది ఒకటి ధాటిగానడుస్తున్నదన్న స్పృహే సమాజానికి ఇవాళ బొత్తిగా లేకుండా పోయింది. హరిజనుడు, బడుగుజీవుడు, బలహీనుడు, గ్రామీణుడు, శీలవతి, పసిబాలుడు, వికలాంగుడు, ముసలిమనిషి, సాగు పనులు, చేతివృత్తులు, కుటీర పరిశ్రమ, స్వపరిపాలన, పారదర్శకత, నీతి మార్గం.. ఇలా బాపూజీ భారతీయుల అభ్యున్నతి కోసమై కలవరించని అంశం కనిపించనే కనిపించదు. ఏ ఒక్క రంగమైన బాపూజీ కలలు కన్న రామరాజ్యం తీరులోన సాకారమయే లక్షణాలు కనిపిస్తున్నాయా?

'నేను గాంధీజీ వారసుణ్ణి' అని ప్రకటించుకున్నా ఒక్క ఓటు అదనంగా సాధించే పరిస్థితులు లేనప్పుడు గాంధీగిరీ రెలెవెన్సు గురించి ఇహ చర్చలెందుకు? తాగడం మానెయ్యమని ఆయన నెత్తీ నోరు కొట్టుకుని బోధించినమద్యం మీది ఆదాయమేఇప్పుడు ప్రభుత్వాలు పేదల కోసమై నడిపించే  సంక్షేమ పథకాలకు    ప్రధాన వనరు. ఒక్క కరెన్సీ నోటు పైన మినహా  దశాబ్దాల కిందట జాతి మొత్తాన్నీ సమ్మోహపరచిన ఆ బోసినవ్వుల బాపూజీ మందహాసం మరెక్కడా కనిపించనప్పుడు .. ఇంకా 'రామ్.. రహీమ్ భాయీ.. భాయీ' అంటూ నాటకాలు ఆడడం  రాజకీయం కాక మరేమిటి?

అధర్మం ప్రబలి ధర్మచ్యుతి జరిగినప్పుడు అవతారపురుషుడు జన్మించి దుష్ట శిక్షణ, ధర్మరక్షణ కార్యాలు నిర్వహిస్తాడన్న విశ్వాసం వినడానికి చెవులకు కమ్మగానే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఏది దర్మమో, ఏది అధర్మమో రాజ్యాంగమే తేల్చలేని సందర్భాలు ఇప్పుడు తరచూ ఎదురవుతున్నాయి! పూటకో సరికొత్తనేత తానొక్కడే గాంధీ మహాత్ముణ్ణి మించి ప్రజాసేవకు అంకితమయేందుకే ముందుకు వచ్చినట్లు సరసాలాడుతుంటే జనం మరింత అయోమయంలో పడి ధర్మాధర్మ విచక్షణశక్తి సర్వం కోల్పోతున్నారు. ధర్మరక్షణకు తొమ్మిది అవతారలు వచ్చిపోయినట్లు  మనం గాఢంగా విశ్వస్తున్నామంటే, ఏ ఒక్క అవతారం సంపూర్ణంగా పాపప్రక్షాళన చేయనట్లే  కదా? రాముడంతవాడు ఏ ధర్మ రక్షణకని భూమ్మీదకుదిగివచ్చాడో.. పాపం,  ఆ ధర్మరక్షణ కడదాకా నిర్వహించలేకనే  సరయూనదిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నది. అనుభవం మీద కృష్ణావతారంలో అందుకే భగవంతుడు  మరీ అంత ముక్కు సూటిమార్గం ఎంచుకోనిది. చక్రవ్యూహం దారిలో వెళ్లినప్పటికీ చివరికి స్వజాతిలో పుట్టిన  ముసలమే  ఆయనను ముప్పతిప్పలు పెట్టింది! కృష్ణనిర్యాణం చివరికి జరిగింది తన మానాన తాను వృత్తి చేసుకునే ఓ కిరాతకుడి ద్వారానే అయినా, కిరాతకుడు కిరాతకుడే! ధర్మావతారాలన్నీ ఇలాగే కిరాతకుల చేతనో, నీచుల చేతనో చివరికి అంతమయిపోవడం కాకతాళీయం అనుకోవడానికి లేదు, గాంధీజీని మోహన్ దాస్ గాందీలాగా  ఉండనిస్తే ఆయన కోరుకున్నట్లు నిండు నూరేళ్లు పండులాగా బతికి జాతి నుంచి అసలైన మానుషనీతిని రాబట్టి వుండేవాడేమో! భక్తి మూఢభక్తికి దిగి ఆయనను అవతారపురుషుడు స్థాయికి ఎత్తే సరికి, ఆ అవతార అంతానికి చరిత్రకు మరో కిరాతకుడి చర్య అవసరమయింది. జాగ్రత్తగా గమనించి చూడండి, అవతార పురుషులందరూ ధర్మోద్ధరణకు కాకుండా, మనుషుల్లో ఎంత నీచత్వం దాగుంటుందో చూపించడానికే అవతరించినట్లు అనిపిస్తుంది.  కొడవటిగంటి కుటుంబరావుగారు అన్నట్లు,  బాపూజీ తన మరణం ద్వారా మన మనుషుల మధ్యలోని నీచత్వాన్ని నగ్నంగా నిలబెట్టడానికే పుట్టినట్లు అనిపిస్తుంది నిజానికి.

ఆ నీచత్వం పోగొట్టుకోవడమే బాపూజీకి మనం ఇవాళ నిజంగా ఇచ్చే నివాళి.  ఆ పని మీద దృష్టి పెట్టకుండా పై పైన కొంగభక్తి నటిస్తూ, లోలోపల ఆ మొండి మనిషి ఇప్పుడు బతికిలేనందుకు సంబరపడ్డమే నీచాతినీచం. అట్లా ఆనందపడడం మన స్వార్థం కోసం ప్రతీ రోజూ, ప్రతీ క్షణం ఆ అహింసామూర్తిని చంపుతున్నట్లే! ఆనాడు తెల్లపాలకుడు కూడా చేయడానికి  వణికిపోయిన కిరాతకం ఈనాడు మనం చల్లంగా చేయడానికైనా వెనుకాడడంలేదు. ఎంత సిగ్గుపడాల్సిన దుర్గుణం!
 -కర్లపాలెం హనుమంతరావు
 ***
(సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట ప్రచురితం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...