Sunday, August 30, 2020

రక్తదానం- కర్లపాలెం హనుమంతరావు-




తారతమ్యాలు లేకుండా దానం ఇవ్వగలిగింది రక్తం. ఆ దానానికి మనుషులందరిని మానసికంగా సిద్ధం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ జూన్. 14 వ తేదీని రక్తదాన దినోత్సవంగా నిర్దేశిస్తే, ఆ విధంగా రక్తం ఉదారంగా దానం చేసే కర్ణులను గుర్తించి గౌరవించేందుకు 'ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్స్' అనే అంతర్జాతీయ రక్తదాతల సమాఖ్య స్థాపించబడింది. స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసే దాతలను గుర్తించి వారిని గౌరవించడం ద్వారా సమాజంలో రక్తదాన స్ఫూర్తిని మరింత పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది.
రక్తానికి గడ్డకట్టే స్వభావం ఉంది. అయినప్పటికీ ఒక పరిమిత కాలం వరకు దానిని నిలువచేసే సాంకేతిక పరిజ్ఞానం అభివృధ్ధి చెందింది. ఆ తరువాతనే 'బ్లడ్ బ్యాంకులు' స్థాపన అభివృద్ధి చెందింది. బ్యాకులు దేశ దేశ ఆర్థికరంగ పరిపుష్టికి ఎంత అవసరమో, బ్లడ్ బ్యాంకులు దేశ ఆరోగ్య రంగ పరిపుష్టికి అంతే అవసరం. కొన్ని కొన్ని ప్రదేశాలలో, రహదారుల వెంట ప్రమాదాలు తరచూ జరిగే అవకాశాలు కద్దు. ఆ తరహా ప్రాంతాలను గుర్తించి ఆ దారి పొడుగూతా రక్త బ్యాంకులు ఏర్పాటు చేయడం ఉచితం. అందుకోసమైన ప్రజలలో రక్తాన్ని ఉచితంగా దానం చేసే అలవాటు అభివృద్ధి చెందవవలసిన అవసరం ఉంది.
శరీరం ఉత్పత్తి చేసే రక్తాన్ని గురించి చాలా మందికి సరి అయిన అవగాహన ఉండదు. రక్తాన్ని దానం చేయడం అంటే ఒంట్లోని రక్తాన్ని తోడేయడంగా భావించరాదు. ఎంత రక్తం బైటికి పోతుందో అంతే మోతాదులో రక్తం కొత్తగా శరీరం ఉత్పత్తి  చేస్తుంది. కొత్త రక్తం వంటికి పట్టిన తరువాత మనిషిలోని పూర్వపు మందగొడితనం కొంత తగ్గి,  నూతనోత్సాహం అనుభవంలోకి వస్తుంది కూడా.  వంటి రక్తంలోని చిన్నిపాటి కొవ్వు, మాంస కృత్తుల అసమతౌల్యత  దానికదే సర్దుకుని రక్తదాత ఆరోగ్యంలో మెరుగుదల శాతం పెరుగుతుంది కూడా
అట్లాగని అందరి శరీరాలు రక్తదానానికి అనువుకావు. 17 - 18 సంవత్సరాల వయసు దాటిన వారి దగ్గర నుంచి మాత్రమే రక్తం సేకరిస్తారు. దీర్ఘరోగ పీడితులు, పసిపిల్లలు, పెద్ద వయస్సువారు, మెన్సుయేషన దశ దాటిన స్త్రీల వంటి వారి రక్తం దానానికి స్వీకరించడం శ్రేయస్కరం కాదని ఆరోగ్యశాస్త్రం హితవుచెబుతోంది.
రక్తదానం చేయాలనుకునేవారు తమ పేరును ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. దాత ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి అర్హుడు అని నిర్ధారణ అయితే స్వచ్ఛంద దాతగా పేరు నమోదు చేసుకుంటారు. అవసరమైన సందర్భంలో రక్తదానం చెయ్యడానికి పిలుపు వస్తుంది. రాకపోయినా ఏ పుట్టినరోజు వంటి సందర్భాన్ని మనమే  కల్పించుకుని రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేయనూవచ్చు. తమ అభిమాన సినీకథానాయకుడు జన్మదినోత్సవమనో, తమ రాజకీయ అధినేత పిలువు ఇచ్చాడనో సామూహికంగా రక్తదానం చేసే సందర్భాలు మనం తరచూ చూస్తూ ఉంటాం. స్వఛ్ఛదంగా రక్తం దానం చెయ్యడం కూడా ఒక రకమైన సామాజిక సేవా కార్యక్రమం కిందే లెక్క
రక్తదాతల కరవు వల్ల రక్తాన్ని అమ్ముకునే దురాచారం ఒక వృత్తిగా అభివృద్ధి చెందే అవకాశం తగ్గుతుంది
 'రక్తం ప్రాణులను కాపాడుతుంది. ఆ రక్తదానం నాతో మొదలవుతుంది. స్వచ్ఛమైన రక్తం అందిస్తాను' అన్న నినాదంతో తొలి రక్తదాన దినోత్సవం ప్రారంభమయింది. ఆ నినాదాలు మానవజాతిని శాశ్వతంగా నిలబెట్టే విలువైన నినాదాలు. 'మోర్ బ్లడ్.. మోర్ లైఫ్' లాంటి నినాదాలు ఒక్కో ఏడు ఒక్కొక్కటి తీసుకుని  రక్తదాన దినోత్సవాలు సంరంభంగా జరపడం రివాజుగా వస్తోంది 2004 నుండిమొదటి రక్తదాన దినోత్సవం దక్షిణాఫ్రికా జోహాన్స్ బర్గ్ నగరం నుంచి నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ప్రపంచమంతటా ఈ రక్తదాన దినోత్సవాలు నిరాటంకంగా జరుగుతున్నాయి.
రక్తానికి ఉన్న విలువను గుర్తించడం ముఖ్యం. అయినవారు ఆపదలో ఉన్నప్పుడు, బంధువులు రోగికి సరిపడా రక్తం కోసం వెదుకులాడుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు రక్తం విలువ మనకు అర్థమవుతుంది. రైలు, రోడ్డు ప్రమాదాలు వంటివి పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో రకరకాల రక్తం అవసరమవుతుంది. రక్తం ముందే సేకరించి భద్రపరిచి ఉంచిన సందర్భాలలో అధిక మోతాదులో జరగబోయే ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. స్త్రీల ప్రసవాల సందర్భంలోనూ, కేన్సర్ వంటి రోగులకు.. దీర్ఘకాలిక రోగాల నుంచి కోలుకునేవారికి చికిత్సలు అందించే సందర్భంలోనూ రక్తం ప్రాధాన్యత బాగా పెరుగుతుంది.
మనిషి ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు బాధితుడిని కాపాడే దేవుడు వైద్యుడు అయితే, ఆ దేవుడికైనా సమయానికి అందుబాటులో ఉండవలసిన ముఖ్యమైన సాధనాలలో రోగికి సరిపడే  రక్తం చాలినంత ఒకటి. సరయిన గ్రూపు రక్తం, సరిపడా సమయానికి  దొరికినప్పుడే ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం.  అంత గొప్ప విలువైన సాధనం ప్రతి మనిషి వంట్లోనూ నిరంతరం రక్తం రూపంలో ప్రవహిస్తూనే ఉంటుంది. దానిని పరిమితులకు లోబడి దానం చేసినందువల్ల నష్టం ఏమీ ఉండకపోగా లాభాలే అదనం. ఆ విశేషం ప్రతీ వ్యక్తీ గుర్తించాలి. ఆ విధంగా గుర్తించే దిశగా ప్రభుత్వాలుగాని, ఆరోగ్య సంఘాలు గాని స్వచ్ఛంద అవగాహనా శిబిరాలు ఏర్పాటు చేయాలి.  
రక్తదానంతో మరో ప్రాణి జీవితాన్ని కాపాడవచ్చన్న సత్యం ఆరోగ్యశాస్త్రం పసిగట్టినప్పటి నుంచి రక్తదానానికి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. రక్తంలోని కణాల నిర్మాణం గ్రూపుల ద్వారా నిర్దారించబడుతుంది. ఓ పాజిటివ్ గ్రూప్ గల మనుషులు సాధారణంగా ఎక్కువ సంఖ్యలో లభ్యమవుతుంటారు. రక్తానికి సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య శాస్త్రం 'హెమటాలజీ' రక్తానికి ఉన్న భిన్నమైన గ్రూపులు, ఆర్ హెచ్ లక్షణం గుర్తించి, వ్యక్తి నుంచి మరో వ్యక్తిలోనికి రక్తాన్ని ఎక్కించే సాంకేతిక ప్ర్రరిజ్ఞానాన్ని మరింత  అభివృధ్ధి పరిచింది, అప్పటి నుంచే 'రక్తదానం' ఆలోచన ఒక ముఖ్యమైన ఆదర్శ సామాజిక అంశంగా రూపుదిద్దుకొన్నది. దానిని మరింత ప్రచారంలో పెట్టడం అంటే పరోక్షంగా అయినా మానవ ఆరోగ్యానికి ఇతోధికంగా సాయం అందిస్తున్నట్లే లెక్క. మన శరీరంలో పారే ఒక్కక్క రక్తపు చుక్క మన ఒక్కళ్లకే కాదు.. అవసరమైనప్పుడు లక్షలాది మంది ఇతరుల ప్రాణాలను రక్షించే క్రతువులో సమిధ కింద కూడా సమర్పించవచ్చు. ఈ దిశగా ఒక సదాలోచన ప్రతీ వ్యక్తిలో కలిగించడం, స్వయంగా స్వచ్ఛందంగా ఆ తరహా రక్త దానం చెయ్యడం= రెండూ మనిషిగా పుట్టినందుకు మానవజాతికి ఇతోధికంగా మనం చేసుకునే ఉత్తమ సేవాకార్యక్రమాలే!
-కర్లపాలెం హనుమంతరావు
(జూన్. 14 వ తేదీ రక్తదాన దినోత్సవం)
***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...