Wednesday, February 3, 2021

హేట్సాఫ్ టు.. రంధి సోమరాజూ! -కర్లపాలెం హనుమంతరావు- కవిత

 




 







అయోమయం

అవతారం

ఎత్తింది ఎప్పుడనా

సందేహం?

 

అయితే మన రంధి

సోమరాజు ఏమందీ

 ఈ కింద  ఓసారి

చిత్తగించండి మరీ!-

 

 వీపులేని రోడ్డుమీద

ముక్కులేని కుళ్ళు కాల్వ

ఊపిరి తీసుకుంటున్నప్పుడు..

 గుడ్డలేని బజారు

గొడ్డు వోయిన మబ్బుతో

సరసాలకు దిగిపోయినప్పుడు..

 

నీటి తెగులుతో ఎండిన పాలు

మీటరు మొగుణ్ణి

కాస్త దూరంగా తొలగమని

దండం పెడుతున్నప్పుడు..

 

పచ్చగడ్డి

ఆవును మేసి

మాంసం దుకాణం

పెట్టేసినప్పుడు..

 

నామాల షావుకారి

చేతిలోని తక్కెడ

సూర్యుడి రాయికి సరిసమానంగా

చంద్రుణ్ణీ తూచిచ్చేసినప్పుడు..

 

నీడ నిచ్చే చెట్టుకు

నీడ కావాలని

పెద్దలు లెక్చర్లు

దంచుతున్నప్పుడు..

 

ముక్కు మూసుకుని

నోటితో చెడుగాలిని పీల్చడం

చాలమంది వంటికి సులువుగా

వంటబట్టిన అలావాటుగ మారినప్పుడు..

 

 

పకోడీ ఉద్యోగానికి

ఉల్లిపాయ కూడా

దరఖాస్తు పెట్టుకునే

దుష్టకాలం దాపురించినప్పుడు..

 

వల్లకాటిలో

నిద్ర చాలడం లేదని

శవాలు

ఏడుపు మొగాలు పెడుతున్నప్పుడు..

 

థీరీ ఆఫ్ రెలిటివిటీ

 మంది తెలివిని

వెన్నముద్దల్లా

ఆరగించేసున్న సంధికాలమప్పుడు..

 

అడుక్కునే

అజ్ఞానాన్ని చూసి

విజ్ఞానం ఉడుక్కుంటూ

బొడ్డుని మురు కుంటోన్నప్పుడు..

 

చావుకసలు చావేలేని

రోజొకటి వచ్చేస్తుందేమోనని

ఓ పిచ్చి సన్నాసికి

చచ్చేచావు ఇప్పుడే

వచ్చేసినప్పుడు..

 

దోమకవిగారు

తమ-'గీ'గీతాన్ని

ప్రచురించే పత్రిక బ్రతకాలని

రక్తాన్ని పోగుచేస్తున్నప్పుడు..

 

ఇంత వేగంగా తిరుగుతున్నా

గగ్గోలు పెట్టడం రాని భూమి

విమానం మోతను చూసి

విస్తుపోతున్నప్పుడు..

 

తన కీ తనే ఇచ్చుకుంటే తప్ప

బతికే దారింకేదీ లేదని  

గడియారం బెంగటిల్లి

తపస్సుక్కూర్చున్నపుడు..

 

వెలుతురుతో సహా

వస్తువునీ స్వాహా

చేసెయ్యాలని నీడ

ఆబగా మాటేసినప్పుడు..

 

కళ్ళున్నవాళ్లకూ కళ్ళులేనివాళ్లకూ

ఒకేలా తను కనిపిస్తున్నందుకు

చీకటి కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నప్పుడు..

 

దేవుడికే దేవుడెవడో

తేలలేదని

కబురందిన వేదాంతులు

గుడ్లు తేలవేస్తున్నప్పుడు..

అయోమయం

అవతారం ఎత్తిందని

సోమరాజు రంధి   థీరీ!

నులక మంచం దుమ్ము నుండయినా

శనగపిండి కారబ్బూందీ నలా

వండి వార్చే నలమహారాజు

మన రంధి సోమరాజులు!

.

 

పదికాలాల పాటు

పంటికింద నలిగే

హాటూ స్వీటూ

అందించినందుకు

చేద్దామా 

రంధి సోమ రాజుకు

 'హేట్సాఫ్' అంటూ బిగ్ ఓ సెల్యూటు!

-కర్లపాలెం హనుమంతరావు

జనవరి 19, 2013

 

 

 

 

 

 

వర్ధమాన రచయితలకు శ్రీవాత్సవ లేఖ- కర్లపాలెం హనుమంతరావు

                                                     


 

అఖిలభారత తెలుగు రచయితల 2వ మహాసభ 1963, జనవరిలో రాజమండ్రిలో జరిగిన సందర్భంలో ఒక సావనీర్ తెచ్చారు.సుమారు 200పేజీలకు పైనే ఉంటుందా ప్రత్యేక సంచిక. పి.వి.నరసింహారావు గారు "ఉన్నత లక్ష్యాలతో రచనలు సాగించాల"ని ఉద్భోధిస్తూ చేసిన ప్రసంగపాఠం ఉంది అందులో. విశ్వనాథవారి నుంచీ కాశీ కృష్ణమాచార్యుల వారి దాకా... మధునాపంతుల, సినారె, సోమంచి యజ్ఞన్నశాస్త్రి, దాశరథి, తిలక్, మధురాంతకం, సంపత్కుమార, పిలకా, పురిపండా వంటి  ప్రముఖుల వ్యాసాలు, రచనలు ఎన్నో ఇందులోకనిపిస్తాయి.

ప్రముఖ విమర్శకులు శ్రీవాత్సవ- వర్ధమాన రచయితలను ఉద్దేశించి  లేఖారూపంలో ఒక మూడుపుటల  చక్కని రచన చేశారు. ఆ వ్యాసం మొత్తాన్నీ మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం కుదరదు కాని కొత్తగా రచనలు చేసే ఔత్సాహికులకు ఈ నాటికీ పనికొచ్చే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి.కొన్ని భాగాలను క్లుప్తంగా ఇస్తాను.చూడండి!

రచయితలు అష్టకష్టాలుపడి  రాసిన తమ రచనలకు ఎందుకో(బహుశా సరదావల్లో..మోజుతోనో) కలంపేర్లు పెట్టుకుని ప్రచురించుకుంటుంటారు. మళ్ళా ఆ రచన ప్రచురింపబడ్డప్పుడు ఆ రాసింది తామే అని నలుగురికీ తెలియచెప్పటానికి నానాతంటాలు పడుతుంటారు. ఇంచక్కా సొంతపేరుతో ప్రచురించుకుంటే ఈ తిప్పలుండవు కదా అని శ్రీవాత్సవ అభిప్రాయం. సరే..అదేమంత పెద్ద  విషయం కాదుకానీకాస్త అలోచించదగిన సంగతులు ఇంకా  కొన్ని ఉన్నాయి.

సాధారణంగా రైళ్ళలోనో..బస్సుల్లోనో ప్రయాణంచేస్తూ ప్రేమలో పడిపోయే మధ్యతరగతి యువతనో, నిత్యనీరసంగా ఉండే సతీపతికుతూహల రహస్యాలనో ఇతివృత్తాలుగా తీసుకుని కాలక్షేపం రచనలు చేస్తే వచ్చే ప్రయోజన మేముంది? అంటారు శ్రీవాత్సవ. మన చుట్టూ...  జీవితాలతో నిత్యం సంఘర్షిస్తూ అంతులేని పోరాటం చేసే జనావళి అశేషంగా  కనపడుతుంటే  వాళ్ళ జీవితాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడో..ఎప్పుడో.. కదాచిత్ గా కనిపించే అసాధారణమైన అద్భుత సంఘటనలను గ్లోరిఫై చేసే రచనలు చేయడం ఎంతవరకు సబబు? అలాంటి రాతలు తాత్కాలికంగా సంతృప్తినిస్తాయేమో గానీ.. కలకాలం నిలిచుండేవి మాత్రం కావని శ్రీవాత్సవ అభిప్రాయపడతారు ఆ వ్యాసంలో..

మరీ ముఖ్యంగా మనలోని కొందరు రచయితలు అవినీతిని ఆకర్షణీయంగా చిత్రించే ధోరణికీ పాల్పడుతుంటారు. మనచుట్టూ ఇంత అవినీతి పెరిగిపోతూసామాన్యుడి బతుకును అతలాకుతలం చేస్తుంటే..అదేమీ పట్టించుకోకుండాసంఘాన్ని మరింత  దిగజార్చే  నిమ్న వాంచల్నీ, నికృష్ట తత్త్వాల్ని, దుర్మార్గాన్నీ, దుర్నీతినీ, సౌఖ్య వాంచల్నీ,  కామోద్రేక్తలనీ సమర్ధించే సమ్మోహన విద్యను రచయిత ఉపయోగిచడం ఎంత వరకు ధర్మం? రచయిత అన్నవాడు మనసులో దాగున్న మధురాత్మను మేల్కొలిపి మహనీయమైన కార్యాలు చేయడానికి పురికొల్పే స్థితిలో ఊండాలి. మంచి రచనలతో మనిషిలోని మంచితనాన్నితట్టి లేపవచ్చు అన్నది శ్రీవాత్సవ ఉద్దేశం..

కవిత చెప్పినా,  కావ్యం అల్లినా,  పాట పాడినా, పద్యం పలికినా, కథ వినిపించినా.. మానవతలోని తరగని విలువలను వెలికి తీసేవిగా ఉండాలి. పదిమందీ పదే పదే పలుమారు తలుచుకునే రీతిలో  రచన సాగాలంటే.. మన ముందు తరం రచయతలు తొక్కిన దారేమిటో తెలుసుకోవాలి. ఆ దారిలో మనం నడిస్తే.. మన అడుగుజాడలు తరువాత తరం వారికి అనుసరించేవి అవుతాయని ఆ లేఖలో శ్రీవాత్సవ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు..

ఈ రచనఽఅయన చేసి ఇప్పటికి సుమారు అర్థశతాబ్దం దాటిపోయింది. అయినా ఈ కాలానికీ శ్రీవాత్సవ చెబుతున్న విషయాలు కొత్త రచయితలు సరిగ్గా అతికినట్లు సరిపోతాయి.

ఆశ్చర్యం కలిగించడం లేదు కాని, ఆ దారిలో ఎక్కువ మంది నడవనందుకే బాధంతా!

-కర్లపాలెం హనుమంతరవు

03 -02 -2021

 

 

భావ విపంచి - కవి - కర్లపాలెం హనుమంతరావు

                                                     



కొరకంచు వంటి లోకానుభవం, రస బంధురమైన హృదయ స్థానం, కన్ను కలిగి చరించే చిత్తం, గభీరమైన భావ ప్రకటన కవిత్వానికి అవసరమైన దినుసులు- అంటారు కట్టమంచి రామలింగారెడ్డి  'కవిత్వ తత్త్వ విచారము' లో.

హృదయ తంత్రుల్ని మీటి భావ మాధుర్యాన్ని పంచే విపంచి- కవి. మీన మేషాలు లెక్కించుకుంటూ, గుణకార సూత్ర బద్ధంగా, చెమటోడ్చి చేసే రచన భౌతికశాస్త్రం అవుతుందేమో కానీ కవిత్వం మాత్రం కాదు. కాలేదు. కృత్రిమత్వానికీ మూర్తిమత్వం ప్రసాదించే అసాధారణ ప్రజ్ఞ (భావనా శక్తి- అంటాం  మామూలు మాటల్లో) కవికి ఉండే ప్రత్యేక లక్షణం.

మనస్తత్వ శాస్త్రం ప్రకారం మానవులను మిగతా జీవరాశి నుంచీ విడదీసి ప్రత్యేక  జాతిగా నిలబెట్టి భావోద్దీపన కలిగించే ప్రాకృతిక గుణాలు 1.ఆలోచనలు(Thinking) 2.భావాలు(Feeling) 3.సంకల్పాలు(Willing).  భావాలను ఉత్తేజ పరిచే గుణం  అధికంగా గల మనిషికే కవిత్వ లక్షణాలు అలవడేది. కవిత్వం ఏ నిర్వచనానికీ అందని ఒక బ్రహ్మ పదార్థం అయితే..  ఒకడు కేవలం ఎందుకు కవి మాత్రమే కాకుండా ఉండ లేడో.. ఇంకొకడు ఎంత గింజుకున్నప్పటికీ కవిగా ఎందుకు మారలేడో అంతుబట్టని వింత.  కవికి మాత్రమే ఉండవలసిన ప్రత్యేక లక్షణాలు ఏవో కవుల నైజంలో ఉండి ఉండాలి. ఏవిటవి?!


ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే అది భౌతికశాస్త్ర సిద్ధాంతం అవుతుంది. కన్నది కన్నట్లుగా వ్యక్తీకరిస్తే అది కవిత్వ రసాయనం అవుతుంది. ఉన్నదానికీ కన్నదానికీ మధ్య ఒక సన్నని  తెర ఎప్పుడూ కదలాడుతూనే ఉంటుంది. ఆ తెరను తొలగించుకుని మరీ సత్యశోధనకు తాపత్రయ పడే తత్త్వం శాస్త్రజ్ఞుడిదైతే.. తెరకు ఈవలి వైపునే నిలబడి కంటికి కనిపించే దృశ్యాన్ని కమనీయంగా వర్ణించే నైజం కవిది

సత్యాన్వేషికి లాగా కవికి  శుద్ధ సత్యంతో పని లేదు. సత్యాన్ని  గజం దూరం నుంచైనా సరే నిలబడి మనస్సనే సాధనంతో ఊహించే పనికి కవికి ఇష్టపడతాడు.  

బుద్ధి జీవులకు కవుల భాష చాలా సందర్భాల్లో అసంబద్ధంగా ఉండి చికాకు పుట్టించడానికి కారణం అదే. ఐనప్పటికీ  కొన్ని సందర్భాల్లో ఆ కవిత్వమే తార్కికులకూ సాంత్వన అందించే మంచి ఔషధం అవుతుంది. అదే కవిత్వంలోని విశిష్టత.

కవిత్వానికి ఉండే మరో ప్రత్యేకమైన మంచి లక్షణం దాని చంచలత్వం.. దాని మూలకంగా సంతరించే తాజాదనం.

ఒకే వస్తువును కొన్ని నిర్దేశిత పరిశోధనలకు లోబడి పరీశీలించ గలిగితే ఒకే వస్తువు లాగా నిర్థారించడం అసంభవం కాదు. కానీ  ఒకే వస్తువు కవులు అందరికీ ఒకే విధంగా కనిపించదు. ఆ మాట కొస్తే అదే వస్తువు అదే కవికీ అన్నివేళలా ఒకే విధంగా కూడా కనిపించదు. కాళిదాసునే  మేఘదూతం మళ్ళీ తిరగరాయమంటే పూర్వ రూపంలో రాయగలడని భరోసా లేదు. చూసే సమయ సందర్భాలను బట్టి, అప్పటికి ఉండే రసస్థాయి ఆధారంగా  కవి వ్యక్తీకరణ ధోరణులు మార్పుచెందుతాయి

ఆటంబాంబు నిర్మాణ సూత్రానికి మల్లే ఆడదాని ప్రేమభావనికి ఓ శుద్ధ నిత్య సత్య సూత్రం ఆవిష్కరించడం ఆమెను పుట్టించిన బ్రహ్మకైనా సాధ్యం కాదు? అటువంటి  అసాధ్యంలోనే కవిత్వపు అసలు తాజాదనపు సౌరభ రహస్యమూ  దాగి ఉంది. గురజాడవారి మతం ప్రకారం ఆకులందున అణగి మణగి కూయడమే  కవిత భావనా శక్తి అసలు సిసలు సౌందర్యం.

భావనాశక్తి అనేకమైన మాయలు పన్న గల లీలా వినోదిని-అనేది కట్టమంచి రామలింగా రెడ్డి 'కవిత్వతత్వవిచారం'లో.  నిజమే. కవి తన హృదయంలో అప్పటికి ఉప్పతిల్లిన భావాల అధారంగా చదువరి చేత రూప సందర్శనం చేయిస్తాడు. కవి సమకూర్చిన దూరదర్శినితోనే  చదువరికి వ్యోమసందర్శనం చేయక తప్పని పరిస్థితి. ఆ సందర్శనకు సత్యసంధతతో నిమిత్తం లేదు. రసానుభూతి మాత్రమే అంతిమ లక్ష్యం.  ఆంగ్లకవి టెనిసన్ లాంటి మహానుభావులైతే తమ అసమాన ప్రజ్ఞా పాటవాలతో నందిని పందిలాగా,  పందిని నందిలాగా కూడా చూపించ గల సమర్థులు.  విద్యుత్తరంగాల వేగంతో పాఠకుడి మనో యవనిక మీద ఒక అత్యద్భుతమైన చలనచిత్రాన్ని ప్రదర్శించ గల గడసరులు.  మరుపు రాని, అనిర్వచనీయమైన అనుభవాన్ని అందించడమే కవిత్వం అంతిమ లక్ష్యం.

కాళిదాసులు,  భవభూతులు, పోతనలు, శ్రీశ్రీలు, విశ్వనాథలు, జాషువాలు, నాజర్లు, గద్దర్లు.. జనం నాలుకల మీద ఇవాళ్టికీ అలా నాట్యం చేస్తూనే ఉన్నారంటే.. అలాంటి చిరంజీవనం కలగడానికి  కవిత్వానికి ఎంత ఉపజ్ఞత కావలి! ఆ ఉపజ్ఞతను సృజించే కవి ఎంత సుకృతం చేసుకుని ఉండాలి!

వాల్మీకి లేనిదే రాముడు లేడు. వ్యాసులవారు  పూనుకోక బోయుంటే గీతాచార్యుడి ఆనవాలే మనకు దొరికి ఉండేది కాదు. తిక్కన అంత అద్భుతంగా కవిత్వరీకరించబట్టే పాంచాలి  లోకపరీక్షలో మహా ఇల్లాలుగా  తేలింది. పెద్దన బుద్ధికి ప్రవరాఖ్యుడు, సూరన సంగీత ప్రజ్ఞకి శుక్తిమతి, తెనాలి కవి చతురతకి సుగుణశర్మ పెద్దక్క ఇలా.. నాటి చేమకూర కవి విజయవిలాస కథానాయిక సుభద్ర నుంచీ ఇటీవలి  గురజాడవారి కన్యాశుల్కం తాలూకు  మధురవాణి వరకూ మన మనసుల్లో శాశ్వతంగా గూళ్ళు కట్టుకుని ఉన్నారంటే.. ఆ పుణ్యమంతా  ఆయా కవుల ప్ర్జ్ఞజ్ఞాపాటవాలదే.   భూమి గుండ్రంగా ఉందన్న విశ్వాసం మరో సిద్దాంతం వచ్చి రద్దై పోవచ్చునేమో కానీ భూమి పుత్రిక సీత  రాముని ఏక పత్నీవ్రతానికి భూమికే అన్న నమ్మకం ఎన్ని యుగాలు గడిచినా  జనం గుండెల నుండి చెదరి పోదు. శాస్త్రవేత్తలకు ఉండే పరిమితులు  కవులకు  ఎందుకు ఉండవో.. కవులు సత్యాన్వేషకులకన్నా ఒక మెట్టు ఎప్పుడూ పైనే ఎందుకు ఉంటారో ఈ ఒక్క ఉదాహరణ తరచి చూస్తే చాలు తేలిపోతుంది.   

కాటికి సాగనంపిన పిదప.. ఫొటో ఫ్రేముల్లో బిగించడంతో  కన్నవారి రుణం తీరిపోతున్నట్లు భావిస్తున్న పిదప కాలంలో ఏ రక్త సంబంధమూ లేకపోయినా గుండెల్లో గుళ్ళు కట్టించుకుని మరీ రాముళ్ళూ.. కృష్ణుళ్ళూ .. సీతలూ.. సావిత్రులూ.. జన నీరాజనాలు అందుకుంటున్నారంటే.. వైభవాల  వెనకాల ఉన్నదంతా  ఆయా పాత్రల్ని సృష్టించిన  కవుల కలాల చలవే.


కవిగా పుట్టడం ఒక వరం. కించపడవ్ల్సన అగత్యం లేదు. వేలాది మందిలో ఏ ఒకరికో గాని ఈ శారదాప్రసాదం లభించదు. ఆయాచితంగా లభించిన ఈ ఉపజ్ఞతా విశేషాన్ని మానవత్వపు విలువలు మరింత పెరిగే రీతిలో ఉపయోగించుకునే బాధ్యత మాత్రం మరిచిపోరాదని సలహా.


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

 

 

Tuesday, February 2, 2021

హాస విలాసం -కర్లపాలెం హనుమంతరావు - వ్యాసం




హాసం  ఈశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక  అంతర్భాగం. 'కారము వాడి చూపులగు, నా-/కారము శ్వేతచంద్రికగు, సం/-స్కారము మందహాసములు, ప్రా-/కారము ప్రేమ సన్నిధి గదా! ..' అనే ఆదిదేవుని  సంస్తుతే ఇందుకొక అందమైన ఉదాహరణ. రావణవధ అనంతరం అయోధ్యలో ఆరుబయట వెన్నెల్లో అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు  నిండు కొలువు తీరి కూర్చున్నాడు. సభ పరమ గంభీరంగా ఉంది. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి కిలకిలల నవ్వులు! ఎవరికి వారు ఆ నవ్వుకి తమకు తోచిన భాష్యం తలుచుకుని, ఉలికిపాటుకు గురి అవడం తదనంతర కథాపరిణామం.. 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/  విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్' అంటాడు బమ్మెర పోతన ఆంధ్రమహాభాగవతం నరకాసుర వధ ఘట్టంలో. కృష్ణనారి ఒకసారే సారించిన మందహాసంలో హరి కొక  అర్థం, అరికి మరో అర్థం తోచినట్లు పోతన చెప్పుకొచ్చిన ఆ తీరులోనే నవ్వుకు నూటికి నూరు పైసల నిర్వచనం రాబట్టడం దాని సృష్టికర్త విధాతకైనా అలివిమాలిన కార్యమని తేలిపోతోంది.   చూసే తీరులోనే భేదం. గిరిజాసుతుడి రూపాన్ని పాపం చవితి చంద్రుడు ఏ భావంతో తేరిపార చూసి నవ్వాడో.. పాపం, నిందల పాలయ్యాడు. హాసానికి, పరిహాసానికి మధ్య గల  పల్చటి  కారణంగానే  భారతంలోనూ సాథ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాల పాలయింది. 'నవ్వకుమీ సభలోపల/నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్/నవ్వకుమీ పరసతితో/నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!' అంటో హాసపరిమితుల  మీదుండే పరిమితుల పైన  సుదతులందరికీ బద్దెన చెప్పిన సుద్దులు  నవ్వులాటకు కాదు.   'కారణము లేక నవ్వును.. ప్రేరణమును లేని ప్రేమ.. వృథరా!' అని ఆ సుమతీ శతక కర్త నిష్కారణంగా నీతులకు దిగడు కదా! కానీ కాలంతో పాటు ఆలోచనల్లోనూ మార్పులొస్తున్నాయి మరి.  'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు'అంటున్నాయి  నవీనశాస్త్ర పరిశోధనలు. 'నవ్వు నాలుగిందాల చేటు' అనుకోడం అందం, ఆనందం, ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని గతకాలపు ఛాందసం నుంచి వారసత్వంగా వస్తోన్న మాట – అని కొట్టిపారేస్తున్నది కొత్త తరం.   

 

సరస రసాల సరసన పీట వేసి హాస్యానికీ ఉత్తమ గౌరవ మిచ్చారు ఆలంకారికులు అప్పట్లో కూడా.  'సహవికృతి వేషాలంకార ధార్ఘ్యలౌల్య కలహాసత్ప్రోలాష..' అంటూ కలగాపులగంగా హాస్యానికేదో పెద్ద నిర్వచనమే ఇచ్చే ప్రయత్నమూ చేసారా మేథావులు. ఆ సిద్ధాంతాల రాద్ధాంతాల గోల మామూలు మనుషులం  మనకెందుకుగ్గాని, మనిషి మౌలికంగా ఆనంద స్వరూపుడన్న  అంతిమ సత్యం ఒక్కటి వంటబట్టించుకుంటే సరిపోతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా నవ్వు రావచ్చు. సందర్బోచితంగా  సంభాషణలు సాగించినా.. అసందర్భగా సంభాషణల మధ్య తల దూర్చినా.. శబ్దాలు విరిచి పలికినా.. పదాలు అడ్డదిడ్డంగా పేర్చి చదివినా.. చేష్టలు వికృతంగా  అనుకరించినా.. అకటా వికటంగా ఎట్లా ప్రవర్తించినా.. ఏ వంకర టింకర విన్యాసాలు ప్రదర్శించి అయినా.. మందహాసం నుండి అట్టహాసం దాకా  రకరకాల స్థాయీభేదాలతో నవ్వు ముత్యాలను మనసు గనుల నుండి కొల్లగొట్టవచ్చు.  తిక్కన సోమయాజిది తన పాలు భారతంలో నవ్వులను రాసులు రాసులుగా దిమ్మరించిన చతురత.  పిన్ననవ్వు, చిఱునవ్వు, అల్లన నవ్వు, అలతి  నవ్వు, మంద స్మితం, హర్ష మంద స్మితం, ఉద్గత మంద స్మితం, జనిత మంద స్మితం, అనాద మంద స్మితం, అంటూ తొమ్మిది రకాల చిన్ని చిన్ని నవ్వులను; కలకలనవ్వు, పెలుచనవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటో పెద్ద నవ్వులనో  మూడు రకాలను; కన్నుల నవ్వు, కన్నుల నిప్పు  రాలు నవ్వు, ఎల నవ్వు, కినుక మునుగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు , కటిక నవ్వు,  కినుక నవ్వు అనే మరో  మరో ఎనిమిది రకాలను- వెరసి మొత్తం కాలి, చేతి వేళ్ల లెక్కకు సరితూగేటన్ని హాస విలాసాదులతో వివిధ పాత్రల రసపోషణ  రసఫ్లావితం చేసి 'అహో' అనిపించిన సరసరాజ్య సామ్రాట్టు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభవాలను  గురించి కాళిదాసు నుంచి, కృష్ణదేవరాయల వరకూ, శ్రీనాథుని మొదలు.. చిన్నయసూరి దాకా అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ  కోకొల్లలు. ఆయా హాససారస్వ సర్వస్వాన్ని రామాయాణ భారత భాగవతాదులకు మించిన శ్రద్దాసక్తులతో మహాప్రీతిగా ఇప్పటికీ మనం పారాయణం చేస్తూనే ఉంటిమి.  'ప్రపంచ నవ్వుల దినం' ప్రత్యేకత అంతా .. మన సుమతీశతక కర్త చెప్పుకొచ్చిన  'కారణం లేని నవ్వు' మాహాత్మ్యాన్ని గూర్చి మరింత సదవగాహన పెంచుకొనే సందర్భంగా జరుపుకొనేందుకే!

 

గొంతుకోత పోటీలు.. ఉరుకుల పరుగుల జీవితాలు.. ముంచుకొచ్చిన మీదట కానీ  తెలిసి రాని నివారణ లేని పెను రోగాలు. ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్నవైభోగాల జాబితా చిన్నదేమీ కాదు. కొత్త కొత్త వ్యాధులకు కొత్త కొత్త అధ్యయనాలు.. సరి కొత్త పరిష్కారాలు. అందరికీ అందే ద్రక్షాఫలాలేనా అవి? వీలున్నంత దాకా ఏ మందూ మాకూ జోలికి పోకుండా,  జీవన శైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రాధాన్యత పెరుగుతోందిప్పుడు క్రమంగా. గుడ్డిలో మెల్ల. నవ్వు నాలుగు విదాల చేటన్న మాట సరికాదు. సరికదా  నవ్వుతో ఆరోగ్యానికి అదనంగా అరవై రకాల మేళ్ళు. ఐదు దశాబ్దాల కిందటే నార్మన్‌ క్విజిన్స్‌  విటమిన్‌ ‘సి’ కు  బదులుగా   నవ్వునూ  చికిత్స  ప్రక్రియగా మలిచాడు.  చాలా అధ్యయనాలలో ఉల్లాసం పరమౌషధంగా రుజువు కావడం విశేషం. సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ యోగా గురువు  డా. మదన్‌ కటారియా ప్రారంభించిన హాస చికిత్సా విధానం బహిరంగ సాముహిక సంబరమే నేటి నవ్వులదినోత్సవానికి నేపథ్యం. ఏ కారణం లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు.. ఉద్రిక్తల నుంచి ఉపశమనం, భయాల నుంచి విముక్తి. నవ్వు వల్ల రక్తవాహికలు మరింత విశాలమవుతాయి.   వత్తిడి పెంచే హార్మోన్ల ఉత్పత్తి మందగిస్తుంది., రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకుంటుంది, ప్రాణవాయువుకు ధారాళమైన  సరఫరా మార్గం సాధ్యమవుతుంది, నొప్పిని నివారించే ఎండార్ఫిన్ నిలవలు మరింత పెరగుతాయని, ఊపిరితిత్తుల మళ్లీ ఊత్తేజితమవుతాయని, హృద్రోగ సంబంధ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చనేవి .. చేకూరే వందలాది లాభల్లో కొన్ని మాత్రమే. నిస్పృహకు , నాడీ సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నవ్వితే  పదినిమిషాలు పడి పడి  వ్యాయామం చేసినంత  లాభం. ముఖసౌందర్యం మెరుగుదలకు, సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక  జీవన సూత్రం. సూదంటు రాయిలాగా మంచి వారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానికి ఉంది. కారణాలేమీ అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపక నవ్వగలగడం.. ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని, పరిసరాలను  వెలిగించుకో గలగడం హాస దినోత్సవ సంబరాల వెనకున్న స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తివంతమైన మంత్రం  మన పెదాల మీదే ఉంది .అదే నవ్వుల క్లబ్  హాస నినాదం ‘హా..హా..హా’ నిదానం.

-     కర్లపాలెం హనుమంతరావు

04 -02 -2021

బోథెల్, యూఎసె


                                                              


కలసి ఉంటే కలదా సుఖం?

జి. ఎస్ . దేవి

( కర్లపాలెం హనుమంతరావు )



అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కాకి. అదో రోజు ఆహారంకోసం వేటకుబైలుదేరింది. దారిలో దానికి ఒక గద్ద ఎదురయింది. "తమ్ముడూ! ఎక్కడికీప్రయాణం?" అని యోగక్షేమాలు ఆరాతీయడం మొదలుపెట్టింది. మాటల సందర్భంలో

కాకి వేటకు బైలుదేరినట్లు తెలుసుకుంది. "నాకూ ఇంటినిండా గంపెడు సంతానం.నేనూ నీకు తోడుగా వస్తాను. ఇద్దరం కలసి వేటాడుకుందాం. వేటలో సంపాదించినదేదో ఇద్దరం చెరి కాస్తా పంచుకుందాం. నీకు సమ్మతమైతే ఈ క్షణంనుంచే మనం స్నేహితులం" అని పొత్తు ప్రతిపాదించింది గద్ద.

కాకిదీ అదే ఆలోచన. పెద్దజాతి జీవాల మద్దతు ఉంటే తప్ప మనుగడకు ఆస్కారం లేకుండా ఉన్నాయి పరిస్థితులు. 'గద్ద పెద్దజాతి పక్షి. బలమైనది. వడి ఎక్కువ. ఎంత ఎత్తైనా ఎగరగలదు. ఎంత దూరంలో వున్నా ఆహారం స్పష్టంగా పసిగట్ట గలదు. దీనితో పొత్తు అంటే లాభమే, అదృష్టం కలిసొచ్చినట్లు ముందు గద్దే

పొత్తు ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఆలస్యం చేస్తే అవకాశం జారిపోవచ్చు'అనుకుంది. కాకి గద్ద స్నేహానికి వప్పుకుంది.

ఆ రోజు నుంచి కాకి, గద్ద మంచి స్నేహం చిగురించింది. రెండూ కలిసి వేటకు వెళ్ళేవి. వేటలో సంపాదించిందేదో ముందు అనుకున్న విధంగానే చెరిసగం పంచుకునేవి. 'కలసి వుంటే కలదు సుఖం' అనే సూత్రంలోని సుఖాన్నిస్వయంగా అనుభవిస్తూ సఖ్యంగా కాలక్షేపం చేస్తుండేవి.

పెద్ద పక్షితో కాకి సఖ్యత ఆ అడవిలోనే ఉన్న నక్కకు ఏమాత్రం నచ్చలేదు. ఎవరన్నా ఆనందంగా బతుకుతుంటే నక్కకు అసలు గిట్టదు. నక్క నైజం అది. దాన్నే కుళ్ళుమోతుతనం అంటుంటాం మనం. కాకి గద్దల మధ్య తంపులు పెట్టే అవకాశం కోసం ఎదురుచూస్తోంది నక్క.

ఆ అవకాశం రానే వచ్చింది. నక్కకు ఒకసారి కాలికి గాయమై కదలలేని పరిస్థితి వచ్చిపడింది. ఆహారం దొరకడం దుర్లభంగా ఉంది. ఇదే అదనుగా అది తన ఉపాయాన్నిఆచరణలో పెట్టేందుకు పూనుకుంది.

కాకి, గద్ద వేటకు పోయే దారిలో మూలుగుతూ పడుకుంది. అటుగా వచ్చిన కాకి. గద్ద చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నత్లు కనిపించే నక్కను చూసి ఆగాయి.

"కాకి తమ్ముడూ! ఇక ఈ పూటకు వేట అక్కరలేదు. ఈ నక్క మనకు వారానికి సరిపడా ఆహారంగా సరిపోతుంది" అంది గద్ద.

కాకికీ అలాగే అనిపించింది. "అవునన్నా! మనం వేటాడేదే కడుపు నింపుకోవడానికే కదా! సరిపడినంత ఆహారం దొరికాక మరే ఇతర జంతువునైనా చంపడం అడవి న్యాయానికి కూడా విరుద్ధం. మా ఇంటికి ఇవాళ బంధువులు వచ్చి ఉన్నారు. 'అతిథి దేవో భవ'

అని కదా పెద్దల సూక్తి ! ఈ సారికి వేట జంతువు గుండెభాగం నన్ను తీసుకోనిస్తావా! బంధువుల్లో నా పరువు నిలబడుతుంది" అని కాకి అడిగింది . గద్దకూ అభ్యంతరం చెప్పాలనిపించ లేదు. 'సమయానికి ఆదుకోని స్నేహానికి అర్థం ఏముంటుంది!' అని పెద్ద మనసుతో ఆలోచించింది. 'సరే' అని సంతోషంగా ఒప్పుకుంది.

కాకి, గద్ద ఇంత సఖ్యంగా ఆహారం పంచుకోవాలనుకోవడం నక్క కేమాత్రం నచ్చింది కాదు. 'ఇద్దరి మధ్యా కుంపటి రాజేయడానికి ఇదే తగిన అదను' అని లోలోన ఒక కుతంత్రం ఆలోచించుకుంది.

బైటికి మాత్రం ప్రాణంపోయే బాధ నటిస్టూ "మీ ఇద్దరి మధ్య ఈ స్నేహం చూస్తుంటే నాకు దుఃఖం పొంగుకొస్తోంది. ఈ చివరి రోజుల్లో నేను చేసిన పాపాలు గురుకొచ్చి నా మీద నాకే రోత పుడుతోంది. వచ్చే జన్నలోనైనా మీ వంటిమంచి వారిలో ఒకటిగా పుట్టాలని మహా కోరికగా ఉంది. సాధ్యమైనంత తొందరగా నా ప్రాణాలు తీసేసుకోండి. నా శరీరం మీలాంటి ఉత్తములకు ఆహారంగా మారటం నించి గొప్ప అవకాశం ఇంకేముంది! నా పాపాలకు ఇట్లాగైనా పరిహారం దొరుకుతుందేమో! కాకపోతే నాదొకటే చిన్న విన్నపం. ఈ చివరి కోరికను మీరు ఇద్దరూ తప్పకుండా

మన్నిస్తారనే ఆశిస్తాను" అని బుడిబుడి రాగాలు తీయడం మొదలుపెట్టింది.

"ఎమిటా కోరిక?" అని అడిగింది గద్ద.

"నా దేహంలోని గుండె భాగాన్ని నువ్వే తీసుకోవాలి గద్ద బావా! అతిముఖ్యమైన గుండె భాగం కాకిలాంటి నీచ జంతువు పాలపడితే నాకు వచ్చే జన్మలో ఉత్తమ జన్మ ఎలా దొరుకుతుంది?" అంది నక్క.

నక్క మాటలకు కాకి మనసు చివుక్కుమంది. తనను నీచమైన జంతువు అనడం-ఎక్కడాలేని కోపం తెప్పించింది. "సృష్టి లోని జీవులన్నీ సమానమైనవే. వాటిని సృష్టించే సమయంలో ఒకటి ఎక్కువ.. మరొకటి తక్కువ.. అని దేవుడైనా అనుకుని ఉండడు. ఈ భేదభావాలన్నీ మనకుగా మనం కల్పించుకునేవే. అయినా మా కాకులకు మాత్రం ఏం తక్కువ? అని తగవుకి దిగింది కాకి

."అలా కాదులే కాకిబావా! 'పక్షీనాం కాకి ఛండాలి-పక్షులన్నింటిలోనూ కాకి అతి నీచమైన జీవి' అని కదా

శాస్త్రాలు చెబుతున్నాయి!"అని నయగారాలు పోవడం మొదలుపెట్టింది నక్క.

"మనుషులది ఉత్తమ జన్మ అని కదా మీరనే ఆ శాస్త్రాలు చెబుతున్నది కూడా! అలాంటి మానవులు కూడా మరి చనిపోయిన తరువాత తమ పిండాలని ముందుగా మా కాకులే

తినాలని కోరుకుంటారు. మా గొప్పతనానికి ఇంతకు మించి వేరే నిదర్శనం ఏముంటుంది? ఇంకా ఈ గద్దంటేనే లోకులకు లోకువ. ప్రాణాలు పూర్తిగా పోకముందే కళేబరాలకోసం పైన ఆకాశంలో గిరిటీలు కొడుతుంటాయని అసహ్యం. ఈ గద్దలంటే మనుషులకు యమదూతలకన్నా రోత." అంది కాకి ఆ కోపంలో.

ఎవరికైనా కోపం వస్తే అంతే. మెదడు నిగ్రహం కోల్పోతుంది. మంచి సంబంధాలను చేజేతులా చెడగొడుతుంది క్రోధం. ఇప్పుడు జరిగిందీ అదే. కాకి మాటలకి గద్దా కృద్ధురాలైంది "ఎంత సాహసం! పెద్ద జాతి పక్షిని. నన్ను పట్టుకుని ఇంతలేసి మాటలు అంటావా? జనం నిన్ను మాత్రం మన్నిస్తున్నారనిఅనుకుంటున్నావా? నీ నలుపు చూస్తే వాళ్ళకి ఎక్కడలేని జుగుప్స. నీ అరుపు వింటే అంతకు మించి అసహ్యం! నలుగురూ చేరి చేసే అల్లరిని మీ ' కాకి

గోల' తోనే పోలికపెట్టి చీదరించుకునేది! నీ బతుక్కు నువ్వా మా జాతిని వేలెత్తి చూపించేది! మేం విష్ణుమూర్తి వాహనానికి వారసులం. నక్క బావ చెప్పింది నిజమే. దైవాంశ మాది. బుద్ధితక్కువై నీతో జతకట్టాను. ఈక్షణంనుంచీ నీతో కచ్చి. నక్కబావ చివరి కోరిక మన్నించి తీరాల్సిందే. దానికి పుణ్యగతులు రావాలంటే గుండెభాగం నేనే తిని తీరాలి" అని అడ్దం తిరిగింది గృద్ధ౦..

కాకికి బక్కకోపం ఇంకా ఎక్కువైంది. నెత్తురు పీల్చి బతికే నీచజాతి

దోమకైనా.. 'చీ..పో' అని చీదరించుకుంటే కోపం రాకుండా ఉండదు కదా! ' ఆత్మగౌరవం’ అంటామే మనం.. అది అన్ని జీవులలోనూ ఉండే ఉంటుంది. అహానికి దెబ్బ తగిలితే అందుకే ఎవరికైనా రోషం తన్నుకొస్తుంది. అది సహజమే. ఆ రోషం

పెరిగితే ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ క్షణంలో హద్దులు తెలియవు. బుద్ధి సుద్దులు విననీయదు. జగడానికి దిగి ఆగడం ఆగడం జరిగి అన్నివిధాలా సర్వనాశనం అయిన తరువాతనే ఏ వీరంగాలేవైనా ఆగటం.

కాకి ఆత్మాభిమానమూ దెబ్బతిన్నది మరి. గద్ద ఆత్మగౌరవమూ గాయపడింది. ఇంత కాలం కలిసుంటూ ప్రదర్శించుకున్న పరస్పర సౌహార్దత అంతా కేవలం శుష్క ఆదర్శంగానే మిగిలిపోయింది రెండు పక్షుల మధ్య.

కాకి 'కావు.. కావు' మంటూ తన మూకను కేకలేసి మరీ పిలిచింది.

గద్ద మాత్రం గోళ్ళు ముడుచుకుని కూర్చుంటుందా? ఆ జాతి పక్షులన్నిటికీ పిలుపులు వెళ్ళాయి.

చూస్తున్నంతలోనే కాకులకూ.. గద్దలకూ మధ్య భీకర సంగ్రామం!

అంతా నక్కబావ సమ్ముఖంలోనే. నక్క జిత్తులమారితనం ఫలమే.

ఏ యుద్దంలోనైనా చివర్న తప్పనిసరిగా కనిపించే దృశ్యమే అక్కడా కనిపించింది.

క్షణాల్లో చచ్చిపడిన కాకులు.. గద్దలు! వాటి పీనుగ కుప్పలు! చావు తప్పి కన్నులొట్టపోయిన పక్షులు ఎటెటో ఎగిరివెళ్లిపోయాయి. 'కలసి ఉంటే కలదు సుఖం’ అన్న సూత్రం అంతరార్థం అర్థంచేసుకొనేందుకు ఇప్పుడు అక్కడ ఏ గద్దఅన్నగారూ లేరు. కాకి తమ్ములుంగారూ మిగిలిలేరు. ఉన్నదంతా ఒక్కజిత్తులమారి నక్క మాత్రమే. దానికి ఐదు సంవత్సరాలకు సరిపడినంత ఆహారం..”



"ఐదుసంవత్సరాలకు కాదు ! రెండున్నర సంవత్సరాలకు..”ఠక్కున ఎవరో పార్టీ కార్యకర్త సరిచేసాడు. ‘అవునవును’ అన్నట్లు తతిమ్మా కార్యకర్తలంతా వంతపాడారు.

ఉపాధ్యాయుడు తృప్తిగా తల ఊపాడు “కావాలనే ఐదు సంవత్సరాలని తప్పుగా చెప్పాను తమ్ముళ్లూ! తప్పును చక్కగా గుర్తించారందరూ! ఇదే పాఠం మీద మరో మూడు ప్రశ్నలు. వాటి మీదొచ్చే స్పందనలను బట్టే రేపొచ్చే ఎన్నికలలో మన పార్టీ తరుఫున మీకు దక్కే టిక్కెట్లు. ఈ కథకు తగ్గ పేరేమిటి?”

‘ప్రజాస్వామ్య అవస్థలో ఎన్నికల నాటకం.. ‘

“పొత్తుల ప్రహసనం జిత్తుల అసహనం”’

"గుడ్. బాగా లాగారు సెంట్రల్ పాయింట్! మరో ప్రశ్నః ఈ ఎన్నికల నాటకంలో మన పార్టీ ఏ పాత్రను పోషిస్తే ప్రహసనంలో అసహనం బాగా రక్తి కట్టేది?”

కాకి పేరు ఎంత చెత్త కార్యకర్తయినా చస్తే చెప్పడు. గద్ద పేరైనా వెరైటీ కోసం కొందరు కోరుకుంటారని గురువుగారు భావించారు, అన్నిరోజుల కంఠ శోష ప్రభావం.. వృథా పోలేదు! అందరూ ఏకగ్రీవంగా 'నక్క' పాత్రకే టిక్కెట్టేశారు.

సార్ తృప్తిగా తలాడిస్తూ “వారం రోజులగా సాగిన ఈ రాజకీయ శిక్షణా తరగతుల ఇంతటితో సమాప్తం.” అంటూ లేచి నిలబడ్డారు.

గుండెధైర్యం కాస్తంత ఎక్కువుండే ఓ  కార్యకర్త కలగజేసుకొని అందరి మెదళ్లను తొలిచే సందేహాన్ని బైటపెట్టాడు “మూడు ప్రశ్నలన్నారు, రెండే అడిగారేంటి గురూజీ..?! ఆ మొదటిది కూడా తెలిస్తే మా పీకులాట అణుగుతుంది కదా!”

ఆ పీకులాటకి జవాబు నాకే తేలలేదు ఇంత వరకు. అందుకే అడగలేదు బాబూ! ఆదిగారు కాబట్టి చెప్పక తప్పదు ప్రశ్న “గద్దలకూ కాకులకూ మధ్య పొత్తు ఈ కథలోనే కాదు.. అసలే కథలోనైనా కడ దాకా నిలుస్తుందా.. లేదా?” అన్నది  కథ ముందు నుంచి ఉన్న సందేహం”

హై కమాండుకే అంతుబట్టక తన్నుకులాడే ప్రశ్న! మీలో ఎవరికైనా ఏమైనా సవ్యవ్మైన సమాదానం తెలిస్తే చెప్పేయచ్చు! ఎవరి జావాబు సబబుగా అనిపిస్తే వాళ్లకే .. ఎన్నికలొస్తే గిస్తే.. ఎదుటి పక్షం నలబడనిస్తే.. గిసే.. జనం బడబడా ఓట్లన్నీ మనకే వేస్తే గీస్తే.. కోర్టుల్లో గిట్టనోళ్ళు కేసులెట్లాగూ వేస్తరు.. అవన్నీ గెలిస్తే గెలిస్తే .. అప్పుడు ఏర్పడబోయే ప్రభుత్వంలో కొత్తగా ఎర్పాటు చెసైనా ఇచ్చే  ఆ మంత్రిత్వ శాఖకు పర్మినెంటుగా టెంపరరీ బాధ్యతలు వాళ్లకే!?  ఏం చెప్పండి తమ్ముళ్ళూ కావాలా ఆ పోర్టుఫోలియో?’

అంతటా పిన్ డ్రాప్ సైలెన్స్!

***

(సూర్య దినపత్రిక వ్యంగల్పిక)

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...