హాసం ఈశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయ సంస్కృతిలో
ఒక అంతర్భాగం. 'కారము వాడి చూపులగు,
నా-/కారము శ్వేతచంద్రికగు, సం/-స్కారము మందహాసములు, ప్రా-/కారము ప్రేమ సన్నిధి గదా! ..' అనే ఆదిదేవుని సంస్తుతే ఇందుకొక అందమైన ఉదాహరణ. రావణవధ అనంతరం అయోధ్యలో ఆరుబయట వెన్నెల్లో అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు నిండు కొలువు తీరి కూర్చున్నాడు. సభ పరమ గంభీరంగా ఉంది. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి కిలకిలల
నవ్వులు! ఎవరికి వారు ఆ నవ్వుకి తమకు తోచిన భాష్యం తలుచుకుని,
ఉలికిపాటుకు గురి అవడం తదనంతర కథాపరిణామం.. 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు
శృంగారమున్ జరుగన్' అంటాడు బమ్మెర పోతన ఆంధ్రమహాభాగవతం నరకాసుర
వధ ఘట్టంలో. కృష్ణనారి ఒకసారే సారించిన మందహాసంలో హరి కొక అర్థం, అరికి మరో అర్థం తోచినట్లు పోతన చెప్పుకొచ్చిన
ఆ తీరులోనే నవ్వుకు నూటికి నూరు పైసల నిర్వచనం రాబట్టడం దాని సృష్టికర్త విధాతకైనా
అలివిమాలిన కార్యమని తేలిపోతోంది. చూసే తీరులోనే భేదం. గిరిజాసుతుడి
రూపాన్ని పాపం చవితి చంద్రుడు ఏ భావంతో తేరిపార చూసి నవ్వాడో.. పాపం, నిందల పాలయ్యాడు. హాసానికి, పరిహాసానికి మధ్య గల పల్చటి కారణంగానే
భారతంలోనూ సాథ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాల
పాలయింది. 'నవ్వకుమీ సభలోపల/నవ్వకుమీ తల్లి
దండ్రి నాథుల తోడన్/నవ్వకుమీ పరసతితో/నవ్వకుమీ
విప్రవరుల నయమిది సుమతీ!' అంటో హాసపరిమితుల మీదుండే పరిమితుల పైన సుదతులందరికీ బద్దెన చెప్పిన సుద్దులు నవ్వులాటకు కాదు. 'కారణము లేక నవ్వును..
ప్రేరణమును లేని ప్రేమ.. వృథరా!' అని ఆ సుమతీ శతక కర్త నిష్కారణంగా నీతులకు దిగడు కదా! కానీ కాలంతో పాటు ఆలోచనల్లోనూ
మార్పులొస్తున్నాయి మరి. 'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు'అంటున్నాయి నవీనశాస్త్ర పరిశోధనలు.
'నవ్వు నాలుగిందాల చేటు' అనుకోడం అందం, ఆనందం,
ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని గతకాలపు ఛాందసం నుంచి వారసత్వంగా
వస్తోన్న మాట – అని కొట్టిపారేస్తున్నది కొత్త తరం.
సరస
రసాల సరసన పీట వేసి హాస్యానికీ ఉత్తమ గౌరవ మిచ్చారు ఆలంకారికులు అప్పట్లో కూడా. 'సహవికృతి వేషాలంకార ధార్ఘ్యలౌల్య కలహాసత్ప్రోలాష..' అంటూ
కలగాపులగంగా హాస్యానికేదో పెద్ద నిర్వచనమే ఇచ్చే ప్రయత్నమూ చేసారా మేథావులు.
ఆ సిద్ధాంతాల రాద్ధాంతాల గోల మామూలు మనుషులం మనకెందుకుగ్గాని, మనిషి మౌలికంగా ఆనంద స్వరూపుడన్న
అంతిమ సత్యం ఒక్కటి వంటబట్టించుకుంటే సరిపోతుంది.
ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా
నవ్వు రావచ్చు. సందర్బోచితంగా సంభాషణలు సాగించినా.. అసందర్భగా
సంభాషణల మధ్య తల దూర్చినా.. శబ్దాలు విరిచి పలికినా..
పదాలు అడ్డదిడ్డంగా పేర్చి చదివినా.. చేష్టలు వికృతంగా అనుకరించినా.. అకటా వికటంగా
ఎట్లా ప్రవర్తించినా.. ఏ వంకర టింకర విన్యాసాలు ప్రదర్శించి
అయినా.. మందహాసం నుండి అట్టహాసం దాకా రకరకాల స్థాయీభేదాలతో నవ్వు ముత్యాలను మనసు గనుల
నుండి కొల్లగొట్టవచ్చు. తిక్కన సోమయాజిది
తన పాలు భారతంలో నవ్వులను రాసులు రాసులుగా దిమ్మరించిన చతురత. పిన్ననవ్వు, చిఱునవ్వు,
అల్లన నవ్వు, అలతి నవ్వు, మంద స్మితం,
హర్ష మంద స్మితం, ఉద్గత మంద స్మితం, జనిత మంద స్మితం, అనాద మంద స్మితం, అంటూ తొమ్మిది రకాల చిన్ని చిన్ని నవ్వులను; కలకలనవ్వు, పెలుచనవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటో పెద్ద నవ్వులనో
మూడు రకాలను; కన్నుల నవ్వు, కన్నుల నిప్పు రాలు నవ్వు,
ఎల నవ్వు, కినుక మునుగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు , కటిక
నవ్వు, కినుక నవ్వు అనే
మరో మరో ఎనిమిది రకాలను- వెరసి మొత్తం కాలి, చేతి వేళ్ల లెక్కకు సరితూగేటన్ని హాస విలాసాదులతో వివిధ పాత్రల
రసపోషణ రసఫ్లావితం చేసి 'అహో' అనిపించిన సరసరాజ్య సామ్రాట్టు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభవాలను గురించి కాళిదాసు నుంచి, కృష్ణదేవరాయల
వరకూ, శ్రీనాథుని మొదలు.. చిన్నయసూరి దాకా
అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ కోకొల్లలు.
ఆయా హాససారస్వ సర్వస్వాన్ని రామాయాణ భారత భాగవతాదులకు మించిన శ్రద్దాసక్తులతో
మహాప్రీతిగా ఇప్పటికీ మనం పారాయణం చేస్తూనే ఉంటిమి. ఈ 'ప్రపంచ నవ్వుల దినం'
ప్రత్యేకత అంతా .. మన సుమతీశతక కర్త చెప్పుకొచ్చిన
ఆ 'కారణం లేని నవ్వు'
మాహాత్మ్యాన్ని గూర్చి మరింత సదవగాహన పెంచుకొనే సందర్భంగా జరుపుకొనేందుకే!
గొంతుకోత
పోటీలు.. ఉరుకుల పరుగుల
జీవితాలు.. ముంచుకొచ్చిన మీదట కానీ తెలిసి రాని నివారణ లేని పెను రోగాలు. ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్నవైభోగాల జాబితా చిన్నదేమీ కాదు.
కొత్త కొత్త వ్యాధులకు కొత్త కొత్త అధ్యయనాలు.. సరి కొత్త పరిష్కారాలు. అందరికీ అందే ద్రక్షాఫలాలేనా
అవి? వీలున్నంత దాకా ఏ మందూ మాకూ జోలికి పోకుండా, జీవన శైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ
చికిత్సలకు ప్రాధాన్యత పెరుగుతోందిప్పుడు క్రమంగా. గుడ్డిలో మెల్ల.
నవ్వు నాలుగు విదాల చేటన్న మాట సరికాదు. సరికదా నవ్వుతో ఆరోగ్యానికి అదనంగా అరవై రకాల మేళ్ళు.
ఐదు దశాబ్దాల కిందటే నార్మన్ క్విజిన్స్ విటమిన్ ‘సి’ కు బదులుగా నవ్వునూ చికిత్స ప్రక్రియగా మలిచాడు. చాలా అధ్యయనాలలో ఉల్లాసం పరమౌషధంగా రుజువు కావడం
విశేషం. సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ
యోగా గురువు డా. మదన్
కటారియా ప్రారంభించిన హాస చికిత్సా విధానం బహిరంగ సాముహిక సంబరమే నేటి నవ్వులదినోత్సవానికి
నేపథ్యం. ఏ కారణం లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే
చాలు.. ఉద్రిక్తల నుంచి ఉపశమనం, భయాల నుంచి
విముక్తి. నవ్వు వల్ల రక్తవాహికలు మరింత విశాలమవుతాయి. వత్తిడి పెంచే హార్మోన్ల ఉత్పత్తి
మందగిస్తుంది., రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకుంటుంది,
ప్రాణవాయువుకు ధారాళమైన సరఫరా
మార్గం సాధ్యమవుతుంది, నొప్పిని నివారించే ఎండార్ఫిన్ నిలవలు
మరింత పెరగుతాయని, ఊపిరితిత్తుల మళ్లీ ఊత్తేజితమవుతాయని, హృద్రోగ
సంబంధ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చనేవి .. చేకూరే వందలాది
లాభల్లో కొన్ని మాత్రమే. నిస్పృహకు , నాడీ
సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా.
ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నవ్వితే పదినిమిషాలు పడి పడి వ్యాయామం చేసినంత లాభం. ముఖసౌందర్యం మెరుగుదలకు,
సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక జీవన సూత్రం. సూదంటు రాయిలాగా
మంచి వారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానికి ఉంది. కారణాలేమీ అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపక
నవ్వగలగడం.. ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని,
పరిసరాలను వెలిగించుకో గలగడం హాస దినోత్సవ
సంబరాల వెనకున్న స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తివంతమైన మంత్రం మన పెదాల మీదే ఉంది .అదే నవ్వుల
క్లబ్ హాస నినాదం ‘హా..హా..హా’ నిదానం.
- కర్లపాలెం హనుమంతరావు
04 -02 -2021
బోథెల్, యూఎసె
No comments:
Post a Comment