Wednesday, February 3, 2021

హేట్సాఫ్ టు.. రంధి సోమరాజూ! -కర్లపాలెం హనుమంతరావు- కవిత

 




 







అయోమయం

అవతారం

ఎత్తింది ఎప్పుడనా

సందేహం?

 

అయితే మన రంధి

సోమరాజు ఏమందీ

 ఈ కింద  ఓసారి

చిత్తగించండి మరీ!-

 

 వీపులేని రోడ్డుమీద

ముక్కులేని కుళ్ళు కాల్వ

ఊపిరి తీసుకుంటున్నప్పుడు..

 గుడ్డలేని బజారు

గొడ్డు వోయిన మబ్బుతో

సరసాలకు దిగిపోయినప్పుడు..

 

నీటి తెగులుతో ఎండిన పాలు

మీటరు మొగుణ్ణి

కాస్త దూరంగా తొలగమని

దండం పెడుతున్నప్పుడు..

 

పచ్చగడ్డి

ఆవును మేసి

మాంసం దుకాణం

పెట్టేసినప్పుడు..

 

నామాల షావుకారి

చేతిలోని తక్కెడ

సూర్యుడి రాయికి సరిసమానంగా

చంద్రుణ్ణీ తూచిచ్చేసినప్పుడు..

 

నీడ నిచ్చే చెట్టుకు

నీడ కావాలని

పెద్దలు లెక్చర్లు

దంచుతున్నప్పుడు..

 

ముక్కు మూసుకుని

నోటితో చెడుగాలిని పీల్చడం

చాలమంది వంటికి సులువుగా

వంటబట్టిన అలావాటుగ మారినప్పుడు..

 

 

పకోడీ ఉద్యోగానికి

ఉల్లిపాయ కూడా

దరఖాస్తు పెట్టుకునే

దుష్టకాలం దాపురించినప్పుడు..

 

వల్లకాటిలో

నిద్ర చాలడం లేదని

శవాలు

ఏడుపు మొగాలు పెడుతున్నప్పుడు..

 

థీరీ ఆఫ్ రెలిటివిటీ

 మంది తెలివిని

వెన్నముద్దల్లా

ఆరగించేసున్న సంధికాలమప్పుడు..

 

అడుక్కునే

అజ్ఞానాన్ని చూసి

విజ్ఞానం ఉడుక్కుంటూ

బొడ్డుని మురు కుంటోన్నప్పుడు..

 

చావుకసలు చావేలేని

రోజొకటి వచ్చేస్తుందేమోనని

ఓ పిచ్చి సన్నాసికి

చచ్చేచావు ఇప్పుడే

వచ్చేసినప్పుడు..

 

దోమకవిగారు

తమ-'గీ'గీతాన్ని

ప్రచురించే పత్రిక బ్రతకాలని

రక్తాన్ని పోగుచేస్తున్నప్పుడు..

 

ఇంత వేగంగా తిరుగుతున్నా

గగ్గోలు పెట్టడం రాని భూమి

విమానం మోతను చూసి

విస్తుపోతున్నప్పుడు..

 

తన కీ తనే ఇచ్చుకుంటే తప్ప

బతికే దారింకేదీ లేదని  

గడియారం బెంగటిల్లి

తపస్సుక్కూర్చున్నపుడు..

 

వెలుతురుతో సహా

వస్తువునీ స్వాహా

చేసెయ్యాలని నీడ

ఆబగా మాటేసినప్పుడు..

 

కళ్ళున్నవాళ్లకూ కళ్ళులేనివాళ్లకూ

ఒకేలా తను కనిపిస్తున్నందుకు

చీకటి కుళ్ళికుళ్ళి ఏడుస్తున్నప్పుడు..

 

దేవుడికే దేవుడెవడో

తేలలేదని

కబురందిన వేదాంతులు

గుడ్లు తేలవేస్తున్నప్పుడు..

అయోమయం

అవతారం ఎత్తిందని

సోమరాజు రంధి   థీరీ!

నులక మంచం దుమ్ము నుండయినా

శనగపిండి కారబ్బూందీ నలా

వండి వార్చే నలమహారాజు

మన రంధి సోమరాజులు!

.

 

పదికాలాల పాటు

పంటికింద నలిగే

హాటూ స్వీటూ

అందించినందుకు

చేద్దామా 

రంధి సోమ రాజుకు

 'హేట్సాఫ్' అంటూ బిగ్ ఓ సెల్యూటు!

-కర్లపాలెం హనుమంతరావు

జనవరి 19, 2013

 

 

 

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...