Thursday, February 25, 2021

కొత్త రాజకీయాలకు సరికొత్త అవతారం -సరదా వ్యాఖ్య -కర్లపాలెం హనుమంతరావు

 



పాడు రాజకీయాలని పద్దాకా చీదరించుకోడం మనకో పెద్ద ఫ్యాషనై పోయిందికానీ.. పాలిటిక్సువల్ల ఎన్ని లాభాలో పట్టించుకోకుండా ఉన్నాం.

 ముక్కుసూటిగా వెళితే రాజకీయాలు వికటిస్తాయని మనకో యాంటీ సెంటిమెంటు. ముక్కునిలా లైట్ గా నేలకు రాసేస్తే చాలు ఎక్కడెక్కడి పాపాలూ జనాలు ఇట్టే క్షమించేస్తారని కనిపెట్టేసింది రాజకీయాలే. త్రేతాయుగంనాటికి ఈ తెలివితేటలు అభివృద్ధి చెందకే  పాపం సీతమ్మవారు అంత అమానుషమైన అగ్నిపరీక్షకు గురయింది!

' అనను.. కనను..వినను' అంటూ వున్న నోరూ, కన్నూ, చెవులూ వృథాచేసుకునే చాదస్త రాజకీయాలు కాదన్నా ప్రస్తుతం నడుస్తున్నవి. గతంలో మన యువనేత ఒకాయన అంగరక్షకుడి వీపుని మైకుసెట్టు పెట్టుకునే బల్లగా మార్చే షార్ప్ నెస్ చూపించాడు..  మరి గుర్తుందో లేదో షార్ట్ మెమొరీ ఎక్కువుండే మెజార్టీ ఓటరయ్యలకు. సైంటిస్టులు ఏళ్ళ తరబడి కోట్లు ఖర్చుపెట్టినా సాధించలేని ప్రయోజనాలెన్నో పొలిటీషియన్లు ఇట్టే పసిగట్టి ప్రచారంలో పెట్టేస్తున్నారు పరమ చురుగ్గా.

ఏళ్ల చరిత్రున్న  ఓ జాతీయపార్టీకి గుర్తింపు తెచ్చింది  ఆఫ్ట్రాల్ ఒక అరచెయ్యి. చేతులనేవే లేకపోతే ప్రజాస్వామ్యానికి చేష్టలుడిగినట్లనేగా మీనింగ్? లోక్ పాల్ బిల్ ఎంత గొప్పదైతేనేమి?  చట్టసభల్లో మెజారిటీ సభ్యులు చేతులెత్తిం తరువాతే గదా ఆ బండి ముందుకు కదిలింది!

 బూతు కూతలు రాని నేతలకీ చేతులు చేసే సాయం అంతా ఇంతా  కాదు. ఎదుటి పక్షం మీద మర్యాదపూర్వకంగా దాడి చేయాలంటే ఎంతలావు  పెద్దమనిషైనా 'చేతులు తీసేస్తా.. నాలుక కోసేస్తా.. తోకలు పీకేస్తా' అంటూ  వంటి మీది భాగాలనే కదా మహా రోషంగా  వాడుకోవాల్సుంది..ఎమ్త మాజీ సీనియర్ నేతగా పేరు సంపాదించినప్పటికీ!

హస్తం పార్టీ మీద అస్తమానం పడి ఏడ్చే ఓ యువనేత తదభినయానికి అనుగుణంగా  వాడేదీ మరి స్వీయ హస్తాలనే! రుబ్బుడు రొట్లో పొత్రంలా అరచేతులు అలా గాలిలో తిరక్కపోతే నోటి నుంచొక్క ఓదార్పు ముక్కయినా పెగులుతుందా!

'కళ్ళు కైకలూరులో.. కాపురం డోకిపర్రులో' అని సామెత.   టైపు  పక్కచూపుల మీదెంత రచ్చవుతోందో తెలుసుగా ఈనాటి రాజకీయాలల్లో! హన్నన్నా!  నాయకులు  కళ్లకూ, కన్నీళ్ళకూ అద్దే  కొత్త కళలు మరి అన్నా..ఇన్నా!

శాల్తీలు గల్లంతై పోయి ఏళ్ళూ పూళ్ళూ గడిచిపోతున్నా ఓటరు కంటబడితే చాలు.. వాటర్ ఆఫ్ ఇండియా టైపు.. ఓ.. ఒహటే కన్నీళ్ళ ట్యాపులు పెనింగులు! ఎన్నడో పోయిన బామ్మా, బాపూల చావు శోకన్నాలతో తెప్పలు కట్టేసుకుని ఎన్నికల గోదారి ఈదాలనుకునే టైపు ప్రయోజనాలు రాజకీయవేత్తలకు తప్ప శాస్త్రవేత్తలకు తడతున్నాయా చెప్పండి! ఏళ్ల తరబడి కోట్లు తగలబెట్టినా సైంటిష్టులు సాధించలేని ఫలితాలను పొలిటీషియన్లు ఇట్టే  కనిపెట్టేస్తున్నారు. ఐనా  పాపం జనాల  తిట్లు, సాపనార్థాలు ప్రజాసేవకులకు తప్పడం లేదు. ఎంతన్యాయం!

సాదా  సీదా పేద జనాల పాదాలు.. మైళ్ళు మైళ్లు నడిచి ఏ మురిగ్గుంటల నీళ్ళో తోడితెచ్చుకోడానికో.. స్టాపుల్లో ఆగని బస్సులను వెంటాడి రొప్పడానికో తప్ప పనికిరావు.  అదే మరి ఏ మహామేధావి  అధినేతగారైతేనో? మర్చిపోయిన బోడి మల్లయ్యలను ఎన్నికల ముందు మళ్ళీ మాలిమి చేసుకోడానికి ఇంచక్కా వినియోగించుకుంటారు. పడీ పడీ ప్రసన్నం చేసుకొనేందుకు.. పడనప్పుడు  పట్టి పడదోయడానికి ఎదుటి శాల్తీ తాలుకు   పాదపద్మాలు  ఎంత ఉపయోగమో పాలిటిక్సువాళ్లకు తప్ప తతిమ్మా  వర్గాలెవరికన్నా తడుతున్నాయా?

నోరు అన్నది బడుగుజీవులకైతే పెను శాపం. కరవు రోజుల్లో దాన్ని మేపేందుకు సామాన్యుడు పడే పాట్లు అలివి కానివి. అదే నోరు మరి  మహారాజరాజశ్రీ  ఏ నేతాశ్రీగారికి ఐతేనో?ఎదుటి వర్గం మీద  చేసే దాడిలో తిరుగులేని వజ్రాయుధం.

నిర్భాగ్యులు నిర్వేదంతో చప్పరించుకోడానికి తప్ప పనికి రాని  నాలుక ఎన్నికల్లో హామీలు గుప్పించే వేళ  నాయకులకు ఎంతో కీలకం.  నాటకాంతాన ఇంచక్కా మడతేసి  మళ్ళా ఎన్నికల దాకా భద్రంగా దాచుకునే సాధనం.

ఆ నోరు ఒక్కోసారి అలవాటుగా జారి అల్లరయేటప్పుడు ఠప్పుమని 'సారీ' చెప్పించి 'స్వారీ' సౌకర్యం చేజారి పోకుండా జాగ్రత్త పరిచేవి చెవితమ్మలు. సృష్టించేటప్పుడు బ్రహ్మదేవుడికైనా ఈ కొత్త ప్రయోజనం తట్టిందో లేదో?  చెవితమ్మల్నిలా సుతారంగా  'టచ్'  చేసి వదిలేస్తే చాలు.. ఎంత నికృష్టుడైనా శ్రీకృష్ణ పరమాత్ముడంత వింతగా పునీతుడై పోయేది ఒక్క రాజకీయాలల్లోనే.

రెండు వేళ్లూ నోట్లోకి  తిన్నగా పోయే వెసులుబాటేమీ లేక వట్టిగాలి మాత్రం జనం భోంచేస్తుంటే.. ఆ వేళ్ళనే విక్టరీ సింబల్సుగా మలుచుకున్న ప్రయోజకులు  మన  నేతలూ.. వాళ్ల దూతలూ.

ఓటుబ్యాంకు రాజకీయాల్నే వదులుకోని నాయకులు..  ఉచితంగా వచ్చి పడ్డ  వంటిమీది పార్టులను వృథాగా పోనిస్తారా.. మన పిచ్చిగానీ! నీతిని నమ్మితే మోచేతి మీది బెల్లమే అధికార పదవి.

పై నుంచీ వచ్చిన పెద్దాయనొకాయన ఆ మధ్య  పద్దాకా ఓ యువనేత  డిఎన్ఏ ప్రస్తావన తీసుకొచ్చేవాడు. ఆ పెద్దాయన చెంపల రెండూ  వాయించమన్నాడు యువనేతగారు. నేతల రాజకీఆ యాత్రల్లో చూస్తున్న కథే కదా!  ఆడా మగా  చిన్నా పెద్దా తేడా కూడా చూడక  కంటబడ్ద ప్రతి ఓటరు రెండు చెంపల మీదా చేతులేసి నిమిరే  మా గొప్ప అలవాటు ఓ యువనేతగారిది. 'పంఖా' గుర్తు ఎందుకు ఖాయమైందో! కానీ నిజానికా  బాబుగారి రాజకీయాలకు 'చెంపలు' సరైన సింబల్.

 కొందరు బుర్రమీసాలు.. కొందరు తొడగొట్టుళ్ళ చూట్టూ రాజకీయాలు తిప్పేస్తుంటారు. వంటి భాగాలు  గుర్తుగా కూడదన్న షరతు  ఎన్నికల సంఘానికేదో ఉండుండబట్టి కానీ.. నిజానికి కొన్ని పార్టీలకు 'కడుపు' గుర్తు ఇస్తే ఓటరు ఇట్టే గుర్తుపట్టడం సులభమవుతుంది.

తొందరపాటులో ఏదో కూసి ఆనక చెవులు పట్టుకుని 'సారీ' చెప్పే ఆత్రగాళ్లకేమో చెవుల గుర్తు మోస్ట్ సూటబుల్. తడవ తడవకీ వేళ్లో, గోళ్ళో చూపించే పాడలవాటు పోని వాళ్లకు 'గోళ్ళు ఏపుగా పెరిగిన వేళ్ళు' గుర్తుగా ఖాయం చేస్తే అభిమానులు తగు దూరంలో తిరగేందుకు సులభం. తల్లి చంక దిగకుండా రాజకీయాలు చేసే చంటి బిడ్దలకు 'పాల పీక' లాంటిదేదో గుర్తుగా అందిస్తే పాలిటిక్సుతో ఆడుకుందుకు సరిపోతుంది. అస్తమానం సానుభూతి సెంటిమెంటు మీదనే ఆధారపడ్డ పార్టీలకు  'నీళ్లు నిండిన కళ్ల్ల'ను దయచేయిస్తే  నాలుగు ఓట్లేమన్నా అదనంగా కలిసొచ్చే వెసులుబాటు పెరుగుతుంది. నిండు సభలో, చట్టసభలో కూడా నిద్రాపుకోలేని కుంభకర్ణ  వారసులకు 'గురక మార్కు నోరు' గనక గుర్తుగా దయచేస్తే నిద్రమత్తు ఓటర్ల మద్దతైనా దొరక వచ్చేమో మరి! నీలి చిత్రాలతో తప్ప ఉత్తేజం పొందలేని నీచ నేతలకు ''మార్కు బొమ్మలేమైనా సింబల్సుగా వాడుకునే సౌకర్యం ప్రత్యేకంగా కల్పిస్తే.. ఆ టైపు ఓటర్లంతా ఒకటయ్యే అవకాశం ఇచ్చినట్లవుతుంది.

తలాతోకా .. అని కాదు.. దేన్నైనా తళతళలాండించే కళ మరో పేరే రాజకీయం.

రాజ్యాంగ పెద్దల పుణ్యమా అని ఏదో ఐదేళ్లకోసారి వేలుకి చుక్క పొడిపించుకుని..  నచ్చిన మంచివాడికి ఓటేయ వచ్చనుకుంటుంటే.. మధ్యలో ఈ తిరకాసేమిటంటారా?

చెడ్దవాడికిచ్చే ఓటు తలారి చేతికిచ్చే తల్వారు వేటు వంటిది. పదేసి తలలతో  తలపడే రావణబ్రహ్మ ప్రాణాలు కూడా అరికాలి బొటన వేలులొనేగా పడి ఉండేది! ఎంతేసి వడ్డూ పొడుగున్న నేత ఆయుష్షైనా బ్యాలెట్టు పెట్టె బొడ్డు లోనేగా దాగుండేది! ఓటు గుండేసి చెడ్ద రాజాకీయాలను పేల్చేయాలి' అంటారా!  మీరు చల్లంగుండాలి.  అంతలా  మరి మిగతా ఓటర్లంతా ఆలోచించగలగితే  ఇన్నేసి కళలున్న రాజకీయానికి  అప్పుడే కొత్త అవతారం ఎత్తేది! బాడీలోని ఏ పార్ట్ కయినా వివేచన ఉన్న మెదడే అధినేత!

-కర్లపాలెం హనుమంతరావు

25 -02 -2021

***

 

Wednesday, February 24, 2021

వెన్నెల-కథానిక -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు- ఆదివారం అనుబంధం ప్రచురితం)

 


నాకప్పుడు ఏ అయిదో ఆరో  ఏళ్ళుంటాయనుకుంటా. నాన్నగారి ఉద్యోగ రీత్యా నెల్లూరి ఉదయగిరి దగ్గర్లోని సీతారాంపురంలో ఉన్నాం. నాన్నగారు అడపా దడపా హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చేది. ఆయన ఊళ్లో లేనప్పుడు లంకంత ఆ ఇంట్లో అమ్మా నేనూ మాత్రమే ఉండాల్సొచ్చేది. పగలంతా ఎట్లాగో ఫరవాలేదు కాని, చీకటి పడితే చాలు ప్రాణాలు  పింజం పింజం అంటుండేవి. ఊరు కొత్త కావడం వల్ల పరిచయాలు తక్కువ. ఉన్నా రాత్రిళ్లు తోడు పనుకునేటంత పరిచయస్తులు లేరు. మా ఇంటికొచ్చి వైద్యం చేసే ఆచారిగారు తోడుకీ, ఇంటి పనికీ ఒక మనిషిని పంపించారు. ఆమె పేరే 'వెన్నెల'.

వెన్నెల పేరు ఎంత అందంగా ఉంటుందో.. మనిషి అంత మొరటుగా ఉండేది. గడ్డం కింద సొట్ట, కనుబొమలు మగాళ్ల మీసాలంత ఉండేవి. మాట పెళుసు. కుడికాలు ఎత్తెత్తి వేస్తుంది. నడుస్తుంటే గతుకుల రోడ్డు మీద ఎద్దులబండి పడిలేస్తూ పోతున్నట్లుండేది.

పెళ్లి కాలేదుట. 'నా' అన్నవాళ్లెవరూ లేరని చెప్పారు ఆచారిగారు. అయినా డబ్బుల దగ్గర కాపీనం చూపించేది. ఇంట్లో ఏ పనికిరాని వస్తువు కనిపించినా మూట కట్టుకునిపోయేది. వారానికొకసారి ఎక్కడికో వెళ్లి వస్తుండేది. ఎక్కడికని అమ్మ అదిగితే మాట మార్చేది.

 నాకు వెన్నెలంటే మెల్లగా ఇష్టం ఏర్పడడం మొదలయింది. సందు దొరికినప్పుడల్లా నన్ను ఒళ్లో కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతుండేది. అన్నీ అడవి కబుర్లే. వినడానికి గమ్మత్తుగా ఉండేవి. కుబుసం విడిచిన పాములు ఎంత చురుకుగా కదులుంటాయో, గిన్నీకోడి ఎలా తమాషాగా కూతపెడుతుందో, కుందేళ్ళు మనుషులకు దొరక్కుండా ఎలా తెలివిగా తప్పించుకుంటాయో, అడవి మధ్యలో ఉన్న పాతాళం బావిలో నీళ్లు అన్నికాలాల్లో ఎలా తియ్యగా చల్లగా ఉంటాయో, తేనెపట్టును ఈగలు కుట్టకుండా ఎలా తెలివిగా కొట్టుకురావచ్చునో, కప్పలు రాత్రుళ్ళు రాళ్ల సందుల్లో చేరి ఎలా బెకబెకమంటాయో అనుకరించి నవ్వించేది. భయపెట్టేది. అయినా సరే, కమ్మంగా ఉండేవా అడవి కబుర్లు నాకారోజుల్లో.

 వెన్నెల ఇంట్లో ఉన్నంత సేపూ అమ్మను ఏ పనీ ముట్టుకోనిచ్చేది కాదు. 'దొరసానమ్మా! దొరసానమ్మా!' అంటూ బాగా మన్నన చేసేది. నన్నయితే 'చిన్నదొరా!' అంటూ చంక దించేదికాదు. నాన్నగారు ఇంట్లో ఉంటే మాత్రం చడీ చప్పుడు లేకుండా పనిచేసుకుపోయేది. వెన్నెల కలివిడితనమంతా ఆడవాళ్లతోనూ, నా లాంటి చిన్నపిల్లలతోనే!

 చెల్లాయి అమ్మ కడుపులో ఉందా రోజుల్లో. మా తాతగారి ఊరు పాండిచ్చేరి దగ్గరుండే కడలూరు. 'కాన్పుకు కాస్త ముందే పోరాదా?' అనేవారు నాన్నగారు. 'ఈ అడవిలో ఏం ఉంటారో.. ఏం తింటారో! ప్రసవం టైముకు పోతాలే!' అనేది అమ్మ. నా ఊహ తెలిసి అమ్మ నాన్నగారిని వదిలి ఉన్నది చాలా తక్కువే. 'ఎన్నో కాపురాలను చూశాను గానీ, సీతారాముల్లా మీ అంత వద్దికగా ఉండేవాళ్లని శానా తక్కువ మందిని చూశాను దొరసానీ!' అంటుండేది వెన్నెల. పాపాయికి అమ్మ స్వెట్టర్ అల్లుతుంటే దగ్గర కూర్చుని వింతగా చూసేది వెన్నెల.

 మేం కడలూరు పోవాల్సిన రోజులు దగ్గరపడ్డాయి. మర్నాడు ప్రయాణమనగా ఆ రోజు జరిగింది ఆ సంఘటన. ఇప్పటికీ నాకు నిన్నగాక మొన్న జరిగినట్లుంది. ఆ రోజు పగలంతా అమ్మ నడుం నొప్పిగా ఉందని మంచం దిగలేదు. వెన్నెలే అన్ని పనులూ చేసుకుపోతోంది. సాయంకాలం నాకు పెరట్లో స్నానం చేయించే సమయంలో నడవాలో నుంచి పెడబొబ్బలు. అమ్మ అదే పనిగా ఆగకుండా అరుస్తూనే ఉంది. గభాలున లేవబోయి కాలు మడతబడి బోర్లా పడిపోయింది వెన్నెల. తట్టుకుని లేచి ఇంట్లోకి పరుగెత్తింది. వెనకనే తడి ఒంటితో నేనూ.. !

అమ్మ మంచం మీద ఒక కోతి. పళ్ళు బైటపెట్టి కిచకిచమంటూ అమ్మని బెదిరిస్తోంది. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. పెద్దగా ఏడుస్తున్నాను. నా ఏడుపు చూసి ఆ కోతి నా మీదకు దూకపోయింది. వెన్నెల దాన్ని వెనక్కు నెట్టేసింది. తను మూలనున్న గడకర్ర అందుకునే లోగానే ఇంకో అరడజను కోతులు లోపలికి జొరబడ్డాయి. ఇల్లు కిష్కింధకాండే! ఒక గండుకోతయితే మరీ రెచ్చిపోయినట్లు  పిచ్చి పిచ్చిగా  గెంతుతూ అమ్మ మీదకు దూకి తను అల్లుతున్న స్వెట్టర్ లాక్కుని బైటకు పరుగెత్తింది. అంతే.. వెన్నెలకు శివమెత్తినట్లయిపోయి ఒక కర్ర తీసుకుని దాన్ని తరుముకుంటూ పోయింది. ఆ కంగారులో ఇంటి ముందు కరెంటువాళ్లు తీసిన గోతిలో పడిపోయింది. నలుగురూ చేరి ఆమెను బైటికి తీశారు. గోతిలోని రాళ్లు తలకు ఒకటి రెండు చోట్ల తగిలి రక్తం ధారగా కారిపోతోంది. ఆచారిగారు వచ్చే వేళకు ఆమె శ్వాస తీసుకోవడం ఆపేసింది. నాన్నగారొచ్చే సమయానికి ఇంటి ముందు శవం.. అదీ సీను!

వెన్నెల శవాన్ని ఎవరికి అప్పగించాలో తెలియలేదు. ఆమె కోసం ఎవరూ రాలేదు. ఊళ్లోవాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఆమెను మా ఇంట్లో చేర్చిన ఆచారిగారిక్కూడా ఏంచెయ్యాలో పాలుపోలేదు. నాన్నగారే ఫార్మాలిటీస్ ప్రకారం పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ల అనుమతి తీసుకుని కూలీ మనుషుల చేత పాతిపెట్టించారు. ఈ హడావుడిలో మా కడలూరు ప్రయాణం వాయిదాపడింది.

 వెన్నెల లేని ఇల్లు వెలవెలాబోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆమె మా ఇంట్లో మనిషి అయిపోయింది. వెన్నెలను పదే పదే తలుచుకుంటూ అమ్మ డీలాపడిపోయింది. నా సంగతి సరేసరి. మనిషి ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్లే ఉంది. వెన్నెల కోతి వెంట పడి గోతిలోపడిన దృశ్యం ఇప్పటికీ నిన్న గాక మొన్న జరిగినట్లే ఉంటుంది.

మర్నాడు మా కడలూరు  ప్రయాణమనగా ఆచారిగారు ఒక మనిషిని మా ఇంటికి వెంటబెట్టుకుని వచ్చారు.. వెన్నెల జీతం ఇతనికి ఇచ్చేయండంటూ. ఆ టైములో నేను అమ్మ ఒళ్లో పడుకుని నిద్రపోతున్నాను. ఆచారిగారి మాటలకు మెలుకువ వచ్చింది. ఆ మనిషికి డబ్బిచ్చి పంపిన తరువాత ఆచారిగారిని నాన్నగారు అడిగారు. 'వెన్నెల అంత మంచి మనిషి కదా! ఎవరూ లేకపోవడేమేంటి? ఆమె చనిపోయినప్పుడు కూడా ఎవరు సాయానికి రాకపోవడమేంటి? మీ క్కూడా అమెను గురించి నిజంగా ఏమీ తెలీదా? ఇప్పుడు డబ్బులు తీసుకెళ్లిన మనిషెవరు?' అంటూ.

'ఈ మధ్యకాలంలో వెన్నెలను మీ అంత బాగా చూసుకున్నవాళ్లెవరూ లేరు. నాకు తెలిసింది మీకూ చెబుతా. ఇప్పుడు చెబితే తప్పులేదు. నిజానికి చెప్పాలి కూడా.' అంటూ చెప్పడం మొదలుపెట్టారు ఆచారిగారు. ఆయన అప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటూ ఉంటాయి.

'సీతారాంపురం ఫారెస్టాఫిసులో ప్యూన్ గా చేసె యేసేబు కూతురు ఇది. దీని అసలు పేరు వెన్నెల కాదు. మేరీ. ఇది ఆడికి పుట్టింది కాదు. ఎక్కదో దొరికితే ఎత్తుకొచ్చి సాక్కున్నాడు. ఇది ఇప్పుడంటే ఇట్లా ఉంది గాని చిన్నతనంలో చాలా బాగుండేది. పాత సినిమాలల్లో భానుమతిలాగా పాడేది. అల్లరి చేసెది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఊళ్లో అందర్నీ ఆటపట్టిస్తుండేది. దీని చేత తిట్టించుకోడం పిల్లలకూ, పెద్దలకూ సరదాగా ఉండేది. దీన్ని కవ్వించి తిట్టించుకుని ముచ్చటపడిపోయేవాడు బాషా.

బాషా అంటే ఈ పరగాణాల్లో పెద్ద రౌడీ కింద లెక్క. వాడంటే అందరికీ హడల్. పాత డొక్కు జీపులో జనాల్ని కొండ మీదికీ కిందికీ దింపుతుండేవాడు. అట్లాంటివాడితో ఇది సరసాలాడుతుండేది. వాడే పెట్టాడు దీనికి 'వెన్నెల' అనే పేరు. వెన్నెలని బాషా పెళ్లాడుతాడనుకునేవాళ్లు ఊళ్లో అందరూ. 'నా కూతురు రాణీవాసం పిల్ల. ఈ రౌడీ నా కొడుక్కిచ్చి చేస్తానా! దాని చెయ్యి పట్టుకు పోడానికి ఏ మైసూరు మహారాజో వస్తాడు' అంటుండేవాడు యేసోబు మందు మత్తులో. ఆ మాట బాషా చెవిలో పడిందో సారి. 'ఆ తాగుబోతు సచ్చినోడిచ్చేదేంటి? నేను తీసుకునేదేంటి? వెన్నెల ఎప్పటికీ నాదే. దాని మీద చెయ్యే కాదు.. కన్ను పడినా నా చేతిలో చచ్చాడన్న మాటే!' అంటుండేవాడు బాషా.

ఆ టైములోనే అడవి బంగళాలోకి ఓ ఆఫీసరు దిగాడు. కుర్రాడు పచ్చగా, పట్టుకుంటే మాసిపోయేటట్లుండేవాడు. ఉదయగిరి కోట మీదా, సీతారాంపురం అడవి మీదా ఏవో రిపోర్టులు రాసుకోవడానికి వచ్చాట్ట. ఆయన దర్జా, హంగూ ఆర్భాటం చూసి నేనే డంగైపోయేవాడిని. ఇక చదువు సంధ్యా లేని ఊరి జనాల సంగతి చెప్పేదేముంది! వచ్చీ రాగానే బాషా జీపు రెండు నెలలకు బాడుగ మాట్లాడేసుకున్నాడు. డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టే ఆయన జోరు చూసి యేసోబులో ఆశ కలిగింది. వయసులో ఉన్న తన కూతురిని పనిమాలా బంగళాలో ఆయన ముందు తిప్పుతుండేవాడు. బాషా కిది మంటగా ఉండేది.

ఒకరోజు రాత్రి.. చీకట్లో వెన్నెల మా ఇంటికి వచ్చింది. రెండు రోజుల్నుంచి కడుపులో ఒకటే ఇదిగా ఉంది. ఏమీ సయించటంలా! మందియ్యి ఆచారీ!' అంటూ. దాని చెయ్యి పట్టుకుని చూస్తే నాడిలో తేడా ఉంది. నా అనుమానం నిజమైతే వెన్నెలకు నెల తప్పినట్లే. గుచ్చి గుచ్చి అడిగినా ఏమీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ టైములో దాని మొహంలో కలవరపాటు కనిపించింది.

ఆ మర్నాడు రాత్రి..  వర్షం పడుతూ ఉంది. నవంబర్ నెల చివరివారం.. చలి బాగా ఉంది. పెందరాళే పడుకోవడం నాకలవాటు. నెల్లూరు నుంచి రావాల్సిన చివరి బస్సు వచ్చినట్లుంది. ఆ సందడికి మెలుకువ వచ్చింది. మళ్ళీ నిద్ర పట్టలేదు. వెన్నెల గురించే ఆలోచిస్తూ పడుకున్నాను.మళ్లీ మాగన్నుగా నిద్ర పట్టే సమయానికి ఎవరో తలుపు టకటకమని కొడుతున్న చప్పుడు. ఊళ్లో ఎవరికైనా బాగోలేకపోతే ఎంత రాత్రి వేళలోనైనా ఇంటి కొచ్చి తడుపు తడుతుంటారు. లేచి వెళ్ళి తలుపు తీస్తే మొగం నిండా దుప్పటి కప్పుకున్న ఓ ఆకారం వాకిట్లో వణుకుతూ నిలబడి ఉంది. 'బంగళాలో ఆఫీసర్ మాదాచ్ఛోత్ పడున్నాడు. వెళ్లి చూసుకో! 'ఇంకా ఊపిరి ఉంటే ఏ మందో మాకో ఇచ్చి తెల్లారేసరికల్లా ఊళ్లో నుంచి పంపిచెయ్!' అంటూ మళ్లా  చీకట్లో కలసిపోయింది ఆ ఆకారం.

జీపు వెళ్లిన శబ్దమయింది. అంటే ఆ శాల్తీ బాషా అన్నమాట. బంగళాకు పరుగెత్తాను. మనిషి ప్రాణాలు పోలేదు కానీ.. స్పృహలో లేడు ఆఫీసరు. ఏదో కలవరిస్తున్నాడు కానీ, అర్థంకావడం లేదు. తెల్లారేసరికి తలా ఓ చెయ్యేసి ఎలాగో ఆయన్ని ఆత్మకూరు పంపించేశాం.

తెల్లారిన తరువాత యేసోబు ఘొల్లుమని ఏడుస్తూ వెన్నెలని భుజాన వేసుకుని పరుగెత్తుకొనొచ్చాడు. ఆ పిల్ల వర్షం నీళ్లల్లో తడిసిన రక్తపు ముద్దయి పుంది. స్పృహలో కూడా లేదు. బంగళా వెనక బాలిరెడ్డి తవ్విస్తున్న కొత్త బావి గుంతలో పడుంది సామీ! ఎప్పుడు పడిందో.. ఎందుకు పడిందో.. ఆ దేవుడికే తెలియాలి. వానకు తడుస్తొ.. చలికి వణుకుతో.. వంటి మీద యావ లేకుండా పడివుంది. 'నా కూతుర్ని బతికించు ఆచారీ! చచ్చి నీ కడుపున పుడతా!' అంటూ కాళ్లా వేళ్ల పడి ఏడుస్తున్నాడు యేసోబు.

ఏదో ఎత్తు మీద నుంచి పడటం వల్ల ఆ పిల్ల కుడి కాలు ఎముకలు మూడు చోట్ల విరిగాయి. మొహం మీది బొమికలు పొడుచుకొచ్చి చూడ్డానికే మహా భయంకరంగా ఉంది. నెల్లూరు ఆసుపత్రిలో మూడు నెలలుంది. మనిషి బతికింది కనీ శాశ్వతంగా అవిటిదైపోయింది. ఆ మొహం మీద సొట్టలూ, మచ్చలూ అన్నీ అప్పటివే. ఇప్పటి ఈ మనిషిని చూస్తే అప్పటి ఆ  అందమైన ఆడపిల్ల అంటే ఎవరూ నమ్మరు. అప్పటి పాటుకు గర్భసంచీ కూడా దెబ్బతింది. తీసేయాల్సొచ్చింది. ఆ ఆఫీసరు మళ్లా ఊళ్లోకి రాలేదు. పోలీసు కేసయింది. బాషా కనిపించకుండాపోయాడు. వాడి మొదటి పెళ్లానికి మతి చెలిస్తే పిచ్చాసుపత్రిలో పడేశారు. ముగ్గురు పసిబిడ్డలు బాషాకు. ఇన్నాళ్లూ వాళ్లని నెల్లూరు హాస్టల్లోనే ఉంచి వెన్నెలే సాకుతూ వస్తోంది. అందుకే అది అందరి దగ్గరా డబ్బు దగ్గర మాత్రం అంత కాపీనంగా ఉండటం!

'వారానికి ఒకసారి వెళ్లేది వాళ్ల దగ్గరికేనా?' అంది అమ్మ పశ్చాత్తాపంగా.

'అవునమ్మా! ఈ రోజుల్లో పిల్లల చదువులు.. పెళ్లిళ్లు అంటే ఎంతెంత కావాలీ! అదీ దాని యావ. బాషా పిల్లల కోసం అది తన పెళ్లి ఊసు ఎత్తనిచ్చేది కాదు. ఆ దిగులుతోనే యేసోబు తాగి తాగి చచ్చాడు. పెళ్ళికి ముందే కడుపు చేయించుకుందని ఊళ్లో అందరూ దాన్ని చులకనా చూస్తారు. అందుకే దాని చావు నాడు కూడా ఎవరు ఇటు తొంగి చూడలేదు.

యేసేబు పెంచుకున్నందుకు వెన్నెలను కిరస్తానీ అనాలా? బాషాను ప్రేమించినందుకు ముసల్మాను అనాలా? ఆ ఆఫీసరు పాడు చేసినందుకు మన మతం మనిషి అనాలా?  ఆ సందిగ్ధంలో ఉండే ఆ రోజు వెన్నెల పార్థివ దేహాన్ని ఏం చేద్దామని మీరు అడిగినప్పుడు సమాధానం ఏం చెప్పడానికీ పాలుపోలేదు. ఇందాక వచ్చి మీ దగ్గర వెన్నెల జీతం పట్టుకుపోయిన వ్యక్తి బాషా పిల్లలుండే హాస్టల్ ఉద్యోగి. ఇక ముందు ఆ పిల్లల గతేమిటో ఆ శ్రీమన్నారాయణుడికే తెలియాలి' అంటూ లేచారు ఆచారిగారు.

(ఆ పిల్లలకు ఆ ఏర్పాట్లేవో మా నాన్నగారు తరువాత చేయించారు ప్రభుత్వం వైపు నుంచి)

 ఆచారిగారు ఇంత చెప్పినా .. ఆ నవంబరు చివరివారం రాత్రి చీకట్లో.. అడవి బంగళాలో ఏం జరిగిందో మిస్టరీగానే మిగిలిపోయింది. వెన్నెల గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ విషయమే నన్ను తొలుస్తుండేది.

---

సుమారు పాతికేళ్ల తర్వాత ఆ చిక్కుముడీ తమాషాగా విడిపోయింది.

అనుకోకుండా ఒక పుస్తకాల దుకాణంలో ఆంధ్రప్రదేశ్ కోటలను గురించిన పరిశోధనా గ్రంధం ఒకటి నా కంటబడింది. అందులో ఉదయగిరి కోటను గురించి ఆంధ్రా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ డా॥ చిలువూరు సూర్యనారాయణశర్మగారు  రాసిన వ్యాసం ఉంది. ఆ వ్యాస విషయాన్ని బట్టి, సీతారాంపురం అడవులను గురించి చేసిన ప్రస్తావనలను బట్టి.. ఆయనకూ .. ఆ ప్రాంతానికి ఏదో అవినాభావ సంబంధం ఉందనిపించింది.

శర్మగారి చిరునామా సంపాదించి ఆయన్ని కలిశాను. ముందు ఆయన నోరు విప్పడానికి అంతగా సుముఖత చూపించలేదు. కానీ, వెన్నెల చనిపోయిన తీరు ఊరిలో ఆమెకు జరిగిన అవమానాలను గురించి వివరించినప్పుడు ఆయనలో కదలిక వచ్చింధి. ఆ కదలికే ఆయన నోటి నుంచి ఆ నవంబరు చలి రాత్రి ఏమి  జరిగిందో బైటపెట్టింది.

'ఆచారిగారి ద్వారా నెల తప్పినట్లు  తెలియడంతో ఆ నిర్వాకం నాదేనని పసిగట్టింది  వెన్నెల. నా రూము కొచ్చి తాళి కట్టమని గోల పెట్టింది. అప్పటికే నాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు! విషయం విన్న వెంటనే షాక్ అయింది. అయినా వెంటనే తేరుకొంది. 'నా తంటాలేవో నేను పడి చస్తా ఆనక. బాషా బండ చచ్చినోడు. నన్నీ టయింలో ఇక్కడ చూసాడంటే మీకిక్కడే నూకలు చెల్లినట్లే. వాడొచ్చి పోయిందాకా నేను వెనక పక్క కింద గది కిటికీ సన్ షేడ్ మీద దాక్కునుంటా. మీరు పోయేటప్పుడు  మర్చిపోకుండా  నన్ను  పైకి లాగితే చాలు! అబ్బలు చేసిన ఛండాలప్పనికి బిడ్డలెందుకు బలవాల.. నాకుమల్లే? అందరికీ మా ఏసోబయ్యలాంటి దేవుళ్లే దొరుకుతారా? మన మూలకంగా ఎవుళ్ళూ ఉత్తిపున్నేనికే బాధపడద్దంటాడు  మా తాగుబోతయ్య!'  అనుకుంటూ .. అంత వర్షంలోనూ .. చీకట్లో..  కిటికీ చువ్వల మధ్య గుండా  దూరుకుంటూ కింది భాగం గది కిటికీ  పైని పాత బడ్డ సన్ షేడ్  మీదకు జారెళ్లి కూర్చుంది వెన్నెల.. తల్లి!' అంటున్నప్పుడు శర్మగారి గొంతులో సన్నని వణుకు. 

'బాషా తలుపు విరగ్గొట్టుకొనొచ్చి వెంట తెచ్చుకున్న జీప్ రెంచితో నా బుర్ర మీద చాలా సార్లే మోదేడు. స్పృహ తప్పడం తెలుస్తూనే ఉంది. ఆ తరువాత జరిగినవేవీ  తెలియవు. విశాఖలో చాలాకాలం ట్రీట్ మెంట్ తీసుకున్నాను' అని గతం గుర్తుచేసుకున్నారీ శర్మగారు.

తలుపు చిన్నగా కొట్టి ఒక పాతికేళ్ల అందమయిన అమ్మాయి కాఫీ కప్పులతో సహా లోపలికి వచ్చింది.

'మా అమ్మాయి' కాజ్యువల్ గా పరిచయం చేశారు శర్మగారు,

'పేరేంటి తల్లీ?' అనడిగాను అణుకువతో 'నమస్తే చెప్పే ఆ పాపను.  

'వెన్నెల'  అంది చిరునవ్వుతో. నా చిన్నతనంలోని


 వెన్నెల చిరునవ్వే మళ్లీ గుర్తుకొచ్చింది.

నాకు ఆడపిల్ల పుడితే పెట్టుకోవాలనుకున్నదీ అదే పేరు.

-కర్లపాలెం హనుమంతరావు

24 -02 -2021

***

(ఈనాడు- ఆదివారం అనుబంధం







ప్రచురణ)

 











 

 

 

 

 

 

 

 

 

 

 

Tuesday, February 23, 2021

చిన్న వ్యాసం : ఆడవాళ్లూ ! ముందు మీరు మారండి! -కర్లపాలెం హనుమంతరావు




అశోకుడు తన సువిశాల సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసుకుని పరిపాలించిన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణ భాగంలోని ఆంధ్రరాష్ట్రానికి సువర్ణగిరి రాజధానిగా ఉండేది.  కాలానుగతంగా అది జొన్నగిరి అనే చిన్ని గ్రామంగా కుచించుకుపోయింది.
కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా గుత్తికి దగ్గర్లో ఉన్న ఈ జొన్నగిరికి చేయి దూరంలో   ఎఱ్ఱగుడి  రాతి బండల మీద అశోకుడు చెక్కించిన కొన్ని ధర్మలిపులు.. సుమారు రెండువేల రెండు వందల ఏళ్లపాటు ఎండకు ఎండుతూ , వానకు తడుస్తూ ఉండిపోయినవి.. భూగర్భ శాస్తజ్ఞుడు ఎస్. ఘోష్  ఖనిజాల వేటలో ఉండగా కాకతాళీయంగా బైటపడ్డాయి. పురాతత్వ శాస్త్రజ్ఞులు (దయారాం సహానీ, హరప్రసాద్ శాస్త్రి) ధృవపర్చిన మీదట 1929, జూన్ , 11 వ తేదీ నాటి పత్రికలలో అధికారికంగా ప్రకటింపబడ్డాయి. 
ప్రముఖ తెలుగు చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరు వేంకట రమణయ్యల పుణ్యమా అని అవి  ఎస్టాంపేజ్ పత్రాల రూపంలో గుట్టు చప్పుడుకాకుండా  చెన్నపట్నం చేరడం,  1929, సెప్టెంబర్ నాటి భారతిలో దొరికిన రెండు లఘురూపాలు, పథ్నాలుగు పెద్ద సైజు  ధర్మశాసనాల వివరాలు లోకం విశదంగా తెలుసుకోవడం సాధ్యమయింది.
ఆ శాసనాల మూలకంగా అశోకుడి కాలం నాటి రాజకీయ వ్యవస్థకు ఇప్పటి మన రాజకీయ  వ్యవస్థకు మధ్య కొన్ని పోలికలున్నట్లు అర్థమవుతుంది. పాటలీపుత్రం ప్రధాన రాజధానిగా ఉన్నప్పటికీ అశోకుడికీ  నాలుగు ప్రాంతీయ రాజధానులు విడివిడిగా ఉండడం, రాజధానిలోని రాచరిక వ్యవస్థ తీరునే ఉన్నట్లే, ఉపరాజధానుల్లోనూ ఉపరాచకీయ వ్యవస్థ ఉండటం గమనార్హం. ఉపరాజులు రాజుకు తోబుట్టువులయి ఉండాలనేది, తతిమ్మా పరిపాలనాంగాలు సైతం రాజబంధువుల కనుసైగలలో మాత్రమే నడవాలనే  నియమమూ ఉన్నట్లనిపిస్తోంది. ఈ ఉపరాజు కుటుంబీకులంతా రాష్ట్రీయులుగా ప్రసిద్ధులని శాసనాలు తెలియచేస్తున్నాయ్.

రాజధాని దారిలోనే ఉపరాజధానిలోనూ న్యాయవ్యవస్థ ఒకటి రజ్జుకులు, మహామాత్రలు, అంతమహామాత్రలు, ఉపమాత్రల ఆధ్వర్యంలో నడవడం గమనార్హం. ఇప్పటి మహిళా కమీషన్ తరహాలోనే అశోకుడి కాలంలో కూడా స్త్రీల కొరకు స్త్రీల చేత మాత్రమే నిర్వహింప బడే మహామాత్రలు ఉండటం చెప్పుకోదగ్గ మరో గొప్ప విశేషం.

అశోకుని ధర్మలిపుల వల్ల రెండువేల రెండు  వందల ఏళ్ల కిందట ఆంధ్రదేశంలోని స్త్రీల జీవన స్థితిగతులు ఏ విధంగా సాగాయో రేఖామాత్రంగా తెలుసుకునే అవకాశం లుగుతుంది. పదమూడో శిలా శాననం చెప్పిన విధంగా 'ఏదో ఒక మతమును అనుసరించని జనముండు దేశమే లేదు'. అన్న తీరులోనే నేటికీ లోకతంత్రం నడుస్తున్నది కదా!
శాసనాల వల్ల నాటికాలం సమాచారం ఆనవాలు పట్టడం సులభమవుతుంది. ఈ పై అనుశాసనాల వల్ల ఆ కాలంలో జంతుబలులు, జాతర్లు జరిగేవన్న విషయం సుస్పష్టం. తెలుగు సాహిత్యం  కూడా ఇదే విషయాన్నే నొక్కిచెబుతుంది. 'అంబోధరము క్రింద నసిమాడు/నైరావతియు బోలె సిడి ప్రేలె దెఱవయోర్తు' అంటూ తెనాలి రామకృష్ణకవి పాండురంగ మహాత్యం మూడో అశ్వాసం, డెబ్భైఏడో  పద్యంలో గంగజాతర్లలో స్త్రీలు పడే హింసాకాండ సమస్తాన్ని వళ్లు గగుర్పొడిచే రీతిలో వర్ణిస్తాడు. క్రీ.శ. 15 వ శతాబ్దంలో దక్షిణ హిందూ దేశంలో పర్యటించిన పోర్చుగీసు చరిత్ర కారుడు బర్బోసా కూడా గ్రామదేవతల కొలువులలో జరిగే హింసను విశదంగా వర్ణిస్తూ 'ఈ దేశంలోని స్త్రీలు దైవారాధన దగ్గర ఎంతటి ఆత్మహింసకైనా తెగించడం విచిత్రం' అని రాసుకొచ్చాడు. తాను ఇష్టపడ్డ ప్రియుడు తననూ ఇష్టపడే విధంగా మనసు మార్చే శక్తి స్త్రీ దేవతలకు ఉంటుందన్న నమ్మకం .. స్త్రీలను ఈ తరహా దుస్సాహసాలకు పురిగొల్పుతుదన్నది మనస్తత్వవేత్తసిద్ధాంతం.
చిన్న ముల్లు  వంట్లో దిగినా ఓపలేని సుకుమారి సైతం సిడి ఉత్సవాల నెపంతో వంటి రక్తాన్ని  సిడి మాను(పెద్ద స్తంభం)కి కట్టిన ఏతం లాంటి వాసం ఇనుప కొక్కెం గాలాన్ని వీపుకు తగిలించుకుని గాలిలో గుండ్రంగా తిరగుతూ గొప్ప ఆత్మానుభూతి పొందడాన్ని ఏ విధంగా చూడాలి మనం? ఈ విధమైన హింసాకాండకు ఆ కాలంలో   అమితాదరణ ఉండబట్టే  అహింసా మూర్తి అశోక చక్రవర్తి మొదటి శిలాశాసనంలోనే
'ఇచ్చట ఏ సజీవ ప్రాణిని బలి ఇవ్వకూడదు'
'ఇచ్చట ఏ విధమయిన వేడుక సమూహము కూడా నిషేదిద్ధము'
'అట్టి సమావేశము వలన హాని కలుగునని దేవానాం ప్రియుని అభిప్రాయం' అంటూ మూడు ఆదేశాలు  జారీచేసివుంటాడు .
శాసించిన మాత్రాన జనం పాటించేదుంటే  పరిస్థితులు ఇప్పటంత అధ్వాన్నంగా ఎందుకుంటాయి? జాతి తన పాటికి తాను  తన ఆచారవ్యవహారాలను  కొనసాగిస్తూనే ఉంటుంది. నోములూ, వ్రతాలూ చేసుకోవడం, ఇంట్లో అనారోగ్యాలు కలిగితే మొక్కుకోవడం, కోరిన కోరికలు తీర్చమని ఇష్టదైవాలకు మొక్కుబళ్లతో ఆశపెట్టడం వంటివన్నీ మానసిక భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు. ఎంత మహాచక్రవర్తయినా   మనసులను అదుపు చేయలేడు. కాబట్టే అశోకుని 9వ శిలాశానసంలో
1.   దేవానాం ప్రియుడు ఈ విధముగా దెల్పెను.
2.  జనులు అనారోగ్యముగా ఉన్నప్పుడు, గృహములందు వివాహాది శుభకార్యములు జరుగుచున్నప్పుడు మంగళ ప్రధానమయిన క్రతువులు చేయుచుందురు.
3.  ఆయా సందర్భాలలో శుభాకాంక్షులై పుణ్యకార్యములు చేయుట కూడా కలదు.
4. అందు ముఖ్యముగా స్త్రీలు నిరుపయోగమైనట్టి, అర్థరహితమైనట్టి పనులెన్నో చేయుటయు కలదు.
5.   శుభప్రదమయిన కార్యములను తప్పక చేయవలసినదే.
6.  కానీ సాధారణముగ మనము చేయు కార్యములు తగినంత ప్రయోజనకరములు కావు.  - అని చెప్పడం జరిగింది.

అశోకుడు రెండున్నర సహస్రాబ్దాల కిందట చెప్పిన మాటలు అక్షరాలా ఇప్పటికీ వర్తిస్తాయి. అశోకుడి కాలమేం ఖర్మ, అధర్వణకాలంలోనూ ఈ మంత్ర తంత్రాలు, యజ్ఞయాగాదులు దండిగా ఉన్నాయి. ఆ వేదానికి అనుబంధంగా ఉండే సర్పవేదం, పిశాచవేదం, అసురవేదం.. వగైరాలు మనిషిలోని భయాలను, ఎదుర్కొనే ప్రమాదాలను,  వాటికి  తగిన  విరుగుళ్లను తెలియచేస్తాయి. జ్వరం, పరుస జ్వరం, పసరికలు, అజీర్ణం, జలోచరం, కుష్టు, వ్రణాలు, పురుగులు పడడం, పశురోగాలు, విషప్రయోగాలు.. ఇత్యాదుల నివారణకు అధర్వణ వేదంలో మంత్రాలు కనపడ్డమే ఇందుకు ఉదాహరణ.

ఆరోగ్యం నిర్లక్ష్యం చేసే అంశం కాదన్న మాట అక్షరాల వేదం చెప్పే పన్నాకి సమానమైన సుభాషితమే. రోగ నిరోధానికి, వస్తే.. గిస్తే నిదానికి, శాశ్వత నివారణకు ఏ తంత్రమో, మంత్రమో శాస్త్రీయంగా (ప్రయోగ ఫలితం మీద) ఆచరించి తీరవలసిందే. ఔషధాల మీద నిషేధాలను ఎవరూ కోరుకోరు.  పెళ్లిళ్లు, పురుళ్లు వంటి శుభకార్యాలకు ఉత్సవాలు వద్దనడాన్ని ససేమిరా ఒప్పుకోరు.  అయితే, అన్నీ పద్ధతి ప్రకారం  చేసుకోవాలనుకుంటే,  ఏడాది మొత్తం ప్రతీ రోజూ     వ్రతం నిర్వహించుకునే విధంగా మన సంప్రదాయాలలో మన పూర్వీకులు. ఏదో ఒక ఏర్పాటు చేసిపెట్టారు  అవన్నీ తు.చ తప్పకుండా ఆచరించడం ఈ కలికాలం, కరవుకాలం, ఏ రోజుకారోజు కడుపు నింపుకునేందుకు బతుకు తెరువు కోసం వెదుకులాడుకునే కాలంలో ఎంత వరకు ఆచరణ సాధ్యం?!
సంప్రదాయం మీద వీరాభిమానానికి తోడు, హేతువుకు అందని ఆలోచనలు సహజంగానే అధికంగా ఉండే స్గ్త్రీల చిత్త ప్రవృత్తి వల్ల  సమయం అధికంగా నిరుపయగమవుతుందనేదే ఆనాటి  అశోకుడి నుంచి నేటి అభ్యుదయవాదుల వరకు అందరి    ప్రధాన బాధ,

వీరేశలింగంగారి మాటలే మరో సారి మననం చేసుకోదగ్గ  మంచి సందర్భం ఇది. ఆ కాలమందెల్లవారికిని దయ్యములయందలి విశ్వాసములు అధికముగా నుండెను. స్త్రీలలో నొకప్పుడును దయ్యము పట్టని వారెక్కడనో గాని లేక యుండిరి. ఎవ్వరికే వ్యాధి వచ్చినను  వైద్యుని ఇంటికి మారుగా ముందుగా భూతవైద్యుని ఇంటికో, సోది చెప్పువాని ఇంటికో  పరుగెత్తుచుండిరి'
 
అధర్వణవేదం కాలంలో కానీయండి, అశోకుని కాలంలో కానీయండి, తెనాలి రామకృష్ణకవి కాలంలో కానీయండి, వీరేశలింగంపంతులుగారి కాలంలో కానీయండి.. స్త్రీలందరూ ఒకే విధంగా ఉన్నారా?  అధునాతున కాలం ఇదని గొప్పలు పోతున్నాం.. పోనీ ఇప్పుడైనా  వందకు వంద శాతం స్త్రీలు మార్పు చెందారా?మారారంటున్న  ఆ కొందరిలో అయినా నూటికి నూరు శాతం  మార్పు వచ్చిందా?
నాటి  తెలుగునగరం సువర్ణగిరి దగ్గర రెండువేల రెండు వందల సంవత్సరాల కిందట 'స్త్రీలు  నిరుపయోగకరమైనట్టిఅర్థరహితమైనట్టి పనులెన్నో చేయుట కలదు' అని అశోకుడు వేయించిన శిలాశాసనంలో అక్షరాలే శిలాశాసనాలై మిగులుతాయా?'అన్న ప్రశ్న వచ్చినప్పుడు..
వ్యవస్థ మారితే తప్ప స్త్రీల దురవస్థ మారదు. స్త్రీలు మారిపురుషులను మారిస్తే  తప్ప వ్యవస్థ అవస్థలో ఏ మంచి మార్పూ సాధ్యం కాదు.. అని సమాధానం చెప్పుకోక తప్పదు  .. ఎవరెంత నొచ్చుకున్నప్పటికీ!

            ***
        - కర్లపాలెం హనుమంతారావు
(సారంగ అంతర్జాల పక్షపత్రికలో ప్రచురితం)





గిల్టీ -చిన్నకథః రచనః కర్లపాలెం హనుమంతరావు

"సార్!"

అతను గదిలోకి వచ్చినట్లు గమనించక పొలేదు. కావాలనే చూడనట్లు నటించాను.

కారణం ఉంది.

ఇంట్లో ఇందిర రాత్రి చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది.

"మీ ఆఫీసులో సుబ్బారావనే పేరున్న వాళ్లెవరన్నా ఉన్నారా?"

"ఉంటే?!"

"అతగాడి తల్లికి రేపు హార్ట్ ఎటాక్ రాబోతుంది. 'స్టార్ట్ ఇమ్మీడియట్లీ' టైపు ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే మూడు రోజులు క్యాజువల్ లీవు కావాలని  మీకు లీవు లెటర్ ఇవ్వబడుతుంది. మీ చేత 'సాంక్షన్డ్' మార్క్ చెయించుకుని సదరు సుబ్బారావు వేంచేసేదెక్కడికో తెలుసా సార్?"

"ఎక్కడికీ?!"

"వేసంగి కదా! చల్లగా ఉంటుందని.. ఊటీకి. ఈ పాటికే అతగాడి ఇంట్లో ప్రయాణానికని అన్ని ఏర్పాట్లూ ఐపోయాయి కూడా. తెల్లారంగానే తమరు సెలవు మంజూరు చెయ్యడమే కొరవడింది”.

"ఇవన్నీ నీకెలా తెలుసోయ్!" ఆశ్చర్యంతో నోట మాట రాలేదు నాకు.

"లేడీసుమండీ బాబూ మేం. మీ పురుష పుంగవులకు మల్లే  'కంటబడిందంతా కటిక సత్యం..  చెవిన బడిందంతా గడ్డు వాస్తవం' అని నమ్మే చాదస్తులం కాం. సదరు సుబ్బారావు గారి సహధర్మచారిణి నోటినుంచే రాలిపడిందీ  స్కెచ్.  నేను తన హబ్బీ బాసు తాలూకు మనిషినని తెలీక నా ముందే పాపం నోరు జారింది. మీ కొలీగు రంగనాథంగారి చెల్లెలు సీమంతంలో బైటపడింది  సుమా ఈ కుట్రంతా" అంది ఇందిర.

బాసుని నేను. నా కన్నుకప్పి, అబద్ధాలు చెప్పి తప్పించుకుని తిరగాలనే! ఆ క్షణంలోనే ఈ ధూర్తుడితో ఎంత మొండిగా వ్యవహరించాలో డిసైడ్ చేసుకుని ఉన్నా.

---

"సార్!ఒక చిన్న రిక్వస్టు"

"తెలుసు. మీ అమ్మగారికి హార్ట్ ఎటాక్. 'స్టార్త్ ఇమ్మీడియట్లీ' అని ఇంటినుంచీ కాల్. నీకర్జంటుగా మూడు రోజులు క్యాజువల్ లీవు శాక్షన్ చేయాలి. యామై రైట్?"

ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేశాడు ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు "సార్! మీకెలా తెలిసింది? ప్లీజ్ .. సాంక్షన్ మీ లీవ్ సార్!"

సుబ్బారావు కళ్ళల్లో నీళ్ళు.

ముందుగా అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంటు చేసే టైమొచ్చింది. దొంగేడుపులకే  మాత్రం ఛస్తే లొంగరాదు.

సాధ్యమైనంత విచారాన్ని గొంతులో రంగరించుకుని  "సారీ సుబ్బారావ్! రేపు ఆడిటర్సు వస్తున్నారు ఇన్ స్పెక్షనుకి. మొదట్నుంచీ నువ్వే చూస్తున్నావుగా ముఖ్యమైన ప్రాజెక్టు రిపోర్టులన్నీ! నువ్వు లేకుంటే ఎలాగా? కావాలంటే వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత నువ్వూ వెళ్ళి రావచ్చు.. ఒక్క పూట. ఓకే..నౌ.. యూ కెన్ గో అండ్ గెట్ రడీ ఫర్ ఆడిటింగ్"అని అప్పుడే గుర్తుకొచ్చినట్లు ఫోనందుకున్నా.

"సార్! మా అమ్మ ఇప్పుడు గుండె నొప్పితో అల్లాడిపోతుంటే ఎప్పుడో ఆడిటింగయిన తరువాత వెళ్లాలా? అప్పటిదాకా ఆమెకేమీ కాదని మీరెవరన్నా భరోసా ఇవ్వగలరా?"

బాగానే రక్తి కట్టిస్తున్నాడూ నాటకాన్నీ! ఈ సుబ్బారావులో ఇంత పెద్ద కళాకారుడున్నాడని ఇప్పటిదాకా తెలీదే! ఒక్క అతగాడికేనా నటనా కౌశలం తెలిసింది!  నేను మాత్రం తక్కువ తిన్నానా!"

పాత సినిమాల్లో రంగారావు  మార్క్ గాంభీర్యం ప్రదర్శిస్తూ "ఐ సెడ్  సుబ్బారావ్ ! నౌ యూ కెన్ గో!  లెట్ మీ డూ మై డ్యూటీ.. ప్లీజ్!" అనేసి సెల్ రిసీవర్లో తల దూర్చేశాను.

మరో మూడు నిమిషాల పాటు అలాగే  కన్నీళ్ళతో మౌనంగా నిలబడి  చివరికి వెళ్ళిపోయాడు సుబ్బారావు.

---

 "నన్నెప్పుడూ ఓ మెతక వెధవ కింద  జమ కడతావుగా నువ్వు. ఇకనైనా  నీ అభిప్రాయం మార్చుకుంటే బెటర్.. బెటర్ హాఫ్ గారూ" అంటో   ఆఫీసులో జరిగిందంతా  ఇంట్లో ఇందిరకు చెప్పేసాను గొప్పగా.

సాంతం విని తాపీగా అంది ఆ మహాతల్లి "నిన్న నేను పొరపడ్డాను సుమండీ! ఊటీ చెక్కేద్దామనుకున్నా సుబ్బారావుది మీ సెక్షను కాదట. మీ పక్క సెక్షన్ కొలీగ్ రంగనాంగారి స్టెనోగ్రాఫర్ ఆ సుబ్బారావు.  శుభ్రంగా సెలవులు పుచ్చేసుకొని  ఊటీ చెక్కేసాడు కూడా ఈ పూట. మాటల సందర్భంలో రంగనాథంగారి మిసెస్ అంది ఇందాక. అతగాడి పెళ్ళాం తెచ్చే మేలు రకం ముత్యాల కోసం ఎదురు చూస్తుంటేనూ ఇక్కడ ఈవిడగారూ..!"

ఇందిర ఇంకేదేదో చెబుతున్నది కానీ..

ఆ క్షణంలో మాత్రం  నాకు .. న్నీళ్ళు నిండిన కళ్లతో  ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు మొహమే కనబడింది. చలా గిల్టీగా అనిపించింది.

-కర్లపాలెం హనుమంతరావు

23 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

 

 

లియో టాల్ స్టాయ్-కౌంటు బిరుదు ఎలా వచ్చింది?- - సేకరణ :

 

""


 




జార్ ప్రభువుల కాలంలో 'కౌంట్' అనేది ఒక రకమైన రాజగౌరవ చిహ్నం.ఇప్పటి మన మిలటరీ హోదాలాగా. విఖ్యాత చక్రవర్తి పీటర్ కాలంలో టాల్ స్టాయ్ వంశం వారికి అలాంటి 'కౌంటు' బిరుదు దక్కింది.  ఆ బిరుదు వచ్చిన విధానాన్ని గురించి ఒక తమాషా కథ ప్రచారంలో వుంది.

జారు చక్రవర్తిని కలుసుకోవాలని ఒకసారి ఒక ఉన్నత వంశం తాలూకు పెద్దవ్యక్తి(ఆ దేశంలో అటువంటివాళ్లను 'ప్రభువు' అంటారు)వేళకాని వేళలో అంతఃపురానికి వచ్చాడు. ద్వారం దగ్గర కాపలాకాసే సైనికుడు ఆ ప్రభువును అడ్డగించాడు. ఆ ప్రభువుకి ఆ సమయంలో లోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఒక మామూలు ద్వారపాలకుడు తనని అడ్డగించడం ఆ ప్రభువుకు ఆగ్రహం తెప్పించింది. "నేనెవరో తెలిసే అడ్డగిస్తున్నావా?" అని గర్జించాడు ఆ ప్రభువు. "చిత్తం. మిమ్మల్ననే కాదు  ఎవర్నైనా సరే.. ఈ సమయంలో లోనికి అనుమంతించడానికి నాకు ఆదేశాలు లేవు. మీరు దయచేసి రేపు తగిన అనుమతితో రండి. తప్పక లోపలికి వెళ్ళవచ్చు" అన్నాడు ద్వారపాలకుడు వినయంగానే. ఐనా ఆ ప్రభువుకి ఇది ధిక్కారంలాగే అనిపించింది. "నీ అహంకారానికి బహుమానమేమిటో తెలిసే అలా మాట్లాడుతున్నావా?" అని హూంకరించాడు. ద్వారపాలకుడినుంచి మౌనమే సమాధానం.

ప్రభువుకి కోపం కట్టలు తెగింది. చేతిలోని కొరడాతో ఆ సైనికుడిని వళ్ళంతా రక్తాలు కారేటట్లు కొట్టటం మొదలు పెట్టాడు.

నొప్పులన్నీ మౌనంగా భరింస్తున్నాడే కానీ ఎదురు తిరగలేదు.అలా అని  దొరను లోపలికి అనుమతించనూ లేదు ఆ సైనికుడు.

అదే సమయంలో పీటర్ మహారాజు అటుగా వస్తూ ఈ దృశ్యం చూశాడు. ఏం జరుగుతుందో ముందు అర్థం కాలేదు. తెలిసిన తరువాత అంతులేని ఆశ్చర్యం ఆగ్రహం కలిగాయి. ద్వారపాలకుడితో "ఆ ప్రభువు నిన్ను అలా గొడ్డులా మోదుతుంటే ఒక సైనికుడివి అయి వుండీ  మౌనంగా భరిస్తావా! ఇదిగో కొరడా.. ఇప్పుడు నీ ప్రతీకారం యథేచ్చగా  తీర్చుకోవచ్చు" అని కొరడా అందించాడు.

ఆ మాటకు ప్రభువు అభ్యంతరం చెప్పాడు "మహారాజావారు విడ్డూరంగా మాట్లాడుతున్నారు. అతనొక తుచ్చ సైనికుడు. నేనేమో ప్రభువును. ఎలా దండిస్తాడు?"

"అదే అభ్యంతరమైతే నేనతన్ని ఈ క్షణమే జనరల్ చేస్తున్నాను" అన్నాడు పీటర్.

"జార్ చక్రవర్తులు క్షమించాలి. ఒక గొప్ప వంశస్థుడ్ని ఒక క్షుద్ర సేద్యగాడు శిక్షించడం మన సంప్రదాయం ఏమాత్రం ఒప్పుకోదు" అన్నాడు మళ్ళీ పెడసరంగా.

పీటరు చక్రవర్తికి అతని దుష్ప్రవర్తన సహించరానంతటి క్రోధం తెప్పించింది.

"ఈ ద్వారపాలకుడికీ తక్షణమే 'కౌంట్' బిరుదు ప్రసాదిస్తున్నాను. నా పాలనలో కౌంటులు ఆత్మగౌరవం లేనివారిగా ప్రవర్తించడం నాకు అవమానం" అని ఉరిమి చూసాడు ద్వారపాలకుని వైపు.

అంతే.. రాజుగారి సమక్షంలోనే రాజావారి కొరడాతోనే రాజగౌరవం నిలబడేటట్లు కొత్త కౌంటు ఆ ప్రభువుని మళ్ళీ లేవలేని విధంగా  దండించి వదిలిపెట్టాడు.

మర్నాడే ఆ కౌంటుకు 'జనరల్' పదవి కూడా  ఇస్తున్నట్లు ప్రకటన వెలువడింది.

'కౌంట్' బిరుదూ రాజుగారి స్వహాస్తాలతో ప్రసాదించబడింది.

'వార్ అండ్ పీస్' లాంటి ఎన్నీ అత్యున్నమైన మానవతావాదాన్ని బలపరిచే రచనలు చేసిన గొప్ప రచయిత  లియో టాల్ స్టాయ్ కి కౌంట్ బిరుదు  అలా వారసత్వంగా వచ్చిందే.

అలాంటి రాజచిహ్నాలు ప్రజాస్వామ్యవాది అయిన టాల్ స్టాయికి ఇష్టముం
డేవి కాదు. వాటిని తొలగించుకోవడాని  తరువాత చాలా తంటాలు పడ్డాడనుకోండి..అది వేరే కథ

***

 సేకరణః కర్లపాలెం హనుమంతరావు

Friday, November 8, 2013

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...