Saturday, March 20, 2021

హితాభిలాషి - కథానిక కర్లపాలెం హనుమంతరావు

 

హితాభిలాషి  - 

-కర్లపాలెం హనుమంతరావు

అన్నిటితో పాటు పెళ్లిచూపుల పద్ధతుల్లోనూ మార్పులొచ్చాయిప్పుడు. గతంలో ఇంట్లో ఎదిగిన ఓ కూతురుందంటే ఆమెనో అయ్య చేతిలో పెట్టిందాకా కన్నవారి కంటి మీద కునుకుండేది కాదు. సంబంధాల కోసం  తెలిసినవాళ్లనే కాదు, తెలీనివాళ్లనూ విచారించడం.. అదో రివాజు. పెళ్లిళ్ల పేరయ్యదే ప్ర్రధాన మధ్యవర్తిత్వం అప్పట్లో. సలీసైన కుర్రాడు ఉన్నాడని తెలిస్తే చాలు..  పిల్ల తరుఫువాళ్లే పూనుకుని వెళ్లి 'ఒకసారి వచ్చి మా పిల్లను చూడమ'ని మొహమాట పెట్టడం.. వాళ్లొచ్చి చూసి అన్నీ అమిరితే ఇహ బాజాబంత్రీలు మోగడం విధాయకంగా ఉండేదా కాలం. పిల్ల నచ్చడం లాంటి ఒక్క విషయంలోనే వరుడికి స్వేచ్ఛ. వధువుకైతే ఆ వెసులుబాటూ అరుదే. కట్నకానుకలూ, పెట్టుపోతల్లాంటి తతంగాలన్నీ పెద్దవాళ్ల ఫీల్డు. మరీ ముఖ్యంగా  మొగవాళ్లది.

సుందరమ్మ పాతకాలం మనిషి. కూతురు సరోజను కూడా ఆ పద్ధతుల్లోనే పెంచింది. ఆ అమ్మాయి పెళ్లి విషయం కూడా పాతకాలం పద్ధతిలోనే సంబంధాలు మధ్యవర్తుల ద్వారా విచారించడంతో అరంభమయింది.

సరోజ తండ్రి గోపాలరావు మెడికల్ డిపార్ట్ మెంటులో డ్రగ్స్ ఇన్స్పెక్టర్. సరోజ పదో తరగతి పరీక్షలు రాసే రోజుల్లో హార్టెటాక్ వచ్చి పోయారు. మగదిక్కులేని సుందరమ్మగారు తోడబుట్టినవాడి పంచన చేరింది.

జిల్లా హైస్కూల్లో హెడ్ మాస్టర్ గా చేసిన అచ్యుతరామయ్యగారు కొడుకు సత్యమూర్తితో సమంగా మేనకోడలు సరోజనూ చదివించారు. మూర్తి సరోజ కన్నా ఏడాది చిన్న. చదువుల్లో మెరిక. అమెరికా వెళ్లి చదువుకోవాలని తంటాలు పడుతున్నాడు. ఆ పిల్లాడూ వదిన కోసం వకటి రెండు సంబంధాలు మంచివే సూచించాడు. కానీ, ఒక్కగానొక్క కూతుర్ని అంతంత దూరభారాలు పంపించడం సుందరమ్మగారికే ఇష్టంలేకపోయింది. పడనీయలేదు. కష్టానికి, నష్టానికి సాయమంటే వంటిగా వెళ్లేందుకు తనకు వీలుండదని ఆ పాతకాలం మనిషి ఆలోచన. 'ఇక్కడివే మంచివి.. ఏవన్నా ఉంటే చూడన్నయ్యా!' అంటూ తోడబుట్టినవాడినే ఒహటే శతపోరుతున్నదామె.

 

అచ్యుతరామయ్యగారో తాపీ మనిషి. ఏ విషయమూ ఓ పట్టాన చెవికెక్కదు. పెళ్లాం కూడా ఆడపడుచు తరుఫున వకాల్తా పుచ్చుకునేసరికి ఇహ తప్పక ఒక సంబంధం పట్టుకొచ్చారు.

అబ్బాయి బెంగుళూరులోనే ఏదో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్. ఐదంకెల జీతగాడు. పద్ధతైన కుటుంబం. 'మనకు సరితూగేవాళ్లే! ఓ సారొచ్చి పిల్లను చూసుకోమని చెపొచ్చాను' అన్నారు ఒక పూట హఠాత్తుగా వచ్చి.

పెళ్ళిచూపులయ్యాయి.

సరోజ కంటికి నదురుగా ఉంటుంది. చదివింది బి.టెక్కే అయినా ఈ కాలం పిల్లల్తో పోలిస్తే టెక్కు తక్కువ కిందే లెక్క. మగపెళ్లివాళ్లకు నచ్చింది. విధాయకంగా 'ఏ సంగతీ ఒకటి రెండు రోజుల్లో చెబుతామ'ని చెప్పి వెళ్లారే కానీ, మిగతా విషయాల కూడా జతపడితే దాదాపు సంబంధం ఖాయపడ్డట్లే అనుకుంటున్నారిక్కడ! 'వాళ్ళు నోరు తెరిచి ఇంత అని అడక్కపోయినా ఎంతో కొంత ఇద్దామన్నయ్యా! నాకు మాత్రం ఇది కాక ఇంకెవరున్నారూ!' అంది సుందరమ్మగారు అన్నగారితో.

రెండు రోజులు కాదు.. వారం దాటినా బెంగుళూరు నుంచి ఏ కబురూ కాకరకాయా లేదు! 'ఏవఁయింద'ని విచారిస్తే మా పిల్లాడికి వేరే సంబంధం చూసుకున్నామ'నేశారుట! 'ముందు నచ్చిందన్నవాళ్లు తరువాత ఎందుకు వెనక్కి వెళ్లారో కనుక్కుందామని ఎంత విచారించినా లాభంలేకపోయింది.' అని తెగ వగచారు అచ్యుతరామయ్యగారు.

అట్లాగే మంచివి అనుకున్న సంబంధాలు ఇంకో రెండు.. మూడు చివరిదాకా వచ్చి చెదిరిపోయేసరికి సుందరమ్మగారు డీలాపడిపోయారు.

'ఈ కాలప్పిల్లల్ని గురించి ఏమీ చెప్పలేము వదినా! ముందు మన  పిల్ల వైపు నుంచి మతలేబైనా ఉందేమో .. కనుక్కోండి!' అని హెచ్చరించింది ఆడపడుచు సుందరమ్మగారిని.

'నాన్న మీదొట్టు! నేనలాంటి దాన్ని కాద'ని ఏడ్చింది సరోజ. పిల్ల జాతకం చూపించింది శాస్త్రులుగారికి. 'కుజ దోషమున్నా పరిహారమైపోయిందే! అమ్మాయి చేత ఈ కార్తీక మాసమంతా పగటిపూట ఉపవాసముంచి.. సాయంకాలానికి అమ్మవారి అర్చన చేయిస్తుండండి! కొదమ దోషమేమన్న మిగిలుంటే ప్రక్షాళన అయిపోతుంది' అని సలహా ఇచ్చారు శాస్త్రులుగారు. సరోజ  నియమనిష్టలతో శ్రద్ధగా పూర్తిచేసిందా దీక్ష.

 ఆ తరువాతి నెలరోజులకు అనుకోకుండా గుండ్లపల్లివారి సంబంధం వచ్చింది. ఖాయమైంది. అబ్బాయి చెన్నై ఫిలిప్స్ కంపెనీలో ఇంజనీరు . సరోజకు చీటికి మాటికి ఫోన్ చేసి 'స్వీట్ నథింగ్స్' చెబుతున్నాడు! ఇదంతా కొత్తగా థ్రిల్లింగ్ గా ఉన్నా కొద్దిగా బెరుగ్గా కూడా ఉంది సరోజకు. సుందరమ్మగారికీ తెలుసు.. కానీ, ఏమంటే ఏమయిపోతుందో.. అని సర్దుకుపోతోందీ సారి. 

 

పెళ్లి ఇంకో వారం రోజులుందనంగా బట్టల కోసం చీరాల వెళ్లి వచ్చారు ఆడంగులంతా. ఇంటికొచ్చేవేళకు చీకటి పడింది. వసారాలో అచ్యుతరామయ్యగారు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆయన ధోరణి చూసి ఏదో అయిందనుకుంది సుందరమ్మగారు. 'వినకూడదనిది ఏదన్నా వినాల్సి వస్తుంద'ని భయపడుతూనే అడిగింది 'ఏంటన్నయ్యా!.. ఏమయినా అయిందా?'

అచ్యుతరామయ్యగారు నిశ్శబ్దంగా ఓ కవరందించారు. సుందరమ్మ వణికే చేతుల్తో అందుకుని తెరిచి చూసింది. అది పెళ్లికొడుకు తండ్రి రాసిన ఉత్తరం.'గోపాలరావుగారు సర్వీసులో ఉండగా మాకు చాలా సాయంచేశారు. ఆయన చలవ వల్లే మేమివాళ ఒంగోలులో మూడు పెద్ద మెడికల్ షాపులు నడుపుతున్నాం. ఆ విశ్వాసంతోనే వారి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుందామని ఉబలాటపడ్డాం. కానీ.. పెళ్లి కాక ముందే అనుభవమున్న అమ్మాయి అంటే కుదరదు. ఇంతకు మించి చెప్పలేము. దీనికి జత చేసిన హితాభిలాషి  ఉత్తరం చదివితే అన్ని విషయాలు మీకే బోధపడతాయి.' అని ఉంది. ఓ 'హితాభిలాషి ' తన ఉత్తరంలో సరోజను గురించి ఏవేవో చడామడా రాశాడు!

'ఇంత దూరం వచ్చింతరువాత ఇట్లా అయిపోతే పిల్లదాని బతుకేమయిపోవాలం' టూ సుందరమ్మగారు కుప్పకూలిపోయారు. సరోజే గుండె దిటవు చేసుకుని తల్లిని సముదాయించాల్సొచ్చింది చివరకు..  లోలోన ఆమె మనసూ రగిలిపోతున్నప్పటికీ.

హితోభిలాషి రాసిన 'చెత్త'ను ఒకటికి రెండు సార్లు శ్రద్ధగా చదువుకుంది సరోజ. ముందు ఆ ఛండాలాన్ని చించి పోగులుపెడదామనుకుంది. కానీ, ఒక్క క్షణం ఆలోచించి.. భద్రంగా దాచేసింది.. తల్లికి తెలీకుండా.

మనస్సును మళ్లించుకోడానికి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇ.సి.ఐ.ఎల్ లో సైంటిఫిక్ అసిస్టెంట్  గా ఆఫర్ వచ్చేసరికి తల్లిని తీసుకుని  హైదరాబాద్ వచ్చేసింది సరోజ. ఏ.ఎస్. రావ్ నగర్ లో తల్లితో పాటు సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ లో ఉంటూ బెటర్ ఆపర్చ్యూనిటీస్ కోసమై ప్రయత్నం చేస్తోందిప్పుడు.

సంబంధం బెడిసి కొట్టినప్పుడల్లా 'ఇంకా టైము రాలేదు. అందుకే ముడిపడ్డంలేదు' అనే వైరాగ్యం వంటబట్టించుకోడం నేర్చుకుంది సుందరమ్మగారు.

 

ఆ డిసెంబర్ లో అమెరికా నుంచి మూర్తి వచ్చాడు. తల్లికి ఏడాదిగా కిడ్నీ ప్రాబ్లమ్. ఫిట్స్ వస్తున్నాయ్ కొత్తగా! 'ఎందుకొస్తున్నాయో అంతుబట్టడం లేదు. డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. నువ్వొక్కసారి వచ్చి చూసిపోరా! అప్పుడన్నా తల్లి మనసు కుదుటపడుతుందేమో!' అని తండ్రి పోరగా పోరగా ఇప్పుడు తీరిక చేసుకుని దిగబడ్డాడు మూర్తి. వచ్చిన మొదటి మూడు వారాలు తల్లితోనే సరిపోయింది తెనాలిలో. ఇది చివరి వారం. అత్తను, సరోజను కూడా చూసి ఇటు నుంచి ఇటే విమానం ఎక్కేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు హైదరాబాదులో దిగబడ్డాడు.

సరోజా, మూర్తీ చిన్నప్పట్నుంచి వదినా మరుదులుగా కన్నా స్నేహితుల్లా సన్నిహితంగా తిరిగారు. మంచి స్నెహితుల్లా ఒకళ్ల కష్టసుఖాలు మరొకళ్లతో నిస్సంకోచంగా పంచుకునే అలవాటు. వయసులో పెద్దదైనా చాలా విషయాలల్లో సరోజ మూర్తి గైడెన్స్  ఇష్టపడేది. మూర్తి అమెరికా వెళ్లిన కొత్తల్లో సరోజతో రెగ్యులర్గా కాంటాక్టులో ఉన్నా.. తన పని వత్తిళ్ల మూలకంగా ఈ మధ్య ఎవరితోనూ సరిగ్గా టచ్ లోకి రావడంలేదు.

ఇట్లా సంబంధాలు వచ్చి వృథాగా పోతున్నాయని తెలుసు కానీ, అంత దూరంలో ఉండి తాను చేయగలిగిందీ ఏమీ లేదనే ఉద్దేశంతో.. సరోజను ఆ విషయమై పెద్దగా కదిపేవాడు కాదు. తన మనసును అనవసరంగా కష్టపెట్టడమెందుకన్న ఉద్దేశం కూడా కావచ్చు.

ఇక్కడి కొచ్చిన తరువాతే తెలిసింది ఈ హితోభిలాషి లేఖాస్త్రాలు చేస్తోన్న విధ్వంసం గురించి. 'నా కన్నా ఒక ఏడాది వెనక పుట్టుంటే నీ కీ బాధలు తప్పుండేవి కదే!' అన్నాడు సరోజతో జోకుగా!

'నీకు చిన్నప్పట్నుంచీ యుగంధర్ పరిశోధనలంటే పిచ్చి కదరా! నీ బుల్లి బుర్రకేమన్నా కనీసం ఓ చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో చూడు!' అంటూ తల్లి క్కూడా తెలీకుండా దాచిన హితాభిలాషి  ఉత్తరాన్ని మూర్తికి చూపించింది సరోజ.

ఆ ఉత్తరాన్ని ఆసాంతం చదివి తిరిగిచ్చేశాడు మూర్తి.. పెదవి విరుస్తూ!

ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర మూర్తి సుందరమ్మగారితో 'అత్తా! అడక్కూడదో.. లేదో తెలీదు కానీ.. అర్జంటుగా ఓ ఐదు లక్షలు సర్దుతావా? ఆఫీసు బిజినెస్ పన్లకు అవసరపడింది. అమ్మ వైద్యం ఖర్చులకు నా దగ్గరున్నదంతా  చెల్లుపోయింది. లేకపోతే అడక్కపోదును.  సరోజ పెళ్లికి దాచిన సొమ్ముంటుందిగా! దాని పెళ్లి ఫిక్సైతే వెంటనే ఎట్లాగో సర్దేస్తాలే! బ్యాంకు వడ్డీ కన్నా ఒక శాతం ఎక్కువే తీసుకో!' అన్నాడు.

'అయ్యో రాత! వడ్డీదేముందిలే కాని.. అట్లాగే తీసుకో! మీ కన్నా కావాల్సిన వాళ్లెవరున్నార్రా నాకు! మీ మామయ్య పోయినప్పుడు వచ్చిందంతా మీ నాయన దగ్గరే పెట్టాను. ఇహ సరోజ పెళ్లంటావా! అది ముడిపడినప్పుడు చూద్దాంలే' అందా సుందరమ్మగారు నిర్వేదనగా.

'సమస్యేముందిక! నాన్ననే అడుగుతాలే!' అన్నాడు మూర్తి.

ఎయిర్ పోర్ట్ లో సెండాఫ్ ఇవ్వడానికని వచ్చిన సరోజతో 'ఈ మాఘమాసంలో తమరి పెళ్లి ఖాయం. తయారయిపోండి రాకుమారిగారూ! నాదీ హామీ! పెళ్లికొడుక్కూడా తమరి కలల రాకుమారుడే' అని ఆటపట్టించాడు మూర్తి.

మూర్తి అమెరికా వెళ్లిన పది రోజులకు చెన్నై నుంచి ఫిలిప్స్ కంపెనీ శ్రీధర్ సరోజకు కాల్ చేశాడు. సుందరమ్మగారికి ఏం చెయ్యాలో తోచక తెనాలిలో ఉన్న అన్నగారికి ఉప్పందించింది. ఆయనా ఏ కళనున్నాడో ఏమో.. ఈసారి వెంటనే ఒంగోలు వెళ్లి గుండ్లపల్లివారి సంబంధమే ఖాయం చేసుకొని వచ్చి శుభవార్త చెల్లెలికి చేరవేశాడు.  'హితోభిలాషి ఉత్తరాలు పట్టుకుని మంచి సంబంధం వదులుకున్నందుకు వాళ్లబ్బాయీ  బాగా అలిగాడుట. పెద్దమనసు చేసుకుని గోపాలరావుగారి పిల్లను మా కిచ్చెయ్యండి!' అంటూ పెళ్లికొడుకు తండ్రే  గడ్డాలు పట్టుకున్నంత పనిచేశాడు' అని అన్నగారు చెబుతుంటే సుందరమ్మగారు నోరు వెళ్లబెట్టేశారు,

మొత్తానికి అంతా ఓ కలలోలా జరిగిపోయింది. మూర్తి ఆటపట్టించినట్లు సరోజ పెళ్లి ఆ మాఘమాసంలోనే ఘనంగా జరిగింది. సుందరమ్మ గుండె బరువు దిగింది. సరోజ చెన్నయ్ కాపురానికి వెళ్లిపోయింది.

***

ఆ రోజు ఆదివారం. ఉదయం ఎనిమిది అవుతున్నా శ్రీధర్ పక్క దిగే మూడ్ లో లేడు. సరోజ సెల్ అదే పనిగా రింగవుతుంటే. శ్రీధరే విసుక్కుంటూ అందుకున్నాడు.

మూర్తి నుంచి కాల్.

'సరోజ లేదా?'

'బాత్ రూంలో..'

ఓకే! మరి మీరేం చేస్తున్నారూ?' ఆరాగా అడిగాడు మూర్తి.

'చెప్పాలా?'

'వద్దులే కానీ, మీరూ, మా సరోజా కలసి నాకింత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు బ్రదర్. అందుకే కాల్ చేస్తోందిప్పుడు' అన్నాడు మూర్తి.

మూర్తి గొంతులంఇ ఆకతాయితనం పసిగట్టకపోలేదు శ్రీధర్.

'మేమేం చేశాం బ్రో?'

'రాత్రి నాకో పీడకల వచ్చింది బ్రదర్! మీకో పాప పుట్టిందట! మా డాళింగుకి 'ప్రహ్లాదో' 'పంచకల్యాణో' ఏదో పేరు తగిలించేసారుట! ఇదన్యాయం కాదా మిలార్డ్?'

'ఇందులో అన్యాయం ఏముందిరా?' అయోమయంగా అడిగింది సరోజ  భర్త చేతిలోని ఫోన్ రిసీవర్ బలవంతంగా గుంజుకుంటూ. తను అప్పుడే స్నానాల గది నుంచి బైటి కొచ్చి ఉంది.

'కృతఘ్నురాలా! మీ ఇద్దరినీ మళ్లీ కలిపింది ఈ గ్రేట్ సత్యమూర్తి కాదా? ఆడైనా, మగైనా ఈ మహాత్ముడి పేరు మాత్రమే  పెట్టుకోవాలి మీ బిడ్డకు. లేకపోతే..'

'ఏం చేస్తావో చేసుకో!యంగ్ కపుల్నిలా మాటి మాటికీ డిస్టర్బ్ చేసి ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసెయ్యడవూఁ ..గుడ్ మేనర్స్ కాదని మహాత్మా మూర్తీ ముందు నువ్వు తెలుసుకో' అంటూ ఫోన్ కట్టేసింది పకపకానవ్వుతూ  సరోజ.

అప్పుడే స్నానం చేసి లావెండర్ సోపులో  సువాసనలు విరజిమ్మే  సరోజను చూసి మోహంగా  మీదకు లాక్కున్నాడు శ్రీధర్. సరోజ విడిపించుకుంటున్నట్లు నటిస్తుంటే మళ్లీ మూర్తి  ఫోన్.. రింగింగ్!

'మీ ఇద్దరికీ లైన్ కలిపింది నేనూ! నాకే లైన్ కట్ చేస్తార్రా? నా డిమాండ్ సంగతేంటో తక్షణమే తేలాలి ముందు!'

'సిగ్గూ శరం లేదట్రా మూర్తీ! కొత్త జంటనిలా విసిగిస్తావా పద్దాకా బద్మాష్?' అంటూ ఫోన్ కట్ చేసి భర్త ఒడిలోకి ఒరిగిపోయింది సరోజ!

మళ్లీ సెల్ రింగింగ్! శ్రీధరే అందుకుని నవ్వుతూ అన్నాడీ సారి 'ఒకే బ్రో! యువర్ రిక్వెస్ట్ విల్ బి కన్సిడర్డ్ సూన్! కానీ అంతకు ముందు మీరు మా పని మమ్మల్ని చేసుకోనివ్వాలి గదా!'

'దట్స్ ఎ  నైస్ డీల్! నౌ గో ఏ హెడ్! బెస్టాఫ్ లక్ టు బోతాఫ్ యూ!' అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల నుంచి మూర్తి.

'మా మూర్తి మీకు ముందే తెలుసా?' ఆశ్చర్యపోయింది సరోజ మూర్తితో చనువుగా మాట్లాడిన తీరు చూసి.

తెలుసన్నట్లు తలాడించాడు శ్రీధర్ నవ్వుతూ.

'ఎలా? నేను పరిచయం కూడా చేయలేదే! మన పెళ్లిక్కూడా రాలేదు వాడు.. రాలేక'

శ్రీదర్ కూల్ గా జవాబిచ్చాడు 'బ్రేకయిన మన సంబంధాన్ని  మళ్లీ పాజిబుల్ చేసిన  పుణ్యమూర్తి  మీ మూర్తే సరూ!'

'ఓహో! మీకలా బిల్డప్పిచ్చాడా మా మహానుభావుడు! మొదట్నుంచీ మా మామయ్యేనండీ మాకు  అండా దండా! ఆయన పూనుకోకపోయుంటే అసలు మీరంటూ ఒకరున్నట్లు మాకు తెలిసే అవకాశమే లేదు'

'అయితే నీ దాకా అన్ని విషయాలు పూర్తిగా రాలేదన్న మాట!' చిద్విలాసంగా  అంటున్న భర్త వంక ఆబ్బురంగా చూసింది సరోజ.

'మీ డాడీ సర్వీసులో ఉన్నంతకాలం సంపాదించింది ఏసిబివాళ్లకు జడిసి మీ మామయ్య పేరున బ్యాంక్ ఎకౌంట్లలో దాచాట్ట కదా! మీ మామయ్య ఆ సొమ్మంతా ఈ మూర్తి అమెరికా చదువుల కోసం ధారపోసేశాట్ట.. మూర్తి ప్రయోజకుడయితే తీర్చేసుకుంటాడు లెమ్మని! మూర్తింకా పూర్తిగా  సొంత కాళ్ల మీద నిలబడనే లేదు..   మీ అత్తయ్యకు కొత్తగా కిడ్నీస్ ఫెయిల్యూర్ సమస్య తగులుకోడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది! అడపా దడపా కొడుకు పంపే సొమ్ము భార్య  వైద్యానికే సరిపోతుండటంతో పాపం, పెద్దాయనకు ఏం చెయ్యాలో దిక్కు తోచిందికాదు.  ఆర్థికంగా సర్దుబాట్లు చేయలేక.. అట్లాగని పరువుగా  గడిపిన భేషజం వదులుకోలేక కొత్తగా ఓ 'హితోభిలాషి' అవతారం ఎత్తేశారు పాపం.  చెల్లెలి వత్తిడి మీద సంబంధాలు తేవడం, మళ్లా తానే  వాటిని ఏ హితాభిలాషి  లేఖతోనో చెడగొట్టేయడం! మాకు వచ్చిన   హితాభిలాషి  ఉత్తరం అట్లాంటిదే! ఈ రహస్యం కనిపెట్టిందీ  మీ మూర్తే! నేరుగా  నాకు ఎక్స్ ప్లయిన్ చేసేందుకు ఫోన్ చేసినప్పట్నుంచే మేమిద్దరం ఫ్రెండ్సమయింది. 'మా సరోజ చాలా మంచి మొద్దు పిల్ల, చెత్త ఉత్తరాలు నమ్మి ఆ ఉత్తమురాలికి అన్యాయం చేయద్దు బ్రదర్! నిదానం మీద నేనే మీ  కట్నకానుకల మేటర్సన్నీ సెటిల్ చేసిపెడతా.. దయచేసి మి పేరెంట్స్ ను కన్విన్స్ చేయండి బ్రదర్! మా నాన్నని కాదు గానీ,   నీతి మార్గమే ఆయనకు పరమ ప్రమాణం. ఆయన శిక్షణలో పెరిగిన వాడిగా నేనీ విషయం గట్టిగా నమ్ముతున్నానిప్పటికీ! ఈ హితాభిలాషి  మేటర్ బైటపడితే అయన తట్టుకోలేరు. మీరే మీ పెద్దాళ్లను ఎలాగైనా ఒప్పించాలి పెళ్లికి!' అంటు  రోజుకో రకంగా  ఫొనులో ఇదిగో.. ఇట్లాగే..' బిగ్గరగా నవ్వేశాడు శ్రీధర్.

'అందుకా మీరీ  సంబందానికి మొగ్గు చూపింది! మనస్ఫూర్తిగా  నన్ను చేసు..'

'పిచ్చిగా మాట్లాడొద్దు! నువ్వంటే ఎంత పిచ్చి లేకపోతే రోజూ పరగడుపు నుంచే  ఫోనులో స్వీట్ నథింగ్సుతో నీ ప్రాణంతీస్తాను చెప్పు.. మొద్దూ! పెళ్ళికి ముందు  మీ మామయ్యకు మూర్తి అందించిన సొమ్మంతా ఎవరిదనుకుంటున్నావ్! నాదే! ఇదంతా అప్పుడే  తెలిస్తే నీకు, మీ అమ్మక్కూడా మీ మామయ్య మీదున్న గుడ్ ఇంప్రెషన్  గాలిక్కొట్టుకుపోదా!  మూర్తికి, ఆ మాట కొస్తే నా క్కూడా బొత్తిగా  అదిష్టం లేదు సరూ! దొంగ ఉత్తరాలతో నమ్ముకున్న మంచివాళ్లకు అట్లా ద్రోహం తలపెట్టడడం.. అఫ్ కోర్స్.. నాట్ ఏ గుడ్ గెస్చర్ అనుకో! దట్ టూ మీ మామయ్యలాంటి జంటిల్మెన్ విషయంలో! కానీ, ధర్మరాజంతటి పెద్దమనిషే అవసరార్థం అదేదో యుద్ధంలో  బొంకాడని  మన భారతంలోనే ఉంది కదా!' అన్నాడు శ్రీధర్.

మూర్తి హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మను అంత డబ్బు అప్పుగా అడిగింది నిజంగా అవసరముండి కాదన్న మాట. నాన్న డబ్బు అమ్మ మామయ్య దగ్గర దాచించదన్న నిజం నిర్ధారణ చేసుకోడం కోసమని  ఇప్పుడు అర్థమవుతుంది' అనుకుంది సరోజ. 

'ఆ హితాభిలాషి  చెత్త మీ నాన్నే  రాసినట్లు  నువ్వెట్లా పసిగట్టావురా మై డియర్ యంగ్ యుగంధర్?' అని తరువాతెప్పుడో  మూర్తి లైన్లోకి వచ్చినప్పుడు  సరోజ అడిగితే మూర్తి ఇచ్చిన సమాధానం మరీ విడ్డూరం అనిపించింది. 'మీ ఇంటికొచ్చినప్పుడు నువ్వు  నాకు చూపించిన లెటరేనే ఆధారం! నాన్నగారు ఎంత స్టైల్  మార్చి రాసినా ఆ గొలుసుకట్టు రాతలోని అక్షరాలు కొన్ని ఇట్టే పట్టించేస్తాయ్! ఈ కాలంలో ఎంత 'హితాభిలాషి' అయినా   మా నాన్నలాగా 'బి' కింది వత్తు మరీ అంత భీకారంగా కింది దాకా  సాగదీసి మేకు దిగ్గొట్టేనట్లుగా రాయడం లేదు కదా!' అని నవ్వేశాడు మూర్తి.

***

-కర్లపాలెం హనుమంతరావు

 ('ఆకాశరామన్న' పేరుతో ఆంధ్రభూమి (19, ఫివ్రవరి, 2019)  నాటి వారపత్రికలో ప్రచురితం)




కథానిక





Friday, March 19, 2021

కవిత్వం- కవుల బడాయి- రామకృష్ణ కవుల పద్యాలు- సేకరణః కర్లపాలెం హనుమంతరావు

 


తెలుగు కవుల బడాయి- రామకృష్ణ కవుల షష్టాష్టకాలు

-సేకరణః కర్లపాలెం హనుమంతరావు

 

వినాయకచవిత పండుగ పూట పూజాదికాలైన పిదప సాయంకాలం ఇష్టులైన వారి ఇళ్ళమీదకు పిల్లలు చిన్న చిన్న రాళ్ళు, బెడ్డలు విసిరి పెద్దలచేత షష్టాష్టకాలు పెట్టించుకోవడం హిందువుల సంస్కృతిలో ఓ ఆచారం. ఆ పండుగ పూట   పెద్దలు వడ్డించే  తిట్లు పిన్నలకు మేలుచేసే  దీవెనలతో సమానమని ఒక నమ్మకం. శతావధాన పండితులు రామకృష్ణ కవులు బహుశా ఇలాంటి ఏదో విశ్వాసంతోనే  నన్నయాదులవంటి అఖండ ప్రజ్ఞావంతులందరిని ఒక వరసలో తిట్టి పోసారు. 1918నాటి ఆంధ్ర పత్రిక సంవత్సరాది సంచికలోని ముచ్చట ఇది.  సరదాగా ఏరిన అందులోని కొన్ని పద్యాలు ఇవి.  పూర్వకవులమీద తనకుండే అపారమైన  భక్తిశ్రద్ధలను  రామకృష్ణకవులే స్వయంగా ప్రకటించుకున్నారు కనక ఇక  పేచీ లేదు.

కేవలం  సరదాగా మాత్రమే తీసుకోమని సహృదయ సాహిత్యాభిమానులకు మనవి.

 

ఆంధ్ర లోకోపకారము నాచరింప/

భారతమ్మును నన్నయభట్టు తెలుగు/

జేయుచున్నాడు సరియె; బడాయి గాక/

తొలుత సంస్కృతపద్య మెందులకు జెపుఁడి!

 

గురుకులక్లిష్టుడయి విద్య గఱవబోక/

సహజపాండిత్యుడ నటంచు సంబరపడు/

పోతనామాత్యు నే రాజు పూజ సేయు?/

దేవరల దయ్యములను గీర్తింప కేమీ?

 

ఆంధ్ర కవిచక్రవర్తుల కందఱకును/

నీ పలుకు చాలు మేలుబంతి యగుగాక!/

తెలుగు సేతయె కా? స్వతంత్రించి నీవు/

చేసినది యేది? శ్రీనాథ! చెప్పుకోగ.

 

తన మాట తనకె తెలియక/

చని యొక సాలీని వాక్యసందర్భంబున్/

విని యర్థ మెఱింగిన తి/

క్కన పాండిత్యంబె వేఱ యడుగగ నేలా!

 

మన యెర్రన హరివంశము/

దెనిగించినవాడు మంచిదే నాచన సో/

మన యుత్తరహరివంశము/

గనుడీ! యది యెంత చక్కగా నున్నదియో!

 

మధ్యవళ్లు పెట్టి మంజరిద్విపద బ/

ల్నాటి వీరచరిత నా బెనచితి/

వది స్వతంత్రకావ్య మని యేరు మెచ్చుకొ/

నంగవలెనొ? కమలనాభ పౌత్ర!

 

ప్రాలుమాలికచే దాళపత్ర పుస్త/

కాటవుల నర్థపుందెరువాట్లు గొట్టి/

కొఱతబడు నని కుకవిని కొసరి తిట్టి/

పెద్దన యొనర్చినట్టి తప్పిదము నదియె.

 

కృష్ణరాయడు చేసిన విష్ణుచిత్త/

కావ్యమందలి భావము శ్రావ్యమె యగు;/

నెన్ని మార్లు పఠించిన నెఱుకపడని/

వట్టి పాషాణపాక మెవ్వండు సదువు?

 

కవనధోరణి కల్పనాగౌరవంబు/

శబ్దసౌష్ఠవమును లెస్స సంబరంబె;/

బోగపుబడంతులా కళాపూర్ణ కథకు/

నెత్తిన ప్రధాననాయిక? లెంత తప్పు!

 

తగని గర్వంబు జేసి తన్ను దానె/

పొగడుకొనువాడటంచు జెప్పుదురుగాక,/

నాలి పలుకులు రావు తెనాలిరామ/

కృష్హ్ణకవి నోట బంగారు గిలకదీట.

 

కవులందరికీ కలిపి చేసిన  వడ్డనలుః

 

ఒకడు స్వప్నప్రకారము నుగ్గడింప/

నెల్లవారలకు గలలె తెల్లవార్లు/

నవ్వుదురను తలంపు లే దెవ్వరికిని/

పేరుకొన నేమిటికి నట్టి బీద కవుల?

 

దేవతాప్రార్థనంబును దేశనగర/

రాజవర్ణనములు కథారచన యంత/

త్రొక్కి విడిచిన పుంతయే దిక్కుమాలి/

కవనముం  జెప్పదిగిన ప్రజ్ఞానిధులకు.

 

ఈ కాలం కవులకూ ఆశీర్వచనాలు తప్పలేదుః

 

గాసటబీసట వేలుపు/

బాసం బఠియించి యాంధ్రభాషాగ్రంథా/

భ్యాసము లేకయె తెలుగుల/

జేసెద మనుచుండ్రు బుధులు సిగ్గెఱుగరొకో?

 

పూర్వకవి రాజులకు నిది భూషణంబొ/

దూషణమొ యనుకొనుడు మీ తోచినట్లు;/

నన్నయాదుల పట్ల మాకన్న గూర్మి/

గలుగువారలు లేరు జగమ్మునందు.

 

(ఆంధ్రకవులనింద-కవిత-ఆం.-సం.సం-1918-కవిత్వం)

-సేకరణః కర్లపాలెం హనుమంతరావు

రావు

19 -03 -2012

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Sunday, March 14, 2021

వాజ్ఞ్మయ చరిత్ర- రచన- సాధక బాధకాలు · కర్లపాలెం హనుమంతరావు

 




వాక్' అంటే శబ్దం. దానికి 'మయట్ ' అనే ప్రత్యయం కలిస్తే వాజ్ఞ్మయం. శబ్దకృతమయేదంతా వాజ్ఞ్మయ  కింద లెక్కకు రాదు.?  రచన అంటే రాసిన అంశం మాత్రమే  అని మనకో అపోహ. అదీ  సరికాదు. ఆంధ్ర సాహిత్య చరిత్ర ప్రస్తావనలో మాన్యులు పింగళి లక్ష్మీకాంతం రచనను కూర్చిన అంశంగా చెప్పుకోవాలని సూచించారు.   మరి  ఆ కూర్పు మామూలు పొడి పొడి శబ్దాలతో కూడా నిండి ఉండకూడదని ఆయన అభిప్రాయపడతారు.

మహాభారతం శాంతిపర్వంలో  భీష్ముడు అంపశయ్య మీద అచేతనంగా పడున్నప్పుడు విష్ణువుని స్తుతించే  'వృషాకపిస్తవం' లో భగవంతుణ్ణి 'వాజ్ఞ్మయాధ్వరార్చితుడు'ని చేసినందువల్ల  తాను  ధన్యమైనట్లుగా భావిస్తాడు. ('తపమునకు, విద్యకును, జనుస్థ్సానమైన/ జనన రహితుని యజ్ఞాత్ము శౌరి వాజ్మ/ యాధ్వరార్చితు జేసితి నా జనార్ద/ నుండు మద్భాజనమున బ్రీతుండు గాత”) కవితిక్కన భావన ప్రకారం  అర్థవంతమయిన శబ్దంతో నోటి మాట వెలువడినప్పుడే అది  'వాజ్ఞ్మయం' అవుతుందనుకోవాలి.  నోటితో మాట్లాడే శబ్దం రాత రూప  వాజ్ఞ్మయంగా  అన్వయించుకుంటే  ఉభయత్రా శ్రేష్టస్కరమా? అని సందేహం వచ్చినప్పుడు హల్లాం (  Hallam) అనే ఆంగ్ల విమర్శకుడు 'అవును' అంటే, ఛార్లెస్ లాంబ్(Chaarles Lamb) అనే మరో పెద్దమనిషి పద్యాలు మాత్రమే 'రచన' కేటగిరీ కిందకి వస్తాయని వాదనకు దిగాడు. రెండూ విచిత్ర సిద్ధాంతాలే. చాకలి పద్దు కూడా వాజ్ఞ్మయం కిందకే వస్తుందని ఒకరంటే.. చక్కని పద్యాలు మాత్రమే వాజ్ఞ్మయం కింద లెక్క' అని మరో కవి తిక్క ఆలోచన!

ఈ గోలంతా ఎందుకని సమబుద్ధితో ఆలోచించే చేవగల విమర్శకులు దానా.. దీనా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి వాటిలో ఏ కొన్నైనా పాటించే సారస్వతం 'వాజ్ఞ్మయం' శాఖలోకి వచ్చినట్లేనని తీర్మానించారు.    నిబందనల్లో ప్రధానమైనవి రెండు. రచన విజ్ఞాన ప్రసాదిత లక్షణం కలిగి  ఉండటం.. భావనాత్మకమైన సుఖానుభూతి(imaginative pleasuure) అందించడం! అయితే వాజ్ఞ్మయ విభాగం కిందకొచ్చే అన్ని రచనల్లోనూ ఆ రెండు లక్షణాలు ఉండాలని లేదు!

కొన్ని కేవలం మనోవికాసమే లక్ష్యంగా  సాగేవి; మరి కొన్ని భావనాప్రపంచంలో ఓలలాడేవిగా కూడా ఉంటాయి కదా! ఈ పేచీకి పరిష్కారంగానే మన భారతీయ ఆలంకారిక శాస్త్రవేత్త రాజశేఖరుడు మొదటి తరగతి వాజ్ఞ్మయాన్ని(తర్క, వ్యాకరణ, మీమాంసాది ) శాస్త్ర వాజ్ఞ్మయం అని, రెండో తరగగతి వాజ్ఞ్మయాన్ని(రామాయణ భారత భాగవతాది మనో వికాసం తో పాటు భావనాత్మక ఆనందం అందింఛేవి) కావ్య వాజ్ఞ్మయం అనీ విభజించాడు.

మరి  మనోవికాసంతో నిమిత్తం లేని ఆధ్యాత్మిక సంబంధమైన  భజనలు, కీర్తలు, స్తోత్రాది సాహిత్యం సంగతో? అంటే అదీ కావ్య సారస్వతం పరిధిలోకే వస్తుందన్నది లక్షణ నిర్దేశకుల ఉద్దేశం.  ఈ రెండో జాతి కావ్య వాజ్ఞ్మయం పాశ్చాత్య లాక్షిణుకుల పరిభాషలో సాధారణ వాజ్ఞ్మయం (General Literature).

విస్తారంగా అభివృద్ధి చెందే శాస్త్రవాజ్ఞ్మయం ఆయా ఆంశాలకు సంబంధించిన పేర్ల మీదనే వాజ్ఞ్మయంగా ప్రసిద్ధమవడం రివాజు. తర్కం ప్రధానంగా సాగే రచనలు  తర్కశాస్త్ర వాజ్ఞ్మయం కింద చేరినట్లు!

 కావ్య వాజ్ఞ్మయంలో కూడా ప్రక్రియ పరంగా వచ్చే సాహిత్యం ఆ ప్రక్రియ పేరుతోనే కావ్యవాజ్ఞ్మయంగా గుర్తింపు పొందడం సబబు. సాహిత్య చరిత్ర రచన కోసం పాశ్చాత్య లాక్షణికులు అనుసరించిన ఈ సులభ విధానమే భారతీయ కావ్య సాహిత్య చరిత్రకూ అన్వయించుకోవడం ఉత్తమం అన్నది పింగళి లక్ష్మీకాంతంగారు అభిప్రాయపడ్డారు.

ఆ పంథాలోనే ఆ కవివిమర్శకుడు 'ఆంధ్ర సాహిత్య చరిత్ర' రచన అప్పటికి అందుబాటులో ఉన్న ఉపకరణాల సాయంతో వీలైనంత సమగ్రంగా సాకారం చేయగలిగారు.  ఆంధ్రజాతి వారికి సదా రుణపడి ఉండటం అవసరం.

 

'ఏది కావ్యం? ఏది ఇతరం?' అన్న సందిగ్ధం సాహిత్య రచన సాగుతున్నంత కాలం పింగళివారి మనసును పీకుతూనే ఉన్నట్లు ప్రస్తావనలో వారే స్వయంగా వెలిబుచ్చిన అంశాల ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. కావ్యానికి ఉండదగ్గ అర్హతలుగా పాశ్చాత్య లాక్షిణుకులు పరిగణించిన మూడు అర్హతలు- అనురంజన, లక్షణ సౌందర్యం, రసానందం- ఆధారంగానే పింగళివారు కూడా తన సాహిత్య చరిత్ర  రచన సాగించినట్లు అర్థమవుతోంది.  విస్తృతితో నిమిత్తం లేకుండా ఈ మూడు లక్షణాల పరిపూర్ణత పైనే రచనకు  కావ్యార్హత అనేది అంతిమ నిర్ణయం . సౌందర్య భావనకు కించిత్  లోపమేర్పడినప్పటికీ తతిమ్మా రెండు (అనురంజన, రసానందం)  కావ్యానికి విధిగా ఉండవలసిన లక్షణాలని తేల్చేశారు. 

లక్షణ సౌందర్యం ఎంత సమృద్ధిగా ఉన్నప్పటికీ  సర్వజన రంజన, రసానందానుభూతిలో లోపం ఏర్పడినప్పుడు  ఆ రాతకు  కావ్యార్హత లోపించినట్లే! 

పతంజలి మహాభాష్యం, శ్రీ శంకరుల ఉపనిష్భాష్యం ఉత్తమోత్తమ సంస్కృత సౌందర్యరచనలు. శబ్దపరంగా  అద్భుత రచనలు అయినప్పటికీ వ్యాకరణ శాస్త్రం లోతులు చూసినవారికి, వేదాంత పారావారం ఈదగలిగిన వారికి మాత్రమే అవగాహనకొచ్చే వాటిని కావ్య విభాగం కిందకు తీసుకొనడం తగునా.. తగదా? అని ఓ ధర్మ మీమాంస! ఒకప్పుడు ఉనికిలో ఉండి తదనంతరం మరుగున పడి ఉన్న అంశాలను వెలికి తీసి వెలుగులోకి తేగల ద్రష్ట మాత్రమే  శాస్త్రకర్త . కావ్య స్రష్ట తరహాలో తనకై తానుగా సృజించే సామర్థ్యం అతనికి ఉండదు. బ్రహ్మకావ్యం అందుకు ఉదాహరణ.

అంతకు ముందు లేని వస్తువును సృష్టించిన రచన అది. కావ్యం జన్మస్థానం హృదయక్షేత్రం. ఒకే అంశం మీద ఎవరికి వారు తమదైన  వస్తువుగా చెప్పుకునే రీతిలో  సాగే అవకాశం కావ్యరచనకు కద్దు. ఒక వస్తువు కేవలం ఒకనిది గానే లోకం గుర్తించగలిగే ఆత్మీయత (personality)  కావ్యం ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఈ ఆత్మీయ ముద్ర (subjective matter) లేని రచనలను పింగళివారు అపౌరషేయాలు(objective matter) అని పిలుచుకున్నారు. 

 

ఏతావాతా తేలేదేమిటి? సర్వజన రంజకమైన  శైలిలో  భావనాత్మక విధానంలో తనదైన ముద్రను ప్రస్ఫుటీకరిస్తూ సాగే రచన- కావ్యం. ఆ కావ్యానికి సౌందర్యం పూవుకు తావి వంటిది. ఆ తరహా కావ్యాల కాలనుగత పరిస్థితులను పరిశీలించే విధానమే కావ్య సాహిత్య చరిత్ర. కావ్య సాహిత్య చరిత్రలో అటు కావ్యలక్షణాలు, ప్రస్తావనలు, కాలానుగతంగా అవి ప్రభావితమవుతూ వచ్చిన టైమ్ - లైన్ రెండూ ఉంటాయని గ్రహించడం అవసరం. 

 

చరిత్ర అంటేనే ఒక అంశానికి సంబంధించిన జాతి దేశ కాల పుట్టు పూర్వోత్తరాల వికాస క్షయ క్రమ పరిణామాల దశలపైన సహేతుక, ఉదాహరోచిత వ్యాఖ్య.  పౌరుషేయ(subjective matter) అంశం అయిన   వాజ్ఞ్మయం తాలూకు పుట్టుక ఉత్పత్తి వికాస దశలను పై నిర్వచనంలో ఇమిడే విధంగా పరిశీలించే పౌరుషేయ రచన(object matter)  వాజ్ఞ్మయ చరిత్ర. అది  రాయబూనుకోవడం రెండు తాళ్ల పైన ఒకేసారి నడిచే ప్రయాస లాంటిది. పరిపూర్ణమైన  సహాయం, సంపత్తులు కలిగి వాజ్ఞ్మయ చరిత్ర రాయగలిగితే అది ఆ దేశచరిత్రకు మించి విస్ఫుటంగా జాతి ఆత్మను పట్టిచూపిస్తుందంటారు  పింగళివారు.

కాదనలేని మాట.  ఒక జాతి ఆత్మను ప్రతిబింబించే విషయంలో దేశచరిత్రలకు మించి  వాజ్ఞ్మయ చరిత్రలే ఎక్కువ మేలుచేస్తాయి. దేశచరిత్రల పెనుగులాట ఎంతసేపటికి బాహ్య భావనల వరకే పరిమితమవడమే అందుకు కారణం.

 

కర్త లేనిదే గ్రంథం ఉండదు. గ్రంథానికి కర్త జీవితంతో సంబంధం ఎటూ తప్పదు. అట్లాగని కవి జీవితచరిత్రను మాత్రమే రాసుకు పోతే అది వాజ్ఞ్మయ చరిత్ర అనిపించుకోదు.

వాజ్ఞ్మయ చరిత్రలో కవిచరిత్ర ఒక అంతర్భాగం మాత్రమే! ఒకానొక గ్రంథం ఆ విధంగా రూపొందడానికి కారణం కవి జీవితంలోని ఏ సంఘటన కారణం అయివుంటుందని తర్కించడం వరకే వాజ్ఞ్మయ చరిత్రకు కవిచరిత్ర ప్రయోజనం పరిమితం.

కర్త కాలం నాటి సాంఘిక, రాజకీయ, సామాజికాది పరిస్థితులు కవి ద్వారా కవి రచన మీద ఏ విధంగా ప్రభావం చూపించాయో పరిశీలించడం వాజ్ఞ్మయ చరిత్ర రచనలో ఒక భాగంగా ఉంటుంది.

కాల ప్రభావానికి కొట్టుకుపోతూ రచనలు చేసే కవులే ఎక్కువగా ఉండడం సహజం. కొందరు అత్యంత ప్రతిభాశాలులైన కవులు కాలగతిపై తమ ప్రభావం చూపించినవారూ కద్దు. కవి జీవిత కాలాదుల ఏకరువుకు మాత్రమే పరిమైనా ఆ వాజ్ఞ్మయ చరిత్ర నిజమైన వాజ్ఞ్మయ చరిత్ర కాలేదు. కవి జీవితంలోని ఏయే సంఘటనలు ఏ మేరకు చరిత్ర గమనం పైన ప్రభావం చూపించాయో సోదాహరణగా  ఉటంకిస్తూ పరిశీలన చేసేదే అసలు సిసలు వాజ్ఞ్మయ చరిత్ర అవుతుంది.

ప్రతిభాహీనులైన కవుల విషయంలో ఇంత పరిశ్రమ చేయటమంటే సమయం వృథా చేయడమే. పతిభావంతులైన కర్తల విషయంలో ఈ దిశగా అప్రమత్తత కొరబడ్డా అది వాజ్ఞయ చరిత్రకు చేసే అన్యాయమే అవుతుంది. వాజ్ఞయ చరిత్ర నిర్దుష్టతకు కర్తలో  అందుకే కేవలం ఒక పరిశోధకుడు  మాత్రమే ఉంటే సరిపోదు. తోడుగా విమర్శకుడి మేధోమధనమూ తప్పనిసరి! 

 

వాజ్ఞ్మయ చరిత్ర రాతకు పూనిక వహించిన విమర్శకుడిలో ఉండవలసిన మరో ముఖ్యమైన బుద్ధి వైశిష్ట్యం రాగద్వేషాలకు అతీతమైన స్వతంత్ర పరిశీలనా శక్తి.

 

పిండితార్థం  ఏమిటంటే చక్కని వచన రూప  వాజ్ఞ్మయ చరిత్ర సాకారానికి కర్తలో  ఉండవలసిన ప్రధాన లక్షణాలుః పాండిత్యం, పరిశీలన, సమబుద్ధి, నిశిత దృష్టి, వ్యాఖ్యాన నిపుణత. కావ్యేతర రచనల ప్రస్తావనా అవసర పడితే తప్పదన్న వాస్తవం వాజ్ఞ్మయ చరిత్ర రచయిత మనసుకు పట్టించుకోవలసిన  ముఖ్య సూత్రం. న్యాయ నిర్ణయం కోసం న్యాయాధికారి తన ఇష్టాయిష్తాలతో నిమిత్తం లేకుండా అవసరమనిపించే ఏ సాక్షినైనా బోనులోకి అనుమతించక తప్పదు. వాజ్ఞ్మయ చర్రిత్ర కర్తదీ అదే అవస్త.

 

ఒక ప్రతిపాదిత  సిద్ధాంతం నిరూపించడానికో, ఖండించడానికో అవసర్రమైనప్పుడు కావ్యేతర గ్రంధాన్నైనా, కావ్య లక్షణం ఒక్కటైనా బొత్తిగా కరువైన పొత్తాన్నైనా ఉటంకించక తప్పనప్పుడు ఆ పనికి సిద్ధపడాలి. తమషా ఏమిటంటే వాజ్ఞ్మయ చరిత్ర రచనకు పూనుకొనే రచయిత సార్వజనీన సిద్ధాంతానికి మనస్ఫూర్తిగా  బద్ధుడై, స్వయంగా ఏ ప్రతిభావంతుడైన కవికూడానో అయివుంటే  అతగాడి వాజ్ఞ్మయ చరిత్ర కేవలం దేశ చరిత్రల జాబితాలోనే కాకుండా, స్వయంగా వాజ్ఞ్మయ విభాగంలో కూడా సమున్నత్తమైన స్థానం పొందగలుగుతుంది.  సంస్కృతంలోని విక్రమాంకదేవ చరిత్రము, హర్ష చరిత్రము ఆ కోవకు చెందినవే!  తెలుగులో అయితే కృష్ణదేవరాయ విజయము, రంగరాయ విజయము, పలనాటి వీరచరిత్ర, కాటకరాజు కథ  ఈ కోవకు చెందేవి.

 

చరిత్ర వాస్తవానికి కేవలం యథార్థ సంఘటనల సారం. చారిత్రక ఇతివృత్తాంతాన్ని కథావస్తువుగా తీసుకున్నప్పటికీ రసానందానుభూతి కోసం గాను కొన్ని  సందర్భాలలో కావ్య సంప్రద్రాయాలకు లోబడి కల్పనలకు పాల్పడే పద్ధతి కద్దు.    విశిష్ట శైలితో  మాత్రమే రచనకు దేశచరిత్ర్ర హోదా దక్కదు. చారిత్రక  రచనలుగా ప్రసిద్ధిపొందిన కావ్యాలను గమనిస్తే అయా రచనలలో కనిపించేది ఏక మొత్తంగా చరిత్ర మొత్తం కాదు. రచయిత తనకు నచ్చిన ఏదో ఒక సంఘటన ఆధారంగా అల్లిన కావ్యకల్పన.  సత్య కథనానికి భంగం కలిగిస్తున్నాయి కాబట్టి అట్టి వాటికి చరిత్ర విభాగం కింద ప్రవేశం ఉండదు.  అయితేనేం, సారస్వత ప్రియులు ఆ రచనలను తమవిగా భావించి వాజ్ఞ్మయ కులంలో స్థానం కల్పిస్తారు. వాజ్ఞ్మయ చరిత్రకు పూనకున్న పండితులు చరిత్రకు, కాల్పనిక చరిత్రకు మధ్యన ఉండే పల్చటి పొరను గమనించకపోతే రాసే వాజ్ఞయ చరిత్రకు లోపం కలిగిస్తున్నట్లే!

-కర్లపాలెం హనుమంతరావు

14  -03 -2021

***

Saturday, March 13, 2021

బ్రహ్మ చెవుడు ఉంటేనే గురు బ్రహ్మగా రాణింపు - సరదాకే - కర్లపాలెం హనుమంతరావు

 



గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహ...!

సోది! మాను మానవా! సూటిగా పాయింటుకి రా!’ 

'చిత్తం చిత్తం శ్రీమన్నారాయణా! దిగువ లోకంలో నేనో దిక్కుమాలిన అయ్యవారుని..!కన్నీళ్లు అడ్డు పడ్డంతో మాట పెగల్లేదు బక్క పంతులుగారికి. 

'అరరేఁ! ఎందుకయ్యవారూ ఈ కన్నీరు?! నరులకు  నువ్వే కదా గురువుగా మా తరుఫు   జ్ఞాన తరువువి! బుజ్జాయిలుగా ఉన్నప్పటి బట్టీ మనుషుల మరగుజ్జు మెదళ్లలో నానా గుజ్జూ కూరి బాహుబలి సైజు భారీ మోదీలుగాషాలుగా  మలిచే పూచీ నీకే కదా మేం అప్పగించింది! మరి ఇప్పుడేంటీ పేచీ’ 

బుద్ధి గడ్డి తిని స్వామీ      మీ దేవుళ్ల పని నా నెత్తికి రుద్దుకున్నది అప్పట్లోకేవలం తొమ్మిది అవతారాలు మాత్రమే తమరు ఎత్తింది కేశవా ఇప్పటికి.   ఓఁ.. దానికే సర్వలోకాలకు సమస్త సన్మంగళాలు సిద్ధించాయనా తమరి భ్రమదుష్ట శక్తులన్నింటినీ తరిమికొట్టేసినట్లు తమరేమో  ఇక్కడ నిశ్చింతగాయోగనిద్రలో జోగుతుంటిరి!  తుంటరి మూకలేవీ ఎక్కడకీ తారుకోనేలేదు తాండవ కృష్ణా! బాహాటంగానే  మా భూమండలం పై   బళ్లూకాన్వెంట్లూగట్రాలతో పీడన కొనసాగిస్తున్నారు.  పసికుంకలకు,  మా బడిపంతుళ్లకు నానా రకాల నరకాలు  రుచి చూపిస్తున్నారు!’ మేష్టార్లుగా మేం దిద్దే బుడతల నోటుబుక్కుల  ముందర కూర్మావతారంలో తమరెత్తిన  మంధర గిరులు ఎన్ని వందలైనా  దూది పింజలే సుమా!’   

గోల మాని గో టు ది పాయింట్ స్ట్రయిట్ సర్!’ 

యస్సార్భూమ్మీద కో సారి కోదండపాణి మళ్ళీ దిగిరావాలి! ఏ కాన్వెంటు ఇస్కూలులోనో జాయినవాలి! అప్పటిగ్గానీ మా గురుర్విష్ణువుల తిప్పలేమిటో  తిరుమలేశునికి తెలిసిరావు.  అట్టహాసమే తప్పించి హిరణ్యాక్షుడు నిజానికి వట్టి పిచ్చి సన్నాసి  స్వామీవరాహావతారం ఎత్తి  తమరిట్లా ముట్టే,   మూతీ ఎగరేయగానే బెదిరి   కొట్టేసిన భూమి మొత్తం  ఇట్టే  తిరిగిచ్చేసిన రాక్షసోత్తముడుమా నేతలు ఉత్త రాక్షసులుఎన్నో హిరణ్యాక్ష వరాలిచ్చారు  ఎన్నికల ముందు..  మీ ముక్కోటి దేవతలను మించి! గెలిచి గట్టెక్కినాక  కావరం చూపించడం తప్పించి.. ఏ ఒక్క వరమూ తీర్చే యోచనే లేకపాయ యోగానందా! తమరెంతో  అధర్మ ద్వేషులని గదా విశ్వమంతటా వినిపించే మాటఅదే సత్యమైతే మరెందుకు  సుమొటోగా అయినా   మా భూలోక గురువుల  బీదరుపులు తమరి చెవుల దాకా రాలేదు?!  పింఛమే ఆడిస్తారోఫ్లూటే ఊదుతారో మురళీ కృష్ణా.. ముందు మా ఉపాథ్యాయుల కాంట్రిబ్యూటరీ పింఛను సమస్య కొంచమైనా  ముందుకు కదిలే మహిమ చూపించమని మనవి!  ప్రహ్లాదుడంటే పాలూ నీరూ తేడా తెలియని  బాలుడు. అతగాడేదో అమాయకంగా అడిగాడని అంత లావు ‘గాడ్’ అయివుండీ అన్యాయంగా తమరు  నరసింహావతారమెత్తి అంతమొందించారే హిరణ్యకశిపుడిని! నిజానికి అక్షరం విలువ క్షుణ్ణంగా తెలిసిన సత్తెకాలపు తండ్రి  హిరణ్యకశిపుడు.  పద్దాకా పాఠ్యప్రణాళికలలో అడ్డ దిడ్డంగా  మార్పులు తెచే మా దొడ్డ పాలకులు ఆ ప్రహ్లాదుడి కన్నతండ్రి కాలి ధూళికైనా సరిరారు నరహరీ ప్రభుద్ధుల బుద్ధుల సరిదిద్దే పనికి తమరెందుకు బద్ధకిస్తున్నట్లుదుష్టశిక్షణ పద్దు తమరి ఎజెండా నుంచి ఇంకా జారకుండా ఉందా ముకుందా?  భూలోక దేవుళ్ళం కదా మేం గురువులంఅయినా ఇంత దూరం  దేకుతూ పాకుతూ వచ్చి దేబిరించే దాకా  తమరు విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టి పెట్టరా విశ్వంభరా  విడ్డూరం కాకపోతే!  తమరా బాకీ కల్కి అవతారం  ఎత్తైనా ముందు మా పీ ఆర్ సి బకాయిలు నగదు రూపంలో చెల్లించేదుకు  ప్రభుత్వాలను ఒప్పించండి  మహాప్రభోతల్లిభాష ప్రాధాన్యత పై  ఇంకా తాత్సారం తగదు  ! ఇందిరాప్రియా..   తమరి ఇమేజికే డ్యామేజీ! వైనతేయునికి స్వామివారన్న వినయమన్నా   వైరి వర్గం చూపదుఏ పరశురామావతారం తాలూకు గండ్రగొడ్డలి సీనులో మార్ఫింగు  వీడియోలో వైరలయే ప్రమాదం కద్దు! 'బతకలేక బడి పంతులుఅన్న సామెత చచ్చినా చచ్చిపోరాదన్నదన్నంత కచ్చగా ప్రవర్తిస్తున్నారందరూ  గురువుల ముందరఅందుకే ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకోసం భూమ్యాకాశాలనైనా ఏకం చేసి తీరాలన్న  పంతానికొచ్చాం పంతుళ్లమంతా. ఇకనైనా  తమరికి      ఉదాసీనత తగదు సదానందా! మా తగాదాలలో తలదూర్చండిజగద్గురువుగా సాటి గురువుల గౌరవం నిలపండి!  హలం భుజాన మోసారే  తప్పించి   కనీసం ఓ అరెకరా మడి చెక్కనైనా తమరు చదును చేసిందెక్కడ?  భూమ్మీది పంతుళ్ల పనులు  వత్తిళ్ళు అంత సులువుగా లేవు సుదర్శనా!  పేరుకే బడికి సెలవులు. పరగడుపున నిద్ర లేచింది మొదలు రాత్రి పొద్దెక్కినా పడకెక్కలేనంత పనిభారం!  ఎన్నికల నుంచి సమాచార సేకరణల వరకు అన్నింటా సర్కారువారికి కాణీ ఖర్చులేని కంచిగరుడ సేవకులు బడి పంతుళ్ళే పద్మనాభా! అయినా ‘టీచర్’ అంటే బడి లోపలి  బుడతడి పాలిట డర్టీ క్రీచర్. బడికి బైట సర్కారు కంటికి ‘సిల్లీ కేరికేచర్’! కృష్ణావతారంలో అబల ‘సత్య’ ఆగ్రహానికి జడిసి గబగబా పారిజాతం కోసం పరుగులెత్తారే మురారీ! అరే!  అదే మరి ఇన్నాళ్ళుగా మా బతుకులు బాగు కోసం సత్యాగ్రహాలకు  దిగుతున్నా చీమైనా కుట్టినట్లు లేదేం శ్రీమన్నారాయణా!   

 

సర్సరేలే గురువా! యోగ నిద్ర మధ్యలో జొరబడింది ఈ మీ  లోకం గోలంతా చెప్పి మరీ నన్ను దెప్పేందుకా?!’ 

 

ఏళ్ల తరబడి పదవీ విరమణ చేసే ఏళ్ళు పెంఛమని ఏడ్చుకుంటున్నాం పంతుళ్లం. యుగాల బట్టి పెండింగులో పడుంది  జగన్నాథుడి పదో అవతారం. ముందెళ్ళి ఆ ముకుందుడి  ముక్కు పిండి జవాబు రాబట్టుకు రండి.. అప్పుడు మీ తిప్పల సంగతి గురించి  తీరిగ్గా ఆలోచిద్దాం!’ అంటోంది సర్కార్ ఎప్పుడు ఆందోళనలకు దిగినా చివరాఖర్న! ఈ వేళ మా లోకంలో ఉపాధ్యాయులకు  దినోత్సవం.  గురువులకు గురువువి! తమరిచ్చే  సూచనల గురించే ఈ యాచనంతా యాదగిరిస్వా,మీ!’ 

బిగినింగులో చదవబోయావే .. ఏదీ ఆ శ్లోకం ఇప్పుడో సారి బిగ్గరగా బైటికి చదువు గురువా!’ 

 'గురుబ్రహ్మ.. గురుర్విష్ణు:.. గురుర్దేవో మహేశ్వర: .. 

 ‘ఆగక్కడ! నీ శ్లోకంలోనే ఉంది కదా సారూ  ముందుగా గురువంటే  బ్రహ్మ.. చివర్నేమో శివుడు. నా ఖర్మ కాకపోతే  మధ్యన ఉన్న నన్ను అడ్డమేసుకుని  ఎవరెవరినో ఈ ఆడిపోసుకోవడంలోని ఆంతర్యమేమి స్వామీ?!’ 

కైలాసగిరి చుట్టూతానే ముందు కాళ్లరిగేటట్లు తిరిగింది ముందు ముకుందా!  ‘ఒకే రకంగా ఉద్యోగ నిబంధనలు లేవు. ఆ కారణంగా పదోన్నతలకు అవకాశాలు కరువు. కరువు భత్యం బకాయిలకు ఎప్పుడూ ఎదురుచూపులే! పీఆర్సీ నివేదికల అమలు జాప్యమయే పక్షంలో కనీసం బకాయిల్లో కొంత నగదుగానైనా  ముక్కుకు వాసన చూపించమని  ఏళ్ల బట్టి మొత్తుకోళ్లు. అయినా సర్కార్ల మనసులు కరగేదిలేదు. పింఛన్ కోసమని  జీత బత్తేలలో  కోత పెట్టే పద్ధతిఅయినా  బలవంతంగా రుద్దకుండా పాత విధానమే  కొనసాగించేలా చూడమని కైలాసవాసుణ్ని  వేడుకొనేందుకుఉ వెండికొండ పై కెన్ని సార్లు ఎగబాకామో.. ఆ దేవుడికే తెలుసు.  నల్ల బ్యాడ్జీలతో  మేం కంటపడ్డప్పుడల్లా వల్లకాదు పొమ్మనడు.. వల్లకాటికి రావద్దనడు. శివయ్య తాండవాలు తప్పించి మరో అనుగ్రహం మాకెన్నడూ  లేకపాయ! ఇదేమని నిలదీయబోతే నడి మధ్యలోకి నంది బంటు వచ్చి  గుప్పెడు బూడిదకు తోడు ఆ బికారి శేష వస్త్రాలని చెప్పి ఇదిగో ఈ మందపాటి తోలు ఒకటి అందించడంతో సరి .. శ్రీహరీ!’ 

సరి! మరి మీ గురుబ్రహ్మ శ్లోకంలోనే ఉంది కదా అందరి కన్నా ముందు   విధాత పేరుఆ చతుర్ముఖుడికీ ఎందుకట ముఖం చాటేయడం?’ 

బ్రహ్మగురువుకి మా లోకంలో పూజాదికాలు కరువు!  ఆ మాంధాత  మాటకు ఏమంత విలువుంటుందివట్టి కంఠశోష అవుతుందేమోనని    మీ సన్నిదానానికే ఇట్లా వచ్చి విన్నవింఛుకునేది? ’ 

దుర్మార్గాల ప్రక్షాళన కోసం   సరికే తొమ్మిది అవతారాలు ఎత్తున్నాను! బుద్ధావతారంలోనే మీ  మానవుల బుద్ధి మా బాగా బుర్రకెక్కింది బాబూ!   కలి పైత్యం ఆసాంతం ముదరాలి ముందు. ఆ పైనే కల్క్యావతారం కథా కమామిషు! నా సహస్ర బాహువుల్లో సహస్ర ఆయుధాలు. శంకువుచకంగదదండం. మీ అధికారులది బధిరాంధకార బుద్ధి. శంఖవు పనిచేయదు. చక్రం ఏ సత్యయుగం ముందు కాలంనాటొ తయారీనో! వాడకం లేని అలంకారం. అస్తమానం సర్కులేషన్లో ఉండి.. వాడుతున్న కొద్దీ వాడి పెరిగే ఆయుధం దండం. దీన్నందుకో గురువర్యా! మీ యుగంలో దీని మరో పేరే ‘దణ్ణం’. దణ్ణం దశగుణం భవేత్! పై వాళ్లను  మునగ చెట్టు ఎక్కించేందుకుకరుడుగట్టిన పెద్దలను మెత్తబరిచి కడగండ్ల బారి నుంచి  తప్పించుకునేందుకు అన్ని యుగాలలోఅన్ని లోకాలలో దాసులు ఎల్లవేళలా రెండు చేతుల నిండుగా ధరించి ధీమాగా తిరిగే లైట్ వెయిట్ పవర్ ఫుల్ వెపన్ ఈ దణ్ణం.  గద  మాదిరి భారీగా ఉండదు కనుక  భుజం మోత తప్పుతుంది. శంకువు  తరహాలో మారుమోగదు కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా  మన పని కానిస్తుంది. చక్రమంటే చూపుడు వేలు పద్దస్తమానం దానికే మీదు కట్టే బాధ.  దండం   పెరుకే ఒక ఆయుధం. కనీసం బట్టలు ఆరేసుకునే దండెం కిందకైనా ఉపయోగించని దండుగ ఆయుధం.  ’ బక్క అయ్యవారువి.  తిక్క ఆందోళనలతో సాధించేది ఏమీ లేదని ముందు తెలుసుకో! సమయానుకూలంగా ఈ 'దండం'  సందించే విద్య ఒక్కటి వంటకి బడితే చాలు సర్వీసులో ఉన్నంత కాలం బడికి వెళ్ళి పాఠాలు చెప్పకున్నా జీత భత్తేలతో పాటు ‘ఉత్తమ ఉపాధ్యాయ’ వంటి  పురస్కారాలు అడక్కోకుండానే రెక్కలు కట్టుకుని మరీ ఇంటి ముంగిట వాలిపోతాయ్!  మంచు కొండ మీద ఒంటి మీద చింకిపాతైనా లేకుండా మాడు పై ఒకరినివంటి పక్కన వేరొకరిని  ఇద్దరాడంఫులను  ఒకేసారి భరింఛడానికి తోడు గొంతు లోపల కాల కూట విషమున్నాగొంతు మీదనే మిన్నాగు పాకుతున్నా,  గోల గోలగా అరుపులు సాగిస్తూ ఒక్క క్షణమైనా వదలని భూత ప్రేతపిశాచాల  మూకలను సైతం చుట్టూ చేర్చుకునీ యోగ ముద్రలో అంత భద్రంగా కాలుడు దున్నపోతు మీద ఓ కాలు వేసుకుని మరీ అంత  కులాసాగా విశ్వదుష్ట వినాశనం పైన ఏ ఒక్క  ఫిర్యాదుకైనా తావీయనంత దీక్షతో  ధర్మకార్యం నిర్వహణ నిరంతరం అనాదిగా అంత సమర్థంగా ఎలా నిర్వహిస్తున్నాడో ఎన్నడైనా ఆలోచించావా గురువా! ఆ మహేశ్వరుడి అంత నిశ్చింతకూ నీవు ఇందాక తిట్టిపోస్తివే.. ఆ 'తోలు మందమేమూల కారణం పంతులూ! గురువే బ్రహ్మగురువే విష్ణువు. గురువే మహేశ్వరుడు- అని నీవే ఓ శ్లోకం అందుకుంటివి గదా ఇందకా! పిల్లల అల్లరి మాటల పట్ల బ్రహ్మ చెముడు  పాటించు. పెద్దల చిల్లర చేష్టలనే మాత్రం పట్టించుకోని మహేశ్వరుడి మందపాటి తోలు మనసుకు ధరించు. కలియుగం కాబట్టి నేను అందించిన ‘దణ్ణం’ రెండు చేతుల నిండుగా పట్టు! అప్పుడు తప్కుండాక నీ శ్లోకంలోని  ఆ రెండో భాగం 'గురుస్సాక్షాత్ పరబ్రహ్మం'  నిజం కాక చస్తుందాఅప్పుడు వద్దన్నా అన్ని లోకాలూ 'తస్మై శ్రీ గురువే నమ:!అంటూ మోకాళ్ల మీద తలవంచి మరీ నీ ఆశీర్వాదం కోసం క్యూ కడతాయి అయ్యవారూ! ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా  అందుకో మా త్రి మూర్తుల  తరుఫు నుంచి ఆయుధాలూఅభినందనలు! 

-కర్లపాలెం హనుమంతరావు

***


నరక బాధలు- -కర్లపాలెం హనుమంతరావు - సరదా కథానిక

 







చరవాణి గణగణ మోగుతున్నది. చిరాగ్గా అందుకున్నాడు యమధర్మరాజు. చిత్రగుప్తుడు చిటపటలాడిపోతున్నాడు అవతలి వైపు నుంచి. 'వరదలా పోటెత్తిపోతున్నాయి మహాప్రభో మానవాత్మలు! వీటితో వేగడం నా వల్ల కావడం లేదు. న్యాయ, చట్టం, హక్కులంటూ ఏవేవో కొత్త వాదనలతో తల బొప్పికట్టించేస్తున్నాయి. మన రాజ్యాంగం మాంధాతల కాలం నాడు రాసిందట! మార్చి తీరాల్సిందేనని మఠం వేసుక్కూర్చున్నాయి నరకం ఎంట్రీ దగ్గర! కొన్ని స్వర్గ ద్వారాలకు అడ్డంగా పడుకున్నాయి!' చిత్రగుప్తుడి గగ్గోలు.

'చచ్చి పైకొచ్చిన ఆత్మల పాప పుణ్యాల విచారణ చకచకా సాగితేనే కదా.. అవి యధాలోకాలకు వెళ్లి నరకంలో జాగా దొరికేది!'

'నిజమే కానీ ఆ ఇంగితం ఉంటే ఇన్నిన్ని ఒకే సారి ఇక్కడి కెందుకొచ్చిపడాతాయి? లోపలి ఆత్మలు బైటికి పోలేక, బైటి ఆత్మలు లోనికొచ్చే అవకాశం లేక చెకింగ్ పాయింట్సు దగ్గర పెద్ద స్టార్ల కొత్త సినిమా మొదటాట ముందుండే సినీ థియేటర్లను మించి నరకంగా ఉన్నాయి మహాప్రభో! కిం కర్తవ్యం?'

'మన కింకరాధములంతా అక్కడ ఏంచేస్తున్నారయ్యా?' హూంకరించాడు యమధర్మరాజు.

'అంతా ఆత్మల గుంపు మధ్యలో ఇరుక్కుపోయారు మహాప్రభో! ఎవరు కింకరుడో, ఎవడు పాపాత్మగల నరుడో .. తేడా తెలీకుండా ఉంది. అంతా గందరగోళంగా ఉంది. ఏం చెయ్యమని సెలవు? సలహా కోసమే తమరికిలా ఫోన్ చెయ్యడం!'

'సలహాదారుడి నువ్వే కదయ్యా! ఆలోచింఛమని నన్ను శ్రమ పెట్టొద్దు' కంగారుపడ్డాడు యమధర్మరాజు.

'పోనీ నేరవిచారణాల్లాంటివేమీ లేకుండానే నేరుగా స్వర్గంలోకి తోసేద్దామా ప్రభూ! ఇప్పుడీ మోడల్ న్యాయవ్యవస్థకే కింది లోకాల్లో డిమాండ్ ఎక్కువగా ఉందిమరి! స్వర్గంలో కూడా బొత్తిగా పనీ పాటా లేక ఇంద్రాదులంతా కొత్త కొత్త బాలీవుడ్ మూవీలతో ఎంజాయ్ చేస్తున్నారు'

'త్రిమూర్తులు ఊరుకుంటారా పిచ్చి చిత్రగుప్తా! ఇంద్రుడు, కుబేరుళ్లాంటి కొద్ది మంది మీదే సర్వేశ్వరుల కెప్పుడూ కరుణా కటాక్షాలయ్యా బాబూ! సందెక్కడ దొరుకుతుందా.. నన్నీ పీఠం మీద నుంచి కిందకు లాగి తొక్కిపడేద్దామన్న అక్కసు బోలెడంత మందికుంది. ఆ మంద నిశ్శబ్దంగా ఊరుకుంటుందా?త్రి మూర్తుల బుద్ధి మాత్రం తిన్నగా ఉంటుదన్న గ్యారంటీ ఏముంది? చేసిన పాపాలకు కిందా శిక్షలుండక, పైనా శిక్షలు పడక దుర్మార్గులు తప్పించుకుంటే సన్మార్గం మీద ఇంకెవరికయ్యా ఆసక్తి మిగిలుండేదీ?'

 మన సమస్యలు ఎప్పుడూ చచ్చేవేగా!'

'ఎప్పటి మాదిరి సమస్యలయితే ఎప్పట్లానే డీల్ చేద్దుము ప్రభూ! ముక్కుతూ మూలుగుతూనే విధులు పాత పద్ధతుల్లో చక్కబెట్టడం న్యావ్యవస్థలకేం కొత్త కాదు గానీ ఎక్కడైనా! ఇప్పుడొచ్చిపడే కేసులను నా కోటి పుటల చిట్టాలోని ఏ ఒక్క ఆర్టికలూ పరిష్కరించేది కాదు మహాప్రభో! అన్నదాతలను, ఆడబిద్డలను, బ్యాంకు మదుపుదారుల్లాంటి అమాయక జీవులను యదానపెట్టుకునే  పాపాత్ములకు ఎలాంటి శిక్షలు అమలు చెయ్యాలో .. కరతలామలకం నాకు. కానీ కన్నబిడ్డ చెప్పకుండా పెళ్లి చేసుకుందని కక్ష కట్టి ఇంటల్లుడిని  కోటిచ్చి మరీ చంపించిన త్రాష్టులు విచారణకొస్తున్నారు. విచారించి తగు సమయంలో కఠినాతి కఠినమైన శిక్షలు వేసే కొలువులు చేపట్టీ.. చట్టంలోని లోసుగుల్ని చూపెట్టి దోషుల్నికాపాడే దుష్టులూ పైకొచ్చేస్తున్నారు విచారణలకు. పండంటి ఇద్దరు బిడ్డల తల్లై ఉండీ.. కొత్త మొగుడు మరోడుంటేనే పండగలా ఉంటుందని పాత మొగుడి తలపండు రోకలిబండతో బద్దలేసే ఇల్లాళ్లూ ఇక్కడ విచారణకొచ్చేస్తున్నారు మహాప్రభో!  ఏ పుటలో ఏ క్రిమినల్ కోడ్ సరైన శిక్షలు  సూచించిందో చూద్దామన్నా కన్నీళ్ల మధ్య ఒక్కక్షరం ముక్క కనిపించి చావడంలేదు..'

చిత్రగుప్తుడి గొంతులోని వణుకు చరవాణిలో స్పష్టంగా వినిపిస్తోంది 'చాలా గడుగ్గాయి ఆత్మలు తమకు బదులు తమ ప్లీడరు ఆత్మలను పంపి వాదనలు చేయిస్తున్నాయి! చేయని పుణ్యాలను క్లయిమ్ చేసే క్లయింట్లు కొంత మందైతే, చేసిన పాపాలను తాము నేరుగా  చెయ్యలేదని బుకాయింపులకు దిగే రువాబు ఆత్మలు వాటికి డబుల్! చచ్చి వచ్చినవాళ్లంతా చావు తెలివితేటలు ప్రదర్శిస్తుంటే.. విచారణ ప్రారంభించడమే చచ్చే చావుగా ఉంది. మరి ముగింపుకు స్వస్తి పలికేదెప్పుడో ముకుందుడికైనా తెలుస్తుందో లేదో..'

'విచారణ అయిందాకా నరకలోకంలోనే పడుంటారు కదా! మధ్యలో నీ కేంటయ్యా బాధ చిత్రగుప్తయ్యా?'

'బసే' పెద్ద సమస్యగా మారిందిప్పుడు మహాప్రభో! నేర నిర్దారణ అయిందాకా  అందరం మహాత్ముల కిందే లెక్క. అందాకా పుణ్యాత్మలకే స్వర్గ సుఖాలకు హక్కులుంటాయో .. మాకూ అవి దక్కి తీరాల్సిందే' అనే బ్యాచి ఎక్కువయిపోతోంది మహాప్రభో! సంఘాలు కడుతున్నాయి ప్రేతాత్మలు. మన నరక చట్టాల మీద వాటికే మాత్రం ఖాతరీ లేదు. ఆ నాస్తికులతో కల్సిపోయి మన పిచ్చి కుంకలు కింకరులు కూడా సంకరమయిపోతున్నారు  అరివీరభయంకరా! ఏమి చెయ్యమని సెలవు?'

' సలహాదారుడంటే సమస్యలు ఏకరువు పెట్టడం వరకేనా? పరిష్కారాలు కనిపెట్టే పనిలేదా?' గయ్యిఁ మన్నాడు యమధర్మరాజు మరేం చెయ్యాలో పాలుపోక.

'అన్నమాట ఎలాగూ అన్నారు. మరో ఉన్నమాటా సెలవిచ్చుకుంటాను సమవర్తీ! స్థల, వ్యవసస్థలే కాదు ప్రస్తుత సమస్యలు, వనరులు కూడా క్రమంగా అడుగంటిపోతున్నవి మహాత్మా!' చిత్రగుప్తుల వారి ముక్కు చీదుడు చరవాణిలో స్పష్టంగా వినిపిస్తోన్నది.

'సర్దుకో.. సర్దుకో! కలహభోజనుడు ఇటే వస్తున్నాడు. ఆ మహానుభావుడి చెవిన గాని బడితే మన పరువు వైతరణిలో కలిసిపోడం ఖాయం' చరవాణి చటుక్కున కట్టేశాడు యమధర్మరాజు కంగారుగా.

'నారాయణ.. నారాయణ! నా మీదనేనా నాయనా వ్యంగ్యబాణాలు! నరక లోక వైతరణికి పుష్కరాలొచ్చినట్లున్నాయే.. జీవాత్మల తాకిడి ఎక్కువైందీ! చిత్రగుప్తుల వారితో సహా తమరంతా విచారణలెలా చెయ్యాలో దిక్కు తోచక  గుడ్లుతేలేసారని   ముల్లోకాల్లోనూ నవ్వుకుంటున్నారయ్యా! ముందా పరిహాసాల సంగతి చూసుకో యమధర్మరాజా!'

'సంక్షోభంలో ఉన్నాం. హాస్యానికి ఇదా సందర్భం నారదా!'

సంక్షోభం నుంచే సంక్షేమం రాబట్టుకోవాలయ్యా పిచ్చి యమధర్మరాజా! ఇన్ని సార్లు టాలీవుడ్డెళ్లి వాళ్ల టాకీలల్లో నటించొచ్చావే! భూలోక వాసులను చూసైనా నేర్చుకోరాదా?'

'సినిమాలు వేరు. పాలనలు వేరు. మాది వనరుల  సమస్య మహర్షి నారదా! భారీగా పెరిగిపోతోందిక్కడ పాపాత్మల జనాభా!నిభాయించుకురావడ మెలాగో తేలకే..'

'దీనికే ఇలా దిగాలుబడితే ఎలాగయ్యా పిచ్చిరాజా! ముందున్నది ముసళ్ల పండుగ! భూలోకంలో కరోనా అని ఓ కొత్త ముసలం బైలుదేరింది.  ఇంకో రెండు నరకాలు నువ్వు అద్దెకు తెచ్చుకున్నా చాలని పరిస్థితి..'

'బెదరగొట్టకపోతే.. బయటపడే దారేదో చూపించి పోరాదా నారాదా!'

'భూలోకాన్ని మించిన పాప్యులేషన్ టయ్యా నీ బోడి నరకానిది? దేశాలుపట్టి పోయిన వాళ్లు పోగా  ఇప్పటికీ ప్రపంచంలో అయిదో వంతు జనాభాకి భారద్దేశమే వసతిగృహం, విడిదిగృహం. జనాభానే నిజంగా సంక్షోభానిక్కారణమయితే పొరుగునున్న చైనాతో అది పోటీ పడ్డమెందుకు? వరదల నుంచి వడగళ్ల దాకా, హత్యల నుంచి  రాజకీయ కక్షల దాకా, ఎబోలా, కరోనా లాంటి రోగాలు రొప్పులతో మీ దగ్గరి కొచ్చి పడే శాల్తీల శాతమెంతో తెలుసా?ముష్టి ఒక్కటి. ఆ ఒక్క శాతానికే నువ్వింతలా  బిక్కమొగమేస్తున్నావే! తతిమ్మా తొంభై తొమ్మిది మందితో కింది లోకాలు ఎలా వెలుగొందిపోతున్నాయో .. ముందో సారి కళ్లకు చుట్టూ ఇదిగో ఈ అంజనం పులుముకుని మరీ బాగా పరికించి చూడూ!'

'అబ్బా! గొంది గొందికి బృందావనాలు! సందు సందుకీ మధ్యన సందు లేకుండా జనాల సందళ్లు! ఎవడి కడుపు చూసినా బాన షేపు, ఎవతె తలను చూసినా నెత్తిన గోల్డు కొప్పు, ఏ బుడ్డోడి జేబు తడిమినా స్మార్ట్ ఫోను, ముసిలోడి పక్కన చూసినా సింగపూరు సిగారు! ఏట్లా సాధ్యమయిందంటావ్ ఇంత అసాధ్యమైన లీల! ఒక్కసారి ఆ తారక మంత్రమూ నా చెవిన వేసి పోరాదయ్యా నారదా?'

'బావుంది. అట్లా మర్యాదగా అడిగావు కనక చెప్పబుద్ధవుతుంది. ఓ సారి నీ  చెవ్విటు పారేయ్'

'…………'

'ఆర్నీ! అదా సంగతి! అర్థమయింది  మహర్షీ.. కష్టం గట్టెక్కే పద్ధతి! 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్!'  అని ఇప్పుటిగ్గాని మా మట్టి  బుర్రలకు తట్టింది కాదు. మా దగ్గర పేరుకుపోతోన్న నరాత్మలతో వనరుల సాధనెలాగో ఇప్పుడో దారి దొరికింది. '

'శుభం! ఎలాగూ జమిలి  ఎన్నికల గంట  ఏ క్షణంలోనైనా మోగవచ్చు.  ఈ మధ్యలోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల సహకార బ్యాంకుల నుంచి.. రాష్ట్ర స్థాయిలో పురపాలక సంఘాలు వంటి వాటికి పోటీలు తప్పవంటున్నాయి. ఎన్నిక ఏదయినా ఎన్నో చేతులు అవసరం. బూతుల్లోపల.. బైటా కూడా చేతులతోనే అవసరం. ఓటు యంత్రం మీటలు నొక్కాలి. ఓట్ల ప్రచారంలో రాళ్లేయాలి.  గుర్రాల మీద ఎక్కించి వూరేగడం ఓల్డ్ ఫ్యాషన్. నేరుగా కొని తెచ్చుకున్న  కార్యకర్తల భుజాల మీదెక్కి ఊరేగినప్పుడే బోలెడంత కిక్కు. మొన్నీ మధ్య అమెరికా ట్రంపొచ్చినప్పుడు కూడా కోట్లాది మంది జమకూడక పోయుంటే మన పరువు గంగలో కలసిపోయుండేది. '

'ముందు భూలోకంలోని ఈ బ్రోకర్లతో కనెక్షన్లు పెట్తుకోవయ్యా!ఒక్క నరకమేంటి  మరో నాలుగు రకాల నరకాలకు సరిపడా వనరులు వాళ్లే సమకూర్చి పెడతారు. '

'ధన్యవాదాలు నారద మహర్షీ!'

'నారాయణ! నారాయణ! అన్నట్లు ఆ కమ్యూనిస్టు నారాయణ పుసుక్కున ఏదో అని ప్లానంతా పాడు చేసే లోపలే కార్యరంగంలోకీ దూకు'

***

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...