వాక్' అంటే శబ్దం. దానికి 'మయట్
' అనే ప్రత్యయం కలిస్తే వాజ్ఞ్మయం. శబ్దకృతమయేదంతా
వాజ్ఞ్మయ కింద లెక్కకు రాదు.? రచన అంటే రాసిన అంశం
మాత్రమే అని మనకో అపోహ. అదీ సరికాదు. ఆంధ్ర సాహిత్య చరిత్ర ప్రస్తావనలో
మాన్యులు పింగళి లక్ష్మీకాంతం రచనను కూర్చిన అంశంగా చెప్పుకోవాలని సూచించారు.
మరి ఆ కూర్పు మామూలు పొడి పొడి శబ్దాలతో కూడా నిండి
ఉండకూడదని ఆయన అభిప్రాయపడతారు.
మహాభారతం
శాంతిపర్వంలో భీష్ముడు అంపశయ్య మీద
అచేతనంగా పడున్నప్పుడు విష్ణువుని స్తుతించే
'వృషాకపిస్తవం' లో భగవంతుణ్ణి 'వాజ్ఞ్మయాధ్వరార్చితుడు'ని చేసినందువల్ల తాను ధన్యమైనట్లుగా భావిస్తాడు. ('తపమునకు, విద్యకును, జనుస్థ్సానమైన/
జనన రహితుని యజ్ఞాత్ము శౌరి వాజ్మ/ యాధ్వరార్చితు జేసితి నా జనార్ద/ నుండు
మద్భాజనమున బ్రీతుండు గాత”) కవితిక్కన భావన ప్రకారం అర్థవంతమయిన శబ్దంతో నోటి మాట వెలువడినప్పుడే
అది 'వాజ్ఞ్మయం'
అవుతుందనుకోవాలి. నోటితో మాట్లాడే శబ్దం రాత రూప వాజ్ఞ్మయంగా
అన్వయించుకుంటే ఉభయత్రా
శ్రేష్టస్కరమా? అని సందేహం వచ్చినప్పుడు హల్లాం ( Hallam) అనే ఆంగ్ల
విమర్శకుడు 'అవును' అంటే, ఛార్లెస్ లాంబ్(Chaarles Lamb) అనే మరో పెద్దమనిషి
పద్యాలు మాత్రమే 'రచన' కేటగిరీ కిందకి
వస్తాయని వాదనకు దిగాడు. రెండూ విచిత్ర సిద్ధాంతాలే. చాకలి పద్దు కూడా వాజ్ఞ్మయం
కిందకే వస్తుందని ఒకరంటే.. చక్కని పద్యాలు మాత్రమే వాజ్ఞ్మయం కింద లెక్క' అని మరో కవి తిక్క ఆలోచన!
ఈ గోలంతా
ఎందుకని సమబుద్ధితో ఆలోచించే చేవగల విమర్శకులు దానా.. దీనా కొన్ని నిబంధనలు
ఏర్పాటు చేసి వాటిలో ఏ కొన్నైనా పాటించే సారస్వతం 'వాజ్ఞ్మయం' శాఖలోకి వచ్చినట్లేనని తీర్మానించారు. ఆ
నిబందనల్లో ప్రధానమైనవి రెండు. రచన విజ్ఞాన ప్రసాదిత లక్షణం కలిగి ఉండటం.. భావనాత్మకమైన సుఖానుభూతి(imaginative
pleasuure) అందించడం! అయితే వాజ్ఞ్మయ విభాగం కిందకొచ్చే అన్ని
రచనల్లోనూ ఆ రెండు లక్షణాలు ఉండాలని లేదు!
కొన్ని కేవలం
మనోవికాసమే లక్ష్యంగా సాగేవి; మరి కొన్ని భావనాప్రపంచంలో ఓలలాడేవిగా కూడా
ఉంటాయి కదా! ఈ పేచీకి పరిష్కారంగానే మన భారతీయ ఆలంకారిక శాస్త్రవేత్త రాజశేఖరుడు
మొదటి తరగతి వాజ్ఞ్మయాన్ని(తర్క, వ్యాకరణ, మీమాంసాది ) శాస్త్ర వాజ్ఞ్మయం అని, రెండో తరగగతి
వాజ్ఞ్మయాన్ని(రామాయణ భారత భాగవతాది మనో వికాసం తో పాటు భావనాత్మక ఆనందం
అందింఛేవి) కావ్య వాజ్ఞ్మయం అనీ విభజించాడు.
మరి మనోవికాసంతో నిమిత్తం లేని ఆధ్యాత్మిక
సంబంధమైన భజనలు, కీర్తలు, స్తోత్రాది
సాహిత్యం సంగతో? అంటే అదీ కావ్య సారస్వతం పరిధిలోకే
వస్తుందన్నది లక్షణ నిర్దేశకుల ఉద్దేశం. ఈ రెండో జాతి కావ్య వాజ్ఞ్మయం పాశ్చాత్య
లాక్షిణుకుల పరిభాషలో సాధారణ వాజ్ఞ్మయం (General Literature).
విస్తారంగా
అభివృద్ధి చెందే శాస్త్రవాజ్ఞ్మయం ఆయా ఆంశాలకు సంబంధించిన పేర్ల మీదనే వాజ్ఞ్మయంగా
ప్రసిద్ధమవడం రివాజు. తర్కం ప్రధానంగా సాగే రచనలు
తర్కశాస్త్ర వాజ్ఞ్మయం కింద చేరినట్లు!
కావ్య వాజ్ఞ్మయంలో కూడా ప్రక్రియ పరంగా వచ్చే
సాహిత్యం ఆ ప్రక్రియ పేరుతోనే కావ్యవాజ్ఞ్మయంగా గుర్తింపు పొందడం సబబు. సాహిత్య
చరిత్ర రచన కోసం పాశ్చాత్య లాక్షణికులు అనుసరించిన ఈ సులభ విధానమే భారతీయ కావ్య
సాహిత్య చరిత్రకూ అన్వయించుకోవడం ఉత్తమం అన్నది పింగళి లక్ష్మీకాంతంగారు
అభిప్రాయపడ్డారు.
ఆ పంథాలోనే ఆ
కవివిమర్శకుడు 'ఆంధ్ర సాహిత్య చరిత్ర' రచన అప్పటికి అందుబాటులో ఉన్న ఉపకరణాల సాయంతో వీలైనంత సమగ్రంగా సాకారం
చేయగలిగారు. ఆంధ్రజాతి వారికి సదా రుణపడి
ఉండటం అవసరం.
'ఏది కావ్యం? ఏది ఇతరం?' అన్న
సందిగ్ధం సాహిత్య రచన సాగుతున్నంత కాలం పింగళివారి మనసును పీకుతూనే ఉన్నట్లు
ప్రస్తావనలో వారే స్వయంగా వెలిబుచ్చిన అంశాల ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు.
కావ్యానికి ఉండదగ్గ అర్హతలుగా పాశ్చాత్య లాక్షిణుకులు పరిగణించిన మూడు అర్హతలు-
అనురంజన, లక్షణ సౌందర్యం, రసానందం-
ఆధారంగానే పింగళివారు కూడా తన సాహిత్య చరిత్ర
రచన సాగించినట్లు అర్థమవుతోంది.
విస్తృతితో నిమిత్తం లేకుండా ఈ మూడు లక్షణాల పరిపూర్ణత పైనే రచనకు కావ్యార్హత అనేది అంతిమ నిర్ణయం . సౌందర్య
భావనకు కించిత్ లోపమేర్పడినప్పటికీ
తతిమ్మా రెండు (అనురంజన, రసానందం) కావ్యానికి విధిగా ఉండవలసిన లక్షణాలని
తేల్చేశారు.
లక్షణ
సౌందర్యం ఎంత సమృద్ధిగా ఉన్నప్పటికీ
సర్వజన రంజన, రసానందానుభూతిలో లోపం
ఏర్పడినప్పుడు ఆ రాతకు కావ్యార్హత లోపించినట్లే!
పతంజలి
మహాభాష్యం, శ్రీ శంకరుల ఉపనిష్భాష్యం
ఉత్తమోత్తమ సంస్కృత సౌందర్యరచనలు. శబ్దపరంగా
అద్భుత రచనలు అయినప్పటికీ వ్యాకరణ శాస్త్రం లోతులు చూసినవారికి, వేదాంత పారావారం ఈదగలిగిన వారికి మాత్రమే అవగాహనకొచ్చే వాటిని కావ్య
విభాగం కిందకు తీసుకొనడం తగునా.. తగదా? అని ఓ ధర్మ మీమాంస! ఒకప్పుడు ఉనికిలో ఉండి తదనంతరం మరుగున పడి ఉన్న
అంశాలను వెలికి తీసి వెలుగులోకి తేగల ద్రష్ట మాత్రమే శాస్త్రకర్త . కావ్య స్రష్ట తరహాలో తనకై తానుగా
సృజించే సామర్థ్యం అతనికి ఉండదు. బ్రహ్మకావ్యం అందుకు ఉదాహరణ.
అంతకు ముందు
లేని వస్తువును సృష్టించిన రచన అది. కావ్యం జన్మస్థానం హృదయక్షేత్రం. ఒకే అంశం మీద
ఎవరికి వారు తమదైన వస్తువుగా చెప్పుకునే
రీతిలో సాగే అవకాశం కావ్యరచనకు కద్దు. ఒక
వస్తువు కేవలం ఒకనిది గానే లోకం గుర్తించగలిగే ఆత్మీయత (personality) కావ్యం ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఈ ఆత్మీయ
ముద్ర (subjective matter) లేని రచనలను పింగళివారు
అపౌరషేయాలు(objective matter) అని పిలుచుకున్నారు.
ఏతావాతా
తేలేదేమిటి? సర్వజన రంజకమైన శైలిలో
భావనాత్మక విధానంలో తనదైన ముద్రను ప్రస్ఫుటీకరిస్తూ సాగే రచన- కావ్యం. ఆ
కావ్యానికి సౌందర్యం పూవుకు తావి వంటిది. ఆ తరహా కావ్యాల కాలనుగత పరిస్థితులను
పరిశీలించే విధానమే కావ్య సాహిత్య చరిత్ర. కావ్య సాహిత్య చరిత్రలో అటు
కావ్యలక్షణాలు, ప్రస్తావనలు, కాలానుగతంగా
అవి ప్రభావితమవుతూ వచ్చిన టైమ్ - లైన్ రెండూ ఉంటాయని గ్రహించడం అవసరం.
చరిత్ర
అంటేనే ఒక అంశానికి సంబంధించిన జాతి దేశ కాల పుట్టు పూర్వోత్తరాల వికాస క్షయ క్రమ
పరిణామాల దశలపైన సహేతుక, ఉదాహరోచిత వ్యాఖ్య. పౌరుషేయ(subjective matter) అంశం అయిన వాజ్ఞ్మయం తాలూకు
పుట్టుక ఉత్పత్తి వికాస దశలను పై నిర్వచనంలో ఇమిడే విధంగా పరిశీలించే పౌరుషేయ రచన(object
matter) వాజ్ఞ్మయ చరిత్ర.
అది రాయబూనుకోవడం రెండు
తాళ్ల పైన ఒకేసారి నడిచే ప్రయాస లాంటిది. పరిపూర్ణమైన సహాయం, సంపత్తులు కలిగి
వాజ్ఞ్మయ చరిత్ర రాయగలిగితే అది ఆ దేశచరిత్రకు మించి విస్ఫుటంగా జాతి ఆత్మను
పట్టిచూపిస్తుందంటారు పింగళివారు.
కాదనలేని మాట. ఒక
జాతి ఆత్మను ప్రతిబింబించే విషయంలో దేశచరిత్రలకు మించి వాజ్ఞ్మయ చరిత్రలే ఎక్కువ మేలుచేస్తాయి.
దేశచరిత్రల పెనుగులాట ఎంతసేపటికి బాహ్య భావనల వరకే పరిమితమవడమే అందుకు కారణం.
కర్త లేనిదే
గ్రంథం ఉండదు. గ్రంథానికి కర్త జీవితంతో సంబంధం ఎటూ తప్పదు. అట్లాగని కవి
జీవితచరిత్రను మాత్రమే రాసుకు పోతే అది వాజ్ఞ్మయ చరిత్ర అనిపించుకోదు.
వాజ్ఞ్మయ
చరిత్రలో కవిచరిత్ర ఒక అంతర్భాగం మాత్రమే! ఒకానొక గ్రంథం ఆ విధంగా రూపొందడానికి
కారణం కవి జీవితంలోని ఏ సంఘటన కారణం అయివుంటుందని తర్కించడం వరకే వాజ్ఞ్మయ
చరిత్రకు కవిచరిత్ర ప్రయోజనం పరిమితం.
కర్త కాలం
నాటి సాంఘిక, రాజకీయ, సామాజికాది
పరిస్థితులు కవి ద్వారా కవి రచన మీద ఏ విధంగా ప్రభావం చూపించాయో పరిశీలించడం
వాజ్ఞ్మయ చరిత్ర రచనలో ఒక భాగంగా ఉంటుంది.
కాల
ప్రభావానికి కొట్టుకుపోతూ రచనలు చేసే కవులే ఎక్కువగా ఉండడం సహజం. కొందరు అత్యంత
ప్రతిభాశాలులైన కవులు కాలగతిపై తమ ప్రభావం చూపించినవారూ కద్దు. కవి జీవిత కాలాదుల
ఏకరువుకు మాత్రమే పరిమైనా ఆ వాజ్ఞ్మయ చరిత్ర నిజమైన వాజ్ఞ్మయ చరిత్ర కాలేదు. కవి
జీవితంలోని ఏయే సంఘటనలు ఏ మేరకు చరిత్ర గమనం పైన ప్రభావం చూపించాయో సోదాహరణగా ఉటంకిస్తూ పరిశీలన చేసేదే అసలు సిసలు వాజ్ఞ్మయ
చరిత్ర అవుతుంది.
ప్రతిభాహీనులైన
కవుల విషయంలో ఇంత పరిశ్రమ చేయటమంటే సమయం వృథా చేయడమే. పతిభావంతులైన కర్తల విషయంలో
ఈ దిశగా అప్రమత్తత కొరబడ్డా అది వాజ్ఞయ చరిత్రకు చేసే అన్యాయమే అవుతుంది. వాజ్ఞయ
చరిత్ర నిర్దుష్టతకు కర్తలో అందుకే కేవలం
ఒక పరిశోధకుడు మాత్రమే ఉంటే సరిపోదు.
తోడుగా విమర్శకుడి మేధోమధనమూ తప్పనిసరి!
వాజ్ఞ్మయ చరిత్ర
రాతకు పూనిక వహించిన విమర్శకుడిలో ఉండవలసిన మరో ముఖ్యమైన బుద్ధి వైశిష్ట్యం
రాగద్వేషాలకు అతీతమైన స్వతంత్ర పరిశీలనా శక్తి.
పిండితార్థం ఏమిటంటే చక్కని వచన రూప వాజ్ఞ్మయ చరిత్ర సాకారానికి కర్తలో ఉండవలసిన ప్రధాన లక్షణాలుః పాండిత్యం, పరిశీలన, సమబుద్ధి,
నిశిత దృష్టి, వ్యాఖ్యాన నిపుణత. కావ్యేతర
రచనల ప్రస్తావనా అవసర పడితే తప్పదన్న వాస్తవం వాజ్ఞ్మయ చరిత్ర రచయిత మనసుకు
పట్టించుకోవలసిన ముఖ్య సూత్రం. న్యాయ
నిర్ణయం కోసం న్యాయాధికారి తన ఇష్టాయిష్తాలతో నిమిత్తం లేకుండా అవసరమనిపించే ఏ సాక్షినైనా
బోనులోకి అనుమతించక తప్పదు. వాజ్ఞ్మయ చర్రిత్ర కర్తదీ అదే అవస్త.
ఒక
ప్రతిపాదిత సిద్ధాంతం నిరూపించడానికో, ఖండించడానికో అవసర్రమైనప్పుడు కావ్యేతర
గ్రంధాన్నైనా, కావ్య లక్షణం ఒక్కటైనా బొత్తిగా కరువైన
పొత్తాన్నైనా ఉటంకించక తప్పనప్పుడు ఆ పనికి సిద్ధపడాలి. తమషా ఏమిటంటే వాజ్ఞ్మయ చరిత్ర
రచనకు పూనుకొనే రచయిత సార్వజనీన సిద్ధాంతానికి మనస్ఫూర్తిగా బద్ధుడై, స్వయంగా ఏ
ప్రతిభావంతుడైన కవికూడానో అయివుంటే అతగాడి
వాజ్ఞ్మయ చరిత్ర కేవలం దేశ చరిత్రల జాబితాలోనే కాకుండా, స్వయంగా
వాజ్ఞ్మయ విభాగంలో కూడా సమున్నత్తమైన స్థానం పొందగలుగుతుంది. సంస్కృతంలోని విక్రమాంకదేవ చరిత్రము, హర్ష చరిత్రము ఆ కోవకు చెందినవే!
తెలుగులో అయితే కృష్ణదేవరాయ విజయము, రంగరాయ విజయము,
పలనాటి వీరచరిత్ర, కాటకరాజు కథ ఈ కోవకు చెందేవి.
చరిత్ర
వాస్తవానికి కేవలం యథార్థ సంఘటనల సారం. చారిత్రక ఇతివృత్తాంతాన్ని కథావస్తువుగా
తీసుకున్నప్పటికీ రసానందానుభూతి కోసం గాను కొన్ని
సందర్భాలలో కావ్య సంప్రద్రాయాలకు లోబడి కల్పనలకు పాల్పడే పద్ధతి
కద్దు. విశిష్ట శైలితో మాత్రమే రచనకు దేశచరిత్ర్ర హోదా దక్కదు.
చారిత్రక రచనలుగా ప్రసిద్ధిపొందిన
కావ్యాలను గమనిస్తే అయా రచనలలో కనిపించేది ఏక మొత్తంగా చరిత్ర మొత్తం కాదు. రచయిత
తనకు నచ్చిన ఏదో ఒక సంఘటన ఆధారంగా అల్లిన కావ్యకల్పన. సత్య కథనానికి భంగం కలిగిస్తున్నాయి కాబట్టి
అట్టి వాటికి చరిత్ర విభాగం కింద ప్రవేశం ఉండదు.
అయితేనేం, సారస్వత ప్రియులు ఆ రచనలను
తమవిగా భావించి వాజ్ఞ్మయ కులంలో స్థానం కల్పిస్తారు. వాజ్ఞ్మయ చరిత్రకు పూనకున్న
పండితులు చరిత్రకు, కాల్పనిక చరిత్రకు మధ్యన ఉండే పల్చటి
పొరను గమనించకపోతే రాసే వాజ్ఞయ చరిత్రకు లోపం కలిగిస్తున్నట్లే!
-కర్లపాలెం
హనుమంతరావు
14 -03 -2021
***
No comments:
Post a Comment