హితాభిలాషి -
-కర్లపాలెం
హనుమంతరావు
అన్నిటితో
పాటు పెళ్లిచూపుల పద్ధతుల్లోనూ మార్పులొచ్చాయిప్పుడు. గతంలో ఇంట్లో ఎదిగిన ఓ
కూతురుందంటే ఆమెనో అయ్య చేతిలో పెట్టిందాకా కన్నవారి కంటి మీద కునుకుండేది కాదు.
సంబంధాల కోసం తెలిసినవాళ్లనే కాదు, తెలీనివాళ్లనూ విచారించడం.. అదో రివాజు.
పెళ్లిళ్ల పేరయ్యదే ప్ర్రధాన మధ్యవర్తిత్వం అప్పట్లో. సలీసైన కుర్రాడు ఉన్నాడని
తెలిస్తే చాలు.. పిల్ల తరుఫువాళ్లే
పూనుకుని వెళ్లి 'ఒకసారి వచ్చి మా పిల్లను చూడమ'ని మొహమాట పెట్టడం.. వాళ్లొచ్చి చూసి అన్నీ అమిరితే ఇహ బాజాబంత్రీలు మోగడం
విధాయకంగా ఉండేదా కాలం. పిల్ల నచ్చడం లాంటి ఒక్క విషయంలోనే వరుడికి స్వేచ్ఛ.
వధువుకైతే ఆ వెసులుబాటూ అరుదే. కట్నకానుకలూ, పెట్టుపోతల్లాంటి
తతంగాలన్నీ పెద్దవాళ్ల ఫీల్డు. మరీ ముఖ్యంగా
మొగవాళ్లది.
సుందరమ్మ
పాతకాలం మనిషి. కూతురు సరోజను కూడా ఆ పద్ధతుల్లోనే పెంచింది. ఆ అమ్మాయి పెళ్లి
విషయం కూడా పాతకాలం పద్ధతిలోనే సంబంధాలు మధ్యవర్తుల ద్వారా విచారించడంతో అరంభమయింది.
సరోజ తండ్రి
గోపాలరావు మెడికల్ డిపార్ట్ మెంటులో డ్రగ్స్ ఇన్స్పెక్టర్. సరోజ పదో తరగతి
పరీక్షలు రాసే రోజుల్లో హార్టెటాక్ వచ్చి పోయారు. మగదిక్కులేని సుందరమ్మగారు
తోడబుట్టినవాడి పంచన చేరింది.
జిల్లా
హైస్కూల్లో హెడ్ మాస్టర్ గా చేసిన అచ్యుతరామయ్యగారు కొడుకు సత్యమూర్తితో సమంగా
మేనకోడలు సరోజనూ చదివించారు. మూర్తి సరోజ కన్నా ఏడాది చిన్న. చదువుల్లో మెరిక.
అమెరికా వెళ్లి చదువుకోవాలని తంటాలు పడుతున్నాడు. ఆ పిల్లాడూ వదిన కోసం వకటి రెండు
సంబంధాలు మంచివే సూచించాడు. కానీ, ఒక్కగానొక్క
కూతుర్ని అంతంత దూరభారాలు పంపించడం సుందరమ్మగారికే ఇష్టంలేకపోయింది. పడనీయలేదు.
కష్టానికి, నష్టానికి సాయమంటే వంటిగా వెళ్లేందుకు తనకు
వీలుండదని ఆ పాతకాలం మనిషి ఆలోచన. 'ఇక్కడివే మంచివి.. ఏవన్నా
ఉంటే చూడన్నయ్యా!' అంటూ తోడబుట్టినవాడినే ఒహటే శతపోరుతున్నదామె.
అచ్యుతరామయ్యగారో
తాపీ మనిషి. ఏ విషయమూ ఓ పట్టాన చెవికెక్కదు. పెళ్లాం కూడా ఆడపడుచు తరుఫున వకాల్తా
పుచ్చుకునేసరికి ఇహ తప్పక ఒక సంబంధం పట్టుకొచ్చారు.
అబ్బాయి
బెంగుళూరులోనే ఏదో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్. ఐదంకెల జీతగాడు. పద్ధతైన
కుటుంబం. 'మనకు సరితూగేవాళ్లే! ఓ సారొచ్చి
పిల్లను చూసుకోమని చెపొచ్చాను' అన్నారు ఒక పూట హఠాత్తుగా
వచ్చి.
పెళ్ళిచూపులయ్యాయి.
సరోజ కంటికి
నదురుగా ఉంటుంది. చదివింది బి.టెక్కే అయినా ఈ కాలం పిల్లల్తో పోలిస్తే టెక్కు
తక్కువ కిందే లెక్క. మగపెళ్లివాళ్లకు నచ్చింది. విధాయకంగా 'ఏ సంగతీ ఒకటి రెండు రోజుల్లో చెబుతామ'ని చెప్పి వెళ్లారే కానీ, మిగతా విషయాల కూడా జతపడితే
దాదాపు సంబంధం ఖాయపడ్డట్లే అనుకుంటున్నారిక్కడ! 'వాళ్ళు నోరు
తెరిచి ఇంత అని అడక్కపోయినా ఎంతో కొంత ఇద్దామన్నయ్యా! నాకు మాత్రం ఇది కాక
ఇంకెవరున్నారూ!' అంది సుందరమ్మగారు అన్నగారితో.
రెండు రోజులు
కాదు.. వారం దాటినా బెంగుళూరు నుంచి ఏ కబురూ కాకరకాయా లేదు! 'ఏవఁయింద'ని విచారిస్తే
మా పిల్లాడికి వేరే సంబంధం చూసుకున్నామ'నేశారుట! 'ముందు నచ్చిందన్నవాళ్లు తరువాత ఎందుకు వెనక్కి వెళ్లారో కనుక్కుందామని ఎంత
విచారించినా లాభంలేకపోయింది.' అని తెగ వగచారు
అచ్యుతరామయ్యగారు.
అట్లాగే
మంచివి అనుకున్న సంబంధాలు ఇంకో రెండు.. మూడు చివరిదాకా వచ్చి చెదిరిపోయేసరికి
సుందరమ్మగారు డీలాపడిపోయారు.
'ఈ కాలప్పిల్లల్ని గురించి ఏమీ చెప్పలేము వదినా! ముందు మన పిల్ల వైపు నుంచి మతలేబైనా ఉందేమో .. కనుక్కోండి!' అని హెచ్చరించింది ఆడపడుచు సుందరమ్మగారిని.
'నాన్న మీదొట్టు! నేనలాంటి దాన్ని కాద'ని ఏడ్చింది
సరోజ. పిల్ల జాతకం చూపించింది శాస్త్రులుగారికి. 'కుజ
దోషమున్నా పరిహారమైపోయిందే! అమ్మాయి చేత ఈ కార్తీక మాసమంతా పగటిపూట ఉపవాసముంచి..
సాయంకాలానికి అమ్మవారి అర్చన చేయిస్తుండండి! కొదమ దోషమేమన్న మిగిలుంటే ప్రక్షాళన
అయిపోతుంది' అని సలహా ఇచ్చారు శాస్త్రులుగారు. సరోజ నియమనిష్టలతో శ్రద్ధగా పూర్తిచేసిందా దీక్ష.
ఆ తరువాతి నెలరోజులకు అనుకోకుండా గుండ్లపల్లివారి సంబంధం వచ్చింది.
ఖాయమైంది. అబ్బాయి చెన్నై ఫిలిప్స్ కంపెనీలో ఇంజనీరు . సరోజకు చీటికి మాటికి ఫోన్
చేసి 'స్వీట్ నథింగ్స్' చెబుతున్నాడు!
ఇదంతా కొత్తగా థ్రిల్లింగ్ గా ఉన్నా కొద్దిగా బెరుగ్గా కూడా ఉంది సరోజకు.
సుందరమ్మగారికీ తెలుసు.. కానీ, ఏమంటే ఏమయిపోతుందో.. అని
సర్దుకుపోతోందీ సారి.
పెళ్లి ఇంకో
వారం రోజులుందనంగా బట్టల కోసం చీరాల వెళ్లి వచ్చారు ఆడంగులంతా. ఇంటికొచ్చేవేళకు
చీకటి పడింది. వసారాలో అచ్యుతరామయ్యగారు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ
తిరుగుతున్నారు. ఆయన ధోరణి చూసి ఏదో అయిందనుకుంది సుందరమ్మగారు. 'వినకూడదనిది ఏదన్నా వినాల్సి వస్తుంద'ని భయపడుతూనే అడిగింది 'ఏంటన్నయ్యా!.. ఏమయినా అయిందా?'
అచ్యుతరామయ్యగారు
నిశ్శబ్దంగా ఓ కవరందించారు. సుందరమ్మ వణికే చేతుల్తో అందుకుని తెరిచి చూసింది. అది
పెళ్లికొడుకు తండ్రి రాసిన ఉత్తరం.'గోపాలరావుగారు సర్వీసులో ఉండగా మాకు చాలా సాయంచేశారు. ఆయన చలవ వల్లే
మేమివాళ ఒంగోలులో మూడు పెద్ద మెడికల్ షాపులు నడుపుతున్నాం. ఆ విశ్వాసంతోనే వారి
అమ్మాయిని కోడలుగా తెచ్చుకుందామని ఉబలాటపడ్డాం. కానీ.. పెళ్లి కాక ముందే
అనుభవమున్న అమ్మాయి అంటే కుదరదు. ఇంతకు మించి చెప్పలేము. దీనికి జత చేసిన హితాభిలాషి ఉత్తరం చదివితే అన్ని విషయాలు మీకే బోధపడతాయి.' అని ఉంది. ఓ 'హితాభిలాషి ' తన ఉత్తరంలో సరోజను గురించి ఏవేవో
చడామడా రాశాడు!
'ఇంత దూరం వచ్చింతరువాత ఇట్లా అయిపోతే పిల్లదాని బతుకేమయిపోవాలం' టూ సుందరమ్మగారు కుప్పకూలిపోయారు. సరోజే గుండె దిటవు చేసుకుని తల్లిని
సముదాయించాల్సొచ్చింది చివరకు.. లోలోన ఆమె
మనసూ రగిలిపోతున్నప్పటికీ.
హితోభిలాషి
రాసిన 'చెత్త'ను
ఒకటికి రెండు సార్లు శ్రద్ధగా చదువుకుంది సరోజ. ముందు ఆ ఛండాలాన్ని చించి
పోగులుపెడదామనుకుంది. కానీ, ఒక్క క్షణం ఆలోచించి.. భద్రంగా
దాచేసింది.. తల్లికి తెలీకుండా.
మనస్సును
మళ్లించుకోడానికి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇ.సి.ఐ.ఎల్
లో సైంటిఫిక్ అసిస్టెంట్ గా ఆఫర్
వచ్చేసరికి తల్లిని తీసుకుని హైదరాబాద్
వచ్చేసింది సరోజ. ఏ.ఎస్. రావ్ నగర్ లో తల్లితో పాటు సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ లో
ఉంటూ బెటర్ ఆపర్చ్యూనిటీస్ కోసమై ప్రయత్నం చేస్తోందిప్పుడు.
సంబంధం
బెడిసి కొట్టినప్పుడల్లా 'ఇంకా టైము రాలేదు. అందుకే
ముడిపడ్డంలేదు' అనే వైరాగ్యం వంటబట్టించుకోడం నేర్చుకుంది
సుందరమ్మగారు.
ఆ డిసెంబర్
లో అమెరికా నుంచి మూర్తి వచ్చాడు. తల్లికి ఏడాదిగా కిడ్నీ ప్రాబ్లమ్. ఫిట్స్
వస్తున్నాయ్ కొత్తగా! 'ఎందుకొస్తున్నాయో అంతుబట్టడం లేదు.
డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. నువ్వొక్కసారి వచ్చి చూసిపోరా! అప్పుడన్నా
తల్లి మనసు కుదుటపడుతుందేమో!' అని తండ్రి పోరగా పోరగా
ఇప్పుడు తీరిక చేసుకుని దిగబడ్డాడు మూర్తి. వచ్చిన మొదటి మూడు వారాలు తల్లితోనే
సరిపోయింది తెనాలిలో. ఇది చివరి వారం. అత్తను, సరోజను కూడా
చూసి ఇటు నుంచి ఇటే విమానం ఎక్కేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు హైదరాబాదులో
దిగబడ్డాడు.
సరోజా, మూర్తీ చిన్నప్పట్నుంచి వదినా మరుదులుగా
కన్నా స్నేహితుల్లా సన్నిహితంగా తిరిగారు. మంచి స్నెహితుల్లా ఒకళ్ల కష్టసుఖాలు
మరొకళ్లతో నిస్సంకోచంగా పంచుకునే అలవాటు. వయసులో పెద్దదైనా చాలా విషయాలల్లో సరోజ
మూర్తి గైడెన్స్ ఇష్టపడేది. మూర్తి
అమెరికా వెళ్లిన కొత్తల్లో సరోజతో రెగ్యులర్గా కాంటాక్టులో ఉన్నా.. తన పని
వత్తిళ్ల మూలకంగా ఈ మధ్య ఎవరితోనూ సరిగ్గా టచ్ లోకి రావడంలేదు.
ఇట్లా
సంబంధాలు వచ్చి వృథాగా పోతున్నాయని తెలుసు కానీ, అంత దూరంలో ఉండి తాను చేయగలిగిందీ ఏమీ లేదనే ఉద్దేశంతో.. సరోజను ఆ విషయమై
పెద్దగా కదిపేవాడు కాదు. తన మనసును అనవసరంగా కష్టపెట్టడమెందుకన్న ఉద్దేశం కూడా
కావచ్చు.
ఇక్కడి
కొచ్చిన తరువాతే తెలిసింది ఈ హితోభిలాషి లేఖాస్త్రాలు చేస్తోన్న విధ్వంసం గురించి.
'నా కన్నా ఒక ఏడాది వెనక
పుట్టుంటే నీ కీ బాధలు తప్పుండేవి కదే!' అన్నాడు సరోజతో
జోకుగా!
'నీకు చిన్నప్పట్నుంచీ యుగంధర్ పరిశోధనలంటే పిచ్చి కదరా! నీ బుల్లి
బుర్రకేమన్నా కనీసం ఓ చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో చూడు!' అంటూ తల్లి క్కూడా తెలీకుండా దాచిన హితాభిలాషి ఉత్తరాన్ని మూర్తికి
చూపించింది సరోజ.
ఆ ఉత్తరాన్ని
ఆసాంతం చదివి తిరిగిచ్చేశాడు మూర్తి.. పెదవి విరుస్తూ!
ఆ రోజు
రాత్రి భోజనాల దగ్గర మూర్తి సుందరమ్మగారితో 'అత్తా! అడక్కూడదో.. లేదో తెలీదు కానీ.. అర్జంటుగా ఓ ఐదు లక్షలు సర్దుతావా?
ఆఫీసు బిజినెస్ పన్లకు అవసరపడింది. అమ్మ వైద్యం ఖర్చులకు నా దగ్గరున్నదంతా చెల్లుపోయింది. లేకపోతే అడక్కపోదును. సరోజ పెళ్లికి దాచిన సొమ్ముంటుందిగా! దాని
పెళ్లి ఫిక్సైతే వెంటనే ఎట్లాగో సర్దేస్తాలే! బ్యాంకు వడ్డీ కన్నా ఒక శాతం ఎక్కువే
తీసుకో!' అన్నాడు.
'అయ్యో రాత! వడ్డీదేముందిలే కాని.. అట్లాగే తీసుకో! మీ కన్నా కావాల్సిన
వాళ్లెవరున్నార్రా నాకు! మీ మామయ్య పోయినప్పుడు వచ్చిందంతా మీ నాయన దగ్గరే
పెట్టాను. ఇహ సరోజ పెళ్లంటావా! అది ముడిపడినప్పుడు చూద్దాంలే' అందా సుందరమ్మగారు నిర్వేదనగా.
'సమస్యేముందిక! నాన్ననే అడుగుతాలే!' అన్నాడు మూర్తి.
ఎయిర్ పోర్ట్
లో సెండాఫ్ ఇవ్వడానికని వచ్చిన సరోజతో 'ఈ మాఘమాసంలో తమరి పెళ్లి ఖాయం. తయారయిపోండి రాకుమారిగారూ! నాదీ హామీ!
పెళ్లికొడుక్కూడా తమరి కలల రాకుమారుడే' అని ఆటపట్టించాడు
మూర్తి.
మూర్తి
అమెరికా వెళ్లిన పది రోజులకు చెన్నై నుంచి ఫిలిప్స్ కంపెనీ శ్రీధర్ సరోజకు కాల్
చేశాడు. సుందరమ్మగారికి ఏం చెయ్యాలో తోచక తెనాలిలో ఉన్న అన్నగారికి ఉప్పందించింది.
ఆయనా ఏ కళనున్నాడో ఏమో.. ఈసారి వెంటనే ఒంగోలు వెళ్లి గుండ్లపల్లివారి సంబంధమే ఖాయం
చేసుకొని వచ్చి శుభవార్త చెల్లెలికి చేరవేశాడు.
'హితోభిలాషి ఉత్తరాలు పట్టుకుని
మంచి సంబంధం వదులుకున్నందుకు వాళ్లబ్బాయీ
బాగా అలిగాడుట. పెద్దమనసు చేసుకుని గోపాలరావుగారి పిల్లను మా కిచ్చెయ్యండి!'
అంటూ పెళ్లికొడుకు తండ్రే
గడ్డాలు పట్టుకున్నంత పనిచేశాడు' అని అన్నగారు
చెబుతుంటే సుందరమ్మగారు నోరు వెళ్లబెట్టేశారు,
మొత్తానికి
అంతా ఓ కలలోలా జరిగిపోయింది. మూర్తి ఆటపట్టించినట్లు సరోజ పెళ్లి ఆ మాఘమాసంలోనే
ఘనంగా జరిగింది. సుందరమ్మ గుండె బరువు దిగింది. సరోజ చెన్నయ్ కాపురానికి
వెళ్లిపోయింది.
***
ఆ రోజు
ఆదివారం. ఉదయం ఎనిమిది అవుతున్నా శ్రీధర్ పక్క దిగే మూడ్ లో లేడు. సరోజ సెల్ అదే
పనిగా రింగవుతుంటే. శ్రీధరే విసుక్కుంటూ అందుకున్నాడు.
మూర్తి నుంచి
కాల్.
'సరోజ లేదా?'
'బాత్ రూంలో..'
ఓకే! మరి
మీరేం చేస్తున్నారూ?' ఆరాగా అడిగాడు మూర్తి.
'చెప్పాలా?'
'వద్దులే కానీ, మీరూ, మా సరోజా కలసి
నాకింత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు బ్రదర్. అందుకే కాల్ చేస్తోందిప్పుడు' అన్నాడు మూర్తి.
మూర్తి
గొంతులంఇ ఆకతాయితనం పసిగట్టకపోలేదు శ్రీధర్.
'మేమేం చేశాం బ్రో?'
'రాత్రి నాకో పీడకల వచ్చింది బ్రదర్! మీకో పాప పుట్టిందట! మా డాళింగుకి 'ప్రహ్లాదో' 'పంచకల్యాణో'
ఏదో పేరు తగిలించేసారుట! ఇదన్యాయం కాదా మిలార్డ్?'
'ఇందులో అన్యాయం ఏముందిరా?' అయోమయంగా అడిగింది సరోజ భర్త చేతిలోని ఫోన్ రిసీవర్ బలవంతంగా
గుంజుకుంటూ. తను అప్పుడే స్నానాల గది నుంచి బైటి కొచ్చి ఉంది.
'కృతఘ్నురాలా! మీ ఇద్దరినీ మళ్లీ కలిపింది ఈ గ్రేట్ సత్యమూర్తి కాదా?
ఆడైనా, మగైనా ఈ మహాత్ముడి పేరు మాత్రమే పెట్టుకోవాలి మీ బిడ్డకు. లేకపోతే..'
'ఏం చేస్తావో చేసుకో!యంగ్ కపుల్నిలా మాటి మాటికీ డిస్టర్బ్ చేసి ఎమోషనల్గా
బ్లాక్ మెయిల్ చేసెయ్యడవూఁ ..గుడ్ మేనర్స్ కాదని మహాత్మా మూర్తీ ముందు నువ్వు
తెలుసుకో' అంటూ ఫోన్ కట్టేసింది పకపకానవ్వుతూ సరోజ.
అప్పుడే
స్నానం చేసి లావెండర్ సోపులో సువాసనలు
విరజిమ్మే సరోజను చూసి మోహంగా మీదకు లాక్కున్నాడు శ్రీధర్. సరోజ
విడిపించుకుంటున్నట్లు నటిస్తుంటే మళ్లీ మూర్తి
ఫోన్.. రింగింగ్!
'మీ ఇద్దరికీ లైన్ కలిపింది నేనూ! నాకే లైన్ కట్ చేస్తార్రా? నా డిమాండ్ సంగతేంటో తక్షణమే తేలాలి ముందు!'
'సిగ్గూ శరం లేదట్రా మూర్తీ! కొత్త జంటనిలా విసిగిస్తావా పద్దాకా బద్మాష్?'
అంటూ ఫోన్ కట్ చేసి భర్త ఒడిలోకి ఒరిగిపోయింది సరోజ!
మళ్లీ సెల్
రింగింగ్! శ్రీధరే అందుకుని నవ్వుతూ అన్నాడీ సారి 'ఒకే బ్రో! యువర్ రిక్వెస్ట్ విల్ బి కన్సిడర్డ్ సూన్! కానీ అంతకు ముందు
మీరు మా పని మమ్మల్ని చేసుకోనివ్వాలి గదా!'
'దట్స్ ఎ నైస్ డీల్! నౌ గో ఏ హెడ్!
బెస్టాఫ్ లక్ టు బోతాఫ్ యూ!' అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల
నుంచి మూర్తి.
'మా మూర్తి మీకు ముందే తెలుసా?' ఆశ్చర్యపోయింది సరోజ
మూర్తితో చనువుగా మాట్లాడిన తీరు చూసి.
తెలుసన్నట్లు
తలాడించాడు శ్రీధర్ నవ్వుతూ.
'ఎలా? నేను పరిచయం కూడా చేయలేదే! మన పెళ్లిక్కూడా
రాలేదు వాడు.. రాలేక'
శ్రీదర్ కూల్
గా జవాబిచ్చాడు 'బ్రేకయిన మన సంబంధాన్ని మళ్లీ పాజిబుల్ చేసిన పుణ్యమూర్తి
మీ మూర్తే సరూ!'
'ఓహో! మీకలా బిల్డప్పిచ్చాడా మా మహానుభావుడు! మొదట్నుంచీ మా మామయ్యేనండీ
మాకు అండా దండా! ఆయన పూనుకోకపోయుంటే అసలు
మీరంటూ ఒకరున్నట్లు మాకు తెలిసే అవకాశమే లేదు'
'అయితే నీ దాకా అన్ని విషయాలు పూర్తిగా రాలేదన్న మాట!' చిద్విలాసంగా అంటున్న భర్త వంక
ఆబ్బురంగా చూసింది సరోజ.
'మీ డాడీ సర్వీసులో ఉన్నంతకాలం సంపాదించింది ఏసిబివాళ్లకు జడిసి మీ మామయ్య
పేరున బ్యాంక్ ఎకౌంట్లలో దాచాట్ట కదా! మీ మామయ్య ఆ సొమ్మంతా ఈ మూర్తి అమెరికా
చదువుల కోసం ధారపోసేశాట్ట.. మూర్తి ప్రయోజకుడయితే తీర్చేసుకుంటాడు లెమ్మని!
మూర్తింకా పూర్తిగా సొంత కాళ్ల మీద
నిలబడనే లేదు.. మీ అత్తయ్యకు కొత్తగా
కిడ్నీస్ ఫెయిల్యూర్ సమస్య తగులుకోడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది! అడపా దడపా
కొడుకు పంపే సొమ్ము భార్య వైద్యానికే
సరిపోతుండటంతో పాపం, పెద్దాయనకు ఏం చెయ్యాలో దిక్కు తోచిందికాదు. ఆర్థికంగా సర్దుబాట్లు చేయలేక.. అట్లాగని
పరువుగా గడిపిన భేషజం వదులుకోలేక కొత్తగా ఓ
'హితోభిలాషి' అవతారం ఎత్తేశారు
పాపం. చెల్లెలి వత్తిడి మీద సంబంధాలు
తేవడం, మళ్లా తానే
వాటిని ఏ హితాభిలాషి లేఖతోనో చెడగొట్టేయడం! మాకు వచ్చిన హితాభిలాషి ఉత్తరం అట్లాంటిదే! ఈ రహస్యం
కనిపెట్టిందీ మీ మూర్తే! నేరుగా నాకు ఎక్స్ ప్లయిన్ చేసేందుకు ఫోన్
చేసినప్పట్నుంచే మేమిద్దరం ఫ్రెండ్సమయింది. 'మా సరోజ చాలా
మంచి మొద్దు పిల్ల, చెత్త ఉత్తరాలు నమ్మి ఆ ఉత్తమురాలికి
అన్యాయం చేయద్దు బ్రదర్! నిదానం మీద నేనే మీ
కట్నకానుకల మేటర్సన్నీ సెటిల్ చేసిపెడతా.. దయచేసి మి పేరెంట్స్ ను కన్విన్స్
చేయండి బ్రదర్! మా నాన్నని కాదు గానీ, నీతి మార్గమే ఆయనకు పరమ ప్రమాణం. ఆయన శిక్షణలో
పెరిగిన వాడిగా నేనీ విషయం గట్టిగా నమ్ముతున్నానిప్పటికీ! ఈ హితాభిలాషి మేటర్
బైటపడితే అయన తట్టుకోలేరు. మీరే మీ పెద్దాళ్లను ఎలాగైనా ఒప్పించాలి పెళ్లికి!'
అంటు రోజుకో రకంగా ఫొనులో ఇదిగో.. ఇట్లాగే..' బిగ్గరగా నవ్వేశాడు శ్రీధర్.
'అందుకా మీరీ సంబందానికి మొగ్గు
చూపింది! మనస్ఫూర్తిగా నన్ను చేసు..'
'పిచ్చిగా మాట్లాడొద్దు! నువ్వంటే ఎంత పిచ్చి లేకపోతే రోజూ పరగడుపు
నుంచే ఫోనులో స్వీట్ నథింగ్సుతో నీ
ప్రాణంతీస్తాను చెప్పు.. మొద్దూ! పెళ్ళికి ముందు
మీ మామయ్యకు మూర్తి అందించిన సొమ్మంతా ఎవరిదనుకుంటున్నావ్! నాదే! ఇదంతా
అప్పుడే తెలిస్తే నీకు, మీ అమ్మక్కూడా మీ మామయ్య మీదున్న గుడ్ ఇంప్రెషన్ గాలిక్కొట్టుకుపోదా! మూర్తికి, ఆ మాట కొస్తే
నా క్కూడా బొత్తిగా అదిష్టం లేదు సరూ!
దొంగ ఉత్తరాలతో నమ్ముకున్న మంచివాళ్లకు అట్లా ద్రోహం తలపెట్టడడం.. అఫ్ కోర్స్..
నాట్ ఏ గుడ్ గెస్చర్ అనుకో! దట్ టూ మీ మామయ్యలాంటి జంటిల్మెన్ విషయంలో! కానీ, ధర్మరాజంతటి పెద్దమనిషే అవసరార్థం అదేదో యుద్ధంలో బొంకాడని
మన భారతంలోనే ఉంది కదా!' అన్నాడు శ్రీధర్.
మూర్తి
హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మను అంత డబ్బు అప్పుగా అడిగింది నిజంగా అవసరముండి
కాదన్న మాట. నాన్న డబ్బు అమ్మ మామయ్య దగ్గర దాచించదన్న నిజం నిర్ధారణ చేసుకోడం
కోసమని ఇప్పుడు అర్థమవుతుంది' అనుకుంది సరోజ.
'ఆ హితాభిలాషి చెత్త మీ నాన్నే
రాసినట్లు నువ్వెట్లా పసిగట్టావురా
మై డియర్ యంగ్ యుగంధర్?' అని తరువాతెప్పుడో మూర్తి లైన్లోకి వచ్చినప్పుడు సరోజ అడిగితే మూర్తి ఇచ్చిన సమాధానం మరీ
విడ్డూరం అనిపించింది. 'మీ ఇంటికొచ్చినప్పుడు నువ్వు నాకు చూపించిన లెటరేనే ఆధారం! నాన్నగారు ఎంత
స్టైల్ మార్చి రాసినా ఆ గొలుసుకట్టు
రాతలోని అక్షరాలు కొన్ని ఇట్టే పట్టించేస్తాయ్! ఈ కాలంలో ఎంత 'హితాభిలాషి' అయినా
మా నాన్నలాగా 'బి' కింది వత్తు మరీ అంత భీకారంగా కింది దాకా సాగదీసి మేకు దిగ్గొట్టేనట్లుగా రాయడం లేదు
కదా!' అని నవ్వేశాడు మూర్తి.
***
-కర్లపాలెం
హనుమంతరావు
('ఆకాశరామన్న' పేరుతో ఆంధ్రభూమి (19, ఫివ్రవరి, 2019)
నాటి వారపత్రికలో ప్రచురితం)
No comments:
Post a Comment