Sunday, December 12, 2021

 

రామాయణంలో మందుల వేట

-కర్లపాలెం హనుమంతరావు

 

ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధంలో 67 కోట్ల రామ సైన్యంతో సహా రామలక్ష్మణులు సైతం మూర్ఛపోయారు. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు  బాగా గాయపడ్డారు. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న రామసేన  మధ్య విభీషణుడు , ఆంజనేయుడితో బతికున్న కోతులు, భల్లూకాల కోసం వెతుకుతుంటే   జాంబవంతుడు కంటబడ్డాడు. 'ఎట్లా ఉన్నావు పెద్దాయనా?' అని విభీషణుడు అడిగిన మీదట 'గొంతును బట్టే నిన్ను గర్తుపట్టడం! కంటి చూపు కూడా మిగల్లేదు ఇంద్రజిత్తు దెబ్బకు. ఆంజనేయుడు బతికే ఉన్నాడా?' అని జాంబవంతుడు అడిగాడు. విభీషణుడుకి ఆశ్చర్యం కలిగించింది. 'రామలక్ష్మణులకన్నా నీకు ఆంజనేయుడే అంత ఎక్కువ ఎప్పుడయ్యాడు?' అని దెప్పితే 'అదేం కాదయ్యా మహానుభావా! హనుమంతుడు  ఒక్కడు బతికి ఉంటే మన  సేనంతా చచ్చీ బతికున్నట్లే. లేకపోతే వానర, భల్లూకం జాతికి ఇహ భూమ్మీద నూకలు లేనట్లే.. అదీ లెక్క!' అన్నాడు. అనుభవంలో, వయసులో అందరికన్నా పెద్దవాడు జాంబవంతుడు. తాత దగ్గరకొచ్చి పాదాభివందనం చేసిన  వాయునందనుడితో జాంబవంతుడు 'పగలు పన్నెండు గంటల కాలాన్ని  ప్రాతఃకాలం, సంగవం, మధ్యాహ్నం, అపరాహ్ణం, సాయాహ్నం అనే ఐదు విభాగాలుగా విడగొట్టారు మన కాలజ్ఞులు. ఐదో భాగం సాయాహ్నంలో సహజంగానే రాక్షస ప్రవృత్తికి బలం జాస్తి.  ఇంద్రజిత్తు ముందు మన శక్తి తగ్గడానికి అదే కారణం. అదీగాక ఆ దుర్మార్గుడు  వదిలిన బ్రహ్మాస్త్రం మీద గౌరవంతో నీకు లాగానే రామలక్ష్మణులూ తాత్కాలికంగా లొంగినట్లు నటిస్తున్నారు! మీరంతా నిజానికి అజేయులు.  నా దిగులు దిక్కూ మొక్కూ లేని వానర, భల్లూక జాతి నిష్కారణంగా రణం పేరుతో విలువైన ప్రాణాలు వదులుకోవలసి వస్తున్నదనే. తోకలు, చేతులు, తొడలు, పాదాలు, వేళ్లూ, శిరస్సులూ, తెగిపడి, రక్త మూత్రాదుల మద్య మృత్యు పర్వతంలాగా పడి ఉన్న వీళ్లందర్ని తిరిగి బతికించుకునే ఉపాయం ఒక్కటే ఉంది హనుమంతూ!   ఈ లంక నుంచి మహాసముద్రం మీదుగా యోజనాల పర్యంతం  వ్యాపించి ఉన్న  ఉత్తరం దిక్కు ఆవలి అంచున    ఋషభ పర్వతం, కైలాస శిఖరం అని రెండు పర్వతాలు ఉన్నాయి. ఆ  కొండల మధ్యన అత్యంత విలువైన ఓషధీ గుణాలుండే మూలికలు, మొక్కలతో నిండిన ఓషధీ పర్వతం కూడా ఉంది. దాని నడి నెత్తిన పది దిక్కులనూ ప్రకాశవంతం చేస్తూ నాలుగు మందు మొక్కలు .. మృతసంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి ఉన్నాయ్! విశల్యకరణి శిధిలమయిన శరీరకణాలను బాగుచేస్తుంది. సువర్ణకరణి వల తేజం పెరుగుతుంది. సంధానకరణి విరిగిన ఎముకలను అతుకేయడానికి ఉపయోగిస్తారు. మొదట చెప్పిన మృతసంజీవని   నిర్జీవులకు ప్రాణదానం చేస్తుందంటారు.ఏదో ఒక ఔషధం మన  వానర, భల్లూక సేనకు ప్రస్తుతం అత్యవసరం. నీ మీదనే మా అందరి ఆశ!' అనగానే ఆంజనేయుడు అమాంతం ఉబ్బితబ్బుబ్బయిపోయాడు.  పర్వతాకారానికి పెరిగిపోయాడు. వాయువేగంతో ఓషదీ పర్వతం వైపుకు దూసుకుపోయాడు.

 

హనుమంతుడి దూకుడు దెబ్బకు దారిలోని పర్వత శిఖరాలు భూమ్మీదకు విరుచుకు పడి మండిపోవడం, శిఖరాగ్రాన ఉండే బండరాళ్లు  కిందకు దొర్లిపడ్డం.. హాలివుడ్ మూవీ క్లైమాక్సును మరిపించే విధంగా ఉన్నాయా దృశ్యాలన్నీ.

 

త్రికూట పర్వతాల నుంచి హనుమంతుడు మేరుపర్వతం లాంటి మలయపర్వతం పైకి ఎగబాకిన పద్ధతికి అనేక జలపాతాలు, మహావృక్షాలు, దట్టమైన లతలెన్నో ఛిన్నాభిన్నమైన తీరు వర్ణనాతీతం. 60 యోజనాల ఎత్తున్న ఆ పర్వతం పైన దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, మునులు, అప్సరసలు నివాసముంటారు. అక్కడ సంచరించే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు సైతం భయం పుట్టించేలా ఆంజనేయుడు శరీరం పెంచేసుకుని వెళ్లిన ఆ స్థలం బ్రహ్మ నివసించే గృహం, ఇంద్రుని సుఖించే భవనం, రుద్రుడు విలాసార్థం బాణాలు వదిలే స్థలం కూడా! హయగ్రీవుణ్ని అక్కడే ఆరాధించేది. శివుడు బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించి  పడగొట్ట్టిన స్థలం కూడా అక్కడే ఉంది. సూర్య కిరణాలు రాత్రంతా విశ్రాంతి తీసుకునే వసతి సౌకర్యాలన్నీ చక్కగా అమరివున్న ఆ స్థలంలోనే ఒకప్పుడు ఆంజనేయుడికి బ్రహ్మదేవుడు, ఇంద్రుడు చేత వజ్రాయుధం ఇప్పించింది. సూర్యకాంతితో సమానమైన కుబేరుని నివాసం, ఛాయాదేవి ప్రీతి కోసం   కాంతి తగ్గించేందుకు సూర్యుణ్ణి విశ్వకర్మ శాణం(గుండ్రంగా తిరిగే ఆకురాయి) పైకి ఎక్కించేందుకై బంధించిన స్థలం కూడా అక్కడే ఉంది. బ్రహ్మాసనం, కైలాసవాసుని ధనుస్సు దాచి ఉంచిన పాతాళ ప్రవేశద్వారం సైతం అక్కడే ఉండటం మరో విశేషం. ఇవేవీ ప్రస్తుతం ఆంజనేయుడు చూసి ఆనందించే మూడ్ లో లేదు.  కైలాసపర్వతం, హిమవచ్ఛిల, ఋషభపర్వతం, మేరుపర్వతం.. వాటి మధ్యన సమస్త ఓషధులతో ప్రకాశిస్తూ కనిపించే ఓషధి పర్వతాన్ని పట్టుకోవడమే ప్రస్తుత ధ్యేయం.

 ఓషదీ పర్వతం కనిపించింది. కాని, జాంబవంతుడు చెప్పుకొచ్చిన  ఓషదులేవీ ఆంజనేయుడికి ఎంత శ్రమించి వెదికినా కనిపించలేదు. వేలకొలదీ యోజనాలు దాటి తమ కోసం ఎవరో అంత అట్టహాసంగా రావడంతో ఓషధీపర్వతం పైనున్న మందుమొక్కలు ముందు ఆశ్చర్యపోయాయి. ఆనక  అతగాడెవడో మాయగాడని భయపడి ఎవరికీ కనపడకుండా దాగుండిపోయాయి.

వెదికి వెదికి విసిగిన ఆంజనేయుడు గుడ్లెర్రచేసాడు చివరకు 'మా రాముడికి సాయం చేసేందుకు నిరాకరించంచడం నాకెంతో ఆగ్ర్రహం తెప్పిస్తోంది. నాలాంటి కోతికి కోపం తెప్పిస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు అనుభవించండి' అంటూ ఒక పెడ్డబొబ్బ పెట్టి లక్షలాది  వృక్షాలతో, ఏనుగులతో, బంగారంతో, వేలకొలది  ధాతువులతో నిండి ఉన్న ఆ ఓషధి పర్వతం మొత్తాన్ని అమాంతం తన చేతుల మీదకు ఎత్తుకుని వాయువేగంతో ఆకాశం వైపుకు దూసుకు వెళ్లిపోయాడు.

సూర్యకాంతితో వెలిగిపోయే ఓషధీ పర్వతాన్ని చేత బట్టి గగనమార్గంలో సూర్యుడికి దగ్గరగా ఎగురుతోంటే ఇద్దరు సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తున్న భ్రాంతి. పర్వతంలాంటి ఆంజనేయుడు మరో వెలిగే పర్వతాన్ని అరచేతిలో పెట్టుకుని  ఆకాశ మార్గంలో  ఎగురుతుంతే వేయి  అంచులు గలిగిన విష్ణుచక్రం గగన తలంలో గిరిటీలు కొడుతున్నంత గొప్ప భావన.

తమ హనుమను  చూసీ చూడగానే భూమ్మీదున్న అశేష వానర సేన  ఉత్సాహంతో హాహాకారాలు చెయ్యడం చూసి ఆంజనేయుడు నోటమాట రాకుండా

పోయింది! 

***

అదెట్లా? ఆంజనేయుడు ఓషధులున్న పర్వతం కిందకు దింపక ముందే అన్ని కోట్ల మంది మృత రామ సేనకూ ప్రాణాలు ఎవరు ప్రసాదించినట్లు స్వామీ? ఎంత కతకైనా కొంత చెవులూ ముక్కులూ వుండాలి కదా గురువా?

 

అక్కడే ఉందిరా శిష్యా తిరకాసంతా? మహా మహిమాన్వితుడైన హనుమంతులవారు ఉత్తమ ఓషధులతో  నిండిన ఋషభ పర్వతంతో తమ జాతి మధ్యన నేలకు దిగక ముందే దూమ్ దేవ్ బాబా ఒకరు తమ పోతాంజలి బ్రాండ్ తయారీ మందు మృత కోతి సేన పైన ప్రయోగించారు శిష్యా!'

'నమ్మేదేనా గురువా ఈ  కత?'

'నమ్మాలి .. తప్పదు. కరోనా వైరస్ విషయంలో ప్రపంచం అంతా కిందా మీదా పడుతోంటే మన పుణ్యభూమిలో మాత్రం.. ఆ మహమ్మారికి విరుగుడుగా అదే పనిగా ఔషధాలు విడుదలవుతున్నాయా లేదా? పేర్లెందుకులే ..పెద్ద పీకులాటవుతుంది కానీ.. పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఇప్పటికే తాము కరోనాపై విజయం సాధించే మందులను ప్రయోగాలు నిర్వహించి మరీ సిద్ధం చేసేశామని ప్రకటించేస్తున్నాయ్ కదా!  కేంద్ర ప్రభుత్వ ఆమోదమూ ఉందని అమ్మకానికి విడుదల చేస్తున్నాయి. ఆయుర్వేద రంగమూ మందుల తయారీలో తానే  ముందున్నానంటూ కోతాంజలి బ్రాండు ఒకటి   తెర పైకి తెచ్చేసింది.. చూడలేదా? ఏదో 'నిల్' పేరుతో ఆర్భాటంగా విడుదలయిన ఆ   మందును వాడలేదా?

త్రేతాయుగంలో ఆ నారాయణ బృందం చేసిన చికిత్సలకు మెచ్చే కలియుగంలో  కరోనా వైరస్ మహమ్మారి నిదానానికి శాస్త్రీయ విధానాల ఫలితాలతో నిమిత్తం అక్కర్లేని  ఓషదులు విడుదల చేసుకునే మరో సువర్ణావకాశం సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రమూర్తే  కల్పించినప్పుడు.. నువ్వు  సందేహించావో దైవద్రోహం కింద నీకు కఠిన శిక్ష సిద్ధంగా ఉంటుంది. ముందు నోరు ముయ్యి శిష్యా.. ముందు ముందు కీడేమీ జరగకూడదనుకుంటే!

 

-కర్లపాలెం హనుమంతరావు

13 -10 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

మాటలతో ఆటలు - కర్లపాలెం హనుమంతరావు (సరదాకే)

 


ఎవరో ఒకరు పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది? అంటాడు మాయాబజారు సినిమాలో ఎస్వీఆర్ ఘటోత్కచుడి అవతారం ఎత్తేసి. భాష అంతస్సారం రాక్షసజాతికే వంటబట్టగా లేనిది, జీవకోటిలో ఉత్కృష్టమైందని గొప్పలు పోయే మనిషి బుర్రకు తట్టకుండా ఉంటుందా? ఇహ, ఆవుకు కూడా 'కొమ్ము' తగిలించే మన తెలుగుభాషలోని మాటల తమాషా సంగతిః.. కాస్సేపు.. బుర్రకు తట్టినవి.

అసల తట్ట అంటేనే వెదురును ముక్కలు ముక్కలుగా చేసి కళ ఉట్టిపడేటట్లు  అల్లే ఒక పదార్థం. తాటాకు చెట్టు నుంచి వస్తుంది కాబట్టి తట్ట అయిందేమో! విజ్ఞులొక పరి  మా జ్ఞానం పట్ల కూడా గౌరవముంచి ఆలోచించాలి! మింగే లక్షణం గలది కాబట్టే తిమింగలం అయిందన్నది మా మిత్రుడొకడి పరిశోధనలో తేలిన అంశం. కేస్ట్ కౌచింగ్ మీద  ఆ మధ్య పెద్ద దుమారమే రేగింది తెలుగు సినీపరిశ్రమలో  .. గుర్తుందిగదా! ఈ గొడవలు ఇట్లా ముందు ముందు తగలడతాయాన్న కాలజ్ఞానం మస్తుగా ఉండుండబట్టే దీపిక అనే బాలివుడ్ కథానాయికి తాను 'పడుకోని' దీపిక అని పుట్టీపుట్టంగనే ప్రకటించేసుకుంది.

చౌ ఎన్ లై కి చాయ్ తాగేటప్పుడైనా ఎనలైట్మమెంటు కింద 'లైస్' (అబద్ధాలు)పకుండా చెప్పే పని తెలీని  రాజకీయనేతగా ప్రసిద్ధి. ఎన్ టి రామారావును కాంగ్రెసోళ్లు పాలిటిక్సులోకి వచ్చిన  ఎమ్టీ (ఖాళీ) రావు’ అని ఎద్దేవా చేసేవాళ్లు. చివరకు పాపం కాంగిరేసువాళ్లకే ఆ పార్టీ తరుఫున నిలబడితే ఎన్నికల 'రేసు' లో కనీసం ధరావత్తులు కూడా 'రావు'  అనే దుస్థితి  వచ్చిపడింది. సోనియమ్మ గారాబాల బిడ్డ రాహుల్ గాంధీ. తరచూ ఊహించని క్షణాలలో తిరగబడ్డం ఆ బాబీ హాబీ! ఆందుకే ఆ గారాబాల   రాగా(రాహుల్ గాంధీ)బాల గా మాధ్యమాలకు ఎక్కింది. గీర్వాణం అంటే సంస్కృతభాష. ఆ వాణిలో నాలుగు ముక్కలు ముక్కున పట్టీ పట్టంగానే గీరపోయే పండితులే దండిగా ఉండటం సర్వసాధారణం. సో అ 'గీర వాణం' పేరు గీర్వాణానికి చక్కగా అతికిపోతుంది. బా అన్నా వా అన్న ఒకే శబ్దం బెంగాలీబాషలో. ‘పో అని ఆ శబ్దానికి అర్థం. ఇష్టం లేని అక్క మొగుడు ఎవడో ఒంటరిగా ఉండడం చూసి కమ్ముకొచ్చినప్పుడు 'పో.. పో' అంటూ  కసిరికొట్టి ఉంటుంది వయసులో ఉన్న మరదలు పిల్లో. ఆ మాటే చివరకు అక్క మొగ్గుళ్లందర్నీ 'బా.. వా' లుగా సుప్రసిద్ధం చేసేసింది మన తెలుగుభాషలో.

కాల్షియం సమృద్ధిగా ఉంటేనే మనిషిలో పెరుగుదల సక్రమంగా ఉండేదంటారు  ధన్వంతురులు. ఆ ధాతువు అధిక పాళ్లలో దొరికేది కాబట్టే ' పెరుగు' పెరుగు అయింది. ధన్వంతురుల అన్న మాట ఎలాగూ వచ్చింది  కాబట్టి ఒక చిన్న ముచ్చట.  ధనం మాత్రమే తన వంతన్న దీక్షగా  చికిత్స చేసే వైద్యనారాయణులు కొంతమంది కద్దు. ఆ మహానుభావులకు  ఆ పేరు చక్కగా సూటవుతుంది. ఆయుర్వేదం చేసే వైద్యుల కన్నా అల్లోపతి చేసే ఫిజీషియన్లకు ఆ పదం అద్దినట్లు సరిపోతుంది. అన్నట్లు  ఫీజు తీసుకుని వైద్యం చేసే ఫిజీషియన్ ని  ‘ఫీజీషియన్ ‘ అనడమే సబబు.

బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అస్తమానం కమ్మని కలలు కనేవాళ్లు తల్లిదండ్రులు. కనకే అమ్మానాన్నా 'కన్నవాళ్లు' గా ప్రసిద్ధమయారు.

కలసి ఆడే కర్రల ఆట కాబట్టి కోలాటం 'కో'లాటం అయింది. రైయ్యిమని దూసుకుపోతుంది కనక రైలుబండి అయినట్లు.  మని, అన్నా 'షి' అన్నా పడిచస్తాడు కనక  మనిషి 'మని-షి'గా తయారయ్యాడు. తతిమ్మా జంతుకోటితో కలవకుండా తానొక్కడే  మడి కట్టుకున్నట్లు విడిగా ఉంటాడు కాబట్టి 'మడి'సి కూడా అయ్యాడనుకోండి.

'కీ' ఉండని చిన్న టిక్కీ కాబట్టి  కిటికీ. 

రాసి రాసి గుర్తింపు లేక  నీరసం వచ్చేసిం తరువాత  కవులు కట్టే గ్రూపు-రసం. విచ్చలవిడితనంతో ఇష్టారాజ్యంగా  రాసే కవుల గుంపు వి-రసంఒక ముఠా కవులు మరో గ్రూపు కవుల మీద ముటముటలాడుతూ  విసుర్లు వేసుకునేవారు ముఠాలు కట్టిన ప్రారంభంలో.

ఆ రంభ వచ్చినా ఆరంభంలో మగవాడికి ఏం చెయ్యాలో తెలిసిరాలేదు. ఆడమన్నట్లా ఆడేది మొదట్లో ఆడది. అందుకే ఆమె ఆరంభంలో ఆడది అయింది. మగువను చూస్తే 'గాడు' (తీపరం)  పుట్టే జీవి కావడం మూలాన వయసు కొచ్చిన మగాడు మగాడు అవుతాడు. క్షీరధార రుచిని మరిపించే  కవిత్వం కురిపించే  కవులు ఉంటారు. ఆ కవులే  అసలు సాహిత్యంలోని  'కౌ'లు.  మెరికలు పోగయ్యే దేశం గనక అది అమెరికాగా ప్రసిద్ధిపొందింది. ఆయిల్ ఫ్రీ లీ అవైలబుల్ గనక ఆఫ్రికా అయిందేమో తెలీదు. అట్లాగని ఆస్ట్రేలియాలో అంతా స్ట్రే డాగ్సులా తిరుగుతారనుకోవద్దు. అట్లా చేస్తే స్టేలు కూడా దొరకని క్రిమినల్  కేసుల్లో బుక్కయిపోతారు. అట్లాగే అరబ్బు కంట్రీసు కూడా. పేరును చూసి 'ఐ రబ్ విత్ ఈచ్ అండ్ ఎవ్విరిబడీ' అంటూ మన బ్లడీ ఇండియన్ ఫిలాసఫీలో బలాదూరుగా  తిరిగితే.. సరాసరి పుచ్చెలే ఎగిరిపోవచ్చు. నేతిబీరకాయల్లోని నేతిని మన గొనసపూడి పూసల నేతితో  అన్నోయింగ్లీ కంపేరు చేసేసుకుని సెటైర్లకు దిగెయ్యడం మన దేశంలో కాలమిస్టులకు అదో అమాయక లక్షణం. న ప్లస్ ఇతి ఈజ్  క్వల్ టు   నేతిరా  నాయనల్లారా! ‘-ఇతి అంటే  'ఇది కాదు' తెలుగర్థం.  దాన్ని పట్టుకునొచ్చి నేతి బీరకాయలో అది లేదని ముక్కు చీదుకోడం చదువు మీరిన వాళ్ల చాదస్తం.

ఎలుక కు చిలుకకు ఒక్క పేరులో తప్ప పొంతన బొత్తిగా   ఉండదు.  టమోటోకి టయోటాకి మాటలో తప్ప రేటులో  పోలికే  తూగదు. పదాలున్నాయి కదా పదార్థాల కోసం దేవులాడితే వృథా ప్రయాసే! ‘ఎలాగూ’  లో ఏ లాగూ కోసం వెతికినా దొరకదు కాక దొరకదు. మైసూర్ బజ్జీలో మైసూరు కోసం వెదికి ఉసూరు మనకు!  అన్ని పదాలు కలుస్తాయని కాదు. కలవకూడదనీ కాదు.

ఇట్లా పనికిమాలిన పదాలను పట్టుకుని ఎన్ని ఆటలైనా అలుపూ  సొలుపూ  లేకుండా ఆడేయడానికి అసలు కారణం..నాకు ఏ పనీ పాటా లేకుండా తిని కూర్చునే లక్షణం పుష్కలంగా ఉండడం. దయచేసి  ఇక్కడ ఏ ‘లంగా’  కోసం వెతక్కండి మహాప్రభో! ఖాయంగా దొరకదు గాక దొరకదు దొరలూ .. దొరసానులూ!

-కర్లపాలెం హనుమంతరావు

26 -11 -2020

***

నీ కాడే ఉండనీయి నాయనా! - కథానిక- కర్లపాలెం హనుమంతరావు - రచనలో ప్రచురితం

 

నీ కాడే ఉండనీయి నాయనా! - కథానిక- కర్లపాలెం హనుమంతరావు

 

నీ కాడే ఉండనీయి నాయనా!- కథానిక (మొదటి భాగం)

-కర్లపాలెం హనుమంతరావు

 

బస్ ఆత్మకూరు చేరేసరికి తెల్లారింది. బస్టాండ్ వెనకాలే లాడ్జ్. రిఫ్రెషయి మళ్ళీ నందిపాడు వైపెళ్లే బస్సు పట్టుకునే వేళకు ఎండ చిరచిరలాడుతోంది.

బస్సు నిండా జనం. కరటంపాడు కరణంగారు నన్ను చూసి పక్కనున్న సాహేబును లేపి సీటిప్పించాడు.  లేచి నిలబడ్డ సాహేబ్జీ గుర్తు పట్టి సలామ్ చేశాడు.

'ఆశ్రమానికేనా?' అని అడిగాడు కరణంగారు. తనూ ఇంట్లో ఆడాళ్లకు వంట్లో బాలేక  స్వామివారి దర్శనానికి తీసుకెళుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

'సాయబ్ గారూ! మీరూ..?' అనడిగాను.

'బస్సులోని అందరం అక్కడికే సాబ్!' అన్నాడు నవ్వుతూ సాహెబ్జీ.

 నీళ్లస్వామివారి మీద సినీ స్టైల్లో పాటలు.. అనుగుణంగా భక్తుల భజనలు!  బస్సులో వాతావరణం హోరెత్తిపోతోంది.

ముందు సీటాయన దగ్గరున్న కరపత్రం అందుకున్నా. దాన్నిండా 'నీళ్లస్వామి'వారి మహిమలే మహిమలు!

'..నమ్మి సేవిస్తే సంకటాలు తొలుగుతాయి. నమ్మని మూర్ఖులకు సుఖశాంతులు నశిస్తాయి..'అంటో ఏవేవో పిట్ట కథలు కాగితమంతా!

కరణంగారేదో చెప్పుకుపోతున్నాడు తన ధోరణిలో '..చక్రాలపాడు శీను తెల్సు కదా సార్! అదే.. మీ టైములో నక్సలైట్లలో తిరిగేవాడు. వాడిప్పుడు స్వామివారికి ప్రథమ శిష్యుడు. నెల్లూరు నుంచి జమీన్ రైతొచ్చేదీ! దాని సబ్-ఎడిటర్.. రామిరెడ్డి ప్రస్తుతం స్వామివారి  పరమ ఆప్తుడు. నీళ్లస్వామివారి హవా అట్లా ఉంది మరి.  మూడేళ్ళ కిందటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాసార్ నేను! అయినా నీళ్లస్వామివారి కృప వల్ల మళ్లా మా ఆడోళ్లు  నీళ్లోసుకోడానికి తయారవుతున్నారు. నాలుగు నెల్ల బట్టి వస్తున్నాం. ఇంకో అరడజను సార్లన్నా దర్శనం తప్పదంటున్నారు'

'అన్ని నెల్లు గర్భమేవిఁటండీ! డాక్టరు కొకసారన్నా చూపించారా?' అడిగాను ఆశ్చర్యంగా!

'గజగర్భం.. అట్లాగే ఉంటుందంటగదా సార్! డాక్టర్లకు చూపిస్తే పెద్ద ప్రాణానికే మొప్పం అన్నారు. ఏదో..  స్వామివారినే నమ్ముకునున్నాం' చేతి వేలికున్న పగడపు ఉంగరం భక్తిగా కళ్లకద్దుకున్నాడా కరణంగారు.

'మా బేటాకు ముందు నుంచి నాలిక మంచిగ మడతబడదు సాబ్! స్వామీజీ ఇచ్చిన పానీ తీన్ మహీనే  తీసుకుంటే బరాబర్.. జీభ్ సాఫ్ హో జాతా హైఁ .. బోలే కోయీ! వస్తా ఉన్నాం! యేఁ  దూస్రీ బార్..!' అంటున్నాడు సాహెబ్జీ.

'ఫలం కనిపించిందా?'

లేదన్నట్లు గాల్లోకి చెయ్యాడించాడా సాహేబ్జీ.

నమ్మకాలకు మతాలు అడ్డం కావు కాబోలు మన దేశంలో!

నందవరంలో బస్సెక్కిన నాయుడుగారు నన్ను చూసి షాక్ అయ్యాడు. 'సార్! మీరింకా సర్వీసులోనే ఉన్నారా? ఏదో జైల్లో ఉన్నావన్నారే!' ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాడు పాపం ఆ మానవుడు  షాకులో.

బండి టోల్ గేట్ ముందాగింది. బడబడా బస్సులో కెక్కిన కుర్రాళ్లు కొందరు ప్యాసింజర్ల అంగీలకు స్టిక్కర్లింటించేస్తున్నారు డబ్బు వసూలు చేసుకుని. ఆ హడావుడిలో నాయుడుగారు నన్నొదిలేశాడు.

'స్టిక్కర్లు లేకపోతే క్యూలో నిలబడనీయరు. అక్కడైనా ఇదే గోల. ముందే తీసేసుకోండి సార్! ఓన్లీ ఫైవ్ రుపీస్!' అంటూ కరణంగారి వచ్చీ రాని ఇంగ్లీషు.. మధ్య మధ్యలో! పైసలు పుచ్చుకుని స్వామివారి బొమ్మున్న ఓ స్టికర్ చొక్కా  జేబుకు అంటించిపోయాడో కుర్ర వలంటీర్!

'ఇక్కణ్నుంచీ అడుగడుక్కీ ఇట్లా ముడుపులు చెల్లించుకుంటూ పోవాల్సిందే!'అన్నాడు సాహెబ్ గారు.

రోడ్డుకు ఎడా పెడాగా ఉన్న మోటార్ పంపుల నుంచి జారే నీళ్ళల్లో జనాలు స్నానాలు చేస్తున్నారు. స్నానానికి ఇరవై. 'దీని'కైతే ఐదు.. 'దీని'కైతే   రెండైదులు' అంటూ సాహెబ్జీ వేళ్లు చూపి వివరించే పద్ధతికి నవ్వాగింది కాదు నాకు.

'అంతా బిజినెస్సయిపోయిందిలే సార్ ఇవాళా రేపూ! మునుపీ రూటులో మిర్చి లోడు లారీలు తప్ప ఇంకేవీ తిరిగేవే కాదు. చీకటి పడితే చాలు దొంగల భయం. ఇప్పుడో! కార్లు, స్కూటర్లు.. అబ్బో.. ఒహటనేమిటిలే! ఆటోల సంగతైతే ఇక చెప్ప పనేలేదు. స్వామివారి పుణ్యమా అని తలా ఓ రకంగా బాగుపడుతా ఉన్నారు.'అన్నాడు కరణంగారు.

'మరే! మర్రిపాడు కాణ్ణుంచీ ఈడ దాకా అంతా ఇసక పర్రే కదండీ! ఎకరా ఐదువేలన్నా కొనే నాథుడుండేవాడు కాదా జమానాలో. ఇప్పుడో? రెండు లక్షలిస్తామని గడ్డం పట్టుకున్నా లొంగే కుంకే లేడు' అని వంత అందు కున్నాడు నాయుడుగారు.. మళ్లీ ఎప్పుడొచ్చాడో గానీ!

వాళ్లూ వాళ్లూ మాటల్లో పడిపోయారు. నాయుడుగారంటున్నాడు 'కావలి ఎం.ఎల్.యే రామారెడ్ది పెళ్లాన్ని తీసుకొని ఇటేపొస్తున్నట్లు తెలిసిందయ్యా! వేరే చోటయితే మన మాటకు దొరకడు. ఇక్కడైతే ఈ  నీళ్ళస్వాములారితో ఓ ముక్క చెప్పించినా పనయిపోతుంది. ఇంజనీరింగ్ కాలేజీ ఈజీగా పెట్టించెయ్యచ్చు.. ఉదయగిరిలో! ఇంతకీ ఈ బేంకాయన ఎందుకొస్తున్నట్లో ఏమైనా తెలిసిందా?' అంటూ నా గురించి మళ్లీ కరణంగారి చెవులు కొరకడం మొదలెట్టాడు.

అతగాడేం చెబుతున్నాడో నా ఊహకందక పోలేదు. నా మనసు పదేళ్లు వెనక్కి మళ్లింది. 

-కర్లపాలెం హనుమంతరావు

(మొదటి భాగం అయిపోయింది)

 

 

నీ కాడే ఉండనీయి నాయనా!- కథానిక (రెండో భాగం)

-కర్లపాలెం హనుమంతరావు

బోరబండ శాఖలో పనిచేస్తుండగా హఠాత్తుగా ధర్మారావుపల్లి శాఖకు బదిలీ అయింది. నెల్లూరుకు పడమరగా బాంబే హై వే మీద ఆత్మకూరుకు దగ్గరగా ఉంటుందా కుగ్రామం. ఆ శాఖ లావాదేవీలన్నీ ప్రధానంగా చుట్టుపక్కల గ్రామాల పొగాకు  సాగుకు సంబంధించినవీ.. టొబోకో బోర్డుకు చెందినవీ. ప్రభుత్వరంగ బ్యాంకు అవడం మూలాన అరకొరగానైనా గవర్నమెంటు స్కీముల కింద రుణాలు కొన్ని అచ్చుకోక తప్పని పరిస్థితి.

కేంద్ర రుణమాఫీ పథకం వచ్చి.. పోయిం తరువాత మళ్లా ఆ తరహా మాఫీలేమైనా వస్తాయన్న బేఫర్వా పెరిగింది జనాలకు; సొమ్ము సమకూరినా   అప్పులు తీసుకున్న వాళ్ళు అస్సలు కిస్తీలు కట్టే ఆలోచనే చేసేవాళ్ళు కాదు.  దరిమిలా   మొండి బకాయీలు  కుప్పగా పేరుకుపోయున్న  స్థితిలో నేను బ్రాంచ్  ఛార్జ్ తీసుకున్నా.

పిల్లల చదువులు భంగమవుతాయని హైదరాబాదు నుంచి ఫ్యామిలీని కదల్చలేదు. ఊళ్లోని బ్యాంకు క్వార్టర్సులోనే  ఒంటరి నివాసం.

పని దినాలు ఎట్లాగో గడిచిపోయేవి. శనాదివారాలప్పుడే సమస్య. కాఫీ, టిఫెన్ల కోసమైనా కాకా హోటల్సుకెళ్లక తప్పేది కాదు.   అదిగో అప్పుడు తగిలాడు 'బర్రెల సాంబయ్య'.

సాంబయ్యకు సొంతానికి పాడి లేదు. ఊరివాళ్ల బర్రెలను మేపుకు బతికేవాడు. అందుకే  అతగాడు బర్రెల సాంబయ్యగా ప్రసిద్ధం.  మగ బిడ్డలు ఇద్దరుండీ ప్రయోజనం శూన్యం. పెద్దాడు వేరే దేశం వెళ్లి చేతికందకుండా పోతే, రెండో ఉద్ధారకుడు దేశం మీద ఊరేగడానికి ఎటో వెళ్లాడు. ఎక్కడున్నాడో తెలీనైనా తెలీదు పదేళ్ల బట్టి. పెళ్లాం కూతుర్ని కని  సాంబయ్య నెత్తికి రుద్ది  కన్నుమూసింది.

'ఆడబిడ్డతో అగచాట్లుగా ఉంది సామీ! ఒక్కయిదేలు అప్పుగా ఇప్పించమ'ని వచ్చిన ప్రతీ మేనేజరు కాళ్లూ గడ్డాలు పట్టుకునేవాడుట బర్రెల సాంబయ్య.

ఆ దఫా నా వంతయింది.

'ఇంత మంది అప్పులు తీసుకుని  ఎగేస్తుంటిరి కదా! ఒక్క ఈ సాంబయ్య మొహానే ఎందుకు మొద్దులు పెట్టడం?' అనిపించింది నాకెందుకో. బ్యాంకు లోను తీయించి  రెండు బర్రెలు ఇప్పించా.

పెద్ద సంతలో వాటిని మూడు వేలకు అమ్మేసుకుని చెప్పాపెట్టకుండా మాయమయ్యాడు మహానుభావుడు! వాడి కూతురు 'దుర్గ'  నేనెప్పుడు నడి రోడ్డు మీద కనపడ్డా ఒహటే శాపనార్థాలు. ఎవరెంత వారించినా వినేది కాదు.  ఆ పిల్లకు అప్పుడు పదమూడు పథ్నాలుగేళ్లుంటాయేమో! తెలిసీ తెలీని ఈడు!

 ఓ నెల్రోజులు జల్సా చేసి అబ్బ తిరిగి రావడంతో ఆమె కోపం కొంత చల్లారింది! కానీ. ఎందుకో మనిషి  ఎదురుపడితే మాత్రం మిడి గుడ్లేసుకుని నొసలు చిట్లిస్తూ ముక్కూ మూతీ తిప్పుకోడం మాత్రం మానేది కాదు.

ఆ ఎండాకాలం సెలవులకు పిల్లలు ఊరు చూద్దామని ఉబలాట పడుతూంటే ఓ నెల్లాళ్లు ఉండి పోతారులెమ్మని తీసుకొచ్చా. ఆ నెల రోజులూ  సాంబయ్య కూతురే మా ఇంట్లో పనిమనిషి.

నా పెద్ద కూతురు దాదాపుగా దుర్గ వయసుది. ఇద్దరికీ బాగ ఖత్తు కలిసింది. దాంతో  దుర్గ పద్దస్తమానం మా ఇంట్లోనే చనువుగా తిరగడం సాగించేది. వాళ్లబ్బకు లోనిచ్చిన కోపం అప్పటిగ్గాని నెమ్మదిగా తగ్గింది కాదు నా మీద. మా పిల్లలను  చూసి తానూ   నన్ను 'నాయనా!' అనీ, ఆవిడ్ని 'అమ్మా' అనీ పిలుస్తుండేది పిచ్చిది.  మొదట్లో అదోలా ఉన్నా మెల్లిగా ఆ పిలుపే  మా ఇద్దరిక్కూడా బాగుందనిపించింది.

తిరిగి వెళ్లే సమయంలో మా ఆవిడ దుర్గకు రెండు లంగాలు, ఓణీలు కొత్తవి కుట్టించి మా పాప చేత ఇప్పిస్తుంటే భోరుమని ఏడ్చేసింది  ఆవిడను కావిటేసుకుని పసిపిల్లలా. ఆ దృశ్యం ఇప్పటికీ నాకు బాగా గుర్తే. 'ఈ పల్లెటూళ్ల జనాల కక్షలే కాదు, ఆపేక్షలు మన నగర జీవులకు ఓ పట్టాన అర్థం కావండీ!'అంది మా ఆవిడ.

మా బాబు చేత  ఓ వెయ్యి రూపాయలు దుర్గ చేతిలో పెట్టించబోయా వాళ్లు బస్సెక్కేపోయే ముందు. ఊహూఁ.. తీసుకుంటేనా! వద్దని మొండికేసింది! 'ఈ సొమ్ము కళ్ల బడితే ఇంకేమైనా ఉందా? మళ్లా మా తాగుబోతు అయ్య ఊరొదిలి పోడా! నీ కాడే ఉంచు నాయనా! గాజులూ, పూసలకేగా నా ఆశంతా! కావాలంటే నిన్ను కాక ఇంకెవర్ని  అడుక్కుంటా!' అని ఆ పిల్ల మళ్లా వల  వలా ఏడుపు!

 

ఒక రోజు కేషియర్ గుప్తా భయంకరమైన వార్తొకటి పట్టుకొచ్చాడు ఊళ్లోకి. గతంలో ఇక్కడ మేనేజరుగా చేసి పోయిన సెల్వరాజన్ అనే అరవాఫీసర్ ఒకాయన  'రుణమాఫీ పథకం' స్కామ్ లో  చిక్కుకుని ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నాట్ట. ఇన్నేళ్లుగా కోర్టుల్లో పోరీ పోరీ రెండు రోజుల కిందటే సుప్రీమ్ కోర్టులో కూడా చుక్కెదురయ్యే సరికి.. ఆ నిస్పృహ తట్టుకోలేక  పెన్నాలో దూకేశాట్ట!

ఆ టాపిక్కే హాట్ హాట్ గా కాకాహోటల్లో చర్చ జరుగుతుంటే 'బ్యాంకు అప్పు తీసుకునే వాడికి కేవలం బ్యాంకు అప్పు మాత్రమే! ఇచ్చే మా బ్యాంకాఫీసర్లకు  అది  సెటిలయే దాకా మెడకేలాడే యమపాశం!' అన్నాను. 

ఆ టైములో బర్రెల సాంబయ్య అక్కడే ఉన్నాడు.

ఆ తరువాత నాలుగు  రోజుల కనుకుంటా.. ఓ శనివారం మధ్యాహ్నం పూట నేను బ్యాంకులో ఒక్కణ్ణే కూర్చుని పని చూసుకుంటుంటే పిల్లిలా లోపలికొచ్చాడు సాంబయ్య. రొంటి కింద దాచిన  మూట విప్పి నా ముందు పరిచాడు. అన్నీ వందా, యాభై నోట్లే! 'అప్పుకు కట్టేసుకో సామీ! ఇంకా ఏమైనా ఉంటే నీ ఇష్టమొచ్చిన కాడికి నువ్వే ఏం చేసుకుంటావో చేసుకో!' అన్నాడు.

'ఇంత సొమ్ము నీ కెక్కడిదయ్యా?' అని గద్దిస్తే 'మా సంగం పిల్లోడు పంపించాడులే సామే!' అంటూ మళ్లీ మాట కందకుండా మాయమైపోయాడు.

మొత్తం పదమూడు వేల  పై చిలుకు  లెక్కేస్తే! సాంబయ్య అప్పు కాతాకు క్రెడిట్ స్లిప్పు రాసి, గుప్తా ఇంట్లో ఇచ్చేసి నేను హైదరాబాద్ వచ్చేశా. జీతం రాగానే అట్లా  వెళ్లి రావడం నా నెలచర్య.

సోమవారం తిరిగొచ్చే వేళకు ఊళ్లో సీనంతా పూర్తిగా మారిపోయి ఉంది. ఊరు మీద వసూలుచేసిన ఇంటిపన్ను రొక్కం బిల్ కలెక్టర్ సుబ్రహ్మణ్యం పంచాయితీ ఆఫీసు బీరువాలో పెట్టి.. ఫోనొస్తే పక్క రూములోకి వెళ్లి మాట్లాడుతున్నాట్ట! తిరిగొచ్చేసరికి ఆ మొత్తం మాయమయింద'ని గగ్గోలు.

పద్దస్తమానం ఆఫీసు వరండాలో పడి దొర్లే  బర్రెల సాంబయ్య మీదకు పోయింది బోర్డు ప్రెసిడెంటు నాయుడుగారి దృష్టి. పూటుగా తాగించి చింత చెట్టుక్కట్టి చితక్కొడితే 'సొమ్మంతా బ్యాంకు సారు చేతిలో పోశా' అని బావురమన్నాట్ట సాంబయ్య! పోలీసులొచ్చి వాణ్ణి పట్టుకుపోయారు.

ఊళ్లోకి దిగడమే ఆలస్యం; సర్పంచి బస్టాండులోనే నన్ను పట్టుకుని నిలదీశాడు. 'సాంబయ్య అప్పుకి జమేసింది పోగా మిగిలిన పదమూడు వేలు ఎక్కడ నొక్కినట్లో చెప్పమని నిలదీస్తుంటే నిలువుగుడ్లు పడిపోయాయ్ నాకైతే. సాంబయ్య అప్పుకు పోగా మిగిలింది మూడు వేలే! అదీ అతగాడి కూతురు దుర్గ పేరుతో ఉన్న కాతాలో జమయింది. ఆ మాటే అంటే నమ్మడే!

గొడవ నెల్లూరు డివిజినల్ ఆఫీసు దాకా పోవడం, ఆ మర్నాడే  విచారణ బృందం దిగిపోవడం! అప్పటికప్పుడే నన్ను రిలీవ్ చేసి కరీంనగర్   బదిలీ మీద పంపించేశారు!

ఆ తరువాత జరిగిన విచారణ కమిటీలు, ఎవరికీ తెలిసే అవకాశం లేని నివేదికలు.. వాటి మీద చర్యలు!

అందుకే ఇందాక నందవరం నాయుడుగారు నన్ను నేరుగా శ్రీకృష్ణ జన్మస్థానం పంపించేసుకున్నది తన మధురోహల్లో! ఈయనే అప్పట్లో ధర్మారావుపల్లి సర్పంచ్! నా మీద చర్యల కోసమై పదే పదే పై వాళ్ల మీద ఒత్తడి తెచ్చింది కూడా ఈ మహానుభావుడే! 

-కర్లపాలెం హనుమంతరావు

(నీ కాడే ఉండనీయి నాయనా!- కథానిక- రెండో భాగం అయిపోయింది)

***

 

నీ కాడే ఉండనీయి నాయనా!- కథానిక (మూడో భాగం)

-కర్లపాలెం హనుమంతరావు

 

ప్రస్తుతం నేను హైదరాబాదు జోనల్ ఆఫిసులో పనిచేస్తున్నా. రిటైర్ మెంట్ గడువు దగ్గర పడుతోంది. సర్వీస్ రికార్డ్సన్నీ సెట్ రైట్ చేసుకుని సిద్ధంగా ఉండకపోతే ఆఖరి నిమిషంలో ఇబ్బందవచ్చు. గతంలో నేను పనిచేసిన శాఖలన్నిటిలోని మొండి బాకీలకు సంబంధించిన వ్యవహారాలు ఒక్కటొక్కటే చక్కబెట్టుకుంటూ వస్తోన్నా. ఆ క్రమంలోనే ఓ రోజు    పొదలకూరు నుంచి కేషియర్ గుప్తా ఫోన్!  ఈ నీళ్లస్వామిని గురించి సమాచారం అందించిందీ అతగాడే!

'నందిపాడు కవతల కడప రూట్లో బ్రాహ్మణపల్లికి  దగ్గర నీళ్ల స్వామి ఆశ్రమం ఒకటి మహజోరుగా నడుస్తున్నది సార్! ఆ స్వామి దగ్గర చాలా మహత్తులున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందీ ఏరియాలో! పుట్టు గుడ్డోళ్లకు, మూగ మొద్దుల క్కూడా చూపూ మాటా ఇట్టే ప్రసాదించే మానవాతీతుడని గట్టిగా నమ్ముతున్నారు జనం. స్వామి మంత్రించి ఇచ్చిన జలప్రసాదం సేవిస్తే ఎట్లాంటి మొండి రోగాలైనా ఇట్టే లొంగొస్తాయని మా వైపు మైకులు పెట్టుకుని మరీ హోరెత్తిచ్చేస్తున్నారు.  ఈ నీళ్లస్వామి మహిమకు మంచి పేరున్న  మా పొదలకూరు ఫెర్టిలిటీ సెంటరే  మూతబడిపోయిందిప్పుడు. నేనూ ఆశ్రమానికి వెళ్లొచ్చా. మీరూ ఓ సారి వెళ్ళి రండి. మీ సమస్య తీరుతుందని నాకనిపిస్తోంది' అంటూ రోజుకో కొత్త విశేషం చెప్పుకు రావడంతో ఈసారి నేను ఈ ప్రయాణ పెట్టుకున్నది కూడా.

బస్సు ఆశ్రమం ముందాగడంతో జనం బిలబిలా దిగిపోతున్నారు. ఆ హడావుడికి ఈ లోకంలోకి వచ్చిపడ్డా. నేనూ దిగిపోయా.

ఎటు చూసినా అంగళ్లే! పూజా సామాగ్రి నుంచి పాటల కేసెట్ల దాకా అన్నిటి అమ్మకం జోరుగా సాగుతోన్నది. అంతా ఒక పెద్ద సంత వాతావరణం.

'ఆదివారం కదా! ఇట్లాగే ఉంటుంది' అంటూ కరణంగారు ఓ పంపు దగ్గరికి పరుగెత్తారు. వగరుస్తూ వగరుస్తూ ఓ చిన్న ప్లాస్టిక్ కేన్ నిండా పంపు నీళ్లు పట్టుకొనొచ్చారు.

కేన్ పాతిక రూపాయలు. 'అన్నింటికీ ఫిక్సడ్ రేట్స్! అదేమని అడిగితే దాష్టీకం చేస్తున్నారు.' అని భార్యతో సహా వెళ్లి క్యూలో నిలబడ్డాడు గొణుక్కుంటూ. అర కిలోమీటరుంది ఆ క్యూ.

ఈ క్యూలో నిలబడి లోపలి దాకా పోవడం నాకు ఈవేళ ముగిసే పనేనా? మనసు లోలోపల పీకుతోంది. అందరి చేతుల్లోనూ నీళ్ల కేనులున్నాయి. లేనిది నా చేతిలోనే.  అనుమానం వచ్చినట్లుంది.. ఓ వస్తాదుకు. దగ్గరిగా వచ్చి 'నీళ్లేవీ?'అనడిగాడు మొరటుగా.

ఏమని చెప్పడం? చెబితే నన్నక్కడ నిలబడనిస్తాడా?

మాటల కోసం తడుముకుంటుంటే అనుమానం మరింత హెచ్చింది. పక్కకు తీసుకెళ్లి వళ్లంతా తడిమి చూశాడు.  సెల్ ఫోను, కళ్ల జోడు, పర్సు,  ఇంకేవో కొన్ని పేపర్లు మాత్రమే కనిపించే సరికి ఏం చేయాలో తోచింది కాదనుకుంటా అతగాడికి. మెయిన్ గేట్ దాకా తోసుకుంటూ వచ్చాడు. అప్పుడు కనిపించిందా అమ్మాయి.

నన్ను చూసి ఒక్క క్షణం షాకయినట్లుంది. వెంటనే తేరుకుని నవ్వు మొహంతో దగ్గరికొచ్చింది.

'దర్శనం అయిందా?' అనడిగింది. తలడ్డంగా వూపా నిరాశగా. ఎదో కాల్ వచ్చిందింతలో తనకు.

'హాల్లోకి తీసుకెళ్లు! నేనొస్తున్నా!' అంటూ ఇందాకటి వస్తాదుకు పురమాయించి తనెటో హడావుడిగా వెళ్లిపోయింది.

ఇందాక నెట్టుకుంటూ తీసుకొచ్చిన వస్తాదే ఇప్పుడు అతి మర్యాద ప్రదర్శిస్తూ నన్ను ఓ హాల్లోకి తీసుకువెళ్లాడు.

'ముందు దర్శనం' అన్నాను టైం చూసుకుంటూ. పక్క గది చూపించి వెళ్లమన్నట్లు ఓ డోర్ తెరిచి నిలబడ్డాడు మాటా పలుకూ లేకుండా.

అక్కడ అన్నసంతర్పణ లాంటిది ఏదో జరుగుతోంది. పంక్తి మధ్యలో ఉన్న ఒక ఆడమనిషి హఠాత్తుగా విరుచుకుపడిపోయింది. మొహాన ఇన్ని నీళ్లు చల్లారెవరో. తెప్పరిల్లి లేచి నిలబడింది. పూనకం వచ్చిన మనిషికి మల్లే ఊగిపోతూ నీళ్లస్వామివారి దయ వల్ల తనకు   బిగుసుపోయిన కాళ్లు రెండూ ఎట్లా మళ్లీ స్వాధీనంలోకొచ్చాయో.. చిలవలు పలవలుగా కథలు చెబుతోంది పెద్ద గొంతేసుకుని. నీళ్లస్వామికి గోవిందలు కొడుతున్నారు తన్మయత్వంతో వింటూ భక్తజనులందరూ. అంత తాదాత్మ్యతలో కూడా  విస్తట్లోని పదార్థాలు ఖాళీచెయ్యడంలో అశ్రద్ధ చూపించడం లేదే భోక్తా!

'తింటారా? ఉచితం' అన్నాడు వస్తాదు ముక్తుసరిగా.

'ముందు దర్శనం' అన్నాను మళ్లీ అసహనంగా. అవతల మళ్లీ నెల్లూరు దాకా వెళ్లాలి. రాత్రి తొమ్మిదికే తిరిగెళ్లవలసిన ట్రైన్. మరో గది చూపించి తలుపు తీసి వెళ్ళమన్నట్లు సైగ చేశాడీ సారి వస్తాదు.

వెళ్లాను. అక్కడ దర్శనమిచ్చాడు నీళ్లస్వామి.. భక్తబృందం  మధ్య కొలువు తీరి. మరో దిక్కు నుంచి క్యూలో వస్తున్న భక్తుల కేనుల్లో స్వామి ఎడం చేయి వేలుముంచి తీయగానే  స్వామివారి ఆంతరంగికులు ముందుకు నెట్టేస్తున్నారు. స్వామివారికి చెరో పక్క నిలబడ్డ మరో ఇద్దరు ఆంతరంగికులు పట్టి నిలబడ్డ జోలెల్లో యధాశక్తి తోచింది వేసి ముందుకు కదులుతున్నారు సందర్శకులు. భక్తులకు మించి వాలంటీర్ల సందడే అధికంగా ఉందక్కడ.

'భోజనం చేశావా నాయనా?' అని అడిగింది ఇందాకటి ఆమ్మాయి మళ్లీ ప్రత్యక్షమై.  నేను బదులు చెప్పేలోగానే చొరవగా నా చెయ్యి పట్టుకుని మరో గదిలోకీ తీసుకెళుతూ 'ముందు నువ్వు భోజనం చెయ్యడం ముఖ్యం. అసలే నీకు షుగర్ కూడానూ. అవునూ! షుగర్ అట్లాగే ఉందా ఇంకా ఏమైనా పెరిగిందా నాయనా?' అని ఆడిగింది ఆప్యాయంగా ఆ అమ్మాయి. తనే విస్తరి వేసి  చికెన్ బిర్యానీ వడ్డించింది. రెండు రోజుల నుండి సరైన ఆహారం లేకుండా ఉందేమో గబగబాలాగించేసింది కడుపు.

'కాస్సేపు  కునుకు తీయండి నాయనా! దర్శనాలు అయేసరికి ఎంత లేదన్నా రెండు గంటలు దాటుద్ది' అంటూ మరో గదిలోకి తీసుకువెళ్లింది.

అదేదో విఐపిల  గెస్ట్ రూమ్ లా ఉంది. ఎ.సి, డబుల్ కాట్స్ తో యమ పోష్ లుక్.   ఇందాకటి స్వామీజీ పక్కనున్న వాలంటీర్స్ లాంటి వాళ్లే మరో ఇద్దరు అదే రకం జోలెల్లో నుంచి కార్పెట్ మీద కుమ్మరించిన సొమ్మును డినామినేషన్ ప్రకారం విడదీసి కట్టలు కడుతున్నారు. మధ్య మధ్యలో వచ్చే బంగారపు ఉంగరాలు, గొలుసులు, గాజుల్లాంటివి విడిగా తీసి మరో వేటికి సంబంధించిన ప్లాస్టిక్ బుట్టలో వాటిని పడేస్తున్నారు. వయసులో చిన్నతను కొద్దిగా నోటితో విసుగుదల ధ్వనించే శబ్దాలు రెండు సార్లు చేయగానే పెద్దతను మందలిస్తున్నట్లు చిన్న స్వరంతో అంటున్నాడు  'ఇంకా ఇట్లాంటి  జోలెలు కనీసం నాలుగైనా వస్తాయిరా సన్నాసీ! అప్పుడే అలిసిపోతే ఎట్లా?'

బ్యాంకులో నిత్యం నోట్ల కట్టల మధ్యనే బతుకీసురోమని వెళ్లదీసే నాకు ఈ డర్టీ 'డఫ్' విలువ తెలీకేంం కాదు గానీ, ఈ కోణంలో చూడడం ఇదే మొదటి సారి అయే సరికి కొద్దిగా షాక్ తగిలిన మాట నిజమే!

ఈ లెక్కన ఈ నీళ్లస్వామివారి ఆదాయం కోట్లలో ఉంటుందేమో! అందుకే కోటలాంటి ఆశ్రమం గట్రా ఏర్పాటయింది. ఇంత మంది వందిమాగధులని  మేపడమంటే మాటలు కాదు.  ఈ హంగూ ఆర్భాటాలు చూసే కదా సినిమా జనం, వ్యాపారస్తులు, రాజకీయాల్లో నలిగేవాళ్లు, విదేశీ కుబేరులు, ప్రభుత్వ అధికారుల్లాంటి వాళ్లు చుట్టూ మూగుతున్నది!

సుమారు నాలుగ్గంటల ప్రాంతంలో స్వామివారు ఈ గదిలోకి వేంచేశారు.

మనిషిలో పెద్ద మార్పేమీ లేదు. అప్పట్లానే సన్నగా, రివటలా పొట్లకాయను మరింత సాగదీసినట్లున్నాడు. స్వామి రాకతో తతిమ్మా జనమంతా యాంత్రికంగా బైటకు వెళ్లిపోయారు.

నన్ను గుర్తు పట్టేడో లేదో తెలీదు. నేను వచ్చిన పని చెప్పాను. 'అప్పట్లో బ్యాంకులో తీసుకున్న లోను వడ్డీ తిరుగుళ్లన్నింటితో కల్సి మొత్తం పాతిక వేలు దాటింది. అప్పు తాలూకు నోటు కూడా మురిగిపోయిందెప్పుడో. ఇదిగో.. తిరగరాసిన పత్రం.. నేనే తయారు చేసి తెచ్చా. ఎవరి చేతనైనా చదివించుకుని కుడి చేతి బొటన వేలు ముద్ర ఒకటి ప్రసాదిస్తే నా దారిన నే పోతా!' అన్నాను వినయంగా.. సాధ్యమైనంత వరకూ నా వెటకారం బైటపడకుండా!

నా మాటలు నాకే వింతగా వినిపించాయి. బర్రెల సాంబయ్యను నిలదీయాలనుకున్నదేమిటి? ఈ నీళ్లస్వామిని బతిమాలుకుంటున్నది ఏమిటి?

చేతిలో చిల్లి గవ్వ లేని మనిషిని అప్పు తీర్చమని దబాయించానప్పుడు. డబ్బు నీటిలో తడిసి ముద్దయే మనిషిని  కిస్తీ అయినా కొంత కట్టమని అడిగేందుకు జంకుతున్నానిప్పుడు! ఎంతలో ఎంత మార్పు!

అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ముందు నా బ్యాంకు హోదా ఎంతలా చిన్నబోయిందో  కళ్లక్కట్టినట్లు కనిపిస్తూందిప్పుడు. భక్తులెంతగానో తపించే ఈ నీళ్లస్వామి సన్నిధానం నాకు మాత్రం మహాచెరగా ఉంది ప్రస్తుతం. ఎంత తొందరగా ఈ నరకం నుంచి బైటపడదామా అన్నదే నా అంగలార్పు!

నోటు అందుకున్నాడు నీళ్ల స్వామి ఉరఫ్ బర్రెల సాంబయ్య. మాటా పలుకూ లేకుండా పరపరా చించేశాడు .

నేను షాక్!

'ఇంకా ఎన్నున్నాయి సామీ అట్లాంటి కాయితాలు నీ కాడ? అదే.. నా లాంటి దగుల్భాజీ సరుకు కట్టకుండా ఎగనూకిన అప్పు తాలుకు కాయితాలు?' అని అడిగాడు. ఆ అడగడంలో ఏ భావమూ తోచలేదు నాకు.

ఈ వారం రోజుల బట్టీ  ఊళ్ల వెంట పడి పడి తిరిగి సేకరించుకున్న మొండి బకాయీల తాలుకు రెన్యువల్ ప్రామిసరీ నోట్లు సుమారు ముప్పై దాకా ఉంటాయ్. గతంలో బ్యాంక్ మేనేజర్ హోదాలో   పని చేస్తున్నప్పుడు    నేను వివిధ శాఖల్లో ఇచ్చిన అప్పులన్నీ సక్రమంగా ఉండాలి. అప్పుడే నా ఉద్యోగ విరమణ ఫైల్ క్లియరయ్యే మాట. అందుకే నాకీ అవస్త!

'అయ్యోయ్! ముంబయ్ నుంచి ఆ సినిమా అమ్మాయిని చంపిన మొగుడొచ్చి కూకున్నాడు. ఇంకా ఎంత సేపు వెయిటింగంటూ గంతులేస్తా ఉండాడు సచ్చినోడు!' అంది ఇందాకటి అమ్మాయే మళ్లీ వచ్చి .

'పడుండనీలేవే.. మొదనష్టపోళ్లని! కమ్మంగా సంసారం చేసుకోడు ఏ మగ సచ్చినోడూ! మదం.  నమ్మి తాళి కట్టించుకున్న పాపానికి నీళ్లతొట్టెలో ముంచేసి సంపేయడమేంటి సామీ బంగారం లాంటి ఆడబిడ్డను! ఇప్పుడేమో  యములాడి పాశం గుర్తుకొచ్చి వణికి చస్తావుండాడు. కాసులు కుమ్మరించేస్తే పెంట సెంటయిపోతుందని ఈ డబ్బు పిచ్చోళ్లందరికీ అహం! చివరాఖర్లో పురుగులు పడి సస్తారని ఎవుడికీ కానదు సత్యం! సడేలే! ఈ గోల మనకెప్పుడూ  సచ్చేదేలే! అంత దూరం నుంచి పడతా లేస్తా వచ్చిండు. ముందు మన సామి పని సక్కబెట్టాల! ఆనకే అవన్నీ!' అంటూ స్వాములోరి దుస్తులు సర్దుకుని పైకి లేచాడు బర్రెల సాంబయ్య! వంగి  నా పాదాలు తాకి నిశ్శబ్దంగా బైటికి వెళ్లిపోతుంటే ఎట్లాగో అనిపించింది.

నా అనుమానం నిజమే! ఈమె ఆనాటి అమ్మాయి.. దుర్గ!

 ముందు నన్ను చెడ తిట్టిపోసి ఆనక 'నాయనా.. నాయనా'  అంటూ సొంత బిడ్డ కన్నా ఎక్కువగా వెంపర్లాడిన  రాక్షసి బిడ్డ. నన్ను మించి ఎదిగిన తల్లి! ఒక్కసారి అభిమానం పొంగుకొచ్చేసింది. దగ్గరకు తీసుకుందామా.. వద్దా అన్న    సంశయంలో ఉందగానే.. తనే హఠాత్తుగా  నా పక్కకొచ్చి కూర్చొని భుజం మీద తలపెట్టింది. నిమిషం తరువాత కాని తెలిసింది కాదు భుజాలు తడుస్తుంటే..  తను  భోరుమని ఏడ్చేస్తుందని!  దుర్గ మొహం చేతుల్లోకి తీసుకుని వారించే ప్రయత్నం చేస్తుంటే నా కళ్ళ సముద్రం కరకట్టలే తెగడం మొదలుపెట్టాయ్! ఎంత సేపట్లా కూర్చుండి పోయామో.. ఇద్దరం మాటా పలుకూ లేకుండా అక్కడే!

బైట అలికిడికి తేరుకుని లేచింది దుర్గ. ఇందాక కనిపించిన  సన్యాసుల చేత నా అప్పు పత్రాలన్నీ అక్కడే చింపిపోగులు పెట్టించింది ముందు. 'ముక్క మిగలకుండా తగలెట్టేయండిరా! టాయ్ లెంట్ సింకులో పోసి నీళ్లు కొట్టేసెయ్యండి..పోండి!' అంటూ వాళ్లకు ఆర్డర్ పాస్ చేసి 'నాయనా! ఒక్క అయిదు నిమిషాలు' అంటూ బైటకు వెళ్లిపోయింది హడావుడిగా దుర్గ.

పదమూడేళ్ల పసి దుర్గ చాలీ చాలని చిరుగు దుస్తుల్లో  నడి రోడ్డు మీద మగపురుగుల ఆబ కళ్ల మధ్య సిగ్గుతో చితికిపోతూ పేడ కళ్లు ఎత్తుకుంటున్న దృశ్యం గుర్తుకొచ్చి మనసంతా చేదయిపోయింది!

మొద్దుబారిన మెదడుతో అట్లాగే.. అక్కడే ఎంత సేపు కూర్చుండిపోయానో నాకే తెలీదు.

ఇందాకటి వస్తాదు మళ్లీ వచ్చాడు. నన్ను చేతులు పట్టుకుని లేపి చిత్రమైన దారుల  గుండా నడిపించుకుంటూ వెళ్లి ఓ పడవలాంటి కారులో కుదేశాడు. తనూ డ్రైవింగ్  సీటులోకి వెళ్లి కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేసాడు.

బండి మూవ్ అయే టైములో పరుగెత్తుకొచ్చింది ఎక్కణ్ణుంచో దుర్గ. తెరిచి ఉన్న కారు విండో గుండా తల లోపలికి పెట్టి చిన్నగా అంటోంది  'డిక్కీలో దరిద్రం శానా ఉంది నాయనా! అయ్య బ్యాంకు తప్పును దాంతో కడిగేసెయ్యి! ఒక్క  అయ్యదే కాదు.. నిన్ను రొష్టుపెట్టిన త్రాష్టులందరి తప్పుల్నీ దాంతో  సుబ్బరంగా కడిగిపారేసెయ్యి!'

'ఎందుకురా తల్లీ  అవన్నీ కూడా మీకు? మీ సొమ్ము. మీ దగ్గరే..'

'నీ కాడే ఉండనీయి నాయినా! నాకు తెలిసి దొంగ నీళ్లస్వామి చేసిన మంచి  పని ఇదే మొట్టమొదటి సారి! నీ ఇల్లు చల్లంగా ఉండాల ! అమ్మకు నా నమస్కారాలు చెప్పు! అక్కకు నా ముచ్చట్లు గుర్తుచెయ్! చిన్నోడికి నా తరుఫున 'ఇది'వ్వడం మాత్రం మర్చిపోవద్దు నాయనా!' అంటూ కటిక్కున నా బుగ్గ మీదో ముద్దు పెట్టేసి తల బైటకు తీసేసుకుంది.

కారు ఎప్పుడు వేగం పుంజుకుందో తెలీదు. బుగ్గలు తడుముకుంటే చెక్కిళ్లంతా తడి.. తడి! నీళ్ల స్వామి కూతురు కన్నీళ్ల తడి!

***

-కర్లపాలెం హనుమంతరావు

25 -03 -2021

(రచన  మాస పత్రిక డిసెంబర్, 2009లో ప్రచురితం)


; నిర్వచనం -నిర్వహణ - కర్లపాలెం హనుమంతరావు



సృష్టి-పునఃసృష్టి జీవనం కొనసాగింపుకు అవసరమయిన   సహజచర్యలు. మానవేతర జంతుజాలం తమ వంటి  జీవులను మాత్రమే సృష్టించ గలిగితే… ఇతర  రూపాలనూ, శబ్దాలనూ సృష్టించే ప్రతిభ మనిషికి అదనం. సంతాన సృష్టికి ప్రతిభతో పని లేదు.అవి జంతుజాలాలు కూడా చేసే సృష్టికార్యమే. ఇతరేతర శబ్ద, రూపాల పునఃసృష్టికే ప్రతిభ తప్పనిసరి. ఆ  ప్రతిభనే మనం 'సృజన' అని అనుకుంటున్నాం. ఆ ప్రజ్జ్ఞ గలవారిని  సృజనశీలురుగా గుర్తిస్తున్నాం. స్రష్టలు అని పేరు పెట్టుకుని గౌరవించుకుంటున్నాం.

కళాకారులందరూ స్రష్టలే. స్రష్టలు కన్నా  ముందు మనుషులు కూడా. మనుషులందరూ కళాకారులు కారు. కాలేరు. కొద్దో గొప్పో ప్రతి మనిషిలో కళంటూఏదో  ఒకటి దాగుండక పోదు గానీ..ఆ పిసరంత  కళయినా  బహిర్గతమైనప్పుడే అతనికి అంతో ఇంతో   కళాకారుడిగా సమాజంలో   గుర్తింపొచ్చేది. 

సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడు డిస్కార్టిస్టు ‘ఉనికి’ (Cogito ergo sum) పేరుతో ఓ సిద్ధాంత తయారుచేశాడు. దాని ప్రకారం మనిషి సృజనశీలి అయినా .. ఆ సృజనకు పొదుగు అనేది అతని 'బుద్ధి'నుంచి పుట్టుకురావాల్సిందే. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అస్తిత్వసిద్ధాంతం కూడా దాన్నే సమర్థిస్తున్నది.  

నేను అంటూ   ఒకడిని భౌతికంగా ఉండబట్టే కదా నాది అంటూ ఒక ఆలోచన ఉండే అవకాశం. ఉనికి వాదం (I exist.. therefore I think)  మనిషిని  బుద్ది విశిష్టుడిగా  కన్నా ముందుగా సృజనశీలిగా గుర్తిస్తుంది. ఇద్ది దాదాపుగా  జెన్ తత్త్వమే. మన  భారతీయుల భక్తి యోగాలకు కూడా ఈ ఉనికివాదనతోనే చుట్టరికం. 

హేతువు కన్నా  ముందు   అనుభూతికే మనిషి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూస్తున్నాం. ఎందుకిలా? అంటే .. ఏమో ఇదో అంతుబట్టని రహస్యం అంటున్నారు ఇప్పటి వరకు విశ్వవ్యాప్తంగా  ఉండే వేదాంతులంతా.  కానీ సృజన విషయం  అట్లా కాదు. స్థూలంగా  ఒక అభిప్రాయానికి రావడం కొంత సులభమే!  శ్రీశ్రీ ‘దివ్యానుభూతి’ ఖండిక తరహాలో  కవితాత్మకంగా చెప్పుకోవాలంటే   సృజన ‘సంకుల పయోధర  చ్చటా పంకిల నిబి- డాంధకార నిర్జన వీధికాంతరముల- నా చరించెడు వేళ-  ప్రోన్మత్త రీతి  అవశమొనరించు దివ్యతేజోనుభూతి’. ఇది స్వీయానుభూతి. ఆ అనుభూతినే ఎదుటివాళ్లకు ప్రసారం చెయ్యాలంటే?

లేనిదాన్ని సృష్టించడం, ఉన్నదాన్ని మరో రూపంలో సృష్టించడం, చూసిన వాటిని చూడని వాటిల్లోకీ, చూడని, చూడలేని వాటిని చూసిన వాటిల్లోకి తర్జుమా చేసి  తన్మయత్వం చెందేటట్లు చెయ్యడం, వగైరా ట్రిక్కులతో ఇది సాధ్యం.  అయితే ఇక్కడ ఒక ప్రమాదం కద్దు. ‘సరసియై చల్లనై నన్ను జలకమార్చె' అంటూ మహాకవి శ్రీశ్రీ తరహాలో కొత్తగా ఏదన్న సృజనాత్మకంగా చెప్పబోతే కొంత మంది ' ఆ సరసి ఎవరు? ఎక్కడుంటుంది? చిరునామా ఏంటి?' అని విచారణలకు దిగవచ్చు. శుద్ధ లౌకికులకు అంతుపట్టని అనేక లక్షణాలు సృజనాత్మక అంశంలో దాగుంటాయి. అవి అర్థం కాక తలపట్టుకునే ఇహలోక చింతకులకు మాత్రమే సృజన ఒక పనికిమాలిన దండుగ వ్యవహారం. నిజంగా సృజన ఒక దండగ వ్యవహారమా? 

ఆహర, నిద్ర, మైథునాధులే కాదు విరామం కూడా నిరంతరాయంగా అనుభవించలేడు మనిషి. వద్దంటే డబ్బు సినిమాలో ప్రారంభంలో పేదరికంతో అష్టకష్టాలు పడ్డ కథానాయకుడు ఒక దశ నుంచి దశ తిరిగి వద్దన్నా డబ్బు వచ్చి పడుతున్నప్పుడు రూపాయి బిళ్లను చూసి బెదిరిపోతాడు. మనిషి చపలచిత్తం మీద వ్యంగ్యాస్త్రాలు సంధించనట్లున్నా ఆ చలన చిత్రం మనిషిలోని కుదురులేని వైనాన్ని కళ్లకుకట్టిస్తుంది. నిశ్శబ్దం ఉండలేక  విసుగెత్తినప్పుడు మనిషి అందుకే శబ్దాన్ని సృష్టించుకుంది. శబ్దంతో మనసు సంక్షుభితమయినప్పుడు  సాంత్వన కోసం  ముక్కూ, మూతీ మూసుకున్ని కూర్చున్నదీ  అందుకే.   ఆ ప్రత్యేక శబ్దాలను  కవిత్వం  ఈ విశిష్ట నిశ్శబ్దాన్ని యోగాసనాలని   ఓ ప్రత్యేక నాదాన్ని సొంతంగా సృష్టించుకుని  రాగాలాపనలోకి జారుకుంటాడు.  కొత్త లయలూ, భంగిమలూ, కదలికలూ ఆవిష్కరించుకుని  నృత్యం పేరుతో సొంతలోకంలో విహరిస్తాడు. అనుకరణే కావచ్చు కానీ అనుసృజన అనిపించే చిత్రాలు, శిల్పాలు సృష్టించుకుని మురుస్తాడు. కవిదీ అదే వరస.’భావ మనియెడు నెత్తావి బలిసియున్న-మేలు రేకుల విప్పారు పూలు మేము’ అంటూ వాస్తవ జగత్తును అనుసరిస్తూనే   కొత్త కొత్త పదాలతో, వ్యక్తీకరణలతో  నూత్నప్రపంచమొకటి  సృష్టించుకుని అందులో  ఆనందాలను వెదుక్కుంటాడు. అనుకరణ కన్నా అనుసృజన మానుషకళలోని  చెప్పుకోదగ్గ గొప్ప ప్రజ్ఞావిశేషం.


అస్తిత్వ సిద్దాంతం  పైపై చూపులకి -  ప్రజ్ఞ, విజ్ఞానం అభాసాలంకారాల్లాగా ఎడపెడగా అనిపిస్తాయి కానీ అది నిజం కాదు.  మహా మేధావి ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ వయోలిన్ బ్రహ్మాండంగా వాయిస్తాడు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త భాభా చిత్రకళ ప్రావీణ్యం అత్యద్భుతం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్,  బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చర్చిల్ చక్కటి ప్రకృతి చిత్రకారులు. కళాభినివేశమంటూ మెలుకువతో ఉండాలే గానీ బుద్ధి ఏ రంగంలో పనిచేస్తున్నా  సృజనతృష్ణ( creative urge) మరో రూపంలో  బైటపడి తీరుతుంది. ‘సృజనశీలత ఆయాచిత వరంగా దక్కిన అదృష్టవంతులు..లౌకిక వృత్తిలో రాణిస్తూనే..ప్రవృత్తి పరంగా అలౌకిక  లోకాల్లో ఆత్మానందాన్ని వెదుక్కుంటో విహరిస్తుంటార’నేది మనోవైజ్ఞానిక శాస్త్ర౦ నిర్థారించిన సత్యం.

కవి ఒక కమనీయ కావ్యం, చిత్రకారుడు ఒక   అద్భుత చిత్రం, నర్తకీమణి ఒక  రమణీయ రూపకం, సంగీతవేత్త ఒక మహత్తరమైన రాగం, శిల్పి ఒక అనల్పమైన విగ్రహం..కల్పించటానికి అహోరాత్రాలు నిద్రాహారాలను నిర్లక్ష్యం చేసి  ఎందుకంతగా శ్రమిస్తాడంటారు?! ఎన్ని కష్టనష్టాలొచ్చి పడ్డా ఆ శ్రమ నుంచీ విముక్తి కోరుకోడు ! ఎందుకు ?! ‘చల్లని వేళ సత్కవి విశాలమనంబునయందు బుట్టి సం/ ఫుల్లత నొందు హల్లకము పోల్కి నొకళ్ళ మొకళ్ళ మోలిమై/ నల్లన మేము విచ్చుచునుందుము’ అంటో  లోపల్నుంచీ ఉడుకులెత్తే సృజనశక్తి హోరెత్తిస్తుంటే ఆ వత్తిడి నుంచి  ముక్తి పొందటానికి ఇలా    ఏదో కళారూపంలో  భౌతికసృష్టి జరగాల్సిందే- కనక.


కొందరు ఎందుకంత సులభంగా  సృజనశీలులై పోగలరు? ఇంకొందరు  ఎందుకు ఎంత  తన్నుకులాడినా ఒక్క మంచి  కల్పనా చేసి వప్పించలేరు?! అనేదింకో  సందేహం. ప్రశ్నంత   సులభం కాదు సమాధానం. 


అనువంశికతో, మానసికతో, బాహ్య పరిసరాల అనుకూలతో, కార్యరూపం దాలిస్తే మరేమన్నాఇతరేతర ప్రేరేపక శక్తుల శబలతో..  ఇతమిత్థంగా ఇదీ అని నిర్థారించడం కుదరని ఇంకేవైనా  కారణాలో కావచ్చు – అనేది ప్రముఖ రసతత్త్వవేత్త  సంజీవ్ దేవ్ జీ మతం.  జన్మతః సృజనశీలత ఉండీ..పరిసరాల ప్రభావం వల్లా, ప్రతికూల పరిస్థితులవల్లా సంపూర్ణంగా వికసించని ప్రచ్ఛన్న కళాకారులు కొందరైతే..పుట్టుకతో పట్టుబడక పోయినా పట్టుదలవల్ల, అనుకూల పరిస్తితుల చలవ చేత , శిక్షణ ద్వారా రాణించిన, రాణిస్తున్న కళాకారులు ఇంకొందరు సమాజంలో మన మధ్యనే  సదా  సంచరిస్తుంటారు’అనేది ఆయన వాదం. కాదనలే౦ కదా!


ఐతే సృజనకార్యంలో తలమునకలైన వాళ్ళంతా కళాకారులే ఐనా.. సహజప్రతిభకి.. బుకాయింపు కళకి మధ్య చాలా అంతరం ఉంటుంది. అసలు కళను ఆ ‘కళే’ పట్టిస్తుంది. సహజ స్రష్ట మదిలో సదా త్యాగయ్యలో మాదిరి  ఓ ఆనందజ్వాల ప్రజ్జ్వలిస్తుంటుంది.  వీరబ్రహ్మంగారి జీవితం లో వలె బౌతిక పీడలు వాళ్ళ అంతఃచేతనను ఎంత   మాత్రం  ప్రభావితం చేయలేవు.  సందు చూసుకుని  మరీ  అన్నమాచార్యులవారి  అంతరంగ తపన లాగా ఇంకేదో  ఉత్కృష్ట రూపంలో విస్మయంగా  బైటికి తన్నుకొచ్చే తీరుతుంది. చెరసాల  పీడ  గోపన్నలోని రాగజ్వాలను మరింత ప్రజ్జ్వలింప చేయడం ఇందుకు ఉదాహరణ. 


కళాకృతులను అమితంగా ప్రేమించి ఆరాధించే కళాభిమానులు వాటి సృష్టికర్తలను  సైతం అంతే సమున్నతంగా ఊహించుకోడం సహజం. కానీ  నిజ జీవితాలను సొంత కళాసృష్టంత సమోన్నతంగా నిర్వహించుకోడం ఏ కళాకారుడికైనా ఏమంత తేలిక వ్యవహారం కాదు. తెనాలి రామలింగడు ఎద్దేవా చేసిన ‘కూరగాయల’ కళాకారులు అప్పుడూ ఉన్నారు.ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. నిజ,కళాజీవితాల  ప్రస్థానాలు సరాసరి వ్యతిరేక దిశల్లో ప్రయాణించిన నీరోలు, జౌరంగజేబులు మనకు చరిత్రలో ఉండనే ఉన్నారు. సృజనవేళే వీళ్ళు అపరబ్రహ్మలు. మిగతా వేళల  వట్టి పిండి బొమ్మలు. బ్రహ్మ రాక్షసులు. మామూలు వ్యక్తుల మాదిరే వ్యావహారిక జీవితంలో చిరుకోరికలకూ, చిట్టి పొట్టి తాపాలకూ, చిరాకులకూ, చిన్నాపెద్దా బలహీనతలకూ దాసులు.  రూకల  బొబ్బట్లు, సన్మానపు దుప్పట్లు, అహం చలి కాచుకునేందుకు  వెచ్చని  చప్పట్ల  కుంపట్లు.. వాటికోసం సిగ్గు విడిచి సిగపట్లు..! ఏటి వాలులోనే వీరి నావ వీర విన్యాసాలు. నిలువీత రాకపోతే ఎంత గజీతగాడి పోజు పెట్టినా…ఆటుపోటు లెదురైనాక   బోటు గల్లంతు..

‘ఆదరము తగ్గె దంభమాహాత్మ్యములకు

పక్షపాతపు రచనల పస నశించె

రసికులకు మీ చరిత్ర విసువు దోచె

పరువుగా నింతట బ్రబంధపురుషులార!

కదలిపొం డెటకైనను..మీకు

నేటి కావ్యప్రపంచాన చోటు లేదు’ అంటూ   కాలప్రవాహం దయాదాక్షిణ్యాలకే  అలాంటి మిడతంభొట్లగుంపు నొదిలేయడానికి మించిన మహత్తర కార్యం మరోటి లేదు.


అట్లాగని  లోకమంతా  ఆషాఢభూతుల బంధుగణంలో  నిండి ఉందన్న నిస్పృహా శుభం కాదు.    ఇంత వైవిధ్యవిలాసాలతో విలసిల్లుతున్న సృష్టి ఎన్ని లక్షల స్వచ్చమైన కళాకారుల సృజనపునాదుల మీద నిర్మాణమవుతుందో అర్థం చేసుకోవాలి. కామించిన సుందరి ‘చీ.. పొమ్మన్న్దం’దుకు గోపాలుడి నడ్డమేసుకుని జావళీలు సృష్టించిన క్షేత్రయ్యలు  ఈ కళాక్షేత్రంలో కొల్లలు. అన్నహారాలు మాని అన్నమిచ్చిన వాని పుణ్యాన్ని రోజుకోతీరులో  సంకీర్తించిన  పదపితామహులు అన్నమయ్య సాహిత్యలక్ష్మిపాదాలకి అలంకరించిన మువ్వల  మాటేమిటి!  దుండగుల కెదురుగా  నోరు తెరవాలంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్లున్న గడ్డుకాలంలో సైతం సామాజిక దురాచారాలను ఆటవెలదుల నోటితో కడిగి పారేసిన ప్రజావేదాంతి వేమన పద్యాల సంగతో! చెప్పాలంటే చేటభారతమంత. ఆ మాటకొస్తే  భారతంలో మాదిరి కళాభారతంలో కూడా ఉత్తరకుమారులున్నట్లే..ఉదాత్త కర్ణులూ..ఏకలవ్యులూ ఉన్నారు.ఉంటారు. ఎవరి దారి ఆదర్శనీయమో అనుసరణీయమో నిర్ణయించుకొనే విజ్ఞత మాత్రం ఎవరిది వారిదే.


సహృదయంతో చూడాలే కాని..నిజ జీవితాలని  సొంత  కళాకృతులను మించిన నిబద్ధతతో నిర్వహించుకున్న స్రష్టలూ .. మనకు కళాసాహిత్య రంగాలనిండా శతసహస్రాలు. అందరిలో అసామాన్యంగా వెలిగే సుగుణదీపం-  సృజన నిత్య నూతన వికాసం.  సాయంగా  .. సమీక్ష, సహనం, నిజాయితీ, నిబద్ధత. కళాజ్యోతుల నిజ జీవితాల్లో ఆలోచనల అనుభూతుల కలబోత  కొట్టొచ్చినట్లు కనిపించే మరో కిరణపుంజం.  ఉత్తమ కళాకారుడు ఉత్తమ మానవుడు కూడా అయితే సమాజానికి సదా ఆదర్శప్రాయుడమతాడు.

 చిత్తశుద్ధితో నమ్మిన జీవన ఉదాత్త సూత్రాలను  ఆచరించి చూపించిన కళావైతాళికుల చరిత్రలో మనకు ఎందరో కనపడతారు. వారి  అడుగుజాడల్లో నడవడానికి కళాకారులకు .. కవులకు ఎవరడ్డొస్తున్నట్లు?


‘నడవడకయ నడచివచ్చితి

నడచిన నే నడచిరాను నడచెడునటులన్

నడిపింప నడవనేరను

నడవడికలు చూచి నన్ను నడిపింపరయా!’అంటూ సృజన  మూర్తే కవి ,కళాకారుడి నడవడికకు  తానెంతగా ప్రాధాన్యత  ఇస్తుందో స్వయంగా వెల్లడించింది. 


పరిసరాల ప్రభావాలెంత ప్రతికూలంగా ఉన్నా స్వయంప్రతిభతో  ఆ సృజనమ్మ పిలుపునందుకుని ఎత్తుల కెదిగే ప్రయత్నం సొంతంగా  చేసుకోవడం కళాకారుడి  చేతుల్లోనే ఉంది. అవే చేతులతో సాటి సహోదరులకూ చేతనైనంత  చేయూతనిచ్చి పైకి చేదుకోవటం కూడా సృజనశీలత ఇంకా సజీవంగానే ఉన్నదని నిరూపించుకునే రుజువు . 

***


- కర్లపాలెం హనుమంతరావు 


నారికేళపాకం - ఆవశ్యకత -కర్లపాలెం హనుమంతరావు

 

కావ్యం ఒక జగత్తు.

లోకంలోని మిట్టపల్లాల మాదిరే కావ్యాలలోనూ ఎగుడుదిగుడులుంటాయి. అనివార్యం. కావ్యజగత్తు, బౌతిక జగత్తు అన్యోన్యాశ్రయాలు. బౌతిక జగత్తు లేనిదే కావ్యజగత్తు లేదు. కావ్యజగత్తు వినా బౌతిక జగత్తుకు వెలుగూ లేదు.

ఇహ కావ్యరసాల విషయానికి వస్తేః

గుత్తి నుంచి ద్రాక్షపండును ఇట్టే కోసి నోట్లో వేసుకోవచ్చు. అరటిపండు ఆరగించడం అంటే గెల నుండి కోయడమే కాకుండా, తోలు వలుసుచుకొనే కొంత ప్రయాస తప్పదు. కొబ్బరికాయ దగ్గరి కొచ్చే సరికే ఆ ప్రయత్నం మరింత  అవసరం. కావ్యపాకాల తంతూ ఈ తరహాలోనే ఉంటుందంటుంది అలంకారశాస్త్రం!

లోకంలో ద్రాక్షపండుతో మాత్రమే సర్దుకుపోతున్నామా మనమందరం! ప్రయత్న పరిమితిని బట్టి సాఫల్య పరిమితి. ఆ సూత్రం అవగతమయిన వారితో వాదు లేదు. కానివారితోనే లేనిపోని పేచీ. ఆనందం కోసమే కావ్య పఠన అనుకున్నప్పుడు.. ఆ ఆనంద రసానుభవానికి బుద్ధి తాలూకు వైవిధ్యం మరంత విశిష్టత చేకూరుస్తుంది.  ఆ వైశిష్ట్యంలోని అంతస్తుల అమరిక అర్థమవకో.. వద్దనుకొనే భావన వల్లనో అయోమయమంతా.

'భోజనం దేహి రాజేంద్ర! ఘృతసూపసమన్వితమ్ /మాహిషం శరచ్చంద్రచంద్రికా ధవళం దధి'అన్న శ్లోకంలోని మొదటి భాగం ఒక్కటే కాదు.. రెండో భాగమూ సమన్వియించుకోవాలి. అదీ సాహిత్యవేత్త లక్షణం.

ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, ఒక్క ద్రాక్షాపాకంలో మాత్రమే కవిత్వం ఉండాలనే  కవిత్వానికే అన్యాయం చేయడమవుతుంది. కదళీపాకం వరకు చదివి ఆనందించేవారితో కూడా కవిత్వానికి సంపూర్ణ న్యాయం జరిగినట్లు కాబోదు. నారికేళపాకం కోరుకొని ఆస్వాదించి ప్రోత్సహించినప్పుడే ఉగాది సంబర ప్రసాదం వంటి కవిత్వం రూపుదిద్దుకొనేది. అయితే ఆ అంతస్తు చేరుకోనే చదువరికి శబ్దశక్తి పట్ల అవగాహన మాత్రమే సరిపోదు.. రసనిష్ఠ సహకారమూ అనివార్యం.

నారికేళపాక రసాస్వాదనకు ప్రాచీన కావ్యజగత్తులో అగ్రతాంబూలం. ఆ గౌరవం అందుకునేటందుకు చదువరికి ముందు అవసరమయేది శబ్దార్థపరిజ్ఞానమే అయినప్పటికీ, అంతకన్నా ముఖ్యమైనది ప్రాక్తనసంస్కారం. ఇది సంపన్నమయివున్నప్పుడే నారికేళపాక రసస్వరూపాన్ని సమగ్రంగా స్వానుభవంలోకి తెచ్చుకొనే భావాత్మ బలం పుంజుకునేది. పాండిత్య శబ్దవాచ్యతా, రసికపదలాంఛనప్రాప్తీ కొరవడుతున్న వాతావరణంఎ కఠినపాకం, బీరఆఆఆపీచుక్రమమనే అలంకార శాస్త్రం ఉగ్గడించని విచిత్ర పదాలు పుట్టుకురావడానికి కారణం.

దోషం కావ్యసృజనలో లేదు. ఉన్న మెలికంతా రసాస్వాదన అసక్తత వల్ల సంభవించిందే!

- కర్లపాలెం హనుమంతరావు

22 -05 -2021

(శ్రీపాదవారి కావ్యజగత్ భావన)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...