Sunday, December 12, 2021

 

రామాయణంలో మందుల వేట

-కర్లపాలెం హనుమంతరావు

 

ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధంలో 67 కోట్ల రామ సైన్యంతో సహా రామలక్ష్మణులు సైతం మూర్ఛపోయారు. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు  బాగా గాయపడ్డారు. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న రామసేన  మధ్య విభీషణుడు , ఆంజనేయుడితో బతికున్న కోతులు, భల్లూకాల కోసం వెతుకుతుంటే   జాంబవంతుడు కంటబడ్డాడు. 'ఎట్లా ఉన్నావు పెద్దాయనా?' అని విభీషణుడు అడిగిన మీదట 'గొంతును బట్టే నిన్ను గర్తుపట్టడం! కంటి చూపు కూడా మిగల్లేదు ఇంద్రజిత్తు దెబ్బకు. ఆంజనేయుడు బతికే ఉన్నాడా?' అని జాంబవంతుడు అడిగాడు. విభీషణుడుకి ఆశ్చర్యం కలిగించింది. 'రామలక్ష్మణులకన్నా నీకు ఆంజనేయుడే అంత ఎక్కువ ఎప్పుడయ్యాడు?' అని దెప్పితే 'అదేం కాదయ్యా మహానుభావా! హనుమంతుడు  ఒక్కడు బతికి ఉంటే మన  సేనంతా చచ్చీ బతికున్నట్లే. లేకపోతే వానర, భల్లూకం జాతికి ఇహ భూమ్మీద నూకలు లేనట్లే.. అదీ లెక్క!' అన్నాడు. అనుభవంలో, వయసులో అందరికన్నా పెద్దవాడు జాంబవంతుడు. తాత దగ్గరకొచ్చి పాదాభివందనం చేసిన  వాయునందనుడితో జాంబవంతుడు 'పగలు పన్నెండు గంటల కాలాన్ని  ప్రాతఃకాలం, సంగవం, మధ్యాహ్నం, అపరాహ్ణం, సాయాహ్నం అనే ఐదు విభాగాలుగా విడగొట్టారు మన కాలజ్ఞులు. ఐదో భాగం సాయాహ్నంలో సహజంగానే రాక్షస ప్రవృత్తికి బలం జాస్తి.  ఇంద్రజిత్తు ముందు మన శక్తి తగ్గడానికి అదే కారణం. అదీగాక ఆ దుర్మార్గుడు  వదిలిన బ్రహ్మాస్త్రం మీద గౌరవంతో నీకు లాగానే రామలక్ష్మణులూ తాత్కాలికంగా లొంగినట్లు నటిస్తున్నారు! మీరంతా నిజానికి అజేయులు.  నా దిగులు దిక్కూ మొక్కూ లేని వానర, భల్లూక జాతి నిష్కారణంగా రణం పేరుతో విలువైన ప్రాణాలు వదులుకోవలసి వస్తున్నదనే. తోకలు, చేతులు, తొడలు, పాదాలు, వేళ్లూ, శిరస్సులూ, తెగిపడి, రక్త మూత్రాదుల మద్య మృత్యు పర్వతంలాగా పడి ఉన్న వీళ్లందర్ని తిరిగి బతికించుకునే ఉపాయం ఒక్కటే ఉంది హనుమంతూ!   ఈ లంక నుంచి మహాసముద్రం మీదుగా యోజనాల పర్యంతం  వ్యాపించి ఉన్న  ఉత్తరం దిక్కు ఆవలి అంచున    ఋషభ పర్వతం, కైలాస శిఖరం అని రెండు పర్వతాలు ఉన్నాయి. ఆ  కొండల మధ్యన అత్యంత విలువైన ఓషధీ గుణాలుండే మూలికలు, మొక్కలతో నిండిన ఓషధీ పర్వతం కూడా ఉంది. దాని నడి నెత్తిన పది దిక్కులనూ ప్రకాశవంతం చేస్తూ నాలుగు మందు మొక్కలు .. మృతసంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి ఉన్నాయ్! విశల్యకరణి శిధిలమయిన శరీరకణాలను బాగుచేస్తుంది. సువర్ణకరణి వల తేజం పెరుగుతుంది. సంధానకరణి విరిగిన ఎముకలను అతుకేయడానికి ఉపయోగిస్తారు. మొదట చెప్పిన మృతసంజీవని   నిర్జీవులకు ప్రాణదానం చేస్తుందంటారు.ఏదో ఒక ఔషధం మన  వానర, భల్లూక సేనకు ప్రస్తుతం అత్యవసరం. నీ మీదనే మా అందరి ఆశ!' అనగానే ఆంజనేయుడు అమాంతం ఉబ్బితబ్బుబ్బయిపోయాడు.  పర్వతాకారానికి పెరిగిపోయాడు. వాయువేగంతో ఓషదీ పర్వతం వైపుకు దూసుకుపోయాడు.

 

హనుమంతుడి దూకుడు దెబ్బకు దారిలోని పర్వత శిఖరాలు భూమ్మీదకు విరుచుకు పడి మండిపోవడం, శిఖరాగ్రాన ఉండే బండరాళ్లు  కిందకు దొర్లిపడ్డం.. హాలివుడ్ మూవీ క్లైమాక్సును మరిపించే విధంగా ఉన్నాయా దృశ్యాలన్నీ.

 

త్రికూట పర్వతాల నుంచి హనుమంతుడు మేరుపర్వతం లాంటి మలయపర్వతం పైకి ఎగబాకిన పద్ధతికి అనేక జలపాతాలు, మహావృక్షాలు, దట్టమైన లతలెన్నో ఛిన్నాభిన్నమైన తీరు వర్ణనాతీతం. 60 యోజనాల ఎత్తున్న ఆ పర్వతం పైన దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, మునులు, అప్సరసలు నివాసముంటారు. అక్కడ సంచరించే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు సైతం భయం పుట్టించేలా ఆంజనేయుడు శరీరం పెంచేసుకుని వెళ్లిన ఆ స్థలం బ్రహ్మ నివసించే గృహం, ఇంద్రుని సుఖించే భవనం, రుద్రుడు విలాసార్థం బాణాలు వదిలే స్థలం కూడా! హయగ్రీవుణ్ని అక్కడే ఆరాధించేది. శివుడు బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించి  పడగొట్ట్టిన స్థలం కూడా అక్కడే ఉంది. సూర్య కిరణాలు రాత్రంతా విశ్రాంతి తీసుకునే వసతి సౌకర్యాలన్నీ చక్కగా అమరివున్న ఆ స్థలంలోనే ఒకప్పుడు ఆంజనేయుడికి బ్రహ్మదేవుడు, ఇంద్రుడు చేత వజ్రాయుధం ఇప్పించింది. సూర్యకాంతితో సమానమైన కుబేరుని నివాసం, ఛాయాదేవి ప్రీతి కోసం   కాంతి తగ్గించేందుకు సూర్యుణ్ణి విశ్వకర్మ శాణం(గుండ్రంగా తిరిగే ఆకురాయి) పైకి ఎక్కించేందుకై బంధించిన స్థలం కూడా అక్కడే ఉంది. బ్రహ్మాసనం, కైలాసవాసుని ధనుస్సు దాచి ఉంచిన పాతాళ ప్రవేశద్వారం సైతం అక్కడే ఉండటం మరో విశేషం. ఇవేవీ ప్రస్తుతం ఆంజనేయుడు చూసి ఆనందించే మూడ్ లో లేదు.  కైలాసపర్వతం, హిమవచ్ఛిల, ఋషభపర్వతం, మేరుపర్వతం.. వాటి మధ్యన సమస్త ఓషధులతో ప్రకాశిస్తూ కనిపించే ఓషధి పర్వతాన్ని పట్టుకోవడమే ప్రస్తుత ధ్యేయం.

 ఓషదీ పర్వతం కనిపించింది. కాని, జాంబవంతుడు చెప్పుకొచ్చిన  ఓషదులేవీ ఆంజనేయుడికి ఎంత శ్రమించి వెదికినా కనిపించలేదు. వేలకొలదీ యోజనాలు దాటి తమ కోసం ఎవరో అంత అట్టహాసంగా రావడంతో ఓషధీపర్వతం పైనున్న మందుమొక్కలు ముందు ఆశ్చర్యపోయాయి. ఆనక  అతగాడెవడో మాయగాడని భయపడి ఎవరికీ కనపడకుండా దాగుండిపోయాయి.

వెదికి వెదికి విసిగిన ఆంజనేయుడు గుడ్లెర్రచేసాడు చివరకు 'మా రాముడికి సాయం చేసేందుకు నిరాకరించంచడం నాకెంతో ఆగ్ర్రహం తెప్పిస్తోంది. నాలాంటి కోతికి కోపం తెప్పిస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు అనుభవించండి' అంటూ ఒక పెడ్డబొబ్బ పెట్టి లక్షలాది  వృక్షాలతో, ఏనుగులతో, బంగారంతో, వేలకొలది  ధాతువులతో నిండి ఉన్న ఆ ఓషధి పర్వతం మొత్తాన్ని అమాంతం తన చేతుల మీదకు ఎత్తుకుని వాయువేగంతో ఆకాశం వైపుకు దూసుకు వెళ్లిపోయాడు.

సూర్యకాంతితో వెలిగిపోయే ఓషధీ పర్వతాన్ని చేత బట్టి గగనమార్గంలో సూర్యుడికి దగ్గరగా ఎగురుతోంటే ఇద్దరు సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తున్న భ్రాంతి. పర్వతంలాంటి ఆంజనేయుడు మరో వెలిగే పర్వతాన్ని అరచేతిలో పెట్టుకుని  ఆకాశ మార్గంలో  ఎగురుతుంతే వేయి  అంచులు గలిగిన విష్ణుచక్రం గగన తలంలో గిరిటీలు కొడుతున్నంత గొప్ప భావన.

తమ హనుమను  చూసీ చూడగానే భూమ్మీదున్న అశేష వానర సేన  ఉత్సాహంతో హాహాకారాలు చెయ్యడం చూసి ఆంజనేయుడు నోటమాట రాకుండా

పోయింది! 

***

అదెట్లా? ఆంజనేయుడు ఓషధులున్న పర్వతం కిందకు దింపక ముందే అన్ని కోట్ల మంది మృత రామ సేనకూ ప్రాణాలు ఎవరు ప్రసాదించినట్లు స్వామీ? ఎంత కతకైనా కొంత చెవులూ ముక్కులూ వుండాలి కదా గురువా?

 

అక్కడే ఉందిరా శిష్యా తిరకాసంతా? మహా మహిమాన్వితుడైన హనుమంతులవారు ఉత్తమ ఓషధులతో  నిండిన ఋషభ పర్వతంతో తమ జాతి మధ్యన నేలకు దిగక ముందే దూమ్ దేవ్ బాబా ఒకరు తమ పోతాంజలి బ్రాండ్ తయారీ మందు మృత కోతి సేన పైన ప్రయోగించారు శిష్యా!'

'నమ్మేదేనా గురువా ఈ  కత?'

'నమ్మాలి .. తప్పదు. కరోనా వైరస్ విషయంలో ప్రపంచం అంతా కిందా మీదా పడుతోంటే మన పుణ్యభూమిలో మాత్రం.. ఆ మహమ్మారికి విరుగుడుగా అదే పనిగా ఔషధాలు విడుదలవుతున్నాయా లేదా? పేర్లెందుకులే ..పెద్ద పీకులాటవుతుంది కానీ.. పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఇప్పటికే తాము కరోనాపై విజయం సాధించే మందులను ప్రయోగాలు నిర్వహించి మరీ సిద్ధం చేసేశామని ప్రకటించేస్తున్నాయ్ కదా!  కేంద్ర ప్రభుత్వ ఆమోదమూ ఉందని అమ్మకానికి విడుదల చేస్తున్నాయి. ఆయుర్వేద రంగమూ మందుల తయారీలో తానే  ముందున్నానంటూ కోతాంజలి బ్రాండు ఒకటి   తెర పైకి తెచ్చేసింది.. చూడలేదా? ఏదో 'నిల్' పేరుతో ఆర్భాటంగా విడుదలయిన ఆ   మందును వాడలేదా?

త్రేతాయుగంలో ఆ నారాయణ బృందం చేసిన చికిత్సలకు మెచ్చే కలియుగంలో  కరోనా వైరస్ మహమ్మారి నిదానానికి శాస్త్రీయ విధానాల ఫలితాలతో నిమిత్తం అక్కర్లేని  ఓషదులు విడుదల చేసుకునే మరో సువర్ణావకాశం సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రమూర్తే  కల్పించినప్పుడు.. నువ్వు  సందేహించావో దైవద్రోహం కింద నీకు కఠిన శిక్ష సిద్ధంగా ఉంటుంది. ముందు నోరు ముయ్యి శిష్యా.. ముందు ముందు కీడేమీ జరగకూడదనుకుంటే!

 

-కర్లపాలెం హనుమంతరావు

13 -10 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...