నీ కాడే ఉండనీయి నాయనా! - కథానిక- కర్లపాలెం
హనుమంతరావు
నీ కాడే ఉండనీయి నాయనా!- కథానిక (మొదటి భాగం)
-కర్లపాలెం హనుమంతరావు
బస్ ఆత్మకూరు చేరేసరికి తెల్లారింది. బస్టాండ్
వెనకాలే లాడ్జ్. రిఫ్రెషయి మళ్ళీ నందిపాడు వైపెళ్లే బస్సు పట్టుకునే వేళకు ఎండ
చిరచిరలాడుతోంది.
బస్సు నిండా జనం. కరటంపాడు కరణంగారు నన్ను చూసి
పక్కనున్న సాహేబును లేపి సీటిప్పించాడు.
లేచి నిలబడ్డ సాహేబ్జీ గుర్తు పట్టి సలామ్ చేశాడు.
'ఆశ్రమానికేనా?' అని అడిగాడు కరణంగారు. తనూ ఇంట్లో ఆడాళ్లకు వంట్లో బాలేక స్వామివారి దర్శనానికి తీసుకెళుతున్నట్లు
చెప్పుకొచ్చాడు.
'సాయబ్ గారూ! మీరూ..?' అనడిగాను.
'బస్సులోని అందరం అక్కడికే సాబ్!'
అన్నాడు నవ్వుతూ సాహెబ్జీ.
నీళ్లస్వామివారి మీద సినీ స్టైల్లో పాటలు..
అనుగుణంగా భక్తుల భజనలు! బస్సులో వాతావరణం
హోరెత్తిపోతోంది.
ముందు సీటాయన దగ్గరున్న కరపత్రం అందుకున్నా.
దాన్నిండా 'నీళ్లస్వామి'వారి మహిమలే మహిమలు!
'..నమ్మి సేవిస్తే సంకటాలు
తొలుగుతాయి. నమ్మని మూర్ఖులకు సుఖశాంతులు నశిస్తాయి..'అంటో
ఏవేవో పిట్ట కథలు కాగితమంతా!
కరణంగారేదో చెప్పుకుపోతున్నాడు తన ధోరణిలో '..చక్రాలపాడు
శీను తెల్సు కదా సార్! అదే.. మీ టైములో నక్సలైట్లలో తిరిగేవాడు. వాడిప్పుడు
స్వామివారికి ప్రథమ శిష్యుడు. నెల్లూరు నుంచి జమీన్ రైతొచ్చేదీ! దాని సబ్-ఎడిటర్..
రామిరెడ్డి ప్రస్తుతం స్వామివారి పరమ
ఆప్తుడు. నీళ్లస్వామివారి హవా అట్లా ఉంది మరి.
మూడేళ్ళ కిందటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాసార్ నేను! అయినా
నీళ్లస్వామివారి కృప వల్ల మళ్లా మా ఆడోళ్లు
నీళ్లోసుకోడానికి తయారవుతున్నారు. నాలుగు నెల్ల బట్టి వస్తున్నాం. ఇంకో
అరడజను సార్లన్నా దర్శనం తప్పదంటున్నారు'
'అన్ని నెల్లు గర్భమేవిఁటండీ!
డాక్టరు కొకసారన్నా చూపించారా?' అడిగాను ఆశ్చర్యంగా!
'గజగర్భం.. అట్లాగే ఉంటుందంటగదా
సార్! డాక్టర్లకు చూపిస్తే పెద్ద ప్రాణానికే మొప్పం అన్నారు. ఏదో.. స్వామివారినే నమ్ముకునున్నాం' చేతి వేలికున్న పగడపు ఉంగరం భక్తిగా కళ్లకద్దుకున్నాడా కరణంగారు.
'మా బేటాకు ముందు నుంచి నాలిక
మంచిగ మడతబడదు సాబ్! స్వామీజీ ఇచ్చిన పానీ తీన్ మహీనే తీసుకుంటే బరాబర్.. జీభ్ సాఫ్ హో జాతా హైఁ ..
బోలే కోయీ! వస్తా ఉన్నాం! యేఁ దూస్రీ
బార్..!' అంటున్నాడు సాహెబ్జీ.
'ఫలం కనిపించిందా?'
లేదన్నట్లు గాల్లోకి చెయ్యాడించాడా సాహేబ్జీ.
నమ్మకాలకు మతాలు అడ్డం కావు కాబోలు మన దేశంలో!
నందవరంలో బస్సెక్కిన నాయుడుగారు నన్ను చూసి
షాక్ అయ్యాడు. 'సార్! మీరింకా సర్వీసులోనే ఉన్నారా? ఏదో జైల్లో
ఉన్నావన్నారే!' ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాడు పాపం ఆ
మానవుడు షాకులో.
బండి టోల్ గేట్ ముందాగింది. బడబడా బస్సులో
కెక్కిన కుర్రాళ్లు కొందరు ప్యాసింజర్ల అంగీలకు స్టిక్కర్లింటించేస్తున్నారు డబ్బు
వసూలు చేసుకుని. ఆ హడావుడిలో నాయుడుగారు నన్నొదిలేశాడు.
'స్టిక్కర్లు లేకపోతే క్యూలో
నిలబడనీయరు. అక్కడైనా ఇదే గోల. ముందే తీసేసుకోండి సార్! ఓన్లీ ఫైవ్ రుపీస్!'
అంటూ కరణంగారి వచ్చీ రాని ఇంగ్లీషు.. మధ్య
మధ్యలో! పైసలు పుచ్చుకుని స్వామివారి బొమ్మున్న ఓ స్టికర్ చొక్కా జేబుకు అంటించిపోయాడో కుర్ర వలంటీర్!
'ఇక్కణ్నుంచీ అడుగడుక్కీ ఇట్లా
ముడుపులు చెల్లించుకుంటూ పోవాల్సిందే!'అన్నాడు సాహెబ్ గారు.
రోడ్డుకు ఎడా పెడాగా ఉన్న మోటార్ పంపుల నుంచి
జారే నీళ్ళల్లో జనాలు స్నానాలు చేస్తున్నారు. స్నానానికి ఇరవై. 'దీని'కైతే ఐదు.. 'దీని'కైతే రెండైదులు' అంటూ
సాహెబ్జీ వేళ్లు చూపి వివరించే పద్ధతికి నవ్వాగింది కాదు నాకు.
'అంతా బిజినెస్సయిపోయిందిలే సార్
ఇవాళా రేపూ! మునుపీ రూటులో మిర్చి లోడు లారీలు తప్ప ఇంకేవీ తిరిగేవే కాదు. చీకటి
పడితే చాలు దొంగల భయం. ఇప్పుడో! కార్లు, స్కూటర్లు.. అబ్బో..
ఒహటనేమిటిలే! ఆటోల సంగతైతే ఇక చెప్ప పనేలేదు. స్వామివారి పుణ్యమా అని తలా ఓ రకంగా బాగుపడుతా
ఉన్నారు.'అన్నాడు కరణంగారు.
'మరే! మర్రిపాడు కాణ్ణుంచీ ఈడ
దాకా అంతా ఇసక పర్రే కదండీ! ఎకరా ఐదువేలన్నా కొనే నాథుడుండేవాడు కాదా జమానాలో.
ఇప్పుడో? రెండు లక్షలిస్తామని గడ్డం పట్టుకున్నా లొంగే కుంకే
లేడు' అని వంత అందు కున్నాడు నాయుడుగారు.. మళ్లీ ఎప్పుడొచ్చాడో
గానీ!
వాళ్లూ వాళ్లూ మాటల్లో పడిపోయారు.
నాయుడుగారంటున్నాడు 'కావలి ఎం.ఎల్.యే రామారెడ్ది పెళ్లాన్ని తీసుకొని ఇటేపొస్తున్నట్లు
తెలిసిందయ్యా! వేరే చోటయితే మన మాటకు దొరకడు. ఇక్కడైతే ఈ నీళ్ళస్వాములారితో ఓ ముక్క చెప్పించినా
పనయిపోతుంది. ఇంజనీరింగ్ కాలేజీ ఈజీగా పెట్టించెయ్యచ్చు.. ఉదయగిరిలో! ఇంతకీ ఈ
బేంకాయన ఎందుకొస్తున్నట్లో ఏమైనా తెలిసిందా?' అంటూ నా
గురించి మళ్లీ కరణంగారి చెవులు కొరకడం మొదలెట్టాడు.
అతగాడేం చెబుతున్నాడో నా ఊహకందక పోలేదు. నా
మనసు పదేళ్లు వెనక్కి మళ్లింది.
-కర్లపాలెం హనుమంతరావు
(మొదటి భాగం అయిపోయింది)
నీ కాడే ఉండనీయి నాయనా!- కథానిక (రెండో భాగం)
-కర్లపాలెం హనుమంతరావు
బోరబండ శాఖలో పనిచేస్తుండగా హఠాత్తుగా
ధర్మారావుపల్లి శాఖకు బదిలీ అయింది. నెల్లూరుకు పడమరగా బాంబే హై వే మీద ఆత్మకూరుకు
దగ్గరగా ఉంటుందా కుగ్రామం. ఆ శాఖ లావాదేవీలన్నీ ప్రధానంగా చుట్టుపక్కల గ్రామాల
పొగాకు సాగుకు సంబంధించినవీ.. టొబోకో
బోర్డుకు చెందినవీ. ప్రభుత్వరంగ బ్యాంకు అవడం మూలాన అరకొరగానైనా గవర్నమెంటు
స్కీముల కింద రుణాలు కొన్ని అచ్చుకోక తప్పని పరిస్థితి.
కేంద్ర రుణమాఫీ పథకం వచ్చి.. పోయిం తరువాత
మళ్లా ఆ తరహా మాఫీలేమైనా వస్తాయన్న బేఫర్వా పెరిగింది జనాలకు; సొమ్ము
సమకూరినా అప్పులు తీసుకున్న వాళ్ళు
అస్సలు కిస్తీలు కట్టే ఆలోచనే చేసేవాళ్ళు కాదు.
దరిమిలా మొండి బకాయీలు కుప్పగా పేరుకుపోయున్న స్థితిలో నేను బ్రాంచ్ ఛార్జ్ తీసుకున్నా.
పిల్లల చదువులు భంగమవుతాయని హైదరాబాదు నుంచి
ఫ్యామిలీని కదల్చలేదు. ఊళ్లోని బ్యాంకు క్వార్టర్సులోనే ఒంటరి నివాసం.
పని దినాలు ఎట్లాగో గడిచిపోయేవి.
శనాదివారాలప్పుడే సమస్య. కాఫీ, టిఫెన్ల కోసమైనా కాకా హోటల్సుకెళ్లక
తప్పేది కాదు. అదిగో అప్పుడు తగిలాడు 'బర్రెల సాంబయ్య'.
సాంబయ్యకు సొంతానికి పాడి లేదు. ఊరివాళ్ల
బర్రెలను మేపుకు బతికేవాడు. అందుకే అతగాడు
బర్రెల సాంబయ్యగా ప్రసిద్ధం. మగ బిడ్డలు
ఇద్దరుండీ ప్రయోజనం శూన్యం. పెద్దాడు వేరే దేశం వెళ్లి చేతికందకుండా పోతే, రెండో
ఉద్ధారకుడు దేశం మీద ఊరేగడానికి ఎటో వెళ్లాడు. ఎక్కడున్నాడో తెలీనైనా తెలీదు
పదేళ్ల బట్టి. పెళ్లాం కూతుర్ని కని
సాంబయ్య నెత్తికి రుద్ది
కన్నుమూసింది.
'ఆడబిడ్డతో అగచాట్లుగా ఉంది
సామీ! ఒక్కయిదేలు అప్పుగా ఇప్పించమ'ని వచ్చిన ప్రతీ మేనేజరు
కాళ్లూ గడ్డాలు పట్టుకునేవాడుట బర్రెల సాంబయ్య.
ఆ దఫా నా వంతయింది.
'ఇంత మంది అప్పులు తీసుకుని ఎగేస్తుంటిరి కదా! ఒక్క ఈ సాంబయ్య మొహానే
ఎందుకు మొద్దులు పెట్టడం?' అనిపించింది నాకెందుకో. బ్యాంకు లోను
తీయించి రెండు బర్రెలు ఇప్పించా.
పెద్ద సంతలో వాటిని మూడు వేలకు అమ్మేసుకుని
చెప్పాపెట్టకుండా మాయమయ్యాడు మహానుభావుడు! వాడి కూతురు 'దుర్గ' నేనెప్పుడు నడి రోడ్డు మీద
కనపడ్డా ఒహటే శాపనార్థాలు. ఎవరెంత వారించినా వినేది కాదు. ఆ పిల్లకు అప్పుడు పదమూడు పథ్నాలుగేళ్లుంటాయేమో!
తెలిసీ తెలీని ఈడు!
ఓ
నెల్రోజులు జల్సా చేసి అబ్బ తిరిగి రావడంతో ఆమె కోపం కొంత చల్లారింది! కానీ.
ఎందుకో మనిషి ఎదురుపడితే మాత్రం మిడి
గుడ్లేసుకుని నొసలు చిట్లిస్తూ ముక్కూ మూతీ తిప్పుకోడం మాత్రం మానేది కాదు.
ఆ ఎండాకాలం సెలవులకు పిల్లలు ఊరు చూద్దామని
ఉబలాట పడుతూంటే ఓ నెల్లాళ్లు ఉండి పోతారులెమ్మని తీసుకొచ్చా. ఆ నెల రోజులూ సాంబయ్య కూతురే మా ఇంట్లో పనిమనిషి.
నా పెద్ద కూతురు దాదాపుగా దుర్గ వయసుది.
ఇద్దరికీ బాగ ఖత్తు కలిసింది. దాంతో దుర్గ
పద్దస్తమానం మా ఇంట్లోనే చనువుగా తిరగడం సాగించేది. వాళ్లబ్బకు లోనిచ్చిన కోపం
అప్పటిగ్గాని నెమ్మదిగా తగ్గింది కాదు నా మీద. మా పిల్లలను చూసి తానూ
నన్ను 'నాయనా!' అనీ, ఆవిడ్ని 'అమ్మా' అనీ పిలుస్తుండేది పిచ్చిది. మొదట్లో అదోలా ఉన్నా మెల్లిగా ఆ పిలుపే మా ఇద్దరిక్కూడా బాగుందనిపించింది.
తిరిగి వెళ్లే సమయంలో మా ఆవిడ దుర్గకు రెండు
లంగాలు, ఓణీలు కొత్తవి కుట్టించి మా పాప చేత ఇప్పిస్తుంటే భోరుమని ఏడ్చేసింది ఆవిడను కావిటేసుకుని పసిపిల్లలా. ఆ దృశ్యం
ఇప్పటికీ నాకు బాగా గుర్తే. 'ఈ పల్లెటూళ్ల జనాల కక్షలే కాదు,
ఆపేక్షలు మన నగర జీవులకు ఓ పట్టాన అర్థం కావండీ!'అంది మా ఆవిడ.
మా బాబు చేత
ఓ వెయ్యి రూపాయలు దుర్గ చేతిలో పెట్టించబోయా వాళ్లు బస్సెక్కేపోయే ముందు.
ఊహూఁ.. తీసుకుంటేనా! వద్దని మొండికేసింది! 'ఈ సొమ్ము కళ్ల బడితే ఇంకేమైనా
ఉందా? మళ్లా మా తాగుబోతు అయ్య ఊరొదిలి పోడా! నీ కాడే ఉంచు
నాయనా! గాజులూ, పూసలకేగా నా ఆశంతా! కావాలంటే నిన్ను కాక
ఇంకెవర్ని అడుక్కుంటా!' అని ఆ పిల్ల మళ్లా వల వలా ఏడుపు!
ఒక రోజు కేషియర్ గుప్తా భయంకరమైన వార్తొకటి
పట్టుకొచ్చాడు ఊళ్లోకి. గతంలో ఇక్కడ మేనేజరుగా చేసి పోయిన సెల్వరాజన్ అనే
అరవాఫీసర్ ఒకాయన 'రుణమాఫీ
పథకం' స్కామ్ లో
చిక్కుకుని ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నాట్ట. ఇన్నేళ్లుగా కోర్టుల్లో పోరీ
పోరీ రెండు రోజుల కిందటే సుప్రీమ్ కోర్టులో కూడా చుక్కెదురయ్యే సరికి.. ఆ నిస్పృహ
తట్టుకోలేక పెన్నాలో దూకేశాట్ట!
ఆ టాపిక్కే హాట్ హాట్ గా కాకాహోటల్లో చర్చ
జరుగుతుంటే 'బ్యాంకు అప్పు తీసుకునే వాడికి కేవలం బ్యాంకు అప్పు మాత్రమే! ఇచ్చే మా
బ్యాంకాఫీసర్లకు అది సెటిలయే దాకా మెడకేలాడే యమపాశం!' అన్నాను.
ఆ టైములో బర్రెల సాంబయ్య అక్కడే ఉన్నాడు.
ఆ తరువాత నాలుగు రోజుల కనుకుంటా.. ఓ శనివారం మధ్యాహ్నం పూట నేను
బ్యాంకులో ఒక్కణ్ణే కూర్చుని పని చూసుకుంటుంటే పిల్లిలా లోపలికొచ్చాడు సాంబయ్య.
రొంటి కింద దాచిన మూట విప్పి నా ముందు
పరిచాడు. అన్నీ వందా,
యాభై నోట్లే! 'అప్పుకు కట్టేసుకో సామీ! ఇంకా
ఏమైనా ఉంటే నీ ఇష్టమొచ్చిన కాడికి నువ్వే ఏం చేసుకుంటావో చేసుకో!' అన్నాడు.
'ఇంత సొమ్ము నీ కెక్కడిదయ్యా?'
అని గద్దిస్తే 'మా సంగం పిల్లోడు పంపించాడులే
సామే!' అంటూ మళ్లీ మాట కందకుండా మాయమైపోయాడు.
మొత్తం పదమూడు వేల పై చిలుకు
లెక్కేస్తే! సాంబయ్య అప్పు కాతాకు క్రెడిట్ స్లిప్పు రాసి, గుప్తా
ఇంట్లో ఇచ్చేసి నేను హైదరాబాద్ వచ్చేశా. జీతం రాగానే అట్లా వెళ్లి రావడం నా నెలచర్య.
సోమవారం తిరిగొచ్చే వేళకు ఊళ్లో సీనంతా
పూర్తిగా మారిపోయి ఉంది. ఊరు మీద వసూలుచేసిన ఇంటిపన్ను రొక్కం బిల్ కలెక్టర్
సుబ్రహ్మణ్యం పంచాయితీ ఆఫీసు బీరువాలో పెట్టి.. ఫోనొస్తే పక్క రూములోకి వెళ్లి
మాట్లాడుతున్నాట్ట! తిరిగొచ్చేసరికి ఆ మొత్తం మాయమయింద'ని
గగ్గోలు.
పద్దస్తమానం ఆఫీసు వరండాలో పడి దొర్లే బర్రెల సాంబయ్య మీదకు పోయింది బోర్డు
ప్రెసిడెంటు నాయుడుగారి దృష్టి. పూటుగా తాగించి చింత చెట్టుక్కట్టి చితక్కొడితే 'సొమ్మంతా
బ్యాంకు సారు చేతిలో పోశా' అని బావురమన్నాట్ట సాంబయ్య!
పోలీసులొచ్చి వాణ్ణి పట్టుకుపోయారు.
ఊళ్లోకి దిగడమే ఆలస్యం; సర్పంచి
బస్టాండులోనే నన్ను పట్టుకుని నిలదీశాడు. 'సాంబయ్య అప్పుకి
జమేసింది పోగా మిగిలిన పదమూడు వేలు ఎక్కడ నొక్కినట్లో చెప్పమని నిలదీస్తుంటే
నిలువుగుడ్లు పడిపోయాయ్ నాకైతే. సాంబయ్య అప్పుకు పోగా మిగిలింది మూడు వేలే! అదీ
అతగాడి కూతురు దుర్గ పేరుతో ఉన్న కాతాలో జమయింది. ఆ మాటే అంటే నమ్మడే!
గొడవ నెల్లూరు డివిజినల్ ఆఫీసు దాకా పోవడం, ఆ
మర్నాడే విచారణ బృందం దిగిపోవడం!
అప్పటికప్పుడే నన్ను రిలీవ్ చేసి కరీంనగర్
బదిలీ మీద పంపించేశారు!
ఆ తరువాత జరిగిన విచారణ కమిటీలు, ఎవరికీ
తెలిసే అవకాశం లేని నివేదికలు.. వాటి మీద చర్యలు!
అందుకే ఇందాక నందవరం నాయుడుగారు నన్ను నేరుగా
శ్రీకృష్ణ జన్మస్థానం పంపించేసుకున్నది తన మధురోహల్లో! ఈయనే అప్పట్లో
ధర్మారావుపల్లి సర్పంచ్! నా మీద చర్యల కోసమై పదే పదే పై వాళ్ల మీద ఒత్తడి
తెచ్చింది కూడా ఈ మహానుభావుడే!
-కర్లపాలెం హనుమంతరావు
(నీ కాడే ఉండనీయి నాయనా!- కథానిక- రెండో భాగం
అయిపోయింది)
***
నీ కాడే ఉండనీయి నాయనా!- కథానిక (మూడో భాగం)
-కర్లపాలెం హనుమంతరావు
ప్రస్తుతం నేను హైదరాబాదు జోనల్ ఆఫిసులో
పనిచేస్తున్నా. రిటైర్ మెంట్ గడువు దగ్గర పడుతోంది. సర్వీస్ రికార్డ్సన్నీ సెట్
రైట్ చేసుకుని సిద్ధంగా ఉండకపోతే ఆఖరి నిమిషంలో ఇబ్బందవచ్చు. గతంలో నేను పనిచేసిన
శాఖలన్నిటిలోని మొండి బాకీలకు సంబంధించిన వ్యవహారాలు ఒక్కటొక్కటే చక్కబెట్టుకుంటూ
వస్తోన్నా. ఆ క్రమంలోనే ఓ రోజు పొదలకూరు
నుంచి కేషియర్ గుప్తా ఫోన్! ఈ
నీళ్లస్వామిని గురించి సమాచారం అందించిందీ అతగాడే!
'నందిపాడు కవతల కడప రూట్లో
బ్రాహ్మణపల్లికి దగ్గర నీళ్ల స్వామి
ఆశ్రమం ఒకటి మహజోరుగా నడుస్తున్నది సార్! ఆ స్వామి దగ్గర చాలా మహత్తులున్నాయని
పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందీ ఏరియాలో! పుట్టు గుడ్డోళ్లకు, మూగ మొద్దుల క్కూడా చూపూ మాటా ఇట్టే ప్రసాదించే మానవాతీతుడని గట్టిగా
నమ్ముతున్నారు జనం. స్వామి మంత్రించి ఇచ్చిన జలప్రసాదం సేవిస్తే ఎట్లాంటి మొండి
రోగాలైనా ఇట్టే లొంగొస్తాయని మా వైపు మైకులు పెట్టుకుని మరీ
హోరెత్తిచ్చేస్తున్నారు. ఈ నీళ్లస్వామి
మహిమకు మంచి పేరున్న మా పొదలకూరు
ఫెర్టిలిటీ సెంటరే మూతబడిపోయిందిప్పుడు.
నేనూ ఆశ్రమానికి వెళ్లొచ్చా. మీరూ ఓ సారి వెళ్ళి రండి. మీ సమస్య తీరుతుందని
నాకనిపిస్తోంది' అంటూ రోజుకో కొత్త విశేషం చెప్పుకు రావడంతో
ఈసారి నేను ఈ ప్రయాణ పెట్టుకున్నది కూడా.
బస్సు ఆశ్రమం ముందాగడంతో జనం బిలబిలా
దిగిపోతున్నారు. ఆ హడావుడికి ఈ లోకంలోకి వచ్చిపడ్డా. నేనూ దిగిపోయా.
ఎటు చూసినా అంగళ్లే! పూజా సామాగ్రి నుంచి పాటల
కేసెట్ల దాకా అన్నిటి అమ్మకం జోరుగా సాగుతోన్నది. అంతా ఒక పెద్ద సంత వాతావరణం.
'ఆదివారం కదా! ఇట్లాగే ఉంటుంది'
అంటూ కరణంగారు ఓ పంపు దగ్గరికి పరుగెత్తారు. వగరుస్తూ వగరుస్తూ ఓ
చిన్న ప్లాస్టిక్ కేన్ నిండా పంపు నీళ్లు పట్టుకొనొచ్చారు.
కేన్ పాతిక రూపాయలు. 'అన్నింటికీ
ఫిక్సడ్ రేట్స్! అదేమని అడిగితే దాష్టీకం చేస్తున్నారు.' అని
భార్యతో సహా వెళ్లి క్యూలో నిలబడ్డాడు గొణుక్కుంటూ. అర కిలోమీటరుంది ఆ క్యూ.
ఈ క్యూలో నిలబడి లోపలి దాకా పోవడం నాకు ఈవేళ
ముగిసే పనేనా?
మనసు లోలోపల పీకుతోంది. అందరి చేతుల్లోనూ నీళ్ల కేనులున్నాయి.
లేనిది నా చేతిలోనే. అనుమానం
వచ్చినట్లుంది.. ఓ వస్తాదుకు. దగ్గరిగా వచ్చి 'నీళ్లేవీ?'అనడిగాడు మొరటుగా.
ఏమని చెప్పడం? చెబితే నన్నక్కడ
నిలబడనిస్తాడా?
మాటల కోసం తడుముకుంటుంటే అనుమానం మరింత
హెచ్చింది. పక్కకు తీసుకెళ్లి వళ్లంతా తడిమి చూశాడు. సెల్ ఫోను, కళ్ల జోడు, పర్సు,
ఇంకేవో కొన్ని పేపర్లు మాత్రమే కనిపించే సరికి ఏం చేయాలో తోచింది
కాదనుకుంటా అతగాడికి. మెయిన్ గేట్ దాకా తోసుకుంటూ వచ్చాడు. అప్పుడు కనిపించిందా
అమ్మాయి.
నన్ను చూసి ఒక్క క్షణం షాకయినట్లుంది. వెంటనే
తేరుకుని నవ్వు మొహంతో దగ్గరికొచ్చింది.
'దర్శనం అయిందా?' అనడిగింది. తలడ్డంగా వూపా నిరాశగా. ఎదో కాల్ వచ్చిందింతలో తనకు.
'హాల్లోకి తీసుకెళ్లు!
నేనొస్తున్నా!' అంటూ ఇందాకటి వస్తాదుకు పురమాయించి తనెటో
హడావుడిగా వెళ్లిపోయింది.
ఇందాక నెట్టుకుంటూ తీసుకొచ్చిన వస్తాదే ఇప్పుడు
అతి మర్యాద ప్రదర్శిస్తూ నన్ను ఓ హాల్లోకి తీసుకువెళ్లాడు.
'ముందు దర్శనం' అన్నాను టైం చూసుకుంటూ. పక్క గది చూపించి వెళ్లమన్నట్లు ఓ డోర్ తెరిచి
నిలబడ్డాడు మాటా పలుకూ లేకుండా.
అక్కడ అన్నసంతర్పణ లాంటిది ఏదో జరుగుతోంది.
పంక్తి మధ్యలో ఉన్న ఒక ఆడమనిషి హఠాత్తుగా విరుచుకుపడిపోయింది. మొహాన ఇన్ని నీళ్లు
చల్లారెవరో. తెప్పరిల్లి లేచి నిలబడింది. పూనకం వచ్చిన మనిషికి మల్లే ఊగిపోతూ
నీళ్లస్వామివారి దయ వల్ల తనకు
బిగుసుపోయిన కాళ్లు రెండూ ఎట్లా మళ్లీ స్వాధీనంలోకొచ్చాయో.. చిలవలు పలవలుగా
కథలు చెబుతోంది పెద్ద గొంతేసుకుని. నీళ్లస్వామికి గోవిందలు కొడుతున్నారు
తన్మయత్వంతో వింటూ భక్తజనులందరూ. అంత తాదాత్మ్యతలో కూడా విస్తట్లోని పదార్థాలు ఖాళీచెయ్యడంలో అశ్రద్ధ
చూపించడం లేదే భోక్తా!
'తింటారా?
ఉచితం' అన్నాడు వస్తాదు ముక్తుసరిగా.
'ముందు దర్శనం' అన్నాను మళ్లీ అసహనంగా. అవతల మళ్లీ నెల్లూరు దాకా వెళ్లాలి. రాత్రి
తొమ్మిదికే తిరిగెళ్లవలసిన ట్రైన్. మరో గది చూపించి తలుపు తీసి వెళ్ళమన్నట్లు సైగ
చేశాడీ సారి వస్తాదు.
వెళ్లాను. అక్కడ దర్శనమిచ్చాడు నీళ్లస్వామి..
భక్తబృందం మధ్య కొలువు తీరి. మరో దిక్కు
నుంచి క్యూలో వస్తున్న భక్తుల కేనుల్లో స్వామి ఎడం చేయి వేలుముంచి తీయగానే స్వామివారి ఆంతరంగికులు ముందుకు
నెట్టేస్తున్నారు. స్వామివారికి చెరో పక్క నిలబడ్డ మరో ఇద్దరు ఆంతరంగికులు పట్టి
నిలబడ్డ జోలెల్లో యధాశక్తి తోచింది వేసి ముందుకు కదులుతున్నారు సందర్శకులు.
భక్తులకు మించి వాలంటీర్ల సందడే అధికంగా ఉందక్కడ.
'భోజనం చేశావా నాయనా?' అని అడిగింది ఇందాకటి ఆమ్మాయి మళ్లీ ప్రత్యక్షమై. నేను బదులు చెప్పేలోగానే చొరవగా నా చెయ్యి
పట్టుకుని మరో గదిలోకీ తీసుకెళుతూ 'ముందు నువ్వు భోజనం
చెయ్యడం ముఖ్యం. అసలే నీకు షుగర్ కూడానూ. అవునూ! షుగర్ అట్లాగే ఉందా ఇంకా ఏమైనా
పెరిగిందా నాయనా?' అని ఆడిగింది ఆప్యాయంగా ఆ అమ్మాయి. తనే
విస్తరి వేసి చికెన్ బిర్యానీ
వడ్డించింది. రెండు రోజుల నుండి సరైన ఆహారం లేకుండా ఉందేమో గబగబాలాగించేసింది
కడుపు.
'కాస్సేపు కునుకు తీయండి నాయనా! దర్శనాలు అయేసరికి ఎంత
లేదన్నా రెండు గంటలు దాటుద్ది' అంటూ మరో గదిలోకి
తీసుకువెళ్లింది.
అదేదో విఐపిల గెస్ట్ రూమ్ లా ఉంది. ఎ.సి, డబుల్
కాట్స్ తో యమ పోష్ లుక్. ఇందాకటి
స్వామీజీ పక్కనున్న వాలంటీర్స్ లాంటి వాళ్లే మరో ఇద్దరు అదే రకం జోలెల్లో నుంచి
కార్పెట్ మీద కుమ్మరించిన సొమ్మును డినామినేషన్ ప్రకారం విడదీసి కట్టలు
కడుతున్నారు. మధ్య మధ్యలో వచ్చే బంగారపు ఉంగరాలు, గొలుసులు,
గాజుల్లాంటివి విడిగా తీసి మరో వేటికి సంబంధించిన ప్లాస్టిక్
బుట్టలో వాటిని పడేస్తున్నారు. వయసులో చిన్నతను కొద్దిగా నోటితో విసుగుదల ధ్వనించే
శబ్దాలు రెండు సార్లు చేయగానే పెద్దతను మందలిస్తున్నట్లు చిన్న స్వరంతో
అంటున్నాడు 'ఇంకా
ఇట్లాంటి జోలెలు కనీసం నాలుగైనా వస్తాయిరా
సన్నాసీ! అప్పుడే అలిసిపోతే ఎట్లా?'
బ్యాంకులో నిత్యం నోట్ల కట్టల మధ్యనే
బతుకీసురోమని వెళ్లదీసే నాకు ఈ డర్టీ 'డఫ్' విలువ
తెలీకేంం కాదు గానీ, ఈ కోణంలో చూడడం ఇదే మొదటి సారి అయే
సరికి కొద్దిగా షాక్ తగిలిన మాట నిజమే!
ఈ లెక్కన ఈ నీళ్లస్వామివారి ఆదాయం కోట్లలో
ఉంటుందేమో! అందుకే కోటలాంటి ఆశ్రమం గట్రా ఏర్పాటయింది. ఇంత మంది వందిమాగధులని మేపడమంటే మాటలు కాదు. ఈ హంగూ ఆర్భాటాలు చూసే కదా సినిమా జనం, వ్యాపారస్తులు,
రాజకీయాల్లో నలిగేవాళ్లు, విదేశీ కుబేరులు,
ప్రభుత్వ అధికారుల్లాంటి వాళ్లు చుట్టూ మూగుతున్నది!
సుమారు నాలుగ్గంటల ప్రాంతంలో స్వామివారు ఈ
గదిలోకి వేంచేశారు.
మనిషిలో పెద్ద మార్పేమీ లేదు. అప్పట్లానే
సన్నగా, రివటలా పొట్లకాయను మరింత సాగదీసినట్లున్నాడు. స్వామి రాకతో తతిమ్మా జనమంతా
యాంత్రికంగా బైటకు వెళ్లిపోయారు.
నన్ను గుర్తు పట్టేడో లేదో తెలీదు. నేను వచ్చిన
పని చెప్పాను. 'అప్పట్లో బ్యాంకులో తీసుకున్న లోను వడ్డీ తిరుగుళ్లన్నింటితో కల్సి మొత్తం
పాతిక వేలు దాటింది. అప్పు తాలూకు నోటు కూడా మురిగిపోయిందెప్పుడో. ఇదిగో..
తిరగరాసిన పత్రం.. నేనే తయారు చేసి తెచ్చా. ఎవరి చేతనైనా చదివించుకుని కుడి చేతి బొటన
వేలు ముద్ర ఒకటి ప్రసాదిస్తే నా దారిన నే పోతా!' అన్నాను
వినయంగా.. సాధ్యమైనంత వరకూ నా వెటకారం బైటపడకుండా!
నా మాటలు నాకే వింతగా వినిపించాయి. బర్రెల
సాంబయ్యను నిలదీయాలనుకున్నదేమిటి? ఈ నీళ్లస్వామిని బతిమాలుకుంటున్నది ఏమిటి?
చేతిలో చిల్లి గవ్వ లేని మనిషిని అప్పు
తీర్చమని దబాయించానప్పుడు. డబ్బు నీటిలో తడిసి ముద్దయే మనిషిని కిస్తీ అయినా కొంత కట్టమని అడిగేందుకు
జంకుతున్నానిప్పుడు! ఎంతలో ఎంత మార్పు!
అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ముందు నా బ్యాంకు
హోదా ఎంతలా చిన్నబోయిందో కళ్లక్కట్టినట్లు
కనిపిస్తూందిప్పుడు. భక్తులెంతగానో తపించే ఈ నీళ్లస్వామి సన్నిధానం నాకు మాత్రం
మహాచెరగా ఉంది ప్రస్తుతం. ఎంత తొందరగా ఈ నరకం నుంచి బైటపడదామా అన్నదే నా
అంగలార్పు!
నోటు అందుకున్నాడు నీళ్ల స్వామి ఉరఫ్ బర్రెల
సాంబయ్య. మాటా పలుకూ లేకుండా పరపరా చించేశాడు .
నేను షాక్!
'ఇంకా ఎన్నున్నాయి సామీ అట్లాంటి
కాయితాలు నీ కాడ? అదే.. నా లాంటి
దగుల్భాజీ సరుకు కట్టకుండా ఎగనూకిన అప్పు తాలుకు కాయితాలు?' అని
అడిగాడు. ఆ అడగడంలో ఏ భావమూ తోచలేదు నాకు.
ఈ వారం రోజుల బట్టీ ఊళ్ల వెంట పడి పడి తిరిగి సేకరించుకున్న మొండి
బకాయీల తాలుకు రెన్యువల్ ప్రామిసరీ నోట్లు సుమారు ముప్పై దాకా ఉంటాయ్. గతంలో
బ్యాంక్ మేనేజర్ హోదాలో పని చేస్తున్నప్పుడు నేను వివిధ శాఖల్లో ఇచ్చిన అప్పులన్నీ
సక్రమంగా ఉండాలి. అప్పుడే నా ఉద్యోగ విరమణ ఫైల్ క్లియరయ్యే మాట. అందుకే నాకీ
అవస్త!
'అయ్యోయ్! ముంబయ్ నుంచి ఆ సినిమా
అమ్మాయిని చంపిన మొగుడొచ్చి కూకున్నాడు. ఇంకా ఎంత సేపు వెయిటింగంటూ గంతులేస్తా
ఉండాడు సచ్చినోడు!' అంది ఇందాకటి అమ్మాయే మళ్లీ వచ్చి .
'పడుండనీలేవే.. మొదనష్టపోళ్లని! కమ్మంగా
సంసారం చేసుకోడు ఏ మగ సచ్చినోడూ! మదం.
నమ్మి తాళి కట్టించుకున్న పాపానికి నీళ్లతొట్టెలో ముంచేసి సంపేయడమేంటి సామీ
బంగారం లాంటి ఆడబిడ్డను! ఇప్పుడేమో
యములాడి పాశం గుర్తుకొచ్చి వణికి చస్తావుండాడు. కాసులు కుమ్మరించేస్తే పెంట
సెంటయిపోతుందని ఈ డబ్బు పిచ్చోళ్లందరికీ అహం! చివరాఖర్లో పురుగులు పడి సస్తారని
ఎవుడికీ కానదు సత్యం! సడేలే! ఈ గోల మనకెప్పుడూ
సచ్చేదేలే! అంత దూరం నుంచి పడతా లేస్తా వచ్చిండు. ముందు మన సామి పని
సక్కబెట్టాల! ఆనకే అవన్నీ!' అంటూ స్వాములోరి దుస్తులు
సర్దుకుని పైకి లేచాడు బర్రెల సాంబయ్య! వంగి
నా పాదాలు తాకి నిశ్శబ్దంగా బైటికి వెళ్లిపోతుంటే ఎట్లాగో అనిపించింది.
నా అనుమానం నిజమే! ఈమె ఆనాటి అమ్మాయి.. దుర్గ!
ముందు
నన్ను చెడ తిట్టిపోసి ఆనక 'నాయనా.. నాయనా'
అంటూ సొంత బిడ్డ కన్నా ఎక్కువగా వెంపర్లాడిన రాక్షసి బిడ్డ. నన్ను మించి ఎదిగిన తల్లి!
ఒక్కసారి అభిమానం పొంగుకొచ్చేసింది. దగ్గరకు తీసుకుందామా.. వద్దా అన్న సంశయంలో ఉందగానే.. తనే హఠాత్తుగా నా పక్కకొచ్చి కూర్చొని భుజం మీద తలపెట్టింది.
నిమిషం తరువాత కాని తెలిసింది కాదు భుజాలు తడుస్తుంటే.. తను
భోరుమని ఏడ్చేస్తుందని! దుర్గ మొహం
చేతుల్లోకి తీసుకుని వారించే ప్రయత్నం చేస్తుంటే నా కళ్ళ సముద్రం కరకట్టలే తెగడం
మొదలుపెట్టాయ్! ఎంత సేపట్లా కూర్చుండి పోయామో.. ఇద్దరం మాటా పలుకూ లేకుండా అక్కడే!
బైట అలికిడికి తేరుకుని లేచింది దుర్గ. ఇందాక
కనిపించిన సన్యాసుల చేత నా అప్పు
పత్రాలన్నీ అక్కడే చింపిపోగులు పెట్టించింది ముందు. 'ముక్క
మిగలకుండా తగలెట్టేయండిరా! టాయ్ లెంట్ సింకులో పోసి నీళ్లు కొట్టేసెయ్యండి..పోండి!'
అంటూ వాళ్లకు ఆర్డర్ పాస్ చేసి 'నాయనా! ఒక్క
అయిదు నిమిషాలు' అంటూ బైటకు వెళ్లిపోయింది హడావుడిగా దుర్గ.
పదమూడేళ్ల పసి దుర్గ చాలీ చాలని చిరుగు
దుస్తుల్లో నడి రోడ్డు మీద మగపురుగుల ఆబ
కళ్ల మధ్య సిగ్గుతో చితికిపోతూ పేడ కళ్లు ఎత్తుకుంటున్న దృశ్యం గుర్తుకొచ్చి
మనసంతా చేదయిపోయింది!
మొద్దుబారిన మెదడుతో అట్లాగే..
అక్కడే ఎంత సేపు కూర్చుండిపోయానో నాకే తెలీదు.
ఇందాకటి వస్తాదు మళ్లీ వచ్చాడు. నన్ను చేతులు
పట్టుకుని లేపి చిత్రమైన దారుల గుండా
నడిపించుకుంటూ వెళ్లి ఓ పడవలాంటి కారులో కుదేశాడు. తనూ డ్రైవింగ్ సీటులోకి వెళ్లి కూర్చుని ఇంజన్ స్టార్ట్
చేసాడు.
బండి మూవ్ అయే టైములో పరుగెత్తుకొచ్చింది
ఎక్కణ్ణుంచో దుర్గ. తెరిచి ఉన్న కారు విండో గుండా తల లోపలికి పెట్టి చిన్నగా
అంటోంది 'డిక్కీలో దరిద్రం శానా
ఉంది నాయనా! అయ్య బ్యాంకు తప్పును దాంతో కడిగేసెయ్యి! ఒక్క అయ్యదే కాదు.. నిన్ను రొష్టుపెట్టిన
త్రాష్టులందరి తప్పుల్నీ దాంతో సుబ్బరంగా
కడిగిపారేసెయ్యి!'
'ఎందుకురా తల్లీ అవన్నీ కూడా మీకు? మీ
సొమ్ము. మీ దగ్గరే..'
'నీ కాడే ఉండనీయి నాయినా! నాకు
తెలిసి దొంగ నీళ్లస్వామి చేసిన మంచి పని
ఇదే మొట్టమొదటి సారి! నీ ఇల్లు చల్లంగా ఉండాల ! అమ్మకు నా నమస్కారాలు చెప్పు!
అక్కకు నా ముచ్చట్లు గుర్తుచెయ్! చిన్నోడికి నా తరుఫున 'ఇది'వ్వడం మాత్రం మర్చిపోవద్దు నాయనా!' అంటూ కటిక్కున నా
బుగ్గ మీదో ముద్దు పెట్టేసి తల బైటకు తీసేసుకుంది.
కారు ఎప్పుడు వేగం పుంజుకుందో తెలీదు. బుగ్గలు
తడుముకుంటే చెక్కిళ్లంతా తడి.. తడి! నీళ్ల స్వామి కూతురు కన్నీళ్ల తడి!
***
-కర్లపాలెం హనుమంతరావు
25 -03 -2021
(రచన
మాస పత్రిక డిసెంబర్, 2009లో ప్రచురితం)
No comments:
Post a Comment