- ఏవండీ! .. మారండీ!
- ( ఈనాడు - ప్రచురితం )
- *
- బ్రహ్మదేవుడు ఏ చిరాకులో ఉండి సృష్టించాడోగానీ.. ఆడదాని బతుకు ఎప్పుడూ గండ్రగొడ్డలికింది ఎండుకొమ్మే!
- కిందే కాదు.. పై లోకాల్లో కూడా అతివకు అడుగడుగునా అవమానాలు.. అగ్నిపరీక్షలే!
- బ్రహ్మయ్యకు రిమ్మ తెగులు. పరమేశ్వరుడైతే భార్యకు సగం శరీరం ఇచ్చినట్లే ఇచ్చి.. నెత్తిమీదికింకో గంగానమ్మను తెచ్చి పెట్టుకున్నాడు! నిరంజనుడుది మరీ నిరంకుశత్వం . . కట్టుకొన్నదాన్ని కాళ్లదగ్గరే కట్టిపడేశాడు!
- 'ఆడదానికి స్వాతంత్ర్యం అనవసర'మని ఆ మనువెవడో అన్నాడుట! ఆ ఒక్క ముక్కను మాత్రం మన మగాళ్లకు మా బాగా నచ్చింది ఈ ఇరవై ఒకటో శతాబ్దిలో !
- ఒక్క మగాడనేమిటి! గ్యాసుబండలు, యాసిడ్ బాటిళ్లు, సెల్ఫో న్లు, కెమేరాలు, బూతు సినిమా డైలాగులు , కట్నం వేధింపులు, అత్తల సాధింపులు, అత్యాచారాలు, అతి ఆచారాలు, అనారోగ్యాలు, భ్రూణ హత్యలు, పరువు హత్యలు, లైంగిక వేధింపులు, తక్కువ జీతాలు,పనిభారాలు.. అబ్బో.. జల్లెళ్లోని చిల్లులకన్నా ఎక్కువ కదూ లోకంలో అక్క చెల్లెళ్లో కడగళ్లు!
- వేళకు వండి వడ్డించడానికి, పిల్లల్ని కని పెంచడానికి, ఇంటిని కనిపెట్టి ఉండటానికి, బయట దర్జాలొలక బోయడానికి, వేణ్ణీళ్ల సంపాదనలో చన్నీళ్ళలా తన జీతం కలిపేసుకోడానికి , సినిమాహాలు క్యూలలో టిక్కెట్లు త్వరగా తీయించుకోడానికి, బస్సుల్లో ఆడాళ్ల సీట్లు అక్రమంగా ఆక్రమించేసుకోడానికి , బ్యాంకుల్లో దొంగకాతాలు తెరవడానికి, ఆదాయప్పన్ను లెక్కలు పక్కదారి పట్టించడానికి మాత్రమే భగవంతుడు ఆడదాన్ని తనకు జోడీగా కుదిర్చాడని మగాడి బడాయి !
- బల్లిని చూసి భయపడేంత సున్నితమైన మనసు ఆడదానిది. అయినా బిడ్డకోసం నెలల తరబడి శరీరాన్ని పోషిస్తుంది. కత్తికోతలకు వెరవకుండా ప్రసవానం అనుభవిస్తుంది. గంట పనికి వందలు డిమాండు చేసే వ్యాపారపు లోకంలో పరగడుపున నిద్రలేచింది మొదలు.. రాత్రి పడక ఎక్కే దాకా సహస్రాధిక హస్తమయిగ స్త్రీ శక్తి అందించు సమర్థ శుశ్రూషలకు విలువగట్టడం మొదలుపెడితే..
- పదిమంది అదానీల సంపదలైనా ఒక వారానికి సరిపోతాయా?
- పక్షిగాలిలో ఎగిరినట్లు, చేప నీటిలో ఈదినట్లు , పులి నేల మీద కదిలినట్లు ఆడది ఇంటి ప్రపంచంలో కలిదిరుగుతుంది . అబలగా ఆమె ఇంటి నాలుగు గోడల మధ్య ఇంతి నడిచే దూరం ముందు ఒలంపిక్సు పరుగులైనా బలాదూర్! ఆమె అత్యవసర గృహ వైద్యురాలు. శిక్షణ లేని బిడ్డల ఉపాద్యాయురాలు. అనుక్షణం కంటికి రెప్పలా కన్న బిడ్డలను సంరక్షించే వార్డెను. కష్టంలో ఓదార్చే కౌన్సిలర్ . పెదవి మనసులోని మాటను ఇట్టే పసిగట్టే టెలీపతీ తన స్పెషాలిటీ. . సంసారం విమానమైతే అమ్మ దానికి పైలెట్.. హోస్టెస్సూ. కలికి కామాక్షిలా ఆమె ఒదిగి ఉంటూనే ఏ సంసారమైనా పదిలం.
- ఆధారు కార్డైన ఓ పట్టాన దొరకని నేడు ఆధారపడదగ్గ సుదతి కారు చౌకగ దొరకడం మొగవాడు చేసుకొన్న పుణ్యం.
- మెడలో మూడు ముళ్ళు .. భర్తతో ఏడడుగులు.. పడిన మరుక్షణమే ఇంటిపేరే కాదు.. వంటి తీరూ కట్టుకున్నవాడికి మీదు కట్టే త్యాగి తరుణి !
- రాముడొచ్చే వరకూ రావణాసురుడినయిన గడ్డిపోచగ నిలవరించిన ధీర వనిత నెలత ! కాలి పారాణి ఆరకనే భర్త భాతృ సేవకని దూరముయితే కడలి దుఃఖం కడుపు హద్దులు దాటనీయని నిగ్రహానికి నిలువుటద్దం స్త్రీ . విగత జీవి పతికి తిరిగి బతుకు దారి దొరుకు వరకు మృత్యు దేవత నొదిలి పెట్టని పంతం పడతి సొంతం.
- గుడ్డి భర్తకలేని దృశ్యభాగ్యం తనకు వద్దను త్యాగబుద్ధి ఎంత మందికి సాధ్యం౧
- మగవాడి మేధకు నాలుగింతలు , సాహసానికి ఎనిమిదింతలు ఎగువ నున్న మగువ ఒదిగి ఒదిగి ఉంది కనకే ఇల్లు జీవనదిలా సాగటం. యుగయుగాలుగా చిక్కుబడిన పీటముడి విడిపోవటానికి మగవాడికి కావలసినది అహము వీడి .. మగనాలితో కలసి నడిచే సహనం.
- ఇంతికి ఇంటి మగనితోనే కాదు తంటా! ఆడదంటే అంగడిన దొరికే సుఖపు సరుకని తలచే తులవలతోనూ బెంగ! ఓ వంక పూజలు, మరో వంక బడితె పూజలు !
- ఆత్మరక్షణ కోసమై ఆడపిల్లలు వాడుకొనే మిరియాల పొడులు పార్లమెంటుల మధ్య వరకు పాకినా, ఆమె రక్షణకు చట్టబద్ధము కావలసివున్న బిల్లులకు మాత్రం కాలదోషం పట్టు వరకు మగప్రపంచం చేయు బెట్టుకు ఏమని పేరు పెట్టి కచ్చ తీరే వరకు తిట్టి పోయాలి!
- 'ఆడపుటక'ను మగసమాజం పానకపు పుడకగా భావించడం మానుకోవాలి! మనోవికాసానికి తిరుగుడొక్కటే తిరుగు లేని మందు అయితే మగువకూ మగవాడి తీరున తిరుగు స్వేచ్ఛ దొరుకు రోజునే ఏ మహిళల దినోత్సవానికైనా తగిన న్యాయం జరిగినట్లు !
- ***
Saturday, October 17, 2015
ఏవండీ!.. మారండీ!- ఓ సరదా గల్పిక
Thursday, October 15, 2015
అన్నమో రామచంద్రా!- ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా వ్యాసం
వానా కాలంలో అందరి బాధలు ఒక రకంగా వుంటే ఇంటి
ఇల్లాలు బాధలు ఇంకో రకంగా వుంటాయంట!
ఇల్లిల్లు తిరిగి ఎలాగో ఇంత నిప్పు కణిక తెచ్చినా అది రాజు కునేందుకు ఎండుగడ్డి , రగులుకునేందుకు ఇంటి వాసాలు కావాలి . అన్నం ఒక పట్టాన
వుడికి చావదు. ఉడికినా ఇల్లంతా అలుముకున్న
పొగతో సుఖంగా భోజనం చేయడం కుదరదు. వేళ
కాని వేళ వచ్చిన అతిధి దేవుళ్ళకే తొలి బంతి బొటా
బొటిగా సరిపోతుంది. చివరగా తినే ఆడంగులు మళ్ళి పాపం వండుకోవాల్సిందే ! ఆ క్షణంలో నెయ్యి గుడ్డలు, కొయ్య సమానులు కూడా వంట చెరుకు క్రిందే చెల్లి పోతుంటాయాంట!
అర్ధాకలితో లేచి అంట్లు, ఎంగిలి గిన్నెలు ఎత్తు
కోవటాలు! కాస్త నడుం వాలుద్దామనుకోగానే
కట్టుకున్న వాడు వచ్చి మర్నాటి అనుపాకాలను గూర్చి ఆరాలు మొదలు పెడతాడు-ఇదంతా ఈ
కాలం లో ఏదో మారు మూల పల్లెలో జరిగే తిండి తంతు అనుకొనేరు. .
ఐదొందల ఏళ్ల క్రిందటే దక్షిణా పథాన్నంతా ఏక చ్చత్రంక్రిందకి తెచ్చి రామరాజ్యం
సాగించాడని మనమందరం మొన్నీ మధ్య దాకా
పట్టాభిషేకోత్సవాలు పెట్టుకుని మరీ మురిసిపోయిన రాయలు వారి కాలం నాటి భోజన
విశేషాలే! రాయలు వారే స్వయంగా కళ్ళతో చూసి
ఒప్పుకుంటున్నట్లు ఇదంతా తన ఆముక్త మాల్యద మహా కావ్యంలో రాసుకున్నారు . ఉన్న
స్వాతంత్ర్యం పోయి మళ్ళా వచ్చి ఆరు
దశాబ్దాలు దాటిపోతున్నా జనం భోజన కష్టాలు తీరలేదని చెప్పటానికే ఇంతలా చెప్పుకొచ్చింది. కష్టాలు తీరలేదు కదా
..ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయాయి. రెండు వేళ్ళు మూడు పూటలా నోట్లోకి పోవాలంటే ఏదో సామెత చెప్ప్పినట్లు
పెట్టి పుట్టాలి . రాను రాను పరిస్థితులు అంత
దుర్బరంగా తయారవుతున్నాయి .
రాజ్యాంగం పందొమ్మిదో అధికరణం ప్రసాదిస్తున్న
స్వేచ్చ, వాక్సభా
స్వాతంత్ర్యాలు వగైరా వగైరా అనుభవించాలంటే
ముందుగా పౌరుడనే జీవుడు ఇంత కడుపుకు నిండుగా
తిని బ్రతికుండాలి కదా !అందుకే పందికొక్కులు పెత్తనం చేసే ఈ రాజ్యం లో
మనుషులకు కూడా ఆహార హక్కు వుండి తీరాలని
ప్రజల హక్కుల కోసం నిత్య పోరాటం చేసే ఓ ప్రజా సంఘం సర్వోన్నత న్యాయస్థానం దాక పోయి
పదేళ్లుగా పోరాడింది.
ఈ పోరాట నేపథ్యం తెలిస్తే బుద్ధి
వున్నవాడెవడికైనా మైండ్ బ్లాకవడం ఖాయం.
జైపూర్ నగర శివార్లలోని భారత ఆహార సంస్థ మూసివున్న గిడ్డంగుల బయట
ఆరుబయలులో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ టార్పాలిన్ కవర్ల క్రింద మొక్క మొలిచిన
కోట్లాది ధాన్యపు రాసులోక వైపు....
గోదాములకు అయిదారు
కిలో మీటర్ల దూరంలోని గ్రామాలలో తినడానికి చాలినన్ని తిండిగింజలు లేక వంతుల
వారీగా తినడమనే వింత పద్ధతిని కనిపెట్టి
అమలుచేస్తున్న దరిద్ర నారాయణుల గుంపింకో వైపు!
ఉన్న తిండిగింజలు అందరికి
అందుబాటులో ఉండాలంటే కుటుంబంలోని ప్రతి వారూ వారానికి మూడు
రోజులు... రోజుకి రెండువందల గ్రాములకు మించి తినరాదన్న విషాద తీర్మానం చేసుకున్నాయా గ్రామాలు!
జన సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వ పక్షం , ప్రజల పక్షాన నిల్చి పోరాడవలసిన ప్రతిపక్షాలు పార్లమెంటులో
ఇలాంటి దారుణ పరిస్థితులకి కారణం మీరంటే
మీరని జనంఅన్నం ముద్దలతో బంతులాట ఆడుకున్నాయి!
సర్వోన్నత న్యాయస్థానమే పూనుకుని విచారణ
జరుగుతున్న ఈ పదేళ్లలో జన హితాన్ని దృష్టిలో ఉంచుకొని
మధ్య మధ్య ఉపాధి హామీ పథకాలనీ, ప్రజాపంపిణి వ్యవస్థ
లోపాలనీ, బడిపిల్లలకు మధ్యాహ్నభోజన
సదుపాయాలనీ, సమగ్ర శిశుపథకమనీ, అంగన్వాడి వ్యవస్థ పటిష్టతలంటూ తలంటుతూ ఉండకబోతే
సామాన్యుడికి ఈ మాత్రమయినా కబళం దొరికే దారి వుండేదా? అనుమానమే!
‘గోదాములలో
ముక్కిపోతున్న బియ్యాన్ని అలా పందికొక్కుల పాలు చేసే బదులు బీదాబిక్కీకి ఉదారంగా
పంచి పెట్టవచ్చు గదా!’ అంటూ ఆదేశంలాంటి సూచనను అంత లావు సర్వోన్నత న్యాయస్థానం చేసినా.. ముక్కుతూ
మూలుగుతూ ఏదో ముక్కి పోయిన బియ్యాన్ని చౌకధరలదుకాణంలో దిగువాదాయ వర్గాలవారికిచ్చే ధరకి తప్ప ఇవ్వటానికీ.. ఠాట్..
లేదు పొమ్మ’ని మొండికేసిన
మన్మోహన్ సింగు గారిసర్కారుని
నమ్మేదెలా !
"తిండిగింజలను పేదలకు పంచే
బదులు కుళ్ల బెడుతున్న భారత దేశం" అంటూ తాటికాయంత అక్షరాలు పెట్టి మరీ ఓ
ప్రముఖ వార్తా పత్రిక వెలుగులోకి తెచ్చిన పచ్చినిజాలను వింటే నిజంగా మన ప్రజాప్రభుత్వాలు
ఎంత ఘనంగా వెలిగిపోతున్నాయో అర్ధమవుతుంది .
కొన్ని కోట్ల, లక్షల టన్నుల తిండిగింజలు
ప్రభుత్వ ఆహార గిడ్డంగుల ముందు బాహాటంగా ఏ
రక్షణా లేకుండా నెలల తరబడి ఎండా వానలకు
మగ్గి పోతున్నాయి. ఉన్న ధాన్యం కుళ్ళి,
కంపు కొడుతున్నా ఆహార సంస్థ బియ్యం సేకరణ మాత్రం నిరాటంకంగా అలా కొనసాగుతూనే ఉంటుంది! ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్న ఆ కుళ్ళు ధాన్యం అప్పటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకున్నా 17, 000 వేల కోట్ల రూపాయలకు తగ్గదని ఒక అంచనా. ఈ
చెత్తను సేకరించే దానికి ఎఫ్.సి.ఐ ఏడాదికి రూ15,000 కోట్లు ఖర్చు చేస్తున్నది! విన్నవారికి
తుగ్లక్ రాజ్యం తిరిగి మళ్ళా వచ్చిందా అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది! ప్రతి ఏటా ప్రళికాసంఘం
గోదాముల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు నిధుల రూపంలో విడుదల చేస్తున్నా
సేకరించిన బియ్యం ఇలా వీధులలో టార్పాలిన్ కవర్లకింద ముక్కిపోవటాన్ని అప్పట్లో
పార్లమెంట్ స్టాండింగ్
కమిటీ ఎండగట్టినా.. ఈ పిచ్చిపుల్లయ్యల పనులకు ‘ది ఎండ్’ పడే దారి కనబడటం లేదు !
అలా గోదాములలో ముక్కిపోతున్న బియ్యంతో ఫ్రాన్స్
లాంటి ఒక పెద్ద దేశాన్ని ఏడాది పాటు
ఉచితంగా పోషించవచ్చని ... మరీ మనకంత మనసొప్పకపోతే మన దేశంలోనే 15 కోట్ల మందికి రోజుకో పూట
కడుపు నింపవచ్చని
ఓ పెద్దమనిషి పాపం వాపోయాడు.
చిన్నారులలో సగం మంది పౌష్టికాహార లోపాలతో బాధ
పడుతున్న దేశం మనది. దుర్భర దారిద్ర్యంలో
సహారా ఎడారి దేశాలకన్నా వెనకబడి వున్న ఘనమైన
అభివృద్ధి మనది. అగ్ర రాజ్యంగా
ఎదగటానికి , అణుశక్తి సామర్థ్యం లో సూపర్ పవర్ దేశాలనన్నింటిని దడదడ దాటి
ముందుకెళ్ళాలని, వేగవంతమయిన అభివృద్ధి
సాధనలో అమెరికా చైనాలకే పాఠాలు చెప్పాలని ఉవ్విళ్లూరే మనం.. ఐక్యరాజ్య సమితి భద్రతాసమితిలో సభ్యత్వం కోసం ఆరాటపడే ముందు గొప్పలకు
పోయి అన్నేసి కోట్లుపోసి కామన్ వెల్త్ గేములు ఆడించేందుకు చూపించిన అత్యుత్సాహం లో
ఒక్కశాతమన్నా దేశపౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఆహార హక్కును ఆచరణలో సుసాధ్యం
చేసేటందుకు చూపిస్తే ఎంత బాగుణ్ణు!
అప్పుడే గదా ఏటేటా మన జరుపుకొనే ప్రపంచ ఆహార దినోత్సవాలకి
ఒక పరమార్ధం సృష్టించినట్లయేది!
అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనాసంస్థ ప్రతి ఏడూ తయారుచేసే
అన్నార్తుల సూచిక ప్రకారం "అన్నమో రామచంద్రా!" అని ఒక్క ముద్దకోసం
అల్లల్లాడే 88 దేశాల జాబితా లో అన్నింటి కన్నా అట్టడుగున పడివున్నది ఘనమయిన మన
'అన్న గర్భే' నన్న సంగతి మర్చిపోకుండా ఉంటే మంచిది.
ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయనో, పత్రికలు వార్తలు రాసి ఎండగడుతున్నాయనో, సుప్రీంకోర్ట్
మొట్టికాయలు వేసిందనో, వ్యవసాయమంత్రిగారు సెలవిచ్చారానో, పి యమ సలహా ఇచ్చారనో, మోదీ గారు మెచ్చుకున్నరానో కాదు
... సర్కారు ఆహారహక్కు కల్పించ వలసింది. ఈ సహజ ధాన్యాగారంలో పుట్టిన పుణ్యానికి
ప్రతిపౌరుడికి కనీసం రోజుకొక్క పూటయినా రెండువేళ్ళు నోటికందే విధంగా చర్యలు
తీసుకోనంత కాలం ఎన్ని ప్రపంచ ఆహార దినోత్సవాలు ఎంత ఆర్భాటంగా జరుపుకున్నా మామూలు జనానికి జరిగే మేలు సున్నా !
‘గింజ గింజ మీద
తినేవాడి పేరు రాసి వుంటుంద’ని హిందీ లో సామెత. మరి ఆ ధాన్యపు గిడ్డంగుల ముంగిలిలో ముక్కిపోయి
తినడానికి పనికి రాకుండా పోతున్న గింజలమీద తిండి దొరకక ప్రాణాలు పోయే ఎంతమంది నిర్భాగ్యుల పేర్లు రాసి వున్నాయో!
మానవత్వం ఉన్న
వారందరూ వెంటనే స్పందించ వలసిన అవసరాన్ని
ఈ ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భమయినా గుర్తు చేస్తే బాగుణ్ణు .
-కర్లపాలెం హనుమంత రావు
(15-10-2010నాటి ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా ఐదేళ్ళ కిందట నేను రాసిన వ్యాసం.. కొన్ని తాజా సవరణలతో)
Wednesday, October 14, 2015
టెలుగూసా.. మజాకానా!- ఓ సరదా గల్పిక
ఆంగ్లంమీద ఆంగ్లేయుడికైనా ఇంతలావు ప్రేమ కారిపోతుందో లేదో సందేహమే!మారుమూల పల్లెల్లో కూడా పిల్లకాయలకు ఏబీసీడీలు నేర్పించందే
బళ్లల్లో చేర్పించేది లేదని అప్పలమ్మల దగ్గర్నుంచి.. తిప్పలయ్యలదాకా
తెగేసి చేప్పేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో!
'తెలుగోళ్లందరం తెలుగులోనే మాట్లాడుకొందాం. చచ్చిపోతున్న మన తల్లిభాషను మళ్లీ బతికించుకుందాం!' అంటూ
చాదస్తంకొద్దీ ఎవరన్నా నోరుజారాడా .. చచ్చాడన్న మాటే!
తెలుగ్గడ్డమీద పుట్టిన ఖర్మానికి ఎట్లాగూ 'టెలుగూస్'
అని పిలిపించుకోక తప్పడం లేదు గదా! ఇంకా నోటితో
కూడా మాట్లాడుతూ చెల్లని నోటుకింద 'చీ' కొట్ట్తించుకోవాలనేనా!'
అని గయిమనేవాళ్ల నోళ్ళు
ఎవర్ మూయించగలరు .. చెప్పండి!
తెలుగులో చదువులు
వెలగబెడితే పోనీ సర్కారు నౌఖరీ అయినా దఖలుబడే సౌకర్యమేమన్నా తగలబడిందా!
తెలుగు పంతుళ్ల పోస్టులకైనా తెలుగులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటైనా లేదు గదా! ఇహ
వత్తులెక్కడ పెట్టాలో, దీర్ఘాలెక్కడ తియ్యాలో తెలుసుకొని చేసే
ఘనకార్యం మాత్రం ఏముంటుంది?
గతంలో కనీసం తెలుగు సినిమా పాటలైనా వినడానికి పనికి వచ్చేది తెలుగు పరిజ్ఞానం. ఇప్పుడు వాటిలోనూ ఒక్క తెలుగక్షరం వినపించి చావనప్పుడు
రొప్పుకుంటూ రోజుకుంటూ ఈ తెలుగు నేర్చుకొనే తిప్పలెందుకు చెప్పమ'ని నిలదీసే పిలగాళ్లకేమని చెప్పి ఒప్పించగలం చెప్పడీ!
పుట్టుకతో వచ్చిన కులాన్నెలాగూ మార్చుకోలేం. ఆంధ్రదేశంలో
పుట్టిన పాపానికి టెలుగూస్ అన్న నిందెలాగూ భరించక తప్పడం లేదు. మతం మాదిరి మార్చుకొనే స్వేచ్చ రాజ్యాంగంగాని మనకు ప్రసాదించి కనక ఉండుంటే..
ఆంధ్రప్రదేశుని ఏనాడో ఆంగ్లప్రదేశుగా, తెలంగాణాని
ఆంగ్లణాగా మార్చేసుకొనుండేవాళ్లం
కదా!
ఆటగాళ్ళకిచ్చే ప్రత్యేక రాయితీల మాదిరి తెలుగు మాటగాళ్లక్కూడా ఏవైనా ప్రత్యేక
కోటాలు గట్రాల్లేకపోతే.. తెలుగు మాట్లాడేవాళ్ళిక కోటికొక్కడన్నా మిగలుతాడా!
సందేహమే!
పిల్లకాయలు దర్జాగా దొరలభాష నేర్చేసుకొని.. దొరబాబులాగానో.. దొరసానిలాగానో..
ఒబామా లెవెల్లో డాబూ దర్పం చూపించాలనీ.. బిల్గేట్సు
మోడల్లో డాలర్ల గుట్టలు కూడబెట్టాలని ఏ కన్నవారికి కలలుండవు చెప్పండి! 'ఇంగ్లీషులో తప్ప మాట్లాడటం తప్ప'ని ఆంక్షలు పెడితే అదేమనా
అంత పెద్ద తప్పా!
దేశంలో మొదటగా
భాషాప్రయుక్తరాష్ట్రంగా ఏర్పాటైన ఘనత మొన్నటిదాకా కలిసున్న మన ఉభయ తెలుగురాష్ట్రాలదే
గదా! సరే స్వామీ!,,
మరి తెలుగు అకాడమీలో ఆ తెలుగు సగం మాత్రమే ఉందేమి?' అనెవరన్నా ఉరుమురిమి అడిగితే ఉలిక్కిపడడమే తప్ప బదులు పలికే సావకాశమేమన్నా
ఉందా! ఇక్కడి మన భాషాదౌర్భాగ్యంపట్ల ఎక్కడో ఉన్న ఐకాసావాళ్ళు
ఆందోళన చెందుతున్నారు! 'అతితొందర్లోనే మీ 'అత్యంత తీయని చక్కర తెలుగు ముక్కలు'
కరిగి పోబోతున్నాయి మహాప్రభో!' అని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.
అయినా మనకేమైనా చీమైనా కుట్టినట్లనిపించిందా!! దటీజ్.. తెలుగోడు!
పది పదాల తెలుగు కథను పదో తరగతి పిల్లగాడైనా తడబడకుండా.. తప్పుల్లేకుండా చదవలేని పరిస్థితి. ప్రాచీనహోదా కోసం అహోరాత్రాలు అలా అలమటిస్తే సరిపోతుందా!ఇక్కడ అధునాతన తరం 'ఓ న మా లు' దిద్దమంటే 'ఓ! మై గాడ్..
నో వే' అని కొట్టిపారేస్తున్నది!
కనుమరుగైతే అవనీయండయ్యా! అన్నింటికీ
అలా కన్నీళ్ళు పెట్టేసుకొంటే ఎలా? రుబ్బురోళ్ళూ, అవుదం దీపాలూ, పాంకోళ్లూ, భోషాణం
పెట్టెలూ.. ఇప్పుడున్నాయా? పాతకాలంనాడు
మా తాతలు తాటాకు మట్టలు వంటికి చుట్టుకొన్నారు. కనక ఇప్పుడు అవే
మొలకు చుట్టుకొని షికార్లు కొట్టమన్నట్లుంది.. గోల! అణాలూ.. కానీలూ కనుమరుగై పోలా! అలాగే అణాకానీక్కూడా కొరగాని మన తెలుగు కనుమరుగయి పోతోంది. పోనీక ఈ పొలికేకలేల బాబూ పొద్దస్తమానం!
దేశంలో హిందీ తరువాత అన్నిటికన్నా ఎక్కువ మాట్లాడే భాష మందేనంటారా! మందేసుకొంటేగాని నాలిక మడతలకింద వినబడదు ఈ పాము మెలికల
తికమక భాష.
'మాతృభాష చచ్చిపోతోందో!' అని పొద్దస్తమానం
ఈ శోకన్నాలేమిటో.. చిరాకు! మాతృమూర్తులకే
సరిగ్గా ఆదరణ దొరకని గడ్డమీద ఇహ ఈ మాతృభాషకు మాత్రం ఘనసత్కారాలు జరుగుతాయా చెప్పండి
మరీ అత్యాశ కాకపోతే!
'తెలుగు రాష్ట్రంలో ఉన్నాంగదా!' అని ఇక్కడి పశువులేమన్నా తెలుగులో
కూస్తున్నాయా! ఇరవైనాలుగ్గంటలూ 'ఇరుగూ పొరుగును
చూసి బుద్ధి తెచ్చుకోమని ఇలా పోరుపెట్టడమేమనా బాగుందా! 'పక్క
మహారాష్ట్రలో పక్కామరాఠీకోసం
ఎలా లాఠీలు పట్టుకొని తిరుగుతున్నారో.. చూసి నేర్చుకోండి!
ఢిల్లీ చట్టాసభల్లో సైతం సొంతభాషలోనే విరుచుకుపడే తమిళుల్ని చూసి తెలివి
తెచ్చుకోండి!' అంటూ ఇరవైనాలుగ్గంటలూ
ఇరుగు పొరుగుతో పోల్చి
చిన్నబుచ్చడం తగదండీ! మన టెలుగూస్ ప్రత్యేకతలు మనవి! అర్థం చేసుకొని ఆదరించమని మనవి.
''ఐ వెవ్వర్ స్పీక్
ఇన్ టెలుగు' అని రాసిన పలకలను పసిపిల్లల మెళ్లకు గంగడోళ్లకు మల్లే వేలాడేసే మెకాలేల నోటనైనా తెలుగు తన్నుకొచ్చే
ట్రిక్కు ఒక్కటే ఒక్కటుందంటారా! గూబమీద గట్టిగా ఒకటిస్తే సరి!
ఎంత పెద్ద ఆక్స్ ఫర్డు వర్డ్సువర్తు పండితుడైనా గానీ.. ' అబ్బా! అమ్మా!' అంటూ అచ్చుతెలుగులో హల్లులన్నీ చేర్చి
ఘొల్లుమంటాడంటారా!
నో..వే! తల్లిభాష గొప్పతనం
తెలుగువాడి తలకెక్కించాలంటే
మీ తలమీదున్న అన్నివెంట్రుకలూ
నేల రాలాస్లిందే మాస్టారూ! టెలుగూసా..
మజాకానా!
-కర్లపాలెం హనుమంతరావు
(22-01-2010 నాటి ఈనాడు- సంపాదకీయం
పుట లో ప్రచురితం)
Tuesday, October 13, 2015
ఉషోదయమంటే!-కవిత
తపోభంగమైన మునిపుంగవునిలా
కల
ఎప్పుడు నిద్ర లేచిందో మసీదు
మీనార్ మీదనుంచీ ఆర్తిగా పిలుస్తోంది
బాట పొత్తిళ్ళలో
పాలప్యాకెట్ పాపాయిల సందడి
ప్రపంచాన్ని పేపర్లో చుట్టేసి మెదడు కారిడార్లలోకి
గురిచూసి విసిరే పసిబైసికిళ్ళు
రాత్రిచీకటి
రోడ్డువార విసిరేసిన రహస్యాలని
సైడుతూముల్లోకి వూడ్చేసే ఝాడూకర్రలు
నైడ్డ్యూటీదిగి దాలిగుంటల్లోకి
సర్దుకుంటున్న
వీధిసింహాల విరామాలు
దారిపక్కన తాళపత్రాసనంలో
వచ్చేపోయే దృశ్యమాలికలను
అర్థనిమీలిత పత్రాలతో అవలోకిస్తూ చెట్లు
నింగిచూరుకు దిగాలుగా వేలాడే
బెంగమొగం ముసలి చంద్రుడు!
వెలుగు రాకను
దండోరాలేసే పులుగు రెక్కలు
సాక్షినారాయణుడి దివ్యదర్శనార్థం
అభ్యంగస్నానాలాచరించి
ముగ్గుదుస్తుల్లో ముస్తాబయే ముత్తైదువుముంగిళ్ళు
భక్తజనసందోహం సుప్రభాతసేవార్థం
మడిబట్టల్లో నిలబడ్డ గుడి మెట్లు
చదివిన పాఠాలే!
అయినా
పునశ్చరణ చేసుకునే
ఉదయ వ్యాహ్యాళులు
గతించిన శూన్యసమయాన
అందాల బంధ గంధాల అరగతీతలో
ఏ గంధర్వలోకాల
ఎన్ని పుష్పమాలికలకు
వికాసభూమికలు ఏర్పడ్డాయో!
మౌనంవ్రతం ముగించుకుని
తూర్పువాకిలి తలుపు తెరిచుకుని
వీధిమొగదలకు కదిలి వస్తోంది
ఉదయరాగసంధ్య
సూర్యనమస్కారాలకోసం సిద్దమవుతోంది లోకం
రాత్రి ఏకాంతంలో
తెల్లహృదయం మీద
ఏ రంగుభావాలని పొదిగి
సొమ్మసిల్లిందో కవిసమయం!
తొలికిరణం కరచాలనంతో గానీ
రంగూ.. రుచీ.. వాసనా తేలదు
ఉషోదయం అంటే
రాత్రిబావిలోపడ్డ లోకంబంతిని
మెల్లగా బైటకు తీయటమేనా!
మరో ముప్పూట సమావేశాల కోసం
సమాయాత్తమయ్యే
భువనభవనపు అంతరంగానికి వేసే
మొదటి వైట్-వాష్
కోటింగు కూడా కదా!
***
కర్లపాలెం హనుమంతరావు
Subscribe to:
Posts (Atom)
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్ , 08-09-2010 మతభావనలు , మనిషికీ నరవానరానికి తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే ...
-
ఆదివారం ఆంధ్రజ్యోతి (15 జూన్ 2014) ఈ వారం కథ పి.సత్యవతిగారి 'పిల్లాడొస్తాడా?' ఒక మంచి కథే కాదు.. కథా వ్యాఖ్యానం.. అని న...
-
పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే .. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు ' యస్య జ్ఞాన దయాసింధో ' అని గురువుగారు ప్ర...