ఆంగ్లంమీద ఆంగ్లేయుడికైనా ఇంతలావు ప్రేమ కారిపోతుందో లేదో సందేహమే!మారుమూల పల్లెల్లో కూడా పిల్లకాయలకు ఏబీసీడీలు నేర్పించందే
బళ్లల్లో చేర్పించేది లేదని అప్పలమ్మల దగ్గర్నుంచి.. తిప్పలయ్యలదాకా
తెగేసి చేప్పేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో!
'తెలుగోళ్లందరం తెలుగులోనే మాట్లాడుకొందాం. చచ్చిపోతున్న మన తల్లిభాషను మళ్లీ బతికించుకుందాం!' అంటూ
చాదస్తంకొద్దీ ఎవరన్నా నోరుజారాడా .. చచ్చాడన్న మాటే!
తెలుగ్గడ్డమీద పుట్టిన ఖర్మానికి ఎట్లాగూ 'టెలుగూస్'
అని పిలిపించుకోక తప్పడం లేదు గదా! ఇంకా నోటితో
కూడా మాట్లాడుతూ చెల్లని నోటుకింద 'చీ' కొట్ట్తించుకోవాలనేనా!'
అని గయిమనేవాళ్ల నోళ్ళు
ఎవర్ మూయించగలరు .. చెప్పండి!
తెలుగులో చదువులు
వెలగబెడితే పోనీ సర్కారు నౌఖరీ అయినా దఖలుబడే సౌకర్యమేమన్నా తగలబడిందా!
తెలుగు పంతుళ్ల పోస్టులకైనా తెలుగులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటైనా లేదు గదా! ఇహ
వత్తులెక్కడ పెట్టాలో, దీర్ఘాలెక్కడ తియ్యాలో తెలుసుకొని చేసే
ఘనకార్యం మాత్రం ఏముంటుంది?
గతంలో కనీసం తెలుగు సినిమా పాటలైనా వినడానికి పనికి వచ్చేది తెలుగు పరిజ్ఞానం. ఇప్పుడు వాటిలోనూ ఒక్క తెలుగక్షరం వినపించి చావనప్పుడు
రొప్పుకుంటూ రోజుకుంటూ ఈ తెలుగు నేర్చుకొనే తిప్పలెందుకు చెప్పమ'ని నిలదీసే పిలగాళ్లకేమని చెప్పి ఒప్పించగలం చెప్పడీ!
పుట్టుకతో వచ్చిన కులాన్నెలాగూ మార్చుకోలేం. ఆంధ్రదేశంలో
పుట్టిన పాపానికి టెలుగూస్ అన్న నిందెలాగూ భరించక తప్పడం లేదు. మతం మాదిరి మార్చుకొనే స్వేచ్చ రాజ్యాంగంగాని మనకు ప్రసాదించి కనక ఉండుంటే..
ఆంధ్రప్రదేశుని ఏనాడో ఆంగ్లప్రదేశుగా, తెలంగాణాని
ఆంగ్లణాగా మార్చేసుకొనుండేవాళ్లం
కదా!
ఆటగాళ్ళకిచ్చే ప్రత్యేక రాయితీల మాదిరి తెలుగు మాటగాళ్లక్కూడా ఏవైనా ప్రత్యేక
కోటాలు గట్రాల్లేకపోతే.. తెలుగు మాట్లాడేవాళ్ళిక కోటికొక్కడన్నా మిగలుతాడా!
సందేహమే!
పిల్లకాయలు దర్జాగా దొరలభాష నేర్చేసుకొని.. దొరబాబులాగానో.. దొరసానిలాగానో..
ఒబామా లెవెల్లో డాబూ దర్పం చూపించాలనీ.. బిల్గేట్సు
మోడల్లో డాలర్ల గుట్టలు కూడబెట్టాలని ఏ కన్నవారికి కలలుండవు చెప్పండి! 'ఇంగ్లీషులో తప్ప మాట్లాడటం తప్ప'ని ఆంక్షలు పెడితే అదేమనా
అంత పెద్ద తప్పా!
దేశంలో మొదటగా
భాషాప్రయుక్తరాష్ట్రంగా ఏర్పాటైన ఘనత మొన్నటిదాకా కలిసున్న మన ఉభయ తెలుగురాష్ట్రాలదే
గదా! సరే స్వామీ!,,
మరి తెలుగు అకాడమీలో ఆ తెలుగు సగం మాత్రమే ఉందేమి?' అనెవరన్నా ఉరుమురిమి అడిగితే ఉలిక్కిపడడమే తప్ప బదులు పలికే సావకాశమేమన్నా
ఉందా! ఇక్కడి మన భాషాదౌర్భాగ్యంపట్ల ఎక్కడో ఉన్న ఐకాసావాళ్ళు
ఆందోళన చెందుతున్నారు! 'అతితొందర్లోనే మీ 'అత్యంత తీయని చక్కర తెలుగు ముక్కలు'
కరిగి పోబోతున్నాయి మహాప్రభో!' అని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.
అయినా మనకేమైనా చీమైనా కుట్టినట్లనిపించిందా!! దటీజ్.. తెలుగోడు!
పది పదాల తెలుగు కథను పదో తరగతి పిల్లగాడైనా తడబడకుండా.. తప్పుల్లేకుండా చదవలేని పరిస్థితి. ప్రాచీనహోదా కోసం అహోరాత్రాలు అలా అలమటిస్తే సరిపోతుందా!ఇక్కడ అధునాతన తరం 'ఓ న మా లు' దిద్దమంటే 'ఓ! మై గాడ్..
నో వే' అని కొట్టిపారేస్తున్నది!
కనుమరుగైతే అవనీయండయ్యా! అన్నింటికీ
అలా కన్నీళ్ళు పెట్టేసుకొంటే ఎలా? రుబ్బురోళ్ళూ, అవుదం దీపాలూ, పాంకోళ్లూ, భోషాణం
పెట్టెలూ.. ఇప్పుడున్నాయా? పాతకాలంనాడు
మా తాతలు తాటాకు మట్టలు వంటికి చుట్టుకొన్నారు. కనక ఇప్పుడు అవే
మొలకు చుట్టుకొని షికార్లు కొట్టమన్నట్లుంది.. గోల! అణాలూ.. కానీలూ కనుమరుగై పోలా! అలాగే అణాకానీక్కూడా కొరగాని మన తెలుగు కనుమరుగయి పోతోంది. పోనీక ఈ పొలికేకలేల బాబూ పొద్దస్తమానం!
దేశంలో హిందీ తరువాత అన్నిటికన్నా ఎక్కువ మాట్లాడే భాష మందేనంటారా! మందేసుకొంటేగాని నాలిక మడతలకింద వినబడదు ఈ పాము మెలికల
తికమక భాష.
'మాతృభాష చచ్చిపోతోందో!' అని పొద్దస్తమానం
ఈ శోకన్నాలేమిటో.. చిరాకు! మాతృమూర్తులకే
సరిగ్గా ఆదరణ దొరకని గడ్డమీద ఇహ ఈ మాతృభాషకు మాత్రం ఘనసత్కారాలు జరుగుతాయా చెప్పండి
మరీ అత్యాశ కాకపోతే!
'తెలుగు రాష్ట్రంలో ఉన్నాంగదా!' అని ఇక్కడి పశువులేమన్నా తెలుగులో
కూస్తున్నాయా! ఇరవైనాలుగ్గంటలూ 'ఇరుగూ పొరుగును
చూసి బుద్ధి తెచ్చుకోమని ఇలా పోరుపెట్టడమేమనా బాగుందా! 'పక్క
మహారాష్ట్రలో పక్కామరాఠీకోసం
ఎలా లాఠీలు పట్టుకొని తిరుగుతున్నారో.. చూసి నేర్చుకోండి!
ఢిల్లీ చట్టాసభల్లో సైతం సొంతభాషలోనే విరుచుకుపడే తమిళుల్ని చూసి తెలివి
తెచ్చుకోండి!' అంటూ ఇరవైనాలుగ్గంటలూ
ఇరుగు పొరుగుతో పోల్చి
చిన్నబుచ్చడం తగదండీ! మన టెలుగూస్ ప్రత్యేకతలు మనవి! అర్థం చేసుకొని ఆదరించమని మనవి.
''ఐ వెవ్వర్ స్పీక్
ఇన్ టెలుగు' అని రాసిన పలకలను పసిపిల్లల మెళ్లకు గంగడోళ్లకు మల్లే వేలాడేసే మెకాలేల నోటనైనా తెలుగు తన్నుకొచ్చే
ట్రిక్కు ఒక్కటే ఒక్కటుందంటారా! గూబమీద గట్టిగా ఒకటిస్తే సరి!
ఎంత పెద్ద ఆక్స్ ఫర్డు వర్డ్సువర్తు పండితుడైనా గానీ.. ' అబ్బా! అమ్మా!' అంటూ అచ్చుతెలుగులో హల్లులన్నీ చేర్చి
ఘొల్లుమంటాడంటారా!
నో..వే! తల్లిభాష గొప్పతనం
తెలుగువాడి తలకెక్కించాలంటే
మీ తలమీదున్న అన్నివెంట్రుకలూ
నేల రాలాస్లిందే మాస్టారూ! టెలుగూసా..
మజాకానా!
-కర్లపాలెం హనుమంతరావు
(22-01-2010 నాటి ఈనాడు- సంపాదకీయం
పుట లో ప్రచురితం)
No comments:
Post a Comment