Thursday, October 15, 2015

అన్నమో రామచంద్రా!- ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా వ్యాసం


వానా కాలంలో అందరి బాధలు ఒక రకంగా వుంటే ఇంటి ఇల్లాలు బాధలు ఇంకో రకంగా  వుంటాయంట! ఇల్లిల్లు తిరిగి ఎలాగో ఇంత నిప్పు కణిక తెచ్చినా అది రాజు కునేందుకు ఎండుగడ్డి , రగులుకునేందుకు ఇంటి వాసాలు కావాలి . అన్నం ఒక పట్టాన వుడికి చావదు. ఉడికినా  ఇల్లంతా అలుముకున్న పొగతో సుఖంగా   భోజనం చేయడం కుదరదు. వేళ కాని వేళ వచ్చిన అతిధి దేవుళ్ళకే తొలి బంతి బొటా  బొటిగా  సరిపోతుంది. చివరగా  తినే ఆడంగులు మళ్ళి పాపం  వండుకోవాల్సిందే ! ఆ క్షణంలో నెయ్యి గుడ్డలు, కొయ్య సమానులు కూడా వంట చెరుకు క్రిందే చెల్లి పోతుంటాయాంట! అర్ధాకలితో లేచి అంట్లు, ఎంగిలి గిన్నెలు ఎత్తు కోవటాలు! కాస్త  నడుం వాలుద్దామనుకోగానే కట్టుకున్న వాడు వచ్చి మర్నాటి అనుపాకాలను గూర్చి ఆరాలు మొదలు పెడతాడు-ఇదంతా ఈ కాలం లో ఏదో మారు మూల పల్లెలో జరిగే తిండి తంతు అనుకొనేరు. .

ఐదొందల ఏళ్ల క్రిందటే దక్షిణా పథాన్నంతా  ఏక చ్చత్రంక్రిందకి తెచ్చి రామరాజ్యం సాగించాడని మనమందరం మొన్నీ మధ్య దాకా  పట్టాభిషేకోత్సవాలు పెట్టుకుని మరీ మురిసిపోయిన రాయలు వారి కాలం నాటి భోజన విశేషాలే! రాయలు వారే  స్వయంగా కళ్ళతో చూసి ఒప్పుకుంటున్నట్లు ఇదంతా తన ఆముక్త మాల్యద మహా కావ్యంలో రాసుకున్నారు . ఉన్న స్వాతంత్ర్యం పోయి మళ్ళా  వచ్చి ఆరు దశాబ్దాలు దాటిపోతున్నా జనం భోజన కష్టాలు తీరలేదని చెప్పటానికే ఇంతలా  చెప్పుకొచ్చింది. కష్టాలు తీరలేదు కదా ..ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయాయి. రెండు వేళ్ళు మూడు పూటలా  నోట్లోకి పోవాలంటే ఏదో సామెత చెప్ప్పినట్లు పెట్టి పుట్టాలి . రాను రాను పరిస్థితులు అంత  దుర్బరంగా తయారవుతున్నాయి .

రాజ్యాంగం పందొమ్మిదో అధికరణం ప్రసాదిస్తున్న స్వేచ్చ, వాక్సభా స్వాతంత్ర్యాలు  వగైరా వగైరా అనుభవించాలంటే ముందుగా పౌరుడనే జీవుడు ఇంత కడుపుకు నిండుగా  తిని బ్రతికుండాలి కదా !అందుకే పందికొక్కులు పెత్తనం చేసే ఈ రాజ్యం లో మనుషులకు కూడా ఆహార హక్కు వుండి  తీరాలని ప్రజల హక్కుల కోసం నిత్య పోరాటం చేసే ఓ ప్రజా సంఘం సర్వోన్నత న్యాయస్థానం దాక పోయి పదేళ్లుగా పోరాడింది.
ఈ పోరాట నేపథ్యం తెలిస్తే బుద్ధి వున్నవాడెవడికైనా  మైండ్ బ్లాకవడం ఖాయం.
జైపూర్ నగర శివార్లలోని  భారత ఆహార సంస్థ మూసివున్న గిడ్డంగుల బయట ఆరుబయలులో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ టార్పాలిన్ కవర్ల క్రింద మొక్క మొలిచిన కోట్లాది ధాన్యపు రాసులోక వైపు....
గోదాములకు అయిదారు  కిలో మీటర్ల దూరంలోని గ్రామాలలో తినడానికి చాలినన్ని తిండిగింజలు లేక వంతుల వారీగా తినడమనే  వింత పద్ధతిని కనిపెట్టి అమలుచేస్తున్న దరిద్ర నారాయణుల గుంపింకో వైపు!
ఉన్న తిండిగింజలు  అందరికి  అందుబాటులో ఉండాలంటే కుటుంబంలోని ప్రతి వారూ వారానికి మూడు రోజులు... రోజుకి రెండువందల గ్రాములకు మించి తినరాదన్న విషాద తీర్మానం  చేసుకున్నాయా గ్రామాలు!
జన సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వ పక్షం , ప్రజల పక్షాన నిల్చి పోరాడవలసిన ప్రతిపక్షాలు పార్లమెంటులో ఇలాంటి దారుణ పరిస్థితులకి  కారణం మీరంటే మీరని జనంఅన్నం ముద్దలతో బంతులాట ఆడుకున్నాయి!
సర్వోన్నత న్యాయస్థానమే పూనుకుని విచారణ జరుగుతున్న ఈ పదేళ్లలో జన హితాన్ని దృష్టిలో ఉంచుకొని  మధ్య మధ్య ఉపాధి హామీ పథకాలనీ, ప్రజాపంపిణి వ్యవస్థ లోపాలనీ, బడిపిల్లలకు మధ్యాహ్నభోజన సదుపాయాలనీ, సమగ్ర శిశుపథకమనీ, అంగన్వాడి వ్యవస్థ పటిష్టతలంటూ తలంటుతూ ఉండకబోతే సామాన్యుడికి ఈ మాత్రమయినా కబళం దొరికే దారి వుండేదా? అనుమానమే!
 గోదాములలో ముక్కిపోతున్న బియ్యాన్ని అలా పందికొక్కుల పాలు చేసే బదులు బీదాబిక్కీకి ఉదారంగా పంచి పెట్టవచ్చు గదా! అంటూ ఆదేశంలాంటి సూచనను  అంత లావు సర్వోన్నత న్యాయస్థానం చేసినా.. ముక్కుతూ మూలుగుతూ ఏదో ముక్కి పోయిన బియ్యాన్ని చౌకధరలదుకాణంలో దిగువాదాయ వర్గాలవారికిచ్చే  ధరకి తప్ప ఇవ్వటానికీ.. ఠాట్.. లేదు పొమ్మని మొండికేసిన   మన్మోహన్ సింగు గారిసర్కారుని నమ్మేదెలా !    

"తిండిగింజలను పేదలకు పంచే బదులు కుళ్ల బెడుతున్న భారత దేశం" అంటూ తాటికాయంత అక్షరాలు పెట్టి మరీ ఓ ప్రముఖ వార్తా పత్రిక వెలుగులోకి తెచ్చిన పచ్చినిజాలను వింటే నిజంగా మన ప్రజాప్రభుత్వాలు ఎంత ఘనంగా వెలిగిపోతున్నాయో అర్ధమవుతుంది .
కొన్ని కోట్ల, లక్షల టన్నుల తిండిగింజలు ప్రభుత్వ ఆహార గిడ్డంగుల ముందు బాహాటంగా  ఏ రక్షణా లేకుండా నెలల తరబడి  ఎండా వానలకు మగ్గి పోతున్నాయి. న్న ధాన్యం కుళ్ళి, కంపు కొడుతున్నా ఆహార సంస్థ బియ్యం సేకరణ మాత్రం నిరాటంకంగా అలా కొనసాగుతూనే ఉంటుంది! ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్న ఆ కుళ్ళు ధాన్యం అప్పటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకున్నా 17, 000 వేల కోట్ల రూపాయలకు తగ్గదని ఒక అంచనా. ఈ చెత్తను సేకరించే దానికి ఎఫ్.సి.ఐ ఏడాదికి రూ15,000 కోట్లు ఖర్చు చేస్తున్నది! విన్నవారికి తుగ్లక్ రాజ్యం తిరిగి మళ్ళా వచ్చిందా అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది! ప్రతి ఏటా ప్రళికాసంఘం గోదాముల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు నిధుల రూపంలో విడుదల చేస్తున్నా సేకరించిన బియ్యం ఇలా వీధులలో టార్పాలిన్ కవర్లకింద ముక్కిపోవటాన్ని అప్పట్లో  పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎండగట్టినా.. ఈ పిచ్చిపుల్లయ్యల  పనులకు ది ఎండ్ పడే దారి కనబడటం లేదు !
అలా గోదాములలో ముక్కిపోతున్న బియ్యంతో ఫ్రాన్స్ లాంటి ఒక పెద్ద దేశాన్ని  ఏడాది పాటు ఉచితంగా పోషించవచ్చని ... మరీ మనకంత మనసొప్పకపోతే మన దేశంలోనే 15 కోట్ల మందికి రోజుకో పూట  కడుపు నింపచ్చని ఓ పెద్దమనిషి పాపం వాపోయాడు.
చిన్నారులలో సగం మంది పౌష్టికాహార లోపాలతో బాధ పడుతున్న దేశం మనది. దుర్భర దారిద్ర్యంలో  సహారా ఎడారి దేశాలకన్నా వెనకబడి వున్న ఘనమైన
అభివృద్ధి మనది. అగ్ర రాజ్యంగా ఎదగటానికి , అణుశక్తి సామర్థ్యం లో  సూపర్ పవర్ దేశాలనన్నింటిని దడదడ దాటి ముందుకెళ్ళాలని, వేగవంతమయిన అభివృద్ధి సాధనలో అమెరికా చైనాలకే పాఠాలు చెప్పాలని వ్విళ్లూరే మనం.. ఐక్యరాజ్య సమితి భద్రతాసమితిలో సభ్యత్వం కోసం ఆరాటపడే ముందు గొప్పలకు పోయి అన్నేసి కోట్లుపోసి కామన్ వెల్త్ గేములు ఆడించేందుకు చూపించిన అత్యుత్సాహం లో ఒక్కశాతమన్నా దేశపౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఆహార హక్కును ఆచరణలో సుసాధ్యం చేసేటందుకు చూపిస్తే ఎంత బాగుణ్ణు!
అప్పుడే గదా ఏటేటా మన జరుపుకొనే ప్రపంచ ఆహార దినోత్సవాలకి ఒక పరమార్ధం సృష్టించినట్లయేది!
అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనాసంస్థ ప్రతి ఏడూ తయారుచేసే అన్నార్తుల సూచిక ప్రకారం "అన్నమో రామచంద్రా!" అని ఒక్క ముద్దకోసం అల్లల్లాడే 88 దేశాల జాబితా లో  అన్నింటి కన్నా అట్టడుగున పడివున్నది ఘనమయిన మన 'అన్న గర్భే' నన్న సంగతి మర్చిపోకుండా ఉంటే మంచిది.
ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయనో, పత్రికలు వార్తలు రాసి ఎండగడుతున్నాయనో, సుప్రీంకోర్ట్ మొట్టికాయలు వేసిందనో,  వ్యవసాయమంత్రిగారు సెలవిచ్చారానో, పి యమ సలహా ఇచ్చారనో, మోదీ  గారు మెచ్చుకున్నరానో కాదు ... సర్కారు ఆహారహక్కు కల్పించ వలసింది. ఈ సహజ ధాన్యాగారంలో పుట్టిన పుణ్యానికి ప్రతిపౌరుడికి కనీసం రోజుకొక్క పూటయినా రెండువేళ్ళు నోటికందే విధంగా చర్యలు తీసుకోనంత కాలం ఎన్ని ప్రపంచ ఆహార దినోత్సవాలు ఎంత ఆర్భాటంగా జరుపుకున్నా మామూలు జనానికి జరిగే మేలు సున్నా !
గింజ గింజ మీద తినేవాడి పేరు రాసి వుంటుందని హిందీ లో సామెత. మరి  ఆ ధాన్యపు గిడ్డంగుల ముంగిలిలో ముక్కిపోయి తినడానికి పనికి రాకుండా పోతున్న గింజలమీద తిండి దొరకక ప్రాణాలు పోయే ఎంతమంది  నిర్భాగ్యుల పేర్లు రాసి  వున్నాయో!  మానవత్వం  న్న వారందరూ వెంటనే స్పందించ వలసిన అవసరాన్ని  ఈ ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భమయినా  గుర్తు చేస్తే బాగుణ్ణు .
-కర్లపాలెం హనుమంత రావు
(15-10-2010నాటి ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా  ఐదేళ్ళ కిందట నేను రాసిన వ్యాసం.. కొన్ని తాజా సవరణలతో)





No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...