Sunday, May 1, 2016

నాన్నలంతే!- కౌముదిలోని మరీ చి.క(మరీ చిన్న కథ)


నాన్నతో ఆరుబయలు పడుకొని ఉన్నాడు  బుడతడు వెన్నెల రాత్రి.
'నాన్నా! మనం పేదవాళ్లమా?' అనడిగాడు హఠాత్తుగా!
'కాదు కన్నా! అందరికన్నా ధవవంతులం! ఆకాశంలో కనిపిస్తోందే.. ఆ చందమామ మనదే! అందులోని నిధినిక్షేపాలన్నీ మనవే!' అన్నాడు నాన్న. 'వాటిని తెచ్చుకోవచ్చుగా!  నాకు సైకిలు కొనివ్వచ్చుగా!  రోజూ పనికి పోవడమెందుకు?' చిన్నా ప్రశ్న.
'నువ్వింకా పెద్దాడివైన తరువాత నీకు రైలుబండి కొనివ్వాలని ఉందిరా! ఇప్పుడే తెచ్చుకొని సైకిలు కొనేస్తే రేపు రైలుబండికి తరుగు పడవా? నీకు రైలు కావాలా? సైకిలు కావాలా?' అని నాన్న ఎదురు ప్రశ్న. 'రైలే కావాలి. ఐతే రేపూ నేనూ నీతో పాటు పనికి వస్తా! డబ్బులు సంపాదిస్తా!' అన్నాడు చిన్నా.
'పనికి చదువు కావాలి. అలాగే వద్దువుగాని.. ముందు బుద్ధిగా చదువుకోవాలి మరి!' అన్నాడు నాన్న.
చిన్నా బుద్ధిగా చదువుకొని తండ్రిలాగానే ఓ ఆఫీసులో పనికి వెళుతున్నాడు ఇప్పుడు. పెళ్లయి.. ఓ బాబుకి తండ్రికూడా అయాడు.

ఓ రోజు డాబామీద ఆరుబయలు పడుకొని ఉన్నప్పుడు.. అప్పుడూ వెన్నెలే! ఆ బాబు అడిగాడు'నాన్నా! మన దగ్గర డబ్బు లేదా?'

ఆకాశంలోని చందమామలో తండ్రిముఖం కనిపించింది ఆ బాబు తండ్రికి ఇప్పుడు. కళ్ళు చెమ్మగిల్లాయి.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- మే సంచికలో ప్రచురితం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...