కాళిదాసు
భోజరాజు కీర్తిని కొనియాడే ఓ సందర్భంలో
“నీరక్షేరే గృహీత్వా నిఖిల.
ఖగతితీర్యాతి నాళీకజన్మా
తక్రం
ధృత్వాతు సర్వా నటతి జలనిధీం శ్చక్రపాణి ర్ముకుందః సర్వాంగనుత్తుంగశైలాన్ వహతి పశుపతిః ఫాలనేత్రేణ
పశ్యన్
వ్యాప్తా
త్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతే!
భోజరాజక్షితీంద్ర!”
అంటూ
అతిశయోక్తులు పోతాడు! ప్రభువుకీర్తి
శ్వేతవర్ణంలో దశదిశలా వ్యాపించడంవల్ల పక్షులన్నీ హంసలవలె భ్రాంతి గొలుపుతున్నాయిట! బ్రహ్మదేవుడికి తన వాహనం ఏదో ఆనవాలు పట్టేందుకు నీళ్లు కలిపిన పాలు పక్షులముందు
పెట్టవలసి వచ్చిందని కాళిదాసు చమత్కారం! సర్వసముద్రాలూ పాలసముద్రం మాదిరి
తెల్లబడటంవల్ల జగజ్జేతకు తన పడకగల పాలసముద్రం ఏదో తెలుసుకోడం వల్లగాక మజ్జిగ
సాయం కోరవలసి వచ్చిందని మరో ముచ్చట! మజ్జిగచుక్క పడిన తరువాత గడ్డకట్టిన సముద్రమే తన పాలసముద్రమవుతుందని
పరమాత్ముని పరీక్ష! పరమేశ్వరుడిదీ అదే పరిస్థితి. తన కైలాసగిరి
విలాసమేదో తెలుసుకునేందుకు ఫాలనేత్రం తెరిచి మరీ మండించ వలసిన పరిస్థితి! మండిన కొండే తన వెండికొండవుతుందని
ఈశుని ఈ విచిత్ర పరీక్ష! దీనబాంధవుల
స్థితిగతులనూ ఇంత దయనీయంగా మార్చివేసిందని భోజరాజు కీర్తికాంతులను వర్ణించడం కొంత అతిగా అనిపించినా.. రాసింది
కావ్యం.. రాసిన అక్షరసిరి కాళిదాసు కనుక
ఎంత కల్పన అయితేనేమి.. అత్యంత రమ్యనీయంగా
ఉందని ఒప్పుకోక తప్పదు కదా రసహృదయులందరికీ!
“వేల్పుటేనికలయ్యె బోల్ప నేనుగు లెల్ల- గొండలన్నియు వెండి కొండలయ్యె
బలుకు
చేడియ లైరి పొలతుక లందరు-జెట్టులన్నియు బెట్టు చెట్టు లయ్యె
బాల
సంద్రములయ్యెనోలి నేర్లన్నియు-నలువ బాబాలయ్యె బులుగు లెల్ల
బుడమి
దాలపులయ్యె బడగదార్లన్నియుమేటి సింగములయ్యె మెకము లెల్ల
బండు
రేయెండ కన్నుల పండువగుచు
బిండి
చల్లిన తెరగున మెండు మీరి
యొండు
కడనైన నెడలేక యుండి యప్పు
డండ
గొనగ జగంబెల్ల నిండుటయును”
అంటూ
మన తెలుగు కవిసార్వభౌముడు కూచిమంచి
తిమ్మకవి సైతం తెలుగులో ఓ రామాయణం రచించే సందర్భంలో అయోధ్యకాండ మధ్యలో ఈ హృద్యమైన పద్యం చెప్పుకొచ్చాడు.. ‘శభాష్!’ అనిపించే
మెచ్చుకోళ్ళెన్నో సాధించుకొచ్చాడు.
విస్తారంగా
పరుచుకొన్న పండువెన్నెల్లో నల్లటి
ఏనుగులుకూడా దెవేంద్రుని ఐరావతంలాగా భ్రమింపచేస్తున్నాయనడం.. కాలవర్ణం కుప్ప
పోసినట్లుండే కొండలకూడా మహాశివుని
రజితాలయాల మాదిరి ధగధగలతో వెలిగి
పోతున్నాయనడం.. శ్యామలవర్ణంతో నిగనిగలాడే స్త్రీల సొగసులన్నీ శారదమ్మ
వంటితీరుతో పోటీకి దిగుతున్నాయనడం.. హరితవృక్షాలన్నీ కల్పవృక్షాలకు మల్లే
తెలుపురంగుకి తిరిగి ప్రకాశిస్తున్నాయని
కల్పనలు చేయడం.. నదులు సర్వస్వం క్షీరసాగరాలకు మల్లే మల్లెపూల మాలల మాదిరి మతులు
పోగొడుతున్నాయని అనడం.. వివిధ జాతుల
పక్షులన్నీ వర్ణాలతో నిమిత్తం లేకుండా శ్వేతహంసల మాదిరి బారులు తీరి శోభాయమానంగా అలరారుతున్నాయని
అనడం.. ఆహాఁ.. తిమ్మకవి కల్పనంతా ఎంత కమ్మంగా ఉందో కదా!
‘పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది’ అని ఒక్క వాక్యంలో అని ఊరుకుంటే అది కావ్యం
ఎలాగవుతుంది? తిమ్మనకు కవిసార్వభౌమడన్న గుర్తింపు ఎలా
వస్తుంది? కనకనే ఈ
కల్పనలన్నీ! నిజమే కావచ్చు కానీ.. అసలు విశేషం అందులో ఇసుమంతే ఉంది. నిశితంగా
గమనించి చూడండి ఈ పద్యమంతా అచ్చమైన తెలుగులో కవి రసవంతంగా రాయడంలోనే నిఖార్సైన విశేషం దాగి ఉంది!
రుచిగట్టగలిగే
ప్రతిభ మన మనసుకు ఉండాలేగానీ.. తెలుగు పలుకుకి మాత్రం కలకండ పలుకుకు మించిన
తీపిదనం లేదా! తెలుగు
భాష సాధికారతను గురించి.. ప్రాచీనతను గురించి గత కొద్దికాలంగా చర్చోపచర్చలు
నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. చర్చలు
ప్రాచీనతను గురించి.. అధికారిక హోదాను గురించి కాక.. వ్యావహారికతను గురించి..
అధునికతను గురించి సాగితే మరింత ప్రయోజనం సాధించినట్లవుతుందేమో!
అవసరం
లేకున్నా ఆంగ్లపదం లేకుండా తేటతెలుగులో
మాటలాడుకోవడం మొరటుతనమయి మనకు ఎన్ని దశాబ్దాలాయ! ఆధునిక మాద్యమాల పుణ్యమా అని తెలుగు పదాలు పరాయిభాషకు మల్లే.. పరాయిభాష
పలుకులు తెలుగుభాషకు మల్లె దాదాపుగా
స్థిరపడిపోయిన దుస్థితి ప్రస్తుతానిది. భాషాదినోత్సవాలు భేషజంగా
జరుపుకుని ‘శభాషం’టూ జబ్బలు చరుచుకుంటే సరిపోతుందా? పాలక మహాశయులే చట్టసభల సాక్షిగా ప్రజల భాషమీద చూపించే
చిన్నచూపు ప్రతి మాతృభాషాభిమానికి చివ్వుమనిపించడం లేదూ! 'మన
తెలుగు' అన్న
పట్టింపు మనకే ఏ కోశానా లేనప్పుడు.. తెలుగులో చదువుకున్న వారికి కనీసం
ప్రభుత్వాల తరఫునుంచైనా ఒనగూడే అదనపు
ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు రవ్వంత
కరవవుతున్నప్పుడు.. అమ్మభాషమీద ఎంత అబిమానం
పొంగిపొర్లుతుంటేనేమి.. ఆసాంతం తెలుగులోనే విద్యాబోధన కొనసాగించడం దుస్సాహసం అనిపించుకోదా!
తెలుగువాడికి
మొదటినుంచి పరభాషా వ్యామోహం అధికమన్న అపప్రథ ఒకటి ఎలాగూ ఒకటి ఉండనే ఉంది! ఆ లోపాల లోతులు తడముకొనే సందర్భం ఇది కాదు
వదిలేద్దాం.. కానీ.. కనీసం తెలుగుభాష
సాంకేతిక సామర్థ్యంమీద ..
వ్యావహారిక పదజాల సమృద్ధిమీద ..
అవగాహనా రాహిత్యం తొలగించుకోవాలా..
వద్దా! ఇతరేతర అవసరాల ప్రలోభాలవల్ల
ఒకవర్గం ప్రబలంగా సాగిస్తున్న తెలుగువ్యతిరేకతను అడ్డుకోవాలా.. వద్దా? కనీసం ఆ దిశగానైనా ప్రతి తెలుగు అభిమానిని సమాయత్తం చేయవలసిన గత్తర ప్రస్తుతం
గతకాలాలకన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంది.
ఉద్యోగ.. ఉపాధులాది నిత్యజీవితావసరాలకి
అవసరమయ్యే భాషమీద ఆధారపడటం ఎలగూ తప్పదు.. సరే! అలా ఆధారపడే ఉన్నతస్థాయికి
సొంతభాషను చేదుకోవడం ఎలగూ లేదు! ఉన్నస్థాయినుంచికూడా మరింత పాతాళానికి తల్లిభాష
జారుతుంటే తల్లడిల్లడే లక్షణాలు తెలుగువాడిలో
కల్లలవుతున్నాయి! అదీ కలవరం!
పుట్టిన నేల నేర్పించే మట్టిజ్ఞానాన్ని సైతం కాలదన్నే అజ్ఞానం రోజురోజుకీ అధికమయి
పోతున్నది! బుడత వయసునుంచే మెదడు మడతల్లో మనదికాని మరి దేన్నో బలవంతంగానైనా
చొప్పించాలని ఆరాటం! ఇంటభాషమీద సహజంగా
ఉండే అభిమానాన్ని ఇంతప్పటినుంచే బిడ్డకు దూరం చేయాలనే దురాలోచన!
ఏ
జాతికైనా తనదైన ఉనికి అంటూ ఒకటి ఉంటుందికదా!
ఉండాలి కూడా కదా! నలుగురిలో తను
ఏమిటో నోరు విప్పకుండానే చెప్పగలిగేది ఈ సంస్కారమే కదా! దానికీ ఓ పెద్ద ‘నమస్కారం’ పెట్టేసెయ్యడమే 'అల్ట్రా మోడరన్' నాగరీకంగా మన్ననలు పొందటమే ఆందోళన
కలిగించే అంశం.
తెలుగు
భాషాపరంగా తగినంతగా ఎదగలేదని కదూ ఆంగ్లమానస పుత్రుల అస్తమానం అభియోగం! గతంలోకి ఓ సారి తొంగి చూస్తే తెలుస్తుంది..
సమర్థతగల గురుతుల్యుల మార్గదర్శకత్వంలోనైనా సరే! తెలుగుభాష చూపించే వన్నెచిన్నెలు
ఎన్నెన్నో! విస్తుగొల్పేస్తాయి మన
తల్లిభాష విన్నాణస్థాయికి!
ఒకటో
శతాబ్దిలోనే హాలుడు అచ్చుతెలుగులో ముచ్చటయిన కావ్యసంపదను పోగుచేసాడు.
ప్రాచ్యభాషలెన్నింటిలోలాగానే తెలుగుమీదా సంస్కృతభాష ప్రభావం కాస్త అధికంగా ఉందన్న
మాట వాస్తవమే కావచ్చు కాదనేందుకేమీ లేదు కానీ.. సంస్కృతమూ భారతీయుల సంస్కారానికి
దర్పణీయమైనదే కదా!అయితేనేం.. పాలలో నీళ్లలాగా ఏ పరాయిభాష పదాన్నైనా తనలో
పొదువుకొనే సమ్మిళితశక్తి తెలుగుభాషకున్నంతగా మరే ఇతర భారతీయభాషకూ లేదన్న ప్రత్యేకత గుర్తించాలి.
గర్వించాలి. అన్నం.. పచ్చడి.. బట్టలు.. గుడిసె.. కుండలు.. పలక.. బలపం.. లాంటి
ఎన్నో ముచ్చటైన అచ్చుతెలుగు పదాలతో తెలుగు
సంచీ నిండి ఉంది. ఆ వాడుక పదాలనైనా అవసరానికి వాడుకొంటున్నామా? అనవసరమైన ఆంగ్లపదాలతో తెలుగుసంభాషణల బండిని
తోలుకుపోవడమే దొరలతనమనే భ్రమలో ఉన్నాం!
పొన్నగంటి
తెలుగన్న అచ్చమైన తెలుగు పదాలతో ముచ్చటైన
కావ్యరచనకు శ్రీకారం చుట్టేస్తే.. ఆ స్ఫూర్తిని అందుకొని మరింత వడుపుగా ముందడుగులు
వేసిన తెలుగు కవిమూర్తులెందరో! ఆ విశేషాలు అన్నీ
కాకపోయినా కొద్దిగానే అయినా తెలుగుబుద్ధికి తోచాలన్న సద్బుద్ధితో మచ్చుక్కి
కూచిమంచి తిమ్మకవి రాసిన అచ్చుతెలుగు
రామాయణంలోని ఈ ముచ్చటైన పద్యం మచ్చుక్కి
ముచ్చటించింది!
***
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment