వేటపాలెం పేరు
చెవిన బడంగానే చెవిలో వినిపించే మధురస్మృతుల్లో వెంకట్రాముడి
గానకచేరీ ఒకటి.
తెల్లారుఝామున
మొదలయ్యేది వాడి గానకచేరీ పెరట్లో! తోడి రాగాలు..
ఉదయరాగాల్లాంటి తేడాలేమీ తెలీని లేతవయసులో వాడి
నాదస్వరం మా పిల్లలకు ప్రాణాలు తోడేసినట్లుండేది. దానికి తోడు
కచేరీ పూర్తయేలోపు పక్కలమీదనుంచి లేచి పనుల్లో పడకపోతే మా అమ్మ ప్రాణాలు తోడేయడం అదనం.
వానరానీ.. వరదరానీ.. ఊరుమొత్తం దొంగలొచ్చి దోచుకుపోనీ..
వెంకట్రాముడి గానకచేరీ మాత్రం తొలిసంధ్యలో కనీసం ఒక గంటపాటైనా నిరాటంకంగా సాగాల్సిందే! వాడి నేపథ్యసంగీతంలోనే మా
పిల్లలంతా కాలకృత్యాలు పూర్తిచేసుకోవడం అప్పటి అలవాటు,
పై చదువులకని
వెళ్లి మధ్య మధ్యలో తిరిగివచ్చినప్పుడు తెల్లారుఝామున వెంకట్రాముడి నాదస్వరం చెవినబడంగానే
ప్రాణం లేచివచ్చినట్లనిపించేది.
అంతగా 'అడిక్ట్' అయిపోయామన్న మాట వెంకట్రాముడి సంగీత
కచేరీకి.
కాబట్టే జీవితంలో
అన్నిరకాల పోరాటాలు పూర్తిచేసి ఆఖరిదశలో మనశ్సాంతిగా బతుకు వెళ్లదీయాలన్న నిర్ణయానికి
వచ్చినప్పుడు ముందుగా గుర్తుకొచ్చింది మా ఊరు వేటపాలెం.. బ్రాహణవీధిలో వర్ధనమ్మగారి పెంకుటిల్లు.
దానివెనకాలే వెంకట్రాముడులాంటి నాయీబ్రాహ్మణులుండే మంగల్లంప.
పిల్లల్ని
ఒప్పించి మకాం మా ఊరికి మార్పించడానికి కొంత సమయం పట్టినా..
మొత్తానికి వర్ధనమ్మగారి ఇంటినే కొనడానికే నిర్ణయమయింది.
కొనేముందు
చూసిపోయేందుకని ఒకటికి రెండు సార్లు వచ్చినా..
వెంకట్రాముడి గురించి విచారించే వ్యవధానం లేకపొయింది.
చిన్ననాటి స్నేహితుడు ‘గుడిశర్మ’ కనిపించినప్పుడే ఆ విషయాలన్నీ మళీ చర్చకు వచ్చాయి.
'వెంకట్రాముడి కొడుకు మన ఆదినారాయణగారి మూడో మనమరాలిని లేపుకుపోయాడ్రా! అప్పట్లో అదంతా ఓ పెద్ద
గోల. అందరూ వెంకట్రాముణ్ణే తప్పు పట్టారు.
వెలేసారు. గుళ్లో కచేరీలే కాదు.. తలపనులక్కూడా
వాడు ఇప్పుడు మనవాళ్ళెవరికి పనికిరావడం లేదు. వెంకట్రాముడిప్పుడు మంచంమీద తీసుకుంటున్నాడు. ఇంకేం కచేరీలు నా బొంద! ఆ కథంతా ముగిసి ఏడాది పైనే ఐంది’
అంటూ చావు కబురు చల్లంగా చెప్పేసాడు.
కచేరీలు కాకుండా
క్షురకర్మ చేయడంకూడా నాయీబ్రాహ్మణుల వృత్త్తుల్లో ఒక భాగమే.
నాకిప్పుడు గుర్తుకొస్తోంది. మాఇంటి ముంగిట్లో
కూర్చుని తలపని చేస్తున్నప్పుడు
మా నాన్నగారు అడిగిన
ప్రశ్నకు సమాధానంగా చెప్పాడొకసారి వెంకట్రాముడు 'మా సాంబణ్ణి పెద్ద బడే గులాం సాహెబ్ మాదిరిగా
సెయ్యాలయ్యా!.. అదీ నా కోరిక' అనడం.
వెంకట్రాముణ్ణి
చూద్దామని శర్మతోసహా మంగల్లంపలోకి అడుగు పెట్టాను చాలా కాలం తరువాత.
గానకచేరీ నడిచిన
గుడిసె అలాగే ఉంది. కానీ.. దాని ఆకారం మాత్రం వెంకట్రాముడు అవతారంలాగే చీకిపోయి
ఉంది.
కుక్కి నులకమంచంమీద మాసిన చిరిగిన దుప్పట్లో మూలుగుతూ పడున్న ఆకారాన్ని చూపించి 'ముసలాడు మన మడుసుల్లో లేడయ్యా!' అంది ఆయన పెళ్లాం
నాగమ్మ కన్నీళ్ళు పెట్టుకొంటూ. చిన్నతనంలో ఆ తల్లి
సంజెవేళ దొడ్డిగోడమీదనుంచి మా
పిల్లలకోసమని అందించిన వేడి వేడి ఉలవచారు రుచి
నాలిక్కి తగిలిందిప్పుడు.
నా మనసంతా ఎలాగోఅయిపోయింది..
'వైద్యం చేయించడంలా?' అనడిగితే ఊరు
వెలేసిని మడిసిని వైద్దులు మాత్రం ఏం ఉద్దరిత్తారయ్యా! ఇల్లు గడవాడాలిగందా
ముందు! ఎన్నడూ లేంది
మాఇంటి ఆడపిల్లలు
పక్కూళ్లకెళ్ళి మంగలి పనులు నేర్సుకొంటున్నారిప్పుడు.
పొట్ట నిండాలి గందా!' అని నిష్టూరమాడుతుంటే వినడానికే
కష్టంగా అనిపించింది.
ఆ క్షణంలో
నిర్ణయించుకొన్నాను. మా నూతన గృహప్రవేశానికి వెంకట్రాముడి
మంగళవాయిద్యాలు పెట్టించాలని. సంభావనకింద
వెంకట్రాముడి తల్లి చేతిలో వెయ్యి నూటపదహార్లు పెట్టి 'ఏం చేస్తావో
పెద్దమ్మా! వచ్చే శ్రావణానికి మేం కొత్తింట్లోకి దిగుతున్నాం.
ఆ శుభముహూర్తానికి వెంకట్రాముణ్ణి తయారు చెయ్యాలి. ఇహనుంచీ రోజూ ఉదయాన్నే కచేరీ సాగాలి పెరట్లో ఇదివరకట్లాగానే. ఇది బయానా మాత్రమే! మిగతా సొమ్మ వెంకట్రాముడితోనే మాట్లాడి ఖాయం చేసుకొంటా!' అని చెప్పి బైటికి వచ్చేసాను.
శర్మ సంతోషంగా
నా భుజం తట్టడం నాకు ఆనందం అనిపించింది.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- మే 2016 సంచికలో ప్రచురితం)
No comments:
Post a Comment