Friday, March 3, 2017

జ్ఞాన 'సముపార్జన' - వ్యంగ్యం

" 'అజ్ఞానం' అంటే ఏంటి గురువా?"" 'జ్ఞానం' అంటే ఏంటో తెలుసునా శిష్యా?""తెలీదు కనకనే కదా స్వామీ.. తమరి  దగ్గరికీ రాక!""ఆ తెలీక పోవడమే 'అజ్ఞానం' అని తెలుసుకో నాయనా""ధన్యుణ్ని. ఆ అజ్ఞానం స్వరూపం ఎలా ఉంటుందో కూడా సెలవివ్వండి స్వామీ?"" 'స్వ'  అనద్దు బాలకా! అజ్ఞానం అవుతుంది.  ఆ విశేషణం నీ సొంతానికి వర్తించేది.   రాజకీయాల్లో ఉంటే  మినహా డాంబిక పదప్రయోగాలు  హాని చేస్తాయ్. అది  తెలివిడి లేకపోవడం కూడా 'అజ్ఞానమే' ""చిత్తం స్వామీ! ఆ 'అజ్ఞానం' ఎక్కడుంటుందో  కూడా వివరించి పుణ్యం కట్టుకోండి స్వామీ?"గురువుగారు గడ్డం నివురుకున్నారు.
గురువుగారి గుబురు గడ్డంలో దాగుందని శిష్యుడికి అర్థమైపోయింది. అందుకే కాబోలు..  అంతుబట్టని ప్రశ్న ఎదురు పడ్డప్పుడల్లా గురువుగారిలాంటి బుద్ధిజీవులు గడ్డాలు .. సీదా సాదా జీవులు బుర్రలు గోక్కుంటుంటారు.
"గురూజీ! 'అజ్ఞానం' అంటే గాడిద గుడ్డంటిదని అని ఎవరో  స్వాములవారా మధ్యో టీ.వీలో ప్రవచిస్తుండంగా  విన్నాను. అదెంత వరకు నిజం?"" 'గాడిద' నిజం. 'గాడిద గుడ్డు' అబద్ధం. నిజం నుంచి పుట్టే అబద్ధానికి 'గాడిద గుడ్డు' ఒక సంకేతంరా శిష్యా!  ఆ స్వామి వారన్న  మాట నూటికి నూటొక్కపాళ్లు  నిజమే!""మరి ఆ 'ఆజ్ఞానం' రుచికూడా ఎలా ఉంటుందో విశదపర్చండి గురూజీ?""'ఇంద' చిటికెడు పంచదార అప్పటికప్పుడు సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసి 'రుచి చూడు' అన్నారు స్వామీజీ."తియ్యగా స్వామీ!""ఇప్పుడు ఈ లోటాలోని కాఫీ ఓ గుక్కెడు  తాగి దాని రుచీ ఎలాగుందో చెప్పు!"ఎప్పుడు ఎలా వచ్చాయో కాఫీ.. కప్పు?!తాగి "కషాయంలాగా ఉంది స్వామీ!" అని అదో రకంగా మొహం పెట్టేశాడు శిష్యుడు."'ఇంద' ఈ సారి ఇంకో చిటికెడు ఉప్పు సృష్టించి శిష్యుడి నాలిక మీద వేసి 'రుచి చూడ'మన్నారు  గురువుగారు."ఉప్పగా ఉంది స్వామీ!""మళ్లీ ఇందాకటి లోటాలోని కాఫీనే ఇంకో గుక్కెడు గొంతులో పోసుకో! రుచెలా ఉందో చెప్పు!" ఆదేశించారు గురువుగారు."భలే ఉంది స్వామీ!  కానీ ఏ రుచో చెప్పలేను""ఆ చెప్పలేక పోవడాన్నే అజ్ఞానంగా తెలుసుకోరా శిష్యా!"
ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు శిష్యుడు. 'అయితే స్వామీ…"
"అర్థమయింది. వాసనను గురించే కదా నీ నెక్ట్ ప్రశ్న? ఉనికిలో ఉన్నదానికైతే వాసనంటూ ఏదైనా ఉంటుంది కానీ.. అసలు ఉనికే లేని అజ్ఞానానికి  వాసనేముంటుందిరా అజ్ఞానీ!"శిష్యుడికి మెల్ల మెల్లగా అర్థమవుతోంది అజ్ఞానసారం. అయినా అయినా ఇంకా ఏదో ఇతమిత్థంగా తేలని సందేహం. "స్వామీ! ఆఖరి క్వశ్చన్. జ్ఞానం సంపాదించేందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా తంటాలు పడుతుంటారు. కొందరు ఒంటికాలుమీద  తపస్సు చేస్తుంటారు. నా వంటివారు  మీ బోటి జ్ఞానుల చెంత  చేరి తత్త్వబోధలు వింటుంటారు. ఇంకొందరు గ్రంధ పఠనం,  మరికొందరు ప్రపంచ పర్యటనం.. ఇలా ఎవరికి తోచిన పద్ధతులు   వాళ్లు ఆచరిస్తుంటారు. జ్ఞానం వల్ల ఏదో మేలు.."''అవును.  మంచి చెడ్డా.. లాభం నష్టం.. ఉచితం అనుచితం తెలుస్తాయి  కాబట్టి ఆ యాతనలేవో వాళ్లు అలా  పడుతుంటారురా బాలకా!""మరి అజ్ఞానం వల్ల ఏం లాభం ఉందని  స్వామీ.. ఇంతమంది ఈ లోకంలో జ్ఞానసముపార్జనకు ఏ ప్రయత్నమూ చేయకుండా  ఆ వర్గంలోనే ఉండిపోడానికి కొట్టుకు ఛస్తున్నారూ? ముఖ్యంగా మన రాజకీయ నాయకులు?""ఇదేరా భడవా.. అసలు సిసలు  అజ్ఞానమంటే! పొరుగువాడిని ప్రేమించు! ఎల్లప్పుడూ సత్యమునే పలుకు! ఆడవారిని తోబుట్టువుల్లాగా గౌరవించు! పెద్దలమాట చద్దిమూట. ఆడి తప్పకు. దొంగతనము చేయద్దు. అహింస పరమ ధర్మం. జంతుహింస అమానవీయం. దుర్భాషలాడబోకు! నీతి మార్గం విడవబోకు!' వంటి మంచి సూక్తులన్నీ వింటూ కూర్చుంటే లోకంలో మనం ఎవరికీ  ఏ మంచీ చేయలేం. మనక్కూడా మనం ఏ మేలూ చేసుకోలేం. అడ్డదారిలో  గడ్డికరిస్తేనే కదరా  బిడ్డా.. ఆదాయానికి మించిన ఆస్తులేవైనా  కూడగట్టే  పట్టు దొరికేది! కొడుకులను.. కూతుళ్లను.. అల్లుళ్ళను.. కోడళ్ళను అందలమెక్కించకుండా అలా గాలికొదిలేస్తే వాళ్లు అజ్ఞానంతో చేసే అల్లరి చిల్లరి పన్లతోన్ అంతా ఆగమాగమయిపోదా శిశువా?   పెద్దతనంలో మనం ఏ రోగమో రొప్పో వచ్చి   మంచంపట్టాక  పక్కగుడ్డలు మార్పించే  నాధుడు కూడా కరువవుతాడు. ఎక్కడెక్కడి వాళ్లో సహేలీలు.. స్నేహితులంటూ  సంబంధాలు కలుపుకొని కోటలో పాగా వేస్తారు.  సంపాదించుకున్న మంచి పేరుకు  తూట్లు పడతాయ్! సొంతానికంటూ ఆస్తులేవో పది రకాలుగా  కూడబెట్టుకోకుంటేనే కదా శిష్యా..  కోట్లు లక్షలు ఖర్చయ్యే ఎన్నికల గోదార్లో పడి గట్టెక్కగలిగేది?  అక్రమార్కుడి మార్కు ప్రత్యర్థి అజ్ఞానుల్ని  పడగొట్టాలన్నా  చెడ్డదారి  తొక్కడం కన్నా మంచి మార్గం మరోటేమనా ఉందా మూర్ఖా!   ఇందాక నువ్వన్నావే.. ఆ  జ్ఞానార్జన గట్రాలతో  జీవితంలో  సాధించిందేముందో ఆలోచించురా శిష్యా? భావి చరిత్రకారుల దయాదాక్షిణ్యాలను దేబిరించటం కన్నా.. పదవుల్లో    పచ్చగా  ఉన్నప్పుడే చరిత్ర పుటల్లో  పేర్రాయించుకొనే ఏర్పాట్లు చేసుకోడం మేలు. ధనమూలం ఇదం జగత్! డబ్బుతో దెబ్బేయలేనిదేదీ లేదీ లోకంలో! జ్ఞానసముపార్జన ధనసముపార్జన కాళ్లకడ్డంరా శుంఠా!  అజ్ఞానమే ఓటర్ల తత్త్వంగా తయారైనప్పుడు వాళ్ళు బుట్టలో పట్టానికి  జ్ఞానమార్గం నమ్ముకుంటే  అంతకు మించిన అజ్ఞానం మరోటేమన్నా ఉందా శిష్యా! ఇప్పుడు చెప్పు! జ్ఞానానికా? అజ్ఞానానికా నీ ఓటు?" శిష్యుడు అప్పుడే మొలుస్తున్న గడ్డం నిమురుకోడం మొదలు పెట్టాడు."కళ్లు తెరిపించారు గురూజీ! ధనమూలం ఇదం జగత్. సందేహం లేదు. కాబట్టే సర్వసంగపరిత్యాగులై ఉండీ తమబోంట్లు ఒక్క  ప్రశ్నకు  లక్ష చొప్పున  నిర్మొహమాటంగా ఎంత ఘనాపాటీనుంచైనా రొక్కం  గుంజేస్తున్నారు.  తమరి సంపాదనకు దొంగలెక్కలు రాయలేక నా రెక్కలు గుంజేస్తున్నాయి. తమరి శిష్యుణ్ణి. గురువు మార్గమే కదా శిష్యుడికీ సదా శిరోధార్యం!  అజ్ఞానుల వర్గంలో పోటీ తాకిడి మరీ ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా పొలిటికిల్ సర్కిల్లో.  నా బిడ్డలకూ బారెడు  గడ్డాలూ మీసాలు పెరిగి నాలుగైదు రాజాశ్రమాలు.. టీ వీ ఛానెళ్లు  దొరికిందాకా.. చారెడు రూకలు సంపాదించి ఉంచుకోవాలి కదా! తమరి లాగా జ్ఞాన 'సముపార్జన'కే  నా ఓటు కూడానూ!" సభక్తిపూర్వకంగా చేతులు జోడించి  నిలబడ్డాడు శిష్యుడు లేచి వెళ్లడానికి సంసిద్దుడవుతూ."అదిరిందిరా శిష్యా! అదీరా అసలైన జ్ఞానమంటే! విజయీ భవ!" ఆశీర్వదించారు గురువుగారు.*** 

-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...