Tuesday, March 7, 2017

చవలాయీల దినం- ఓ నెల ముందుగానేనా!



జనాభాకన్నా ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రజాస్వామ్యం మనది. ఆరుపదులు నిండకుండానే స్వాతంత్ర్ర్ర్య యోధుల పింఛన్లందుకునే సమర యోధులూ దండిగా ఉన్న ధర్మభూమీ మనదే! ఇక్కడ 'ఇడియట్ బాక్సు'ల అమ్మకాలకు ఎంత లావు ఆర్థిక మాంద్యాలైనా అడ్డు రాలేవు! సూర్యమండలంమీదైనా సరే భూములు చవగ్గా అమ్ముతున్నారంటే కొనేదానికి కుమ్ముకు చచ్చే ఆసాములు గజానికొక అరడజనుకైనా   తక్కువ కాకుండా వర్ధిల్లే పూర్ణగర్భ కూడా ఇదే.. ఇదే! ఇంతకన్నా మన తెలివితేటలకు నిదర్శనం ఇంకేం కావాలి?!

యథా రాజా తధా ప్రజా! పాత పథకాకాలకే కొత్త కొత్త పేర్లెట్టేసి పార్లమెంటులో ప్రధాని అనుచరగణం పడా పడా చదివేసుంటే.. చేతులు నొప్పెట్టే దాకా చప్పట్లు కొట్టేస్తుంటారు మనం ఎన్నుకున్న ప్రతినిధులు! కన్యాశుల్కం నాటకంలో ఒక్కడే వెంకటేశం. మనదేశ ప్రజాస్వామ్య నాటకంలో అడుగడుక్కీ వెంకటేశాలే! వెంకటేశాలూ పిచ్చిపుల్లయ్యలూ ఒకళ్ల నొకళ్లు తిక్కశంకరయ్యలు చెసుకొంటూ సంబరపడే పండుగ పేరే… చవలాయీల దినం. ఐ మీన్ ఆల్ ఫూల్స్ డ్!

ఈ 'ఫూల్సు  పండుగ'ని కనిపెట్టిన మహానుభావుడెవరో కానీ మహా గడుసుపిండమై ఉండాలి. చవలాయీల దినం.. ఆర్థిక సంవత్సరం ఒకే సుమూహర్తంలో వచ్చేస్తుంటాయి. ఏడాది పొడుగూతా మనం గడిపిన చచ్చు జీవితాన్నోసారి సింహావలోకనం చేసుకోడానికి.. ముందు ముందు ముంచుకు రాబోయే ముప్పులకి మనల్ని మనం సంసిద్ధం చేసుకోడానికి.. ఈ చవటాయీల సంబరాన్ని మించిన ఉత్తమ సందర్భం మరోటి లేనే లేదు. హ్యాపీ ఫూల్సు డే.. ఇన్ ఎడ్వాన్స్!

'ఫూల్' అంటే తెలివితక్కువ దద్దమ్మని కదా అంతరార్థం. నా కన్నీ తెలుసనుకొన్నవాడంత దద్దమ్మీ లోకంలో మరొకడుండడు. మనం దున్నుకునే,  మనదే అనుకొనే భూమి ఏ పెద్దమనిషి కభ్జా పద్దుల్లోకి పోబోతుందో పుట్టించిన భగవంతుడికైనా తెలీదు. నీ బ్యాంకు కాతా జమా సొమ్ము  ఖాయంగా నీదేనన్న ధీమా  నీ దగ్గరే ఉంటుందా పర్మినెంటుగా? అందాకా ఎందుకయ్యా.. నీ మనీ పర్సు చిల్లర వందనోట్లు కచ్చితంగా నకిలీ.. మకిలీలేవీ కానే కావని కనీసం నీకైనా తెలుసా?  అందుకే గురజాడగారి గిర్రాయిగాడనేది అస్తమానం 'ఈ తెలివితక్కువ లోకంలో తెలివితక్కువగా బతకడం కన్నా తెలివైన కార్యం మరోటేదీ లేద'ని. తెలివి ఎక్కువై పోతే తెల్లారి లేచినప్పట్నుంచి తిప్పలే తిప్పలు!

భర్తృహరంతటి మహాకవే తన సుభాషితాల్లో ముందుగా మూర్ఖుణ్ని తలుచుకొన్నాడు. నిప్పుకు నిరు, ఎండకు గొడుగు, ఏనుగుకి అంకుశం, ఎద్దు.. గాడిదలకు ముల్లుగర్ర, రోగానికి మందు, విషానికి మంత్రం… విరుగుడుగా చెప్పిన శాస్త్రాలు సైతం చెవటాయీలకు మాత్రం ఏది నిదానమో నిర్ధారించలేక చేతులెత్తేసాయ్' అంటాడా పెద్దాయన.
పప్పుతో వజ్రాన్నైనా పరా పరా కోసేయచ్చేమో కానీ మంచి మాటలు చెప్పి మూర్ఖుణ్ని రంజింపచేయడం.. ఉప్పు సముద్రంలో తేనె బొట్టేసి తీపిదనాన్ని ఆశించడమంత తెలివితక్కువతనం అనటం .. ఎంత తెలివైన మాట!

జేబులో చిల్లి కానీ లేకపోయినా ఎన్నికల్లో నిలబడి నెగ్గేయ గలమని ఎవరైనా నమ్మగలరా.. ఈ కలికాలంలో మన ప్రజాస్వామ్యంలో? తెలుగు చిత్రాలకు ఏనాటికైనా తప్పకుండా ఆస్కారు పురస్కారాలొచ్చి తీర్తాయని ఆశపడగలరా ఎవరైనా? టీ.వీ ధారావాహికలు పదమూడు ఎపిసోడ్లతో పరిసమాప్తమవుతాయనీ, పెట్రోలు రేట్లు ఎప్పటికైనా తగ్గుముఖం పట్టక తప్పదనీ, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల్లేకుండానే పిల్లకాయలకు  తెలుగు పాఠాలు చెప్పే మంచిరోజులొస్తాయనీ మీరూ నమ్ముతున్నారా? కచ్చితంగా నమ్మేవారంతా కలసి చేసుకోవాల్సిన ఘనమైన సంబరం ఈ ' చవటాయీల దినోత్సవం'.
విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే పాలచెంబులతో  పరుగులెత్తే భక్త గణాలు, పూర్వజన్మల  పాప ప్రక్షాళనార్థం  బాబాల కాళ్లతో తన్నించుకోడానికి  బ్లాకు టిక్కెట్లకోసమైనా  ఎగబడే ముక్తి కాంక్షాపరులు, బైటకళ్లకు కనిపించేదంతా అశాశ్వతమైన తోలుతిత్తి ఆత్రమేగాని, అసలైన లోపలి అంతరాత్మ ఎన్ని అంట్లపనులు చేసినా  మైలనేది అంటుకోదని దృశ్యకావ్యంలో శృంగార లీలలు ప్రబోధించే ఆనందస్వాముల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలాచరించే భక్తపరమాణువులంతా కల్సి ఓ 'చవటాయీల సంఘం' సగర్వంగా ఆరభించుకోదగ్గ సమయం.. సందర్భం ఇదే.. ఇదే!
ఎలాగూ ఏదో ఒక జనాభా లెక్కల గలభా లెప్పుడూ జరిగే గణాంకాల దేశం మనది. ఈ సారైనా మూర్ఖుల వివరాలు సమగ్రంగా సేకరించే ఏర్పాట్లు సర్కార్లు సక్రమంగా చేపట్టే దిశగా వత్తిడి తెచ్చేందుకు  ముక్కోటి మూర్ఖుల సంతకాలు సేకరించే ఉద్యమం  చిత్తశుద్ధితో ప్రారంబించాల్సిన తగిన తరుణమూ ఇదే! చవలాయీలెవరైనా  చైతన్యయాత్రలు తెచ్చుకొనేందుకు ఈ దినాన్ని మించిన సముచిత సందర్భం మరోటి లేనే లేదు.
ఫోర్బ్స్ జాబితా టాప్ టెన్లో మనవాళ్లేదో ఇద్దరు ముగురున్నందుకే మురిసి ముక్కలైపోతున్నామే! ఫోర్బ్సుగాళ్ళను ఫూల్సు జాబితా నిజాయితీగా రిలీజు చేయమనండి.. టాప్ టెన్ థౌజండ్లో ఒక్క పేరైనా పక్క దేశాలకు పోయే ఛాన్సు బొత్తిగా లేదు. నోబెల్ పురస్కారాల్లాంటివి దద్దమ్మలకూ ఇచ్చే పద్ధతీ ప్రారంభిస్తే ఏడాదికో డజను మంది మన దేశంనుంచే పోటీ పడ్డం ఖాయం.

మనలోని తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేక పోవాడాన్ని మించిన తెలివితక్కువతనం మరోటి లేదు. 'మనవాళ్లొట్టి చవటాయిలోయ్' అంటూ గురజాడగారి గిరీశం చేత గోతాలు చెప్పించుకోడం కాదు.. ఆ దిశగా మనల్ని మనం ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన ప్రణాళికలింకా ఎన్నెన్నో సర్కార్లు సిద్ధం చేయాల్సుంది! ఆందోళనలకు దిగితేగానీ ఈ మొండి సర్కారులేవీ బండిదిగిరావని అందరికీ తెల్సు. వచ్చే నెల ఏప్రియల్ ఫస్టుకే 'చవలాయీల దినం'. అందుకే ఓ నెల ముందుగానే ఇన్నేసి హెచ్చరికలు!.
కోట్లు కూడేసి విలాసవంతమైన జీవితం దిలాసాగా గడిపుతున్నా.. ఆ  పెద్దమనుషులెవ్వరినీ 'టచ్' చెయడానికైనా దడిసి.. నాలుగైదు చిరిగిన చీరలకేవో  చాటు మాటుగా మూట కట్టుకు పోయే చవటాయిని  పట్టుకుని ఏడాదిపాటు ఏ వారంటూ లేకుండా  కటకటాల వెనక కుక్కి యమదర్శనం చేయిస్తున్నదంట మన ఘనమైన తెలంగాణా రక్షక భటశాఖ!
కేకోయ్  కేక! 'మూఢుల దినం' ఇంకో ఇరవై రోజులుందనంగానే మన శాంతిభద్రతల సిబ్బంది  అప్పుడే తన వంతు  'చెవలాయీల సంబరాలు' ఆరంభించేసిందన్న మాట! శభాషో శభాష్!
***
-కర్లపాలెం హనుమంరావు 

(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుటలో  2010నాటి ఏప్రియల్ ఫూల్సు డే  సందర్భంగా ప్రచురితం) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...