Wednesday, March 22, 2017

పెద్దమనుషులు కావలెను


ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యమే కానీ.. పెద్దమనుషులకే పెద్ద కరవొచ్చి పడిందిప్పుడు మన  పెద్ద దేశంలో!
గద్దెమీదున్నంత  కాలం 'కారు' కూతలతో కాలక్షేపం చేసిన హస్తం పెద్దలు.. అధికారం దూరమై పోగానే 'కారుకూత'లకు దిగిపోతున్నారు! మొన్న పంద్రాగస్టు పండగనాడూ.. దాంతాడు తెగా..  జెండా తాడు లాగేందుక్కూడా జిల్లాకో పెద్దమనిషి కరవయ్యాడయ్యా మన  బంగారు తెలంగాణంలో!
కరవు లేందెక్కడ?.. అని దబాయించద్దు! అపరాలనుంచి..  ఆడకూతుళ్ల వరకు, బడిబుక్కుల్నుంచి.. మడిచెక్కల వరకు.. అన్నింటా కరవే! ఆ జాబితా ఏకరువు పెట్టాలంటే కాగితానిక్కరవు. సమయాని.. స్థలానికి అంతకన్నా కరవు! నిజవేఁ కానీ.. పెద్దమనుషుల కరవు కందిబద్దల కరవు పద్దులా కాదు గదా! దేశీయంగా దొరక్కపోతే ఏ అఫ్రికానుంచో దిగుబడి చేసేసుకొని పబ్బం గడిపేసుకోడానికి!
పెద్దల సభల్నిండా బెంచీలు పట్టకుండా పెద్దతలకాయలు అనున్నాయిగా?’ అనీ అడగద్దు. అటేపెళితే  ప్రజాప్రతినిధుల హక్కుల గోల! మనకొద్దు! ఇటేపు ఇలా ఊళ్ళల్లోకోసారొచ్చి తొంగి చూడండయ్యా బాబులూ! చిన్నబళ్ల పంతుళ్లే  చిన్నూళ్ళల్లో పెద్ద తలకాయలు. పంతుళ్లందర్నీ మంత్రులంతా సొంత పన్లకి ఎగరేసుకొని పోతుంటే పంచాయితీ పంచలు.. పైన కండువాలున్న దొరలెవరూ లేకుండా బోసిపోతున్నాయయ్యా!
పద్దస్తమానం ఏవేవో ఎన్నికలు జాతర్లు కదా మన ప్రజాస్వామ్య దేశంలో! అందుకే రాజకీయాల్లో నలిగే దొరబాబులెవ్వరికీ  'పెద్ద మనుషుల' పాత్ర పోషించే తీరిక దొరకడం లేదు! సుపరిపాలన స్థానంలో 'సుపారీ' పాలన వచ్చి పడ్డానికి పెద్దమనుషుల కొరతే ప్రధాన కారణం.
దేశాలకీ దేశాలకీ మధ్య ఉద్రేకాలు. రాష్ట్రాలకీ రాష్ట్రాలకీ మధ్య రచ్చరచ్చలు. రాష్ట్రాలకీ కేంద్రానికీ మధ్య కీచులాటలు. ప్రాంతాలకీ ప్రాంతాలకీ మధ్య పొరపచ్చలు. ఊళ్లమీదకి ఊళ్ళే వచ్చి పడిపోతా ఉంటే.. ఊళ్ళోని పేటలకీ పేటలకీ మధ్య పేచీలు ముదిరిపోతున్నాయ్. ఆడా.. మగా మధ్యా ఆగడాలకయితే అంతే లేదింక. అంతెందుకు.. అయ్యేయస్సులు.. ఐపీయస్సుల మధ్యా 'పీస్' పీసు పీసులై పొయ్యేదాకా యవ్వారాలు ముదిరి పాకాన పడ్డాయంటే  పెద్దతలకాయలు లేని లోటు  కొట్టొచ్చినట్లు కనబడుతున్నట్లేగా లెక్క!కాలజ్ఞానం బ్రహ్మంగారైనా ఊహించుంటారా  ఈ అకాల పెద్దమనుషుల ఉపద్రవం గోల!
న్యాయపాలకుల తీర్పుల్ని కక్షిదారులే లక్ష్య పెట్టడం లేదండీ!  అంతర్రాష్ట్ర వివాద  సంఘాల సలహాలన్నీ చెవిటివాడి  ముందూదే శంఖువులవుతున్నాయి ! పెద్దతలకాయల కరువ్వల్లే కదా సర్వే సర్వత్రా  ఈ రవ్వా.. రట్టూనూ!
అమెరికాలో, జపాన్లో కుర్రకారుకు మాత్రమే కొరతంట! మన దగ్గరో? పెద్దతలల్లేక  తల పట్టుకోవాల్సిన తంటా!
రెండు పుష్కరాలొచ్చి పోయాయి ఈ మధ్యనే! వారాంతం వచ్చి పోయిందంటే సరి .. తిరుమలగిరి నుంచి వేదాద్రి వరకు వేలాదిమంది భక్తులు పాప పంకిలంనుంచి  విముక్తులైపోతున్నారు.. తత్తరపాటుతో ఎవరొక్క మాట తూలినా.. ఉత్తర క్షణంలోనే ముక్కు రాపిళ్ళు.. కాణిపాకం గుళ్లో  దీపాలార్పుళ్లు దివ్యంగా జరిగిపోతున్నాయి! బాబాలు. అమ్మోర్లు.. స్వాములార్లు.. అవధూతలు.. అక్కడికీ అడుగడుక్కీ పీఠాలేర్పాటు చేసుకొని పాపపంకిలాలను ప్రక్షాళన  చేస్తూనే ఉంటిరి! ఏడాది తిరిగేసరికల్లే వేలాదిమంది ఖైదీలు.. తీవ్రవాదులు.. క్షమాభిక్షలు పొంది మరీ  జనజీవన స్రవంతుల్లోకొచ్చి పడిపోతున్నా.. పెద్ద తలకాయల లోటు  పూడటం లేదెందుకో.. బొత్తిగా అంతుబట్టకుండా ఉందే!
పరమాత్ముడు అక్కడికీ అన్నేసి అవతారాలెత్తి మరీ ధర్మసంస్థాపనలు గట్రా నిర్వహిస్తున్నా ఇంకా ఈ శిష్టజనుల  కొరత కొనసాగడమేంటో.. విపరీతం కాకపోతే! కాలం ఎంత కలికాలం నాలుగోపాదమీద కంటుతున్నా దొడ్డతనం లేమి మరీ ఇంత విడ్డూరంగా ఉందేవిఁటి  స్వామీ?
అట్లాసులు, ఆంజనేయుళ్లు, కుంభకర్ణుళ్లవంటి  భీకరాకారాలకు కొరతైతే.. ఏదో ఒలంపిక్సు మార్కు  డోపింగు మందుల్తో  తలకాయలు ఉబ్బించుకోవచ్చు. ఏళ్ల తరబడి న్యాయస్థానాలు  విచారణలు గట్రా చేసీ  చేసీ మరీ  నిర్ధారించిన పెద్దమనుషులమీదా   మళ్లా మళ్లా మసి పడాల్సిందేనని  అప్పీళ్ళు పడిపోతుంటే .. పెద్దమనుషుల కొరత ఇహ్క తీరేదెప్పటికి? 
కొత్త జిల్లాలు.. తొందర్లో పట్టాలమీదకు ఎక్కబోతున్నాయి. మండలాల గుమ్మాలక్కూడా రేపో ఎల్లుండో కొత్త మావిఁడి మండలు వేలాడబోతున్నాయి!   ఇప్పుడే పెద్ద తలలకింత  తలనొప్పి తంతుగా ఉందే.. ! ముందు ముందు  సమస్యెంత ముదరనుందో.. తలుచుకొంటేనే గుండెలదురుతున్నాయ్! సర్కారే సమస్యా పరిష్కారానికి పూనుకోవాల్సుందిహ.
ఉద్యోగాలు.. ఉపాధులంటూ ఎటూ ప్రణాళికలూ సాగుతూనే ఉన్నాయిగదా! పనిలో పని.. 'పెద్ద మనుషులు 'కేటగిరీ' ఒకటి కొత్తగా సృష్టిస్తే సరి! చదువు సంధ్యలబ్బక అబ్బల రెక్కల కష్టంమీద పడి మెక్కే పోరంబోకులకింత ‘ప్రత్యేకహోదా’  క్కించినట్లవుతుంది! పేకాట రాయుళ్లమీద 'పెదరాయుళ్ళ' ముద్దర్లద్దితే  పల్లెల్లో పెద్దతలలకిహ వెనక్కి తిరిగి చూసే అగత్యముండదు. కీచకుల చేతికి సర్కారు 'కీ' పోస్టులొస్తే  ఆడకూతుళ్ల హడావుళ్లతో పరువుపోయే బెడద   తగ్గిపోతుంది. పేచీకోరుగాళ్లందరికీ  పెద్ద పీటలేసేస్తే ..   గోచీపాతరాయుళ్ల గోడుకి  చుక్క పెట్టినట్లవుతుంది. 
అక్రమార్కులమీద ఉక్కుపాదం మోపి చక్కబెట్టిన ఘనకార్యమొక్కటైనా ఉందా సర్కార్ల రికార్డుల్లో  ఇప్పటి వరకూ? బుద్ధిగా గూండాల పాదాలకు గండపెండేరాలు తొడగడం.. పెద్దతలల గండం చిటికెలో  తేలిపోయే చిటుకండీ! దైవత్వాన్నైనా  దర్జాగా ప్రసాదించే రోజులు. ధైర్యంగా ఏ సన్నాసికైనా పెద్దరికాన్ని అంటకట్టేయచ్చు. ప్రశ్నించే దద్దమ్మలకు పెద్దమ్మ తెరిసాను ఉదాహరణగా చూపిస్తే సరి. 
కొత్త రక్తాన్నే  కనుక్కుంటున్న మేధావులమండీ మనం! 'పెద్దమనుషులు' అనే కొంగొత్త పదవుల్ను సృష్టించలేమా? 
'మనుషులే కాని వాళ్ళకు 'పెద్దమనుషుల' పదవులేంటనా?' సందేహం మహానుభావా?  అమెరికా అధ్యక్షపదవిని కోరుకున్న  పెద్దమనుషులిద్దరూ  మన దేశీయ  భభ్రాజమ్మలకన్నా  దేంట్లో మిన్నంటా?
పనులు చక్కబెట్టడమే పెద్దమనుషుల  ముఖ్య బాధ్యతైతే ..  నయీం ఎటూ పోయాడు..  అతగాడి  అనుచరవర్గాన్నైనా  సర్కారు అక్కున చేర్చేసుకోవాలి. అర్హతలు సడలించైనా 'పెద్దమనుషుల' పోస్టుల్లోకి సర్దుబాటు చేసేయాలి! తాత్సార చేసుకొంటూ పోతే పొరుగు దేశమే స్వర్గధామం అన్న  ప్రచారం పెరిగి పోతుంది. తస్మాత్ జాగ్రత్త! తరువాత పట్టుకుని కూర్చోడానికి పెద్దసైజుది అలా ఉంచి చిన్నతలకాయైనా దొరక్కపోవచ్చు!
-కర్లపాలెం హనుమంతరావు



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...