Saturday, July 11, 2020

మేధస్సు రాజకీయం వెంట ‘పడి’పోకూడదు! -కర్లపాలెం హనుమంతరావు - సూర్య సంపాదకీయ వ్యాసం





పశ్చిమ జర్మనీ పురాప్రాణి విజ్ఞానవేత్తలలో ప్రముఖుడైన మానసిక విజ్ఞానశాస్త్రవేత్త ప్రొఫెసర్ రూడోల్ఫ్ బిల్జ్ మనిషి చిత్త ప్రవృత్తి మీద అనేక పరిశోధనలు చేసిన అనంతరం తేల్చి చెప్పిన సారాంశం – మనిషి మనసు ఇట్లా ఉంటుంది.. అట్లా ఉంటుంది’ అని గట్టిగా స్థిరపరిచి చెప్పడానికి  ఏ మాత్రం వీలులేని బ్రహ్మపదార్థం- అని. పరిస్థితిని బట్టి ప్రవృత్తి మార్చుకోవడం మనసు బలం. అధునాతమైన ఏ విజిజ్ఞాసాపథప్రమేయ విజ్ఞానమైనా ఈ తరహాలో ఉన్నప్పుడు ఇవాళ జరిగే సంఘటనకు మనిషి రేపు ఎలా స్పందిస్తాడో అన్న ఊహ ఊసుబోకకు మాత్రమే పరిమితమవుతుంది. సాహసించి ఏ కొద్ది మంది బుద్ధిబద్ధ మేదావుల కొంత కల్పన చేసినా ఆ ఊహపోహలు వేటికీ గతకాలపు అనుభవాలను దాటి ముందు వచ్చే పాటి శక్తి చాలదు. ఆ మేధోవర్గ ప్రవచనాలను ఆధారం చేసుకుని తతిమ్మా సామాన్య జనం పడే గుంజాటనల ఫలితాంశమే  లోకంలో ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్న రాజకీయ  గందరగోళ వాతావరణం.
మేధోవర్గంగా మన్ననలు పొందిన బుద్ధిజీవులు ఈ రోజు తమకు తాముగా అస్వతంత్రులవుతున్నారు.  ప్రయోజిత  ఆలోచనాధారకు తమదైన శైలిలో ముద్రలు వేస్తూ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.  మద్దతు  లభించని పక్షంలో  ఆకృతి లేని మాటలకు, నిరాకార భావాలకు ఏలుబడికి వచ్చే అవకాశం ఉండదని తెలిసే ఈ ప్రక్రియ కొనసాగడం ఆందోళన కలిగించే అంశమే కదా?
సమూహాలను మించి వ్యక్తులను అభ్యుదయ శక్తులుగా చూడడమూ, సముదాయాల మీద  వ్యక్తుల ఆధిపత్య ధోరణికి హారతులు పట్టడమూ.. రెండూ వాంఛనీయం కాదు. ప్రజాస్వామ్య పంథా ఏలుబడి మార్గంగా ఎంచుకోబడిన చోట అది మరీ ప్రమాదకరం.  నిబద్ధ రాజకీయాలు (కమిటెడ్ పాలిటిక్స్) అన్న అభాసాలంకారమే అసలు పుట్టేందుకు ఆస్కారం ఉండకూడని జనస్వామ్య వ్యవస్థలో ‘నిబద్ధ మేధోవర్గం’ కూడా ఒకటి పుట్టుకురావడం విషాదకర పరిణామం.
కాలగమనాన్ని, సాంకేతిక విజ్ఞాన ప్రగతిని, విజ్ఞానశాస్త్రపు మనోవేగ ప్రసరణ తీవ్రతను గమనించనివారు మాత్రమే నిబద్ధ రాజకీయం’ అనే ఆలోచన చేసి ఆనక దాని చూట్టూతా సమాజాన్ని సైతం తిప్పించాలని తాపత్రయం చూపించేది. అది వృథా ప్రయాసగా మారిందని గ్రహించే వేళకు వారి పొద్దు ఎటూ వాటారిపోతుంది. దానితో కొంత మంది స్తబ్దుగా  తెర వెనకకు మలిగిపోతారు. మరి కొద్దిమంది బుద్ధిజీవులు ఆగలేక ఆఖరి నిశ్వాసలో నిట్టూర్పు ధ్వని వినిపిస్తారు. విన్యాసం ఏదైనా కావచ్చు కానీ.. రెండు చర్యల సారాంశం మాత్రం ఒక్కటే.. ‘ఏకబద్ధ మేధోసిద్ధాంతం’ అనే ఆలోచనకు ఎప్పుడైనా చివరకు దక్కేది  వైఫల్యమేనని.
 రాజకీయాలలో మాత్రమే ఈ తరహా నాటకీయ ప్రవృత్తులు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. రాజకీయవేత్తలకు ఉండే ప్రత్యేక లాభం కూడా అదే. పరార్థాన్ని స్వార్థం ఆక్రమిస్తుందో, స్వార్థం స్థానే పరార్థం రూపు దిద్దుకుంటుందో.. ఒక పట్టాన అర్థం కాని మయసభ మాదిరిది ఈ ఊసరవెల్లి క్షేత్రం. రాజకీయాలలో వ్యక్తిగతప్రయోజనం పార్టీ ప్రయోజనంగా విలసిల్లడమూ, పార్టీ ప్రయోజనం ప్రజాభీష్టంగా  ప్రదర్శించే ప్రయత్నాలు సందర్భాన్ని బట్టి ముమ్మరించడమూ మనం చూస్తుంటాం.  అందులో ఏది ఏదో చెప్పడం బ్రహ్మకైనా సాధ్యంకాదు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఉండే విశాలమైన అర్థం పరిమిత ప్రయోజనాలకు కుచించుకునిపోయే సందర్భాలు అవే. ఈ వైపరీత్యానికి కారణమేంటని గాని ఆలోచించగలిగితే రాజకీయవేత్తలలో నిరంతరం గూడుకట్టుకుని ఉండే సంకోచం.. భయం అని నిస్సంశయంగా చెప్పుకోవచ్చు. బహుత్వంలో ఏకత్వం దర్శించలేక తమ అస్తిత్వం పట్ల గూడుకట్టుకునే అభద్రతాభావన అది. ఆ భావన ప్రసరణ వివిధ రూపాలే రాజకీయాలలో క్షణక్షణం సాగే రసవత్తర నాటక ప్రదర్శనలకు మాతృక.
ద్వంద్వాలను చూస్తూ, వాటికి అతీతంగా ఉంటూ,  ప్రకృతిని, దాని సృష్టిని జడం నుంచి స్థావరం వరకు, స్థావరం నుంచి జంగమం వరకు సూక్ష్మ అనుశీలన చేసి లోకానికి స్థూలం నుంచి విపులంగాను, విపులం నుంచి స్థూలం వరకు వివరించి చెప్పవలసిన బాధ్యత  మేధోసంపన్నులది. ఆ మేధోవర్గమూ రాజకీయవేత్తల పాత్రల్లో ఇమిడే ఇప్పటి ప్రయత్నాలు విచారం కలిగించే వైపరీత్య విపరిణామం.  
రాజకీయవేత్తల ప్రవృత్తి పరిశీలన పద్ధతికి, మేధావుల ప్రవృత్తి పరిశీలన పద్ధతికి విధిగా తేడా ఉంటుంది. ఉండాలి కూడా. ఆ అంతరం గుర్తెరుగకుండా మేధావిత్వం వెలగబెడుతున్నామనే మెజారిటీ  ఆలోచనాశీలులు తమ్ము తాము వంచించుకుంటున్నారు; తమను నమ్మిన  సామాన్య లోకాన్ని సైతం వంచించాలని చూస్తున్నారు.
రాజకీయవేత్త ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థపు ఎల్లలు దాటి బైటికి చూడవు. మేదావికి ఆ అడ్డమాకులతో ఏం పని నిజానికి? అతని మనసు ఆకాశంలో స్వేఛ్చావిహారం చేసే విహంగంతో సమానమని కదా లోకం మన్నన! నిస్సీమమర్యాదగా సంచరించే ఆ మనసుకు హద్దులెక్కడివి? కేవలం సంకెల బద్ధం కాని బుద్ధిబలం ఒక్కటే మేధావిని కాని, రచయితను కాని, కళాకారుడిని కాని రాజకీయవేత్త నుంచి వేరు చేసి చూపించే గొప్ప లక్షణం. మేధావికీ   కమిట్ మెంటులు, కట్టుబడులు, బిగింపులు, అదుపాజ్ఞలకు లొంగుబాట్లు ఉన్న పక్షంలొ అతని ఆలోచనాధార, ప్రవాహఝరులకు అడ్డుకట్టలు డుతున్నట్లే లెక్క!
 ఇప్పుడు ఈ దేశపు మేధోలోకంలో గోచరించే ఈ సీమాయితబుద్ధిమత్వమే భయపెడుతోంది. రాజకీయవేత్తలోని రాజకీయ పదజాలాన్ని అరువు తెచ్చుకుని తమ ఆలోచనలకు తామే బందీలవుతూ.. లోకాన్ని సైతం తమ పరిమిత భావధారతో బంధించాలని చూస్తున్నారు మేధావులు! మనిషిని విశ్వరూపుణ్ణిగా మార్చవలసిన మేధావి పరిమితుణ్ని చేయాలన్న ప్రయత్నం విచారం కలిగిస్తోంది.
భూమి బంధాలను  సైతం విజ్ఞానశాస్త్ర సాధనతో ఒక వంక తెంచివేస్తోనే మరో వంక నుంచి తనలోని పెరగలేనితనం వెర్రిపిలకలు వేస్తున్నా నిర్లిప్తత పాటించడం నిజంగా ఒక వైపరీత్యమే! ఉత్తమోత్తమమైన  ఉత్ఠానమే సిద్ధాంతంగా అమలు కావాలన్న పంతంలేమి ప్రధానంగా ముందుకు రావడం.. అంటే మేదావులు తమ పాత్ర నిర్వహణలో విఫలమవుతున్నట్లే లెక్క. సంకోచం లేకుండా మేధావులు రాజకీయాలలో పడిపోతున్నారన్న మాటే.. అనుమానం లేదు!

 మహాప్రళయంలో కూడా నిర్భయుడు, నిరాసక్తుడు అయివుండవలసినవాడు, భయభ్రాంతులుగా, మమతాచిత్తులుగా మారిపోవడం దేనికి సంకేతం? అనుశీలన పరిశీలన కన్నా దిగువ స్థాయికి దిగజారిపోవడం ఏ ప్రమాదానికి ఆహ్వానం? ఏకదేశసిద్ధాంతాలకు తమను తాము బిగించుకున్న ఫలితంగా మేధావులలో వ్యుత్పన్నత పలచబారిపోతోన్నది. 'నాతనం' నావారు అనుకున్నవారి చేతకానితనాన్ని  వేలెత్తి చూపించడానికి నామోషీ పెడుతోన్న సందర్భం దశ కూడా దాటిపోయింది. ఇప్పుడు మేధావులూ బరితెగింపు మార్గం పట్టేసారని లోకం బాహాటంగానే విమర్శిస్తున్నది. ఎవరు నొచ్చుకున్నా చెప్పక తప్పని  చేదు నిజం ఇది.
గిట్టని వర్గాల చేవకు చెయ్యెత్తి జైకొట్టడం జైళ్లకు చేర్చే సాకుగా  మారడం స్వార్థరాజకీయాలకు అతుకుతుందేమో! ఆ తరహా  కుతిల(బాధామయ) స్థితులకూ ఒక అంతస్తు కల్పించే ప్రయాస మేధోలోకం నుంచీ ఔత్సాహికంగా రావడమంటే.. నిస్సందేహంగా జనస్వామ్యవ్యవస్థ సర్వవినాశనానికి నాందీ వచనం ఆరంభం అయినట్లే! చీకటిలో తచ్చాడే మనుషులకు  ఏ ఒక్క మేధోజీవీ అనధికార దీపంగా అయినా  వెలిగి రహదారికి ఎక్కే  దోవ చూపించేందుకు సిద్ధంగా లేని  దుస్థితులు మళ్లీ దాపురించాయని నిస్సందేహంగా చెప్పేయవచ్చు. 
ఇక్కడ ఇప్పుడు ఏది లేదో దాని వల్లనే అంతటా చీకటి. ఆ చీకటి పారదోలడమే పనిగా ఉండవలసిన మేధోవర్గమే జనం చీకటిపాలబడేందుకు మొదటి కారణమవుతున్నది. దో విచిత్ర పరిస్థితి.
మేస్సుకు ఎవరో భాష్యం మార్చేసినట్లుగా ప్రస్తుతం ఏ ప్రచార మాధ్యమం గమనించినా ఆలోచనాపరుడంటే ఏకదేశ రాజకీయభావవిన్యాసకుడుగా మాత్రమే దర్శనమిస్తున్నాడు!


సమాజం మహాసముద్రం. గభీరం, గంభీరమైన అగాధమొకటి ఎదు ఉండగా, దానిని వివిధ నత్తల్లో అనుశీలన చేసి వడగట్టిన ఫలితాంశాలను సమాజశ్రేయస్సుకు అంకితమిచ్చే పని మేధావిది. ఆ విధి దిక్కులేనిది అయిపోయింది.
అభివృద్ధికి అర్థం నాలుగు రాళ్లు చేతుల్లో ఆడడం కాదు. సామాజికుణ్ణి ఎంత వరకు స్వతంత్రుణ్ణి, సమగ్రుణ్ణి, సర్వతోముఖుణ్ణిగా తీర్చిదిద్దుతుందన్న దాని మీదనే దాని  ప్రకాస్తి నిలుస్తుంది. ఎటూ రాజకీయవేత్త వల్ల కాని పని ఇది. మనిషిని బంధించేందుకు మాత్రమే ఎత్తులు  వేసేది రాజకీయం. జన బంధ విముక్తి తన ఉనికికి ఇబ్బందని దానికి తెలుసు. కనుక విడిచే పరిస్థితి ఉండదు. సామాజికుడి విముక్తి, జీవన విస్త్రృతులే లక్ష్యంగా పనిచేసే మేధావి  పనివిధానం అందుకు విభిన్నం.
ప్రపంచ దేశాల  వర్తమాన పరిస్థితులతో దేశీయుడి జీవన స్థితిగతులను ఎప్పటికప్పుడు తుల్యమాన పద్ధతిలో బేరీజు వేసుకుంటూ మంచి చెడులను చర్చకు పెట్టడం, క్రియాశీలులు  తమ ఉద్యమాలకు ఉత్తమ లక్ష్యాలు సిద్దంచేసుకునేందుకు వీలుగా వేదికల కల్పనలో తమ వంతు అంకితభావంతో నిర్వహించడం  మేధోజీవి పాత్ర. మేధావి  ఎట్టి సంకటంలో కూడా ప్రతినివిష్ఠ బుద్ధి కాకూడదు.  మనసుకు సంకెళ్లను పడనీయకూడదు. బంధం ఒకరు వేసినా, తనకు తానుగా వేసుకున్నా.. ఆ క్షణం నుంచి   అతని వాణి స్తబ్దము, దభ్రమూ కాకతప్పదు.

రాజకీయం, మేధస్సుకుకానొక అంగం మాత్రమే! ఎల్లవేళలా ఒకే ఆకారంలో ఉండని రాజకీయ వ్యవహారాలను తన సర్వస్వంగా భావించిన మేధావి మేధోమధనను నమ్మలేం. కారణం, అతడూ రాజకీయవేత్తతోనే తన బాణి, వాణి మార్చుకునే వర్గంలోకి దిగజారుతాడు కనక.

రాజకీయాన్ని, దానిలోని వైవిధ్యాన్ని మేధావి ద్రష్ట బుద్ధితో అనుశీలన చేసి అందులోని ఋతానికి, ధర్మానికి మాత్రమే ఆవిష్కర్తృత్వం వహించే బాధ్యత భుజాన వేసుకోవాలి. అట్లా వేసుకోగలిగిన మేధావులే నామవాచ్యులయినట్లు చరిత్ర రుజువులు చూపిస్తోంది. ఆ విధంగా చేయలేనివారు విపరీతపు సిద్ధాంతాలను బుర్రలోకి చొప్పించుకుని మేధోమార్గాన్నే మొత్తంగా పర్యాప్తమూ, పరిమితమూ చేసుకుంటున్నారని చెప్పాలి. పరిమిత సూత్రాలకు అపరిమతమైన ధార్మికతను అంటకట్టి కోరి కోరి తమకు తామే భావనాపంజరాలలో చిలకలుగా మార్చుకుంటున్నారు తాజా మేధావులు! ఎవరి పలుకులో అస్తమానం  చిలుకల్లా వల్లించడంతో మేధస్సుకు దక్కవలసిన న్యాయమైన గౌరవం దూరమవడానికి  కారకులవుతున్నారు.
లోకంలో ఏ సిద్ధాంతమూ, ధర్మమూ సమగ్రంగా ఉండవు. ఎల్లాకాలం ఒకే రూపంలో  చెల్లుబాటవాలనుకోవడం ధర్మం కూడా కాదు.  నిన్నటి ధర్మం ఈ రోజు చద్దివాసన వేయక తప్పదు. కారణం ఏ సిద్ధాంతమైనా ఏదో ఒక  వర్గ  ప్రయోజనానికి పరిమితమయి స్థిరపరచిందవడమే! అప్పటి కాలానికి అది ఉత్తమమని తోచినా.. కాలగమనంలో అవసరాల నిమిత్తం రంగప్రవేశం చేసే నూతన సిద్ధాంతాలు దానిని నిర్వీర్యం చేయడం తప్పనిసరి. అప్పుడు రాజకీయవేత్త కన్నా ముందు దాన్ని నిర్ద్వందంగా సమర్థిస్తూ వచ్చిన మేధావి సమాజం ముందు బోనులో నిలబడే  దుస్థితి వస్తుంది. 
 మానవ చరిత్రలో ఇంత వరకు ఎన్ని రాజకీయ సూత్రాలు అవతరించలేదు! అవధులులేని అధికారాలు అనుభవించీ కాలానుగతంగా అంతరించిపోలేదు! సిద్ధాంతం ఏదైనప్పటికి, ప్రతిదీ మంచి చెడుగుల కలగలుపు నేతే. తానులోని ఏ పోగులు శాశ్వత, సర్వహిత ధర్మ  సమ్మత లక్షణ సమన్వితమైనవో అనుశీలన చేసి ప్రపంచానికి  విడదీసి చూపించడంతో మేధావి బాధ్యత సంపూర్ణమయినట్లే!
కాలం అచంచలం, పృథివి పరిమితం -అన్నట్లుగా నిత్యం ప్రజాజీవితాలతో స్వీయప్రయోజనార్థం రాజకీయవేత్తలు రూపకాలు ప్రదర్శిస్తుంటారు. మేధావులు  వాటికి సూత్రధారుల వేషం కట్టకూడదు. పాత్రధారణనయితే బొత్తిగా దూరం పెట్టడం ఉత్తమం.
బంధాలు లేని  విచారధార వల్లనే కదా విజ్ఞానశాస్త్రం మానవపురోగతికి శక్తి మేరకు సమిధలు సమర్పించ గలుగుతున్నది! ఈ ఒక్క సూత్రం పట్టుకుని మేధోవర్గమూ ముందుకు పోగలిగినప్పుడే ప్రకృతి జనిత సర్వ పదార్థాల క్రమావిష్కార రహస్యాలను   అనుశీలించ గలిగే తన ప్రత్యేక శక్తిసామర్థ్యాలను   నిలుపుకునేది. మనిషిని సర్వతోముఖమైన సర్వజన సంక్షేమంకరమైన కళ్యాణమార్గం వైపుకు మళ్లించే సంకల్పం నిలుపుకోదలుచుకుంటే .. ఇప్పటిలా  ఏదో ఓ రాజకీయ పక్షాన్నో, పంథానో అదే శాశ్వతమని నెత్తిన పెట్టుకు వూరేగే మూఢత్వం ప్రదర్శించకూడదు. ఎంత లావు మన్నన పొందిన మహామేధావికయినా ఈ నియమంలో మినహాయింపులేదు.
 ఏకసిద్ధాంతబద్ధతకు లొంగని నిబద్ధత నిలుపుకున్నంత వరకే మేధావిలోని అసలు మేధస్సుకు జవం, జీవం.. మన్ననా, మర్యాదా. మాన్యత సాధించిన మేధోవర్గం ద్వారానే సామాన్య జనానికి ఎప్పటికప్పుడు వర్తమాన సమాజంలోని రాజకీయ స్థితిగతులు, మంచి చెడ్డలు వడగట్టినట్లు బోధపడేది.
***
(11 -07 -2020 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...