Saturday, July 25, 2020

హేతువాదమే ప్రగతి బాటకు రహదారి! -కర్లపాలెం హనుమంతరావు = సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం - కర్లపాలెం హనుమంత్తరావు



చదువుకున్నవాడికీ, చదువులేనివాడికీ మధ్య ఉండే తేడా మనకు విద్యాలయాల ద్వారా సాధించే పట్టాల రూపంలో మాత్రమే చూడడం అలవాటు. ఇప్పుడా విద్యారేఖా అడ్డుగా ఉండని గొడ్డుమోతురోజులు ముంచుకొచ్చేసాయి. ఆక్స్ ఫర్డ్ లో చదివినా అమ్మనా బూతులు కూస్తేనే తప్ప 'పప్పూ కాదురా సోదరా.. పొరపడ్డాం.. మగాడేరా'! నే మెప్పులు పొందే తప్పుడు సమాజంలో మనమిప్పుడు  అతి కష్టం మీద  ఎట్లాగో ఊపిరి పీలుస్తున్నాం.  హేతువును గురించి ఏమన్నా రెండు హితవైన ముక్కలు చెప్పాలన్నా జంకే! ఎక్కడ 'గిరీశం లెచ్చర్ల ' కోవలోకి జారిపోతామోనన్న బెంగతోనే నోళ్లు కుట్టేసుక్కూర్చునే మేధావులే మట్టంగా దర్శనమిస్తున్నా రిప్పుడు సర్వత్రా. విశ్వాసాలకు, మూఢవిశ్వాసాలకు.. జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉండే అడ్డుగీతలు మామూలు చేతులతో స్పర్శిస్తేనో, కళ్లతో దర్శిస్తేనో నిర్ధారణ చేసుకునే వెసులుబాటు ఉండదు. వీక్షణ, ఆలోచన, విశ్లేషణ, వివేచనలతో కూడిన పని ఎవరైనా బుద్ధిశాలి కొద్దిగా ధైర్యం చేసి  కాస్త కూడబలుక్కునైనా   విడమరచి చెప్పే దుస్సాహం చేయబోతే.. ఠక్కున ఏ దిక్కు నుంచైనా పాతచెప్పులు రేకేట్లలా దూసుకొచ్చే ప్రమాదం కద్దు. 
బుద్ధి కర్మానుసారిణి, అంతా విధి చేతుల్లోనే ఉంది.. మనుషులం కేవలం నిమిత్త మాత్రులం .. లాంటి అహేతుక  భావజాలాంధకారంలో పడి విద్యలు నేర్చినవారు, రాజ్యాలు చేసేవారు, జీవితాలు తీర్చిదిద్దే బాధ్యతలు నెత్తికెత్తుకున్నవారు కూడా కొట్టుమిట్టులాడుతుంటే, పొట్ట కూటికై పాకులాడేందుకే ఎక్కడి జీవితకాలమూ చాలని బక్క మనిషి నుంచా  మనం  మంచిబుద్ధి,  సదసద్విచక్షణలు ఆశించేది?! తరతరాలుగా భావదాస్యంలో మునిగి తేలే అక్కచెల్లెళ్లు, అట్టడుగు జాతుల వంటి విస్మృతవర్గాలవారిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఇంటా బైటా సవాలక్ష ఆంక్షలతో సతమతమయ్యే బక్కజీవి మతి కుదిరి, ఓ మూలను చేరి మంచిచెడులు తీరికగా తర్కించుకునే పాటి సావకాశం పాడు ఆధిక్యతాభావ  ప్రపంచం ఎక్కడ ఏకాలంలో పడనిచ్చింది గనక?! జీవికకు ఏ మాత్రం అక్కరకు రాని  దురభిమానాలు, హెచ్చుతగ్గులు, జాత్యహంకారాలు, కుల మత భేదాలు, అవినీతి, కాముకత్వం వంటి మానసిక జాడ్యాలు నానాటికి పెచ్చుమీరుతున్నాయంటే, అందుక్కారణం  మంచేదో, చేడేదో తర్కింఛుకోవలసిన గత్యంతరం బొత్తిగా లేని అడ్డుగోలు గొడ్డుమోతుతనమే గద్దె మీద చేరి గద్దించి మరీ పనులు సానుకూలపరుచుకునే  కువిధానాల వల్ల.  నాగరికత- పేరుకే ఇరవయ్యకటో శతాబ్దానిది. సంస్కారం- ఒకటో శతాబ్ది కాలాన్నైనా దాటి రాని దుస్థితి. సంఘంలో, ఆర్థిక రంగంలో అశాంతి, అక్రమాలు అంతకంతకు తమ రికార్డులు తామే బద్దలు కొట్టుకుంటున్నాయంటే.. అన్యాయమే రాజకీయగద్దె మీద గజ్జె కట్టి హేతువనే పదానికుండే మూలార్థాన్ని మొదలంటా పెళ్ళగించేందుకు కంకణం కట్టుకోబట్టి కాదూ!
సమాజానికి, కుటుంబానికి కూడా ఎంతో కీలకమయినవి బడుగుల పాత్ర, స్త్రీ పాత్ర. విస్మృతులకు దక్కే హోదా, స్థాయిలే ఆయా సమాజాల ప్రగతి వికాసాలకు కొలమానాలు. తక్కువవర్గాలుగా బావించుకునేవారులోని తతనాన్ని తామే స్వయంగా  గ్రహింపుకు తెచ్చుకుని కలిసొచ్చే సానుకూల శక్తులని తోడు తెచ్చుకునైనా చొరవగా ఒక అడుగు ముందుకు చొచ్చుకుపోకపోని పక్షంలో ఈ సమాజానికి ఇక సమంజసత, సున్నితత్వం, సహేతుకత, సమ్యక్ దృష్టి ఏకమొత్తంగా అలవాటు తప్పిపోయే  పరిస్థితులు దాపురించినట్లే లెక్క.. నిజం చెప్పాలంటే!
సమాజమనే కాదు, వ్యక్తి జీవితంలోనూ ప్రజాస్వామ్యం వెల్లివిరిసిన  వాతావరణం వర్ధిల్లినప్పుడే సర్వే జనా సుఖినో భవన్తు అనే  సూత్రసారం ఆసాంతం సాకారమయే సావకాశం! ఉదాత్తమైన ఆశయాలు, ఉత్తేజకరమయిన ఆలోచనలకు సహేతుకతా తోడయే తప్ప మనిషి ఆలోచనల్లో మంచి మార్పు రాదు. మంచి మార్పు వస్తేనే  ప్రపంచానికి ప్రస్తుతం దాపురించిన దుస్థితుల నుంచి విముక్తయేందుకు  మార్గం దొరికేది.  చార్వాక, కపిల, కణాదుల సిద్ధాంతలతో కూడా బాల్యం నుంచే పరిచయం పెంచుకోవాల్సిన అగత్యంలో ప్రస్తుతం మన సమాజమున్నది. అట్లాగని తిరుగుబాటే మా వేదాంతం అని నినదించాలని కాదు. విప్లవాత్మకమైన ఆలోచనా ధోరణులకు ఎల్లవేళలా స్వాగతపత్రం అందించేందుకు మనసును  సిద్ధం చేసుకొనుంచుకోవాలనేదే.. హితవు.
తిరుగుబాటు వేరు.. విప్లవం వేరు. సిపాయిల తిరుగుబాటు వంటి తిరుగుబాటులకు అన్ని వేళలా సహేతుకమైన కారణాలే ప్రేరణలవుతాయన్న హామీ ఏమీ లేదు. కానీ.. భావవిప్లవం అంటే మాత్రం కణకణ మండే  అఖండ జ్వాలామాల. దానికి ఉత్తేజమనే ఇంధనమందేది మాత్రం అన్ని వేళలా అన్ని వైపులా  హేతుబద్ధమైన వికాసాలోచనల స్రవంతుల నుంచి మాత్రమే! ఆంగ్లసీమలో 1689లో హద్దులెరుగని రాచరికానికి కళ్లెమేసిన తీరులో సాగేదీ విప్లవోద్యమం. ప్రాతినిధ్య అధికారం ఉన్నవారికే పన్నులు విధించే హక్కన్న హేతుబద్ధ ఆలోచనే 1776 నాటి అమెరికన్ ప్రజాస్వామిక విప్లవానికి దారి తీసిన  ప్రేరణ.  స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శవంతమైన  భావజాలం బలం పుంజుకుని 1789 ప్రాంతంలో  ఫ్రెంచి విప్లవానికి ప్రోద్బలంగా నిలచిన సందర్బం గమనించినా, 'భూమి.. తిండి.. శాంతి' వంటి వాస్తవావసరాల నిమిత్తం హోరెత్తిన 1917నాటి రష్యన్ల విప్లవం పరిశీలించినా, కార్మిక, కర్షక, మధ్యతరగతి, అణగారిన వర్గాల వంటి ఇతరేతర విస్మృత శక్తులు  ఆయా దేశాలలో  సాధించిన అన్ని విజయాల వెనకున్నదల్లా హేతుబద్ధమైన ఆలోచనాక్రమ వికాససరళి వెన్నుదన్నులు మాత్రమే అని అర్థమవుతుంది. 1947 నాటి భారత స్వాత్రంత్ర్యసమరం గాని, మరో రెండు ఏళ్ల తరువాత చైనాలో చెలరేగి విజయం సాధించిన జనచైనా విప్లవం గాని.. లోతైన సునిశిత పరిశీలనకు దిగితే చివరికి తేల్చేవి..  హేతువుతో కూడిన సమ్యక్ దృష్టి సమాజం అట్టడుగు వర్గాల వరకు చేరి ప్రభావితం  చేస్తేనే తప్ప అమానుషత్వం అణగారి సమసమాజ నిర్మాణానికి సానుకూల బాటలు పడబోవని.  
సమాజ పరివర్తనకు, భావగమనానికి అవినాభావ సంబంధం ఉంది. అయితే ఆ భావాలు ఎవరి ద్వారానో ప్రతిపాదితమై ప్రభావితం చేసేవా? మన మెదడులోనే కదలడం మొదలయినప్పటి బట్టి స్వత్రంత్ర బుద్ధితో పెంపొందేవా? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు విశ్వవిఖ్యాత ఆలోచనావిప్లవ మేధావి ఎమ్.ఎన్. రాయ్ రెండవదే శిరోధార్యమని బల్లగుద్ది  మరీ చెప్పిన సత్యం మనమిక్కడ స్మృతికి తెచ్చుకోవడం అవసరం.
రాయ్ ఆలోచనా సరళి ప్రకారం, వ్యక్తివాదం, హేతువాదం , మానవవాదం..  అనే మూడు గుణాలతో మనిషి ఆలోచనా క్రమం ప్రభావితం అవుతుంది. తతిమ్మా అన్ని జీవులకు మల్లేనే మనిషి పుట్టుకా ప్రకృతి నుంచే. ప్రకృతి నియమం క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి మానవ వికాసమూ, మనిషి పెరుగుదలా నియమబద్ధంగా.. అంతే హేతుబద్ధంగా సాగుతాయనేది  రాయ్ రేడికల్ హ్యూమనిజం సూత్రం. 
మానవవాదం పురాతనకాలం నుంచి సదాలోచనా పరంపరగా సమాజంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్నదే! కదిలే కాలంతో కదా మనిషి సహప్రయాణం చేస్తున్నది!   పెరుగుతున్న మానవ మేధస్సు, నాగరికతల మూలకంగా సమకాలీన భావజాలం సంధించే క్లిష్టమైన ప్రశ్నలు సహజంగానే ఎన్నో పుట్టుకువస్తాయి.  ఎప్పటికప్పుడు మొలకెత్తే కొత్త కొత్త సందిగ్ధాలకు సంబద్ధమైన బదుళ్లిచ్చే క్రమంలో నవ్యమానవవాదం అనే మరో భావధారకు పురుడుపోసిన ప్రజామేధావి ఎమ్.ఎన్.రాయ్.

స్వభావసిద్ధంగా స్వేచ్ఛాపిపాసి, సత్యాన్వేషి- మనిషి. అతను తన మనుగడ సాగించుకునే క్రమంలో అంతరాత్మ చెప్పే నీతి.. (అదే ఎక్కువ మందికి భగవంతుడు చెప్పే నీతిగా అనిపించేది), ప్రయోజనం కలిగించే నీతి అనే రెండు దోవల నుంచి ప్రేరణ పొందుతాడని, ఈ రెండు దిశలకు ప్రత్యామ్నాయంగా హేతుబద్ధమయిన నీతిమార్గంమాత్రమే మనిషి నడిచే సన్మార్గంగా ఉండాలనేది రాయ్ నవ్యమానవవాద మూల సూత్రం.

రాజకీయాలలో పార్టీలు లేని వ్యవస్థను, ఆర్థికరంగంలో సహకార సంబంధమైన ప్రణాళికా రచనలు ప్రతిపాదించే తీరులోనే,  సాంస్కృతిక రంగంలోనూ స్వతంత్ర బుద్ధితో హేతుబద్ధంగా చేసే ఆలోచనాధారను ప్రోత్సహిస్తుందీ సిద్ధాంతం. సంఘపరంగా సాగే అన్ని రకాల వివక్షలను నిర్ద్వందంగా నిరసిస్తుంది కూడా. కుల, మత, వర్గ, ప్రాంత, భాష, జాతి, దేశ విభేదాల జాబితాలో లింగ విభేదమూ ఉంది. విశ్వజనీనమైన సంస్కృతికి విలువిస్తూనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం చూడగల సత్తా ఈ మానవవాదానికి ఉంది. ఆఖరుదే  అయినప్పటికీ అత్యంత ప్రధానమైన అంశం, విశ్వాసాలు మూఢవిశ్వాసాల కిందకు దిగజారడాన్ని నిర్మొహమాటంగా నిరసించే పదునైన ఆయుధం నవ్యమానవవాదం.


ప్రకృతికి మించిన శక్తి మరేదీ లేదు. మనిషి తన మనుగడకు, తన భవిష్యత్తుకు తానే బాధ్యుడు. తన మేలుకు, సాటి మనిషి మేలుకు మధ్య ఘర్షణ లేదని.. ఉండకూడదన్న జీవన సూత్రాలను మాత్రమే సామాజిక పరిస్థితుల మెరుగుదలకు సాధనాలుగా వాడుకునే ప్రయత్నం చేయాలని నవ్యమానవవాదం హితవు చెబుతుంది.
ప్రస్తుతం ప్రపంచ మానవాళి సంస్కృతులే మహాచిక్కుల్లో నలుగుతున్నాయి. మత ప్రాబల్యం, ఫాసిజం తరహా ఎన్నో ఇతరేతర నియంత్రణ విధానాలు సర్వజనసంక్షేమ కాంక్ష మీద నిప్పులు కురిపిస్తున్నాయి. విజ్ఞానం సహేతుకమైన మార్గంలో అభివృద్ధిచెందడం, మేధస్సు కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చెయ్యడం, సృజనశక్తి సరికొత్త జవసత్తువలు పుంజుకునే నూతన తాత్విక చింతనలకు ప్రాతిపదికలుగా వాతావరణాన్ని మలుచుకోవడం తప్పనిసరి అయిన ఈ తరుణంలో, లోకం రోజురోజుకూ మూఢవిశ్వాసాలు, మూర్ఖాలోచనల రొంపి వైపుకు శరవేగంగా అంగలువేయడం  సామాజిక శ్రేయోకాముకులు ఎవరికైనా అమితాణ్దోళన కలిగించే అంశమే!
పదునెక్కిన నైతిక దృక్పథం మొక్కటే ముందుకు చొరబడి రాక తప్పని తరుణమిది. సమయానుకూలమైన మౌనభంగిమలనే హూందాతనంగా మేధావులు భావిస్తుండవచ్చు. పెద్దరికం ప్రదర్శంచడమంటే ఇతరుల హక్కులకు భంగం వాటిల్లని పద్ధతిలో స్వయం వికాసమార్గాలను అన్వేషించుకునే మార్గాలు వెతికి సూచించడం. అర్థం. క్రమశిక్షణ మిషతో మనిషిని ఒక యంత్రంలా మార్చే విధానాలకు సత్వరమే తిలోదకాలు ఇవ్వడం అవసరం. యాంత్రీకరణ మానవీయ విలువలను.. క్రమంగా మానవతను కూడా ధ్వంసం చేసే మహారక్కసి. తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతమైన, సమగ్రమైన విలువలను ఫణంగా పెట్టే జీవనవిధానాలను చెత్తబుట్టలో వేసి తొక్కేస్తే తప్ప ఆ రక్కసి కర్కోటకం నుంచి నిజమైన విముక్తి అట్టడుగు జీవి వరకు  చేరే అవకాశంలేదు.
వ్యక్తి స్వేచ్ఛ ఆవశ్యకతను తక్కువ చేయలేం.. కాని సమాజశ్రేయస్సు  తరువాతనే దానికి ప్రాధాన్యత. భౌతికపరమైన అవసరాలు తీరే నిమిత్తం పరుల స్వేచ్ఛను హరాయించడం అమానుషమవుతుంది. మానసిక స్వేచ్ఛ, సామాజిక చింతన లేకుండా ప్రగతిని సాధించడం మోచేతి కింది బెల్లం నాలుకతో అందుకోవడంతో సమానం.
నిజం చెప్పాలంటే, మానవవాదంలో పిడివాదానికి, పిడిగుద్దుల సిద్ధాంతానికి  తావేలేదు.  మానవవాదం మరో పేరే వ్యక్తి స్వేచ్ఛ. మారే సమాజానికి అనుగుణంగా అభ్యుదయ పంథాలోనే విధానాల మార్పుకు సౌలభ్యం కల్పించే మౌలిక జీవనసూత్రానికి హేతువాదం కట్టుబడి ఉంటుంది. విజ్ఞాన కాంతిని ప్రపంచశాంతికి వినియోగించే సమన్వయ బుద్ధి సాధించాలన్నా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొనే సవాలక్ష సవాళ్లకు సహేతుకైన సమాధానాలు  వెతికే మనస్తత్వం బాల్యం నుంచే అలవరచుకోవడం ఒక్కటే గతి.  
-కర్లపాలెం హనుమంతరావు
(26-07 -2020 నాటి సూర్య దినపత్రిక సంపాదకీయపుట ప్రచురితం)


                                                

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...