Tuesday, February 1, 2022

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం- గల్పిక ఎందరో మేతగాళ్లు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 )

 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం- గల్పిక 

ఎందరో మేతగాళ్లు 

రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 ) 



రోజూ ఉండే రాజకీయాలకేంగానీ, ఇవాళ నీకు మహాభారతంలోని ఓ మంచికథ చెప్పాలనుందిరా? 


చెప్పు బాబాయ్! కహానీలు చెప్పడంలో నిన్ను మించిన మొనగాడు లేడులే, కానీయ్! 


సృంజయుడనే ఓ మహారాజు, సంతానం లేదు. నారదులవారు ఓసారి చూడ్డానికొచ్చి- గుణవంతుడు, రూప వంతుడు అయిన కొడుకు పుడతాడని ఆశీర్వదించాడట. 'గుణాన్ని ఏమన్నా కోసుకు తింటానా? రూపంతో పనేమి లేదు... రూకలు సృష్టించే పుత్రుణ్ని ప్రసాదించండి స్వామి! వాడి చెమట, కన్నీళ్లు, లాలాజలం కూడా బంగారంలా మారిపోవాలి మరి ' అని కోరుకొన్నాడట మహారాజు . అట్లా పుట్టినవాడే సువర్ణష్ఠీవి.


వాడే గనక ఇంకా జీవించి ఉంటే మన ఆదాయప్పన్ను వాళ్ళకి నిండా బోలెడంత పని


హుష్ ! ముందు కథ విను! వాడినొకసారి దొంగలు ఎత్తుకెళ్ళారు. ఆశకొద్దీ బంగారంకోసం కడుపుకోసి చూస్తే నెత్తురు, మాంసం, పేగులూ తప్ప ఏమీ లేవు. చచ్చిన కొడుకును చూసి రాజుగారు ఏడుస్తుంటే నారదుడొచ్చి ఓదార్చాడు. ' శ్రీరామచంద్రుడి లాంటి మహానుభావుల్ని కోరుకోవాలి గానీ, బంగారం కోసం యావపడితే ఇట్లాగే ... చివరికి బూడిదే మిగిలేది ' అని బుద్ధిచెప్పి ఆ కొడుకును మళ్ళీ బతికించి పోయాడు నారదుడు.


బాగుంది. ఇంతకూ ఇవాళ నీకెందుకీ హరికథ హఠాత్తుగా గుర్తుకొచ్చింది!


పత్రిక చూస్తుంటే లంచాలను గురించి ఓ కథనం కంటబడిందిరా! కూరగాయలు, పెట్రోలు రేట్లు పెరిగి పోతున్నట్లు లంచాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయట! అవినీతి నిరోధకశాఖ పట్టిక ప్రకారమే పట్టుబడ్డ ఉద్యో గుల అక్రమార్జన నిరుడు సగం మెట్రోరైలు ప్రాజెక్టు ఖర్చంత ఉందిట! ఏసీబీవాళ్లు దాడిచెయ్యని, చెయ్యలేని సొమ్మంతా పోగేస్తే- ఏకంగా పోలవరం ప్రాజెక్టునే పూర్తి చెయ్యొచ్చునేమో! సమాచార హక్కు చట్టాలు, అన్నా హజా రేలు, అవినీతి నిరోధక శాఖలు, అడుగడుగునా విజిలెన్సు కమిషన్లు, కొరడాలు ఝళిపించే న్యాయస్థానాలు, జనాల చీదరింపులు.. ఎన్నున్నా... ఇదేందిరా పచ్చిగడ్డే పరమాన్న 'మనుకునే లంచాల పిచ్చి మనవాళ్లకు వదలకుండా పట్టుకుంది?


'లంచం- ఏంటి బాబాయ్... మరీ అంత మొరటుగా పిలుస్తావ్! ముడుపులు, నైవేద్యాలు, మామూళ్లు, చాయ్  పానీలు, విరాళాలు, నజరానాలు, ప్రసాదాలు అంటూ ఎన్నేసి నాజూకు పేర్లున్నాయ్! అయినా, ఇవాళే ఈ పద్ధతి కొత్తగా ప్రవేశించినట్లు తెగ ఇదైపోతున్నావ్! రోజూ నువ్వు నాకిది కావాలి.. అది కావాలి అంటూ చెంపలేసుకొనే ముందు దేవుడికి కొట్టే టెంకాయను ఏమంటారేంటి ? దేవుడే దేవేరి  అనుగ్రహం కోసం పారిజాతాన్ని అపహరించి మరీ సమర్పించుకోక తప్పింది కాదు . రాజులిచ్చే అగ్రహాలకోసం కాదూ కవులు ప్రబంధాలను అంకితాలిచ్చింది! భూమి పుట్టినప్పుడే బహుమానాలు పుట్టాయి బాబాయ్! ఆదాము అవ్వలచేత సంసారం చేయించటానిక్కూడా పాము ఆపిల్ పండును లంచంగా ఇచ్చుకోవాల్చొచ్చింది. 


అది వేరురా... చాకిరీ చేయడానికి నెలనెలా జీతాలు అందుకునే నౌకరీల్లోనూ రోజూ చెయ్యాల్సిన పనికి చాయ్ పానీలు  ఆశించడమేంటి?


నూలు పోగు అందించకపోతే చందమామ ఏమన్నా వెన్నెల తగ్గిస్తాడా ! చందమామకు ఆ పోగు అందం ఎట్లాగో .. కొన్ని సర్కారు పోస్టులకు బల్లకింది చేతులు ఆదో అందం. నువ్వు ఇందాక చెప్పావే హరికథ... సర్కారు పనివాళ్ళ బుర్రకథ ముందు ఎవరికీ వినపడదు. పిల్లాడిని బడికిపోరా అంటే నువ్వు జీడి కొనుక్కోవడానికి డబ్బులిస్తేనే పోతానంటాడు. నోరులేని గేదె నోటికి పచ్చగడ్డి అందించకపోతే పాల పొదుగుమీద చెయ్యి వెయ్యనివ్వదు. నోరున్న మనిషి మరి కట్టేసుకుంటాడా! ఇన్ని చెబుతున్నావు... నీ నాలిక మీద తేనెబొట్టు పడితే చప్పరించకుండా ఉండగలవా? డబ్బు వ్యవహారాల్లో మునిగి తేలేవాడు డబ్బునెట్లా  ఆశించకుండా బిగపట్టుకుంటాడు  బాబాయ్! 


గడ్డి తినడం మహా ఘనమైన లక్షణమని మరి చంకలు గుద్దుకోమంటావా నువ్వు! 


మేయడం కూడా  గొప్ప సృజనాత్మక కళే! ఇన్నేసి వేల మంది సర్కారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్క సరసాదేవి, శ్రీలక్ష్మి, రాజగోపాల్ లాంటివాళ్లే మనకు ఎందుకు గుర్తుం డిపోతున్నారంటావ్? జీతంమీదగాక మరీ గీతంమీదే మరలు బిగిస్తే సర్కారులో దస్త్రాల బళ్లు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలవు.. గుర్తుంచుకో! అమెరికాలాంటి అగ్రరాజ్యాలు కూడా చతికిలపడ్డ రోజుల్లో  మనా దేశార్థికం ఇంత చురుగ్గా ఉందంటే దానికి కారణం కార్యాలయాల్లో చేతులు కింద

పెట్టుకునే బల్లలు ఇంకా ఉన్నాయి కాబట్టే 


ఇంతకీ నువ్వనేది ఏందిరా! లంచాలు ఇలాగే పదికాలా లపాటు వర్ధిల్లాలంటావ్! 


అంతేకాదు... అక్రమార్జనను ఉద్యోగుల హక్కుగా పరిగణించాలి. సిటిజన్ ఛార్జుల మాదిరిగా ఆఫీసుల్లో ఈ పనికి ఇంత అని పబ్లిగ్గా రేట్లు నిర్ణయించాలి. ఆదాయానికి మించిన ఆస్తులున్నవారిని గుర్తించి ప్రోత్సాహించాలి. ఆదాయపన్ను పత్రాల్లో జీతంతో పాటు గీతాన్ని ప్రకటించుకునే సంస్కరణలు అమలు చేయాలి. గీతాలమీద తగినన్ని రాయితీలు ఇవ్వాలి. అవినీతి నిరోధకశాఖ విజిలెన్సు కమిషన్లు వంటివాటిని వెంటనే రద్దుచేసి ఆ సిబ్బందిని నీతి నిరోధక కార్యక్రమాల నిర్వహణవైపు మళ్ళించాలి. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించిన పద్ధతిలోనే అక్రమార్జనను క్రమబద్ధీకరించే చట్టాలు వెంటనే అమలుచేయాలి . నేతలు నానా గడ్డ కరిచి సంపాదించుకొన్న మొత్తాలను దాచుకునేందుకు  తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇంటి పథకాలు వంటివాటి నిధులను మళ్లించి వెంటనే తగినన్ని నేలమాళిగలను ఏర్పాటు చేయాలి. అందుకు ప్రభుత్వ గిడ్డంగులను ఖాళీ చేయించి నల్లధనాన్ని దాచుకునే సౌకర్యం కలిగించాలి. లంచగొండులకు తగిన రక్షణ కల్పించగలిగితే విదేశాల్లోని మన నల్లధనం మొత్తం మనదేశంలోకే ధారాళంగా ప్రవహిస్తుంది. అప్పుడు ప్రపంచ దేశాల్లో అత్యంత ధనవంతులున్న దేశం మనదే అయితీరుతుంది. ఏమంటావ్! 


ఇంకేమంటాను. నా మనసులోని మాట చెప్పాలంటే నువ్వు నాకు ఒక అయిదొందలు ఆమ్యామ్యాగా అచ్చుకోవాలి. 


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18 -10 - 2011 ) 





No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...