కవిత
ఆమని అరుదెంచె ..
జి.కె. సుబ్రహ్మణ్యం
వగరు చివురుల మెక్కి
ఎలకోయిలలు
వలపు రాగాలు ప్రకృతికి నేర్ప
చిగురుటాకుల తొడిగి
ప్రతి తరువు పచ్చదనాలు మెరయ
విరిసిన పూలనెత్తావుల పులుముక
రంగుపుట్టములు తొడిగి
నిన్న ఎరుగని వన్నెచిన్నలు
నేడు తొంగి చూడ
సొగసులు సౌదామినిగా
ఆమని అరుదెంచె!
నవవత్సర అరుణోదయాన
పుడమి పగడపు కాంతులందింప
గుబురు కొమ్మల తీవెలు పూరెమ్మలు
ప్రణయ వీచికల తలలూప
కొమ్మక్రీగంటి చూపుల పులకింప
ప్రకృతి జగతి రసడోలికల తూగ
ఏటికొకసారి వేపపూల రుచిచూప
వేడుకల నందింప ఆమని అరుదెంచె!
మింట తారకల వెలుగు తోరణాల
తారణను స్వాగతింప
అవని హరిత వనాలు
హర్షమున ఆహ్వానింప
కవుల కలాలు అక్షరపూజ సేతు
సకల కళావిశారదగా
పొత్తుల పొదరిళ్ళ
పాలకుల వరాల వాగ్దానాలు
ప్రజకు కొత్త ఆశలు రేప
మోడువారిన ఓటరు
బ్రతుకు పల్లవింప
కొత్త ప్రభుత
ఎన్నికల కలహంసలా
రాజహంసలా
ఆమని అరుదెంచే!
No comments:
Post a Comment