ఈనాడు - హాస్యం - వ్యంగ్యం
పావలా కాలధర్మం
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 06-07-2011 )
చిల్లర రాజకీయాలు పెరుగుతున్న కొద్దీ చిల్లర నాణాలు క్రమంగా కనుమరుగైపో తున్నాయి. పైసా, అయిదు పైసలు, పది పైసలు, ఇరవై పైసలు... ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఇరవై అయిదు పైసలవంతు. త్వరలో అర్ధ రూపాయి గతీ అంతే కావచ్చు
భిక్షగాడికి కూడా అక్కర్లేని డొక్కు నాణెంగా తయారైంది పావలా వంద పావలా బిళ్ళల తయారీ కే నూట అరవై రూపాయలు ఖర్చవుతున్నాయని కేంద్ర అమాత్యులు వాపోతున్నారు. ఈ కరవు కాలంలో వాటిని తయారుచేయడం తమవల్ల కాదని ఓ దండం పెట్టేస్తున్నారు. జులై ఒకటినుంచి పావలా 'మరణం' అధికారికంగా నిర్ధారణయింది!
దమ్మిడీకి కొరగాని నేతల్ని ఎన్నుకోవడానికి ఎన్నికల్లో కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అలాగని ఎన్నికలనే రద్దు చేయాలని ఎవరన్నా అంటున్నారా! బడుగు జీవి బతుకులాగా పావలా నాణెం అందరికీ అలుసయి పోయిందనేదే బెంగ . నెత్తిమీద రూపాయి ఉంచినా పావలాకు అమ్ముడుకాని నేతలను మనం భరించాలి గానీ, పర్సులో పావలాని మాత్రం బరువని చెప్పి గిరాటేస్తున్నాం.
కారు డిక్కీలో, బస్సు టాపులమీద పత్తిబేళ్ల మాదిరిగా కట్టలు కట్టలు వెయ్యి నోట్లు రవాణా అయే కాలంలో- ఇంకా ఈ పావలా, అర్ధ రూపాయల గురించి పలవరింతలు ఎందుకని నవ్వుకొంటున్నారా! అయినవాడికి పదవి కట్టబెట్టడానికి గిట్టనివాడిని చట్టసభనుంచి వెళ్ళగొట్టినట్లు... అయిదు, రెండు, ఒక రూపాయినోట్లకు నాణాల స్థాయి కల్పించారు. పేద వాడి నాణెం పావలా, అర్ధరూపాయలను మాయం చేస్తామంటున్నారిప్పుడు . చిల్లర మహాలక్ష్మి అంటే ఎంత చుల కన?
గుళ్ళో దేవుడి హారతి పళ్ళెంలో వేయడానికి ఇక రూపాయి, అర్ధరూపాయలే సమర్పించుకోవాలి కాబోలు. పిల్లాడు కిడ్డిబ్యాంకులో వేసుకోవడానికి ఇక రూపాయలే ఇచ్చుకోవాలి. పాపాయిల భోగిపళ్లలో కలపడానికైనా పావలా బిళ్లలు చలామణీలో ఉంటే నిండుగా ఉండును పండువు . శవయా త్రలో వెనక్కు విసురుకుంటూ పోయే చిల్లరలో పావలాలు కాక రూపాయి బిళ్లలు కలపాలంటే- బతికున్న వాడి బంధువులు భరించలేక చచ్చూరుకోవాల్సిందే. అసలైన ఆర్థికమాంద్యం దెబ్బ అప్పుడు తెలిసొస్తోంది.
బడుగు జీవికి జనాభాలో ఏ పాటి విలువుందో పావలాల్లాంటి చిల్లర బిళ్లలకూ కరెన్సీ లోకంలో అంతే విలువుందిప్పుడు. కూడికలూ తీసివేతల లెక్కల వరకేగానీ, ఇంద... తీసుకో అంటూ ఇవ్వడానికి పావలాలు ఎక్కడున్నాయి? టీవీల్లో తెలుగులా, నేతల్లో నిజాయతీలా, దుకాణాల్లో నికార్సయిన సరకులా, చేత్తో రాసే ఉత్తరాల్లా... పావలాలూ పది పైసల బిళ్లలూ మాయమైపోయాయి.
అమలుకాని వాటిని ఇప్పుడు పావలా వడ్డీ పథకాలనే పిలుస్తున్నారు. బంగారం కొట్లో ధర్మకాటాలో వేసి తూచడానికితప్ప, ఇతర సమయాల్లో పావలాలు, అర్ధలూ పనికిరాని పదా ' ర్థాలు ' .
ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఎంత సవ్యంగా ఏడ్చిందో - డబ్బు లెక్కల్లో పావలాలకు, అర్ధరూపాయలకు అంతే విలు వుందిప్పుడు . పేదోడిని పట్టించుకుంటున్నారు కనకనా, పావలాను ఎవరైనా లెక్క పెట్టడానికి!
కుంభకోణాల విలువా వేలకోట్ల రూపాయల స్థాయికి చేరిపోయింది. రాష్ట్రప్రభుత్వాల బడ్జెట్లూ లక్షల కోట్లు మించుతున్నాయి. పావలాలను, పైసలను సర్దుబాటు చేసే తీరిక, ఓపిక ఇప్పుడెక్కడున్నాయి?
పావలాలను, రూపా యల్ని కాదని, కోట్ల రూపాయల్ని ఆరగించినవారు వాటిని సర్దుబాటు చేయలేకే ఇప్పుడు తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు.
ఒకప్పుడు పావలా బిళ్ళ అంటే ఎంత విలువ? కప్పు చాయ్ తాగాలంటే పావలా
చాలు. ఇంకా వెనక్కు వెళితే- మానెడు బియ్యం కొలిచేవారు. ఓ పావలాబిళ్ళ గనక జేబులో ఉంటే- ఆ రోజుకు అతను పెద్ద దివానే. పిల్లాడిచేతిలో పావలా పెడితే- ఐస్ సోడా , సోంపాపిడి, మామిడితాండ్ర, రబ్బరు పెన్సిలు, రంగు బెలూన్లు రెండో మూడో కొనుక్కున్నా- ఇంకా పైసో .. రెండు పైసలో మిగిలుండేవి. ఇప్పుడు పీచు మిఠాయినుంచి పాప్ కార్న్ పాకెట్ దాకా ఏది కొనాలన్నా రూపాయలు అచ్చుకోవాలి .
దీపా వళి పండుగకు పావలాకు సగం బుట్టెడు టపాసుల చ్చేవి. పెద్దపండగ నాడు హరిదాసు అక్షయపాత్రలో అరసోల బియ్యం ఓ పావలాబిళ్ళతో పాటు కలిపి పోస్తే ఇంటిల్లపాదీ అప్లైశ్వర్యాలతో చల్లగా ఉండమని మనసారా దీవలనందించేవాడు .
పావలా రైలు టికెట్ తో పాతిక మైళ్ళు సుఖంగా ప్రయాణం చేసేవాళ్లం. సైకిలు అద్దె గంటకు పావలా. శివరాత్రి పండక్కు పావలా ఇచ్చి మూడు సినిమాలు వరసగా చూసి మురిసిపోయేవాళ్లం. అందాకా ఎందుకు, అప్పట్లో ఆలిండియా కాంగ్రెసులో ప్రాథమిక సభ్యత్వం ఖరీదు- కేమం ఒక్క పావలా!
నాణెమా అంటే నాలుక్కాలాలపాటు నిలబడుం డేదీ... విలువగలదీ అని నిఘంటువు అర్ధం. నాణేల చరిత్ర రెండువేల ఏడొందల నాటిది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయుధాల తయారీకి లోహాలకు కరవొస్తే ఆదుకున్నది అప్పటి నాణేలే! శాసనాలకు మాదిరిగానే నాణేలూ చారిత్రక పరిశోధనకు చక్కని సాధనాలు,
అలాంటి నాణేలకు ఇప్పుడు మూడింది. పిల్లకాయ లకు పావలా బిళ్లల్ని ఇంక ఏ మ్యూజియాలలోనో, నాణేల సేకరణ పుస్తకాలలోనో చూపించుకోవాలి.
వెయ్యి నోటు ఇస్తే, వెనక్కూ ముందుకూ వెయ్యి సార్లు తిప్పిచూసుకుని తీసుకునే ఈ కాలంలో- పావలా బిళ్ళ గురించి విలపించడం వృథా అంటారా?
ఆర్ధిక సమరంలో బడుగువాడి పక్కన నిలబడి పోరాడే పావలా యోధుడికి ఇలాగైనా ఆశ్రునివాళి సమర్పించడం మన కనీస ధర్మం.
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 06-07-2011 )
No comments:
Post a Comment