Tuesday, July 7, 2015

కొన్ని చిట్టి కవితలు-1




1
కోకిల పాట
ఎంత కమ్మన
 కాకెంగిలి కదా!

2
ముసురు మేలిముసుగు నుంచీ
ఆకాశం మిసిమిసి నవ్వు
-మెరుపు

3
అడుక్కుంటూ గ్యాపులో
ఆడుకునే వీధిబాలలు
-ఆర్టాఫ్ లివింగ్


4
ఈ గొంగళి పురుగేనా
రేపటి రంగుల సీతాకోకచిలుక!
కాలం గొప్ప కాస్త్యూమ్ డిజైనర్

5
నరపురుగు లేదు
అడవికి
ఎంతానందమో!

6
మనసుతో నడవకే
బతుక్కు
అలసట

7
ఎంత ప్రశాంతంగా ఉందీ!
గుండె
శవాసనమేసినట్లుంది!

8
స్నేహం
మనిషి
-మనిషివ్యసనం

9
పొగడ్త అగడ్తలో
దూకడం తేలికే!
తేలడమే లేదిక!

10
ఎప్పుడు వెలిగించారో?
వెలుగులు విరజిమ్ముతోంది
- గీత

11
రెండో తరగతి రైలుబోగీ
చదివేవాడికి అదే
కదిలే తరగతి గది

-కర్లపాలెం హనుమంతరావు
20-10-2012

Monday, July 6, 2015

వెలుగు బొట్లు- కవిత

1
నీలాకాశాన్నలా దులుపుతావెందుకు?
నాలుగు వెలుగుబొట్లు నేల రాలితే తాగిపోవాలని!
ఆడి ఆడి అలసిపోయాను
గాయాలకు మందు కావాలి!

2
నదిని దాటాలంటే వంతెనే ఉండాలా?
మడుగు అడుగున కాల్దారీ ఉంటుంది!
వేగుచుక్కలు పైన వెలుగుతుంటాయి!
బాటసారివి
నీకు మోరెత్తి చూడాలనే మనసు కలగాలి!
నువు క్షణంపాటు పీల్చి వదిలే ప్రాణవాయువు
ఎన్ని పైరుపచ్చలనుంచీ మూటకట్టుకుని
పడుతూ లేస్తూ తెస్తుందో తెలుసా పిచ్చి గాలి!
నీ కంటికి నిద్రవూహ రాకముందే
రెప్పలు కలలపొత్తిళ్ళు సిద్దం చేస్తాయి!
గోపురాలు కందకాలు రహదారులు రహస్యస్థావరాలు
ఇలాతలాన్ని నువ్వివాళ ఇలా యుద్ధరంగ చేసావు గానీ
ఓంప్రథమంగా
పునాదిరాయి పడింది ఆటలమైదానానికే మిత్రమా!

ఏడుస్తూ వచ్చిన వాడివి…
ఎలాగూ ఏడుస్తూనే పోతావని తెలుసు
ఇక్కడున్నఈ నాలుగు పూటలన్నా 
నిన్ను నవ్వుల పూలతోటల వెంట తిప్పాలని కదూ
ఈ ఆటలూ పాటలూ,  ప్రేమ మాటలూ!

3
కలల మీదా పెత్తనం కావాలి నీకు
అందుకే ఈ కలవరం!
రేపటి సంగతి మరచి
నేటిగెలుపుకి పరుగు
అందుకే ఈ అలుపు!

4
ఆట ముగిసాక
గెలుపోటములు అరటిపండేగా మిత్రమా!
చీకటి ముసిరాక
ఎవరైనా ఇంటిదారేగదా పట్టాలి!
ఎక్కడనుంచొచ్చామో?
ఎక్కడెక్కడికి వెళతామో?
ఇక్కడున్నన్ని  క్షణాలూ
ఎంచక్కా ఆడుకోరాదూ!
చక్కని మైదానం
ఆటవస్తువులు
సాటిదోస్తులు
అలుపు మరుపుకేకదా ఈ ఆటా పాటా?
గెలుపు కోసం అలుపు
వృథా అవునా కాదా!

5
నీలాకాశాన్నలా దులపడమెందుకు?
ధారగా రాలుతునే ఉన్నాయి వెలుగు బొట్లు!
హాయిగా తాగేయి పూరా!
 రేపటికి మాగబెట్టక!
మనిషి బుద్ధి చూపెట్టక!
-కర్లపాలెం హనుమంత రావు

23-10-2012

Sunday, July 5, 2015

దివాలా- ఓ సర్రియలిస్టు కవిత

దివాలా- ఓ సర్రియలిస్టు కవిత
కలలో
నాకెవరో
ఒక 'పావలా' ఇచ్చి
"కావాల్సినవేవైనా కొనుక్కోరా!" అన్నారు.
మెలుకువలో మహా హుషారుగా
బజారుకు పోయి
మబ్బులు,
వాటిని కడిగే సబ్బులు,
చెట్లు,
వాటినెక్కేందుకు మెట్లు,
పడుకునేందుకు పొడువాటి రోడ్లు,
నడిచేందుకు సన్నని, నున్నని కాలువలు..
ఇంకా ఎన్నో.. ఎన్నో..
అన్నీ కొన్నాను.
అన్నింటినీ వీపుమీదంటించుకుని
నా వాకిలి తలుపులు తడుదును కదా..
అక్కడొక పొడుగాటి మనిషి
చక్కగా గోడమీద పడుకున్న వాడు
నవ్వుతూ
నిటారుగాలేచి నిలబడుతూ
"వచ్చావా? నీ కోసమే
కాసుక్కూర్చున్నా!
నా పావలా నాకిచ్చేస్తావా!" అన్నాడు.
"ఏం పావలా?" అనడిగితే
పాతాళం జేబులోనుండి
కాతా పుస్తకం తీసి
కాకుల్ని బాతులుగా చూపించాడు.
చేసేదిలేక చేబదులు తీర్చేద్దామని
జేబులో చేయి పెడితే
పావలా ఏదీ!
"నీ పావలా నా దగ్గర లేదు
మళ్ళీ రా!
నీ ప(ము)ళ్ళన్నీ నీ కిచ్చేస్తా!"అంటే
వాడు వికృతంగా నవ్వి
"మళ్ళీ మళ్ళీ ఎక్కడొస్తానూ,
నాకవతల బోలెడన్ని పనులున్నాయి
(ఎన్నో కాకుల్ని బాతుల్ని చేయద్దూ!)
పోనీ
నీ దగ్గరున్న మబ్బులు, చెట్లు, రోడ్లు, కాలువలు,
కాసిని కోసుకెళతా.. వప్పుకుంటావా?"అంటూ వీపు తడిమి
చక్కాపోయాడు.
నేను నవ్వుకుంటూ
నట్టింట్లోకి నడిచి
నా లాభాల మూటను మూలకు సర్ది
అందంగా నవ్వుకుందామని అద్దం ముందు నిలబడితే
అరె!.....నేనేదీ??!!
ఇంకేం నువ్వు?
వాడిచ్చిన పావలా కెప్పుడో 'దివాలా' తీసావు
అంటో అద్దం నవ్వు!
(అద్దం అబద్ధం చెప్తుందా!)
-కర్లపాలెం హనుమంతరావు

(ఈ కవిత ప్రచురణ కాలం 23-08-1975.  'చక్రవర్తి' కలంపేరుతో ఆంధ్రజ్యోతి వారపత్రికలో (పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు సంపాదకులు) అచ్చయింది. అప్పట్లో "కొత్త కలాలు" పేరుతో వారం వారం ఒకటొ, రెండో కవితలు ప్రచురించే వారు. అంధ్రజ్యోతిలో కవిత రావడం అప్పట్లో నాబోటి చాలామంది చిన్నకవులకు మధురస్వప్నం. ఆ శీర్షికలో ఇప్పటి ప్రముఖులు చాలామంది కనపడుతుండే వారు.(పాపినేని శివశంకర్ పేరు గుర్తు నాకు). ఈ కవిత రాసేకాలం నాటికి నా వయసు 23సంవత్సరాలు. తిలక్, ఆరుద్ర, శ్రీశ్రీ, గజ్జెల మల్లారెడ్డి వంటి వాళ్ళ కవిత్వం ఇష్టంగా చదువుకుంటుండేవాణ్ణి. ఎలా పడిందో నా దృష్టిలో సర్రియలిజం మీది శ్రీశ్రీనో, ఆరుద్రో రాసిన కవిత్వం! దాని ప్రభావంతో రాసిన కవిత ఇది. కవిత్వం అంటే ముందు నుంచీ అమిత ఇష్టం. ఆ అతిప్రేమవల్ల అత్యంత బిడియం. ప్రముఖ  కవులు రాసినవి చదివి విశ్లేషించుకోవడమేకానీ ధైర్యం చేసి రాసింది తక్కువే.(అప్పౌడు.. ఇప్పుడు కూడా)

పాత కాగితాలు తిరగేస్తుంటే.. ఈ కవిత కనపడింది ఇవాళ. ఇప్పటి 'సెజ్జు'ల కాలంలో బక్క మనిషి చిట్టిఆశకు ఈ కవిత ప్రతిబింబం అనిపించింది. అందుకే మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఇలా…)

Friday, July 3, 2015

పెళ్లాం చెబితే వినాలి- ఓ సరదా గల్పిక


పెళ్లాం దగ్గర ఉగ్రవాదం పనికిరాదు. భక్తిమార్గమే శరణ్యం. అర్జునుడికి గోతోపదేశం చేసిన కృష్ణుడంతటివాడు సత్యభామకాళ్ళు పట్టుకోలేదా?
 'దేవుడా! నాకు కష్టాన్నివ్వు! బాధల్నివ్వు! టెన్షన్నివ్వు!' అని నాలాంటి ఓ విరాగి కోరుకుంటే- 'ఇదిగో నీ కోరికలన్నింటినీ తీర్చే సాధనం!' అంటూ నీ లాంటి భార్యామణి నిచ్చాడోయ్ ఆ భగవంతుడు!' అన్నాను మా శ్రీమతితో ఓసారి ఎద్దేవాగా.
తనేమన్నా తక్కువ తిన్నదా! ' ఆహాఁ!  మరా భార్యామణినే 'బెటర్ హాఫ్' అని ఎందుకన్నారో మీ మగాళ్లూ! ఆడది అందుబాటులో ఉండేవాటినే కోరుకొంటుంది. మహేష్ బాబు జుత్తు ఎంత ఒత్తుగా ఉంటే నా కేంటి! నా మొగుడు నెత్తిమీద జుత్తుమాత్రం నా గుప్పెటకి చిక్కేటంత ఎత్తులో ఉండాల’ని కోరుకొనే అమాయకురాలండీ ఆడది! ఆ ఇంగితం మీ మగమూర్ఖులకు అర్థం కాదులేండి ఎన్ని యుగాలకైనాగానీ!' అఏసింది!
'మేం మూర్ఖులమా?'
'మరి! మీకో తమాషా కథ చెప్పనా! ఓ అందమైన ఉద్యానవనమంట! దాన్నిండా పండ్లు, పూలు, కాయలు. అందమైన బుజ్జి బుజ్జి ఎన్నో రకాల జంతువులు.. ఆమెకు తోడుగా! ఐనా ఆమెకు ఏమీ తోచేది కాదంట! సరదాగా ఆడుకొనేందుకు సరిపడా జోడునివ్వవా? అని దేవుడుగారి దగ్గర మొరపెట్టుకొందట బుద్ధి గడ్డితిని.. 'ఇస్తాగానీ! రెండు షరతులు! ఆ వచ్చే జోడు మొరటుగా, నీకన్నా బలంగా ఉంటుంది. ఓకేనా! ఇహ రెండో షరతు. వాడు నీకన్నా తానే ముందు పుట్టానని.. నువ్వే వాడి పక్కటెముకలనుంచి పుట్టుకొచ్చావని కోస్తుంటాడు. నువ్వా అజ్ఞానిని  సహించి నమ్మినట్లు నటించాలి.. మరి' అన్నాడుట దేవుడు. జోడుకోసం ‘సరే’ననక తప్పింది కాదు పాపం ఆ పిల్లకి. అప్పుడలా ఒప్పుకున్న పాపానికే మీ మగాళ్ల మూర్ఖత్వాన్ని, చపలచిత్తాన్ని చచ్చినట్లు భరించి చేస్తున్నాం ఇన్ని యుగాలబట్టీ!' అనేసింది మళ్లీ మా ఇంటిదీపం.
ఎంతైనా మగాణ్ని! నాకు కోపం రాదా! 'మాది చపలచిత్తమా?' అని గయ్యిమన్నాను వళ్ళుమండి.
'మీదే కాదు. మిమ్మల్ని మాకు అంటగట్టిన ఆ దేవుళ్లది కూడా! ఒక భార్యను పక్కలో పెట్టుకొని మరో భామను నెత్తిమీద పెట్టుకొన్నాడు  బిచ్చమెత్తుకొని బతికే దేవుడు శివయ్య. ఒక భార్యచేత అస్తమానం కాళ్లు పట్టించుకోడం చాలక మరో భార్యకోసం పరుగెత్తి అవతారాలెత్తిన మహాపురుషుడు విష్ణుమూర్తి. ఆలికోసం అంతలావు యుద్ధంచేసి.. తీరా సాధించినాక శీలం నిరూపించుకోమని సాధింపులు సాగించిన వీరపురువుడు    శ్రీరాముడు. దేవుడూ మగాడే కదా! బెడ్-కాఫీ దగ్గర్నుంచీ.. బెడ్ ఎక్కేదాకా తన అవసరాలు తీర్చేందుకే ఆడది పుట్టిందని మీ మగాళ్లకో అహంభావం. తలొంచుకొని తాళి కట్టించుకొంటుందని ఎగతాళి కామోసు? పాచిపనిచేసే పనిమనిషికి, బట్టలుతికి ఇస్త్రీచేసే లాండ్రీమనిషికి డబ్బివ్వాలి. కప్పుడన్నం  ఎక్కువడిగినా ఎక్స్ ట్రా బిల్లేస్తాడు హోటలువాడు. సర్వారాయుడైతే నిర్దాక్షిణ్యంగా దక్షిణ బాదేస్తాడు. మీకూ, మీరు కనిపారేసిన పిల్లాపీచుకూ తన సొంతపన్లుసైతం మానుకొని కంచిగరుడసేవచేసే ఆడది మాత్రం గడప దాటి లోపలికొచ్చేముందు  లక్షలు కోట్లు  కట్నంకింద ఎదురు కుమ్మరించాలి. ఛ! ఆ జాన్ గోట్ మ్యాన్ చెప్పిన మాటన్నా చెవినబెట్టకపోతిని.. పిచ్చిచచ్చిందాన్ని!'
'మధ్యలో ఆ జాన్ గోట్ మ్యాన్ ఎవడే బాబూ నా ప్రాణానికి?!'
'మొగుళ్ళు మోటారుబళ్ళలాంటి వాళ్ళని. మొదటి ఏడాది మాత్రమే  బాగా నడిచేదని..  మొహమాటానికనిపోయి మీ స్వేచ్చ పోగొట్టుకోవద్ద’ని తస్మాత్ జాగ్రత్తలు చాలా  మొత్తుకున్నాడులేండి మొదట్లో ఒహాయన.. ఆయనా!'
ఓహో! మగాళ్లలాగా ప్యాంట్లూ, గళ్లగళ్ళషర్ట్లూ వేసుకోవడం, పొద్దుపోయేదాకా బైట బలాదూర్లు తిరగడం.. ఇదేనా మ్యాడమ్ మీ దృష్టిలో స్వేచ్చా వాయువులు సంపూర్ణంగా  పీల్చడమంటే! దాన్ని స్వాతంత్ర్యమనరు. మగాడి ఆధిక్యాన్ని ఒప్పుకోవడమంటారు' అన్నారు జగ్గీ వాసుదేవ్.'
'ఓహో! గురూగారికి ఇప్పుడు ఆ సద్గురుగారు గుర్తుకొచ్చారన్నమాట! ఆయనింకా చాలా మంచిముక్కలుకూడా చెప్పారు మహాశయా! విజయవంతమైన వివాహానికి నమ్ముకోవాల్సింది పామిస్ట్రీని కాదు.. ఆలూమగలమధ్య కెమిస్ట్రీని. పెళ్లయితే అబ్బాయి, అమ్మాయి ఒకటవుతారు. నిజమే కానీ.. ఎవరు ఎవరవుతారన్నదే అసలు సమస్య. మొగుడూ పెళ్ళాలు సినిమాహాల్లో  కుర్చీల్లాంటి వాళ్ళు. రెండు సీట్లకూ కలిపి ఒకే ఒక్క రెక్క ఉంటుంది. ఇద్దరూ సర్దుకుపోవాలిసినిమా ప్రశాంతంగా చూడాలంటే. స్త్రీపాత్ర లేకుండా నాటకాలు నడుస్తాయేమోగాని.. సంసారాలుమాత్రం సవ్యంగా సాగవు. ఆలూమగలు ఆలూమసాలా కూరిన  సమోసాలాగా ఉండాలి. ఓడి గెలవడమన్న సూత్రం ఒక్క భార్యాభర్తలబంధంలో మాత్రమే రాణిస్తుంది. మొగుడూ పెళ్లాలు కాటాకుస్తీ వస్తాదులు కాదుగదా! ఇద్దరూ కలసి ఏడడుగులు వేసిన్నాడే ఒకటైనట్లు లెక్క. అతను ఆకాశమైతే.. ఆమె భూదేవి. అతను వాక్కు అయితే.. ఆమె మనస్సు. కాపురమనే బైకుకు
అతను చక్రమయితే.. ఆమె ఆ చక్రాన్ని అదుపులో పెట్టే బ్రేకు.. గేరు. పెళ్ళితంతులో వల్లించే ప్రతీమంత్రానికి ఒక ప్రత్యేకమైన అర్థముంటుంది. తెలుసా సారూ! ఆలుమగలనేది సీతారాములు వంటి ఒక అందమైన ద్వంద్వసమాసం గురూ! అనురాగం ఛందస్సు కుదిరి, సరైన యతిప్రాసలు పడితే పోతన పద్యమంత హృద్యంగా ఉంటుంది సంసారకావ్యం. వేలుపట్టుకొని  నడిచివచ్చిన భార్యవంక వేలెత్తి చూపించేముందు మొగుడు తనలోపలకికూడా తొంగిచూసుకోవాలి. నిజమే! భర్తపేరు చెప్పడానిక్కూడా సిగ్గుపడే ముగ్ధ భర్త సిగ్గుపడే పని ఎన్నటికీ చేయకూడదు.  పెళ్లంటే.. 'అరే! అప్పుడే నూరేళ్ళు గడిచిపపోయాయా?!' అన్నట్లు సాగిపోవాలి. ఆలుమగలమధ్య అలకలు అకుమీద నీటిబొట్లు. అవి జారిపోయేంతసేపు ఉంటేనే ఇంపూ.. సొంపూ! వాదులాట లేనంతవరకే ఆదిదంపరతులకైనా ఆరాధన. సీతారాములు విడిపోయిన తదనంతర రామాయణమంతా విషాదమే.. మీకొకరు వచ్చి  చెప్పాలా! మొగుడూ పెళ్లాల మధ్య పంచాయితీలో మూడోమనిషికి దూరే సందివ్వరాదన్నది రాయని సంసార రాజ్యాంగసూత్రం.  అనాదిగా అదే నడుస్తున్నది మన కుటుంబ వ్యవస్థలో!'
సుమతీ శతకమంత  చక్కగా చెప్పుకొచ్చింది కదండీ మా శ్రీమతి! ఒప్పుకొని తీరాల్సిదే! ఓప్పుకొన్నాను కూడా!
'నువ్వన్నమాట నిజమేనోయ్! అందుకే ఈ మధ్య ఓ విడాకులకేసులో సర్వోన్నత న్యాయస్థానంసైతం  కలగజేసుకొనేందుకు 'ససేమిరా' అంది. పైపెచ్చు 'పెళ్ళాం చెబితే వినాలి! మేమందరం అదే చేస్తున్నాం ఇళ్లల్లో!' అని నిజం ఒప్పుకేసుకొన్నారు కూడాను కేసు విచారించే శ్రీమాన్ న్యాయమూర్తులవారు.
'చూసారా! భూమ్యాకర్షణకన్నా భామాకర్షణ ఎంత మిన్నో! భూమికి లొంగి నడవగాలేంది.. తాళికట్టిన భామకు లొంగి నడిస్తే తప్పేముంది! చదువులమ్మను భార్యగా పొందీ బ్రహ్మదేవుడు తలరాతలు ఇంత అడ్డదిడ్డంగా  ఎందుకు రాస్తున్నాడో తెలుసాండీ! పెళ్ళాన్ని అడిగి రాయాటానికి 'అహం బ్రహ్మస్య' అన్న అహంకారం అడ్డంపడి! అందుకే అనారు…'
'..పెళ్లాం చెబితే వినాలి.. అని' అంటూ వంతపాడడం నావంతయింది చివరకు.
***
-కర్లపాలెం హనుమంతరావు

(26-06-2009 నాటి 'ఈనాడు' సంపాదక పుటలో ప్రచురితం)

Thursday, July 2, 2015

రామాయణం- ఒక్క వాల్మీకి విరచితమేనా?- ఒక విమర్శ, విశ్లేషణ


‘యావత్ స్థాస్యంతి గిరయః- సరిత శ్చ మహీతలే/తావద్ రామాయణ కథా- లోకేషు ప్రచరిష్యతి (బాల కాండ 2.36)’. మహీతలంపై ఎంత వరకు గిరులు, సరులు ఉంటాయో అంత వరకు లోకాల్లో రామాయణగాథ ప్రచారం జరుగుతుంద’ని బ్రహ్మ వాల్మీకి రామాయణాన్ని ఆశీర్వదిస్తూ అన్న మాట. రామాయణమంత గాఢంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కావ్యం మరొకటి లేదు. ఎన్నో భాషల్లో, కళాప్రక్రియల్లో తీర్చిదిద్దిన ఆదికావ్యం రామాయణం. పండితులను.. పామరులను, ఆస్తికులను.. నాస్తికులను ఒకే తీరులో ఆకర్షించే గుణం రామాయణంలో ఏదో ఉంది.
వేలాదిమంది బలశాలులు ఆయాసపడుతూ నెట్టుకొచ్చిన శివధనుస్సును కుమారరాముడు సునాయాసంగా విరవడంలాంటి అతిమానుష సన్నివేశాలు రామాయణంనిండా ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలో అవి ఆశ్చర్యానందాలను కలిస్తే.. ఎదిగే కొద్దీ రామచంద్రుని మర్యాద పాలన, లక్ష్మణస్వామి సోదరప్రేమ, భరతుని త్యాగబుద్ధి, ఆంజనేయుని దాసభక్తి, సీతమ్మతల్లి పతిభక్తి వంటి సద్గుణాలు ఆకర్షిస్తాయి. వివేచనకొద్దీ ఆలోచనలు రేకెత్తించే సామాజికాంశాలు దండిగా ఉండబట్టే రామాయణం చారిత్రక పరిశోధనాపత్రం.. ఆధ్యాత్మిక పరిచయ పత్రిక కన్నా ఎక్కువ చర్చనీయమౖందేమో! శతాబ్దాలబట్టి లెక్కలేనంత మంది సృజనశీలులు చెయిచేసుకున్నకథ రామాయణం. భిన్నరూపాలు అనేకం ఓ క్రమం లేకుండా మూలంలో నిక్షిప్తమైవడం సహజ పరిణామమే.
వాల్మీకం పేరుతో ప్రచారంలో గల కథా దేశమంతటా ఒకే విధంగా లేదు. వాల్మీకి రామాయణంలోని అన్ని భాగాలూ వాల్మీకి విరచితాలేనని చెప్పలేని స్థితి. మొదటి వాల్మీకి పుట్టించిన కావ్యం మరో వాల్మీకి గంటంలో పెరిగి తదనంతర కాలంలో మరన్ని ప్రక్షిప్తాల హంగుల్ని రంగరించుకుందన్న వాదనా కొట్టివేయదగింది కాదు.
‘నారదస్య తు తద్వాక్యం/ శ్రుత్వా వాక్య విశారదః/ పూజయామాన

ధర్మాత్మా/ సహశిష్యో మహామునిః’ అన్న బాల కాండ (2,1) శ్లోకం మూలకంగానే ఈ అనుమానం. కవి ప్రథమ పురుషలో చెప్పుకోవడం కాదు కానీ.. వాక్యవిశారద, పూజయామాన, ధర్మాత్మ, మహాముని’ వంటి విశేషణాలతో స్వోత్కర్ష చేసుకోవండం వల్ల కలిగే సందేహం, తరువాతి శ్లోకాల్లోని భగవాన్( బాల 2, 9), మహాప్రాజ్ఞ, మునిపుంగవః (బాల 2, 17) వంటి పొగడ్తలతో మరింత బలపడుతోంది. తనకు తాను నమస్కరించుకునే కుసంస్కారా వాల్మీకి మహర్షి?
క్రౌంచ పక్షి హననంతో ఖిన్నుడైన వాల్మీకి ముఖతః అప్రయత్నంగా వెలువడ్డ ‘మా నిషాద’ శ్లోకం కాకతాళీయంగా అనుష్టుప్ చందస్సులో ఉండటం.. తదనంతరం ఆ చందస్సులోనే సంపూర్ణ రామాయణం కథనం చేయాలని కవి సంకల్పించడం జగద్వితం. వాల్మీకి రామాయణ శ్లోకాల్లో అనుష్టుప్ ఛందస్సుకు భినమైన ఛందస్సూ కనిపిస్తుంది! అదంతా అనంతర కాలం తాలూకు మరో వాల్మీకి ప్రక్షిప్తమై ఉంటుందని సందేహించడంలో అసమంజసమేముంది?
నారదుడు వాల్మీకి మహర్షికి కథనం చేసిన సంక్షేప రామాయణంలోగానీ, మహాభారత అరణ్యపర్వంలోని రామోపాఖ్యానంలోగానీ బాలకాండకు సంబంధించిన కథ ఆట్టే లేదు. వాల్మీకి రామాయణ బాలకాండలోనే రామసంబంధమైన కథ ఉన్నది కడు స్వల్పం. అప్రస్తుతమని తోచే కథాభాగమంతా ఆ ‘మరో వాల్మీకుల’వారి నై’పుణ్య’మేమో?
ఉత్తరకాండలోని శంబూక వధ మాత్రం? తపోదీక్షకు అర్హమైన వర్ణాల ప్రస్తక్తి వచ్చే సందర్భంలో- కృతయుగంలో బ్రాహ్మణులు, త్రేతాయుగంలో అదనంగా క్షత్రియులు, ద్వాపరంలో ఆ ఇద్దరికీ అదనంగా వైశ్యులు, కలియుగంలో నాలుగు వర్ణాలవారూ అర్హులన్నట్లు ఒక సిద్ధాంతం ఉన్నట్లు అర్థమవుతుంది. తద్విరుద్ధంగా త్రేతాయుగంలో దీక్ష చేబట్టినందువల్లే శూద్ర శంబూకుడు వధ్యుడన్నట్లు వాదన ముందుకొచ్చింది. విశ్వామిత్రరుషి క్షత్రియుడు. దశరథ మహారాజు ఏనుగనుకుని వధించిన బాలకుడు ఒక శూద్రతపస్వి కన్నకొడుకు. ఇలాగే ఇతిహాసాలనిండా వివిధ వర్ణాలవారు ఉగ్రతపస్సులు చేసిన దృష్టాంతాలు పుష్కలంగా ఉన్నప్పుడు వాల్మీకివంటి సామాజిక తత్త్వవేత్త ఇంత పెద్ద తప్పిదం చేస్తాడా?! తదనంతర కాలంలో వాల్మీకేతర కవులెవరో చొప్పించిన ప్రక్షిప్తాల చలవే ఈ స్ఖాలిత్యాల గోలంతా.. అని అందుకే అనిపించేది.
ప్రథమ రామాయణం రాసిన వాల్మీకి రామునికి సమకాలీనుడని కదా భావన! జరగక ముందే ఉత్తరకాండను ఆ కవి ఊహించి రాసాడనడం హేతుబద్ధంగా ఉందా? కావ్యారంభంలో వాల్మీకి చేసుకున్న కథాగమన మననంలో ఉత్తరకాండా ఉంది కదా అని వాదించ వచ్చు. ఆ సర్గా ఎందుకు ప్రక్షిప్తమై ఉండకూడదూ?!
లంకాధిపతి వేదపాండిత్యంగల పౌలస్త్య బ్రాహ్మణుడన్న వాదనా ప్రశ్నార్హమే. వేదవిధిమీద విశ్వాసమున్నవ్యక్తి యజ్ఞాయాగాదులు భగ్నమవాలని చూస్తాడా?! ‘రావణుడు రాక్షసుడు. అసురుడుగా ప్రచారం చరిత్ర దృష్ట్యా దోషం’ అనుకుందామనుకొంటే సుందరకాండలో తద్విరుద్ధమైన భావం (సుందర 20, 5-6) ఎదురవుతుంది! ఎత్తుకొచ్చిన స్త్రీకి మనసు దిటవు పరుచుకొనేందుకు వీలుగా ఒక ఏడాదిపాటు అవకాశంగా ఇవ్వాలని రాక్షసవివాహ నీతి. అప్పటికీ ఒల్లని స్రీని భక్షించడం ఆదిమ జాతుల్లో తప్పు కాదు. రాక్షస రావణుడు సీతను చంపి తింటానని బెదిరించాడుగానీ బలాత్కరిస్తానని ఎక్కడా అనడు! పైపెచ్చు ‘కామం కామః శరీరే మే/యథా కామం ప్రవర్తతాం’ (మన్మథుడు నా శరీరంలో ఎంత యధేచ్చగానైనా ప్రవర్తించనీయి నా పై కామనలేని నిన్ను నేను తాకను) అంటాడు. ఒక ఉదాత్త ప్రేమికుడి . ఆదర్శనీయమైన భావన అది. ప్రధానపాత్రలలోనే ఇన్ని పరస్పర వైరుధ్యాలా?! రామాయణ కర్త ఒక్కరు మాత్రమే కాకపోవడమే ఇంత గందరగోళానికి కారణమనుకోవాలి.
ఆచారాలనుబట్టి, కొన్నిభాషనుబట్టి రామాయణంలోని వానరలు సవర జాతివారేమోనని గో. రామదాసుగారు (భారతి 1926 మార్చి, ఏప్రియల్ సంచికలు) ఓ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. సవర భాషలో ‘ఆర్శి’ అంటే కోతి. ఆర్శిలలో మగవాళ్ళు లంగోటి కట్టే విధానం వెనక వేలాడే తోకను తలపిస్తుంది. (అందుకేనా ఆడవారికి తోకలున్నట్లు రామాయణంలో ఎక్కడా చెప్పలేదు?) రామాయణంలోని లంక, జన స్థానాలకి సవర పదాలు లంకాన్, జైతాన్ మూలాలేమేమోనని గో. రామదాసుగారి ఊహ. ‘దండకా’ అన్న పదానికీ వ్యుత్పత్తి చెప్పారాయన. సవర భాషలో ‘దాన్’ అంటే నీరు. ’డాక్’ అన్నా నీరే. ‘దాన్ డాక్’ అంటే నీరే నీరు. ‘దాన్డాక్’ మీద ‘ఆ’ అనే షష్టీ విభక్తి ప్రత్యయం చేరి ‘దన్డకా’.. (దండకా) అయిందని రామదాసు గారి ఆలోచన. దండకారణ్యంలో విశేషంగా నీరుండబట్టే అరణ్యకాండ (11, 40-41) లో ‘స్థాలీప్రాయే వనోద్దేశే పిప్పలీవన శోభితే/బహుపుష్పఫలే రమ్యే నానా శకుని నాదితే/పద్మిన్యో వివిధా స్తత్ర ప్రసన్న సలిలాశ్రితాః/హంసకారండవాకీర్ణా శ్చక్రవాకోశోభితాః’ అన్న శ్లోకంలో చెప్పినట్లు అగస్త్యాశ్రమం పిప్పిలోవన శోభితమైన సమతలంమీద రకరకాల పుష్పాలు, ఫలాలు, పక్షుల రవాలు, హంసలు, సారసాలు, చక్రవాకాలతో శోభాయమానంగా ఉంద’న్న వర్ణనకు అతికినట్లు సరిపోతుంది.
చిన్నవాడు పెద్దవాడి భార్యను పెండ్లాడవచ్చు. పెద్దవాడు చిన్నవాడి భార్యను మాత్రం ముట్టుకోకూడదన్నది సవరల ఆచారం. రామాయణంలోని వాలిసుగ్రీవుల కథ తదనుగుణంగానే ఉంది కాబట్టి రామాయణంలోని వానరులు ఒకానొక సవర జాతివారేనని గో. రామదాసుగారి సిద్ధాంతం. తథాస్తు అందామనిపించినా తత్ సిద్ధాంతానికి తభావతు కలిగించే అంశాలు వాల్మీకంలోనే నిక్షిప్తమై ఉండె! చరిత్ర ప్రకారం వానరులు దక్షిణభారతంలో మహా బలవంతులు. ప్రముఖులు. బుద్ధిమంతులు. ఆర్యులకు స్నేహపాత్రులు. రామ లక్ష్మణులతో ప్రథమ పరిచయం వేళ హనుమంతుడు ధరించిన భిక్షు రూపం, ప్రదర్శించిన భాషాపాటవం, సముద్ర లంఘనంలో లాఘవం, సందర్భశుద్ధితో పెద్దలకు వందనాదులు చేసే సంస్కారం వానరజాతి నాగరిక లక్షణ విశేషాలు. అభివృద్ధి పరంగా ఎంతో వెనకంజలో ఉండే సవర జాతిగా వారు ఏ కారణం చేత ఎప్పుడు దిగజారిపోయారో? నమ్మదగ్గ అదారాలేమీ దొరకనంత వరకు రామదాసుగారి ‘సవర’ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా స్వీకరించలేం. కిష్కింధగా చెప్పుకునే ఆ ప్రాంతంలో ఇప్పుడు సవర జాతివారూ దాదాపుగా లేరు. కోతులు మాత్రం చాలా ఎక్కువ. అదో వింత!
రామాయణంలోని జటాయువూ ఒక ఆటవిక జాతి మనిషని సురవరం ప్రతాపరెడ్డిగారి సిద్ధాంతం. కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ప్రకటించిన విష్ణుకుండి మూడవ మాధవశర్మ శాసనం ప్రస్తావించిన ‘గుద్దవాది’.. ఇప్పటి గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకు రంపచోడవరమని మల్లంపల్లివారూ అభిప్రాయపడుతున్నారు. ఆ గుద్దవాదే పూర్వం గుద్రహారము. గృధ్ర శబ్దం సంస్కృతీకరించిన గుద్ర శబ్దంకాగా కాలక్రమేణా అది గద్దగా ‘పెంచిన రామాయాణం’లో రూపాంతరం చెందివుంటుందని పెద్దల ఊహ. కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు సీతమ్మవారిని ఆకాశమార్గానే తీసుకు పోయినట్లుంది. జటాయువూ ఒక పక్షిమాత్రంగానే వర్ణితం. ఈ వైవిధ్యాలకీ ప్రక్షిప్తాలే కారణాలా?
ముందా జాతిని గురించి ఒక వ్యాసం రాస్తూ శరశ్చంద్రరాయ్ గారు ‘ముందాలలోని ఉరోవన్ అనే ఒక శాఖ తాము రావణ సంతతికి చెందిన వారమని చెప్పుకుంటుంద’న్నారు. ఆయన సిధ్ధాంతం ప్రకారం కోరమండల్ తీరం ఖరమండలం అనే మూలపదం నుంచి ఉద్భవించింది. రామాయణంలో చెప్పిన ఖరమండలం ప్రాంతం ఇదే కావచ్చన్న రాయ్ గారి అభిప్రాయం సత్యానికి ఎంత సమీపంలో ఉందో చెప్పలేని పరిస్థితి. శాస్త్రబద్ధంగా పరిశోధనలేవీ సవ్యంగా సాగని నేపథ్యంలో రామాయణంలోని ప్రతి అంశమూ, ప్రాంతమూ ఇలాగే పలుప్రశ్నలకు గురవుతున్నవన్న మాట ఒక్కటే అంతిమ సత్యంగా మిగిలింది
‘రామాయణంలోని లంక నేటి సింహళం. సముద్ర తీరానికి అది నూరు యోజనాల దూరం’ అన్నది బహుళ ప్రచారంలో ఉన్న ఒక విశ్వాసం. సురవరం ప్రతాపరెడ్డిగారి అభిప్రాయం మరో విధంగా ఉంది. చుట్టూ రెండు మూడు దిక్కుల నీరున్నా లంకలుగానే చలామణి అయ్యేవని.. గోదావరీ
ప్రాంతంలోని ఒక లంక రామాయణంలోని లంకయి ఉండవచ్చని రెడ్డిగారి అంచనా. ఆంజనేయుడు సముద్ర లంఘనం చేసాడని రామాయణంలో స్పష్టంగా ఉన్నప్పుడు గోదావరీ ప్రాంతంలోని ఏదేని ఒక కాలవను మాత్రమే దాటాడని అనడం దుస్సాహసమే అవుతుంది! రామాయణ కాలంనాటి నైసర్గిక స్థితిలో భారతదేశానికి లంకకు మధ్య నూరు యోజనాల దూరం ఉండేదా! నాటి లంక నైసర్గిక స్వరూపం నిర్ధారణ అయేదాకా సింహళంలోని లంకే రామాయణంలోని లంక అనుకోవడం మినహా మరో మార్గం ఏముంది?
ఆధార లవలేశాలపై చేసిన ఈ కేవల ఊహావిశేషాలూ సందేహాతీతాలేమీ కావు కూడా. ప్రథమ రామాయణ కర్త రాముడికి సమకాలికుడు కాకపోయే అవకాశమూ కొట్టి పారేయలేం. నిజంగా సమకాలీనుడే అయితే ఎంత కావ్యమైనా గోరంత వాస్తవికతకు కొండంత అభూత కల్పనలు కల్పిస్తాడా? గతంలో జరిగిన కథేదో కాలమాళిగలో వూరి వూరి ప్రథమ రామాయణ కర్తృత్వం జరిగే నాటికి కల్పనలు, కవితోక్తులతో ఓ అందమైన కావ్యానికి సరిపడినంత సరంజామాగా సమకూరిందనుకున్నా పేచీ లేదు. తదనంతర కాలంలో ఆ కావ్యంలోకొచ్చి పడ్డ ప్రక్షిప్తాల తంతు సరే సరి!
అనుష్టుప్ కి భిన్నమైన శ్లోకాలయితేనేమి? అందులోనూ ఎంతో ప్రతిభావంతమైన కవిత్వం ఉంది. రెండో వాల్మీకీ(ఉండి ఉంటే) మొదటి వాల్మీకులవారికి ప్రతిభాపాటవాలలో తీసిపోని మహాకవే. కాబట్టే ప్రక్షిప్తాల పోలికల్లో ఇంత సంక్లిష్టత!

రామాయణం భారతానికి సుమారు వెయ్యి సంవత్సరాల ముందైనా జరిగి వుంటుందని ఒక అంచనా. నాటి సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక పరిస్థితులకు అనుగుణంగా అల్లిన కథ రామాయణం. నేటి సమాజ విలువలతొ వాటిని బేరీజు వేయబూనడం సబబా?
సాహిత్యంలో ప్రధానంగా ఎంచవలసింది నాటి విశ్వాసాలు.. ఆ విశ్వాసాలు ఆయా పాత్రలను నడిపించే తీరు.. అంతిమంగా మానవత్వం ప్రకటితమైన వైనం. ఆ దృష్టితో చూస్తే రామాయణం నిశ్చయంగా అత్యుత్తమమైన విలువలతో కూడిన మనోవికాస గ్రంథమే.
కర్తృత్వం సంగతి కాసేపు పక్కన పెడదాం! ఆ ఆదికావ్యంలోని కవిత్వం, కథా నిర్వహణ, పాత్ల పోషణ అపూర్వం. వివాదాలన్నింటికీ అతీతం. పురుషోత్తముడైన రాముని కథ కవిశ్రేష్టుడైన వాల్మీకి మలిచిన తీరు అనితర సాధ్యం. శోకం, శృంగారం, శౌర్యం, వేదాంతం, నీతి.. మహాకవి పట్టుకున్న ప్రతీ రసం మన మానసాలని తేనెపట్టులాగా పట్టుకుని ఒక పట్టాన వదలదు. పురంనుంచి, వనంవరకు కవి కావ్యంలో చేసిన వర్ణనలో? అత్యద్భుతం. సహజ సుందరం. కథ కల్పనల్లో విహరించినా.. వర్ణనలు వాస్తవికతకు అద్దం పడుతుంటాయి. ప్రతి సన్నివేశం విస్పష్టం. విశిష్టం. వెరసి రామాయణం వంటి కావ్యం న భూతో న భవిష్యతి. సీతారాముల దాంపత్య సరళిని వాల్మీకి మలిచిన తీరుకి విశ్వజనావళి మొత్తం నివాళులెత్తుతున్నది ఇవాళ్టికీ.
మానవుడైన రాముణ్ణి వాల్మీకి తన లేఖినితో దేవుణ్ణి చేసాడు. భారతావనిలో ఇవాళ రాముడు లేని గుడి లేదు. రామకథ వినిపించని బడి లేదు. సీతారాముల్ని చిత్రించని కళారూపం అసంపూర్ణం. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో స్పర్శిచని భారతీయ సాహిత్యం అసమగ్రం. దేశదేశాలలో సైతం గుబాళిస్తుదా రామకథా సుగంధం.
ఎక్కడో ఆకాశంలో విహరించకుండా.. మన మధ్య మసలుతూనే మానవ విలువలను గురించి, మంచి పాలన గురించి, కుటుంబ నిష్ఠతను గురించి ఉత్తమ మార్గమేదో స్వీయప్రవర్తన ద్వారా రుచి చూపించిన పురుషోత్తముడు రాముడు. కల్పనో.. వాస్తవమో.. రెండు చేతులా నిండు మనసుతో మనం చేసే సునమస్సులకు నూరు శాతం యోగ్యులు సీతారాములు. ఆ ఆదర్శ దంపతులను క్షుభిత జాతికి అందించిన కవియోగులు.. ప్రథములైనా..ద్వితీయులైనా.. అందరూ ధన్యులు.
-రచన: కర్లపాలెం హనుమంతరావు

సంప్రదించిన కొన్ని రచనలుః
వాల్మీకి రామాయణము- ఉప్పులూరి కామేశ్వరరావు
రామాయణ సమాలోచనము- కాళూరి హనుమంతరావు
రామాయణ విశేషములు- సురవరం ప్రతాపరెడ్డి
రామాయణమునందు వానరులు ఎవరు? – గో. రామదాసు
రామాయణము- బాలకాండము- కాళూరి వ్యాసమూర్తి

The Riddle of Ramayana- C.V. Vaidya
(మాలిక- అంతర్జాల పత్రిక జూలై 2015లో ప్రచురితం)

Wednesday, July 1, 2015

ఆత్మనిగ్రహం- చిట్టి సరదా కథ

ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న  రుషివర్యుణ్ణి చూసి ఆకర్షితుడయాడు. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్నిచూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు.
'స్వామీ! మీరు మా నగరానికి పావనంచేస్తే సకల సౌకర్యాలున్న మంచిభవంతి నిర్మించి ఇస్తాను' అన్నాడు.
'రాజా! ఈ మనోహరమైన వనసీమలను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా బతకలేను. క్షమించండి!' అన్నాడు రుషివర్యుడు.
'పోనీ.. శరీరంమీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టుపీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి!'అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.
'దైవం ప్రసాదించిన దుస్తులుకదా ఆత్మమీది ఈ శరీరం! ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా!
మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది బాదుషా!' అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.
'కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!'అన్నాడు అక్బర్.
'దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగగదా! అన్యథా భావించకండి రాజా!' అని మహర్షి సమాధానం.
'పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?' రాజుగారి ప్రార్థన.
సాధువుది మళ్ళా అదే సమాధానం. 'ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకయ్యా మహారాజా!' అని నిరాకరించాడు రుషివర్యుడు.
రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధువుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. 
'ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా  నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి' అంటూ రాజుగారు రుషివర్యునికి సమాధానం ఇచ్చే వ్యవధానంకూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.
'స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడు ప్రత్యక్షంగా అర్థమయింది' అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.
'సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేం మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడో? అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా సొంతానికి ఏర్పాటు చేసుకోగలను.. ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు   'ఆత్ననిగ్రహం' అని! అర్థమయిందా?'
గురువుగారి బోధనను విన్న  శిష్యపరమాణువు నోరువెఃఃఅబెట్టాడని వేరే చెప్పాలా!
***
-కర్లపాలెం హనుమంతరావు
( నా నోట్ సునుంచి సేకరించినది. సోర్సు తెలియ లేదు)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...