Thursday, April 7, 2016

హైకూ- చంద్రుడిని చూపించే వేలు.- హైకూ పరిచయ వ్యాసం



"Because the poem is tiny does not mean that it is simple. A good haiku is apt to be not only subtle but complex with inner meanings"
జపాన్ దేశ కవితా ప్రక్రియ హైకూ. పండితులను, పామరులను సమానంగా అలరించే హైకూ వయసు దాదాపు ౩౦౦ ఏళ్ళు. 20వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలకు పాకిన తరువాత ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. గత శతాబ్ద చివరి దశకంలోఆంగ్ల భాషా మద్యమంద్వారా హైకూ తెలుగులొకి దిగుమతి అయింది.
తాదాత్మ్యస్థితిలో కవికి ఆశ్చర్యాన్నో, ఆనందాన్నో, విషాదాన్నో, సంవేదననో కలిగించే దృశ్యశకలానికి యథాతథ రూపాన్నిచ్చే ప్రక్రియగా హైకూని నిర్వచించుకోవచ్చు. తాదాత్న్యత వల్ల ఉక్తి వైచిత్రి. క్లుప్తత, గుప్తత హైకూ రెండు కళ్ళు.
వచనకవిత లాగానే హైకూకి పాద విభజనలో హేతుబధ్ధత లేదు.పట్టుదలతో అక్షరనియమాన్ని పాటించినందువల్ల హైకూ మౌలిక సౌందర్యానికే ముప్పు.17 అక్షరాలలో మాత్రమే ఉండితీరాలన్న నియమం వల్ల అవసరమైన చోట భావలోపం, అనవసరంగా అక్షరాల సాగతీత. హైకూను భిన్నమయిన కవితాప్రక్రియగా నిలిపేది విలక్షణమయిన భావ వ్యక్తీకరణే. కవి విశిష్ట దృక్కోణం మాత్రమే హైకూని ప్రత్యేకంగా నిలబెట్టగలిగేది.
హైకూలో పరిమితులు ఎక్కువ. దృశ్యాన్ని మాత్రమే చెప్పాల్సివుంటుంది. అందరితో పాటు..ఎప్పుడూ చూసేదే ఐనా…ఒకానొక తాదాత్మ్య స్థితిలో ఆశ్చర్యంగానో…సంభ్రమంగానో వాచ్యం చేయడం మరో ప్రధాన లక్షణం.స్వానుభూతే తప్ప సహానుభూతికి అవకాశం లేని ప్రక్రియ హైకూ. ముందుగా వస్తునిర్దేశం కుదరదు. జ్ఞానాన్నో సందేశాన్నో ఇచ్చే ప్రయత్నం చేయ కూడదు. హైకూ కవిత ప్రసరించే పరోక్ష జ్ఞానాన్నిస్వానుభవానికి సమన్వయం చెసుకోవాలంటే …పాఠకుడిలో కూడా కవి అంత పరిణతి అవసరం. ఇది ప్రధానమైన పరిమితి. భావపరంగా…భాషాపరంగా ఎలాంటి అలంకరణలకు అవకాశం లేదు కనుక…భాషాపాండిత్యానికి…శబ్దాలంకారాలకు తావు లేదు. హైకూకు శీర్షిక సైతం ఉండరాదనేది మరో పరిమితి. వర్తమానాంశాలే తప్ప భూత,భవిష్యత్తులకు సంబధించిన అంశాలు, స్వప్నాలు, ఊహలు హైకూలకు ఇమడవు.
ఈ పరిమితులను అధిగమించిన కవితలేవి హైకూలు అనిపించుకోవు.
స్థూల దృష్టికి అభివ్యక్తి, ప్రయోజనాల దృష్ట్యా హైకూలు నాలుగు రకాలు.
సుందర దృశ్యం…సార్వత్రిక సత్యం ప్రతిఫలించే హైకూలు మొదటి రకం.
పచ్చిక మొలిచింది
బాటని కప్పేసింది, మళ్ళీ
ఎన్ని వందల కాళ్ళు అవసరమో(ఇస్మాయిల్-కప్పల నిశ్శబ్దం)
హైకూ ధ్వని ప్రధానం. చెప్పిన దాని కన్నా చెప్పనిది అధికంగా ఉండే'చంద్రుని చూపించే వేలు'
ఖాళీ పాత్ర
శూన్యానికి
ఆకారమిస్తూ -(లలితానంద్-ఆకాశ దీపాలు)
ఉపమానం ఉన్నా ఉపమేయం ఉండదు.హైకూ అందుకే ఎంత సర్వ సమగ్రంగా అనిపిస్తుందో..అంత అసంపూర్ణమూ అనిపిస్తుంది. పరిపూర్ణత అందుకోవాల్సింది పాఠకుడి మనసులోనే!
సుందరమైన, విలక్షణమైన దృశ్యాన్ని ప్రదర్శించే హైకూలు రెండవ రకం.
బోటుని
దాని నీడకి కట్టేసి
సరంగు ఎటో వెళ్ళిపోయాడు- ఇదీ ఇస్మాయిల్ గాఅరి హైకూనే-కప్పల నిశ్శబ్దం నుంచి)
ఉత్ప్రేక్షకాలంకారం. గాఢానుభూతికి గీటురాయి.
నిరాడంబరంగా వ్యక్తీకరింపబడే దృశ్యాలు హైకూ మూడో రకం.
Outside the pub
The sailor
Faces the wind- చక్ బ్రిక్ లీ
పరస్పర భిన్న స్థితిగతులకు చెందిన రెండు విషయాలను సమన్వయం చెసే విధానం ఇందులో ఉంటుంది.
కొన్ని రకాల ఉద్వేగాలను కలిగిమ్చేవి..ఒక రకమైన మూడ్ ని సృష్టించేవి నాలుగో రకం.
On a bare branch
A rook roosts:
Autumn dusk-(The penguin Book of Japanese verse)
హైకూలను ఇలాగే అర్థం చేసుకోవలని నియమమ్ ఏమీ లెదు. పాథకుని మానసిక స్థితి, వైఖరి, సంస్కారాన్నిబట్టి బహుళార్థక బోధనకు అవకాశం ఉండే ప్రక్రియ హైకూ.
'క్లుప్తత ప్రధానమైన హైకూ విస్తృతమైన వివరణలను అపేక్షించే సంక్లిష్తమైన అంశాలను, అసాధారణమైన అనుభవాలను చెప్పడానికి అనువైమ్ది కాదు' అంటున్నారు -అంటూ హైకూ ప్రక్రియలోని బలాన్నీ, బలహీనతలనీ సవివరంగా చర్చించారు పెన్నా శివరామకృష్ణ.
సూచనః
ఈ వ్యాసానికి మూలం కూడా పెన్నా ప్రచురించిన "దేశదేశాల హైకు"లోని 'కవితాప్రక్రియగా 'హైకూ' స్వరూప స్వభావాలు. మరింత అవగాహనకు ఆసక్తి గలవారు-పాలపిట్ట బుక్స్ వారు ప్రచురించిన "దేశదేశాల హైకు" పరిశీలించ వచ్చు.ప్రాథమిక అవగాహన కోసమే ఈ ప్రయాస.
పెన్నా అనువదించిన కొన్ని విదేశీ హైకూలుః
గాలిలొ గర్వంగా విహరిస్తూ
పెద్ద గడ్డిపరక
ఓహ్! తూనీగ!
-మత్సువొ బషోఃజపాను కవిత

మంచు కురిసే వేళ
తెల్లగా మారే వరకూ
చాచిన చేతులతో పిల్లవాడు
-రిచర్డ్ రైట్(ఆఫ్రికన్ అమెరికన్ కవిత)

అతడికి వాన ఇష్టంః
ఆమె అతడి జీవితంలో ప్రవేశించి
గొడుగును ఇచ్చింది
-అలెక్జీ ఆన్ ద్రెయేవ్(రష్యన్ కవిత)

మా నాన్న సమాధి వద్ద
నల్లటి నున్నటి
మార్బుల్స్ లో నా ముఖం
-ఇవాన్ నాదిలో(క్రొయేషియన్ హైకూ)

నేను పక్షిగా మారగలను-
నువ్వు క్రూర జంతువుగా మారనని 
ప్రమాణం చేస్తే
-రీటా ఓడె (పాలస్తీనియన్ కవయిత్రి కవిత)

రాతి నుంచి మొలిచిన
పుట్టగొడుగు-దానికి తెలుసుః
బెరమాడే కళ (కార్పొరేట్ హైకూ)

నదులు లేని చోట
వంతెనలు నిర్మిస్తూ
రాజకీయ నాయకులు
-ప్రొ.ఆర్.కె.సింగ్ (భారతీయ ఆంగ్ల కవిత)

తల్లి తిడుతుంటే
కొడుకు మౌనం తల్లి
తానే రోదించింది
-పురుషోత్తమ్ దీవాన్(హిందీ కవిత)

అకస్మాత్తుగా వర్షం-
కొలను నిండా
ఆశ్చర్యార్థకాలు!!
-మిత్రా(తమిళ్ కవిత)

ఆమెను చేరడానికి
దారినయ్యా
ఎవరో నడిచి వెళ్ళారు...
(కన్నడ హైకూ)

మన యువకవులకు మరిన్ని మంచి హైకూలు రాయాలన్న ఆసక్తి కలిగితే
ఈ వ్యాసం  సార్థకమయినట్లే!.
(పెన్నా శివరామకృష్ణ గారికి ధన్యవాదలతో…పాలపిట్ట బుక్స్ వారికి కృతజ్ఞతలతో)

* దృశ్యాదృశ్యం-బి.వి.వి.ప్రసాద్.'చంద్రుడిని చూపించే వేలు'ముందు మాట
-కర్లపాలెం హనుమంతరావు

Monday, April 4, 2016

ఎన్నో అదృష్టాంతాలు- ఓ రాజకీయ సరదా వ్యాఖ్య

పరమాత్ముడైనా ఆ పరంధాముడు పథ్నాలుగేళ్లు వనవాసం చేసేవరకు పట్టాభిషేకానికి నోచుకోలేదు. అదే అతగాడి పాదుకలు! ఏ ప్రయత్నం చేయకుండానే దర్జాగా అయోధ్య సింహాసనం అధిష్టించాయి! అదృష్టమంటే అదే!
అదృష్టం ఉంటే ఎడారిలో పడున్నాసరే ఏనుగు  వెదుక్కంటూ వచ్చి వరమాలను మెడలో వేస్తుంది. 'తంతే బూరెల బుట్టలో పడ్డం' అంటాంగదా.. అలాంటిదే ఇదీనూ! అలాగని బూరెల బుట్టముందు నిలబడి తన్నించుకున్నా.. ప్రారబ్దం బాగోలేకపోతే పక్కనున్న పేడతక్కెట్లో పడవచ్చు! ప్రారభ్దానికి ఏ శబ్దార్థ కౌముదీ సరిగ్గా నిర్వచనం చెప్పలేదు. చెప్పలేదుకూడా!
'ఖర్మానికి ధర్మాధర్మాలుండవని గీతకూడా బోధిస్తూనే ఉందిగదా! 'దృష్టం' అంటేనే  కంటికి కనిపించనిదిదృష్టాంతాలేగాని.. సిద్ధాంతాలండనిది. అపోలో రెండోదశ అంతరిక్ష నౌక చంద్రమండలంమీద దిగేముందు సరిగ్గా ఇరవై నిమిషాలకు సరిపడ్డ ఇంధనం మాత్రమే మిగిలి ఉందటఅదీ  అదృష్టం అంటే! కలసి రావాలి.. అంతే! కలసిరాని వేళ అలంకారంకోసం వేలికి పెట్టుకున్న పచ్చల ఉంగరంకూడా పచ్చడి మెతుకులతో పాటు గొంతులోకి జారి బతుకులు 'హరీ' అనవచ్చు!
'పూర్వజన్మసుకృతం' అని ఏదో పేరు తగిలించుకొని  సంతృప్తికోసం  సమర్ధించుకొంటామేగానీ ఏ అపూర్వ శబ్దచింతామణీ అదృష్టానికి సంపూర్ణ న్యాయం చెయ్యనేలేదు. చెయ్యలేదుకూడా!
టైమ్ బాగోలేకపోతే భోలక్ పూర్ నల్లానీళ్ళే కాదు.. బోలెడంత డబ్బుపోసి కొన్న మినరల్ వాటరుకూడా కాలకూట విషమౌతుంది! అన్నీ తెలుసు రాజకీయవేత్తలకు. అయినా రాజకీయాలు పత్తి మార్కెట్ల(కాటన్ మార్కెట్లు) మాదిరి సందడి చేస్తూనే ఉన్నాయి!
జనాలని నమ్ముకోవాల్సింది పోయి జాతకచక్రాలను నమ్ముకొన్న జయలలితమ్మ గతి ఏమవబోయిందో అందరికీ తెలిసిందే! మన దగ్గరా ఎమ్మెల్సీ సీట్లకోసం హస్తంపార్టీ చీట్లు తీసింది!
గోడదూకుడుగాళ్ళు ఎక్కువైపోతున్నారని  వాపోయే ఓ పార్టీ  తన కార్యాలయం గోడలు మరింత ఎత్తుకు పెంచిందొకసారిఏమయిందీ?   గోడలకు కన్నాలేసి మరీ కోరుకొన్న పార్టీల్లోకి దూకేసారు జంపు జిలానీలు! నీతిమంతులుండే అదృష్టం ప్రధానంగానీ..  ఎత్తులూ.. జిత్తులూ ఎవరి సొత్తుల్నీ శాశ్వతంగా కాపాడలేవు!
గెలుపుకి 'గుర్తు' కలసిరావడం లేదని కుములుకుంటోందిగాని.. జనంలో గుర్తింపు తగ్గిందని గుర్తుపట్టలేకపోతుందింకో  మడమ తిప్పని పార్టీ! నేతల తలరాతలను తేల్చేది నిజానికి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల జాతరేగానీ.. గుర్తులూ.. తాయెత్తులూ కానేకాదని ఎన్నేళ్ళు ఓడినా మన ప్రజాప్రతినిధులకు జ్ఞానోదయం కలగడంలేదు! ప్చ్! జనం దురదృష్టం!
రోజులూ అలాగే  ఉంటున్నాయిలేండి! ఎన్నికల్లో విజయఢంకా మోగించినవాడు ప్రమాణ స్వీకారం రోజునే ప్రాణాలు పోగొట్టుకొంటుంటే.. యావజ్జీవ కారాగారశిక్ష పడ్డవాడు దర్జాగా బైటకొచ్చి రాజకీయ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నాడు! రాసిపెట్టుంటే చర్లపల్లి జైల్లో ఉన్నా వేడివేడి బిర్యాని పొట్లాలు వేళకు అందుతాయి! సిమ్ కార్డు తాయిలాలు  క్రమం తప్పకుండా అందుతుంటాయి! నూకలు చెల్లితే గోకుల్ చాటుకు పోయి మరీ  ప్రాణాలు పోగొట్టుకోవడం  ఈ కళ్లతో ఎన్నేసి సార్లు చూసి తరించ లేదూ!
దేవుడు దయతలచి 'పోనీలే 'పాప'మని 'ఉఁ' అన్నాసరే.. పూజారన్నగారు తలాడిస్తేనే ప్రసాదం ప్రాప్తించేది. పూజారయ్య మనసు ముందు మనవైపు మళ్లడటమే ప్రస్తుతం అదృష్టాల్లోకెల్లా పెద్ద అదృష్టం! రాజకీయాలనుంచి.. రాసలీలలవరకు.. అన్నింటా పూజారులే రాజ్యాలు చలాయిస్తున్నా 'మాది రామరాజ్యం' అని ప్రభుత్వాలు బుకాయించడం  ప్రజల దురదృష్టం.
కాలం కలసిరాకపోతే కోట్లుపోసి పెట్టిన వోక్సువేగను కార్లఫ్యాక్టరీకూడా ఇంచక్కా రెక్కలొచ్చి ఎక్కడెక్కడికో ఎగిరిపోవడం చూడ్డంలే! చేటుకాలం తోసుకొచ్చినప్పుడు 'జై' కొట్టిన చేతులే పాతచెప్పులు విసరడం చూడ్డంలే! అదృష్టానికి దురదృష్టానికీ మధ్య అడ్డుగీత ఎక్కడున్నట్లు
అదృష్టదేవతేమన్నా మన గర్ల్ ఫ్రెండా! పిలిచీ పిలవంగానే 'హాయ్' అంటూ వచ్చి వళ్లోవాలి 'హాయి'నిచ్చిపోవడానికి! ఆడవారి మనసులు నిజంగా ఎంత చంచలమో తెలీదుగానీ.. అదృష్టదేవతదిమాత్రం మహా 'ఫికిల్ మైండ్'! అమ్మగారి చపలచిత్తానికి ఎన్ని వందల ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు!
సోనియమ్మ  ప్రధాని పదవికి ఎన్నుకునే సమయంలో  మన్మోహన్ జీ  కనీసం రాజ్యసభకు హాజరయ్యే సభ్యుడైనా కాదుదేశం అమెరివాడికి  ఊడిగం చెయ్యాలని రాసిపెట్టి ఉన్నప్పుడు సోనియమ్మ ముసుగులోనైనా సరే వచ్చి  శనిలా ఆడించేస్తుంది మరి అదృష్టదేవత!
'రాసిపెట్టి ఉన్నప్పుడు రాళ్లగుట్టకింద దాచిపెట్టి ఉన్నా  అధికారం దానంతట అదే నెత్తిమీదకొచ్చి నృత్యమాడి తీరుతుంద'న్న సిద్ధాంతం కొంజేటి రోశయ్యగారిని చూసి కొంచెమైనా వంటబట్టించుకొని ఉంటే  రాజకీయాల్లో ఇన్నేని రాద్ధాంతాలకు  తావుండదు. జగన్ బాబుకా సూత్రం వంటబట్టకే ఉప్పుడిన్ని  మంటలు
'రాజధాని ఆహ్వానపత్రం' ఇవ్వనే ఇవ్వద్దని.. ఇచ్చినా తాను చచ్చినా వచ్చేది  లేద'ని మొండికేసి వంటరివాడయిపోయింది అదృష్టదేవత తత్త్వం రోజా మాదిరి ఎంత మొండిదో అర్థం కాకపోబట్టే
దేనికోసమూ దేబిరించకుండా దేవుడు మనకిచ్చిన 'పాత్ర'ను   వీలయినంత అద్భుతంగా నటించుకుంటూ పోతుండడమే విజ్ఞుడైన రాజకీయవేత్త పాటించదగ్గ ప్రాప్తకాలజ్ఞత. ఆ పాఠం ఇద్దరు చంద్రులను చూసైనా నేర్చుకోవద్దూ!
జీవితంపాత్రలో  అదృష్టం ఉండేది కింది సగంలో. పైన సగభాగం కృషి. రాజకీయలవరకు అదే నటనా కౌశలం! అదృష్ట దేవత ఆశీర్వాదం అందాలంటే కృషి(అదే.. నటన)ని నమ్ముకోవడం తప్పని సరి.
దుర్యోధనుడి పాచికలాట విజయం   కేవలం శకునిమామ 'పని'తనంవల్ల మాత్రమే వచ్చిపడ్డది కాదు. అదృష్టదేవత ముద్దుమురిపాలుమితిమించడం వల్లకూడా! 
గురుత్వాకర్షణశక్తిని గుర్తుపట్టిన రోజు న్యూటన్ మహాశయుడు ఆపిల్ చెట్టుకింద కూర్చోనుండడం- కాదు అదృష్టం. పండు కిందపడ్డం కంటబడ్డప్పుడు   న్యూటన్ మెదడ్లో 'బల్బు' వెలగడం అదృష్టం. రాజకీయాల్లో నాయకుల  'బల్బు'లు ఎప్పుడు వెలుగుతాయో.. ఎందుకు వెలుగుతాయో! దానిమీదే ప్రజల అదృష్ట దురదృష్టాలు  ఆధారపడి ఉండేది!
సముద్రంమీద లేచిన అల్పపీడనం= వాయుగుండంగా మారి  ఏ దిశకు తిరగాలో ఏ సిద్ధాంతగ్రంథం  చూసి నిర్ణయిస్తుందీ? వాటాన్నిబట్టి జరిగే   సంక్షేమచర్యలకు ఏ యాగమూ.. యజ్ఞమూ దిశానిర్దేశాలు  చెయ్యవు. అయినా యాగాలూ.. యజ్ఞాలూ.. చేయడం చంద్రుళ్లమార్కు రాజకీయం! 'చేయను గాక చెయ్యను' అంటూ భీష్మించుక్కూర్చోడం జగన్ బాబు మార్కు మూర్ఖత్వం!
'ఎవరి తలరాతలు వారే స్వయంగా రాసుకొనవచ్చు' అన్న సత్యం సత్యంరామలింగరాజువంటివారి ఏ కొద్దిమంది మేథావులకే   పరిమితం.  
ప్రజాస్వామ్యంలో జనం తలరాతలు రాసేది ప్రజానేతలు! వాళ్ళ తలలు ఎలా పనిచేస్తున్నాయన్న  దాన్నిబట్టే జనతా  అదృష్ట దురదృష్టాలు!
ఇప్పుడు మాత్రం మన అదృష్టాలకేం తక్కువ.. చెప్పండి! స్వైన్ ఫ్లూ వచ్చే సీజన్లో సాధారణ ఫ్లూ వచ్చిపోవడం అదృష్టం కాదా! వానలు కురవని రోజుల్లో బ్యాంకురుణాలు దొరక్కపోవడం రైతన్నల అదృష్టం.. అవునా కాదా! మాంద్యం ముదిరిన వేళ  ఉద్యోగాలూడకుండా వేళ్ళాడుతూ అయినా  ఉండటం ఎంత పెద్ద అదృష్టం! ఫ్లాపు పిక్చరు తీసినా ఫస్టువీకే ప్రపంచ మొత్తం  ఒకేసారి విడుదల చేసి  వీలైనంత సొమ్ము రాబట్టేసుకోడం మెగా అదృష్టమేనా కాదా! కందిపప్పుకు కరువున్నా  కనీసం పెసరపప్పైనా నా పిసరంత దొరుకుతున్నది అదేమైనా   మామూలు అదృష్టదేవత విలాసమా! ఆలస్యంగానైనా ఆడపిల్ల క్షేమంగా ఇల్లుచేరడం ఎంత పెద్ద అదృష్టమో ఈ పాడురోజుల్లో! ఏసిడ్ దాడులు పెరిగిన రోజుల్లో ఎవరూ మన పిల్లల్ని ప్రేమిస్తున్నారని వెంటాడకపోవడాన్ని మించిన అదృష్టమాత వరం  కన్నవారికి ఇంకెక్కడ దొరుకుతుంది!
మన చేతుల్లో లేని అదృష్టాన్ని గురించి వాపోవడంకన్నా ఉన్న స్వల్ప అదృష్టాలని తలుచుకొంటో మురిసిపోయే  మనసుండటం మించిన అదృష్టం మరింకేముంటుందం!  ఏమంటారు?

-కర్లపాలెం హనుమంతరావు


( 05-10-2009 నాటి ఈనాడు సంపాదకీయం పుటలో ప్రచురితం 

Saturday, April 2, 2016

ప్రజాప్రతినిధులు- జీతభత్యాలు- ఓ రాజకీయ సరదా వ్యాఖ్య



'ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది. నూటపాతిక కోట్ల మంది జనాభాకి ముష్టి ఏడొందల తొంభై మూడుమంది మాత్రమేనా ప్రజాప్రతినిథులు! స్థాయిలో మాకన్నా ఎంతో దిగువనున్న వాళ్లకేమో   లక్షల్లో జీతాలా! మాకు మాత్రం  భిక్షాపాత్రలో ముష్టి వేసినట్లు   తొంభైవేలా?! ప్రొటోకాలు పరువైనా  నిలబడాలా వద్దా?   లెక్కకైనా వేతనంలో కనీసం  ఒక్కరూపాయైనా  ఎక్కువ మాకు  దక్కాలి గదా! ఎవరు బాబూ నువ్వు? ఎందుకా పడీ పడీ నవ్వు?'
'నీ అంతరాత్మనులే మహానుభావా! గుర్తుపట్టలా? ఎన్నికల సంఘంవాళ్లకి నువు సమర్పించిన తప్పుడు వివరాల ప్రకారం చూసుకొన్నా నీ ఇప్పటీ ఓ గంట ఆదాయం.. తెల్లకార్డువాడి ఏడాది సంపాదనకన్నా ఎన్నోరెట్లు ఎక్కువగదా! ఉచిత బంగళా.. ఫ్రీ ఫోన్ కాల్సు.. సకుటుంబ సపరివారంగా చక్కర్లు కొటేందుకు దేశీయంగా ఉచిత  ప్రయాణ సౌకర్యాలు.. ఖర్చుచేసినా చెయ్యకున్నా పెట్రోలు, గ్యాసులమీద భారీ రాయితీలు, నియోజక వర్గాల్లో తిరిగినా తిరగకున్నా సాదర ఖర్చులకింద వేలాది రూపాయలు.. నొక్కుతున్నావుకదా! ఇంకా ఈ వేతనాలు చాలడంలేదన్న సన్నాయి నొక్కులేమిటంట? నవ్వు రాదా మహాశయా! నీ విమానాలు, ఏసీ రైళ్ళ ప్రయాణాలు వగైరాలన్నింటికీ అయ్యే ఖర్చు బొక్కసానికి ఏటా డెబ్బైనాలుగు లక్షల పైచిలుకు బొక్కపెదుతోందని లెక్కలు  చెబుతున్నాయిగదా! అయినా నువ్విప్పుడు మళ్ళీ క్యాంటీను భోజనం ఖరీదుగా ఉందని యాగీకి దిగుతున్నావ్! ఇంకా ఏవేవో సౌకర్యాలు సమకూరడంలేదని  సణుగుతున్నావ్! ఈ కరవు, ఆర్థికమాంద్యం గడ్డురోజుల్లోకూడా నీకు జీతమెందుకు పెంచాలో ఒక్క సజావుకారణం ఉంటే  సెలవివ్వు.. నవ్వడం మానేస్తా!'
'ఒక్కటి కాదు. ఓ కోటి చెబుతాను.. ఒక్కోటీ ఓపిగ్గా వినాలేగాని! ఈ వృత్తిలోకి రాకముందు నేనెంత గడించేవాణ్ణో నీకూ తెలుసు. మామూళ్ళు, సెటిల్మెంటులు, రింగుల్లాంటివి ఇప్పుడు బాహాటంగా చెయ్యడానికి ఎలా వీలుంటుంది చెప్పు! పనోళ్ళకి సిమెంటు ఫ్యాక్టరీలున్నా పట్టించుకోరుగాని.. మేం ఇసుక తక్కెళ్ళ జోలికెళ్ళినా గగ్గోలు పెడతారు దిక్కుమాలిన జనం.. విడ్డూరంగా! అందుకే ప్రభుత్వ వైద్యులకు మల్లే మాకూ 'నాన్ ప్రాక్టీసింగు అలవెన్సు'ఇవ్వాలంటున్నాం! తప్పా?
'హా.. హా.. హా'
ఆ నవ్వే వద్దు! మంగళరిగి చేంతాడంతందని  మా ఆదాయప్పట్టికను తప్పుపడుతున్నావ్ గానీ.. హనుమంతుడి తోకమాదిరి సాగే మా ఖర్చుల చిట్టా మాత్రం  నీకు పట్టదు! సర్కారువాళ్ళిచ్చే ముష్టి ముగ్గురు సెక్యూరిటీ
మాకేమూలకు! కాలు బైటపెడినప్పుడల్లా ఎంత హంగూ.. ఆర్భాటం ప్రదర్శించాలీ! పెట్రోలు, డీజెలు రేట్లు ఎట్లా పెట్రేగిపోతున్నాయో.. అంతరాత్మగాడివి నీకే తెలుస్తుంది! మా  ప్రైవేటు ఆర్మీకేమన్నా తలా ఓ రెడ్ ఫెరారీ డిమాండు చేస్తున్నామా? బుల్లెటు ప్రూఫ్ కార్లు, బుల్లెట్లు, బాంబులకయ్యే ఖర్చు ఎంతని సొంతంగా పెట్టుకోగలం.. కరువుకాలంలో!  అన్నీ బైటకు చెప్పుకొనే ఖర్చులుకూడా కావాయ! ఎన్నికల్లో ఎన్నెన్నిరకాల వత్తిళ్ళొస్తాయో నీకూ తెలుసని నాకు తెలుసు.'
'నిజమే! ఇదివరకు మాదిరి ఏదన్నా సర్కారు భూముల్లో జెండాలు పాతుకొందామనుకొన్నా.. పాపం.. వాటికీ ఉల్లిగడ్డలకుమల్లే కరువొచ్చి పడిందాయ! దేవుడి సొమ్మూ దేవుడికే అంతుచిక్కకుండా అంతర్దానమవుతుందాయ!  ఇంక మీకు మాత్రం మిగులుతున్నదేముందిలే తమ్ముడూ బూడిద మినహా!'
'వెటకారమా! ప్రభుత్వాలన్నా స్థిరంగా ఉండుంటే మాకిన్ని పాట్లుండేవా చెప్పన్నా!  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడే భూసేకరణ సవరణో.. చటుక్కున చట్టమై కూర్చుందనుకో.. ఇహ మా పని చుట్టలు పీల్చుకుంటూ రచ్చబండమీద చతికలబడ్డమేగా! కాల్ సెంటరు పనోళ్లకన్నా మెలుకువగా  కళ్లలో వత్తులేసుకొని కూర్చోకపోతే మా పని 'శ్రీమద్రమారమణ గోవిందో హారి' ఐపోదా! కొన్ని నష్టాలకు సరిపడా పరిహారంగానైనా మాకు జీతభత్యాల్లో సర్దుబాటు చేయమనడం అన్యాయవా! లాభదాయక పదవుల్లో ఉండరాదని మాకు మాత్రమే ఓ  గుదిబండ మెడలో వేలాడుతుంటుందని తెలుసుగా! ఆ వారా నష్టపరిహారం లెక్క  చూసుకున్నా ఇప్పుడు మేమడిగే పదిలక్షలకు ఐదురెట్లు ఎక్కువ ఇచ్చినాఅ తక్కువే!  ప్రజాప్రతినిధులన్న కక్ష మానేసి పక్షపాతం లేకుండా ఆలోచించమని మనవి చేసుకొంటున్నాం! అదీ  నీకు మహా ఎగతాళి ఐపోయింది!'
'సారీ తమ్ముడూ! నువ్వింత వివరంగా విడమరిచి చెప్పినప్పుడైనా   నా మైండ్ సెట్ మారకపోతే  తప్పే!ఒప్పుకుంటున్నా!  న్యాయంగా ఆలోచిస్తే నెలకు పాతిక లక్షలు జీతంగా ఇచ్చినా మీ నష్టానికి సరిపడ్డ పరిహారం కాదనే అనిపిస్తున్నదిప్పుడు!'
' థేంక్స్ అంతరాత్మా!'
'కానైతే నాదో చిన్న సలహా కూడా ఉంది మిత్రమా! పనికి తగ్గ జీతభత్యాలుండాలని కోరుకోవడంలో తప్పు లేదు. అరవై ఏళ్లకిందట ఏటా అరవై బిల్లులు పాసు చేసేవాళ్ళు మీ ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రశాంతంగా కూర్చుని. ఇప్పుడో? పాతిక పాసు అవడానికే ఆపసోపాలు పడుతున్నారు! చాలా బిల్లులు చర్చలకు నోచుకోకుండానే చట్టాలు ఐపోతున్నాయిప్పుడు ఇహ చట్టసభల్లో తమరి హాజరు చిన్నబళ్లో పంతుళ్ల హాజరీకన్నా అన్యాయంగా ఉంది హుజూర్!'
'ఐతే ఏమంటావ్?!'
'అకౌంటబిలిటీనిబట్టి అకౌంటింగు ఉండాలంటాను'
'మరి..'
'గంటకు ఇంతని హాజరుభత్యం నిర్ణయించాలి. హాజరుపట్టీ ప్రకారమే జీతాల చెల్లింపులుండాలి. వాకౌట్ చేసిన రోజున జీతం మొత్తం కట్! సభాపతి అనుమతి లేకుండా మాట్లాడే ప్రతి పదానికి ఇంతని కత్తిరించడం తప్పనిసరి చేయాలి. మార్షల్సు బలవంతంగా బైటికి మోసుకుపోయిన సందర్భంలో బరువుకి ఇంతని అపరాధరుసుం అదనంగా మీ జీతాలనుంచే వసూలు చేయాలి. ఫలహార శాలల్లో ఇచ్చే రాయితీలను రూపాయి పైసల్లోకి మార్చి మీ జీతాలనుంచే  తిరిగి రాబట్టాలి. రాజకీయాల్లోకి రాకముందు.. వచ్చిన తరువాత.. కనిపించే ఆదాయాల్లోని  తేడానుబట్టి  ఇంత శాతమని శిస్తుగా వసూలు చేసి ఏ ప్రధాని సంక్షెమ నిధికో జమచేసేందుకు 'సై' అంటే నెలకు పదిలక్షలేం ఖర్మ.. పాతికలక్షలమీదొక్క రూపాయి ఎక్కువిచ్చినా అధర్మం అనిపించదు'
'ఖర్మ! ఆ లెక్కన మాకిక నికరంగా మిగిలేదేముంటుంది అంతరాత్మా.. ఆ ఒక్క రూపాయి తప్ప!'
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు సంపాదకీయ పుటలో 'శ్రమకు తగ్గ ఫలం' పేరుతో ప్రచురితం)



'



Friday, April 1, 2016

తూటా- కౌముది మరీ చి.కగా ప్రచురితం

రాజా రావుబహద్దూరు రాజారావుగారికి ఉబ్బసం వ్యాధి. దగ్గు తెరలు తెరలుగా తన్నుకొస్తూ పక్కమీద ఒక్కక్షణంకూడా నిలవనీయడం లేదు. పక్కనే పక్కలోనే సహధర్మచారిణి  దేవికారాణి.. ముసుగు ఉంది! అయినా భర్త బాధలేవీ ఆ రాణిముసుగులో చలనం కలిగించలేకపోయాయి!
రాజావారే లేని ఓపిక తెచ్చుకొని లేచివెళ్ళి మందుబిళ్లమింగి కాసిన్ని మంచితీర్థం గొంతులో వంపుకొన్నారు. తరువాత  బాత్రూంకని బైలుదెరారు. కాలకృత్యం ముగించుకొని తిరిగివస్తూ యథాలాపంగా కిటికీగుండా బైటికి చూస్తే..  వాచ్ మెన్ వెంకట్రాముడి  పక్కా ఖాళీగా ఉంది!
పక్క గదిలోనుంచి పకపకలు.. గుస గుసలు! ఆడా మగా గొంతులు కలగలసి పోతూ.. ఉండి ఉండి నవ్వులు! అర్థరాత్రి ఆటలని  ఆ ముద్దులు..ముచ్చట్లే చెబుతున్నాయి!
పక్కమీదకొచ్చి ముసుగులో చూస్తే భార్యామణిగారూ లేరు!
పరువుకోసం అరవయ్యిల్లో ఇరవైయ్యేళ్ల పిల్లను మూడోపెళ్లి చేసుకొని పొరపాటు  చేసినట్లేననిపిస్తోంది రాజావారికి ఇప్పుడు.
తప్పును సరిదిద్దుకోవాలి.. సాధ్యమైనంత తొందరగా!’ గొణుక్కొంటూ గోడమీద వేలాడే తుపాకీ వంక చూసారు రావుబహుద్దూరు రాజారావుగారు.
ముక్కుతూ మూలుగుతూనే లేచి వెళ్ళి డ్రాయరు సొరుగు తాళంతీసారు!
***
మూడోరోజు వార్త
'రాజా రావుబహుద్దూరు రాజారావుగారింట్లో తూటా పేలి వాచమన్ వెంకట్రాముడి  దుర్మరణం. రెండురోజుల కిందట ఉదయం పూట రాజావారి  తుపాకీ శుభ్రం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు భోగట్టా!'
-కర్లపాలెం హనుమంతరావు


***

డాక్టరు- యాక్టరు- కౌముది మరీ చి.కగా ప్రచురితం

నాకిద్దరు సంతానం. అమ్మాయి. అబ్బాయి. ఇద్దర్నీ డాక్టర్లు చేయాలని నా ఆశ.
పెద్దది ఎలాగో పొర్లుదండాలైనా పెట్టుకుంటూ వైద్యాలయం చేరుకొంది. కానీ చిన్నాడి కథే గుంటపూత.
డాక్టరవుతావా? యాక్టరవుతావా? అని ఎవరైనా అడిగితే.. తడబాటుకూడా ఉండదు.. 'యాక్తర్' అనేవాడు నత్తిగా మా వాడు.
ఆలోచనకు తగ్గట్లే బుద్ధులూనూ!
బడికి పంగనామం పెట్టినప్పుడు, సినిమా టిక్కెట్టుకి పైనలు నొక్కాల్సొచ్చినప్పుడు, పరీక్షలైపోయి ఫలితాలు వచ్చేటప్పుడు, స్నేహాల మిషతో అడ్డమైనవాళ్ళను కొంపమీదకు తెచ్చినప్పుడు.. వాడి నటనాకౌశలం చూసితీరాలి. ముందు కన్నతల్లిని.. ఆనక ఆమె కన్నీళ్లతో నన్నూ లొంగదీసుకోడం వెన్నతో పెట్టిన విద్య వాడికి.
వాడి ఖర్మానికి వాణ్ణి వదిలేసి చాలా కాలమే అయింది. రేపు పెళ్లయి పిల్లా జెల్లా పుట్టుకొస్తేకనీసం వాడి అక్కమాత్రం నెలకో పాతికవేలైనా గడించుకోకపోతే ఎలాగన్నది ఒక్కటే ప్రస్తుతం మా దిగులు.
మా ఆవిడకు ఒంట్లో బాగుండటం లేదు. చూపించడానికని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకు వెళ్లా. ముందే అప్పాయింటుమెంటు తీసుకొన్నా.. మా కన్నా ముందు ఇంకెంతమంది తీసుకొన్నారోగాని అప్పాయింటుమెంటు.. వెయిటింగు హాలు తిరుమల వెంకన్న దర్శనం గదులకన్నా రద్దీగా ఉన్నాయ్!
డాక్టర్లు వచ్చారో.. రాలేదో! అడుగుదామనుకుంటే తెల్లకోటుల్లో తిరిగేవాళ్ళలో ఎవరు వైద్యులో.. ఎవరు కాంపౌండర్లో.. కన్ఫ్యూజన్! పడిగాపులు పడలేక వేరే ఆసుపత్రుల చిరునామాలు సెల్ ఫోనుల్లో చూసుకొంటున్నారు చాలామంది రోగులు. అప్పుడు జరిగింది ఆ వింత.
అప్పటిదాకా కామ్గా కూర్చొన్న యువ జంట ఒకటి ఉన్నట్లుండి పెద్దగా అరుచుకోవడం మొదలు పెట్టింది. మాటలు చేతల్లోకి మారడం క్షణాల్లో జరిగిపోయింది! టీవీ సీరియలు కన్నా రసవత్తరంగా సాగుతోంది సీను.
అబార్షను కేసు. అమ్మాయికి ఇష్టం లేదు. అబ్బాయికి సంతానం ఇష్టం లేదు. ఇంటిపట్టునే గుట్టుగా తేల్చుకోవాల్సిన కాంప్లికేటెడ్ మేటరు గదా! ఆసుపత్రిదాకా వచ్చి ఇక్కడీ రచ్చెందుకో ఇప్పుడు!
మొత్తానికి ప్రేక్షకులందరికీ మంచి కాలక్షేపం. ముక్కుతూ మూలుగుతూ పడుకొన్న రోగులుకూడా నొప్పులన్నీ మర్చిపోయారు. లోపలి వాళ్ల సంగతి సరే సరి.. బైట జనంకూడా ఎగబడుతున్నారు! ఆసుపత్రివాళ్ళు టీవీ కట్టేసిన సంగతికూడా ఎవరూ పట్టించుకోలేదంటే.. పరిస్థితిలోని మార్పు అర్థం చేసుకోవచ్చు.
'డాక్టర్లు వచ్చారు' అని ఎవరో అరిచిందాకా టైమెంతయిందో ఎవరికీ పట్టలేదు.
క్షణాల్లో సీను మారిపోయింది.
అప్పటివరకు జుట్టూ జుట్టూ పట్టుకొని కొట్టేసుకొన్న ఆ అబ్బాయి.. అమ్మాయి.. ఇంచక్కా నవ్వుకొంటూ చెట్టాపట్టాలేసుకొని వెళ్లిపోయారు లోపలికి!
విసుగెత్తిన రోగుల్ని వినోదపరిచేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఆచరిస్తున్న లేటెస్టు టెక్నాలజీ! 'యాక్టింగు' ద్వారా ఎంటర్ టైన్ చేయడంకూడా ఒక ముఖ్యమైన టెక్నిక్కుట! రోగుల్ని పక్క ఆసుపత్రులకు వదిలేసుకోకుండా ఒడుపుగా నిలబెట్టుకోవడం, కొత్త రోగులను రాబట్టుకోవడం లక్ష్యంట!
 చాలా వైద్యాలయాలు అనుసరిస్తున్నాయి ఇలాంటి వ్యాపార సూత్రాలను' అని ఇంటి దగ్గర  మా డాక్టరమ్మాయి వివరించినప్పుడు నోరు వెళ్లబెట్టడం మా వంతయింది.
'డాక్టర్ని చేసి నా దుంప తెంపారు మీరు. ఇంచక్కా తమ్ముళ్లా నేను యాక్టర్నై ఉంటే  ఈ కార్పొరేట్ ఆసుపతులోనే కార్పెట్లు పరిపించుకొనే దాన్ని' అని నిష్టూరాలక్కూడా దిగింది మా డాక్టరుడాటరు.
తన తప్పేముందిలేండి! ఎం.డి పట్టా పుచ్చుకొని ఎంప్లాయిమెంటుకోసం  వెళ్ళినప్పుడు 'డాక్టర్లకు మా దగ్గర కొదవలేదు. మాక్కావాల్సిందిప్పుడు యాక్టర్లు. డాక్టర్లకు నెలకు పాతికవేలు మించి ఇవ్వలేం. యాక్టర్లకైతే రెట్టింపు ఇచ్చేందుకైనా రడీ' అన్నాడుట ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంటు. అదే ఆసుపత్రి తమకోసం పనిచెయ్యమని తమ్ముడిమీద తెగ వత్తిడి తెస్తున్నాయి.. తమరికి తెలుసో .. లేదో!’ అనికూడా వ్యంగ్యాలు పోయింది. వాడికి అంత టైం లేదని.. తన ట్రైనీసుని అవసరం వచ్చినప్పుడల్లా డిప్యూట్ చేస్తున్నాట్ట ఇప్పుడు!
ఇందాకటి అబార్షన్ కీచులాట కాన్సెప్టుకూడా మా వాడిదే అని అప్పుడు తెలిసింది మాకు.
మొత్తానికి మన డాక్టరు అమ్మాయికన్నా యాక్టరు అబ్బాయి పనే బాగుందన్న మాట! కలికాలం!' అని నోరు నొక్కుకుంది మా శ్రీమతి. అలా నొక్కుకోవాలన్న స్పృహైనా లేకుండా దిమ్మరబోవడం నా వంతైంది.
-కర్లపాలెం హనుమంతరావు
***



తిరగబడ్డ ‘సీతారాముడు ఉదయగిరి’- కౌముది పత్రిక ప్రచురితం

డోర్ బెల్ మోగింది.
తలుపు తీసింది కళ్యాణి. ఎదురుగా ఎవరూ లేరు! రంగుకాగితాల చుట్ట మాత్రం కనిపించింది గడపలో. విప్పి చూస్తే లోపలా ఏమీ లేదు. చిన్న నోట్ మినహా!
'విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్ డే విత్ ఏ బ్యూటీఫుల్ బేబీ సూట్'
-యువర్స్
అప్పుడే పుట్టిన బిడ్డవంటిమీద ఏవీ ఉండవన్న అర్థంలో కాబోలు! ముందు కొద్దిగా నవ్వొచ్చింది. ఆనక కోపం ముంచుకొచ్చింది.
 ‘హూ ఈజ్ దిస్ యువర్స్?!’
ముక్కూమొగం తెలీని మనిషితో  పరాచికాలా! ఇది మొదటిసారి కాదు.
రెండు నెల్లకిందట..
సెల్లార్లో కారు స్టార్టుచేసి బైలుదేరే సమయానికి ఎదురుగా డ్యాష్ బోర్డు అద్దంమీద భయంకరంగా.. బల్లి!
పైప్రాణాలు పైనే పోయాయాక్షణంలో. బల్లంటే తనకింతప్పణ్ణుంచీ పరమ అలర్జీ!
వాచ్ మెన్ వచ్చి  రబ్బరుబల్లితో పాటు  ఒక చిన్ననోటూ తీసి చూపించాడు. 'ఏప్రియల్ ఫూల్!' అనిమాత్రం ఉందందులో.
అదీ  ఈ యువర్స్ నిర్వాకమే!
ఏప్రియల్ ఫూళ్ళు, పుట్టిన్రోజులు, ఫ్రెండ్షిప్ డేలు.. అన్నీ రాజుగాడితోపాటే  మటుమాయమై పోయాయి జీవితంలో!
పెద్ద పోలీసాఫీసరుకదా అని మరీ ఇష్టపడి చేసుకొంది సీతారాముణ్ణి. ‘సీతారాముడు ఉదయగిరి’ ఒక్కటే అప్పట్లో తనకు తెలిసిన తన ప్రాణం పేరు. ఆ ప్రాణ ప్రసాదమే రాజు.
విధి నిర్వహణలో భాగంగా సీతారాముడు బొక్కలో వేయించాడన్న కక్షతో మూడేళ్ల రాజును పొట్టన పెట్టుకున్నది మాఫియా గ్యాంగు.
ఆ కోపంలోఅనాలోచితంగా సీతారాముణ్ణీ దూరం చేసుకుంది తను.
రాజుగాడి పుట్టినరోజు ఆ రోజు.  సజ్జబూరెలంటే వాడికి చాలా ఇష్టం. స్వహస్తాలతో చేసి అనాథాశ్రమంలో ఇద్దామని ప్లానుసరుకులకోసం గంగారాముకి పోతే .. ముందే ఆర్డరిచ్చినట్లు అన్నీ సిద్ధంచేసిన పాకెట్ అందించారు దుకాణంవాళ్ళు! బిల్లూ ఆల్రెడీ పెయిడ్! పే చేసిందీ ఈ 'యువర్సే'!
అవన్నీ ఎలాగో భరించొచ్చుపెళ్లి రోజున మూడ్ అవుటాఫయి ఎవరికీ అందకుండా సాంఘీటెంపుల్లోకెళ్లి కూర్చుంటే.. అక్కడికీ వెదుక్కుంటూ వచ్చి వాలిందీ 'యువర్స్' బేవార్స్ పార్శిల్!
ఎలా కనిపెడతాడో  తన ఇష్టాఇష్టాలుసందర్బానికి తగ్గట్లు వచ్చేస్తాయి బహుమానాలు! బ్లూ కలర్ అంచున్న గుజరాతీవర్కుశారీ అంటే తనకు ప్రాణం. దాంతోపాటు పింకుకలర్ లోపలి డ్రాయరూ పాకెట్లో కనిపించేసరికి పిచ్చెత్తినట్లయింది కళ్యాణికి.
ఆగడాలు మరీ మితిమీరుతున్నాయి. తనమానానికి తాను ఏడుస్తూకూడా ఓ మూల కూర్చోకూడదా
'యువర్సు గాడెవడో తేల్చాల'ని  గుళ్లోనే డిసైడయింది కళ్యాణి.
'షి' టీముకి ఫిర్యాదూ చేసింది.
మూడురోజుల్లో మొత్తం విషయం బైటకొచ్చేసింది.
యువర్స్ ఒక మనిషి కాదుఆఫ్టర్ లైఫ్ సర్వీసుకి అంకితమైన సంస్థ!
తీరని కోర్కెలతో పోయేజీవికి  తదనంతర కోర్కెలు తీర్చేటందుకు సహకారం అందించే ఒక సేవా సంస్థ. కొంత డిపాజిట్.. కోరికల చిట్టాతో.. కాంట్రాక్టులోకి ఎంటరవడమే పోయేముందు ఆ జీవి చేయాల్సిన పని.
షీటీం ఇచ్చిన వివరాలతో యువర్స్ ను కాంటాక్టు చేసింది కళ్యాణి.
 'వివరాలేమీ  చెప్పేందుకు వీల్లేదు.. బిజినెస్ రూల్సు! ఇంకొక్క ప్యాకెట్టు! మా కాంట్రాక్టు కంప్లీటయిపోతుంది. సారీ మ్యాడమ్.. ఫర్ బాదరింగ్ యూ!' అంటూ  యువర్స్  చల్లటి సమాధానం.
రాబోయే ఆ చివరి ప్యాకెట్టుకోసం ఆ రోజునుంచి  కళ్యాణి ఎదురు చూడని క్షణం లేదు.
వేలంటైన్సు డే రోజున ఆ ముచ్చటా తీరింది.
'కల్లూ! నీకు నామీద కోపమెందుకో తెలీదు! నాకుమాత్రం నీమీదున్నదంతా కేవలం  ఆకాశం పట్టనంత ప్రేమే! బతికున్నంత కాలం ఎలాగైనా నిన్ను కన్విన్సు చేసుకోగలనన్న నమ్మకముండేది. గుండెలోతుల్లోకి దిగిన  తూటాతో నాకిప్పుడా అవకాశం లేకుండా పోయింది. నేరం చేసి ఉరిశిక్షబడ్డ ఖైదీక్కూడా చివరికోరిక తీర్చుకొనే అవకాశం ఇస్తుంది వ్యవస్థ. నాకూ ఆ అవకాశం ఇవ్వద్దాఒకరాజును పోగొట్టుకొన్నా మరోరాజును  సంపాదించుకోవచ్చుమగాళ్ళందరూ  సీతారాముళ్ళ మాదిరిగానే ఉండాలనీ లేదుగా! నీకు నచ్చిన మరో రాధాకృష్ణకోసమైనా నువ్వు అన్వేషణ ఆరంభించాలి.  పదేళ్లకిందట మొదటిసారి ఎన్కన్వెంక్షను సెంటర్లో పింకుకలర్ లోలుంగీలు కొంటున్నప్పటి కళ్యాణిలాగానే నిన్నెప్పుడూ పైనుంచీ చూడాలన్నది నా కోరిక. కాదనవని నా ఆశ 
-తిరగబడ్డ YOURS
(SRUOY- సీతారావుడు ఉదయగిరి ఓన్లీ ఫర్ యూ)
కళ్యాణి కళ్ళవెంట  ధారకట్టే నీళ్ళు! తుడుచుకొనే ప్రయత్నమేమీ ఆమె ఇప్పుడు చేయడంలేదు.
-కర్లపాలెం హనుమంతరావు

***
(కౌముది అంతర్జాల పత్రిక ఏప్రియల్ సంచిక మరీ చి.క లో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...