Friday, April 1, 2016

తిరగబడ్డ ‘సీతారాముడు ఉదయగిరి’- కౌముది పత్రిక ప్రచురితం

డోర్ బెల్ మోగింది.
తలుపు తీసింది కళ్యాణి. ఎదురుగా ఎవరూ లేరు! రంగుకాగితాల చుట్ట మాత్రం కనిపించింది గడపలో. విప్పి చూస్తే లోపలా ఏమీ లేదు. చిన్న నోట్ మినహా!
'విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్ డే విత్ ఏ బ్యూటీఫుల్ బేబీ సూట్'
-యువర్స్
అప్పుడే పుట్టిన బిడ్డవంటిమీద ఏవీ ఉండవన్న అర్థంలో కాబోలు! ముందు కొద్దిగా నవ్వొచ్చింది. ఆనక కోపం ముంచుకొచ్చింది.
 ‘హూ ఈజ్ దిస్ యువర్స్?!’
ముక్కూమొగం తెలీని మనిషితో  పరాచికాలా! ఇది మొదటిసారి కాదు.
రెండు నెల్లకిందట..
సెల్లార్లో కారు స్టార్టుచేసి బైలుదేరే సమయానికి ఎదురుగా డ్యాష్ బోర్డు అద్దంమీద భయంకరంగా.. బల్లి!
పైప్రాణాలు పైనే పోయాయాక్షణంలో. బల్లంటే తనకింతప్పణ్ణుంచీ పరమ అలర్జీ!
వాచ్ మెన్ వచ్చి  రబ్బరుబల్లితో పాటు  ఒక చిన్ననోటూ తీసి చూపించాడు. 'ఏప్రియల్ ఫూల్!' అనిమాత్రం ఉందందులో.
అదీ  ఈ యువర్స్ నిర్వాకమే!
ఏప్రియల్ ఫూళ్ళు, పుట్టిన్రోజులు, ఫ్రెండ్షిప్ డేలు.. అన్నీ రాజుగాడితోపాటే  మటుమాయమై పోయాయి జీవితంలో!
పెద్ద పోలీసాఫీసరుకదా అని మరీ ఇష్టపడి చేసుకొంది సీతారాముణ్ణి. ‘సీతారాముడు ఉదయగిరి’ ఒక్కటే అప్పట్లో తనకు తెలిసిన తన ప్రాణం పేరు. ఆ ప్రాణ ప్రసాదమే రాజు.
విధి నిర్వహణలో భాగంగా సీతారాముడు బొక్కలో వేయించాడన్న కక్షతో మూడేళ్ల రాజును పొట్టన పెట్టుకున్నది మాఫియా గ్యాంగు.
ఆ కోపంలోఅనాలోచితంగా సీతారాముణ్ణీ దూరం చేసుకుంది తను.
రాజుగాడి పుట్టినరోజు ఆ రోజు.  సజ్జబూరెలంటే వాడికి చాలా ఇష్టం. స్వహస్తాలతో చేసి అనాథాశ్రమంలో ఇద్దామని ప్లానుసరుకులకోసం గంగారాముకి పోతే .. ముందే ఆర్డరిచ్చినట్లు అన్నీ సిద్ధంచేసిన పాకెట్ అందించారు దుకాణంవాళ్ళు! బిల్లూ ఆల్రెడీ పెయిడ్! పే చేసిందీ ఈ 'యువర్సే'!
అవన్నీ ఎలాగో భరించొచ్చుపెళ్లి రోజున మూడ్ అవుటాఫయి ఎవరికీ అందకుండా సాంఘీటెంపుల్లోకెళ్లి కూర్చుంటే.. అక్కడికీ వెదుక్కుంటూ వచ్చి వాలిందీ 'యువర్స్' బేవార్స్ పార్శిల్!
ఎలా కనిపెడతాడో  తన ఇష్టాఇష్టాలుసందర్బానికి తగ్గట్లు వచ్చేస్తాయి బహుమానాలు! బ్లూ కలర్ అంచున్న గుజరాతీవర్కుశారీ అంటే తనకు ప్రాణం. దాంతోపాటు పింకుకలర్ లోపలి డ్రాయరూ పాకెట్లో కనిపించేసరికి పిచ్చెత్తినట్లయింది కళ్యాణికి.
ఆగడాలు మరీ మితిమీరుతున్నాయి. తనమానానికి తాను ఏడుస్తూకూడా ఓ మూల కూర్చోకూడదా
'యువర్సు గాడెవడో తేల్చాల'ని  గుళ్లోనే డిసైడయింది కళ్యాణి.
'షి' టీముకి ఫిర్యాదూ చేసింది.
మూడురోజుల్లో మొత్తం విషయం బైటకొచ్చేసింది.
యువర్స్ ఒక మనిషి కాదుఆఫ్టర్ లైఫ్ సర్వీసుకి అంకితమైన సంస్థ!
తీరని కోర్కెలతో పోయేజీవికి  తదనంతర కోర్కెలు తీర్చేటందుకు సహకారం అందించే ఒక సేవా సంస్థ. కొంత డిపాజిట్.. కోరికల చిట్టాతో.. కాంట్రాక్టులోకి ఎంటరవడమే పోయేముందు ఆ జీవి చేయాల్సిన పని.
షీటీం ఇచ్చిన వివరాలతో యువర్స్ ను కాంటాక్టు చేసింది కళ్యాణి.
 'వివరాలేమీ  చెప్పేందుకు వీల్లేదు.. బిజినెస్ రూల్సు! ఇంకొక్క ప్యాకెట్టు! మా కాంట్రాక్టు కంప్లీటయిపోతుంది. సారీ మ్యాడమ్.. ఫర్ బాదరింగ్ యూ!' అంటూ  యువర్స్  చల్లటి సమాధానం.
రాబోయే ఆ చివరి ప్యాకెట్టుకోసం ఆ రోజునుంచి  కళ్యాణి ఎదురు చూడని క్షణం లేదు.
వేలంటైన్సు డే రోజున ఆ ముచ్చటా తీరింది.
'కల్లూ! నీకు నామీద కోపమెందుకో తెలీదు! నాకుమాత్రం నీమీదున్నదంతా కేవలం  ఆకాశం పట్టనంత ప్రేమే! బతికున్నంత కాలం ఎలాగైనా నిన్ను కన్విన్సు చేసుకోగలనన్న నమ్మకముండేది. గుండెలోతుల్లోకి దిగిన  తూటాతో నాకిప్పుడా అవకాశం లేకుండా పోయింది. నేరం చేసి ఉరిశిక్షబడ్డ ఖైదీక్కూడా చివరికోరిక తీర్చుకొనే అవకాశం ఇస్తుంది వ్యవస్థ. నాకూ ఆ అవకాశం ఇవ్వద్దాఒకరాజును పోగొట్టుకొన్నా మరోరాజును  సంపాదించుకోవచ్చుమగాళ్ళందరూ  సీతారాముళ్ళ మాదిరిగానే ఉండాలనీ లేదుగా! నీకు నచ్చిన మరో రాధాకృష్ణకోసమైనా నువ్వు అన్వేషణ ఆరంభించాలి.  పదేళ్లకిందట మొదటిసారి ఎన్కన్వెంక్షను సెంటర్లో పింకుకలర్ లోలుంగీలు కొంటున్నప్పటి కళ్యాణిలాగానే నిన్నెప్పుడూ పైనుంచీ చూడాలన్నది నా కోరిక. కాదనవని నా ఆశ 
-తిరగబడ్డ YOURS
(SRUOY- సీతారావుడు ఉదయగిరి ఓన్లీ ఫర్ యూ)
కళ్యాణి కళ్ళవెంట  ధారకట్టే నీళ్ళు! తుడుచుకొనే ప్రయత్నమేమీ ఆమె ఇప్పుడు చేయడంలేదు.
-కర్లపాలెం హనుమంతరావు

***
(కౌముది అంతర్జాల పత్రిక ఏప్రియల్ సంచిక మరీ చి.క లో ప్రచురితం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...