పరమాత్ముడైనా
ఆ పరంధాముడు పథ్నాలుగేళ్లు వనవాసం చేసేవరకు పట్టాభిషేకానికి నోచుకోలేదు. అదే అతగాడి పాదుకలు! ఏ ప్రయత్నం చేయకుండానే దర్జాగా అయోధ్య సింహాసనం అధిష్టించాయి!
అదృష్టమంటే అదే!
అదృష్టం ఉంటే
ఎడారిలో పడున్నాసరే ఏనుగు వెదుక్కంటూ వచ్చి
వరమాలను మెడలో వేస్తుంది. 'తంతే బూరెల బుట్టలో పడ్డం'
అంటాంగదా.. అలాంటిదే ఇదీనూ! అలాగని బూరెల బుట్టముందు
నిలబడి తన్నించుకున్నా.. ప్రారబ్దం బాగోలేకపోతే పక్కనున్న పేడతక్కెట్లో
పడవచ్చు! ప్రారభ్దానికి ఏ శబ్దార్థ కౌముదీ సరిగ్గా నిర్వచనం చెప్పలేదు.
చెప్పలేదుకూడా!
'ఖర్మానికి ధర్మాధర్మాలుండవని గీతకూడా బోధిస్తూనే ఉందిగదా! అ'దృష్టం' అంటేనే కంటికి కనిపించనిది. దృష్టాంతాలేగాని.. సిద్ధాంతాలండనిది. అపోలో రెండోదశ అంతరిక్ష నౌక చంద్రమండలంమీద
దిగేముందు సరిగ్గా ఇరవై నిమిషాలకు సరిపడ్డ ఇంధనం మాత్రమే మిగిలి ఉందట ! అదీ అదృష్టం అంటే!
కలసి రావాలి.. అంతే! కలసిరాని
వేళ అలంకారంకోసం వేలికి పెట్టుకున్న పచ్చల ఉంగరంకూడా పచ్చడి మెతుకులతో పాటు గొంతులోకి జారి బతుకులు 'హరీ' అనవచ్చు!
'పూర్వజన్మసుకృతం' అని
ఏదో పేరు తగిలించుకొని సంతృప్తికోసం సమర్ధించుకొంటామేగానీ ఏ అపూర్వ శబ్దచింతామణీ
అదృష్టానికి సంపూర్ణ న్యాయం చెయ్యనేలేదు. చెయ్యలేదుకూడా!
టైమ్ బాగోలేకపోతే
భోలక్ పూర్ నల్లానీళ్ళే కాదు.. బోలెడంత డబ్బుపోసి కొన్న మినరల్
వాటరుకూడా కాలకూట విషమౌతుంది! అన్నీ తెలుసు రాజకీయవేత్తలకు.
అయినా రాజకీయాలు పత్తి మార్కెట్ల(కాటన్ మార్కెట్లు)
మాదిరి సందడి చేస్తూనే ఉన్నాయి!
జనాలని నమ్ముకోవాల్సింది
పోయి జాతకచక్రాలను నమ్ముకొన్న జయలలితమ్మ గతి ఏమవబోయిందో అందరికీ తెలిసిందే! మన దగ్గరా ఎమ్మెల్సీ సీట్లకోసం హస్తంపార్టీ చీట్లు తీసింది!
గోడదూకుడుగాళ్ళు
ఎక్కువైపోతున్నారని వాపోయే ఓ పార్టీ తన కార్యాలయం గోడలు మరింత ఎత్తుకు పెంచిందొకసారి! ఏమయిందీ? ఆ గోడలకు కన్నాలేసి మరీ కోరుకొన్న పార్టీల్లోకి
దూకేసారు జంపు జిలానీలు! నీతిమంతులుండే అదృష్టం ప్రధానంగానీ.. ఎత్తులూ.. జిత్తులూ
ఎవరి సొత్తుల్నీ శాశ్వతంగా కాపాడలేవు!
గెలుపుకి 'గుర్తు' కలసిరావడం లేదని కుములుకుంటోందిగాని..
జనంలో గుర్తింపు తగ్గిందని గుర్తుపట్టలేకపోతుందింకో మడమ తిప్పని పార్టీ! నేతల తలరాతలను తేల్చేది నిజానికి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల జాతరేగానీ..
గుర్తులూ.. తాయెత్తులూ కానేకాదని ఎన్నేళ్ళు ఓడినా
మన ప్రజాప్రతినిధులకు జ్ఞానోదయం కలగడంలేదు! ప్చ్! జనం దురదృష్టం!
రోజులూ అలాగే ఉంటున్నాయిలేండి! ఎన్నికల్లో విజయఢంకా మోగించినవాడు ప్రమాణ స్వీకారం రోజునే ప్రాణాలు పోగొట్టుకొంటుంటే..
యావజ్జీవ కారాగారశిక్ష పడ్డవాడు దర్జాగా బైటకొచ్చి రాజకీయ వ్యాపారాల్లో మునిగి
తేలుతున్నాడు! రాసిపెట్టుంటే చర్లపల్లి జైల్లో ఉన్నా వేడివేడి
బిర్యాని పొట్లాలు వేళకు అందుతాయి! సిమ్ కార్డు తాయిలాలు క్రమం తప్పకుండా అందుతుంటాయి!
నూకలు చెల్లితే గోకుల్ చాటుకు పోయి మరీ ప్రాణాలు పోగొట్టుకోవడం ఈ కళ్లతో ఎన్నేసి సార్లు చూసి తరించ లేదూ!
దేవుడు దయతలచి 'పోనీలే 'పాప'మని 'ఉఁ' అన్నాసరే.. పూజారన్నగారు తలాడిస్తేనే ప్రసాదం ప్రాప్తించేది.
పూజారయ్య మనసు ముందు మనవైపు మళ్లడటమే ప్రస్తుతం అదృష్టాల్లోకెల్లా పెద్ద
అదృష్టం! రాజకీయాలనుంచి.. రాసలీలలవరకు..
అన్నింటా పూజారులే రాజ్యాలు చలాయిస్తున్నా 'మాది రామరాజ్యం' అని ప్రభుత్వాలు బుకాయించడం ప్రజల దురదృష్టం.
కాలం కలసిరాకపోతే
కోట్లుపోసి పెట్టిన వోక్సువేగను కార్లఫ్యాక్టరీకూడా ఇంచక్కా రెక్కలొచ్చి ఎక్కడెక్కడికో
ఎగిరిపోవడం చూడ్డంలే! చేటుకాలం తోసుకొచ్చినప్పుడు 'జై'
కొట్టిన చేతులే పాతచెప్పులు విసరడం చూడ్డంలే! అదృష్టానికి
దురదృష్టానికీ మధ్య అడ్డుగీత ఎక్కడున్నట్లు!
అదృష్టదేవతేమన్నా మన గర్ల్ ఫ్రెండా! పిలిచీ పిలవంగానే 'హాయ్' అంటూ వచ్చి వళ్లోవాలి 'హాయి'నిచ్చిపోవడానికి! ఆడవారి మనసులు నిజంగా ఎంత చంచలమో తెలీదుగానీ.. అదృష్టదేవతదిమాత్రం మహా 'ఫికిల్ మైండ్'! అమ్మగారి చపలచిత్తానికి ఎన్ని వందల ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు!
అదృష్టదేవతేమన్నా మన గర్ల్ ఫ్రెండా! పిలిచీ పిలవంగానే 'హాయ్' అంటూ వచ్చి వళ్లోవాలి 'హాయి'నిచ్చిపోవడానికి! ఆడవారి మనసులు నిజంగా ఎంత చంచలమో తెలీదుగానీ.. అదృష్టదేవతదిమాత్రం మహా 'ఫికిల్ మైండ్'! అమ్మగారి చపలచిత్తానికి ఎన్ని వందల ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు!
సోనియమ్మ ప్రధాని పదవికి ఎన్నుకునే సమయంలో మన్మోహన్ జీ కనీసం రాజ్యసభకు హాజరయ్యే సభ్యుడైనా కాదు! దేశం అమెరివాడికి ఊడిగం చెయ్యాలని
రాసిపెట్టి ఉన్నప్పుడు సోనియమ్మ ముసుగులోనైనా సరే వచ్చి శనిలా ఆడించేస్తుంది మరి అదృష్టదేవత!
'రాసిపెట్టి ఉన్నప్పుడు రాళ్లగుట్టకింద దాచిపెట్టి ఉన్నా అధికారం దానంతట అదే నెత్తిమీదకొచ్చి నృత్యమాడి తీరుతుంద'న్న సిద్ధాంతం కొంజేటి రోశయ్యగారిని చూసి కొంచెమైనా వంటబట్టించుకొని ఉంటే రాజకీయాల్లో ఇన్నేని రాద్ధాంతాలకు తావుండదు. జగన్ బాబుకా సూత్రం వంటబట్టకే ఉప్పుడిన్ని మంటలు!
'రాజధాని ఆహ్వానపత్రం' ఇవ్వనే ఇవ్వద్దని.. ఇచ్చినా తాను చచ్చినా వచ్చేది లేద'ని మొండికేసి వంటరివాడయిపోయింది అదృష్టదేవత తత్త్వం రోజా మాదిరి ఎంత మొండిదో అర్థం కాకపోబట్టే!
దేనికోసమూ దేబిరించకుండా దేవుడు మనకిచ్చిన 'పాత్ర'ను వీలయినంత అద్భుతంగా నటించుకుంటూ పోతుండడమే విజ్ఞుడైన రాజకీయవేత్త పాటించదగ్గ ప్రాప్తకాలజ్ఞత. ఆ పాఠం ఇద్దరు చంద్రులను చూసైనా నేర్చుకోవద్దూ!
'రాజధాని ఆహ్వానపత్రం' ఇవ్వనే ఇవ్వద్దని.. ఇచ్చినా తాను చచ్చినా వచ్చేది లేద'ని మొండికేసి వంటరివాడయిపోయింది అదృష్టదేవత తత్త్వం రోజా మాదిరి ఎంత మొండిదో అర్థం కాకపోబట్టే!
దేనికోసమూ దేబిరించకుండా దేవుడు మనకిచ్చిన 'పాత్ర'ను వీలయినంత అద్భుతంగా నటించుకుంటూ పోతుండడమే విజ్ఞుడైన రాజకీయవేత్త పాటించదగ్గ ప్రాప్తకాలజ్ఞత. ఆ పాఠం ఇద్దరు చంద్రులను చూసైనా నేర్చుకోవద్దూ!
జీవితంపాత్రలో అదృష్టం ఉండేది కింది సగంలో.
పైన సగభాగం కృషి. రాజకీయలవరకు అదే నటనా కౌశలం!
అదృష్ట దేవత ఆశీర్వాదం అందాలంటే కృషి(అదే.. నటన)ని నమ్ముకోవడం తప్పని సరి.
దుర్యోధనుడి పాచికలాట విజయం కేవలం శకునిమామ 'పని'తనంవల్ల మాత్రమే వచ్చిపడ్డది కాదు. అదృష్టదేవత ముద్దుమురిపాలుమితిమించడం వల్లకూడా!
గురుత్వాకర్షణశక్తిని గుర్తుపట్టిన రోజు న్యూటన్ మహాశయుడు ఆపిల్ చెట్టుకింద కూర్చోనుండడం- కాదు అదృష్టం. పండు కిందపడ్డం కంటబడ్డప్పుడు న్యూటన్ మెదడ్లో 'బల్బు' వెలగడం అదృష్టం. రాజకీయాల్లో నాయకుల 'బల్బు'లు ఎప్పుడు వెలుగుతాయో.. ఎందుకు వెలుగుతాయో! దానిమీదే ప్రజల అదృష్ట దురదృష్టాలు ఆధారపడి ఉండేది!
గురుత్వాకర్షణశక్తిని గుర్తుపట్టిన రోజు న్యూటన్ మహాశయుడు ఆపిల్ చెట్టుకింద కూర్చోనుండడం- కాదు అదృష్టం. పండు కిందపడ్డం కంటబడ్డప్పుడు న్యూటన్ మెదడ్లో 'బల్బు' వెలగడం అదృష్టం. రాజకీయాల్లో నాయకుల 'బల్బు'లు ఎప్పుడు వెలుగుతాయో.. ఎందుకు వెలుగుతాయో! దానిమీదే ప్రజల అదృష్ట దురదృష్టాలు ఆధారపడి ఉండేది!
సముద్రంమీద
లేచిన అల్పపీడనం= వాయుగుండంగా మారి
ఏ దిశకు తిరగాలో ఏ సిద్ధాంతగ్రంథం చూసి నిర్ణయిస్తుందీ? వాటాన్నిబట్టి జరిగే సంక్షేమచర్యలకు ఏ యాగమూ.. యజ్ఞమూ దిశానిర్దేశాలు చెయ్యవు. అయినా యాగాలూ..
యజ్ఞాలూ.. చేయడం చంద్రుళ్లమార్కు రాజకీయం! 'చేయను గాక చెయ్యను' అంటూ భీష్మించుక్కూర్చోడం జగన్ బాబు మార్కు మూర్ఖత్వం!
'ఎవరి తలరాతలు
వారే స్వయంగా రాసుకొనవచ్చు' అన్న సత్యం సత్యంరామలింగరాజువంటివారి ఏ కొద్దిమంది మేథావులకే పరిమితం.
ప్రజాస్వామ్యంలో జనం తలరాతలు రాసేది ప్రజానేతలు! వాళ్ళ తలలు ఎలా పనిచేస్తున్నాయన్న దాన్నిబట్టే జనతా అదృష్ట దురదృష్టాలు!
ప్రజాస్వామ్యంలో జనం తలరాతలు రాసేది ప్రజానేతలు! వాళ్ళ తలలు ఎలా పనిచేస్తున్నాయన్న దాన్నిబట్టే జనతా అదృష్ట దురదృష్టాలు!
ఇప్పుడు మాత్రం
మన అదృష్టాలకేం తక్కువ.. చెప్పండి! స్వైన్ ఫ్లూ వచ్చే సీజన్లో
సాధారణ ఫ్లూ వచ్చిపోవడం అదృష్టం కాదా! వానలు కురవని రోజుల్లో బ్యాంకురుణాలు
దొరక్కపోవడం రైతన్నల అదృష్టం.. అవునా కాదా! మాంద్యం ముదిరిన వేళ ఉద్యోగాలూడకుండా వేళ్ళాడుతూ అయినా ఉండటం ఎంత పెద్ద అదృష్టం! ఫ్లాపు పిక్చరు
తీసినా ఫస్టువీకే ప్రపంచ మొత్తం ఒకేసారి విడుదల చేసి వీలైనంత సొమ్ము రాబట్టేసుకోడం మెగా అదృష్టమేనా కాదా! కందిపప్పుకు కరువున్నా కనీసం పెసరపప్పైనా నా పిసరంత దొరుకుతున్నది అదేమైనా మామూలు అదృష్టదేవత విలాసమా! ఆలస్యంగానైనా ఆడపిల్ల క్షేమంగా ఇల్లుచేరడం
ఎంత పెద్ద అదృష్టమో ఈ పాడురోజుల్లో! ఏసిడ్ దాడులు పెరిగిన రోజుల్లో
ఎవరూ మన పిల్లల్ని ప్రేమిస్తున్నారని వెంటాడకపోవడాన్ని మించిన అదృష్టమాత వరం కన్నవారికి ఇంకెక్కడ దొరుకుతుంది!
మన చేతుల్లో
లేని అదృష్టాన్ని గురించి వాపోవడంకన్నా ఉన్న స్వల్ప అదృష్టాలని తలుచుకొంటో మురిసిపోయే మనసుండటం మించిన అదృష్టం మరింకేముంటుందం! ఏమంటారు?
-కర్లపాలెం హనుమంతరావు
(
05-10-2009 నాటి ఈనాడు సంపాదకీయం పుటలో ప్రచురితం)
No comments:
Post a Comment