జపాన్ దేశ కవితా ప్రక్రియ హైకూ. పండితులను, పామరులను
సమానంగా అలరించే హైకూ వయసు దాదాపు ౩౦౦ ఏళ్ళు. 20వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలకు పాకిన తరువాత
ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. గత శతాబ్ద చివరి దశకంలోఆంగ్ల భాషా
మద్యమంద్వారా హైకూ తెలుగులొకి దిగుమతి అయింది.
తాదాత్మ్యస్థితిలో కవికి ఆశ్చర్యాన్నో, ఆనందాన్నో, విషాదాన్నో, సంవేదననో
కలిగించే దృశ్యశకలానికి యథాతథ రూపాన్నిచ్చే ప్రక్రియగా హైకూని నిర్వచించుకోవచ్చు.
తాదాత్న్యత వల్ల ఉక్తి వైచిత్రి. క్లుప్తత,
గుప్తత హైకూ రెండు కళ్ళు.
వచనకవిత లాగానే హైకూకి పాద విభజనలో హేతుబధ్ధత
లేదు.పట్టుదలతో అక్షరనియమాన్ని పాటించినందువల్ల హైకూ మౌలిక సౌందర్యానికే ముప్పు.17
అక్షరాలలో మాత్రమే ఉండితీరాలన్న నియమం వల్ల అవసరమైన చోట భావలోపం, అనవసరంగా
అక్షరాల సాగతీత. హైకూను భిన్నమయిన కవితాప్రక్రియగా నిలిపేది విలక్షణమయిన భావ
వ్యక్తీకరణే. కవి విశిష్ట దృక్కోణం మాత్రమే హైకూని ప్రత్యేకంగా నిలబెట్టగలిగేది.
హైకూలో పరిమితులు ఎక్కువ. దృశ్యాన్ని మాత్రమే
చెప్పాల్సివుంటుంది. అందరితో పాటు..ఎప్పుడూ చూసేదే ఐనా…ఒకానొక తాదాత్మ్య స్థితిలో
ఆశ్చర్యంగానో…సంభ్రమంగానో వాచ్యం చేయడం మరో ప్రధాన లక్షణం.స్వానుభూతే తప్ప
సహానుభూతికి అవకాశం లేని ప్రక్రియ హైకూ. ముందుగా వస్తునిర్దేశం కుదరదు. జ్ఞానాన్నో
సందేశాన్నో ఇచ్చే ప్రయత్నం చేయ కూడదు. హైకూ కవిత ప్రసరించే పరోక్ష
జ్ఞానాన్నిస్వానుభవానికి సమన్వయం చెసుకోవాలంటే …పాఠకుడిలో కూడా కవి అంత పరిణతి
అవసరం. ఇది ప్రధానమైన పరిమితి. భావపరంగా…భాషాపరంగా ఎలాంటి అలంకరణలకు అవకాశం లేదు
కనుక…భాషాపాండిత్యానికి…శబ్దాలంకారాలకు తావు లేదు. హైకూకు శీర్షిక సైతం ఉండరాదనేది
మరో పరిమితి. వర్తమానాంశాలే తప్ప భూత,భవిష్యత్తులకు సంబధించిన అంశాలు, స్వప్నాలు, ఊహలు
హైకూలకు ఇమడవు.
ఈ పరిమితులను అధిగమించిన కవితలేవి హైకూలు
అనిపించుకోవు.
స్థూల దృష్టికి అభివ్యక్తి, ప్రయోజనాల
దృష్ట్యా హైకూలు నాలుగు రకాలు.
సుందర దృశ్యం…సార్వత్రిక సత్యం ప్రతిఫలించే
హైకూలు మొదటి రకం.
పచ్చిక మొలిచింది
బాటని కప్పేసింది, మళ్ళీ
ఎన్ని వందల కాళ్ళు అవసరమో(ఇస్మాయిల్-కప్పల
నిశ్శబ్దం)
హైకూ ధ్వని ప్రధానం. చెప్పిన దాని కన్నా
చెప్పనిది అధికంగా ఉండే'చంద్రుని చూపించే వేలు'
ఖాళీ పాత్ర
శూన్యానికి
ఆకారమిస్తూ -(లలితానంద్-ఆకాశ దీపాలు)
ఉపమానం ఉన్నా ఉపమేయం ఉండదు.హైకూ అందుకే ఎంత
సర్వ సమగ్రంగా అనిపిస్తుందో..అంత అసంపూర్ణమూ అనిపిస్తుంది. పరిపూర్ణత
అందుకోవాల్సింది పాఠకుడి మనసులోనే!
సుందరమైన,
విలక్షణమైన దృశ్యాన్ని ప్రదర్శించే
హైకూలు రెండవ రకం.
బోటుని
దాని నీడకి కట్టేసి
సరంగు ఎటో వెళ్ళిపోయాడు- ఇదీ ఇస్మాయిల్ గాఅరి
హైకూనే-కప్పల నిశ్శబ్దం నుంచి)
ఉత్ప్రేక్షకాలంకారం. గాఢానుభూతికి గీటురాయి.
నిరాడంబరంగా వ్యక్తీకరింపబడే దృశ్యాలు హైకూ
మూడో రకం.
Outside the pub
The sailor
Faces the wind- చక్ బ్రిక్ లీ
పరస్పర భిన్న స్థితిగతులకు చెందిన రెండు
విషయాలను సమన్వయం చెసే విధానం ఇందులో ఉంటుంది.
కొన్ని రకాల ఉద్వేగాలను కలిగిమ్చేవి..ఒక రకమైన
మూడ్ ని సృష్టించేవి నాలుగో రకం.
On a bare branch
A rook roosts:
Autumn dusk-(The penguin Book of Japanese verse)
హైకూలను ఇలాగే అర్థం చేసుకోవలని నియమమ్ ఏమీ
లెదు. పాథకుని మానసిక స్థితి, వైఖరి, సంస్కారాన్నిబట్టి బహుళార్థక బోధనకు అవకాశం
ఉండే ప్రక్రియ హైకూ.
'క్లుప్తత
ప్రధానమైన హైకూ విస్తృతమైన వివరణలను అపేక్షించే సంక్లిష్తమైన అంశాలను, అసాధారణమైన
అనుభవాలను చెప్పడానికి అనువైమ్ది కాదు' అంటున్నారు -అంటూ హైకూ ప్రక్రియలోని బలాన్నీ, బలహీనతలనీ
సవివరంగా చర్చించారు పెన్నా శివరామకృష్ణ.
సూచనః
ఈ వ్యాసానికి మూలం కూడా పెన్నా ప్రచురించిన
"దేశదేశాల హైకు"లోని 'కవితాప్రక్రియగా 'హైకూ' స్వరూప
స్వభావాలు. మరింత అవగాహనకు ఆసక్తి గలవారు-పాలపిట్ట బుక్స్ వారు ప్రచురించిన
"దేశదేశాల హైకు" పరిశీలించ వచ్చు.ప్రాథమిక అవగాహన కోసమే ఈ ప్రయాస.
పెన్నా అనువదించిన కొన్ని విదేశీ హైకూలుః
గాలిలొ గర్వంగా విహరిస్తూ
పెద్ద గడ్డిపరక
ఓహ్! తూనీగ!
-మత్సువొ
బషోఃజపాను కవిత
మంచు కురిసే వేళ
తెల్లగా మారే వరకూ
చాచిన చేతులతో పిల్లవాడు
-రిచర్డ్
రైట్(ఆఫ్రికన్ అమెరికన్ కవిత)
అతడికి వాన ఇష్టంః
ఆమె అతడి జీవితంలో ప్రవేశించి
గొడుగును ఇచ్చింది
-అలెక్జీ
ఆన్ ద్రెయేవ్(రష్యన్ కవిత)
మా నాన్న సమాధి వద్ద
నల్లటి నున్నటి
మార్బుల్స్ లో నా ముఖం
-ఇవాన్
నాదిలో(క్రొయేషియన్ హైకూ)
నేను పక్షిగా మారగలను-
నువ్వు క్రూర జంతువుగా మారనని
ప్రమాణం చేస్తే
-రీటా
ఓడె (పాలస్తీనియన్ కవయిత్రి కవిత)
రాతి నుంచి మొలిచిన
పుట్టగొడుగు-దానికి తెలుసుః
బెరమాడే కళ (కార్పొరేట్ హైకూ)
నదులు లేని చోట
వంతెనలు నిర్మిస్తూ
రాజకీయ నాయకులు
-ప్రొ.ఆర్.కె.సింగ్
(భారతీయ ఆంగ్ల కవిత)
తల్లి తిడుతుంటే
కొడుకు మౌనం తల్లి
తానే రోదించింది
-పురుషోత్తమ్
దీవాన్(హిందీ కవిత)
అకస్మాత్తుగా వర్షం-
కొలను నిండా
ఆశ్చర్యార్థకాలు!!
-మిత్రా(తమిళ్
కవిత)
ఆమెను చేరడానికి
దారినయ్యా
ఎవరో నడిచి వెళ్ళారు...
(కన్నడ
హైకూ)
మన యువకవులకు మరిన్ని మంచి హైకూలు రాయాలన్న
ఆసక్తి కలిగితే
ఈ వ్యాసం
సార్థకమయినట్లే!.
(పెన్నా
శివరామకృష్ణ గారికి ధన్యవాదలతో…పాలపిట్ట బుక్స్ వారికి కృతజ్ఞతలతో)
* దృశ్యాదృశ్యం-బి.వి.వి.ప్రసాద్.'చంద్రుడిని
చూపించే వేలు'ముందు మాట
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment