Friday, April 1, 2016

డాక్టరు- యాక్టరు- కౌముది మరీ చి.కగా ప్రచురితం

నాకిద్దరు సంతానం. అమ్మాయి. అబ్బాయి. ఇద్దర్నీ డాక్టర్లు చేయాలని నా ఆశ.
పెద్దది ఎలాగో పొర్లుదండాలైనా పెట్టుకుంటూ వైద్యాలయం చేరుకొంది. కానీ చిన్నాడి కథే గుంటపూత.
డాక్టరవుతావా? యాక్టరవుతావా? అని ఎవరైనా అడిగితే.. తడబాటుకూడా ఉండదు.. 'యాక్తర్' అనేవాడు నత్తిగా మా వాడు.
ఆలోచనకు తగ్గట్లే బుద్ధులూనూ!
బడికి పంగనామం పెట్టినప్పుడు, సినిమా టిక్కెట్టుకి పైనలు నొక్కాల్సొచ్చినప్పుడు, పరీక్షలైపోయి ఫలితాలు వచ్చేటప్పుడు, స్నేహాల మిషతో అడ్డమైనవాళ్ళను కొంపమీదకు తెచ్చినప్పుడు.. వాడి నటనాకౌశలం చూసితీరాలి. ముందు కన్నతల్లిని.. ఆనక ఆమె కన్నీళ్లతో నన్నూ లొంగదీసుకోడం వెన్నతో పెట్టిన విద్య వాడికి.
వాడి ఖర్మానికి వాణ్ణి వదిలేసి చాలా కాలమే అయింది. రేపు పెళ్లయి పిల్లా జెల్లా పుట్టుకొస్తేకనీసం వాడి అక్కమాత్రం నెలకో పాతికవేలైనా గడించుకోకపోతే ఎలాగన్నది ఒక్కటే ప్రస్తుతం మా దిగులు.
మా ఆవిడకు ఒంట్లో బాగుండటం లేదు. చూపించడానికని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకు వెళ్లా. ముందే అప్పాయింటుమెంటు తీసుకొన్నా.. మా కన్నా ముందు ఇంకెంతమంది తీసుకొన్నారోగాని అప్పాయింటుమెంటు.. వెయిటింగు హాలు తిరుమల వెంకన్న దర్శనం గదులకన్నా రద్దీగా ఉన్నాయ్!
డాక్టర్లు వచ్చారో.. రాలేదో! అడుగుదామనుకుంటే తెల్లకోటుల్లో తిరిగేవాళ్ళలో ఎవరు వైద్యులో.. ఎవరు కాంపౌండర్లో.. కన్ఫ్యూజన్! పడిగాపులు పడలేక వేరే ఆసుపత్రుల చిరునామాలు సెల్ ఫోనుల్లో చూసుకొంటున్నారు చాలామంది రోగులు. అప్పుడు జరిగింది ఆ వింత.
అప్పటిదాకా కామ్గా కూర్చొన్న యువ జంట ఒకటి ఉన్నట్లుండి పెద్దగా అరుచుకోవడం మొదలు పెట్టింది. మాటలు చేతల్లోకి మారడం క్షణాల్లో జరిగిపోయింది! టీవీ సీరియలు కన్నా రసవత్తరంగా సాగుతోంది సీను.
అబార్షను కేసు. అమ్మాయికి ఇష్టం లేదు. అబ్బాయికి సంతానం ఇష్టం లేదు. ఇంటిపట్టునే గుట్టుగా తేల్చుకోవాల్సిన కాంప్లికేటెడ్ మేటరు గదా! ఆసుపత్రిదాకా వచ్చి ఇక్కడీ రచ్చెందుకో ఇప్పుడు!
మొత్తానికి ప్రేక్షకులందరికీ మంచి కాలక్షేపం. ముక్కుతూ మూలుగుతూ పడుకొన్న రోగులుకూడా నొప్పులన్నీ మర్చిపోయారు. లోపలి వాళ్ల సంగతి సరే సరి.. బైట జనంకూడా ఎగబడుతున్నారు! ఆసుపత్రివాళ్ళు టీవీ కట్టేసిన సంగతికూడా ఎవరూ పట్టించుకోలేదంటే.. పరిస్థితిలోని మార్పు అర్థం చేసుకోవచ్చు.
'డాక్టర్లు వచ్చారు' అని ఎవరో అరిచిందాకా టైమెంతయిందో ఎవరికీ పట్టలేదు.
క్షణాల్లో సీను మారిపోయింది.
అప్పటివరకు జుట్టూ జుట్టూ పట్టుకొని కొట్టేసుకొన్న ఆ అబ్బాయి.. అమ్మాయి.. ఇంచక్కా నవ్వుకొంటూ చెట్టాపట్టాలేసుకొని వెళ్లిపోయారు లోపలికి!
విసుగెత్తిన రోగుల్ని వినోదపరిచేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఆచరిస్తున్న లేటెస్టు టెక్నాలజీ! 'యాక్టింగు' ద్వారా ఎంటర్ టైన్ చేయడంకూడా ఒక ముఖ్యమైన టెక్నిక్కుట! రోగుల్ని పక్క ఆసుపత్రులకు వదిలేసుకోకుండా ఒడుపుగా నిలబెట్టుకోవడం, కొత్త రోగులను రాబట్టుకోవడం లక్ష్యంట!
 చాలా వైద్యాలయాలు అనుసరిస్తున్నాయి ఇలాంటి వ్యాపార సూత్రాలను' అని ఇంటి దగ్గర  మా డాక్టరమ్మాయి వివరించినప్పుడు నోరు వెళ్లబెట్టడం మా వంతయింది.
'డాక్టర్ని చేసి నా దుంప తెంపారు మీరు. ఇంచక్కా తమ్ముళ్లా నేను యాక్టర్నై ఉంటే  ఈ కార్పొరేట్ ఆసుపతులోనే కార్పెట్లు పరిపించుకొనే దాన్ని' అని నిష్టూరాలక్కూడా దిగింది మా డాక్టరుడాటరు.
తన తప్పేముందిలేండి! ఎం.డి పట్టా పుచ్చుకొని ఎంప్లాయిమెంటుకోసం  వెళ్ళినప్పుడు 'డాక్టర్లకు మా దగ్గర కొదవలేదు. మాక్కావాల్సిందిప్పుడు యాక్టర్లు. డాక్టర్లకు నెలకు పాతికవేలు మించి ఇవ్వలేం. యాక్టర్లకైతే రెట్టింపు ఇచ్చేందుకైనా రడీ' అన్నాడుట ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంటు. అదే ఆసుపత్రి తమకోసం పనిచెయ్యమని తమ్ముడిమీద తెగ వత్తిడి తెస్తున్నాయి.. తమరికి తెలుసో .. లేదో!’ అనికూడా వ్యంగ్యాలు పోయింది. వాడికి అంత టైం లేదని.. తన ట్రైనీసుని అవసరం వచ్చినప్పుడల్లా డిప్యూట్ చేస్తున్నాట్ట ఇప్పుడు!
ఇందాకటి అబార్షన్ కీచులాట కాన్సెప్టుకూడా మా వాడిదే అని అప్పుడు తెలిసింది మాకు.
మొత్తానికి మన డాక్టరు అమ్మాయికన్నా యాక్టరు అబ్బాయి పనే బాగుందన్న మాట! కలికాలం!' అని నోరు నొక్కుకుంది మా శ్రీమతి. అలా నొక్కుకోవాలన్న స్పృహైనా లేకుండా దిమ్మరబోవడం నా వంతైంది.
-కర్లపాలెం హనుమంతరావు
***



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...