Wednesday, May 9, 2018

జీవన వేదం- వై ఎస్ ఆర్ దుర్మరణం సందర్భంలో ఈనాడు ఆదివారం సంపాదకీయం





కుండపోతగా వాన కురిసింది కొండాకోనల నల్లమలపైన. ఊహాతీతంగా పిడుగు పడింది మాత్రం యావత్రాష్ట్ర ప్రజ గుండెల మీద! రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. మరి లేరన్న దావానలంలాంటి దుర్వార్త ప్రజానీకాన్ని శోకసాగరంలో ముంచేసింది. ఏటా సంబరంగా సాగే గణేశ నిమజ్జనం సైతం బాధాతప్త హృదయాల కన్నీటి మడుగులోనే ముగిసిపోయింది. రచ్చబండ కార్యక్రమంకోసం చిత్తూరు జిల్లాకు బయలుదేరిన వై.ఎస్‌. హెలికాప్టర్ఆచూకీ గల్లంతు అయిందన్న తొలి సమాచారం తెలిసినప్పటినుంచి ఇరవై నాలుగ్గంటలపాటు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడిన జనవాహిని- కనిపించిన దేవుళ్లకల్లా మొక్కుతూ కోరుకొంది ఒక్కటే- ముఖ్యమంత్రి వై.ఎస్‌. క్షేమంగా తిరిగి రావాలనే! చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర దేశీయాంగ, రక్షణ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా అత్యాధునిక విమానాలతో నల్లమలను జల్లెడ పడుతున్నంతసేపూ- పూర్వాశ్రమంలో నేషనల్క్యాడెట్కోర్‌(ఎన్‌.సి.సి.) సభ్యుడైన వై.ఎస్‌. అడవిని జయిస్తారనే మీడియా కూడా సాంత్వన వచనాలు పలికింది. కర్నూలుకు తూర్పున నలభై నాటికల్మైళ్ల దూరాన కొండ కొమ్ముపై హెలికాప్టర్జాడ తెలిసిందన్న సమాచారమూ దాన్ని వెన్నంటి వచ్చిన శరాఘాతంలాంటి కబురూ ప్రజానీకాన్ని హతాశుల్ని చేశాయి! ముఖ్యమంత్రి హెలికాప్టర్దారితప్పి 18 కిలోమీటర్లు తూర్పుదిశగా వెళ్లి కొండను ఢీ కొట్టిందని రాష్ట్ర డి.జి.పి. చెబుతున్నారు. 1978లో ఎన్నికల రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టింది మొదలు వై.ఎస్‌. కాంగ్రెస్లో కొండల్లాంటి సీనియర్లు ఎందరినో ఢీ కొడుతూనే ముందుకుసాగారు. వరస పరాజయాలతో కుంగిన రాష్ట్ర కాంగ్రెస్కు తన ప్రజాపథ ప్రస్థానంతో కొత్త ఊపిరులూది వరస విజయాలు కట్టబెట్టిన వై.ఎస్‌.- తానే రాజకీయ మేరునగంగా ఎదిగారు. అననుకూల వాతావరణంలో రాజశిఖరం ప్రయాణిస్తున్న హెలికాప్టర్నల్లమల కొండ శిఖరాగ్రాన్ని తాకి ముక్కలై మహా విషాదాన్ని వర్షించింది. విధి మనిషిని విగతం చేస్తుందేమోగాని, చెమ్మగిల్లిన గుండెల సాక్షిగా వై.ఎస్‌. ప్రజల మనిషి!

'
నేను వృత్తిరీత్యా డాక్టరును... అయితే రోజుకు ఎంతమంది రోగులకు వైద్యం చెయ్యగలను? యాభై... వంద- అంతేకదా! అందుకే రాజకీయాల్లోకి రావాలనుకొన్నా'- అని ప్రకటించిన వై.ఎస్‌.కు మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేదు. 'గరీబోళ్ల బిడ్డ'గా అధికార పీఠం అందుకొన్న అంజయ్య మంత్రివర్గంలో తొలిసారి వై.ఎస్‌.కు చోటు దక్కింది. తరవాత ఇరవయ్యేళ్లు అధికార పదవులకు దూరంగా ఉన్నా- 2004లో కాంగ్రెస్విజయం దరిమిలా ముఖ్యమంత్రి పీఠం ఆయన్ను కోరి వరించింది. చదువుకొనే రోజుల్లోనే ఆదాయం పన్ను కట్టానని పలుమార్లు చాటుకొన్న వై.ఎస్‌. మృతికి పేదవాడి గుండె ఎందుకు చెరువవుతోంది? కారణం ముంజేతి కంకణం. 'ప్రజల్ని అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలంటే మార్పు తప్పనిసరి... అయితే అది మానవీయ కోణంలోనుంచి రావాలి' అని ప్రకటించిన వై.ఎస్‌.- సంక్షేమ పథకాల్ని పల్లెబాట పట్టించారు. ఖజానాకు భారమన్నా వినకుండా మొండిగా కిలో రెండు రూకల బియ్యం పథకాన్ని పట్టాలకు ఎక్కించారు. వందల కోట్ల బడ్జెట్టుతో నిరుపేదల్ని ఆరోగ్య 'శ్రీమంతుల్ని' చేశారు. బడుగు రైతాంగానికి ఉచిత విద్యుత్తు సరేసరి! ఇందిరమ్మ ఇళ్లు, బడుగు, బలహీన, అల్పాదాయ వర్గాల పిల్లలకు వృత్తి విద్యా కోర్సు ఫీజుల పూర్తి చెల్లింపు వంటివి వై.ఎస్‌.ను పేదల పక్షపాతిగా మార్చేశాయి. ముఖ్యమంత్రి సహాయనిధినీ వందల కోట్లకు పెంచి అవసరార్థులకు దాన్ని కామధేనువుగా మార్చింది వైఎస్సే! రాజశేఖరరెడ్డి ఏలుబడి తీరుతెన్నులపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక- నిరుపేదల కళ్లకు ఆయన తమ ఆర్తి తీర్చే ఒయాసిస్సే! విధంగా ఎందరికో ఆత్మబంధువైన వై.ఎస్‌. లేని లోటు వేరెవరూ పూడ్చగలిగేది కాదు!

వై.ఎస్‌. అనగానే గుర్తుకొచ్చేవి- తెలుగు ఠీవి ఉట్టిపడే పంచెకట్టు, నగుమోము చేసే కనికట్టు! రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని చెప్పే వై.ఎస్‌. స్వీయ ప్రతిష్ఠను పణం పెట్టి అయినా నమ్ముకొన్నవాళ్లను ఆదుకొన్న మిత్రశ్రేష్ఠుడు! రాష్ట్ర బడ్జెట్ను లక్షకోట్లకు చేర్చడం, తెలుగుభాషకు ప్రాచీన హోదా రాబట్టడం వై.ఎస్‌. ఘనతలే. 'పాదయాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నా... విద్యుత్‌, బియ్యం, ఆరోగ్యశ్రీ పథకాలను శాశ్వత ప్రాతిపదికన అమలు చేస్తాం- ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు విశ్రమించం' అని నిరుడు జూన్‌ 15 వై.ఎస్‌. ప్రకటించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంద్వారా కోటి ఎకరాలకు సాగునీటి పరికల్పన సాధిస్తామంటూ ఆయన ఉద్ఘోషించని వేదికే లేదు. తొలి అయిదేళ్లలో లక్ష్యసిద్ధికోసం జలయజ్ఞానికి వై.ఎస్‌. వెచ్చించింది రూ.43వేల కోట్లు! ఫలానా పని చెయ్యాలనుకొన్నాక విమర్శల్ని, కష్టనష్టాల్ని బేఖాతరు చేస్తూ ముందుకు సాగడమే ఆయన నైజం. మరికొన్ని రోజుల్లో ప్రధాని చేతుల మీదుగా తలపెట్టిన భెల్‌- ఎన్‌.టి.పి.సి. ప్రాజెక్టు శంకుస్థాపన పాటికే పూర్తయి ఉంటే, మౌలిక రంగంలో భారీ కర్మాగారం రాష్ట్రానికి రావాలన్న తన స్వప్నం ఫలించిందన్న సంతృప్తి వై.ఎస్‌.కు మిగిలుండేదన్నది నిజం! తాను చేపట్టిన పథకాలే కాంగ్రెస్కు గెలుపు గుర్రాలవుతాయని విశ్వసించిన వై.ఎస్‌.- వాటిలో లోటుపాట్ల పరిశీలనకు బయలుదేరడమే, అననుకూల వాతావరణం రూపేణా ప్రాణాంతకమయ్యింది. బియ్యం, రేషన్కార్డులు, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల అమలు తీరుపై ప్రజలతో నేరుగా చర్చించదలచిన నాయకుడు మరలిరాని లోకాలకు తరలిపోవడంతో పల్లె కన్నీరొలుకుతోంది. జన ప్రియనేతకు రాష్ట్రం నివాళి ఘటిస్తోంది'వై.ఎస్‌. అమర్రహేఅని!
(
ఈనాడు,. 04 - 09 -2009



ఇదే సందర్భానికి తగిన విధంగా 06, సెప్టెంబర్, 2009.. ఆదివారం ఈనాడు రాసిన సంపాదకీయం 
"జీవన వేదం" 


మనం ఎంతగానో ప్రేమించేవారు మనకు దూరమైతే ఆ ఎడబాటుకు మందేమిటో తెలుసా? మనం ప్రేమించేవారు ప్రేమించిన వాటిని అన్నింటినీ మనమూ ప్రేమించడం.  ఆస్కార్ వైల్డ్ చెప్పిన చిటుకు అది, మహాభారతంలో యక్షుడు 'ప్రపంచంలో కెల్లా అత్యంత అబ్బురం కలిగించే విశేషం ఏమిటి?' అని అడిగినప్పుడు 'రేపు కనుమరుగయే వ్యక్తి ఈ రోజు కాలం చెల్లిన ఆప్తుడిని గురించి కన్నీళ్లు పెట్టుకోవడం' అని జవాబు ఇస్తాడు ధర్మరాజు. ఆ మాటే నిజం. 'అసలు జీవితమంటేనే ఒక నాటక రంగం. మనమందరం ఆ వేదిక మీద ఆడే జగన్నాటకంలో  వచ్చే పోయే పాత్రధారులం' అంటాడు ఆంగ్ల నాటక కర్త విలియం షేక్స్పియర్. ఆ సత్యం మనమూ వంటబట్టించుకుంటే 'పుట్టడం.. గిట్టడం ప్రకృతి చేసే ప్రకటనలు' అని ఇట్టే ఆర్థమవుతుంది. 'జీవనం ఒక వేదం. ఆ వేదసారం గ్రహింపుకొస్తే ఆవేదనకు ఆస్కారముండదు' అంటాడు హిరణ్యాక్షుడు సోదరుడి మరణానికి దురపిల్లే బంధుగణాన్ని ఓదార్చే సందర్భంలో మహాభాగవతంలో. విశ్వవిజేతగా చక్రం తిప్పాలని దురాశ పడ్డ అలెగ్జాండర్ చలిజ్వరంతో చనిపోయే ఆఖరి క్షణంలో 'హతీతో క్రతిస్తో' అంటో ఖాళీ చేతులు చూపించి వెళ్ళిపోయాడు! ఎలా పోయారన్నది కాదు లెక్క.. ఎలా బతికి పోయారన్నది ముఖ్యం. లోకం కోసం విషం తాగిన శివుడికి ఉన్న విలువ తన కోసం అమృతం తాగిన దేవేంద్రుడుకుందా? మిన్నాగులాగా కలకాలం బతికే కన్నా మిణుగురులా వెలుగులు విరజిమ్ముతూ క్షణకాలం జీవించినా మిన్నే! అసలు మృత్యు పిశాచి ఒక్క దుఃఖాన్ని తప్ప మరేదీ ఆత్మబందువులకు దక్కనివ్వదా? రెండో ప్రపంచయుద్ధ సందర్భం. ఓ జర్మను చెరసాలలో ఖైదీలు వందల కొందలు  ఒకే అరలో బందీలుగా పడివున్నారు. తొక్కిసలాటలు తగ్గించేందుకు కారాగారాధికారుల కో పథకం తట్టిందిప్రతీ బందీ చేతికి ఒక అంకె ఇవ్వడం..  రోజూ కొన్ని అంకెలను చీటీలు తీసి  ఎన్నిక చేయడం.. ఆయా అంకెగల చీటీ  చేతనున్న అభాగ్యుడిని  పైకి పంపించెయ్యడం.. అదీ 'ఆపరేషన్ క్లీన్'. ఎన్నికైన అంకెచీటి చేత పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడో ఖైదీ.  తోటి ఖైదీ 'ఇంకా ఇక్కడ నీకు బందీగానే బతకాలనుందా? మిత్రమా! నీ చీటీ నా చేతికివ్వు!' అంటూ తానే  ఆ చీటీతో సంబరంగా ముందుకెళ్లి తుపాకీ గుండుకు బలి అయ్యాడు. ఆ ప్రాణత్యాగి ఆనందం అరువు ఊపిరితో బతికే ఖైదీ కేదీ?!
'మృత్యువు నా వాకిట్లో నిలబడితే వట్టి చేతులతో పంపను' అంటాడు రవీంద్ర కవీంద్రుడు 'గీతాంజలి'లో. 'జాతస్య మరణం ధృవమ్' అంటుంది గీత. కాలప్రవాహానికి ఎదురీదడం ఎవరి తరమూ కాదు'. పురాణేతిహాసాలు మృత్యువుని 'కాలధర్మం'గా వర్ణించడంలోని మర్మం మనిషి గ్రహించాలి. భూమ్మీద కలకాలం నిలిచిపోవాలన్న కాంక్ష ఎవరికుండదు! నిజంగా చిరంజీవిగా జీవించాలంటే 'తానే తుమ్మి తానే చిరంజీవ' అనుకుంటే చాలదు. చిరకాలం జనహృదయంలో సజీవంగా నిలిచిపోయే సత్కారాలేవైనా చేస్తుండాలి. మొక్కుబడిగా 'కీర్తిశేషులు' అనిపించుకోవడం కాదు.. మొక్కి.. మరీ 'కీర్తి'ని గుర్తు చేసుకొనే మంచి కర్మలు  సంకల్పించాలి. మనసుకు దగ్గరైన మనిషి దూరమైనప్పుడు ఒక పట్టాన ఒప్పుకోని పిచ్చిభ్రమలు మానవజాతి పుట్టుక నుంచే మొదలయినాయి.  వేళ్లు కోసినప్పుడు రుధిరం గడ్డకట్టినట్లు గట్టిగా రువువైతే తప్ప  రోమన్లు  ఆత్మబందువులు  మృతులైనట్లు ఒప్పుకొనేవారు కాదు. చనిపోయిన తమవారు తిరిగి వాస్తారన్న ఆశతో మూడు రోజుల వరకు పార్థివ దేహాన్ని పాడె మీదకు చేర్చనివ్వరు గ్రీకులు. 'ఎడ్గార్ ఎలెన్ పో' తన 'మెక్బరి' నవల్లో శవపేటిక లోపల మీటలుండే విధానాన్ని సూచించారు. ఖననమైన తరువాత ఒకవేళ తిరిగి ప్రాణమొస్తే మీట నొక్కి తమవాళ్ళకు  శుభవార్త చెప్పేందుకన్న మాట ఆ ఏర్పాటు! హిందూధర్మంలోని 'దింపుడు కళ్లెం' ఆచారం వెనకున్న మర్మం ఈ పునర్జీవితం మీద ఉన్నప్రగాఢ విశ్వాసమే!
శాస్త్రవిజ్ఞానం ఇంతగా అభివృధ్ధి చెందిన కాలంలో కూడా  ఇలాంటి నమ్మకాలను గూర్చి వింటుంటే నవ్వురావచ్చేమో గానీ.. నిజానికి గుండెచప్పుడు ఆగిపోయిన కొన్ని క్షణాల వరకు యంత్రంలో ఇసిజి నమోదు చెయ్యవచ్చని ఇప్పుడు వైద్యశాస్త్రం సైతం ఒప్పుకుంటున్న సత్యం. 'పైలోకార్పైన్' అన్న మందు కంటిలో వేస్తే వ్యక్తి చనిపోయిన మూడు గంటల వరకు కంటిపాపకు సంకోచిస్తుంది. అసలు మరణమనేది హఠాత్తుగా జరిగే విషాదం కాదు.  అదో క్రమంలో శరీరంలో జరిగే జీవపరిణామం అంటుంది మరణశాస్త్రం(థాంటాలజీ).కంటికి కనిపించని ఆత్మ శరీరాన్ని విసర్జించడంగా మతాలన్నీ మరణాన్ని నిర్వచించుకుంటున్నాయి. విజ్ఞానశాస్త్రం మాత్రం విశ్లేషించేందుకు వీలైన ప్రయోగాలు విజయవంతమయే వరకు మరణం మనిషికి మనసుకు సంబంధించిన ఒక అత్యంత భావోద్వేగ పరిణామంగానే మరణాన్ని చూస్తోంది. తార్కిక శాస్త్రాలు  ఏ సూత్రాలైనా చేయనీయండి.. మనసుకు దగ్గరైన వ్యక్తి హఠాత్తుగా దూరమయ్యాడన్న విషయం ఆప్తులలో  అంతులేని విషాదాన్ని నింపితీరుతుందిఅందులోనూ పెద్దమనిషి.. పెద్ద మనసున్న మనిషి! మరణమంటే మాములు జనాలకు పత్రికల్లో నల్లరంగు అద్దుకుని వచ్చే పతాక శీర్షికో.. టీవీ ప్రసారాలలో ఆపకుండా చూపించుకుంటూ పోయే 'రియాల్టీ' ప్రదర్శనో కాదు. ఆట ముగిస్తే రాజైనా బంటైనా ఒకే పాచికల పెట్టెలోకి సర్ధుకుంటారన్న మాట నిజమే కావచ్చేమో! కానీ జనం తరుఫున ఆడే ఆట రాజకీయం. అది ముగించకుండానే  మధ్యలో హఠాత్తుగా వదిలేసి చిరునవ్వులు చిందించుకుంటూ ఎవరు వెళ్లిపోయినా ప్రజావళి దృష్టిలో అది 'తొండే'!  ఆగిపోయిన  ఆటను  గుండె దిటవుతో   ముందుకు కొనసాగించి విజయం సాధించడమే  ఆ 'రాజు' కు ఆయన నమ్మిన 'బంట్లు'  సమర్పించుకొనే నిజమైన నివాళి.
***

(ఈనాడు- ఆదివారం సంపాదకీయం – 6, సెప్టెంబర్, 2009)

Tuesday, May 8, 2018

డబ్బు కష్టాలు- సరదావ్యాసం



గడించడం కష్టం. ఖర్చు చేయడం కష్టం.. ఎవరెవరికో లెక్కలు చెప్పాలి. అట్లాగని దాచుకున్నా కుదరదు. దారాపుత్రులు ఊరుకోరు. ఎక్కడ దాచాలో  తోచదు. ఎవర్మని నమ్మాలి? ఎంత వరకు కుమ్మాలి? డబ్బు ఉంటేనే కాదు. డబ్బు అంటేనే కష్టం బాబూ!
అగచాట్లెందుకు.. అస్సలు డబ్బే వద్దన్నా దెబ్బై పోవడం ఖాయం! పూట గడవాలన్నా.. పూటుగా మందు పడాలన్నా ముందు కావాల్సింది కరెన్సీనే కదన్నా?
పొరుగింటి మీనాక్షమ్మల్తో పోలిక పెట్టే ఆండాళ్లు ప్రతి ఇంటా ఉంటారు.  ఓ ముత్యాల బేసరయినా ముక్కుకి తగిలించలేదని అలిగి కూర్చుంటారు. రేకెట్ నుంచి పాకెట్ దాకా అన్నింటికీ మనీతో పని. డబ్బు లేందే డుబ్బు క్కొరగాడన్న సామెతేమన్నా సర్దాకు పుట్టించారా  అనుభవజ్ఞులు?
ఎన్నికల్లో టిక్కెట్ల ఇక్కట్ల సంగతట్లా ఉంచండి. చిన్నోడి ప్రీ-కాన్వెంటు సీటుకైనా పెద్ద నోట్ల కట్టలవసరమే కదప్పా! బ్లాక్ బస్టరని బోడి బిల్డప్పులిచ్చే ఓన్లీ వన్దే డే ఆడే చెత్త సినిమాకైనా బ్లాకులో తప్ప టిక్కెట్లు దొరికి చావని రోజుల్లో రొక్కాన్ని మరీ అరటి తొక్కలా తోసలవతల పారేస్తే పస్తులే!  
పైసలుంటేనే పేరొచ్చేది .. మంచిదో.. చెడ్డదో! ఫోర్బ్స్ జాబితాలో కెక్కించేదీ.. ఫోర్ ట్వంటీ కేసుల్నుంచీ తప్పించేదీ మనీనే! మనీ మేక్స్ మెనీ ట్రిక్స్!
బ్యాంకప్పుల వంకతో పైసా వసూల్. తిరిక్కట్టమంటే ఇంటి పై కప్పుల వంక చూపులు! వీల్చూసుకొని విదేశాలకు చెక్కింగ్స్!   మంచి స్కీమ్సే కావచ్చు కానీ..  విమాన టిక్కెట్లకు సరిపడా అయినా మనీ తప్పని సరే కాదా.. దటీజ్ డబ్బూస్ పవర్!
బిర్లా టాటాలకి ఏ పేరొచ్చినా, అదానీ అంబానీలకి ఏ 'కీ' రోలిచ్చినా కీలకమంతా పర్శులోని కాపర్సుదే! బిట్స్ పిలానీ టు.. బిట్ కాయిన్స్ వరకు అంతా కాసుల తిరకాసులే! కాదంటే కుదరదు సుమా!
కుదురుగా ఉండనీయదు డబ్బెవర్నీ! పెద్ద నోట్లనట్లా అర్థరాత్రి కల్లా హఠాత్తుగా రద్దు చేయిందా లేదా?  పెద్దాయన పేరనట్లా ఊరూ వాడా మారుమోగించిందా.. లేదా? బ్యాంకులంటూ కొన్ని డబ్బుండే  చోట్లు మన దేశంలో కూడా పనిచేస్తుంటాయని జనాలకు తెలిసింది. ఏటియంలంటే ఏంటోలే.. పెద్ద కొలువులు చేసుకొనే చదువుకున్నోళ్లు నోట్ల కోసం నొక్కుకునే యంత్రాలని మామూలు జనాలకు అవి ఖాళీ అయినప్పుడే తెలిసింది! అందీ డబ్బు దెబ్బ! ఉన్నా సంచలనమే.. లేకున్నా సంక్షోభమే!
డబ్బు లేందే అప్పులుండవు. అప్పులంటే వూరికే ఎగేసేందుకు తీసుకొనే సొమ్మా కాదు.. సర్కార్లు ఓట్ల కోసం  మాఫీలు చేసేందుక్కూడా. ఏమైనా అంటే ఆర్బీఐ వూరికే ఫీలయిపోతుంది కానీ.. బాకీలు  మాఫీలు లేందే ఏ రాజకీయ పార్టీ అయినా సాఫీగా హామీలిచ్చేదెట్లా? అధికారంలోకి ఎగబాకేది ఎట్లా?
ఒక్క ‘పవర్’తోనే కాదు డబ్బుకు పరువూ ప్రతిష్ఠల్తో కూడా లంకే! డాలరు డాబు చూసుకొనే అమెరికావాడి ఆ రువాబు. ప్రపంచం అమెరికా చుట్టూతా గిరిటీలు కొడుతున్నా.. అమెరికావాడు డాలరు చుట్టుతా గింగిరాలు కొడుతున్నా అంతా ఆ సొమ్ములో ఉన్న గమ్మత్తు వల్లే.  డాలరు మీద దెబ్బేద్దామనే చైనావాడిప్పుడు  సిల్కు రోడ్డుతో తయారవుతున్నాడు. సిల్క్ స్మిత నుంచి.. సిల్క్ రోడ్డు దాకా అందరికీ డబ్బుతోనే బాబు డాబు!
నాలుగు రాళ్లు వెనకేసుకోమని పెద్దలేమన్నా పన్లేక సతాయిస్తారా? ఎప్పుడు ఏ రాయికి ఎంత విలువ పెరుగుతుందో దేవుడికే తెలియాలనుకుంటాం.  ఆ సూక్ష్మం వంటబట్టకే దేవుడూ  ఓ రాయిగా మారిపోయాడు. భక్తులు హుండీల్లో వేసే రాళ్లతో లోకతంత్రం నడిపిస్తున్నాడు! రూపాయిల నోట్ల మీద కనిపించక పోయుంటే పాపం గోచీపాతరాయుడు బాపుజీని అయినా పట్టించుకొనుండేదా ఈ డబ్బు పిచ్చి లోకం?
గౌరవనీయమైన పదవుల కోసం ఘోరంగా కొట్లాడుకుంటుంటారు నిస్వార్థ ప్రజాసేవకులు. గౌరవంగా ఓ రూపాయి వచ్చినా మనీ మార్కెట్లో దాని మార్పిడి విలువ ఎన్ని కోట్లుంటుందో?
డబ్బు మీదే ప్రజానేతకీ నిజానికి బొత్తిగా  మమకారముండదు. కానీ ఎన్నికల తంతుకు  కావాల్సిందే డబ్బు మూటలు కదా! అభిమానసందోహం ఆనందంగా  కోట్లు ధారపోస్తామన్నా ఎన్నికల సంఘం నిమ్మళంగా ఉండనీయదు. అందుకే ఎన్నికలకు ముందు నెల్లాళ్లు నేతలు ఎన్నడూ ఎరగని కాయా కష్టానికి తయారయేది. పలుగూ పారా పట్టినా, మట్టి మూటలు నెత్తికెత్తినా, రోడ్దు పక్క టీ కాచినా, రొప్పొచ్చేటట్లు రిక్షా తొక్కినా.. కూలి కింద గంటకు ఓ ఐదారు లక్షలు తగ్గకుండా గడించేది.
డబ్బుంటేనే కోర్టుల్లో ఏ పిల్ అయినా వేయగలిగేది.. ఏ జింఖానా కోర్టుల్లో అయినా ఐపిఎల్ ఆడగలిగేది! డబ్బుంటేనే అబ్బా.. చర్లపల్లి జైలైనా చల్లపల్లి రాజావారి బంగళాలా చల్లంగా ఉండేది.
డబ్బున్న వాడికి నేరాలతో నిమిత్తం లేదు. బేళ్ల కొద్దీ నోట్లు మనవి కాదనుకుంటే చాలు.. బెయిళ్లైనా దానంతటవే నడుచుకొచ్చేస్తాయ్! మరో అప్పీలుక్కూడా ఆస్కారం ఉండదు.
రూకల్లేకుంటే లోకానికి లోకువ. డబ్బున్న మారాజుకే మొక్కే బుద్ధి దానిది. ఈ కలియుగ  మాహాత్మ్యం వడపోసిన మహానుభావుడు కాబట్టే అంతెత్తున ఏడుకొండల మీద కొలువై ఉన్నప్పటికీ హుండీలు నిండుగా భక్తుల నుండి డబ్బులు దండుకొంటున్నాడు వడ్దికాసులవాడు. కళ్యాణ కట్టలో ఉచిత క్షౌరం చేసే చోట కూడా.. కాస్త చెయ్యి తడపందే కత్తెర మెత్తగా పడదు. పర్సు ఖాళీగా ఉన్నవాడంటే దేవుడుక్కూడా పడదు.
నోట్ల విలువ తెలియాలంటే సర్కారు కచేరీలే సలీసైన చోట్లు. అక్కడి కార్యాలయాల్లో అన్నేసి బల్లలు ఎందుకున్నాయో ముందా సూక్ష్మం తెలుసుకోవాలి తెలివున్న వాడెవడైనా. చాయ్ పానీకని  ఎంతో కొంత  పడితే గానీ స్ప్రింగు డోరును బార్లా తెరవనివ్వడు  బిళ్ల బంట్రోతు. దఫ్తర్లో ఏ పనికయినా అంకురార్పణ జరిగేది ముందు మేజాబల్ల మీద కాదయ్యా.. బల్ల కింద! గుడ్దిగవ్వంతయినా విలువ లేకుంటే ఎందుకంతలా కిందా మీదా పడి  ప్రజాసేవకులు కక్కుర్తి పడేది? ధన మూలం ఇదం జగత్! ఏ మూల చూసినా డబ్బు గమ్మత్తులే దుమ్ము లేపేస్తున్నప్పుడు .. నిప్పులాంటి  బతుకని డప్పేసుకు తిరిగే అమాయకుడికి కూట్లోకి పప్పే కాదు ఉప్పు కూడ దొరకదు.
అన్నదాతలకు నేరుగా అంతంత సొమ్ము సర్కార్లు ధారపోస్తున్నాయ్ ఉదారంగా! ఉద్ధరించేందుకా? డబ్బు దెబ్బ తెలుసు కాబట్టే ఎన్ని డబుల్ బెడ్రూంలు కట్టించినా పోలింగు రోజు ఓటరు చేతికి చీటీకింతని ముట్ట చెపుతున్నాయ్ అన్ని పార్టీలూ!
ఆకాశమంత పందిర్లేసి.. భూలోకమంత  వేదికల మీద ఎన్నొందల సార్లు రిలే ఆమరణ దీక్షలకైనా  కుర్చమనండి.. ఆ ఎన్నికల ఆఖర్రోజున ఎవరెక్కువ పాడుకుంటారో వాడికే ఓటు పడేది! దటిజ్ నోట్ పవర్!
డబ్బు మత్తు డ్రగ్సు కన్నా చెడ్డది. డ్రగ్సు కేసుల్నైనా అది గమ్మత్తుగా గాయబ్ చేసేస్తుంది. నలుపో తెలుపో .. డబ్బున్న వాడి ముందు సర్కార్లైనా చేతులు నలుపుకుంటూ నిలబడక తప్పదు. వాడి గల్లాపెట్టె మీద దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం ఎంత ల్యాంద్ సైడు  విజేతకయినా బ్యాండ్ భజాయింపు తప్పదు.
కనక.. కేసులు సంగతి ఆనక చూసుకోవచ్చు మహాశయులారా! ముందు  సూట్ కేసుల సంగతి పట్టించుకోండి! బ్యాంకులు వట్టి పోతే ఓటుబ్యాంకుకు గట్టి ముప్పు. ఇంకూ.. పేపరూ లేదని మంకు పట్లు వద్దు. ఎమ్టీ ఏటీఎమ్ములు ఎంతలావు వస్తాదుల్నైనా పల్టీ కొట్టించేస్తాయి!
సిబిఐ సంగతి ఆనక.. ముందు ఆర్బీఐ సంగతి చూడండి బాబులూ!
-కర్లపాలెం హనుమంతరావు

Monday, May 7, 2018

మన దేశములో ముస్లిముల పరిస్థితి - ఒక పరిశీలన -



మన దేశం ముస్లిములలో మెజార్టీ కడు పేదవారు. అత్యంత అవమానితులు. దళితుల మాదిరే రెండో తరగతి పౌరులు. నిరక్షరాస్యులు. సామాజికంగా వెనకబడినవాళ్లు. జనాభాలో ముస్లిముల వాటా 12 శాతం. ఆ మేరకైనా రిజర్వేషన్లు దక్కడం లేదు. ఎక్కడో ఒకచోట ఏదో ఒక మిష మీద తాము చేయని గతకాలపు దోషాలకు అమానుషంగా శిక్షలకు గురవుతున్న అల్పసంఖ్యాక వర్గం ముస్లింలే! ఒక వ్యూహం ప్రకారం నడిచే ఈ పైశాచిక దాడుల్లో ఒక్కోసారి కుటుంబాలకు కుటుంబాలు, ఊళ్లకు ఊళ్లు కొంపా గోడూ పోగుట్టుకొని నడిరోడ్దు మీదకొచ్చి పడే పరిస్థితులు పెచ్చుమీరుతున్నాయ్! ముస్లిముల మీది దాడుల్లో అరెస్టవుతున్న వాళ్లూ ముస్లిములే అవడం మరో విచిత్రం.
ఎన్నడో జరిగిపోయిన తప్పులకి ఇప్పటి తరాలు  ద్వేష చిహ్నాలుగా మారే విచిత్ర పరిస్థితులు ముస్లిం జాతి విషయంలో విశ్వవ్యాప్తంగా ఉన్నప్పటికీ.. ఈ దేశంలో  ఆ ఆగ్రహ జ్వాలలు ఆగకుండా మండే రాజకీయ గుండంలో భాగంగా ఉంటున్నాయ్! యూరపులో  కైస్తవులకు ముసల్మానులు అనలు మనుషుల్లానే కనిపించరు! క్రీస్తుని శిలువ వేసిన అపరాథానికి  యూదులు  చిత్రహింసల రూపంలో రుసములు చెల్లిస్తూనే ఉన్నారు తరాల తరబడి సాగిన జర్మన్ నాజీల పాలనలోనే ఈ దమన కాండ పరాకాష్టకు చేరిందనుకుంటే ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్న ద్వేషచరిత్ర దానికి పోటీగా తయారయింది. ముసల్మానుని సదా అనుమానంగా, ద్వేషంగా చూసే నాజీ మనస్తత్వంతోనే మన దేశ హిందువులకు ఇప్పుడు సరయిన పోలిక!
దేశభక్తిని ప్రదర్శించమని, హిందువులను గౌరవించమని, దేశ ప్రధాన స్రవంతిలో భాగం కావాలని ఒక్క ముస్లిం మతస్తుల మీదే వత్తిడి పెరగడం వారి జాతీయతను అవమానించడమే! పది కోట్ల పైచిలుకు ముస్లిములు మాట్లాడే ఉర్దూభాషకి  ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ అధికార హోదా లేదు! తతిమ్మా పేదల్లాగానే పనీ పాటా, ఇల్లూ వాకిలీ, తిండీ తిప్పలూ, రోగం రొప్పులతో  సతమతమయ్యే ముస్లిములను గురించి నాలుగు మంచి ముక్కలు విచారించడం మాని.. దేశ సంస్కృతి, మతం, భాష వంటి అంశాల ఆధారంగా ప్రధాన స్రవంతిలో కలిసిపోతేనే మంచిద'ని పద్దాకా సతాయించడం ఏ మతసామరస్యానికి నిదర్శనం? ముస్లిం కుటుంబంలో పుట్టిన కారణంగా..  ఆ వ్యక్తి పరాయిగడ్డ మతం మీద మాత్రమే ప్రేమ పెంచుకుంటాడని ఏ ఆధారంతో నిర్ధరణ జరుగుతున్నట్లో? సాటి పౌరులకన్నా ఒక మెట్టు తక్కువలో ఉన్నట్లు  నిత్యం తూట్లుపొడిచేటందుకు ఒక మాతాన్ని అడ్దుపెట్టుకోవదం సర్వ సత్తాక ప్రజాస్వామిక వ్యవస్థకు చేటు తెచ్చే పిచ్చిచేష్ట.  ఒక వ్యక్తిని తన సహజ, ప్రజాస్వామిక, ప్రాధమిక హక్కుల నుంచి మతం ప్రాతిపదికగా   దూరం చేయడాన్ని మన రాజ్యాంగం ఏ సెక్షంలో సమర్థించింది?!
ముస్లిముల పట్ల అధిక సంఖ్యాక వర్గాలకు ఉండే సందేహాలు, ద్వేషభావాలు  రోజు రోజుకీ కొత్త రూపు సంతరించుకుంటున్నాయి! పాక్ లోనో, బంగ్లా లోనో జరిగే ఘోరాలకు ఇక్కడి ముస్లిములు నిలదీతకు గురవుతున్నారు! న్యూయార్క్ ట్రేడ్ సెంటర్ కూలిన రోజుల్లో భారతీయ ముస్లిములకు ఎదురైన చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో మార్పేమీ లేదు. ప్రపంచంలో ఏ మూల ముస్లిం ఉగ్రవాదులు విధ్వంసం  సృష్టించినా దానికి ఇక్కడి ముస్లిములు బాధ్యత వహించాలనడం భావ్యమేనా? స్వేఛ్చగా వదిలేస్తే ఇక్కడి ముసల్మానులూ ముందు ముందు ఆ తరహా విధ్వంసాలకే   పాల్పడతారన్న  భయాందోళనలకు ఏ సహేతుకమైన కారణాలు కనిపించవు.  సాటి పౌరుల అకారణ భయాందోళనల కారణంగా గౌరవప్రదంగా జీవించే హక్కులు ముస్లిం జాతి కోల్పోవడం అన్యాయం! ప్రతి ముస్లిమునూ ఎల్లవేళలా ఓ కంట కనిపెట్టి ఉండటం దేశభద్రత దృష్ట్యా  ఎంతో అవసరం- అనే మిషతో ముస్లిములను నిత్యం వేధించే 'గౌరవప్రదమైన' పెద్దలకు, సంస్థలకు   మన్నింపులు పెరుగుతున్నాయ్! దేశ మతసామరస్య స్ఫూర్తికి ఇది మేలు చేయదు.
జ్ఞాపకాలూ, సంశయాలు సమస్తం ముస్లిములు అనగానే  ద్వేషం రంగునే పులుముకుంటున్నాయ్ ఈ దేశంలో! ముస్లిం మతంలో పుట్టిన పాపానికి అప్పుడే పుట్టిన పాపాయి కూడా స్థల కాలాదులతో నిమిత్తం లేకుండా దోషిగా అనుమానానికి గురి కావడం ఈ దేశ ప్రవచిత లౌకిక వ్యవస్థకు మచ్చ తెచ్చే చర్య.
నమ్మదగ్గ గణాంకాలు ఏవీ నిర్దరించకపోయినా ప్రతీ ముస్లిం పురుషుడు నాలుగుకు తగ్గకుండా పెళ్లిళ్లు చేసుకొని.. అడ్డూ ఆపూ లేకుండా పిల్లల్ని కంటూ దేశాన్ని ముస్లిం  పుట్టగా మార్చేస్తున్నాడన్న దుష్పచారం ఎప్పటినుంచో  సాగుతోంది. ఇప్పుడా ప్రచారానికి అధికారిక హోదా  తోడయింది! కానీ తాజా  జనాభా గణాంకాలు  ఈ ఊహలను సమర్థించడం లేదు. సుదూర భవిష్యత్తులో తమ మతస్తుల అత్యధిక సంఖ్యలో ఉండాలన్న లక్ష్యంతో పూట కూటికే దేవులాడుకొనే పేద ముస్లిం అడ్దూ ఆపూ లేకుండా బిడ్డల్ని కంటాడా? ఆ ఊహే హాస్యస్పదం.  
స్త్రీలను పరదాల్లో దాచి ఉండటం, వారి విద్య, వైద్యం వంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాయడం, మూఢాచారాలతో పీడించడం, సంతానార్థం వత్తిడికి గురిచేయడం.. వంటి అనాగరిక చర్యలు ఒక్క ముస్లిం మతంలోనే లేవు.  సామాజికంగా,  ఆర్థికంగా, మేధోపరంగా వెనకబడ్డ హిందూ అణగారిన వర్గాలలోనూ కనిపిస్తుంది. స్త్రీలు మగ సాయం ఆశించకుండా ఇంటి పనంతా స్వయంగా చూసుకోవాలి. ఆడదంటే వంటింటి కుందేలు. బైటకు వెళ్లవలసిన అగత్యపు పరిస్థితుల్లో మగ తోడు తప్పని సరి. పరాయి మగవారి కంటబడే సందర్భంలో మొగం కొంగులో దాచుకోవాలి. పెద్దలతో వ్యవహరించే సమయంలో నెత్తి మీది ముసుగు సర్దుకోవాలి. ఇంటి మగవాళ్లంతా భోజనాలు ముగించిన తరువాతే ఆడవాళ్లు తమ తిళ్లను గురించి ఆలోచించాలి. విద్య, వైద్యం, వినోదం వంటి రంగాలలో మగవారికే ముందు అవకాశం.. ప్రాధాన్యత. ఈ తరహా సంస్కృతి నిన్న మొన్నటి వరకూ హిందూ సమాజాలలోనూ ఓ సుసంప్రదాయంగా చలామణీ అయింది! అన్నిటికన్నా విచిత్రమైన విషయం - ఇవాళ విశాల భావాలతో  మెలిగే మధ్యతరగతి హిందూ వర్గాలు ముస్లిములు పాటిస్తున్నారని ఎద్దేవా చేసే  ఆచారాలనే అటూ ఇటూగా గతంలో తమ పెద్దలూ ఆచరించారన్న సత్యం విస్మరించడం! తామే  ప్రదర్శిచని మతసామరస్యాన్ని ముస్లిములు ప్రదర్శించడం లేదని ఆక్షేపించేవారే గొప్ప 'సంస్కర్తలు'గా ప్రస్తుతం కీర్తింపబడుతున్నారు! తమకు లేని విలువలు ముస్లిములకూ లేకపోవడం తమ విషయంలోలాగా వారి విషయంలోనూ వెనుకబాటుతనమే ముఖ్య కారణం కాగా.. తమ సంస్కృతి మీద కలసి కట్టుగా ముస్లింలు  చేస్తున్న విద్రోహ చింతన ఎట్లా అవుతుందో మరి హిందూ పెద్దలే తేల్చి చెప్పాల్సుంది!
నిజం చెప్పాలంటే మతపరంగా  అల్ప  సంఖ్యాకులైన ముస్లిములు ఈ దేశంలో  సామాజికంగా ఒక మానవీయ స్పర్శకు దూరమై,  తాము చేయని నేరాలకు నిష్కారణంగా సాటి పౌరుల వివక్షకు గురవుతున్నారు. ఊహపోహలతో చెప్పుకొస్తున్నది కాదు! స్వాతంత్ర సాధన సమర సందర్భంలో దేశ విభజన నేపథ్యంగా తూర్పు పాకిస్తాన్, పంజాబుల్లో జరిగిన మతపరమైన హింసాత్మక సంఘటనలు స్మృతిపథం నుంచి చెరిగిపోని పెద్దలు ఎవరినైనా అడిగి చూడండి! క్రూరత్వం, దేశద్రోహం అనే రెచ్చగొట్టే భావోద్వేగాలకు ముస్లిములనే ఎవరు.. ఎందుకు సంకేత చిహ్నాలుగా వాడుకొనే వ్యూహానికి తెరలేపారో  వివరంగా చెప్పుకొస్తారు.
ఏడు దశాబ్దాలు దాటినా ఆ  మతసర్పాల బుసలు సద్దుమణగనే లేదు. సరికదా..  విద్వేష పూరిత విషప్రచారాలు వేయిపడగలతో  మరింత జోరుగా విషం చిమ్ముతున్నాయిప్పుడు. పాపం పుణ్యం ఎరుగని ముస్లిం పేద కుటుంబాల బిడ్డలని  పాక్ ఏజెంట్లుగా చిత్రించి చిత్రవధలు  పెడుతున్న కథలు ఎన్నో వింటున్నాం. పేదలు, పీడితులు, అవమానితులుగా దళితులని గుర్తించి సంఘటిత పరిచే ఉదార మేధావులు  ముస్లిములకు జరుగుతున్న అన్యాయాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నట్లు? నిర్లిప్తత, నిరాసక్తతల ద్వారా ఫాసిస్ట్తు శక్తులకు  మరింత ఊతం ఇవ్వదలిచారా?
ఆత్మరక్షణ కోసం గత్యంతరం లేని  పరిస్థితుల్లో  అమాయక ముస్లిములు అవకాశవాద రాజకీయాలకు, తమ మతానికే చెందిన తీవ్రవాదుల ఉచ్చులకు చిక్కుకుంటున్నారు.  మత సామరస్యాన్ని మంట కలిపే శక్తులే   జాతి నిర్మాత పాత్రలు నటిస్తున్నాయిప్పుడు. తస్మాత్ జాగ్రత్త!


కన్నడ రచయిత 'బోళువారు మహమ్మద్ కుంజి' కథల సంకలనం 'దేవర గళ రాజ్యదల్లి'(దేవుళ్ల రాజ్యంలో) ముందు మాట- ప్రేరణతో
-కర్లపాలెం హనుమంతరావు

Sunday, May 6, 2018

మాటలూ- మార్పులూ- డా॥ బూదరాజు రాధాకృష్ణ పుస్తక పరిచయం -1



తెలుగులో రెండు మూడు నిఘంటువులు ఉన్నాయి. శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్రం, ఆంధ్రవాచస్పత్యం.. వగైరా. ఇంకా ఏమైనా ఉంటే ఉండవచ్చు, వేటి దారిది వాటిదిగా సాగింది పదనిఘంటువుల నిర్మాణం. తక్కిన ద్రవిడ భాషలకు మహానిఘంటువులు నిర్మితమయ్యాయి.. కానీ తెలుగువాడికి ఆ అదృష్టం లేదు. వేదం వెంకటరాయ శాస్త్రి, గిడుగు రామ్మూర్తి పంతులుగారు వంటి ఉద్దండులు నిఘంటువల నిర్మాణానికి కొంత ప్రయత్నం చేసారు. వాటిని వేటినీ కాదని ఆంధ్రసాహిత్య పరిషత్తువారు సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణం తలపెట్టారు! ఆ నిఘంటు నిర్మాణ పోషణకు పూనుకున్న పిఠాపురం రాజావారు చివరకు బికారి దశకు చేరుకున్నారంటారు. తెలుగు అకాడమీ ప్రారంభమయిన తరువాత శబ్దసాగరం పేరుతో ఒక నిఘంటువు నిర్మించాలన్న తలంపు పెట్టుకున్నది. కానీ అఖండ భాషాభిమానులయిన పాలకులు ఆ క్రతువు పూర్తి కాకుండా ఉండేందుకు శక్తి వంచన లేకుండా పాటుపడ్డారని బూదరాజు రాధాకృష్ణగారు ఒక సందర్భంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక వ్యక్తి తన జీవితకాలమంతా శ్రమించినా ఒక మహానిఘంటువు నిర్మాణం సాధ్య పడదు. అలా పడదని ప్రపంచ దేశాల నానా భాషాచరిత్రలు నిరూపిస్తున్నాయి కూడా. అయినా కాలం, ఖర్మం కలసి వచ్చి భవిష్యత్తులో అలాంటి మహానిఘంటువు నిర్మాణం  తలంపు మొదలయితే.. ఉపకరణంగా ఉంటుందన్న మంచి ఉద్దేశంతో బూదరాజు  రాధాకృష్ణగారు ఈనాడు ఆదివారం అనుబంధంలో  సుమారు నాలుగేళ్ళపాటు ( 1997, జూన్ 8 - 2001, ఫిబ్రవరి 2) 'మాటలూ-మార్పులూ' శీర్షిక నిర్వహించారు.  మహానిఘంటువు నిర్మాణం కానీ చేపట్టదలిస్తే గమనించవలసిన అంశాలు బోలెడున్నాయి. వాటినన్నింటినీ ఏకరువు పెట్టడం ఆరంభంలోనే బెదరగొట్టినట్లవుతుందని  రాధాకృష్ణగారి అభిప్రాయం. అయినా కాలక్రమంలో శబ్దాల్లో, అర్థాల్లో వచ్చే స్వాభావికమైన మార్పులను కొంతలో కొంతైనా సూచిస్తే బుద్ధిమంతులకు, శక్తిమంతులకు మహానిఘంటువు లేదన్న కొరత స్వల్పంగా అయినా తీరుతుందన్న ఉద్దేశంతో బూదరాజుగారు నిర్వహించిన  మంచి ధారావాహిక శీర్షిక ఇది. దీని ద్వారా తెలుగువారిలో ఎవరికయినా మళ్ళీ భాషాభిమానం రేకెత్తి.. మహానిఘంటువు నిర్మాణ సంకల్పం మొలకెత్తితే తాను పడ్డ శ్రమ కొంత సార్థకమవుతుందని రాధాకృష్ణగారి భావన.
600 మాటలకు సంబంధించిన కొంత సమాచారం ఈ శీర్షిక ద్వారా అందిచారు. పదానికి ఉన్న అర్థాల్లో కాలక్రమంలో వచ్చిన మార్పుల వివరణ ఉంది. సందర్భాన్ని బట్టి ఆధునిక శాస్త్ర రచన అవసరాలనూ దృష్టిలో ఉంచుకొని పాతమాటలకే కొత్తపదబంధాలు కల్పించి వాటినే సాంకేతిక శబ్దాలుగా ప్రయోగిస్తున్న వైనాన్నీ పరిశీలించారు ఇందులో. ఇలాంటి ప్రయత్నం ఈ శీర్షిక ముందు.. తరువాత కూడా మళ్లీ ఎవరు తలపెట్టక పోవడం విచారించదగ్గ విషయం.
అంతర్జాల యుగంలో తెలుగు పద సంపదకు మరింత పుష్టి కలిగించాలన్న దృష్టి కల భాషాభిమానులు, భాషోద్ధరణకు కృషి చేసే సంస్థలు, సమాచార పత్రికలు ఈ తరహా కృషిని మరింత ముందుకు కొనసాగిస్తారన్న ఆశతో ఇక్కడ ఈ చిరు పరిచయాన్ని ఇవ్వడం జరిగింది!
అభినందనలతో
కర్లపాలెం హనుమంతరావు
***

ఈ వ్యాసానికి కొనసాగింపుగా ఈనాడు విశ్రాంత ఉద్యోగులు శ్రిధర మూర్తి  గారు అందించిన అదనపు అత్యంత విలువైన సమాచారాన్ని కూడా ఇక్కడ జత చేస్తున్నాను :

"జయంతి రామయ్య పంతులు గారిచే రచింపబడిన "శ్రి సూర్యరాయంధ్ర నిఘంటువు " కాకినాడ అంధ్ర  సాహిత్య పరిషత్ వారు 1936 లొ ప్రచురించారు.  దానిని అంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి వారు  1979 లొ పునర్ముద్రించారు,  6 సంపుటాలు గా వెలువడింది. దీని గొప్ప దనం ఏమిటంటే, అలుక అని ఒక మాటకు ఎన్ని అర్ధాలున్నయో తెలుపుతూ, ఆ మాట వాడబడిన పద్యం గాని, వాక్యం గాని ఉదాహరణలు ఇచ్చారు.  తరువాతి కాలం లొ వచ్చిన పుర్ముద్రణలో ఈ పద్యాలు ఉదాహరణలు లెకుండా ఒకె సంపుటం గా ముద్రించారు. ఇక తెలుగు అకాడెమీ వారు ఇంగ్లీష్ తెలుగు నిఘంటువును  A4 size లొ  3 కాలంస్ తో 1300 పేజీ ల నిఘంటువు ప్రచురించారు.  అప్పట్లో  డిప్యుటీ  డైరెక్టర్స్ గా పనిచేసిన, ముకురాల రామారెడ్డి, పొరంకి దక్షిణామూర్తి ఈ నిఘంటువు ను తయారు చేసారు. ఇప్పుడు ఇది దొరకటం లేదు. నా దగ్గర మాత్రం ఒక కొపీ వుంది.  ఇక, బూదరాజు గారు ఈనాడు జర్నలిస్ట్ ల కొసం వ్యవహార పదకొశం తయారు చేసారు.  ఈనాడు దీనిని ముద్రించింధి.  సచివాలయం లొ న్యాయ శాఖ లో అనువాద విభాగం లో మేము తయారు చేసిన నిఘంటువు ను ముద్రించటానికి మాకు నిధులు లేనందున తెలుగు అకాడెమి వారికి ఇచ్చాము.  వారు దానిని న్యాయ పద కోశము పేరుతొ ముద్రింఛారు.  నాకు తెలిసిన సమచారం ఇది."

మాల్యా! మా జైళ్లే భేషయ్యా!- సరదా వ్యాఖ్య



భారతదేశంలోని జైళ్ల పరిస్థితి బాగోలేదని.. తనను అక్కడికి పంపించవద్దని విజయ్ మాల్యాజీ లండన్ న్యాయస్థానంలో మొరపెట్టుకున్నట్లొక తాజా వార్త. భారతదేశంలో జైలు జీవితం ఎంత మజాగా ఉంటుందో  తెలీకే శ్రీవారి ఈ కొత్త మెలిక?
విజయ్ జీ  సంఘంలో మహా గొప్ప గుర్తింపుగల పెద్దమనిషి. ప్రపంచవ్యాప్తంగా మాల్యాజీ మాటకుండే విలువ అమూల్యం. భారతీయ కారాగారాల మీద శ్రీవారలా  కారాలూ మిరియాలూ నూరడం  భావ్యం కాదు.  అందుకే ఈ చిన్న విన్నపం!
మహా మహా రాజశ్రీ విజయ్ మాల్యాజీ!
ప్రస్తుతం  కర్ణాటకలో హోరాహోరీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఇప్పుడు ప్రతీ ఒక్క ఓటూ అమూల్యమే. గత రెండు దఫాలుగా తమరు కర్నాటక రాష్ట్రం తరుఫు  నుంచే ‘పెద్ద’ల సభకు ఎన్నికైన ప్రతినిధులు! తమ వంటి పెద్దల కీలకమైన ఓటు ఒక్కటి తగ్గినా మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి పెద్ద లోటు.  ఎన్నికల గడువు లోపే తమరు ఈ దేశం గడ్డ మీదకు మళ్లీ కాలు మోపి తమ అమూల్యమైన ఓటును సద్వినియోగ పరుచుకోమని  వినతి. మన దేశంలోని జైళ్లు జేబుదొంగలకు చుక్కలు చూపిస్తాయేమో గానీ.. తమ బోటి బ్యాంకు బొక్కింగులకు, లిక్కరు కింగులకు పక్కలు పరుస్తాయి!  
మన దేశీయ కారాగారాల   వైభోగం తమబోటి పెద్దలకు పెద్దగా విడమరచి చెప్పాలా! బడా  నేరస్తులకు  అత్యంత సురక్షితమైన స్థలాలు మన జైలు గోడలే! ఉన్నత వర్గాల నుంచి విచ్చేసే గౌరవనీయమైన నేరస్తులకు కారాగారాలలో కల్పించే ప్రత్యేక సౌకర్యాలను గూర్చి  మన మీడియానే వీడియోలతో సహా  ప్రపంచానికి ఎన్నోసార్లు  చాటి చెప్పింది. వాటినన్నింటినీ  వట్టి కల్పిత కథనాలుగా మేం కొట్టి పారేసిన మాట నిజమే. ఆయా ప్రకటనలను ఆట్టే పట్టించుకోవద్దని మనవి.  వట్టేసి చెబుతున్నాం! మన దేశ కారాగారాలు  తమబోటి ఘరానా వ్యక్తులకు స్వర్గధామాలు. మా బందిఖనాలలో అందించే ప్రత్యేక సౌకర్యాలన్నీ అధికారికంగా ఇక్కడ పొందుపరచడం ఇబ్బందికరం. ఒక్కసారి తమరే  విచ్చేసి  పర్యవేక్షించ ప్రార్థన. తమరి   లండన్ ఐదు నక్షత్రాల వసతి గృహాలైనా వట్టి 'డన్ జన్’ లుగా భావించకుంటే ఒట్టు.
తాజాగా తమిళనాడు బ్రాండ్ వి.వి.వి..పి మ్యాడమ్ శశికళమ్మగారికి కర్ణాటక కారాగారవాస అదృష్టం తన్నుకొచ్చింది. ఆ దేవేరికి జరుగుతున్న  రాణీమర్యాదలే మా కారాగార అధికారుల నిబద్ధతకు తిరుగులేని నిదర్శనం.
ఆ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల కారాగారాలలో ప్రముఖ   రాజకీయ నేతలు.. వారి వందిమాగదులు  మేం కల్పించిన ప్రత్యేక సౌకర్యాలన్నెంటినో తనివి తీరా  అనుభవించారు చాన్నాళ్ళు. ఛానళ్ల కళ్లబడకుండా ఎన్ని అవస్థలైనా పడి  పెద్దలను సంతోషపెట్టడమే ప్రధమ కర్తవ్యంగా మేం భావిస్తాం! మీ  మహారాజా మర్యాదలకు మాదీ గ్యారంటీ మాల్యాజీ! వారానికోసారి మా వారంట్లూ, వాటిని మళ్లీ మళ్లీ మీరు తిప్పి కొట్టడాలూ.. ప్రతిపక్షాలతో బొప్పికట్టేటట్లు మాకు తలంట్లు.. ఇవన్నీ అవసరమా? ఒక్క శనివారం  తమరు  మన చట్టానికి చిక్కి చుట్టపు చూపుగా మా కారాగారాలకి విచ్చేయండి.. చాలు.. విజయ్ జీ! మళ్లీ సోమవారానికల్లా   మీకు బెయిలు తెప్పించే పూచీ మాదీ.   మూడ్రోజులూ మేం మీకిచ్చే అతిధి మర్యాదలకు తమరే మూడ్ మార్చుకొని మళ్లీ మళ్లీ మా ఊచల వెనక్కే వచ్చేయాలని ఉవ్వీళ్లూరడం   ఖాయం.  
ఒక్క రాజకీయ నేతాశ్రీలకే మా ప్రత్యేక సౌకర్యాలన్న భయాలొద్దు! మీ బోటి బ్యాంకులూటీ బిగ్ పర్శనాల్టీలకు అంతకు మించిన రాజభోగాలు.. గ్యారంటీ! దొరలైతే చాలు .. ఎన్ని దొంగపన్లకు పట్టుబడి జైలుకొచ్చినా పొర్లుదండాలు పెట్టి మరీ సేవించుకోవడం మా అదృష్టంగా భావిస్తాం మాల్యాజీ! 'అతిధి దేవో భవ'అన్న భారతీయుల సత్సాంప్రదాయం అత్యంత నిబద్ధతతో అమలు చేసే ప్రభుత్వ శాఖలు ఏమైనా  ఇంకా మిగులుంటే.. అందులో మా కారాగారశాఖవారిదే మొదటి స్థానం. 
ముంబయి అల్లర్ల కేసులో పట్టుబడి జైలుకొచ్చిన కసబ్ కహానీ దొరవారి చెవులకు సోకినట్లు లేదు. కిలో రెండొందలు పెట్టినా దొరకని ‘శ్వాన్’ బ్రాండ్ బాసుమతితో మాత్రమే రోజూ బిర్యాని వండి పెట్టేవాళ్లం. ముక్క లేందే ముద్ద దిగదని ఆ ముష్కరుడు  మొండికేస్తే మేమే తలకింతని వేసుకొని టన్నులకొద్దీ మటన్లు, చికెన్లు వండి  వార్చాం.   చింకిచాపల మీద కునికే చిల్లరగాళ్లకే ఇంతలా సేవలు అందించగా లేంది.. బంగారు కోడి పెట్టలు.. తమరి వంటి శృంగార పురుషులకు ఏ తరహా పవ్వళింపు సేవలు కావాలో  మాకు తెలీదా? కంగారు పడకుండా ఒక్కసారి విధాయకంగా అయినా మన దేశ చట్టానికి లొంగిపోండి. మా కారాగారాలకు దయచేయండి మహాప్రభో!
మీకు అప్పులిచ్చిన ఆ బ్యాంకులోళ్లెవరూ మీ బ్యారెక్సు వైపు కన్నెత్తైనా చూడకుండా కాచి కాపాడే  పూచీ మాదీ! తమరి  క్రికెట్టాటల షెడ్యూళ్లేవీ   చెదిరి పోకుండా మీ కోర్టు కేసులన్నీ రీషెడ్యూలు చేయించే డ్యూటీ  మన సర్కారు పెద్దవకీళ్లు మహా సంబరంగా స్వికరించేందుకు సిద్ధం.. సరా సార్జీ!
అనొచ్చో లేదో.. తెలీదు కానీ..  ఇప్పుడిక్కడి న్యాయస్థానాలలోనూ నేరం తూచే  పని మరీ తమరు వణికిపోయేటంత  తిన్నగా ఏమీ సాగడం లేదు! కేసుల సాగతీతకు మీరు అక్కడ లండన్లోనే ఉండి అవస్తలు పడనక్కర్లేదు. ఆసారాం బాపూలాంటి ఆధ్యాత్మిక బాబాలకే అప్పుడెప్పుడో చీకట్లో చేసిన పెద్ద తప్పుకు ఇప్పటిగ్గానీ శిక్ష పడలేదు. అదీ మరీ అంత పెద్ద ఉరి శిక్షేమీ కాదు. నెంబర్ వన్ బాలీవుడ్ హీరోలకే  శిక్షలు పడ్డం లేదు ఇప్పుడిక్కడ మాల్యాజీ! ఆఫ్ట్రాల్ తొమ్మిది వేల కోట్లు .. అదీ జనం సొమ్మే కదా దొరగారు బొక్కిందీ! బోనులో నిలబెడతారని అంతలా భయపడ్డమెందుకు? గమ్మునుండటం మీ వంటి గుండెలు తీసిన బంట్లకు శోభనివ్వదు. తమిళ తంబి ఏ. రాజాలా తమరూ ఇక్కడి ‘లా’ పాయింట్లతోనే ఎదురు తిరగబడరూ? మన చట్టాల్ని చితక్కొట్టేందుకైనా తమరు తిన్నగా ఈ దేశంలోకొచ్చి తీరాలి! తొండి ఆట ఆడేందుకైనా తమరు  తొందరగా దయచేయండి మాల్యాజీ! మీ మీద ఈగైనా వాలకుండా  మా జైళ్ల శాఖలన్నీ వేయి కళ్లతో  కాపు కాసేందుకు రడీ!
రెండుసార్లు రాజ్యసభ సభ్యులయి ఉండీ ఎన్నికల్లో ఓటేయకుంటే  జనం ఏమనుకుంటారూ?   
మన దేశంలో కారాగారాల కండిషన్లేవీ బావో లేవని మాత్రం కోర్టుకెక్కకండి మహాప్రభో! బావోదు! వి.వి.వి.ఐ.పిలకు ఎర్రతివాచీలు పరుస్తాం మేం! మా మాట బూటకమనుకుంటే  మీరే నేరుగా ప్రముఖ నేరస్తులు.. సీజనల్ ప్రిజనర్ గౌరవనీయులు శ్రీమాన్ లాలూ ప్రసాద్ యాదవ్ గారిని సంప్రదించవచ్చు!  ఏళ్ల తరబడి జైల్లో మహారాజ వైభోగాలను నిరాటంకంగా అనుభవించిన గనుల పెద్దలతో అయినా  లైను కలుపండి!  దిగులుగా జైళ్ల కెళ్లి హుషారుగా  ఊరేగుతూ తిరిగొచ్చిన వి.వి.వి..పి ల చిరునామాలు తమరి కర్నాటక అభ్యర్థుల జాబితాలోనే తట్టల కొద్దీ దొరుకుతాయ్  మాల్యాజీ! ఏ బడా నేరస్తుడినడిగినా మన జైళ్ల మర్యాదలకు జై కొట్టడం ఖాయం.
ఓటేసేందుకు  వీల్లేకుండా పోయిందని తమరిలా  వాపోయే కన్నా ఒక్కసారి దేశంలోకి దొగబడి సరెండరై చూడండి.  జైలుకెళ్లొచ్చిన వాళ్లకే జనంలో చచ్చేటంత  డిమాండ్. హాస్యానికని అంటున్నారేమో తమరు.. మన జైళ్ల పరిస్థితులేం బావోలేవని! జైళ్లంటే పెద్దమనుషులకి అత్తారిళ్లంత సౌకర్యవంతంగా ఉంచాలన్నది మా పాలసీ మాల్యాజీ!
ఒకే ఒక్కసారి మా జైళ్లకు విచ్చేసి ఓ పూట మా ఆతిధ్యం స్వికరించమని మనవి! జన్మంతా జైళ్లల్లోనే గడిపేయాలన్నంత కమ్మంగా ఉంటాయి మా  చందన తాంబూలాది  అతిధి సత్కారాలు!   
ఇట్లు
తమరి  విదేయుడు
పేరు బైటకు చెప్పకోలేని అనధికార కారాగారాధికారి
అనధికార జైలు పర్యవేక్షకుడు
***
-కర్లపాలెం హనుమంతరావు




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...