గడించడం కష్టం.
ఖర్చు చేయడం కష్టం.. ఎవరెవరికో
లెక్కలు చెప్పాలి.
అట్లాగని దాచుకున్నా కుదరదు. దారాపుత్రులు ఊరుకోరు.
ఎక్కడ దాచాలో తోచదు. ఎవర్మని నమ్మాలి? ఎంత వరకు కుమ్మాలి? డబ్బు ఉంటేనే కాదు.
డబ్బు అంటేనే కష్టం బాబూ!
అగచాట్లెందుకు..
అస్సలు డబ్బే వద్దన్నా దెబ్బై పోవడం ఖాయం! పూట గడవాలన్నా..
పూటుగా మందు పడాలన్నా ముందు కావాల్సింది కరెన్సీనే కదన్నా?
పొరుగింటి మీనాక్షమ్మల్తో పోలిక పెట్టే ఆండాళ్లు ప్రతి ఇంటా ఉంటారు. ఓ ముత్యాల బేసరయినా ముక్కుకి తగిలించలేదని అలిగి
కూర్చుంటారు.
రేకెట్ నుంచి పాకెట్ దాకా అన్నింటికీ మనీతో పని. డబ్బు లేందే డుబ్బు క్కొరగాడన్న సామెతేమన్నా సర్దాకు పుట్టించారా అనుభవజ్ఞులు?
ఎన్నికల్లో టిక్కెట్ల ఇక్కట్ల సంగతట్లా ఉంచండి. చిన్నోడి ప్రీ-కాన్వెంటు సీటుకైనా పెద్ద నోట్ల కట్టలవసరమే కదప్పా! బ్లాక్ బస్టరని బోడి బిల్డప్పులిచ్చే ఓన్లీ వన్దే డే ఆడే చెత్త సినిమాకైనా
బ్లాకులో తప్ప టిక్కెట్లు దొరికి చావని రోజుల్లో రొక్కాన్ని మరీ అరటి తొక్కలా
తోసలవతల పారేస్తే పస్తులే!
పైసలుంటేనే పేరొచ్చేది .. మంచిదో.. చెడ్డదో!
ఫోర్బ్స్ జాబితాలో కెక్కించేదీ.. ఫోర్ ట్వంటీ కేసుల్నుంచీ తప్పించేదీ మనీనే! మనీ మేక్స్ మెనీ
ట్రిక్స్!
బ్యాంకప్పుల వంకతో పైసా వసూల్. తిరిక్కట్టమంటే ఇంటి
పై కప్పుల వంక చూపులు!
వీల్చూసుకొని విదేశాలకు చెక్కింగ్స్! మంచి స్కీమ్సే కావచ్చు కానీ.. విమాన టిక్కెట్లకు సరిపడా అయినా మనీ
తప్పని సరే కాదా.. దటీజ్ డబ్బూస్ పవర్!
బిర్లా టాటాలకి ఏ పేరొచ్చినా, అదానీ అంబానీలకి ఏ 'కీ' రోలిచ్చినా కీలకమంతా పర్శులోని కాపర్సుదే! బిట్స్ పిలానీ టు.. బిట్ కాయిన్స్ వరకు అంతా కాసుల తిరకాసులే! కాదంటే కుదరదు సుమా!
కుదురుగా ఉండనీయదు డబ్బెవర్నీ! పెద్ద నోట్లనట్లా
అర్థరాత్రి కల్లా హఠాత్తుగా రద్దు చేయిందా లేదా? పెద్దాయన పేరనట్లా ఊరూ వాడా మారుమోగించిందా.. లేదా? బ్యాంకులంటూ కొన్ని డబ్బుండే చోట్లు
మన దేశంలో కూడా పనిచేస్తుంటాయని జనాలకు తెలిసింది. ఏటియంలంటే ఏంటోలే..
పెద్ద కొలువులు చేసుకొనే చదువుకున్నోళ్లు నోట్ల కోసం నొక్కుకునే
యంత్రాలని మామూలు జనాలకు అవి ఖాళీ అయినప్పుడే తెలిసింది! అందీ డబ్బు దెబ్బ!
ఉన్నా సంచలనమే.. లేకున్నా సంక్షోభమే!
డబ్బు లేందే అప్పులుండవు. అప్పులంటే వూరికే
ఎగేసేందుకు తీసుకొనే సొమ్మా కాదు.. సర్కార్లు ఓట్ల
కోసం మాఫీలు చేసేందుక్కూడా. ఏమైనా అంటే ఆర్బీఐ వూరికే ఫీలయిపోతుంది కానీ.. బాకీలు మాఫీలు లేందే ఏ రాజకీయ పార్టీ అయినా
సాఫీగా హామీలిచ్చేదెట్లా?
అధికారంలోకి ఎగబాకేది ఎట్లా?
ఒక్క ‘పవర్’తోనే కాదు డబ్బుకు పరువూ ప్రతిష్ఠల్తో కూడా లంకే! డాలరు డాబు చూసుకొనే అమెరికావాడి ఆ రువాబు. ప్రపంచం అమెరికా
చుట్టూతా గిరిటీలు
కొడుతున్నా..
అమెరికావాడు డాలరు చుట్టుతా గింగిరాలు కొడుతున్నా అంతా ఆ సొమ్ములో
ఉన్న గమ్మత్తు వల్లే.
ఆ డాలరు మీద
దెబ్బేద్దామనే చైనావాడిప్పుడు సిల్కు
రోడ్డుతో తయారవుతున్నాడు. సిల్క్ స్మిత
నుంచి..
సిల్క్ రోడ్డు దాకా అందరికీ డబ్బుతోనే బాబు డాబు!
నాలుగు రాళ్లు వెనకేసుకోమని పెద్దలేమన్నా పన్లేక సతాయిస్తారా? ఎప్పుడు ఏ రాయికి ఎంత విలువ పెరుగుతుందో దేవుడికే తెలియాలనుకుంటాం. ఆ సూక్ష్మం వంటబట్టకే
దేవుడూ ఓ రాయిగా మారిపోయాడు. భక్తులు
హుండీల్లో వేసే రాళ్లతో లోకతంత్రం నడిపిస్తున్నాడు! రూపాయిల నోట్ల మీద కనిపించక పోయుంటే పాపం గోచీపాతరాయుడు బాపుజీని అయినా
పట్టించుకొనుండేదా ఈ డబ్బు పిచ్చి లోకం?
గౌరవనీయమైన పదవుల కోసం ఘోరంగా కొట్లాడుకుంటుంటారు నిస్వార్థ ప్రజాసేవకులు. గౌరవంగా ఓ రూపాయి వచ్చినా మనీ మార్కెట్లో దాని మార్పిడి విలువ ఎన్ని కోట్లుంటుందో?
డబ్బు మీదే ప్రజానేతకీ నిజానికి బొత్తిగా
మమకారముండదు.
కానీ ఎన్నికల తంతుకు కావాల్సిందే డబ్బు మూటలు కదా! అభిమానసందోహం ఆనందంగా కోట్లు ధారపోస్తామన్నా
ఎన్నికల సంఘం నిమ్మళంగా ఉండనీయదు. అందుకే ఎన్నికలకు ముందు
నెల్లాళ్లు నేతలు ఎన్నడూ ఎరగని కాయా కష్టానికి తయారయేది. పలుగూ పారా పట్టినా,
మట్టి మూటలు నెత్తికెత్తినా, రోడ్దు పక్క టీ కాచినా,
రొప్పొచ్చేటట్లు రిక్షా తొక్కినా.. కూలి కింద గంటకు ఓ ఐదారు లక్షలు తగ్గకుండా గడించేది.
డబ్బుంటేనే కోర్టుల్లో ఏ పిల్ అయినా వేయగలిగేది.. ఏ జింఖానా కోర్టుల్లో అయినా
ఐపిఎల్ ఆడగలిగేది!
డబ్బుంటేనే అబ్బా.. చర్లపల్లి జైలైనా చల్లపల్లి రాజావారి
బంగళాలా చల్లంగా ఉండేది.
డబ్బున్న వాడికి నేరాలతో నిమిత్తం లేదు. బేళ్ల కొద్దీ
నోట్లు మనవి కాదనుకుంటే చాలు.. బెయిళ్లైనా దానంతటవే
నడుచుకొచ్చేస్తాయ్!
మరో అప్పీలుక్కూడా ఆస్కారం ఉండదు.
రూకల్లేకుంటే లోకానికి లోకువ. డబ్బున్న మారాజుకే మొక్కే బుద్ధి దానిది. ఈ కలియుగ మాహాత్మ్యం వడపోసిన మహానుభావుడు
కాబట్టే అంతెత్తున ఏడుకొండల మీద కొలువై ఉన్నప్పటికీ హుండీలు నిండుగా భక్తుల నుండి
డబ్బులు దండుకొంటున్నాడు వడ్దికాసులవాడు. కళ్యాణ కట్టలో ఉచిత క్షౌరం చేసే చోట కూడా.. కాస్త చెయ్యి
తడపందే కత్తెర మెత్తగా పడదు. పర్సు ఖాళీగా ఉన్నవాడంటే దేవుడుక్కూడా పడదు.
నోట్ల విలువ తెలియాలంటే సర్కారు కచేరీలే సలీసైన చోట్లు. అక్కడి కార్యాలయాల్లో అన్నేసి బల్లలు ఎందుకున్నాయో ముందా సూక్ష్మం
తెలుసుకోవాలి తెలివున్న వాడెవడైనా. చాయ్
పానీకని ఎంతో కొంత పడితే గానీ స్ప్రింగు డోరును బార్లా
తెరవనివ్వడు బిళ్ల బంట్రోతు. దఫ్తర్లో ఏ పనికయినా అంకురార్పణ జరిగేది ముందు మేజాబల్ల మీద కాదయ్యా.. బల్ల కింద!
గుడ్దిగవ్వంతయినా విలువ లేకుంటే ఎందుకంతలా కిందా మీదా పడి ప్రజాసేవకులు కక్కుర్తి పడేది? ధన మూలం ఇదం జగత్!
ఏ మూల చూసినా డబ్బు గమ్మత్తులే దుమ్ము లేపేస్తున్నప్పుడు .. నిప్పులాంటి బతుకని డప్పేసుకు తిరిగే
అమాయకుడికి కూట్లోకి పప్పే కాదు ఉప్పు కూడ దొరకదు.
అన్నదాతలకు నేరుగా అంతంత సొమ్ము సర్కార్లు ధారపోస్తున్నాయ్ ఉదారంగా! ఉద్ధరించేందుకా?
డబ్బు దెబ్బ తెలుసు కాబట్టే ఎన్ని డబుల్ బెడ్రూంలు
కట్టించినా పోలింగు రోజు ఓటరు చేతికి చీటీకింతని ముట్ట చెపుతున్నాయ్ అన్ని పార్టీలూ!
ఆకాశమంత పందిర్లేసి..
భూలోకమంత వేదికల
మీద ఎన్నొందల సార్లు రిలే ఆమరణ దీక్షలకైనా కుర్చమనండి.. ఆ ఎన్నికల
ఆఖర్రోజున ఎవరెక్కువ పాడుకుంటారో వాడికే ఓటు పడేది! దటిజ్ నోట్ పవర్!
డబ్బు మత్తు డ్రగ్సు కన్నా చెడ్డది. డ్రగ్సు
కేసుల్నైనా అది గమ్మత్తుగా గాయబ్ చేసేస్తుంది. నలుపో తెలుపో .. డబ్బున్న వాడి ముందు సర్కార్లైనా చేతులు నలుపుకుంటూ నిలబడక తప్పదు. వాడి గల్లాపెట్టె మీద దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం ఎంత ల్యాంద్ సైడు విజేతకయినా బ్యాండ్ భజాయింపు తప్పదు.
కనక.. కేసులు సంగతి ఆనక చూసుకోవచ్చు మహాశయులారా! ముందు సూట్ కేసుల సంగతి పట్టించుకోండి! బ్యాంకులు వట్టి పోతే ఓటుబ్యాంకుకు గట్టి ముప్పు. ఇంకూ..
పేపరూ లేదని మంకు పట్లు వద్దు. ఎమ్టీ ఏటీఎమ్ములు ఎంతలావు వస్తాదుల్నైనా పల్టీ కొట్టించేస్తాయి!
సిబిఐ సంగతి ఆనక..
ముందు ఆర్బీఐ సంగతి చూడండి బాబులూ!
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment