Saturday, February 6, 2021

తిట్టు!.. తిట్టించు! -సరదా వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 


వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే  ప్రజస్వాముల వాదం.  లక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.  

ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు  ఓటర్ల బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే  సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం!

తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చస్తార’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక  బాదర్ అవలేదు. కానీ ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద ఆట్టే నమ్మకంలేదు.   తలనొప్పి తద్దినమంతా  ఎందుకులెమ్మనే నాయకులంతా ఎన్నికల తుమ్ములు వదిలే వరకూ ‘ఓటర్లే దేవుళ్లు’ అంటూ అష్టోత్తరాలు, సహస్రనామాలు  అందుకునేది! నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయిని ఓ మెట్టు కిందికి దిగలాగడవేఁ!

కాసుల పురుషోత్తమం అని ఓ కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి  శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును  పట్టుకుని దులిపేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులా! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మో అయితే, నువ్వే ఏదో  కామితార్థుడివన్నట్లు వీర పోజులా! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకు బ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకుతో ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుకుంటివి కదా! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని   నీకు ఎందుకయ్యా  పతితపావనుడుల్లాంటి   బిరుదులసలు? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ  దామోదరుడివవే(పనికిమాలినవాడివి) సుమా!’ అంటూంటే.. అది తిట్టో.. మెప్పో తెలీక  ఆ దేవుడు గుళ్లోని రాయికి మల్లే  గమ్మునుండిపోయాడు!

దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు నుంచి భక్తుడికి ఠక్కున ఆఫరొచ్చే  జంపింగ్ జమానా ఇది మరి!

 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో  మటుమాయం చేసుకోవచ్చు.  ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయలిప్పుడు మరీ పాతకాలం నాటి నాటురథాలను మాత్రమే నమ్ముకుని ఉత్సాహపడే ఉత్సవ విగ్రహాలు కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా.. ఓటు మిషను మీట నొక్కే మనిషి కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పది, పదిహేనువేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే  పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ ‘స్టేటు’ దాకా ఎగదోసింది. మసిపూసి మారేడుకాయ చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమో గాని, కడుపు మండితే  ఓటరే ఉల్ఫాగా ఊరేగే నేతల ముఖాన కసి కొద్దీ బుడ్ల బుడ్ల సిరా పూసి సీన్లు ఖరాబు చేసే  రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడ పుట్ట బట్టే!  

పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్ బాగ్ చూసాం కదా! అన్నదాతల ఆగ్రహమూ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే కోపిష్టి ముఠాను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్టు?  తిట్టి పోసిన వర్గాల మీదనే ఏ అయోథ్య రామయ్యను మించిన వరాల జల్లులు! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు. ఇహ  బోడి మల్లయ్యల  తిట్లంటారా?  చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు అధికార దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుంది కదా!  అయినా, తిట్లక్కూడాట్లు తెగే సత్యకాలమా.. మన  పిచ్చిగానీ?

అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో  అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం!  ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!’ అంటూ చెడ  తిట్టిపోసినా  దేవుళ్ళకూ చీమ కుట్టినట్లైనా నొప్పుండటంలేదిప్పుడు !  కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరుతో నోరుజారారనో,  లైంగిక దృష్టితో చూసి వేధించారనో మనిషెంత మధనపడ్డాఅ.. యుద్ధకాండ సిద్ధపడ్డా .. నో బడీ కేర్స్!  కోర్టు బోనుల్లో నిలబడాల్సినవాళ్ళే కోర్టు జోన్ల తరలింపు మీద ప్రకటనలిచ్చేస్తున్నారు! ఎక్కడైనా శాపనార్థాలు వినపడుతున్నాయా? ‘దండుకునే సమయం’ దండగ కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా కూడా  ఉంటున్నదిప్పుడు!

దూర దూరంగా తగలడితే తూలనాడుకొనేటంత పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి మనం. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రావద్దంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..  ఆంజనేయుడికి మధ్యనే గలాటా జరిగి మాటలు రువ్వుకుంటే.. వింటూ ఎంజాయ్ చేసిన మనం  ఈ నేలబారు నేతల కారుకూతలు  ఏమంత ఎబ్బెట్టనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!   

ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు మందలిస్తే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునూరుకున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట ఎదురు పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు గట్రా విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా మాత్ర్రం తిట్టు వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలు ఇచ్చేస్తున్నారిప్పుడు. పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ  నాలుకకు మరికాస్త పదును నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనం సైతం తొక్కేసే మూడులో లేరిప్పుడు.  ఈ దుస్థితికి ఎవర్నని తిట్టుకోడం?!

 తిట్టే వాడి మీద వెగటు పుట్టటం మాట అటుంచి..తిట్టించుకొనేవాడి మానసిక పరిస్థితి మీద  వెకిలిగా తయారైన నకిలీ వీడియోలు విపరీతంగా వైరలవుతున్నాయిప్పుడు!  వినే ఓటారే తిట్లు  వీనులకు విందనుకునే దశకు వచ్చేశాడు జుట్టూ జుట్టూ పట్టుకునే సీన్లుంటేనే చట్టసభలు సజావుగా సాగినట్లు లెక్క! సమయానికి   సభా ప్రసారాలు సడెన్ గా కట్ అయిపోతే సరదా కోసమా   జనం చిందులేసేదీ?! కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్ పబ్లిక్ బాధ!

కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ మాత్రమే చేసుకుని పరమపదిస్తే నరకంలో కూడా ఎవరూ కనీసం మడతమంచాలవీ వేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వాతలు అదనంగా  వడ్డిస్తారేమో కూడా.

అయినా బూతుపురాణాలన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగమహారాజులు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది! తిట్టుకు వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని కోట్లమందుంటారో  లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు మాత్రమే ప్రసాదంగా పెట్టించే  పై దేవుళ్ల మీద పెదవి విప్పకుండా    సాటి వాళ్లమనేగా మా మీదిన్ని సూటిపోటీ మాటలు?’ అని వాపోయే నేతలూ తక్కువేం లేరు మరి!

భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించే వేళ పశ్చిమం నుంచి బ్రహ్మముఖతః రౌద్రరసం ఉత్పన్నమయిందని శారదాతనయుడి 'భావప్రకాశం' వాదం. పోతనగారి ఆ ఆరభటీవృత్తి దక్షాధ్వర ఘట్ట ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే   కొత్త నేతల  హింస నచణ?  ఉత్తి పుణ్యానికే వేలెత్తి చూపటానికేనా పాపం ఓటుకు అన్నేసి వేలు దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిని మనసులో అడ్డగాడిదనుకుంటున్నా  ‘గాడ్..గాడ్” అంటూ కాళ్లట్టుకు వసుదేవుళ్లకు మించి  నేతలు వేళ్లాడేదీ?

భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు కదా  దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న! కోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?  

 

'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' న్నాడు .. 'కొత్త సిలబస్' అనే కవితలో బాలగంగాధర్ తిలక్.  వింటానికి బానే ఉంటాయ్ కవిత్వాలెప్పుడూ! కానీ  'కొత్త సిలబస్' ఈ కొత్త సెంచరీలో పాతబడిపోయింది.. ఇంకా పాతరేయద్దంటే ప్రగతి ఎట్లా?
బూతు ఉందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలమా? అని మనగలవమా? ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా బొంగరంలా గింగుర్లు కొట్టేదిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటేనే శనిగ్రహం  నిగ్రహం కోల్పోయేది!  స్వగృహం పడగ్గదిలోనయినా సరే చాటుగా ఓ నాలుగు మోటు మాటలు బై హార్ట్ చేసుకునే  బైటికి రావటం బుద్ధిమంతులకు  చాలా బెటర్  ఇప్పుడు! చక్రం తిప్పడమనే చాతుర్యం ఒక్క దాని  మీదే కసి పెంచుకుంటే చాలదీ అధికార కుతి కాలంలో! వక్రమార్గంలో అయినా సరే దానిని సంధించేందుకు ఒక్క క్షణం వెనుకంజ పడకూడదు. పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక పోతే పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితి లేదు ఏ స్థాయి నేతకైనా!.

 ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఏదో ''కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే అర్థాంతరంగా గండిపడిందంటారు.  నన్నెచోడుడూ కుమారసంభవం ఆరంభంలో  స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపించ బట్టే  యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్నాడని మరో టాక్! తిట్టు వల్ల త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన తెగినట్లు లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు  స్పష్టంగా లేకుంటే మాత్రంకుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత పడేదీ కాలంలో. నీతుల నెలాగైనా వెనక్కు తీసుకోవచ్చు గానీ, బూతు కూతలకా వెసులుబాటు లేదీ కాలంలో. పెదవి దాటితే పృథివి దాటినట్లే! ఆ హెచ్చరిక గుర్తున్న ఉత్తర కుమారుడెప్పుడూ  ఉత్తుత్తి బీరాల జోలికి పోడు!  ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతల్లో ‘మాస్టర్స్’ చేస్తే తప్ప సింగిల్ సీటున్న ప్రజాసేనలో అయినా టిక్కెట్ దక్కే అవకాశం నిల్!  

అన్నది అన్నట్లు అరక్షణంలో ప్రపంచం చుట్టొచ్చేసే జెట్ యుగం రోజుల్లో జాతి పిత  బాపూజీ మూడు కోతుల నీతిబోధనలు నమ్ముక్కూర్చుంటే  మాజీ ప్రధాని మన్మోహన్ జీ కెరీరుకు మల్లే చాప్టర్ పూర్తిగా పర్మినెంటుగా క్లోజ్! బూత్ పాలిటిక్స్ లో బూతు వద్దనుకోడం.. రామాయణంలో రామా అనే శబ్దం నిషిద్ధమనుకోడమంత అసంబద్ధం.

అనకా తప్పదు.. అనిపించుకోకా తప్పదు.

ఇంత మొత్తుకున్నా ‘తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా? అని  సందిగ్ధమా? ఛఁ! కొంత మందిని ఎన్ని తిట్టీ  నో యూజ్! ఇంకా తిడుతూ కూర్చున్నా  టైం వేస్ట్!

-కర్లపాలెం హనుమంతరావు

06 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

(సూర్యదినపత్రిక - ఆదివారం - వ్యంగం)

 

 

                           

Friday, February 5, 2021

నిజమే.. కానీ! : కథానిక కర్లపాలెం హనుమంతరావు

 

 విశ్వాసానికి తర్కానికి ఆమడ ఎడం

 *       *         *



ఆగకుండా కురుస్తోంది వర్షం. ఇవాళ్టికి మూడో రోజు.

పెనుగాలుల మూలకంగా  కరెంటు లేక.. మధ్యాహ్నం మూడింటికే సాయంత్రం ఆరుదాటినట్లుంది వాతావరణం.శలవులకని ఇంటికి వచ్చిన మూర్తికీ  హౌస్ అరెస్టు చికాకుగా ఉంది.

కాలుగాలిన పిల్లిలాగా లోపలికి, బైటికి తిరిగే కొడుకును చూసి చిన్నగా నవ్వుకుంది సుభద్రమ్మగారు. 'పట్నం కులాసాలకి అలవాటు పడ్డ ప్రాణం.  ముసలాళ్ళకి మల్లే ఇంటి పట్టునుండాలంటే చిరాకే మరి. పొద్దుపోయే సాధనాలేవీ కొంపలో లేకపాయ. బొమ్మలపెట్టే ఉన్నా ఏం లాభం..  కరెంటు లేకపోతే అది వట్టి బొమ్మపెట్టే. రేడియాలో బ్యాటరీలు లేవు. అవి కావాలన్నా ముందు పట్నందాకా పోయి రావాలి'.

" చదివిన పేపరే ఎన్ని సార్లు చదువుతారు గానీ అబ్బాయిని కూర్చోబెట్టుకుని కాస్తేదన్నా కాలక్షేపం  చెయ్యరాదూ! పొద్దు గడవక పాపం పిల్లాడెట్లా  గిలగిలలాడిపోతున్నాడో! మీకేదీ  పట్టదాయ!" అంటూ ముందు గదిలో పేపరు తిరగేస్తున్న సుందరయ్య దగ్గరికొచ్చి మొత్తుకుంది సుభద్రమ్మ

సుందరయ్య చదివే పేపరు పక్కన పారేసి "మూర్తీ!" అని లోపలికి కేకేసాడు.

మూడో పిలుపుకి గానీ మూర్తి ఊడిపడలేదు.

"చదరంగం ఆడదాముట్రా కాస్సేపు.. నీతో ఆడి చాలా కాలమైంది"  అనడిగాడు సుందరయ్య.

"ఒద్దులే నాన్నా! ఓడిపోతే చాలా ఫీలైపోతావు" అన్నాడు మూర్తి అదోలా నవ్వి.

"ఓడటమా? నీతోనా? అదీ చూద్దాం.. బోర్డు సర్దరా ముందూ" అన్నాడు సుందరయ్య తెల్లటి మీసాలు దువ్వుకుంటూ.

"వట్టి ఆటైతే బోరు. ఏదైనా పందెం కాయండి.  ఇంటరెస్టుగా ఉంటుంది" అన్నాడు మూర్తి కాయలు సర్దుతూ.

" పందేలు కాస్తావుట్రా.. ఇదెప్పట్నుంచీ? అంత పెద్దాడివై పోయావేం అప్పుడే!" అంటూ మందలింపులకి దిగబోయింది సుభద్రమ్మ. సుందరయ్యే అడ్డొచ్చాడు "అందులో తప్పేముందిలేవే. ఇంట్లో మనతోనేగా ఆడేదీ! కాకపోతే అబ్బాయిగారికీ సొంత సంపాదన ఎప్పణ్నుంచో.. ఆ సంగతి కనుక్కో ముందు. నా డబ్బులతో నా మీదే పందెం కాయడం.. ఆహా.. ఇదో కొత్త తరహా  పందెం కాబోలు ఈ కాలం పిల్లలకి!"

తండ్రి వెటకారం ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత పసిపిల్లాడేం కాదు మూర్తి. బెంగుళూర్లో థర్డియర్ ఎమ్.టెక్ చేస్తున్నాడు.

"డాడీ! మర్చిపోయారేమో కానీ.. మీరు నాకో బైకు బాకీ. పోయిన బర్త్ డేకే రావాల్సిన బండి.. పంటలు బాగా లేవని వాయిదా వేసాం. సుమారు ఆరవై వేలు. బెస్టాఫ్ త్రీలో నెగ్గండి.. ఆ డిమాండును స్వచ్చందంగా వదులుకుంటా.. ఓకేనా" అన్నాడు మూర్తి రోషంగా.

"సరేలేరా.. ముందు ఓడించు చూద్దాం" అని నవ్వుకుంటూ తన తెల్లబలగంలోని పావుని రెండు గడులు ముందుకు దూకించాడు సుందరయ్య.

వెంటనే మూర్తీ తన వంతు  ఎత్తువేసి తల్లి వేపు సాభిప్రాయంగా నవ్వుతూ చూసాడు.

మొదలు పెట్టడమే కష్టం. మొదలైంతరువాత ఆపడం అంతకన్నా  కష్టం.. చదరంగం తీరే అంత. స్వయంగా ఆడలేదు కానీ సుభద్రమ్మగారికి భర్త ఆటల పిచ్చితో పెళ్ళినాటినుంచీ పరిచయమే. ఆయన గవర్నమెంటు హైస్కూల్లో డ్రిల్లు టీచరు. ఈ మధ్యనే పదవీ విరమణ చేసాడు. తండ్రి తర్ఫీదులో మూర్తీ బాగానే పుంజుకున్నాడు. ప్రస్తుతం అతనే వాళ్ళ యూనివర్శిటీ చెస్ చాంపియన్.

ఐదు నిమిషాల్లోనే తండ్రీ కొడుకులిద్దరూ ఆటలో లీనమై పోయారు.

మరో మూడు గంటల దాకా ఇద్దరూ గుళ్లో విగ్రహాలే.

చీకటి చిక్కపడుతోంది.

'దీపాలు సిద్దం చెయ్యకపోతే  ఎంత రాద్దాంతమవుతుందో తెలుసు. పిల్లాడికీ, ఆయనకీ ఇలాంటి వేళ వేడి వేడి పకోడీలంటే ఎంతో ఇష్టం.'

ఆ తయారీకని వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్రమ్మగారు. హాల్లోనుంచీ తండ్రీ కొడుకుల మాటలు  వాన హోరు మధ్య వింటూ పనిలో పడిపోయిందామె.

"తోసి రాజు".. మూర్తి గొంతు.  సుందరయ్య గొణుగుడు.  ఏదో  'కాద'ని గట్టిగా వాదులాడుతున్నాడు కొడుకుమీద.

మొత్తానికి అబ్బాయి చేతిలో ఆయనగారికేదో గట్టి దెబ్బే తగిలినట్లుందీ! ఆ గిజగిజలు వింటుంటే అర్థవవడంలా!

మూర్తి కొత్త బుల్లెట్ మీద తండ్రి నెక్కించుకుని ఊరి మధ్యనుంచి దర్జాగా పోతున్నట్లు ఓ ఊహ తటాలుమని బుర్రలో మెరిసింది. సుభద్రమ్మగారి పెదాల మీద చిరునవ్వు విరిసింది.

'పందెం సంగతెలా ఉన్నా ఈ ఏడాది మాత్రం మూర్తికి తప్పకుండా బండి కొనివ్వాలి. ఒక్కగా నొక్క నలుసు. ఇంటికి వెలుగు.  పంటల బాగోగులతో నిమిత్తం పెట్టుకోకూడదీసారి. అంతగా ఐతే చేతి గాజులు అమ్మైనా సరే..'

హాల్లోనుంచి కొత్త గొంతు వినిపించే సరికి సుభద్రమ్మ ఆలోచనల చైన్ తెగిపోయింది.

చేస్తున్న పని ఆపి బైటికి తొంగి చూసింది.

 

*     *     *

ఎవరో కొత్త మనిషి. ఎప్పుడూ చూడని మొహం. ఆకారం ఒకింత వింతగానే ఉంది.

భుజం చుట్టూ కాషాయం రంగు శాలువా.. కిందేమో అబ్బాయి వేసుకునే లాంటి ఇరుకు ప్యాంటు.  భుజానికి ఓ జోలెలాంటిది వేలాడుతున్నది. సగం సన్యాసి.. సగం సంసారి లాగుంది వేషం.

గలగలా మాట్లాడుతున్నాడు.  'ఏట్లో పోటు మహా ఉద్దృతంగా ఉంది స్వామీ. అక్కడికీ మొండికేసి సగం దూరందాకా వెళ్లా . నా వల్ల కాలా. ఊళ్లోకి వస్తుంటే  మొదటగా మీ ఇల్లే కనబడింది. వాన వెలిసిందాకా తల దాచుకోక తప్పదు కదా! ఈ వరండాలో కూర్చుంటా.. మీకెవ్వరికీ ఇబ్బంది కలిగించను' అని చెప్పుకొస్తున్నాడు.

'పాపం' అనిపించింది సుభద్రమ్మ గారికి.  తలుపులు బిడాయించుకుని లోపల కూర్చుంటేనే చలిగాలికి వళ్ళు గజగజలాడి పోతున్నది. నడి వయసు మనిషికి.. ఎంత కష్టం.. రాత్రంతా బైట వరండాలో అంటే!'

వాకిలి తలుపులు బార్లా తీసుండటం వల్ల జల్లు లోపలికి కొట్టి గదంతా రొచ్చు రొచ్చవుతున్నది.

"మూర్తీ! ముందా తలుపులు వేసేయరా.. ఆయన్నొచ్చి లోపల  కూర్చోమను" అంది సుభద్రమ్మగారు వంటింటి గుమ్మాని కవతలే నిలబడి.

మూర్తి తలుపులు మూసి వచ్చి కూర్చున్నాడు.

వేసిన తలుపులకు పక్కనే గోడకు చేరగిలబడి కూర్చుండి పోయాడా కొత్త మనిషి. సుభద్రమ్మవంట పనిలో కెళ్ళిపోయింది.

ఆటాడుతూనే  ఆ మనిషితో మాటల్లో పడ్డాడు సుందరయ్య.

ప్రసంగ వశాత్తూ చాలా కొత్త విషయాలే తెలిసాయి. ఆ సన్యాసి పూర్వ నామం భైరవయ్యట. పొద్దుటూరు నివాసి. కాశీ విశ్వేశ్వరుని దర్శనానికని పోయి భార్యా బిడ్డలిద్దర్నీ గంగలో పోగొట్టుకున్నాట్ట. ఆ వైరాగ్యంతో చేసే బంగారం వ్యాపారం చాలించుకుని ఇట్లా దేశాలు పట్టి తిరుగుతున్నానని చెప్పాడు. 'కైలాసగిరి నుంచి కన్యాకుమారి దాకా తిరగని పుణ్యక్షేత్రం లేదు స్వామీ! మనశ్సాంతి కోసం  ఆరాటం. నీడలా వెన్నంటుండే ఇల్లాలు, బిడ్డా.. ఇద్దరూ ఒకేసారి  కనుమరుగయిపోయాక గానీ .. జీవితంలోని డొల్లతనం బైట పడలేదు." అంటూ ఓ  మెగా సీరియల్ కి సరిపడా కథాగానం చేసాడా సెమీ సన్యాసి.

ఇంట్లో వాళ్ళతోపాటే వేడి వేడి పకోడీలు  ఒక ప్లేటులో పెట్టిస్తే ఇంత వేదాంతమూ వల్లించిన సన్యాసి 'ఉల్లివి కదా వద్ద'నలేదు సరికదా.. ఒక్క పలుక్కూడా మిగలకుండా ప్లేటు మొత్తం నిమిషంలో లాగించేసాడు.

ఆరగింపుల పర్వం అలా కొనసాగిస్తూనే ఓ కంట తండ్రీ కొడుకుల ఆటమీద కన్నేసీ వుంచాడు.

ఒక రౌండు అప్పటికే మూర్తి గెలిచి ఉన్నాడు. రెండో రౌండు చివర్లోకొచ్చి అడ్వాంటేజిలో ఉన్నాడు. సుందరయ్య తన  రాజుని అన్ని రకాలా  ఇరకబెట్టుకుని తప్పించుకునే దారి తోచక తన్నుకులాడుతున్న తరుణంలో..

అమాంతం బల్ల ముందుకు దూకేసి " ఈ కుడి వైపు ఏనుగుని బలిచ్చేయండి స్వామీ.. రాజు తప్పుకొనే తోవ అదే ఏర్పడుతుంది!" అని సలహా పారేసాడు సన్యాసి. సుందరయ్య శషభిషలు చూసి తనే చొరవగా ఏనుగుని ఎదుటి పక్షం ఏనుగు ముందు మోహరించేసాడు. 'హుమ్' అని మూలిగాడు సుందరయ్య మరో మార్గమేదీ తోచక.

'ఇదొక ఎత్తా' అనుకుంటూ అమాంతం  ఆ బలగాన్ని తన ఏనుగుతో  ఎత్తికుదేసే ఉత్సాహంలో  తన రాజు అరక్షణ గోతిలో పడిపోవడం గమనించనే లేదు  మూర్తి కూడా.

ఏనుగు ఖాళీ చేసిన ఆ స్థానంలోకి వెంటనే మంత్రిని తోసేసి 'షా' అని సుందరయ్య బిగ్గరగా అరవడం.. మూడే మూడు నిమిషాలపాటు సంపూర్ణ ధ్యానంలోకి వెళ్ళినా లాభంలేక.. మూర్తి  పూర్తిగా చేతులెత్తేయడం.. క్షణాల్లో జరిగి పోయాయి.

ఆట గెలిచిన సుందరయ్య ఆనందం అంతా ఇంతా కాదు.

 ఆశ్చర్యంగా సన్యాసి వైపు చూసి "బంటును ఏనుగని.. మంత్రిని రాజని అంటుంటే   బేసిక్సు కూడా తెలీవని పొరబడ్డా స్వామీ! మీరు ఇంతాట పెట్టుకుని.."

తలడ్డంగా ఊపాడా సన్యాసి నవ్వుతూ " నిజంగానే నాకీ ఆట 'అ ఆ' లు కూడా తెలీవు స్వామీ! మీరాడే తీరు చూసి తోచిన సూచన చేసానంతే.  ఇదంతా నా గొప్పతనమా?.. దీనిది కానీ" అంటూ మెడలో వేలాడే గొలుసు వంక చూపించాడు.

మెరుపు తగ్గిన బంగారపు గొలుసది.  లాకెట్ స్థానంలో ఏదో ఎర్రరంగు రాయి వేలాడుతున్నది.

సుందరయ్య మొహంలో అయోమయం. మూర్తి మొహంలో చిరునవ్వు. సన్యాసి మెళ్లో బంగారపు గొలుసంటే నవ్వు రాదా మరి హేతుబద్ద్ధంగా ఆలోచించే బుద్ధిమంతుల కెవరికైనా! ఎంగిలి ప్లేట్లు ఎత్తు కెళ్ళటానికని వచ్చిన సుభద్రమ్మగారు  సన్యాసి మాటలు శ్రద్దగా వింటో అక్కడే నిలబడి పోయింది.

"ఇది వంటిమీద గుండెల్ని తాకుతున్నంత సేపూ మనసులో వున్నదంతా వాస్తవమై తీరుతుంది. ఆటలో మీకు సాయం చేసేటప్పుడు నా మనసులో ఉన్నది ఒక్కటే కోరిక  'ఈ అబ్బాయి ఎట్లాగైనా ఆ ఏనుగుమీద ఆశతో రాజు కాపు గడిని ఖాళీ చేసెయ్యాల'ని. మీ కళ్లతోనే  చూసారుగా.. ఏం జరిగిందో! అదీ ఈ రాయి మహత్యం. మీ ఇంటి గుమ్మం ముందు తడిబట్టలతో నిలబడున్నప్పుడు నన్ను లోపలికి 'రానీయాలా.. వద్దా' అని మీమాంస పడ్డారు   మీ అబ్బాకొడుకులిద్దరూ. ఎక్కడో లోపల వంటింట్లో పని చేసుకునే ఈ తల్లి పనిమాలా వచ్చి మీ చేత  లోపలికి పిలిపించింది. అదీ ఈ రాయి మహిమే"

మూర్తి మొహం చూసి మళ్లీ అన్నాడా సన్యాసి "  మీరు నమ్మడం లేదని తెలుస్తూనే ఉంది. మీ వయసుకది సమంజసమే! దీని శక్తిని మరో సారి నిరూపిస్తా..  చూడండి. మూడు రోజుల బట్టీ ఈ ప్రాంతంలో కరెంటు నిలకడగా ఉండటం లేదు కదా! "

" కొంప తీసి ఇప్పుడు గానీ కరెంటు పుట్టిస్తానంటారేమిటి?" అన్నాడు మూర్తి. ఎంత వద్దనుకున్నా గొంతులో హేళన దాగడం లేదు. పట్టించుకోలేదా సన్యాసి.

" శ్రీ మల్లికార్జున స్వామివారి సుప్రభాతం  చదువుకుంటూ పోతుంటా స్వామీ ఒక వరసలో.  ఈ లోపలొక  ఐదారు నిమిషాలపాటైనా విద్యుద్దీపాలు వచ్చిపోతే ఈ  రంగురాయిలో శివసత్తువ ఉన్నట్లే లెక్క" అంటో  చప్పట్లు కొట్టుకుంటో శ్లోకాలు చదవడం  ఆరంభించాడు.

"ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం

సింధూరపూరపరిశోభితగండయుగ్మమ్

ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ

మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్।

కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే

శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున

ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్।.."

ఆశ్చర్యం!

"..నమస్తే నమస్తే మహాదేవ శంభో! నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో!

నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో! నమస్తే నమస్తే నమస్తే మహేశ!.." అంటూండగానే తటాలుమని గదిలో దీపాలు వెలిగాయి.

ఎప్పుడు ఆన్ చేసుందో టీవీ స్పోర్ట్స్ చానెల్.. ఒన్-డే చివరి ఓవర్ లాస్త్ బట్ ఒన్ డెలివరీకని జడేజా స్టంప్స్ వైపు దూసుకొచ్చేస్తున్నాడు. చూస్తుండగానే అతగాడు విసిరిన బాలుని  గేల్ ఎదురెళ్లి బలంకొద్దీ బాదడం.. గాల్లోకి లేచిన బంతి సరిగ్గా బౌండరీ లైనుకి ఇంచికి ఇటుగా నిలబడ్డ ఫీల్డరు పట్టిన దోసిట్లో.. పడినట్లనిపించడం! స్లిప్పయినట్లూ ఉంది.. 'సిక్సర్'అని  కామెంటేటర్ల అరుపులు వినిపించడం. గ్యాలరీ జనాల గోల మధ్య .. విన్ అయిందో విండీసో.. చాంపియనయిందో ఇండియన్సో.. క్లియరయే లోపలే.. మళ్ళా ఠప్పుమని కరెంటు పోనే పోయింది.

పూర్తిగా మతి పోయినంత పనయింది సుందరయ్య దంపతులకు.

మూర్తీ ఆలోచనలో పడ్డాడు.  పూర్తిగా నమ్మడానికి హేతువాదం అడ్డొస్తున్నది.

"నాకంతా అర్థమవుతూనే ఉంది. నీకింకా పూర్తివిశ్వాసం కలగనే లేదు కదా స్వామీ.. పోనీ వదిలేయండి!"  అన్నాడా అర్థసన్యాసి అదో రకమైన నిర్వేదంతో.

సుభద్రమ్మగారు అప్పుడే  విస్తరినిండా భోజనం తెచ్చి సన్యాసి ముందుంచింది.  "తల్లీ! మీరింత అభిమానం చూపిస్తున్నారు. చీకటని కూడా చూడకుండా  ఓపిగ్గా ఇన్నేసి అనుపాకాలు కమ్మంగా చేసి తెచ్చారు.  తినే ప్రాప్తం  ఈ నోటి కుండద్దూ?" అన్నాడు అదే మూడ్లో.

"ముందు తినండి స్వాములూ! ఇంటికొచ్చిన అతిథిని ఖాళీ కడుపుతో ఉంచి మేం మాత్రమే భోంచేయడం.. అదేమంత మంచీ మర్యాదా !"అన్నాడు సుందరయ్య. అప్పటికే అతనికా సన్యాసిమీద అపరిమితమైన గురి ఏర్పడిపోయుంది.

పెదవి విరిచాడా సన్యాసి " అభోజనం రాసిపెట్టుంది స్వాములూ ఈ పూట. ఒక్క నాకే కాదు.. ఇంటిల్లిపాదికీ. అమ్మా! ఒక్కసారి మీరా  లాంతరు వంటింటిదాకా పట్టుకెళ్లి  పొయ్యి మీది చూడండి. మీకే అర్థమవుతుంది జరిగిన అనర్థమేమిటో?"

వింత పడుతూ దీపం బుడ్డితో లోపలకి వెళ్ళింది సుభద్రమ్మగారు. అక్కడినుంచే ఒక్క గావుకేక వినబడింది. కంగారుగా లోనికి పరుగెత్తికెళ్ళిన మూర్తి.. సుందరయ్యలకు  గిన్నెలో అన్నం మెతుకులతో సహా ఉడికి ఉబ్బిన ఇంత లావు బల్లి కనబడింది. వళ్ళు జలదరించింది అందరికీ.

"ఇదీ తమరి రంగురాయి మహత్తేనంటారా మహానుభావా?"అనడిగాడు మూర్తి సాధ్యమైనంత వెటకారంగా. వెళ్ళిపోయే మూడ్ లో జోలె సర్దుకుంటున్న సన్యాసి నుంచి బదులే లేదు.

అప్పటికి వర్షం కాస్త తగ్గు ముఖం పట్టింది.

లేచి నిలబడి సుందరయ్యకు నమస్కారం చేసి అన్నాడు సన్యాసి" దారి ఖర్చులకు చేతిలో తైలం బొత్తిగా లేదు. ఈ గొలుసు తమరి దగ్గరుంచుకుని కాస్త నగదు ఇప్పిస్తారేమోనని ఆశతో వచ్చాను. అసలు మీ ఇంటి తలుపు తట్టిన కారణం కూడా  అదే స్వామీ!"

వెంటనే అందుకున్నాడు మూర్తి "అదేం.. మీ దగ్గరే మహత్తుగల  రాయుందిగా! కావాల్సినంత సొమ్ము తమరే సృష్టించుకోవచ్చు కదా?"

సన్యాసి మొహంలో చిరునవ్వు"ఈ రాయికి మహత్తుందన్నానే కానీ.. శూన్యంలోంచి శివలింగాలనీ.. గాల్లోంచీ కరెన్సీ నోట్లను రాలుస్తుందనన్నానా?   ఆ తరహా మహత్తే గనక ఈ రాయికుండుంటే ప్రాణానికన్నా మిన్నగా ప్రేమించిన వాళ్లను గంగ్గమ్మతల్లి ఒడికి వదిలి వస్తానా? వ్యాపారం వద్దని వదిలేసుకునే నాటికి నా స్థిర చరాస్తుల విలువ సుమారు పది కోట్లకు పైమాట. కొంత ఊరి అనాథ శరణాలయానికి, కొంత చెన్నకేశవస్వామివారి ఆలయానికి  రాసిచ్చేసాను. ముందే చెప్పాను.. నేనూ మీ అందరిలాంటి వాడినే అని.   రాయుండట మొక్కటే  నా ప్రత్యేకత. తాకట్టు వ్యాపారం చేసే రోజుల్లో నా చేతికొచ్చిందీ గొలుసు.  కుదవబెట్టిన మనిషే స్వయంగా చెప్పుకొచ్చాడు  దీని మహిమలు. నమ్మలా అప్పట్లో. విడిపించుకోడానికి అతగాడు మళ్ళీ ఎందుకు రాలేదో.. తరువాత తరువాత  గానీ తెలిసిరాలేదు. గంగపాలయినప్పుడిది నా భార్య మెడలోనే ఉంది. తన గుర్తుకోసమనే ఇంతకాలం నావెంట తిప్పుకుంది. మామూలు బంగారమని  చెప్పి  వదిలించుకోవడం తేలికే. నమ్మి కొన్నవాడిని మోసగించినట్లవుతుందది. ఉన్న విషయమేదో చెప్పి.. దృష్టాంతాలు చూపిస్తున్నదందుకే. మీ లాగానే చాలామంది  కాశీ మజిలీ కథలని కొట్టిపారేసారు.  ఈ పెద్దయ్యలాగా  కాస్త నమ్మకం కుదిరినవాళ్ళు గ్యారంటీ అడిగారు.   దారి ఖర్చులకోసం రొక్కం అత్యవసరం పడింది. కనకే ఇంతలా మీకు చెప్పుకోవాల్సొస్తోంది. ఆ పైన మీ ఇష్టం. నా ప్రాప్తం" అంటూ సుభద్రమ్మగారికి నమస్కారం చేసి వీధి వాకిలి వైపుకి అడుగులేశాడు సన్యాసి.

మూర్తి ఏదో అనబోయాడు కానీ.. 'వద్దన్న'ట్లు వారించింది సుభద్రమ్మ గారు. 

 

వీధిలో దాకా  సన్యాసి వెనకనే వెళ్లొచ్చిన  సుందరయ్యను చూసి "పాపం.. ఆయన చేతిలో కాస్తేదన్నా పెట్టకపోయారా?" అంది సుభద్రమ్మగారు సానుభూతితో.

"ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాలేవే. పోతూ.. పోతూ..  తొందరలోనే మనకు పెద్ద మొత్తంలో ధనప్రాప్తి  కలగబోతున్నట్లు చెప్పాడోయ్" అన్నాడు సుందరయ్య  గుప్పెట్లోని గొలుసును హుషారుగా ఊపుకుంటో.

"పెద్ద మొత్తమంటే?" సుభద్రమ్మగారి ఆరా.

"సుమారు ఐదారు లక్షలుట" సుందరయ్య గొంతులో ఉత్సాహం.

కనుబొమలు ముడిపడ్డాయి అప్రయత్నంగా మూర్తికి. "ఆ సన్నాసి మాటకూ నా బైకుకూ ముడిపెట్టొద్దు డాడీ" అన్నాడు  హెచ్చరికగా!

'చూద్దాం లేరా బాబూ! మూడో రౌండు వేద్దాం పట్టు.. అమ్మ మళ్లీ అన్నం వండటానికి ఎటూ టైం పడుతుంది!" అన్నాడు సుందరయ్య.

" మూడ్ పోయింది డాడీ.." అని లేచి గదిలోకి వెళ్ళిపోయాడు  మూర్తి.

"పిల్లాడినింక  వదిలేద్దురూ!  రేపు తెల్లారగట్లే వాడి ప్రయాణం. " అంది సుభద్రమ్మ గారు వంటింట్లోకి పోతూ.

"అయ్యో.. గ్యాసూ ఇప్పుడే ఐపోవాలా!" అని  లోపల్నుంచీ ఆమె అరుపు.

సన్యాసి చెప్పిన 'అభోజనం' గుర్తుకొచ్చింది సుందరయ్యకి.

 

***

తెల్లారు ఝామునే వెళ్ళి పోయాడు మూర్తి.

పట్నం దాకా తండ్రి తోడొస్తానంటే " రోడ్దంతా రొచ్చుగా ఉంది.. నా తంటాలేవో నేను పడతాగానీ పెద్ద మొత్తాలొస్తే మాత్రం  కాల్ చెయ్యండి. కొనాల్సిన లిస్టు చాలా పెద్దదే ఉంది నా దగ్గర " అని  హాస్యాలు పోయాడు మూర్తి  పోతూ పోతూ.

"ముందు రానివ్వరా బాబూ.. చూద్దాం" అని వద్దు వద్దంటున్నా కొడుకు మెళ్ళో రంగురాయి గొలుసు వేసేసాడు  సుందరయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ.

మూర్తి తీసేయబోతుండే అడ్డుతగిలింది తల్లి " బోసి మెడతో తిరగడం ఫ్యాషనా ఏందిరా? ఉండనీయ్ మా తృప్తి కోసమన్నా" అంటో.

తల్లికి కష్టం కలిగించడం ఇష్టం లేక గమ్మునూరుకుండిపోయాడు మూర్తి.

 

పట్నం బస్సు స్టాండు నుంచీ కాల్ చేసాడు మూర్తి " రైల్వే లైన్లు సరిగ్గా లేవంటున్నారు. అన్ని బళ్లూ ఆలస్యంగా నడుస్తున్నాయి. అదృష్టం బాగుండి వోల్వా బస్సొకటి దొరికింది నాన్నా! దాంట్లో పోతున్నా!  సిగ్నల్సు సరిగ్గా లేవు.   మధ్య్లలో  రెస్పాన్సు లేకపోతే  కంగారు పడద్దు. చేరంగానే మళ్లీ కాల్ చేస్తా" అన్నాడు

అదే మూర్తి నుంచి తల్లిదండ్రులకు  వినిపించిన చివరి మాటలు.

 

మూర్తి ఎక్కిన వోల్వా బస్సు దారిలో ఏదో కల్వర్తు దాటుతూ కాలవ నీళ్లల్లో జారి  పడింది. అధునాతనమైన బస్సు. లోపల్నుంచీ అన్ని డోర్లు ఆటోమెటిగ్గా లాకయ్ ఉండటం.. యమర్జన్సీలో అన్ లాకవాల్సిన మెకానిజం అట్టర్ ఫ్లాపయిపోవడం వల్ల..   అంత అందమైన వాహనమూ ఎక్కిన ప్రయాణీకులందరి పాలిట సామూహిక జలసమాధిగా మారి కూర్చుంది.

రకరకాల కారణాలతో  చనిపోయిన నలభై మందిలో మూర్తీ ఒకడు. అతని మృత్యుకారణం మాత్రం చాలా ప్రత్యేకం.

మెడలోని గొలుసు సీటురాడుకు చిక్కుబడిపోయి  రంగురాయి అంగిటికి అడ్దుపడటం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది.

లకీగా బస్సు ఓ ప్రముఖ నేతాశ్రీ ట్రావెలింగు ఏజెన్సీది. 

'ఎన్నికలు ముంచుకొస్తున్నప్పుడే ఈ దారుణం జరగడం ఖర్మ. జరిగిన  నష్టమేదో అణాపైసల్తో సహా   ఎలక్షన్లయినాక వర్లుకోవచ్చు. ముందు.. పార్టీ టికెట్టు పోకుండా చూసుకోవడం ముఖ్యం.  మీడియా ఆర్బాటం.. మృతుల సంబంధీకుల  ఆగ్రహం చల్లబడాలంటే  ఎవరూ ఊహించని భారీ మొత్తం నష్టపరిహారం కింద అచ్చుకోవడమే ఉత్తమం' నేతాజీ వ్యూహం ఆ లైనులో సాగబట్టి సహబాధితులందరికి మల్లే కొడుకు దుర్మరణానికి నష్టపరిహారం కింద సుందరయ్య దంపతులకు అందిన మొత్తం అక్షరాలా ఐదు లక్షలు!

సన్యాసి మాటలు అక్షరాలా సత్యమయ్యాయి..నిజమే!

 

కానీ…!

 

***

హామీ పత్రంః 'నిజమే.. కానీ' అనే ఈ కథానిక నా స్వంత రచన. దేనికీ అనువాదం కానీ, అనుసరణ కానీ కాదు. అప్రచురితం. ఏ పత్రికలోనూ పరిశీలనలో లేదు-అని హామీ ఇస్తున్నాను.

ఇట్లు

గుడ్లదొన సరోజినీదేవి

12-12-2014

 

రచయిత్రి చిరునామాః

గుడ్లదొన సరోజినీదేవి

ఫ్లాట్ నెం# 404, శ్యామ్ కామదేను అపార్టుమెంట్ స్,

మోతీనగర, హైదరాబాద్- 500 018

ఈ-మైల్ : gsdevi55@yahoo.co.in

                Karlapalwm2010@gmail.com

              

               Phone: 8142282178

                             8142283676

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...