Saturday, March 13, 2021

ఆచార్యదేవోభవ! ఉపాధ్యాయ దినోత్సవం - కర్లపాలెం హనుమంతరావు

 







 'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా

యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు







కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.

 గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.

క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

 గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు,

గాయత్రి ఉపదేశించినవాడు,

వేదాధ్యయనం చేయించినవాడు,

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,

పురోగతి కోరేవాడు,

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు,

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,

మోక్షమార్గాన్ని చూపించేవాడు

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.

దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.

(ఈనాడు, 05-09-2009)

 

పశురాజ్యం పార్టీ వర్ధిల్లాలి! – సరదాకే -కర్లపాలెం హనుమంతరావు

 


'' ఫర్ 'ఏపిల్' ఏంటి..విడ్డూరంగా! '' ఫర్ 'ఎనిమల్'..'బి' ఫర్ బఫెల్లో.. 'సి' ఫర్ కౌ..'డి' ఫర్ డాంకీ..ఇలా ఏవైనా జంతువుల పేర్లు పెట్టుకోవచ్చుగా ! తమరి ఆత్మ గౌరవానికి భంగమా?

అబ్బో! 'మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఏనిమల్' అని మళ్లీ మీరేగా లెక్చర్లు దంచేదీ! అంటే 'ఏనిమల్ ఈజ్ ఆల్సో  ఏ సోషల్ మ్యాన'నేగా అంతరార్థం?

ఎదుకో ఆ చిరాకూ? తమరు పడీ పడీ  దణ్ణాలూ దస్కాలూ పెట్టుకునే దేవుళ్ళందర్నీ వీపుల మీదెక్కించుకుని ఊరేగించే దెవరూ? మేం కాదూ! ఆదిదేవుడికి వాహనం మా మహానంది. ఆ నందిని బంగారంతో తాపడం చేసందిస్తే సరి.. మా షోగ్గా  షోకేసుల్లో దాచేసుకుని తెగ మురిసానందిస్తారు! నిజం నందిని మాత్రం పంది కన్నా హీనంగా ఇంటెనకాల గొడ్లచావిట్లో మురికి గుంటల మధ్య బందీ చేస్తారు. దాని నోటి కాడ గడ్డిని మీరు మేస్తారు. పేరు వినీ వినగానే తమరికి ముచ్చెమటలు పోస్తాయే..   మృత్యు దేవత యమధర్మరాజా వారి వాహనం ఏదీ? ఎనుబోతు. కాలయముణ్ణి చూస్తే కాళ్ళు వణుకుడూనూ.. మా దున్నపోతును చూస్తే చిన్న చూపూనా! అందుకే  మీ  మనుషులందరిదీ ద్వంద్వ నీతనేది.

మీకన్నా మేమెందులో తీసిపోయామో! కులాలు, మతాలు, రంగులు, హంగులు అంటూ మీలో మీకే ఎన్న్ని అంట్లూ..సొంట్లు! పేరుకే మా నెత్తిమీదవి కొమ్ములు. అసలు కుమ్ముళ్లన్నీ రక రకాల  పార్టీల పేర్లతో  మీవి. పైపెచ్చు మీ రొచ్చు కీచులాటల మధ్యలోకి ఏ సొమ్మూ సంబధం లేకపోయినా 'ఎద్దులూ.. మొద్దులూ..దున్నపోతులూ.. గొడ్దుమోతులూ' అంటో  మా పేర్లు లాక్కొచ్చి  తిట్లూ.. శాపనార్థాలా!

మా సాయం లేకపోతే మీ వ్యవసాయం క్షణం ముందుకు సాగదు. మేం కాడిని వదిలేస్తే  మీ బండి గజం ముందుకు నడవదు. మా దూడల్ని  దూరంగా నెట్టేసి మా పాలు మీరు కాఫీలు టీనీళ్ళకు వాడేసుకుంటున్నా.. పోనీలే పాపం.. మీ పాపానికి మీరే పోతారని చూసీ చూడనట్లు పోతూ ఉంటే..  మా పోతులంటే మీకింత అలుసా?

 మా గొడ్డూ గోదా గాని రోడ్డు కడ్డం పడితే మీ బుల్లెట్ ప్రూఫులూ, బుగ్గ కార్లూ ఒక్కంగుళం ముందుకు జరగ్గలవా? తోక ముండిచిందాకానే మేం గంగి గోవులం.  లిక్కరు పాకెట్లకు .. చిల్లర నోట్లకు.. కుక్కల్లా తోకూపే మీ బక్క ఓటర్లం కాం మేం! చెత్తనేతల మీద విసుగెత్తున్న  జనం విసిరే పాత జోళ్లలోనుంచీ మా నిరసనలు  వినిపిస్తునే ఉంటాం.

అక్కరయిన దాకా మాకు దణ్నాలు దస్కాలు. అక్కర తీరినాక  గొడ్దుమోతులని ఎకసెక్కాలా? పుష్టిగా ఉన్నంత కాలం మా పుష్టభాగాల క్కూడా పూజలూ.. పునస్కారాలు. కాస్త ఈడిగిల పడితే చాలు కబేళాలకు ఈడ్చి పారేయడాలా?! మీ కడుపుకిన్ని తిండి గింజ లందించే అన్నదాతలమే.. మానోటి కాడి ఎండుగడ్డి కాడ క్కూడా పాలుమాలుతారా? నేతంటే మోతగా మేత మేసేవాడనేనా మీ అర్థం? మా కాలి గిట్టల్నుంచీ నెత్తిమీది కొమ్ముల్దాకా దేన్నీ వదిలి పెట్టరా  మీరు! అచ్చమైన  పచ్చి వ్యాపారానికి అచ్చుపోసిన శాల్తీలు మీరు.

సిగ్గు ఎగ్గు లేకుండా నడి బజారులో మీరు నిలబెట్టే  బడిత బొమ్మల మానం పేడముద్దల మాటున దాచి కాచి కాపాడే శ్రీకృష్ణ పరమాత్ములం మేం. మేం నోరు చేసుకోబట్టే  మీ వీధులు చెత్తకుండీల కన్నా మెరుగ్గా ఉంటున్నాయి. బ్రిటన్ మహారాణి విక్టోరియా మ్యాడం కన్నా ఎక్కువ గ్లామరున్న మూగ జీవాలం మేం. మీ అభిమాన నటవిరాట్టులు గ్రాఫిక్సుల్లోఎన్ని  కుప్పిగంతులు వేసినా రావడం లేదు హిట్లు. మేం మాత్రం ఇలా కాస్త తోకలు  కదిలించినా చాలు చప్పట్లే చప్పట్లు. కోట్లే కోట్లు.

మాతోనే మీకు  అక్కర తప్ప మీరు తిని పారేసిన అరటి తొక్కతో కూడా మాకు  అవసరం పడదు. ఎన్నికల్లో మీకు మేమే పార్టీ గుర్తులం. మీ ఎన్నికల  ప్రచారాల హోరుకీ  మళ్ళీ మేమే ఆసరా. మీరు బాదే డోళ్ళు చచ్చినాకా మాట్లాడే మా వంటి తోళ్ళ నోళ్ళే. మీ మీ అధిష్ఠానాల ముందు మీరు ఊదే బూరాలు మా కొమ్ములు విజయ గర్వంతో చేసే హాహాకారాలు. మీకూ  మాకూ తేడా ఏముంది?మీరు చేతుల్తో వీపులు తోముకో గలరు. మేం తోముకోలేం. మేం తోకల్తో ఈగలు తోలుకోగలం. మీరు  తోలుకొంటారా?

ప్రజాసేవలో మేము మీరెన్నుకున్న ప్రతినిథులకన్నా ఎన్నో రెట్లు మెరుగు జీవులం. దున్నేకాలంలో దూరం పోయి.. కాసే కాలంలో కోడవలి తెచ్చే భడవలం కాం మేం. మాతో మీకు వారసత్వం పేచీ రాదు. కుంభకోణాల గోల ఉండదు.

పశువులనీ.. మనుషులనీ విభజించి చూస్తున్నారు చూడండీ..అదే సబబైన పద్దతి కాదన్నదే మా ఆవేదన. జనాభా లెక్కలు తీసినప్పుడల్లా 'ఓహో వందా పాతిక కోట్లు దాటేసిందండోయి  దేశ జనాభా'అంటో  ఒహటే దండోరా. అందులో అందరూ మనుషులే ఉన్నారా? నిజాయితీగా లెక్కలు తీసి చూడండి! మెజారిటీ మా పశువుల జాతిదే!  మీ మందల్ల్ల్లో మా పశువులెన్ని కలిసున్నాయో లెక్క లు తేలాలి ముందు. మా పోరాటం ఆ దిశగా సాగేందుకే ఈ మా కొత్త పార్టీ. దేశ జనాభాలో మెజార్టీ మా పశువులే అయినప్పుడు మీ  పాడు మనుషులకేల ఊడిగం చేయాలన్నది మా వాదన.

ఒకప్పటి ఉత్తర ప్రదేశ్ అమాత్యవర్యులు అజం ఖాన్ గారి రాంపూర్  బందిల దొడ్దినుంచి ఈ మధ్యనే స్వేచ్చా ప్రపంచంలోకొచ్చి పోయాయి  ఏడు ఎనుబోతులు. ఆ చైతన్యమూర్తులు స్ఫూర్తితోనే  మేమూ అర్జంటుగా ఓ ఫ్రంటును కట్టే ఏర్పాట్లలో ఉన్నాం. దేశ జనాభాలో   దామాషా ప్రకారం చూసుకున్నా అధికార పీఠం మా పశుజాతికే దక్కడం న్యాయం. శతాబ్దాలు గడిచి పోతున్నా మా పశుభాషకు ఇంకా అధికార హోదానే దక్క లేదు. 

ఏ సేవలూ అందించకుండానే ఎన్నికల్లో నిలబడి ఎందరో  ప్రజానాయకులుగా తయార వుతున్నారు. మేం మాత్రం ప్రజాసేవలో  ఎవరికి తీసి పోయాం?  తేనీరు అమ్మే మనిషి ప్రధాని పదవికి పోటీ పడుతుండగా లేనిది.. తేనీటిలోకి పాలందించే పశువులం అధికారంలో మా పాలు కోరుకోవడంలో తప్పేముంది? రాబోయే ఎన్నికల్లో మా  పశుజాతి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇదే తగిన అదనని అభిప్రాయ పడుతున్నాం.

ఇప్పుడున్నవన్నీ నకిలీ పశుప్రభుత్వాలు.అసలైనపశువుల పాలనెలా ఉంటుందో ఒక అవకాశమొస్తే రుచి చూపిస్తాం.

ఇల్లంతా యథేచ్చగా  కలాపులు చల్లుకోవడానికి  గోమయం ఉచితంగా సరఫరా చేస్తాం. ఏడాదికి వంద పిడకలు సబ్సిడీ ధరలో ఆడపడుచులకు అంద చేస్తాం. పిల్లా జెల్లాకు నీళ్లు కలపని పాలు గొడ్లు ఇళ్లముందే  పిదికిచ్చి పోయే ఉచిత  పథకాలు ప్రవేశ పెడతాం. ఇంటింటికీ ఒక 'స్టేటాఫ్ ఆర్ట్' గొడ్ల చావిడి.. పండగ రోజుల్లో పుణ్య సంపాదనకు భక్తుల సన్నిధానికే సుష్టైన పుష్టభాగాలున్న గోదేవతల తరలింపు ఇవీ మాకు మాత్రమే సాధ్యమయిన సేవా పథకాలు. గద్దె నెక్కే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి! మా గొడ్డు గోదా నుంచి వీలైనంత సహకారం రాబట్టి ప్రజాసేవను ఇంకెన్ని విధాల మెరుగు పరచాలో పశుప్రేమికులనుంచి సూచనలు కోరి అమలు చేసే  దిశగా మరింత అంకితభావంతో మా వంతు ప్రయత్నాలు విధిగా చేస్తాం.

చెత్త నేతల పాలనతో విసుగెత్తి ఉన్న ఓటరు మహాశయులారా! 'ఏమో.. దున్న ఎగరా వచ్చు!' అన్న ఒకే  ఒక్క నమ్మకంతో   మాకూ ‘ఒక  అవకాశం’ ఇచ్చి చూడమని ప్రార్తన!

అంబే.. పశు రాజ్యం పార్టీ!  అంబే.. అంబే!

 దున్నపోతుల ప్రభుత్వం! అంబే.. అంబే .

ఎనుబోతుల నాయకత్వం! అంబే..అంబే!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు- దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)

విండో షాపింగ్ - చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు



 

Friday, March 12, 2021

విచ్చలవిడితనానికా పచ్చలపతకాలు! -వ్యంగ్యం -కర్లపాలెం హనుమంతరావు

 



 

‘రామా!’ అన్నా ‘రా.. అమ్మా!’ లాగా అవిపిస్తోందీ మధ్యన మరీను! రాజకీయాలల్లో  సూత పురాణాలెలాగూ వినిపించడం లేదిప్పుడు.. బూతు పురాణాలే ఎక్కువై పోయాయి.. ఖర్మ! ‘బూత్’ స్థాయినుంచీ ఎదిగొచ్చే నేతలు బూతులు కాక నీతులు వల్లిస్తారా? అని ఎదురడిగే బుద్ధిమంతులకో పెద్ద నమస్కారం.

 జాతికి నీతులు చెప్పే రామాయణమే వాల్మీకులవారి వ్యాకులం నుంచి పుట్టిందంటారా! పరమ శాంత గంభీర మూర్తి రామచంద్రుడి పక్కనున్నదే సాక్షాత్తు పోతపోసిన కోపమూర్తి లక్ష్మణుడని దబాయింపా! మరో నమస్కారం!

 కంసుడి హింస లేకుంటే కృష్ణావతార కష్టం విష్ణుమూర్తికి తప్పుండేది కదా? సత్యభామ పువ్వుకోసం అలా అలక్క పోయుంటే కృష్ణభక్తి ప్రకటనకి  ఆస్కారముండేదా? అని వాదమా? తమరి వితండానికో దండం!

 అలుగుటయే యెరుంగని  ఆ మహామహితాత్ముడు ధర్మరాజే అలా అలవోగ్గా అలగ్గా లేనిది ఉప్పు కారాలు పప్పుబెల్లాల్లా మెక్కే నోళ్ళను మన మాజీ ప్రధాని మన్మోహన్ గారి స్టైల్లో మౌనంగా పడుండమనడం న్యాయమా? అని దబాయించే వారికైతే జవాబే లేదింక.

భగవంతుణ్ణి చేరేందుకు భక్తి కన్నా వైరమే దగ్గరి దారని గదా సుందోపసుందులలా రాక్షస మార్గం ఎంచుకుంది? పదవంటే దైవం కన్నా మిన్నగా భావించే  నేతలు ఎందరో. మరా రాక్షసతాతల అడుగుజాడల్లో నడిచినా ఆగడమేనా? అని గదమాయించేవారి నోరు మూయించే కన్నా మన  చెప్పుతో  మన చెంపల్నే మొత్తుకోవడం ఉత్తమం.

కోపతాపాలివాళే ఏమన్నా కొత్తగా పుటుకొచ్చాయా? తారకాసురుణ్ణి చంపే వీరకుమారుడి కోసం మారుడు పాపం ఎంత చేసాడూ? వట్టినే కాలుడి కంటిమంటకు కాలి బూడిదై పోలేదూ? సీతా స్వయంవరణమేంటి? మూలనున్న శివధనుస్సుకు మూడటం ఏమిటి?

కాలికి గుచ్చుకున్న ముల్లుకేమన్నా ప్రాణముందనా.. కసిగా కాల్చి మరీ కోకోకోలా మాదిరి  చాణక్యుడలా కడుపులో పోసుకుందీ? బోజనాలకి సరిగ్గా పిలవలేదని ఒహళ్ళూ, దండిగా సంభావనలు అందలేదని ఒహళ్ళు.. ఒళ్ళూ పై తెలీకుండా సిల్లీ కారణాలతో  పిల్లినో పిచ్చుకనో అడ్డం పెట్టుకుని  అడ్డమైన   శాపానర్థాలు పెట్టిన పుణ్యమూర్తులు పుట్టలు కొద్దీ ఉన్న గడ్డా కాదా మనది? అని గుడ్లెర్ర చేసే పెద్దలకు బుద్దులేం చెబుతాం?

దూర్వాసులు, పరశు రాములు, కన్నబిడ్డలని కూడా చూడకుండా అడుక్కు తినమని తిట్టిపోసిన విశ్వామిత్రులు.. వీళ్ళంతా.. అంటే కళ్ళు పోతాయేమో గానీ.. అవతార పురుషులు.. మహర్షులూనా? అవసరార్థం ఏదో రాజకీయంగా పట్టుకోసం తిట్టిపోసుకునే మేం తుంటరి మూకలమూనా? అని హంటర్తో కొట్టినట్లు మరీ గదమాయిస్తుంటే మన  కంటివెంట నీళ్ళెలా రాకుండా ఉంటాయి చెప్పండి!

అమృతంకోసం పాలసముద్రం చిలికితే హాలాహలం పుట్టింది ముందా పై లోకంలోనే. ఆ గరళం గొంతులో వంపుకోడానికి  గంగాధరుడున్నాడు అప్పట్లో. ఇప్పటి ఈ శబ్దకాలకూటాన్ని మింగి ఆ హరుడైనా ఎంతవరకు  హరాయించుకోగలడో అనుమానమే మరి!

శిశుపాలుడు  గోపాలుణ్ణి తిట్టిపోసాడంటే అర్థం చేసుకోవచ్చు. మరి గుడి కట్టి గొప్ప రామదాసుణ్ణని చెప్పుకొన్న కంచెర్ల గోపన్నా పడతిట్లనే ఎందుకు నమ్ముకున్నట్లో? కీర్తినిందలు పడని ఒక్క దేవుడైనా తెలుగునాడుల్లో ఉన్నాడా? పరమాత్ముడంటే గుళ్ళో విగ్రహంమల్లే ఏవీ చెవిబెట్టుకోడు. మనిషి పాపాత్ముడే! రెండు చెవులు దొప్పల్లా విచ్చుకుని చచ్చాయే! కాబట్టే సీసం కోసం ఈ వెదుకులాట! చెవుల్లో పోసుకుని ప్రశాంతంగా రోజులు వెళ్ళబుచ్చేకన్నా గొప్ప అదృష్టం లేదు ప్రస్తుతం.

 ఎండకూ వానకూ  చలికీ తట్టుకుని గంటలకొద్దీ ఓపిగ్గా వరసలో నిలబడి  ఓట్లేసి మన మాటగా నేతల్ని చట్టసభలకు  పంపిస్తున్నది ఓ పనై పోతుందిలెమ్మనైతే కాదు గదా! జనం మంచి చెడు, కష్టం సుఖం వివరంగా చర్చించి.. బతుకులు సుఖంగా వెళ్ళమారే దారులేవో కనిపెడతారనేగా దొరలు! 

 చేజేతులా చెడ్డపేరు తెచ్చుకుంటున్నారని జనం ఇప్పటికే  చెవులు కొరుక్కుంటున్నారు. కొరుకుళ్ళు పెరక్క ముందే పెద్దలు నోళ్ళు అదుపులో పెట్టుకోవడం  వాళ్లకే మంచిది.  ముక్కుమీద కోపం మగువల ముఖాలకైతే   అందమేమో గానీ.. ప్రజాపతినిధులకు మాత్రం ప్రతిబంధకమే.

 తన కోపమే తన శత్రువు. చిన్నపిల్లలకేనా.. ప్రజాస్వామ్యాన్ని చిన్నబుచ్చే  పెద్దలకూ పనికివచ్చే నీతి సూత్రం బాబూ ఇది!  ఆవేశంలో ఉన్నప్పుడేవీ  కనిపించడు గాని అవకాశం దొరికినప్పుడు మాత్రం చావు దెబ్బ కొట్టకమానడా శత్రువు.

 ప్రతిపక్షమంటే ప్రజల తరుఫున చట్టసభలకొచ్చే చుట్టం. అధికార పక్షమంటే జనామోదం పరీక్ష నెగ్గిన పట్టం . ఎంత పునీతయి అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా  సీతమ్మవారు  ఓ తాగుబోతు మనిషి మతిలేని మాటలవల్ల అంతఃపురానికి దూరమయింది. ప్రజాస్వామ్యంలో కనీసం ఎన్నికల సమయంలోనైనా జనమే స్వామీ స్వాములింకా మన దేశంలో. జనం ఘోష పట్టించుకోని భాషతో ఏం సాధిద్దామణొ పెద్దల ఉద్దేశం?

ఎప్పుడో తీరికున్నప్పుడు కాశీకి పోయి గంగలో వదిలేసి వచ్చే ఇష్ట పదార్థం కాదు క్రోధం. ప్రజాక్షేత్రమే  సదా పునీతంగా సేవించుకోవలసిన కాశీ,  ప్రయాగలు రాజకీయ నాయకులకు.

ప్రజాస్వామ్య నాటకంలో గయుడంటే ఓటేసి పెద్దలను గద్దెనిక్కించిన సామాన్యుడు. కృష్ణార్జునుల మధ్య యుద్ధం పద్యాల్లాగా వినేటంత వరకే వినోదం. గయుడికే గతి పట్టించారా పెద్దలంతా కలసి  చివరికి? అన్నదే ప్రదర్శన విజయానికి నిదర్శనం.

 కొత్త ఏడాది ప్రారంభమయినందుకైనా  నేతలు పాత కక్షలు మర్చిపోతే మంచిదనుకున్నాం. ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపిస్తే .. మంచిదే కానీ.. దాం దుంప తెగనంపిరి.. అసలు చెంపలు బాదుకోడానికా మనం ప్రజా ప్రతినిధులను చట్టసభలకు పంపిటం!

 కుప్పించి లంఘించిన కుండలాల కాంతి పోతన భాగవత పద్యం వరకైతే హృద్యమే కానీ.. కుప్పిగంతులతో రాజకీయాన్ని చిందు భాగోతంగా మారిస్తే ముర్దాబాదులతో మోతెక్కిస్తారు ఎన్నికల్లో మోసిన జనమే!

 క్రికెట్ లో ‘నో బాల్’ వివాదం ప్రపంచ కప్పు  వరకే పరిమితం. ‘డాటర్సాఫ్ ఇండియా’ ..  ఓ రెండు దేశాల విదేశాంగ విధానాలమీదే ప్రధానంగా సర్దుబాటు.

రాజ్యాంగంమీదో.. దేవుడిమీదో  ప్రమాణం చేసి మరీ జనంకోసమని  చట్టసభల్లోకొచ్చి కూర్చున్న పెద్దలకు మరి మనం నచ్చచెప్పేదేముంది? కుబేరుడొచ్చి బడ్జెట్ సమర్పించినా  కుంటి సాకులు వెదికితే నైజం జనం క్షమించి వదిలేస్తారనే? పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదన్న ఓర్పు ప్రభుత్వ పక్షానికి ఉంటేనే ప్రజా తీర్పు శిరసావహించినట్లవర్షాలు లేకపోతే ఎలాగో తట్టుకోవచ్చు. తిట్ల వర్షాల పోటెత్తుతుంటే జనం ఎంతకాలమని తట్టుకోగలరు? విచ్చలవిడితనానికి మెచ్చి అధినేతలు కప్పే శాలువలకోసం ముచ్చట పడద్దు!  ముచ్చెమటలు పట్టించే ఎన్నికల పండగలు ముందున్నాయి..  ఆ ముసళ్ళ నోళ్ళలో పడద్దు!  నేతలకు నోళ్ళున్నది లేనోళ్ళ నోళ్ళుగా పలకేందుకు! గుర్తుంచుకోవాలి.

-కర్లపాలెం హనుమంతరావు

 

తన కోపమె తన శత్రువు- చిన్న కథ - రచన : కర్లపాలెం హనుమంతరావు

బాలు వయసు పదేళ్ళు. అంత చిన్నతనంలో కూడా కోపం బుస్సుమని వచ్చేస్తుంది. కోపం వస్తే ఎంత మాట పడితే అంత మాట అనేస్తాడు. పెద్దా చిన్నా చూసుకోడు. అంత దురుసుతనం భవిష్యత్తుకు మంచిది కాదని వాళ్లమ్మ ఎన్ని సార్లో  చెప్పిచూసింది.  కాస్సేపటి వరకే అమ్మ మాటల ప్రభావం. మళ్లీ కోపం యధాతధం. ఆ సారి పుట్టిన రోజు పండుగకు తనకు కొత్త వీడియో గేమ్ కావాలని అడిగాడు బాలు. పరీక్షలు దగ్గర్లోనే ఉన్నాయి. ఆటల రంధిలో పడి చదువు మీద ధ్యాస తగ్గుతుందని అమ్మానాన్నల బెంగ. పరీక్షలు అయి వేసవి సెలవులు మొదలయితే గానీ ఏ ఆటలూ వద్దని అమ్మ నచ్చచెప్పబోయింది. వినకపోగా అమ్మ మీద ఇంతెత్తున ఎగిరి గభాలున ఒక బూతు పదం కూడా వాడేసాడు. షాకయ్యాడు అక్కడే ఉండి బాలు వీరంగం అంతా చుస్తున్న నాన్న. అప్పటికి ఏమీ అనలేదు. 

మర్నాడు పుట్టినరోజు బాగానే జరిగింది. ఫెండ్స్ రకరకాల ఆటవస్తువులు బహుమానంగా ఇచ్చారు. పరీక్షలు అయిన దాకా వాటిన తెరవకూడదన్న షరతు మీద నాన్నగారు ఒక పెద్ద రంగుల పెట్టె బహుమానంగా ఇచ్చారు. తెరిచి చూస్తే అందులో బోలెడన్ని మేకులు, ఒక సుత్తి, బాలుకి చాలా ఇష్టమయిన తన ముఖం అచ్చొత్తించిన పెద్ద చెక్క ఫ్రేము ఫొటో. నాన్నగారు  ఇలా చెప్పారు 'బాలు! కోపం మంచిది కాదు అని ఎన్ని సార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదు. ఎందుకు మంచిది కాదో నీకై నువ్వే తెలుసుకోవాలి. అందుకోసమే నీకు ఈ చిన్న పరీక్ష. ఇందులో వంద మేకులు ఉన్నాయి. నీకు  కోపం వచ్చిన ప్రతీసారీ ఒక మేకు ఈ పటం మీద ఈ సుత్తితో కొట్టాలి. మేకులన్నీ అయిపోయిన తరువాత ఇంకా కావాలంటే కొని ఇస్తాను' అన్నాడు. 

బాలుకు ఈ ఆట బాగా నచ్చింది. మొదటి రోజు ఏకంగా 37 మేకులు పటం మీద సునాయాసంగా కొట్టేసాడు. అంటే 37 సార్లు కోపం వచ్చిందని అర్థం. రెండో రోజు ఆ ఊపు కొంత తగ్గింది. 21 మేకులు మించి పటంలోకి దిగలేదు. సుత్తితో మేకును కొడుతున్నప్పుడు బాలు మనసు మెల్లిగా ఆలోచనలో పడడం మొదలుపెట్టింది. ఈ మేకులు కొట్టే తంటా కన్నా అసలు కోపం తెచ్చుకోకుండా ఉంటే గోలే ఉండదు కదా! అని కూడా అనిపించింది. 

రోజు రోజుకూ ఆ భావన బాలులో పెరుగుతున్న కొద్ది పటం మీద మేకులు దిగడం తగ్గిపోయింది. అంటే బాలుకు కోపం వచ్చే సమయం క్రమంగా తగ్గిపోయిందనేగా అర్థం! కోపం వచ్చిన ప్రతీసారీ మేకులు, సుత్తితో వాటిని పటం మీద కొట్టే బాదరబందీ గుర్తుకు వచ్చి చల్లబడిపోయేవాడు. 

మేకులు కొట్టడానికి ఇప్పుడు పటం మీద చోటు వెతుక్కోవడం కూడా కష్టంగా ఉంది. పటం నిండా మేకులు  నిండిపోయేవేళకు బాలుకు అస్సలు కోపం రావడం పూర్తిగా మానేసింది. కోపం తగ్గిన తరువాత అమ్మానాన్నా వీడియోగేమ్ ఇప్పుడు ఎందుకు కొనివ్వడం లేదో అర్థమయింది. నెల రోజుల కిందట అమ్మతో తాను దురుసుగా మాట్లాడిన సంగతీ గుర్తుకు వచ్చింది. కళ్ల వెంబడి ఇప్పుడు నీళ్లు వచ్చాయి. తప్పు తెలుసుకున్న బాలు కొట్టలేక మిగిలిపోయిన మేకులు, సుత్తి తండ్రి ముందు పెట్టి 'నాన్నా! 'కోపం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు అర్థమయింది. ఇక ఈ మేకులు కొట్టే పని నా వల్ల కాదు . నేను అమ్మ మీద ఇక నుంచి ఎప్పుడూ కోపమే తెచ్చుకోను' అని చెప్పాడు. 

తండ్రి 'కోపం వల్ల ఇబ్బంది ఏమిటో నీకు తెలిసి వచ్చిందే! కానీ నాకే ఇప్పుడు ఇబ్బంది వచ్చిపడింది . నీకు ఈ పాఠం నేర్పడానికి మేకులు, సుత్తి, పటం ఫ్రేము కట్టించడానికి 500 రూపాయలు అవసరమయ్యాయి. సమయానికి నా దగ్గర అంత  డబ్బు లేకపోతే ఒక ఇనుప కొట్లో అరువు మీద తీసుకున్నాను. ఇప్పుడు మనకు వాటితో అవసరం లేదు కదా! అతని మేకులు, పటం తిరిగి అతనికి ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చేస్తే సరి. నువ్వు రోజుకో మేకు చొప్పున మేకులన్నీ పీకి పారేయ్! కాకపోతే మళ్లా ఒక షరతు. నీకు కోపం వచ్చిన రోజున మేకు తీయడానికి లేదు. గుర్తుంచుకో!'అన్నాడు.

బాలుకు ఆ రోజు నుంచి రోజుకు ఒక మేకు పటం నుంచి తీయడం మీదనే ధ్యాసంతా. అందుకోసం గాను  కోపాన్ని ఆమడ దూరం పెట్టవలసిన అగత్యం మరింత గట్టిగా అర్థమయింది. మొత్తానికి పటం మీది మేకులన్నీ తీసి మేకులు, సుత్తి, పటం తండ్రికి ఇచ్చే సమయానికి బాలు పూర్తిగా శాంత స్వభావుడిగా మారిపోయాడు.'మేకులు పీకడానికి నీవు కోపాన్ని ఎట్లా నిగ్రహించుకున్నావో గమనించాను. కోపం తెచ్చుకోకపోవడమే కాదు..  అది వచినప్పుడు దానిని నిగ్రహించుకోవడం  కూడా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం.  ' తన కోపమే తనకు  శత్రువు' అని పెద్దవాళ్ళు ఎందుకు అన్నారో ఇప్పుడు బాగా అర్థమయింది అనుకుంటా. కోపం తెచ్చుకొని ఏదో ఒక దురుసుమాట అని ఎదుటి వాళ్ల మనసును గాయ పరచడంలాటిందే మేకుతో పటం మీద సుత్తితో బాదడంతో సమానం. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకొని మేకు మళ్లీ తీసినా పటం మీది చిల్లులు పోవు కదా! ఆ వికారం పోగొట్టడం మన తరం కాదు గదా! నోటికొచ్చింది తిట్టి ఆనక 'సారీ' అన్నా ఎదుటి వాళ్ల మనసు మీద గాయమూ ఇట్లాగే ఎప్పటికీ చెరిగిపోకుండా మిగిలిపోతుంద'ని గుర్తుంచుకో చాలు.' అన్నాడు తండ్రి.

బాలు బుద్ధిగా తలుపాడు. 

పరీక్షలు అయి వేసవి రాగానే తండ్రే బాలును వెంటబెట్టుకుని ఎలక్ట్రానిక్ షాపుకు తీసుకువెళ్లి అతగాడికి కావలసిన వీడియోగేమ్సు కొనిపెట్టాడు. ఎన్ని గేమ్సు కొనిపెట్టాడో అన్ని పుస్తకాలు కొని  ఇస్తూ.. ఒక పుస్తక చదవడం పూర్తయిన తరువాతే ఒక వీడియా గేమ్ ఆడుకోవడానికి పర్మిషన్' అన్నాడు తండ్రి నవ్వుతూ.

బాలుకు ఈ సారి కోపం రాలేదు 'అలాగే నాన్నా !' అని సంతోషంగా వీడియో గేమ్సూ, పుస్తకాలూ అందుకుని షాపు బైటికి వచ్చాడు

***

స్వర్గం- నరకం- కథానిక రచనః కర్లపాలెం హనుమంతరావు -సరదాకేః

 



 

ఎన్నికలైపోయాయి. ఓట్ల కౌంటింగుకి ఇంకా వారం రోజుల గడువుంది. ఎక్కడ చూసినా టెన్షన్.. టెన్షన్! ఎవరినోటవిన్నా రాబోయే ఫలితాలను గూర్చి చర్చలే చర్చలు!

ఓటు వేసినవాడే ఇంత టెన్షన్లో ఉంటే.. ఓట్లు వేయించుకున్నవాడు ఇంకెంత వత్తిడిలో ఉండాలి! రాంభద్రయ్యగారు ఓట్లేయించుకుని ఫలితాల కోసం నరాలుతెగే ఉత్కంఠతో ఎదురుచూసే వేలాదిమంది అభ్యర్థుల్లో ఒకరు.

అందరి గుండెలూ ఒకేలా ఉండవు. కొందరు వత్తిళ్ళను తట్టుకుని నిలబడగలిగితే.. కొందరు ఆ వత్తిడికి లొంగి బక్కెట తన్నేస్తారు. రాంభద్రయ్యగారు ఆ సారి అదే పని చేసి సరాసరి స్వర్గ నరక మార్గాలు చీలే కూడలి దగ్గర తేలారు.

ఆ సరికే అక్కడో మంగళగిరి చేంతాండంత క్యూ!  ఆమ్ ఆద్మీలకంటే ఈ మాదిరి చేంతాళ్ళు అలవాటే గాని.. జనవరి ఒకటి, శనివారం కలిసొచ్చే రోజైనా  తిరుమల శ్రీవారి సుప్రభాతసేవ దర్శనానిక్కూడా క్యూలో నిలబడే అగత్యం లేని బడేసాబ్ రాంభద్రయ్యగారిలాంటివారికీ క్యూ వరసలు పరమ చిరాకు పుట్టించే నరకాలు.

ఇదేమీ భూలోకం కాదు. లాబీయింగుకు ఇక్కడ బొత్తిగా అవకాశం లేదు. తన వంతుకోసం ఎదురుచూడడం  రాంభద్రయ్యగారికేమో అలవాటు లేని యవ్వారం. అక్కడికీ ఎవరూ చూడకుండా స్వర్గం క్యూలో చొరబడబోయి కింకరుడి కంట్లో పడిపోయారు పాపం.

'ఇదేం మీ భూలోకం కాదు. మీ చట్టసభల్లో మాదిరి ఇష్టారాజ్యంగా గెంతడాలు కుదరవు.  ముందక్కడ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి. ఆ ఫలితాన్నిబట్టే నీకు స్వర్గమో.. నరకమో తేలేది. నువ్వొచ్చి యేడాదికూడా కాలేదు. అప్పుడే అంత అపసోపాలా బాబయ్యా? నీ నియోజకవర్గంలో జనం పింఛను కోసం, జీతం కోసం, రేషన్ కోసం, గ్యాసుబండల కోసం, అధికారుల  దర్శనం కోసం.. ఎన్నేసి రోజులు నిలువుకాళ్ళ కొలువు చేస్తారో నీకేమైనా అవగాహన ఉందా?' అని గదమాయించాడు దే.దదూత (దేవుడు, దయ్యం కలగలసిన అంశ- దే.దదూత)

'ఆ భూలోక రాజకీయాలు ఇప్పుడంతవసరమా దూతయ్యా? వెనకెంత క్యూ ఉందో చూసావా?ముందు నా స్వర్గం సంగతి తెముల్చు!' పాయింటు లేనప్పుడు టాపిక్కుని పక్కదారి పట్టించే పాతజన్మ చిట్కా ప్రయోగించారు రాంభద్రయ్యగారు.

చిత్రగుప్తుడి దగ్గరకొచ్చింది కేసు.

సెల్లో ఆయనగారెవర్నో కాంటాక్టు చేసినట్లున్నాడు.. రాంభద్రయ్యగారిని చూసి అన్నాడు 'ఓకే పెద్దాయనా! మీరేమో రాజకీయనేతలు! కనక ప్రత్యేక పరీక్ష పెడుతున్నాం. మామూలు ఓటర్లకు మల్లే  మీకు పాత జీవితం తాలూకు  పాప పుణ్యాలతో నిమిత్తం లేదు. ప్రజాస్వామ్యయుతంగా మీకు మీరే స్వర్గమో.. నరకమో ఎన్నుకోవచ్చు..'

'నాకు స్వర్గమే కావాలయ్యా!'

'ఆ తొందరే వద్దు. ఆసాంతం వినాలి ముందు. ఎన్నుకోవడానికి ముందు ఒకరోజు నరకంలో.. ఒకరోజు స్వర్గంలో గడపాలి..'

'ఐతే ముందు నన్ను స్వర్గానికే పంపండయ్యా!'

'సారీ! రూల్సు ఒప్పుకోవు. ముందుగా నరకానికి వెళ్ళి రావాలి.. ఆనక స్వర్గం' అని దే.దదూత  వంక సాభిప్రాయంగా చూసాడు చిత్రగుప్తుడు. అర్థమైందన్నట్లు రామచంద్రయ్యగారి భుజం మీద చెయ్యేసి బలంగా కిందికి నొక్కాడు దేదదూత.

కనురెప్పపడి లేచేంతలో కంటి ముందు.. నరకం!

నరకం నరకంలా లేదు! స్వర్గంలా వెలిగిపోతోంది. మెగాస్టార్ చిత్రం ఫస్ట్ షో సందడంతా అక్కడే ఉంది. మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లు. మనస్సును ఆహ్లాదపరిచే బాలీవుడ్ మిక్సుడ్ టాలీవుడ్ మ్యూజిక్కు! ఎటు చూసినా పచ్చలు,  మణిమాణిక్యాలతో  నిర్మితమైన  రమ్యహార్మ్యాలు! హరితశోభతో అలరారే సుందర ఉద్యానవనాలు! మనోహరమైన పూలసౌరభాలతో వాతావరణమంతా గానాబజానా వాతావరణంతో మత్తెక్కిపోతోంది. మరింత కిక్కెంకించే రంభా ఊర్వశి మేనక తీలోత్తమాదుల  అంగాంగ  శృంగార నాట్యభంగిమలు!

పాతమిత్రులందర్నీ అక్కడే చూసి అవాక్కయిపోయారు రాంభద్రయ్యగారు. అక్రమార్జన చేసి కోట్లు వెనకేసిన  స్వార్థపరులు, వయసుతో నిమిత్తం లేకుండా ఆడది కంటపడితే చాలు వెంటాడైనా సరే  కోరిక తీర్చుకునే కీచకాధములు, అధికారంకోసం మనిషుల ప్రాణాల్ని  తృణప్రాయంగా తీసే పదవీలాలసులు, ఉద్యోగాలు.. ఉన్నతకళాశాలల్లో సీట్లకు బేరం పెట్టి కోట్లు కొట్టేసి ఆనక  బోర్డ్లు తిరగేసే ఫోర్ ట్వంటీలు, పాస్ పోర్టులు,  సర్టిఫికేట్లు, కరెన్సీ నోట్లు, మందులు, సరుకులు వేటికైనా చిటికెలో నకిలీలు తీసి మార్కెటుచేసే మాయగాళ్ళు, నీరు, గాలి, ఇసుక, భూమిలాంటి సహజ వనరులపైనా అబ్బసొత్తులాగా  దర్జాగా కర్రపెత్తనం చేసే దళారులు..  అంతా ఆ అందాలలోకంలో ఆనందంగా తింటూ, తాగుతూ, తూలుతూ, పేలుతూ  యధేచ్చగా చిందులేయడం చూసి రాంభద్రయ్యగారికి మతిపోయినంత పనయింది. సొంత ఇంటికి వచ్చినట్లుంది. అన్నిటికన్నా అబ్బురమనిపించింది.. తెలుగుచిత్రాల్లో పరమ వెకిలిగా చూపించే యమకింకరులుకూడా చాలా ఫ్రెండ్లీగా కలగలిసిపోయి వాళ్ల మధ్య కలతిరుగుతుండటం!

అతిథుల భుజాలమీద ఆప్యాయంగా  చేతులేసి,  బలవంతంగా సుర లోటాలు లోటాలు తాగించడం.. మిడ్ నైట్ మసాలా జోకులేస్తూ జనాలను అదే పనిగా నవ్వించడం.. ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదా ఆతిథ్యం. కడుపు నింపుకునేందుకు అన్ని రుచికరమైన పదార్థాలు సృష్టిలో ఉంటాయని అప్పటివరకు రాంభద్రయ్యగారికి తెలియనే తెలియదు. రోజంతా ఎంతానందంగా గడిచిందో .. రోజుచివర్లో.. చీకట్లో ఏకాంతంలో అతిలోకసుందరులెందరో   బరితెగించి మరీ  ఇచ్చిన సౌందర్య ఆతిథ్యం ఎన్ని జన్మలెత్తినా మరువలేనిది.

ఆ క్షణంలోనే నిర్ణయించేసుకున్నారు రాంభద్రయ్యగారు ఏదేమైనా సరే  ఈ నరకాన్ని  చచ్చినా వదులుకోరాదని.

కానీ.. షరతు ప్రకారం మర్నాడంతా స్వర్గంలోనే గడపాల్సొచ్చింది పాపం రాంభద్రయ్యగారికి. స్వర్గం మరీ ఇంత తెలుగు ఆర్టు ఫిలింలా డల్ గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మనశ్శాంతికోసం సాంత్వనసంగీతమంటే   ఏదో ఒక ఐదారు నిమిషాలు  ఓకేగానీ..  మరీ   రోజుల తరబడి ఆకాశవాణి నిలయవిద్వాంసుల కచేరీ తరహా అంటే.. మాజీ ప్రధాని మన్మోహజ్ జీ సారుకయినా తిరగబడాలనిపించదా? ఒక వంక కడుపులో పేగులు కరకరమంటుంటే ఆ ఆకలిమంటను చల్లార్చడానికి ఏ  ప్యారడైజ్ బిర్యానీనో పడుతుంటే మజాగానీ .. అజీర్తి రోగి మాదిరి అసలాకలే లేని హఠయోగమంటే.. ఎంత స్వర్గంలో ఉన్నా నరకంతో సమానమే గదా! దప్పికతో నిమిత్తం లేకుండా ఏ   బాగ్ పైపరో.. ఆఫీసర్సు ఛాయస్సో.. స్థాయినిబట్టి ఆరగా ఆరగా ద్రవం గొంతులోకి చల్లగా జారుతుంటే కదూ.. స్వర్గం జానా  బెత్తెడు దూరంలోనే ఉన్నట్లండేది!  ఎంత అతి మధురామృతమైనా ఒక బొట్టు మొదట్లో అంటే మర్యాదకోసం’ చీర్స్’ కొట్టచ్చుగానీ.. అదే పనిగా అస్తమానం లోటాల్లో పోసి గుటకేయాల్సిందేనంటే.. ‘ఛీ!’ అంతకన్నా నరకం మరోటుంటుందా? ఆకలిదప్పులు, నిద్రానిప్పులు, మంచిచెడ్డలు, ఆరాటాలు.. పోరాటాలేవీ లేకుండా పద్దస్తమానం తెలిమబ్బులమీదలా తేలుతూ పారవశ్యం నటించాలంటే రాంభద్రయ్యలాంటి ఆసులో కండెలకు అసలు అయే పనేనా?

'ఎవర్నుద్దరించేందుకు, ఏం సాధించేందుకు స్వర్గసామ్రాజ్యంలో.. జన్మరాహిత్యం.. కోరుకోవాలి బాబూ? రమణీయ విలాసాలు, రసికజన వినోదాలు, రత్నఖచితాడంబరాలు.. యధేఛ్చావిహారాలు.. రుచికరాహారాలు, రసరమ్య పానీయాలు,. స్వర్గంలో దొరుకుతాయన్న మాట వట్టిబూటకమేనని ఒక్క రోజులోనే  తేలిపోయింది.  వాస్తవానికి ఇవన్నీ పుష్కలంగా దొరికే చోటు నరకమే అయినప్పుడు ఆ నరకంలోనే స్థిరనివాసం ఏర్పరుచుకోవడమే తెలివైన పని.

మర్నాడు   చిత్రగుప్తుడిముందు ప్రవేశపెట్టబడినప్పుడు మరో ఆలోచన  లేకుండా నరకానికే ఓటేసేసారు రాంభద్రయ్యగారు.

ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసుకుని అధికారిక పత్రాలతో సహా నరకంలోకి అడుగు పెట్టిన రాంభద్రయ్యగారికి కళ్ళు బైర్లుకమ్మే దృశ్యం కంటబడిందీసారి.

నరకం మునుపటి స్వర్గంలాగా లేదు. నరకంలాగేనే ఉంది. మూసీ వడ్డునున్న  మురికివాడకు నకలుగా ఉంది.  మొన్నటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి బొత్తిగా సాపత్యమే లేదు.

మొదటి దృశ్యం- డొనాల్డ్ ట్రంప్ భారతావనికి వచ్చేముందు తీర్చిదిద్దిన అహమ్మదాబాదునగరం.

రెండో దృశ్యం- కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కినర్నాటి  అమరావతినగరం.

పైనుంచీ ఆగకుండా అదే పనిగా వర్షిస్తున్నది చెత్తా చెదారం. ఆగకుండా ఆ చెత్తను  ఎతిపోస్తున్నది  వేలాదిమంది కూలీజనం. నిజానికి  వాళ్లంతా మొన్నరాంభద్రయ్యగారు  సందర్శనార్థం విచ్చేసినప్పుడు-  పిలిచి ఆతిథ్యమిచ్చిన నరక గేస్తులు! భూలోక నేస్తులు! వాళ్ల వంటిమీదిప్పుడు  వేళ్లాడుతున్నవి  అప్పటికి మల్లే  చీని చీనాంబరాలు కాదు. చివికి, చిరిగి, చీలకలైన మసి పేలికలు! చేతుల్లో పెద్ద పెద్ద చెత్తబుట్టలున్న ఆ పెద్దమనుషులంతా  భూమ్మీద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన వి.వి.వి.వి..పి లు! పనిలో ఒక్క సెకను అలసత్వం చూపించినా చాలు వాళ్ల వీపులమీద కొరడా దెబ్బలు ఛళ్ళుమని  పడుతున్నాయి. ఆ కొరడాధరులంతా మొన్న ఇదే చోట శిబిని, అంబరీషుణ్ణి మరిపించిన ఆతిథిమర్యాదలతో రాంభద్రయ్యగారిని మురిపించిన  యమకింకరులే!

నోటమాట రాకా మాన్పడిపోయిన రాంభద్రయ్యగారి చేతిలో ఓ పెద్ద చెత్తబుట్ట పెట్టి ముందుకు తోసాడో కింకరాధముడు. ఆగ్రహం పట్టలేక నరాలు చిట్లేటంత బిగ్గరగా గావుకేక వేసారు రాంభధ్రయ్యగారు 'మోసం!.. దగా! మొన్న నరకానికి స్వర్గధామంగా విపరీతమైన కలరింగిచ్చి.. ఇవాళీ నరకంలో పారేయడం నమ్మక ద్రోహం.. కుట్ర!'

తాపీగా సమాధానమిచ్చాడా యమకింకరుడు 'ద్రోహానికి.. కుట్రకి.. ఇదేం మీ భూలోకం కాదు మానవా!  నువ్వు నరకాన్ని చూసిన రోజు  మా స్వర్గ నరకాల ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు. ఎలక్షన్లు  అయిపోయాయి. నువ్వు ఎన్నుకున్న నరకానికే కదా నిన్ను తరలించిందిప్పుడు? ఇందులో మోసం.. దగా ఉంటే.. మీ భూమ్మీద జనానికి మీరు చూపించే హామీల్లోనూ మోసం.. దగా ఉన్నట్లే లెక్క! ముందే చెప్పాం గదా!  భూమ్మీద మీలాంటి నాయకులు నడిపిస్తున్న ప్రజాస్వామ్య విధానాలనే మేమూ ఇక్కడ మా లోకాల్లో అనుసరిస్తున్నామీ మధ్య' అన్నాడు కింకరుడు కొరడా రాంభద్రయ్యగారి వీపుమీద ఝళిపిస్తూ!

'అబ్బా!' అని రాంభద్రయ్యగారి పెడబొబ్బ. అది కొరడా దెబ్బో.. ప్రజాస్వామ్యం దెబ్బో ఎవరికి వారుగా  జనాలకు హామీలు గుప్పించి గద్దెనెక్కేవాళ్ళే అర్థంచేసుకోవాలబ్బా!

స్వస్తి!

కర్లపాలెం హనుమంతరావు

***

వీళ్ళు మారర్రా బాబూ! - సరదాకే - కర్లపాలెం హనుమంతరావు

 



 

‘అబద్ధాల శక్తి ఏంటో నాకు మించి తెలిసిన పురాణ పాత్ర మరోటి లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే బెట్టుసరికి పోతే మన శ్రీరామచంద్రమూర్తి బాటలోనే చెట్టు పుట్టలు .. ‘

రామయ్య ప్రస్తావనలు ఇప్పుడొద్దు హరిశ్చంద్రా! రోజులని బట్టి నడత మార్చే అవకాశవాది  అవసరం. విభీషణుడేమైనా మళ్లీ మన వైపుకు వస్తాడేమో.. ఓ ప్రయత్నం జరిగితే బావుణ్ణు ముందు!

నిండు సభలో కూడా పెద్దలంతా చూస్తుండంగా ఎంతో గుండెధైర్యంతో ఓ శీలవతిని ఈడ్చుకొచ్చాడే! అన్న చెప్పీ చెప్పగానే మరో దుశ్శంకకు పోకుండా.. తల్లిలాంటి శీలవతి  చీర మీదంత నిర్లజ్జగా చేయ్యేశాడే..   దుశ్శాసనుణ్ణి మనం మళ్లీ మన  సలహాదారుల హోదాలోకి తిరిగి తెచ్చుకొనే పని చూసుకోవాల్సిందన్నాయ్!  

మంచి మాట! మంచి సలహాలిచ్చే విదురుళ్ల వంటి చెత్త సరుకుతో పార్టీ చెదలు పట్టిపోతుందేమోనని దిగులుగా ఉందబ్బీ! ఎంత కాలం ఒక్క నా దొంగ పాచికల మీదనే మహాభారతం ఆసాంతం నడిపించగలుగుతాం!

మామా! ఒక్క భారతాన్ని మాత్రమే పట్టుకు వేళ్లాడుతుంటే  మనకు అస్త్రాలు ఆట్టే దొరిగే అవకాశం లేదు. ఔటాఫ్ బాక్స్ థింకింగ్ అవసరం ప్రస్తుతం! అరాచకమైన ఆలోచనలు చేస్తే తప్ప విజయాలు సిద్ధించని దిక్కుమాలిన రోజులివి. జూదంలో మాయ చేసి ఏదో ఓ పథ్నాలుగేళ్లు జనం కళ్ల బదకుండా దూరంగా నెట్టేశాం గానీ, అ దాయాది పాండవులను. ఇచ్చిన గడువు ఇట్టే కరిగిపోయింది! ఈ సారి ఏ ఐదూళ్ల కోసమో దేబిరించి రాయబారాలు నడిపిస్తారనుకోడం మన భ్రమ.

నిజమే! వేగులవాళ్లు తెచ్చిన దుర్వార్తల ప్రకారం ధర్మారాజుక్కూడా అధర్మ వర్తనలో శిక్షణ ఇప్పిస్తుట్లు సమాచారం..

ఎవరూ? దొంగిలించి తినందే వెన్నైనా ముద్ద గొంతు దిగదనే ఆ కన్నయ నిర్వాకమేనా ఇదంతా!

అతగాడిని ఆడిపోసుకునీ ఉపయోగం ఏముందిలే? ఉత్తరకుమారులు నిజానికి ఆ పక్షంలో ఉన్నది ఏ ఒకరో ఇద్దరో! మన దగ్గరో?

ఇప్పుడెందుకులే మామా ఆ దిక్కుమాలిన లెక్కలన్నీ! కురుక్షేత్రం ఏ క్షణంలో అయినా రావచ్చనే వార్తలు వినవస్తున్నాయ్! దుష్ట శక్తులన్నింటినీ చేజేతులా దూరం చేసుకొనే వ్యూహం ఏమంత మేలని? ముందా సంగతి మీద కదా మన ధ్యసంతా ఉండాల్సిందీ!

అల్లుడూ! నీ అమాయకత్వం ఇట్లా అఘోరించబట్టే అవతల భీముడు అనుక్షణం అట్లా పెట్రేగిపోతున్నది. అర్జునుడు    వాసుదేవుడి దగ్గరికి రాయబారం వెళుతున్నట్లు వార్త! అప్రమత్తం అవు ముందు!

చెప్పు మామా! పెద్దలందరూ ‘థూఁ.. ఛాఁ’ అంటున్నా.. నువ్ చెప్పినట్లే కదా.. తు. చ తప్పకుండా అందరం ఆచరిస్తోందిక్కడ. అడవులకు తరిమి కొట్టమన్నావ్! లక్క ఇళ్లు తగలెట్టమన్నావ్! ఎక్కడ దాక్కున్నారో బైటపడ్డానికి గోవుల గ్రహణం పేరుతో విరాటరాజు మీదకు విరుచుకుపడమన్నావ్! మరిప్పుడే అఘాయిత్యం చెయ్యమన్నావో.. అదీ నువ్వె చెప్పు!

లోపలికొస్తే మళ్లీ బైటకు వెళ్లలేనంత పకడ్బందీగా పద్మవ్యూహం ఉంది. దాన్ని గురించి ఆలోచించల్లుడూ! బుద్ధిమంతులైన పెద్దలు చాలా మంది ఇంకా ధర్మరాజుకే విజయం దక్కాలని మనసులో ప్రార్థిస్తున్నారు. వాళ్లందరి నెత్తి మీదా ఇప్పట్నుంచే గెలిచే బాధ్యతలు రుద్ధిపెట్టు ముందు. దర్మాన్ని గురించి మీమాంస పడేందుకు క్షణమైనా ఖాళీగా కూర్చోనివ్వద్దా ముసలి మొద్దులను. నీ గుడ్డి తండ్రి నీ వైపే ఉన్నా.. ఒక్క బాబాయ్ విదురుడు చాలు బాబా అస్తమానం ఆయన చెవులో నీతుల వంకన ఓఁ అంటూ  రొద పెట్టడానికి. నీ ఒక్కగా నొక్క స్నేహితుడు కర్ణుడు మీద మాత్రమే భరోసా పెట్టుకుంటే కథ నడవదు. నేర్చిన విద్యలన్నీ సమయానికి మరిచే జబ్బున్నప్పుడు ఎంత మహారథి అయితే మాత్రమేంటి సాధించేదేముంది? నీ వంద మంది తమ్ముళ్ల పేర్లే నీకు సరిగ్గా గుర్తుకొచ్చి చావవు! అయినా వాళ్లందరికి మాత్రం నువ్వే ప్రత్యక్ష దైవం. చూసి రమ్మని కూడా నువ్వు చెప్పనక్కర్లేదయ్యా!.. కాల్చి రావడంలో మహా ఉత్సాహం చూపిస్తారందరూ! అదేదో బోడి రాజసూయయాగంలో కృష్ణుడికి ముత్తెమంత పెత్తనమిచ్చినందుకే శశిపాలుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశాడని వింటున్నాం! అట్లాంటి తిట్ల గుంపు నంతా మన వైపుకు తిప్పుకో  ముందు!

శకుని అల్లుడు దుర్యోధనుణ్ణి కూర్చో బెట్టుకుని  దుర్బోధలు చేస్తున్నాడు యధాశక్తి.. చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా చూసుకొనే ధ్యాస లేకుండా. సర్వాంతర్యామి  రావడం ఎవరూ గుర్తించలేదు.

'ఏం జరుగుతోందిక్కడ?' గద్దించాడు దేవుడు. శకుని దుర్యోధనులిద్దరూ నోరు మెదపలేదు.

అయినా సర్వేశ్వరుడికి ఒకరు చెప్పాలా? 'బోలెడంత భారతం సృష్టించి వచ్చారు ఈ లోకాలకు. గడ్డాలు పట్టుకు బతిమాలితే.. పోనీలే.. ఏదో ఒక అవకాశం ఇచ్చి చూద్దాం.. ఎంతటి కర్కోట నాయకుడైనాఅ మంచిగా  మారితే.. జనాలకే కదా ప్రయోజనం అన్న ప్రజాప్రయోజనం దృష్ట్యా దయతలచి కొంతకాల బెయిలిచ్చా. అభాగ్యులను సేవించుకుంటానని మాట ఇస్తేనే  ఒక అవకాశం ఇచ్చా! బెయిలులో ఉండీ మీ బుద్ధి పోనించుకుంటున్నారు కాదిద్దారూ! చేసిన తప్పులు సరిదిద్దుకొనే బదులు గిట్టనోళ్లను మట్టుపెట్టేందుకు మళ్లీ మరో కురుక్షేత్రం బాపతు  కుట్రకు తెర తీయబోతున్నారు! అదీ నా  స్వర్గం నుంచే! ఛీఁ! రసాతలమే మీ పులుసు తీసే సరయిన స్థలం.. ఎవరక్కడ.. ' అంటూ బిగ్గరగా కింకరుల కోసమై చప్పట్లు కొట్టాడు దేవుడు పరమ చిరాగ్గా.

-కర్లపాలెం హనుమంతరావు

12, మార్చి, 2021

***

 

Monday, March 8, 2021

కోప ప్రకోపాలు - ఈనాడు - వ్యంగ్యం - జనవరి, 22, 2009


ఈనాడు-  హాస్యం-  వ్యంగ్యం 
కోప ప్రకోపాలు
రచన - కర్లపాలెం హనుమంతరావు
22-01-2004

మొన్నామధ్య జరిగిన స్థానిక ఎన్ని కల్లో పార్టీ ఓడిందని రాజీనామాలి చ్చిన మంత్రుల్లో ఒకాయన సీయం గారిని కలిసి సంజాయిషీ ఇచ్చి బయటకొచ్చాడు. 'ముఖ్యమంత్రిగారే మన్నారూ? అనడిగాడు ఒక విలేకరి. 'బూతులు తిట్టేడయ్యా' అన్నాట్ట ఆ మాజీ. 'బూతులు వదిలేసి ఇంకేమన్నారో చెప్పండి సార్!' 'ఇంకేమీ అనలేదు' అని వెళ్ళిపోయాట్టా పెద్దమనిషి.

'కోషనరం తెగిపోయిన సీయమ్మే ఇలా కనబడి నవాళ్ళను కడిగేస్తుంటే- ఆర్టాఫ్ లాఫింగ్ అస్సలు పట్టని మాజీ సీయం ఎవరినైనా వేలుచూపించి బెదిరించటంలో తప్పేముంది! పాలిటిక్సులో కోపా లపాలు కాస్తంత ఎక్కువే అయినట్లుంది. కదండీ! రోడ్డు మీదా ఇదే రొదగా ఉంది ప్పుడు' 'గతంలో ఆగ్రహాలకు ప్రత్యేక కోపగృ హాలుండేవి. నిన్నటిదాకా మన నాయకులు నిప్పులు కక్కుకునేందుకు ఓ వేదిక సౌక ర్యంగా ఉండేది. దాని సమావేశాన్ని కుదిం చారు కదా! సభ్యుల కడుపుబ్బరాలు మరెలా తీరాలయ్యా? ఉప్పూకారం తినే మనుషులకే కాదు, కుక్కలకూ కోప తాపా లెక్కువని కొత్తగా పరిశోధనల్లో తేలింది. నిత్యం నలుగురి మధ్య నలిగే నాయకుడికి రవ్వంత బీపీ పెరిగి రోడ్డుమీద రౌడీ తరహా భాషలో రెండుమూడనుకొంటేనే ఇంత రాద్ధాంతమా! ధరలు పెరిగి ఆర్థిక మాంద్యంతో సతమతమయ్యే సగటు ఓటరుకేదో ఉచితంగా వినోదం పంచటానికి తొడలు కొడుతు న్నారనో, మీసం మెలిపెడుతున్నారనో సరిపెట్టుకో వచ్చుగదా!

అసలీ కోపాలు ఇప్పుడు కొత్తగా పుట్టినవా! క్రీస్తు పుట్టకముందు నుంచీ ఉన్నవేగా! శూర్పణఖ కోపం రామాయణమైంది. శివుడి మూడో కంటిమీద బోలెడు కథలున్నాయి. పరశురాముడిది కోపావతా రమేగా! సమస్తేంద్రియాలను జయించిన దుర్వాసు డికే తుస్సుమంటే కోపం వస్తుందిట! చాణక్యుడు కోపం చేతకాదూ నందుల దుంపతెంపిందీ! రామాంజనేయుల్లాంటి వాళ్ళమధ్యే యుద్ధాలు తప్ప లేదు.
రామదాసు కడుపుమండికదూ ఎవడబ్బా సొమ్మాని కులుకుతూ తిరిగేవు' అని శ్రీరామ చంద్రుణ్ని కీర్తనల్లో తిట్టిపోసింది! 'తన కోపమే తన శత్రువ'ని సుమతి శతకకారుడు ఎంత మొత్తు కున్నా లోక్సత్తావాళ్లు తప్ప లోకంలో ఇంకెవరూ ఆర్టిఫిలిం భాషను పట్టుకుని వేలాడటం లేదయ్యా ఇప్పుడు గాంధీగారికి సత్యాగ్రహం రాబట్టే గదా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది! ఇందిరమ్మ అలగబట్టే గదా యమర్జన్సీ వచ్చింది. బుష్క కోపం లేక పోతే ఇరాక్ యుద్ధం వచ్చేదా? బుష్ మీదెంత కాలకపోతే ఆ పాత్రికేయుడు కాలిబూటు విసురు తాడు! ఒక్కోరి కోపం ఒక్కో రూపంలో ఉంటుంది. కేసీఆర్కి కోపంవస్తే 'దద్దమ్మ'లని చెడతిడతాడు. మారప్పకు మండిందంటే సీమ కవిత్వం కడతాడు. జానాకి కోపంలో వాక్యం తెగదు. రాజశేఖర్ కి పదం కుదరదు. రాఘవులికి నవ్వు చెదరదు. నారాయణ కోపమైతే- ఎప్పుడు ఏ తీరం దాటు తుందో తెలీని వాయుగుండం! కోస్తా' భవాని శ్లేషలో తిడుతుంది. చిత్తూరు రోజా దృష్టప్పుడూ బారుమీదో, దర్బారు మీదో పెడుతుంది. ఆ మధ్య చిరంజీవి తమ్ముడు పంచెకట్టుపై పడ్డాడు. తెలుగు
సాహిత్యంలో ప్రత్యేకంగా తిట్ల కవిత్వం ఉంది. తెలుసో లేదో သ మహామహాకవులే కడుపు మండితే కందాల్లో కొట్టుకునే వాళ్లు. ఇప్పటి పార్టీలకు ఓపికా, తీరికా లేక కార్టూన్లేసే వాళ్లమీద రాళ్లేస్తు న్నారు. వార్తలు రాసేవాళ్లమీదా కేసులేస్తున్నారు. "అసలు మనిషికి పశువుకీ తేడా తిట్లే కదయ్యా.

పిట్టలు తిట్టగలవా? తిట్టినా తిట్టించుకొన్నా సృష్టిలో మనిషికొకడికే సాధ్యం. ఈ ప్రత్యేకతను ఓ కళగా భావించాలిగానీ... కళవళపడితే ఎలా? బయటకు అనువుగానీ నీకూ బంగి అనంతయ్య దసరా వేషాలూ, గద్దరు గజ్జకట్టి పాడుతూ వేసే చిందులూ, పవన్ కల్యాణ్, షబ్బీర్ అలీ నిందాస్త్రాలపైనే మోజు. కర్కశంగా మాట్లా డేవాడు తరవాతి జన్మలో పిల్లిగా పుడతా డని గరుడపురాణం ఎంత బెదిరించినా ప్ర ప్రతినిధులవడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి కార్యకర్తలు ఉన్నంత కాలం ఈ పురాణ పారాయణాలూ ఇలా కొనసాగాల్సిందే. జపానువాడు కోపంవస్తే విరామం లేకుండా పనిచేస్తాడని విన్నాము. మనం కూడా ఈ తిట్టు వాఙ్మయాన్ని తిట్టుకుంటూ కూర్చోకుండా ప్రాచీన భాషగా గుర్తించాలి. అధికార భాషగా ఆమోదిం చాలి. ముందుతరాల కోసం ఈ పదకోశం విస్తృతమయ్యే దిశగా తెలుగు అకాడమీ కృషిచేయాలి. శాసనసభ్యుల సౌకర్యార్థం సమా వేశ కాలాన్ని పొడిగించి ప్రత్యేకంగా కాలాన్ని కేటా యించాలి. నీ వంతు కృషిగా నిన్నెవరన్నా తిడితే తిరిగి తిట్టదు. గాంధీగిరీ మాదిరి ఇంకో నలుగు రిని తిట్టుకుంటూపో అన్నట్లు, ఇది ఎన్నికల సంవత్సరం ఆక్షేపణలని, అధిక్షేపణలని ఆపటం ఎవరితరమూ కాదు. ఈ ఏడాదిని అధిక్షేప నామ వత్సరంగా పేరు మారిస్తే సముచితంగా వుంటుంది. ఇన్ని చేసినా నీ కోపం ఇంకా తీరక పోతే ఓటరుగా నీ ప్రతాపం చూపించు అదొక్కటే నీ బాధకు మందు.

-

రచన - కర్లపాలెం హనుమంతరావు
22-01-2004

 

Sunday, March 7, 2021

గీత ఓ అందే ద్రాక్ష పండు! -కర్లపాలెం హనుమంతరావు -

 



 కార్పణ్య దోషోప హత స్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ నమ్మూఢ చేతాః

యచ్ర్ఛెయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తే౨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్

భారతీయులు ఆరాధనాభావంతో పఠించే భగవద్గీతలో ఈ సాంఖ్యయోగం - ఏడో శ్లోకంలో పెద్దలు ఎప్పుడూ గుర్తుంచుకుని అనుసరించదగ్గ ఓ గొప్ప  సూక్తి ఉంది

అభిమానం పరిమితులకు మించి పెరిగిపోయినప్పుడు సహజ స్వభావానికి విరుద్ధమైన ప్రవర్తన సంభవిస్తుంది. ధర్మసంబంధ విచక్షణ  పక్కనుంచి సామాజికపరంగా అయినా ఆమోదనీయం కాని సమతౌల్యతను మనసు కోల్పోవడమే ఇందుకు కారణం. సమాజంలోని  ప్రతీ వ్యక్తికీ ఈ సంకట స్థితి ఏదో ఓ సందర్భంలో తప్పదు. అయితే,  జీవితం నేర్పిన పాఠాల సారం వంటబట్టిన కొందరు గుంభనగా ఈ  స్వ స్వరూప సంభంధమైన వైవిధ్యం స్వయంగానే గ్రహింపుకు తెచ్చుకుని  ఆ  వైపరీత్యం నుంచి బయటపడే ప్రయాసలు ఆరంభిస్తారు! ఆ పైన జీవ సంస్కారాన్ని బట్టి జయాపజయాలు!


కానీ, జీవితమనే మల్ల యుద్ధం గోదాలోకి అప్పుడే  పాదం మోపిన పిన్న వయస్కులు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసిన  సందర్భం తటస్తించినప్పుడు నరుడు నారాయణుణ్ణి ఉచిత మార్గ దర్శనార్థం  ఎట్లా దేబిరిస్తాడో అట్లా దేబిరించడం నామర్ధాగా భావిస్తారు.  అన్నీ తమకే తెలుసనుకుని దుందుడుకుగా ముందుకు దూసుకుపోతారు. కలసిరాని సందర్భంలో చతికిలపడే దుస్థితి దాపురించినప్పుడు బేలతనంతో ఆ పిన్నలు తమ సహాయ సహకారాలు, సముచితమైన సలహాలు యాచించే స్థితికి వచ్చే వరకు కన్నవారు ఓపికతో వేచ్చిడాలి.. అదే పెద్దరికం.. అని ఈ శ్లోకం సారాంశం.

మహాభారతంలో అర్జునుడు  యుద్ధరంగం మధ్య ప్రేమానురాగ బద్ధుడై కర్తవ్య విమూఢత్వం ఆవరించిన సందర్భం ఒకటుంది. తన వైరాగ్యానికి కారణం బంధుప్రీతి అనో, పెద్దలు.. గురువుల మీద భయభక్తులనో, విజయసాధనానంతరం అనుభవంలో కొచ్చే రాజభోగాల మీది కాంక్ష ధర్మసంబద్ధం కాదనో.. ఇలా రకరకాల కారణాలు వెతికే దుస్సాహసానికి సర్వలోకసంరక్షకుడి ముందు  దిగే దుస్సాహసానికి పూనుకుంటాడు. కానీ ఈ శ్లోకం దగ్గరకొచ్చేసరికి విజయుడికి తన పరిమితులు తెలిసివచ్చాయి.  తన సహజ రాజస్వభావానికి విరుద్ధమైన కరుణ, జాలి వంటి గుణాలే ఈ సంక్లిషతకు కారణమని  అవగాహన ఏర్పడింది. ఆ భావన కలిగించింది అప్పటి వరకు తాను కేవలం మిత్రుడిగా భావించిన యదువంశ సంజాతుడు శ్రీకృష్ణుడే. ఎదుట ఉన్న ఆ వ్యక్తి తన బాంధవుడిగా మాత్రమే భావించి తన మనోభావాలని యధేచ్ఛగా పంచుకున్నావాడల్లా జగద్గురువన్న ఎరుక కలిగిన మరుక్షణమే అతనని తన మార్గదర్శుగా ఎంచుకున్నాడు. తగిన కార్యాచరణ సూచించమనే స్థాయి వరకు  దిగివచ్చాడు.  తనను శాసించే సర్వాధికారాలు సమర్పించే దాసస్థితికి ఆ నరుడు చేరువ అయినప్పుడుగాని ఆచార్యుడు కర్తవ్యబోధకు పూనుకోలేదు. 

నరుడికి ఓపిక లేకపోవచ్చును గాని.. నారాయణుడిలోని పెద్దరికనికి  ఎందుకుండదు! పెద్దలూ, పిన్నలతో గీతలోని ఆచార్యుని ర్తీలోనే  సాగాలని  ఈ శ్లోక సారం. 

పండు పిందె దశలో ఎలా వగరుగా ఉండి రుచికి హితవుగా ఉండదో.. పిల్లల ప్రవర్తనా ప్రాథమిక దశల్లో సమాజపోకడలకు విభిన్నంగా సాగుతూ సబబనిపించదు. పిందె పచనానికి పనికి రాని విధంగానే పిల్లలూ బాల్యదశలో పెద్దల మార్గానికి భిన్నమైన దారుల్లో పడిపోతూ ఇబ్బందులు కలిగిస్తారు.  తమ శక్తి సామర్థ్యాల, శక్తియుక్తుల పరిమితులు గ్రహణకొచ్చిన తరువాత తప్పక పెద్దలను ఆశ్రయిస్తారు. ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం భారతంలోని కృష్ణపరమాత్మునికి మల్లే సద్వినియోగం చేసుకోవడమే పెద్దల కర్తవ్యం- అని ఈ శ్లోకం ప్రబోధిస్తుంది.


గీత కేవలం భగవానుని ఉవాచ మాత్రమే కాదు. ఆ ఆధ్యాత్మిక కోణంతో పాటు అదనంగా వ్యక్తిత్వ వికాస సంబంధమైనదని కూడా ప్రపంచం క్రమంగా గుర్తిస్తున్నదిప్పుడు. నిత్య జీవితానికి అక్కరకొచ్చే సూక్తులని గ్రహించి ఆచరణలో పెట్టే వారందరికీ 'గీత' ఎప్పుడూ అందే  ద్రాక్షాపండే!

 -కర్లపాలెం హనుమంతరావు

బోథన్, యూఎస్ఎ

07 -03 -2021

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...