ఎన్నికలైపోయాయి. ఓట్ల
కౌంటింగుకి ఇంకా వారం రోజుల గడువుంది. ఎక్కడ చూసినా టెన్షన్.. టెన్షన్!
ఎవరినోటవిన్నా రాబోయే
ఫలితాలను గూర్చి చర్చలే చర్చలు!
ఓటు వేసినవాడే ఇంత
టెన్షన్లో ఉంటే.. ఓట్లు వేయించుకున్నవాడు ఇంకెంత వత్తిడిలో ఉండాలి! రాంభద్రయ్యగారు
ఓట్లేయించుకుని ఫలితాల కోసం నరాలుతెగే ఉత్కంఠతో ఎదురుచూసే వేలాదిమంది అభ్యర్థుల్లో
ఒకరు.
అందరి గుండెలూ ఒకేలా
ఉండవు. కొందరు వత్తిళ్ళను తట్టుకుని నిలబడగలిగితే.. కొందరు ఆ వత్తిడికి లొంగి
బక్కెట తన్నేస్తారు. రాంభద్రయ్యగారు ఆ సారి అదే పని చేసి సరాసరి స్వర్గ
నరక మార్గాలు చీలే కూడలి దగ్గర తేలారు.
ఆ సరికే అక్కడో మంగళగిరి
చేంతాండంత క్యూ! ఆమ్ ఆద్మీలకంటే ఈ మాదిరి చేంతాళ్ళు
అలవాటే గాని.. జనవరి ఒకటి, శనివారం కలిసొచ్చే రోజైనా తిరుమల శ్రీవారి సుప్రభాతసేవ
దర్శనానిక్కూడా క్యూలో నిలబడే అగత్యం లేని బడేసాబ్ రాంభద్రయ్యగారిలాంటివారికీ క్యూ
వరసలు పరమ చిరాకు పుట్టించే నరకాలు.
ఇదేమీ భూలోకం కాదు.
లాబీయింగుకు ఇక్కడ
బొత్తిగా అవకాశం లేదు. తన వంతుకోసం ఎదురుచూడడం
రాంభద్రయ్యగారికేమో అలవాటు లేని యవ్వారం. అక్కడికీ ఎవరూ
చూడకుండా స్వర్గం క్యూలో చొరబడబోయి కింకరుడి కంట్లో పడిపోయారు పాపం.
'ఇదేం మీ
భూలోకం కాదు. మీ చట్టసభల్లో మాదిరి ఇష్టారాజ్యంగా గెంతడాలు కుదరవు. ముందక్కడ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి. ఆ
ఫలితాన్నిబట్టే నీకు స్వర్గమో.. నరకమో తేలేది. నువ్వొచ్చి యేడాదికూడా కాలేదు.
అప్పుడే అంత అపసోపాలా బాబయ్యా? నీ నియోజకవర్గంలో జనం పింఛను
కోసం, జీతం కోసం, రేషన్ కోసం, గ్యాసుబండల కోసం,
అధికారుల దర్శనం కోసం..
ఎన్నేసి రోజులు నిలువుకాళ్ళ కొలువు చేస్తారో నీకేమైనా అవగాహన ఉందా?' అని గదమాయించాడు దే.దదూత (దేవుడు, దయ్యం కలగలసిన అంశ- దే.దదూత)
'ఆ భూలోక రాజకీయాలు ఇప్పుడంతవసరమా దూతయ్యా? వెనకెంత క్యూ ఉందో చూసావా?ముందు నా
స్వర్గం సంగతి తెముల్చు!' పాయింటు లేనప్పుడు టాపిక్కుని
పక్కదారి పట్టించే పాతజన్మ చిట్కా ప్రయోగించారు రాంభద్రయ్యగారు.
చిత్రగుప్తుడి
దగ్గరకొచ్చింది కేసు.
సెల్లో ఆయనగారెవర్నో
కాంటాక్టు చేసినట్లున్నాడు.. రాంభద్రయ్యగారిని చూసి అన్నాడు 'ఓకే పెద్దాయనా! మీరేమో
రాజకీయనేతలు! కనక ప్రత్యేక పరీక్ష పెడుతున్నాం. మామూలు ఓటర్లకు మల్లే మీకు పాత జీవితం తాలూకు పాప పుణ్యాలతో నిమిత్తం లేదు.
ప్రజాస్వామ్యయుతంగా మీకు మీరే స్వర్గమో.. నరకమో ఎన్నుకోవచ్చు..'
'నాకు స్వర్గమే కావాలయ్యా!'
'ఆ తొందరే వద్దు. ఆసాంతం వినాలి ముందు. ఎన్నుకోవడానికి ముందు ఒకరోజు నరకంలో.. ఒకరోజు స్వర్గంలో గడపాలి..'
'ఐతే ముందు నన్ను స్వర్గానికే పంపండయ్యా!'
'సారీ! రూల్సు ఒప్పుకోవు. ముందుగా నరకానికి వెళ్ళి రావాలి.. ఆనక స్వర్గం' అని దే.దదూత వంక సాభిప్రాయంగా చూసాడు
చిత్రగుప్తుడు. అర్థమైందన్నట్లు రామచంద్రయ్యగారి భుజం మీద చెయ్యేసి బలంగా కిందికి
నొక్కాడు దేదదూత.
కనురెప్పపడి లేచేంతలో
కంటి ముందు.. నరకం!
నరకం నరకంలా లేదు!
స్వర్గంలా వెలిగిపోతోంది. మెగాస్టార్ చిత్రం ఫస్ట్ షో సందడంతా అక్కడే ఉంది. మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లు. మనస్సును
ఆహ్లాదపరిచే బాలీవుడ్ మిక్సుడ్ టాలీవుడ్ మ్యూజిక్కు! ఎటు చూసినా పచ్చలు, మణిమాణిక్యాలతో నిర్మితమైన రమ్యహార్మ్యాలు! హరితశోభతో అలరారే సుందర
ఉద్యానవనాలు! మనోహరమైన పూలసౌరభాలతో వాతావరణమంతా గానాబజానా వాతావరణంతో
మత్తెక్కిపోతోంది. మరింత కిక్కెంకించే రంభా ఊర్వశి మేనక తీలోత్తమాదుల అంగాంగ
శృంగార నాట్యభంగిమలు!
పాతమిత్రులందర్నీ అక్కడే
చూసి అవాక్కయిపోయారు రాంభద్రయ్యగారు. అక్రమార్జన చేసి కోట్లు వెనకేసిన స్వార్థపరులు, వయసుతో నిమిత్తం లేకుండా ఆడది కంటపడితే
చాలు వెంటాడైనా సరే కోరిక తీర్చుకునే
కీచకాధములు, అధికారంకోసం మనిషుల ప్రాణాల్ని తృణప్రాయంగా తీసే పదవీలాలసులు, ఉద్యోగాలు.. ఉన్నతకళాశాలల్లో సీట్లకు బేరం పెట్టి కోట్లు కొట్టేసి
ఆనక బోర్డ్లు తిరగేసే ఫోర్ ట్వంటీలు, పాస్ పోర్టులు, సర్టిఫికేట్లు,
కరెన్సీ నోట్లు, మందులు, సరుకులు వేటికైనా చిటికెలో నకిలీలు తీసి మార్కెటుచేసే మాయగాళ్ళు, నీరు, గాలి, ఇసుక, భూమిలాంటి సహజ వనరులపైనా అబ్బసొత్తులాగా
దర్జాగా కర్రపెత్తనం చేసే దళారులు.. అంతా ఆ అందాలలోకంలో ఆనందంగా తింటూ, తాగుతూ,
తూలుతూ, పేలుతూ యధేచ్చగా చిందులేయడం చూసి
రాంభద్రయ్యగారికి మతిపోయినంత పనయింది. సొంత ఇంటికి వచ్చినట్లుంది. అన్నిటికన్నా అబ్బురమనిపించింది.. తెలుగుచిత్రాల్లో పరమ వెకిలిగా
చూపించే యమకింకరులుకూడా చాలా ఫ్రెండ్లీగా కలగలిసిపోయి వాళ్ల మధ్య కలతిరుగుతుండటం!
అతిథుల భుజాలమీద
ఆప్యాయంగా చేతులేసి, బలవంతంగా సుర లోటాలు లోటాలు తాగించడం.. మిడ్ నైట్ మసాలా జోకులేస్తూ జనాలను అదే పనిగా నవ్వించడం.. ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదా
ఆతిథ్యం. కడుపు నింపుకునేందుకు అన్ని రుచికరమైన పదార్థాలు సృష్టిలో ఉంటాయని
అప్పటివరకు రాంభద్రయ్యగారికి తెలియనే తెలియదు. రోజంతా ఎంతానందంగా గడిచిందో ..
రోజుచివర్లో.. చీకట్లో ఏకాంతంలో అతిలోకసుందరులెందరో బరితెగించి మరీ ఇచ్చిన సౌందర్య ఆతిథ్యం ఎన్ని జన్మలెత్తినా
మరువలేనిది.
ఆ క్షణంలోనే
నిర్ణయించేసుకున్నారు రాంభద్రయ్యగారు ఏదేమైనా సరే ఈ నరకాన్ని చచ్చినా వదులుకోరాదని.
కానీ.. షరతు ప్రకారం
మర్నాడంతా స్వర్గంలోనే గడపాల్సొచ్చింది పాపం రాంభద్రయ్యగారికి. స్వర్గం మరీ ఇంత
తెలుగు ఆర్టు ఫిలింలా డల్ గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మనశ్శాంతికోసం
సాంత్వనసంగీతమంటే ఏదో ఒక ఐదారు
నిమిషాలు ఓకేగానీ.. మరీ రోజుల తరబడి ఆకాశవాణి నిలయవిద్వాంసుల కచేరీ తరహా అంటే.. మాజీ
ప్రధాని మన్మోహజ్ జీ సారుకయినా తిరగబడాలనిపించదా? ఒక వంక కడుపులో పేగులు కరకరమంటుంటే ఆ ఆకలిమంటను చల్లార్చడానికి ఏ ప్యారడైజ్ బిర్యానీనో పడుతుంటే మజాగానీ ..
అజీర్తి రోగి మాదిరి అసలాకలే లేని హఠయోగమంటే.. ఎంత స్వర్గంలో ఉన్నా నరకంతో సమానమే
గదా! దప్పికతో నిమిత్తం లేకుండా ఏ బాగ్ పైపరో.. ఆఫీసర్సు ఛాయస్సో..
స్థాయినిబట్టి ఆరగా ఆరగా ద్రవం గొంతులోకి చల్లగా జారుతుంటే కదూ.. స్వర్గం జానా బెత్తెడు దూరంలోనే ఉన్నట్లండేది!
ఎంత అతి మధురామృతమైనా ఒక బొట్టు మొదట్లో అంటే మర్యాదకోసం’ చీర్స్’
కొట్టచ్చుగానీ.. అదే పనిగా అస్తమానం లోటాల్లో పోసి గుటకేయాల్సిందేనంటే.. ‘ఛీ!’ అంతకన్నా నరకం మరోటుంటుందా? ఆకలిదప్పులు, నిద్రానిప్పులు, మంచిచెడ్డలు, ఆరాటాలు..
పోరాటాలేవీ లేకుండా పద్దస్తమానం తెలిమబ్బులమీదలా తేలుతూ పారవశ్యం నటించాలంటే
రాంభద్రయ్యలాంటి ఆసులో కండెలకు అసలు అయే పనేనా?
'ఎవర్నుద్దరించేందుకు,
ఏం సాధించేందుకు స్వర్గసామ్రాజ్యంలో.. జన్మరాహిత్యం.. కోరుకోవాలి
బాబూ? రమణీయ విలాసాలు, రసికజన వినోదాలు,
రత్నఖచితాడంబరాలు.. యధేఛ్చావిహారాలు.. రుచికరాహారాలు, రసరమ్య పానీయాలు,. స్వర్గంలో దొరుకుతాయన్న మాట వట్టిబూటకమేనని
ఒక్క రోజులోనే తేలిపోయింది. వాస్తవానికి ఇవన్నీ పుష్కలంగా దొరికే చోటు నరకమే
అయినప్పుడు ఆ నరకంలోనే స్థిరనివాసం ఏర్పరుచుకోవడమే తెలివైన పని.
మర్నాడు చిత్రగుప్తుడిముందు ప్రవేశపెట్టబడినప్పుడు మరో
ఆలోచన లేకుండా నరకానికే ఓటేసేసారు
రాంభద్రయ్యగారు.
ఫార్మాలిటీసన్నీ పూర్తి
చేసుకుని అధికారిక పత్రాలతో సహా నరకంలోకి అడుగు పెట్టిన రాంభద్రయ్యగారికి కళ్ళు
బైర్లుకమ్మే దృశ్యం కంటబడిందీసారి.
నరకం మునుపటి స్వర్గంలాగా
లేదు. నరకంలాగేనే ఉంది. మూసీ వడ్డునున్న
మురికివాడకు నకలుగా ఉంది. మొన్నటి
వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి బొత్తిగా సాపత్యమే లేదు.
మొదటి దృశ్యం- డొనాల్డ్ ట్రంప్
భారతావనికి వచ్చేముందు తీర్చిదిద్దిన అహమ్మదాబాదునగరం.
రెండో దృశ్యం- కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కిన మర్నాటి అమరావతినగరం.
పైనుంచీ ఆగకుండా అదే
పనిగా వర్షిస్తున్నది చెత్తా చెదారం. ఆగకుండా ఆ చెత్తను ఎతిపోస్తున్నది
వేలాదిమంది కూలీజనం. నిజానికి వాళ్లంతా మొన్నరాంభద్రయ్యగారు సందర్శనార్థం విచ్చేసినప్పుడు- పిలిచి ఆతిథ్యమిచ్చిన నరక గేస్తులు! భూలోక
నేస్తులు! వాళ్ల వంటిమీదిప్పుడు
వేళ్లాడుతున్నవి అప్పటికి మల్లే చీని చీనాంబరాలు కాదు. చివికి, చిరిగి, చీలకలైన మసి
పేలికలు! చేతుల్లో పెద్ద పెద్ద చెత్తబుట్టలున్న ఆ పెద్దమనుషులంతా
భూమ్మీద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన
వి.వి.వి.వి.ఐ.పి లు! పనిలో ఒక్క సెకను అలసత్వం చూపించినా చాలు
వాళ్ల వీపులమీద కొరడా దెబ్బలు ఛళ్ళుమని పడుతున్నాయి.
ఆ కొరడాధరులంతా మొన్న ఇదే చోట శిబిని, అంబరీషుణ్ణి మరిపించిన ఆతిథిమర్యాదలతో రాంభద్రయ్యగారిని మురిపించిన యమకింకరులే!
నోటమాట రాకా మాన్పడిపోయిన
రాంభద్రయ్యగారి చేతిలో ఓ పెద్ద చెత్తబుట్ట పెట్టి ముందుకు తోసాడో కింకరాధముడు. ఆగ్రహం
పట్టలేక నరాలు చిట్లేటంత బిగ్గరగా గావుకేక వేసారు
రాంభధ్రయ్యగారు 'మోసం!.. దగా! మొన్న నరకానికి స్వర్గధామంగా విపరీతమైన
కలరింగిచ్చి.. ఇవాళీ నరకంలో పారేయడం నమ్మక ద్రోహం.. కుట్ర!'
తాపీగా సమాధానమిచ్చాడా
యమకింకరుడు 'ద్రోహానికి..
కుట్రకి.. ఇదేం మీ భూలోకం కాదు మానవా!
నువ్వు నరకాన్ని చూసిన రోజు మా స్వర్గ నరకాల ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు. ఎలక్షన్లు అయిపోయాయి. నువ్వు ఎన్నుకున్న నరకానికే కదా
నిన్ను తరలించిందిప్పుడు? ఇందులో మోసం.. దగా ఉంటే.. మీ
భూమ్మీద జనానికి మీరు చూపించే హామీలల్లోనూ మోసం.. దగా
ఉన్నట్లే లెక్క! ముందే చెప్పాం గదా! భూమ్మీద మీలాంటి నాయకులు
నడిపిస్తున్న ప్రజాస్వామ్య విధానాలనే మేమూ ఇక్కడ మా లోకాల్లో
అనుసరిస్తున్నామీ మధ్య' అన్నాడు కింకరుడు కొరడా రాంభద్రయ్యగారి
వీపుమీద ఝళిపిస్తూ!
'అబ్బా!' అని
రాంభద్రయ్యగారి పెడబొబ్బ. అది కొరడా దెబ్బో.. ప్రజాస్వామ్యం దెబ్బో ఎవరికి వారుగా జనాలకు హామీలు గుప్పించి గద్దెనెక్కేవాళ్ళే
అర్థంచేసుకోవాలబ్బా!
స్వస్తి!
కర్లపాలెం హనుమంతరావు
***
No comments:
Post a Comment