Friday, March 12, 2021

వీళ్ళు మారర్రా బాబూ! - సరదాకే - కర్లపాలెం హనుమంతరావు

 



 

‘అబద్ధాల శక్తి ఏంటో నాకు మించి తెలిసిన పురాణ పాత్ర మరోటి లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే బెట్టుసరికి పోతే మన శ్రీరామచంద్రమూర్తి బాటలోనే చెట్టు పుట్టలు .. ‘

రామయ్య ప్రస్తావనలు ఇప్పుడొద్దు హరిశ్చంద్రా! రోజులని బట్టి నడత మార్చే అవకాశవాది  అవసరం. విభీషణుడేమైనా మళ్లీ మన వైపుకు వస్తాడేమో.. ఓ ప్రయత్నం జరిగితే బావుణ్ణు ముందు!

నిండు సభలో కూడా పెద్దలంతా చూస్తుండంగా ఎంతో గుండెధైర్యంతో ఓ శీలవతిని ఈడ్చుకొచ్చాడే! అన్న చెప్పీ చెప్పగానే మరో దుశ్శంకకు పోకుండా.. తల్లిలాంటి శీలవతి  చీర మీదంత నిర్లజ్జగా చేయ్యేశాడే..   దుశ్శాసనుణ్ణి మనం మళ్లీ మన  సలహాదారుల హోదాలోకి తిరిగి తెచ్చుకొనే పని చూసుకోవాల్సిందన్నాయ్!  

మంచి మాట! మంచి సలహాలిచ్చే విదురుళ్ల వంటి చెత్త సరుకుతో పార్టీ చెదలు పట్టిపోతుందేమోనని దిగులుగా ఉందబ్బీ! ఎంత కాలం ఒక్క నా దొంగ పాచికల మీదనే మహాభారతం ఆసాంతం నడిపించగలుగుతాం!

మామా! ఒక్క భారతాన్ని మాత్రమే పట్టుకు వేళ్లాడుతుంటే  మనకు అస్త్రాలు ఆట్టే దొరిగే అవకాశం లేదు. ఔటాఫ్ బాక్స్ థింకింగ్ అవసరం ప్రస్తుతం! అరాచకమైన ఆలోచనలు చేస్తే తప్ప విజయాలు సిద్ధించని దిక్కుమాలిన రోజులివి. జూదంలో మాయ చేసి ఏదో ఓ పథ్నాలుగేళ్లు జనం కళ్ల బదకుండా దూరంగా నెట్టేశాం గానీ, అ దాయాది పాండవులను. ఇచ్చిన గడువు ఇట్టే కరిగిపోయింది! ఈ సారి ఏ ఐదూళ్ల కోసమో దేబిరించి రాయబారాలు నడిపిస్తారనుకోడం మన భ్రమ.

నిజమే! వేగులవాళ్లు తెచ్చిన దుర్వార్తల ప్రకారం ధర్మారాజుక్కూడా అధర్మ వర్తనలో శిక్షణ ఇప్పిస్తుట్లు సమాచారం..

ఎవరూ? దొంగిలించి తినందే వెన్నైనా ముద్ద గొంతు దిగదనే ఆ కన్నయ నిర్వాకమేనా ఇదంతా!

అతగాడిని ఆడిపోసుకునీ ఉపయోగం ఏముందిలే? ఉత్తరకుమారులు నిజానికి ఆ పక్షంలో ఉన్నది ఏ ఒకరో ఇద్దరో! మన దగ్గరో?

ఇప్పుడెందుకులే మామా ఆ దిక్కుమాలిన లెక్కలన్నీ! కురుక్షేత్రం ఏ క్షణంలో అయినా రావచ్చనే వార్తలు వినవస్తున్నాయ్! దుష్ట శక్తులన్నింటినీ చేజేతులా దూరం చేసుకొనే వ్యూహం ఏమంత మేలని? ముందా సంగతి మీద కదా మన ధ్యసంతా ఉండాల్సిందీ!

అల్లుడూ! నీ అమాయకత్వం ఇట్లా అఘోరించబట్టే అవతల భీముడు అనుక్షణం అట్లా పెట్రేగిపోతున్నది. అర్జునుడు    వాసుదేవుడి దగ్గరికి రాయబారం వెళుతున్నట్లు వార్త! అప్రమత్తం అవు ముందు!

చెప్పు మామా! పెద్దలందరూ ‘థూఁ.. ఛాఁ’ అంటున్నా.. నువ్ చెప్పినట్లే కదా.. తు. చ తప్పకుండా అందరం ఆచరిస్తోందిక్కడ. అడవులకు తరిమి కొట్టమన్నావ్! లక్క ఇళ్లు తగలెట్టమన్నావ్! ఎక్కడ దాక్కున్నారో బైటపడ్డానికి గోవుల గ్రహణం పేరుతో విరాటరాజు మీదకు విరుచుకుపడమన్నావ్! మరిప్పుడే అఘాయిత్యం చెయ్యమన్నావో.. అదీ నువ్వె చెప్పు!

లోపలికొస్తే మళ్లీ బైటకు వెళ్లలేనంత పకడ్బందీగా పద్మవ్యూహం ఉంది. దాన్ని గురించి ఆలోచించల్లుడూ! బుద్ధిమంతులైన పెద్దలు చాలా మంది ఇంకా ధర్మరాజుకే విజయం దక్కాలని మనసులో ప్రార్థిస్తున్నారు. వాళ్లందరి నెత్తి మీదా ఇప్పట్నుంచే గెలిచే బాధ్యతలు రుద్ధిపెట్టు ముందు. దర్మాన్ని గురించి మీమాంస పడేందుకు క్షణమైనా ఖాళీగా కూర్చోనివ్వద్దా ముసలి మొద్దులను. నీ గుడ్డి తండ్రి నీ వైపే ఉన్నా.. ఒక్క బాబాయ్ విదురుడు చాలు బాబా అస్తమానం ఆయన చెవులో నీతుల వంకన ఓఁ అంటూ  రొద పెట్టడానికి. నీ ఒక్కగా నొక్క స్నేహితుడు కర్ణుడు మీద మాత్రమే భరోసా పెట్టుకుంటే కథ నడవదు. నేర్చిన విద్యలన్నీ సమయానికి మరిచే జబ్బున్నప్పుడు ఎంత మహారథి అయితే మాత్రమేంటి సాధించేదేముంది? నీ వంద మంది తమ్ముళ్ల పేర్లే నీకు సరిగ్గా గుర్తుకొచ్చి చావవు! అయినా వాళ్లందరికి మాత్రం నువ్వే ప్రత్యక్ష దైవం. చూసి రమ్మని కూడా నువ్వు చెప్పనక్కర్లేదయ్యా!.. కాల్చి రావడంలో మహా ఉత్సాహం చూపిస్తారందరూ! అదేదో బోడి రాజసూయయాగంలో కృష్ణుడికి ముత్తెమంత పెత్తనమిచ్చినందుకే శశిపాలుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశాడని వింటున్నాం! అట్లాంటి తిట్ల గుంపు నంతా మన వైపుకు తిప్పుకో  ముందు!

శకుని అల్లుడు దుర్యోధనుణ్ణి కూర్చో బెట్టుకుని  దుర్బోధలు చేస్తున్నాడు యధాశక్తి.. చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా చూసుకొనే ధ్యాస లేకుండా. సర్వాంతర్యామి  రావడం ఎవరూ గుర్తించలేదు.

'ఏం జరుగుతోందిక్కడ?' గద్దించాడు దేవుడు. శకుని దుర్యోధనులిద్దరూ నోరు మెదపలేదు.

అయినా సర్వేశ్వరుడికి ఒకరు చెప్పాలా? 'బోలెడంత భారతం సృష్టించి వచ్చారు ఈ లోకాలకు. గడ్డాలు పట్టుకు బతిమాలితే.. పోనీలే.. ఏదో ఒక అవకాశం ఇచ్చి చూద్దాం.. ఎంతటి కర్కోట నాయకుడైనాఅ మంచిగా  మారితే.. జనాలకే కదా ప్రయోజనం అన్న ప్రజాప్రయోజనం దృష్ట్యా దయతలచి కొంతకాల బెయిలిచ్చా. అభాగ్యులను సేవించుకుంటానని మాట ఇస్తేనే  ఒక అవకాశం ఇచ్చా! బెయిలులో ఉండీ మీ బుద్ధి పోనించుకుంటున్నారు కాదిద్దారూ! చేసిన తప్పులు సరిదిద్దుకొనే బదులు గిట్టనోళ్లను మట్టుపెట్టేందుకు మళ్లీ మరో కురుక్షేత్రం బాపతు  కుట్రకు తెర తీయబోతున్నారు! అదీ నా  స్వర్గం నుంచే! ఛీఁ! రసాతలమే మీ పులుసు తీసే సరయిన స్థలం.. ఎవరక్కడ.. ' అంటూ బిగ్గరగా కింకరుల కోసమై చప్పట్లు కొట్టాడు దేవుడు పరమ చిరాగ్గా.

-కర్లపాలెం హనుమంతరావు

12, మార్చి, 2021

***

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...