Friday, March 12, 2021

విచ్చలవిడితనానికా పచ్చలపతకాలు! -వ్యంగ్యం -కర్లపాలెం హనుమంతరావు

 



 

‘రామా!’ అన్నా ‘రా.. అమ్మా!’ లాగా అవిపిస్తోందీ మధ్యన మరీను! రాజకీయాలల్లో  సూత పురాణాలెలాగూ వినిపించడం లేదిప్పుడు.. బూతు పురాణాలే ఎక్కువై పోయాయి.. ఖర్మ! ‘బూత్’ స్థాయినుంచీ ఎదిగొచ్చే నేతలు బూతులు కాక నీతులు వల్లిస్తారా? అని ఎదురడిగే బుద్ధిమంతులకో పెద్ద నమస్కారం.

 జాతికి నీతులు చెప్పే రామాయణమే వాల్మీకులవారి వ్యాకులం నుంచి పుట్టిందంటారా! పరమ శాంత గంభీర మూర్తి రామచంద్రుడి పక్కనున్నదే సాక్షాత్తు పోతపోసిన కోపమూర్తి లక్ష్మణుడని దబాయింపా! మరో నమస్కారం!

 కంసుడి హింస లేకుంటే కృష్ణావతార కష్టం విష్ణుమూర్తికి తప్పుండేది కదా? సత్యభామ పువ్వుకోసం అలా అలక్క పోయుంటే కృష్ణభక్తి ప్రకటనకి  ఆస్కారముండేదా? అని వాదమా? తమరి వితండానికో దండం!

 అలుగుటయే యెరుంగని  ఆ మహామహితాత్ముడు ధర్మరాజే అలా అలవోగ్గా అలగ్గా లేనిది ఉప్పు కారాలు పప్పుబెల్లాల్లా మెక్కే నోళ్ళను మన మాజీ ప్రధాని మన్మోహన్ గారి స్టైల్లో మౌనంగా పడుండమనడం న్యాయమా? అని దబాయించే వారికైతే జవాబే లేదింక.

భగవంతుణ్ణి చేరేందుకు భక్తి కన్నా వైరమే దగ్గరి దారని గదా సుందోపసుందులలా రాక్షస మార్గం ఎంచుకుంది? పదవంటే దైవం కన్నా మిన్నగా భావించే  నేతలు ఎందరో. మరా రాక్షసతాతల అడుగుజాడల్లో నడిచినా ఆగడమేనా? అని గదమాయించేవారి నోరు మూయించే కన్నా మన  చెప్పుతో  మన చెంపల్నే మొత్తుకోవడం ఉత్తమం.

కోపతాపాలివాళే ఏమన్నా కొత్తగా పుటుకొచ్చాయా? తారకాసురుణ్ణి చంపే వీరకుమారుడి కోసం మారుడు పాపం ఎంత చేసాడూ? వట్టినే కాలుడి కంటిమంటకు కాలి బూడిదై పోలేదూ? సీతా స్వయంవరణమేంటి? మూలనున్న శివధనుస్సుకు మూడటం ఏమిటి?

కాలికి గుచ్చుకున్న ముల్లుకేమన్నా ప్రాణముందనా.. కసిగా కాల్చి మరీ కోకోకోలా మాదిరి  చాణక్యుడలా కడుపులో పోసుకుందీ? బోజనాలకి సరిగ్గా పిలవలేదని ఒహళ్ళూ, దండిగా సంభావనలు అందలేదని ఒహళ్ళు.. ఒళ్ళూ పై తెలీకుండా సిల్లీ కారణాలతో  పిల్లినో పిచ్చుకనో అడ్డం పెట్టుకుని  అడ్డమైన   శాపానర్థాలు పెట్టిన పుణ్యమూర్తులు పుట్టలు కొద్దీ ఉన్న గడ్డా కాదా మనది? అని గుడ్లెర్ర చేసే పెద్దలకు బుద్దులేం చెబుతాం?

దూర్వాసులు, పరశు రాములు, కన్నబిడ్డలని కూడా చూడకుండా అడుక్కు తినమని తిట్టిపోసిన విశ్వామిత్రులు.. వీళ్ళంతా.. అంటే కళ్ళు పోతాయేమో గానీ.. అవతార పురుషులు.. మహర్షులూనా? అవసరార్థం ఏదో రాజకీయంగా పట్టుకోసం తిట్టిపోసుకునే మేం తుంటరి మూకలమూనా? అని హంటర్తో కొట్టినట్లు మరీ గదమాయిస్తుంటే మన  కంటివెంట నీళ్ళెలా రాకుండా ఉంటాయి చెప్పండి!

అమృతంకోసం పాలసముద్రం చిలికితే హాలాహలం పుట్టింది ముందా పై లోకంలోనే. ఆ గరళం గొంతులో వంపుకోడానికి  గంగాధరుడున్నాడు అప్పట్లో. ఇప్పటి ఈ శబ్దకాలకూటాన్ని మింగి ఆ హరుడైనా ఎంతవరకు  హరాయించుకోగలడో అనుమానమే మరి!

శిశుపాలుడు  గోపాలుణ్ణి తిట్టిపోసాడంటే అర్థం చేసుకోవచ్చు. మరి గుడి కట్టి గొప్ప రామదాసుణ్ణని చెప్పుకొన్న కంచెర్ల గోపన్నా పడతిట్లనే ఎందుకు నమ్ముకున్నట్లో? కీర్తినిందలు పడని ఒక్క దేవుడైనా తెలుగునాడుల్లో ఉన్నాడా? పరమాత్ముడంటే గుళ్ళో విగ్రహంమల్లే ఏవీ చెవిబెట్టుకోడు. మనిషి పాపాత్ముడే! రెండు చెవులు దొప్పల్లా విచ్చుకుని చచ్చాయే! కాబట్టే సీసం కోసం ఈ వెదుకులాట! చెవుల్లో పోసుకుని ప్రశాంతంగా రోజులు వెళ్ళబుచ్చేకన్నా గొప్ప అదృష్టం లేదు ప్రస్తుతం.

 ఎండకూ వానకూ  చలికీ తట్టుకుని గంటలకొద్దీ ఓపిగ్గా వరసలో నిలబడి  ఓట్లేసి మన మాటగా నేతల్ని చట్టసభలకు  పంపిస్తున్నది ఓ పనై పోతుందిలెమ్మనైతే కాదు గదా! జనం మంచి చెడు, కష్టం సుఖం వివరంగా చర్చించి.. బతుకులు సుఖంగా వెళ్ళమారే దారులేవో కనిపెడతారనేగా దొరలు! 

 చేజేతులా చెడ్డపేరు తెచ్చుకుంటున్నారని జనం ఇప్పటికే  చెవులు కొరుక్కుంటున్నారు. కొరుకుళ్ళు పెరక్క ముందే పెద్దలు నోళ్ళు అదుపులో పెట్టుకోవడం  వాళ్లకే మంచిది.  ముక్కుమీద కోపం మగువల ముఖాలకైతే   అందమేమో గానీ.. ప్రజాపతినిధులకు మాత్రం ప్రతిబంధకమే.

 తన కోపమే తన శత్రువు. చిన్నపిల్లలకేనా.. ప్రజాస్వామ్యాన్ని చిన్నబుచ్చే  పెద్దలకూ పనికివచ్చే నీతి సూత్రం బాబూ ఇది!  ఆవేశంలో ఉన్నప్పుడేవీ  కనిపించడు గాని అవకాశం దొరికినప్పుడు మాత్రం చావు దెబ్బ కొట్టకమానడా శత్రువు.

 ప్రతిపక్షమంటే ప్రజల తరుఫున చట్టసభలకొచ్చే చుట్టం. అధికార పక్షమంటే జనామోదం పరీక్ష నెగ్గిన పట్టం . ఎంత పునీతయి అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా  సీతమ్మవారు  ఓ తాగుబోతు మనిషి మతిలేని మాటలవల్ల అంతఃపురానికి దూరమయింది. ప్రజాస్వామ్యంలో కనీసం ఎన్నికల సమయంలోనైనా జనమే స్వామీ స్వాములింకా మన దేశంలో. జనం ఘోష పట్టించుకోని భాషతో ఏం సాధిద్దామణొ పెద్దల ఉద్దేశం?

ఎప్పుడో తీరికున్నప్పుడు కాశీకి పోయి గంగలో వదిలేసి వచ్చే ఇష్ట పదార్థం కాదు క్రోధం. ప్రజాక్షేత్రమే  సదా పునీతంగా సేవించుకోవలసిన కాశీ,  ప్రయాగలు రాజకీయ నాయకులకు.

ప్రజాస్వామ్య నాటకంలో గయుడంటే ఓటేసి పెద్దలను గద్దెనిక్కించిన సామాన్యుడు. కృష్ణార్జునుల మధ్య యుద్ధం పద్యాల్లాగా వినేటంత వరకే వినోదం. గయుడికే గతి పట్టించారా పెద్దలంతా కలసి  చివరికి? అన్నదే ప్రదర్శన విజయానికి నిదర్శనం.

 కొత్త ఏడాది ప్రారంభమయినందుకైనా  నేతలు పాత కక్షలు మర్చిపోతే మంచిదనుకున్నాం. ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపిస్తే .. మంచిదే కానీ.. దాం దుంప తెగనంపిరి.. అసలు చెంపలు బాదుకోడానికా మనం ప్రజా ప్రతినిధులను చట్టసభలకు పంపిటం!

 కుప్పించి లంఘించిన కుండలాల కాంతి పోతన భాగవత పద్యం వరకైతే హృద్యమే కానీ.. కుప్పిగంతులతో రాజకీయాన్ని చిందు భాగోతంగా మారిస్తే ముర్దాబాదులతో మోతెక్కిస్తారు ఎన్నికల్లో మోసిన జనమే!

 క్రికెట్ లో ‘నో బాల్’ వివాదం ప్రపంచ కప్పు  వరకే పరిమితం. ‘డాటర్సాఫ్ ఇండియా’ ..  ఓ రెండు దేశాల విదేశాంగ విధానాలమీదే ప్రధానంగా సర్దుబాటు.

రాజ్యాంగంమీదో.. దేవుడిమీదో  ప్రమాణం చేసి మరీ జనంకోసమని  చట్టసభల్లోకొచ్చి కూర్చున్న పెద్దలకు మరి మనం నచ్చచెప్పేదేముంది? కుబేరుడొచ్చి బడ్జెట్ సమర్పించినా  కుంటి సాకులు వెదికితే నైజం జనం క్షమించి వదిలేస్తారనే? పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదన్న ఓర్పు ప్రభుత్వ పక్షానికి ఉంటేనే ప్రజా తీర్పు శిరసావహించినట్లవర్షాలు లేకపోతే ఎలాగో తట్టుకోవచ్చు. తిట్ల వర్షాల పోటెత్తుతుంటే జనం ఎంతకాలమని తట్టుకోగలరు? విచ్చలవిడితనానికి మెచ్చి అధినేతలు కప్పే శాలువలకోసం ముచ్చట పడద్దు!  ముచ్చెమటలు పట్టించే ఎన్నికల పండగలు ముందున్నాయి..  ఆ ముసళ్ళ నోళ్ళలో పడద్దు!  నేతలకు నోళ్ళున్నది లేనోళ్ళ నోళ్ళుగా పలకేందుకు! గుర్తుంచుకోవాలి.

-కర్లపాలెం హనుమంతరావు

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...