తిట్టు!.. తిట్టించు!
-కర్లపాలెం హనుమంతరావు
వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల ఆయుధం-కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా సాగే ప్రజల స్వాముల వాదం. ఎలక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ ఈ ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.
ఎన్నికలయిన తరువాత సాగే గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు ఓటర్ల బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు గానిఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే సాక్షాత్తూ ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం!
తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చస్తార’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక బాదర్ అవలేదు. కానీ ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద ఆట్టే నమ్మకంలేదు. తలనొప్పి తద్దినమంతా ఎందుకులెమ్మనే నాయకులంతా ఎన్నికల తుమ్ములు వదిలే వరకూ ‘ఓటర్లే దేవుళ్లు’ అంటూ అష్టోత్తరాలు, సహస్రనామాలు అందుకునేది! నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయిని ఓ మెట్టు కిందికి దిగలాగడవేఁ!
కాసుల పురుషోత్తమం అని ఓ కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును పట్టుకుని దులిపేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే.. ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులా! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మో అయితే, నువ్వే ఏదో కామితార్థుడివన్నట్లు వీర పోజులా! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకుబ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకుతో ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుకుంటివి కదా! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని నీకు ఎందుకయ్యా పతితపావనుడుల్లాంటి బిరుదులసలు? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ దామోదరుడివవే(పనికిమాలినవాడివి) సుమా!’ అంటూంటే.. అది తిట్టో.. మెప్పో తెలీక ఆ దేవుడు గుళ్లోని రాయికి మల్లే గమ్మునుండిపోయాడు!
దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు నుంచి భక్తుడికి ఠక్కున ఆఫరొచ్చే జంపింగ్ జమానా ఇది మరి!
ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే ఏ మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో మటుమాయం చేసుకోవచ్చు. ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయలిప్పుడు మరీ పాతకాలం నాటి నాటురథాలనుమాత్రమే నమ్ముకుని ఉత్సాహపడే ఉత్సవ విగ్రహాలు కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా.. ఓటు మిషను మీట నొక్కే మనిషి కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా పుచ్చుకునేందుకు పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పది, పదిహేనువేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ ‘స్టేటు’ దాకా ఎగదోసింది. మసిపూసి మారేడుకాయ చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమో గాని, కడుపు మండితే ఓటరే ఉల్ఫాగా ఊరేగే నేతల ముఖాన కసి కొద్దీ బుడ్ల బుడ్ల సిరా పూసి సీన్లు ఖరాబు చేసే రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడ పుట్ట బట్టే!
పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్ బాగ్ చూసాం కదా! అన్నదాతల ఆగ్రహమూ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి చొప్పించే కోపిష్టి ముఠాలను నేతలే ఇప్పుడు స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్టు? తిట్టి పోసిన వర్గాల మీదనే ఏ అయోథ్య రామయ్యను మించిన వరాల జల్లులు! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు. ఇహ బోడి మల్లయ్యల తిట్లంటారా? చెవుల్లో దూరకుండా దూదుండల సదుపాయానికి సర్కారు అధికార దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుంది కదా! అయినా, తిట్లక్కూడా ఉట్లు తెగే సత్యకాలమా.. మన పిచ్చిగానీ?
అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం! ‘ఒద్దికతో లక్ష్మి వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!’ అంటూ చెడ తిట్టిపోసినా దేవుళ్ళకూ చీమ కుట్టినట్లైనా నొప్పుండటంలేదిప్పుడు ! కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో, జాతి పేరుతో నోరుజారారనో, లైంగిక దృష్టితో చూసి వేధించారనో మనిషెంత మధనపడ్డాఅ.. యుద్ధకాండ సిద్ధపడ్డా .. నో బడీ కేర్స్! కోర్టు బోనుల్లో నిలబడాల్సినవాళ్ళే కోర్టు జోన్ల తరలింపు మీద ప్రకటనలిచ్చేస్తున్నారు! ఎక్కడైనా శాపనార్థాలు వినపడుతున్నాయా? ‘దండుకునేసమయం’ దండగ కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా కూడా ఉంటున్నదిప్పుడు!
దూర దూరంగా తగలడితే తూలనాడుకొనేటంత పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి మనం. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రావద్దంటే ఎట్లా? రామాంజనేయయుద్ధంలో రాముడికి.. ఆంజనేయుడికి మధ్యనే గలాటా జరిగి మాటలు రువ్వుకుంటే.. వింటూ ఎంజాయ్ చేసిన మనం ఈ నేలబారు నేతల కారుకూతలు ఏమంత ఎబ్బెట్టనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!
‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా కృష్ణుడు మందలిస్తే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునూరుకున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట ఎదురు పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు గట్రా విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా ఏ మాత్ర్రం తిట్టు వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలు ఇచ్చేస్తున్నారిప్పుడు. పోటీగా నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ నాలుకకు మరికాస్త పదును నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనం సైతం తొక్కేసే మూడులో లేరిప్పుడు. ఈ దుస్థితికి ఎవర్నని తిట్టుకోడం?!
తిట్టే వాడి మీద వెగటు పుట్టటం మాట అటుంచి..తిట్టించుకొనేవాడి మానసిక పరిస్థితి మీద వెకిలిగా తయారైన నకిలీ వీడియోలు విపరీతంగా వైరలవుతున్నాయిప్పుడు! వినే ఓటారే తిట్లు వీనులకు విందనుకునే దశకు వచ్చేశాడు జుట్టూ జుట్టూ పట్టుకునే సీన్లుంటేనే చట్టసభలు సజావుగా సాగినట్లు లెక్క! సమయానికి సభా ప్రసారాలు సడెన్ గా కట్ అయిపోతే సరదా కోసమా జనం చిందులేసేదీ?! కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్ పబ్లిక్ బాధ!
కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ మాత్రమే చేసుకుని పరమపదిస్తేనరకంలో కూడా ఎవరూ కనీసం మడతమంచాలవీ వేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వాతలు అదనంగా వడ్డిస్తారేమో కూడా.
అయినా బూతుపురాణాలన్నీ ఒక్క నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు తిట్టకపోతే మహా వెలితి బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగమహారాజులు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది! తిట్టుకు వందిస్తామనండి! తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని కోట్లమందుంటారో లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు మాత్రమే ప్రసాదంగా పెట్టించే పై దేవుళ్ల మీద పెదవి విప్పకుండా సాటి వాళ్లమనేగా మా మీదిన్ని సూటిపోటీ మాటలు?’ అని వాపోయే నేతలూ తక్కువేం లేరు మరి!
భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించే వేళ పశ్చిమం నుంచి బ్రహ్మముఖతః రౌద్రరసం ఉత్పన్నమయిందని శారదాతనయుడి 'భావప్రకాశం' వాదం. పోతనగారి ఆ ఆరభటీవృత్తి దక్షాధ్వర ఘట్ట ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే కొత్త నేతల హింస నచణ? ఉత్తి పుణ్యానికే వేలెత్తి చూపటానికేనా పాపం ఓటుకు అన్నేసి వేలు దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిని మనసులో అడ్డగాడిదనుకుంటున్నా ‘గాడ్..గాడ్” అంటూ కాళ్లట్టుకు వసుదేవుళ్లకు మించి నేతలు వేళ్లాడేదీ?
భాగవతం వేనరాజును విశ్వనాథ శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు కదా దాశరథీ భక్తుడు కంచెర్ల గోపన్న! కోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!' అంటూ దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?
'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' అన్నాడు .. 'కొత్త సిలబస్' అనే కవితలో బాలగంగాధర్ తిలక్. వింటానికి బానే ఉంటాయ్ కవిత్వాలెప్పుడూ! కానీ ఆ 'కొత్త సిలబస్' ఈ కొత్త సెంచరీలో పాతబడిపోయింది.. ఇంకా పాతరేయద్దంటే ప్రగతి ఎట్లా?
బూతు ఉందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలమా? అని మనగలవమా? ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా బొంగరంలా గింగుర్లు కొట్టేదిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటేనే శనిగ్రహం నిగ్రహం కోల్పోయేది! స్వగృహం పడగ్గదిలోనయినా సరే చాటుగా ఓ నాలుగు మోటు మాటలు బై హార్ట్ చేసుకునే బైటికి రావటం బుద్ధిమంతులకు చాలా బెటర్ ఇప్పుడు! చక్రం తిప్పడమనే చాతుర్యం ఒక్క దాని మీదే కసి పెంచుకుంటే చాలదీ అధికార కుతి కాలంలో! వక్రమార్గంలో అయినా సరే దానిని సంధించేందుకు ఒక్క క్షణం వెనుకంజ పడకూడదు. పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక పోతే పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితి లేదు ఏ స్థాయి నేతకైనా!.
ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో ఏదో 'చ'కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే అర్థాంతరంగా గండిపడిందంటారు. నన్నెచోడుడూ కుమారసంభవం ఆరంభంలో స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపించ బట్టే యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్నాడని మరో టాక్! తిట్టు వల్ల ఏ త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన తెగినట్లు లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు స్పష్టంగా లేకుంటే మాత్రం ఆ కుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత పడేదీ కాలంలో.
వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా సాగే ప్రజల స్వాముల వాదం. ఎలక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ ఈ ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.
ఎన్నికలయిన తరువాత సాగే గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు ఓటర్ల బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే సాక్షాత్తూ ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం!
తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చస్తార’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక బాదర్ అవలేదు. కానీ ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద ఆట్టే నమ్మకంలేదు. తలనొప్పి తద్దినమంతా ఎందుకులెమ్మనే నాయకులంతా ఎన్నికల తుమ్ములు వదిలే వరకూ ‘ఓటర్లే దేవుళ్లు’ అంటూ అష్టోత్తరాలు, సహస్రనామాలు అందుకునేది! నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయిని ఓ మెట్టు కిందికి దిగలాగడవేఁ!
కాసుల పురుషోత్తమం అని ఓ కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును పట్టుకుని దులిపేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే.. ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులా! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మో అయితే, నువ్వే ఏదో కామితార్థుడివన్నట్లు వీర పోజులా! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకు బ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకుతో ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుకుంటివి కదా! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని నీకు ఎందుకయ్యా పతితపావనుడుల్లాంటి బిరుదులసలు? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ దామోదరుడివవే(పనికిమాలినవాడివి) సుమా!’ అంటూంటే.. అది తిట్టో.. మెప్పో తెలీక ఆ దేవుడు గుళ్లోని రాయికి మల్లే గమ్మునుండిపోయాడు!
దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు నుంచి భక్తుడికి ఠక్కున ఆఫరొచ్చే జంపింగ్ జమానా ఇది మరి!
ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే ఏ మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో మటుమాయం చేసుకోవచ్చు. ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయలిప్పుడు మరీ పాతకాలం నాటి నాటురథాలను మాత్రమే నమ్ముకుని ఉత్సాహపడే ఉత్సవ విగ్రహాలు కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా.. ఓటు మిషను మీట నొక్కే మనిషి కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా పుచ్చుకునేందుకు పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పది, పదిహేనువేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ ‘స్టేటు’ దాకా ఎగదోసింది. మసిపూసి మారేడుకాయ చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమో గాని, కడుపు మండితే ఓటరే ఉల్ఫాగా ఊరేగే నేతల ముఖాన కసి కొద్దీ బుడ్ల బుడ్ల సిరా పూసి సీన్లు ఖరాబు చేసే రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడ పుట్ట బట్టే!
పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్ బాగ్ చూసాం కదా! అన్నదాతల ఆగ్రహమూ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి చొప్పించే కోపిష్టి ముఠాలను నేతలే ఇప్పుడు స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్టు? తిట్టి పోసిన వర్గాల మీదనే ఏ అయోథ్య రామయ్యను మించిన వరాల జల్లులు! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు. ఇహ బోడి మల్లయ్యల తిట్లంటారా? చెవుల్లో దూరకుండా దూదుండల సదుపాయానికి సర్కారు అధికార దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుంది కదా! అయినా, తిట్లక్కూడా ఉట్లు తెగే సత్యకాలమా.. మన పిచ్చిగానీ?
అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం! ‘ఒద్దికతో లక్ష్మి వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!’ అంటూ చెడ తిట్టిపోసినా దేవుళ్ళకూ చీమ కుట్టినట్లైనా నొప్పుండటంలేదిప్పుడు ! కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో, జాతి పేరుతో నోరుజారారనో, లైంగిక దృష్టితో చూసి వేధించారనో మనిషెంత మధనపడ్డాఅ.. యుద్ధకాండ సిద్ధపడ్డా .. నో బడీ కేర్స్! కోర్టు బోనుల్లో నిలబడాల్సినవాళ్ళే కోర్టు జోన్ల తరలింపు మీద ప్రకటనలిచ్చేస్తున్నారు! ఎక్కడైనా శాపనార్థాలు వినపడుతున్నాయా? ‘దండుకునే సమయం’ దండగ కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా కూడా ఉంటున్నదిప్పుడు!
దూర దూరంగా తగలడితే తూలనాడుకొనేటంత పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి మనం. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రావద్దంటే ఎట్లా? రామాంజనేయయుద్ధంలో రాముడికి.. ఆంజనేయుడికి మధ్యనే గలాటా జరిగి మాటలు రువ్వుకుంటే.. వింటూ ఎంజాయ్ చేసిన మనం ఈ నేలబారు నేతల కారుకూతలు ఏమంత ఎబ్బెట్టనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!
‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా కృష్ణుడు మందలిస్తే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునూరుకున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట ఎదురు పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు గట్రా విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా ఏ మాత్ర్రం తిట్టు వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలు ఇచ్చేస్తున్నారిప్పుడు. పోటీగా నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ నాలుకకు మరికాస్త పదును నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనం సైతం తొక్కేసే మూడులో లేరిప్పుడు. ఈ దుస్థితికి ఎవర్నని తిట్టుకోడం?!
తిట్టే వాడి మీద వెగటు పుట్టటం మాట అటుంచి..తిట్టించుకొనేవాడి మానసిక పరిస్థితి మీద వెకిలిగా తయారైన నకిలీ వీడియోలు విపరీతంగా వైరలవుతున్నాయిప్పుడు! వినే ఓటారే తిట్లు వీనులకు విందనుకునే దశకు వచ్చేశాడు జుట్టూ జుట్టూ పట్టుకునే సీన్లుంటేనే చట్టసభలు సజావుగా సాగినట్లు లెక్క! సమయానికి సభా ప్రసారాలు సడెన్ గా కట్ అయిపోతే సరదా కోసమా జనం చిందులేసేదీ?! కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్ పబ్లిక్ బాధ!
కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ మాత్రమే చేసుకుని పరమపదిస్తే నరకంలో కూడా ఎవరూ కనీసం మడతమంచాలవీ వేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వాతలు అదనంగా వడ్డిస్తారేమో కూడా.
అయినా బూతుపురాణాలన్నీ ఒక్క నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు తిట్టకపోతే మహా వెలితి బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగమహారాజులు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది! తిట్టుకు వందిస్తామనండి! తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని కోట్లమందుంటారో లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు మాత్రమే ప్రసాదంగా పెట్టించే పై దేవుళ్ల మీద పెదవి విప్పకుండా సాటి వాళ్లమనేగా మా మీదిన్ని సూటిపోటీ మాటలు?’ అని వాపోయే నేతలూ తక్కువేం లేరు మరి!
భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించే వేళ పశ్చిమం నుంచి బ్రహ్మముఖతః రౌద్రరసం ఉత్పన్నమయిందని శారదాతనయుడి 'భావప్రకాశం' వాదం. పోతనగారి ఆ ఆరభటీవృత్తి దక్షాధ్వర ఘట్ట ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే కొత్త నేతల హింస నచణ? ఉత్తి పుణ్యానికే వేలెత్తి చూపటానికేనా పాపం ఓటుకు అన్నేసి వేలు దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిని మనసులో అడ్డగాడిదనుకుంటున్నా ‘గాడ్..గాడ్” అంటూ కాళ్లట్టుకు వసుదేవుళ్లకు మించి నేతలు వేళ్లాడేదీ?
భాగవతం వేనరాజును విశ్వనాథ శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు కదా దాశరథీ భక్తుడు కంచెర్ల గోపన్న! కోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!' అంటూ దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?
'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' అన్నాడు .. 'కొత్త సిలబస్' అనే కవితలో బాలగంగాధర్ తిలక్. వింటానికి బానే ఉంటాయ్ కవిత్వాలెప్పుడూ! కానీ ఆ 'కొత్త సిలబస్' ఈ కొత్త సెంచరీలో పాతబడిపోయింది.. ఇంకా పాతరేయద్దంటే ప్రగతి ఎట్లా?
బూతు ఉందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలమా? అని మనగలవమా? ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా బొంగరంలా గింగుర్లు కొట్టేదిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటేనే శనిగ్రహం నిగ్రహం కోల్పోయేది! స్వగృహం పడగ్గదిలోనయినా సరే చాటుగా ఓ నాలుగు మోటు మాటలు బై హార్ట్ చేసుకునే బైటికి రావటం బుద్ధిమంతులకు చాలా బెటర్ ఇప్పుడు! చక్రం తిప్పడమనే చాతుర్యం ఒక్క దాని మీదే కసి పెంచుకుంటే చాలదీ అధికార కుతి కాలంలో! వక్రమార్గంలో అయినా సరే దానిని సంధించేందుకు ఒక్క క్షణం వెనుకంజ పడకూడదు. పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక పోతే పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితి లేదు ఏ స్థాయి నేతకైనా!.
ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో ఏదో 'చ'కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే అర్థాంతరంగా గండిపడిందంటారు. నన్నెచోడుడూ కుమారసంభవం ఆరంభంలో స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపించ బట్టే యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్నాడని మరో టాక్! తిట్టు వల్ల ఏ త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన తెగినట్లు లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు స్పష్టంగా లేకుంటే మాత్రం ఆ కుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత పడేదీ కాలంలో. నీతుల నెలాగైనా వెనక్కు తీసుకోవచ్చు గానీ, బూతు కూతలకా వెసులుబాటు లేదీ కాలంలో. పెదవి దాటితే పృథివి దాటినట్లే! ఆ హెచ్చరిక గుర్తున్న ఉత్తర కుమారుడెప్పుడూ ఉత్తుత్తి బీరాల జోలికి పోడు! ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతల్లో ‘మాస్టర్స్’ చేస్తే తప్ప సింగిల్ సీటున్న ప్రజాసేనలో అయినా టిక్కెట్ దక్కే అవకాశం నిల్!
అన్నది అన్నట్లు అరక్షణంలో ప్రపంచం చుట్టొచ్చేసే జెట్ యుగం రోజుల్లో జాతి పిత బాపూజీ మూడు కోతుల నీతిబోధనలు నమ్ముక్కూర్చుంటే మాజీ ప్రధాని మన్మోహన్ జీ కెరీరుకు మల్లే చాప్టర్ పూర్తిగా పర్మినెంటుగా క్లోజ్! బూత్ పాలిటిక్స్ లో బూతు వద్దనుకోడం.. రామాయణంలో రామా అనే శబ్దం నిషిద్ధమనుకోడమంత అసంబద్ధం.
అనకా తప్పదు.. అనిపించుకోకా తప్పదు.
ఇంత మొత్తుకున్నా ‘తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా? అని సందిగ్ధమా? ఛఁ! కొంత మందిని ఎన్ని తిట్టీ నో యూజ్! ఇంకా తిడుతూ కూర్చున్నా టైం వేస్ట్!
-కర్లపాలెం హనుమంతరావు
06 -02 -2021
బోథెల్, యూఎస్ఎ
నీతుల నెలాగైనా వెనక్కు తీసుకోవచ్చు గానీ, బూతు కూతలకా వెసులుబాటు లేదీ కాలంలో. పెదవి దాటితే పృథివి దాటినట్లే! ఆ హెచ్చరిక గుర్తున్న ఉత్తర కుమారుడెప్పుడూ ఉత్తుత్తి బీరాల జోలికి పోడు! ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతల్లో ‘మాస్టర్స్’ చేస్తే తప్ప సింగిల్ సీటున్న ప్రజాసేనలో అయినా టిక్కెట్ దక్కే అవకాశం నిల్!