Sunday, December 12, 2021

నాన్నా.. నేనూ.. చిన్నా - కథ -కర్లపాలెం హనుమంతరావు

 నాన్నా.. నేనూ.. చిన్నా - కథ

-కర్లపాలెం హనుమంతరావు


మా నాన్న సినిమాల్లో గుమ్మడిలా గంభీరంగా ఉండేవాడు. మమ్మల్నెప్పుడూ పన్నెత్తి ఒక్కమాటైనా అనేవాడు కాదు. మా తరుఫున కూడా చివాట్లన్నీ మా అమ్మకే!

అయిదుగురు అన్నదమ్ములం మేం. ముగ్గురం అక్కచెల్లెళ్లు మాకు. నేను మూడో వాడిని. అందరితో కలసి ఏదో కొంతకాలం ఒకే చూరు కింద పెరిగే అవకాశం నాకే దక్కింది. చివరి ముగ్గురూ పుట్టి పెరిగి పెద్దయ్యే వేళకు.. పై ముగ్గురూ పెరిగి పెళ్ళిళ్లు చేసుకుని వెళ్లిపోయిన పరిస్థితి. 

నా చిన్ననాటి రోజులు నాకు బాగా గుర్తు. ఇష్టం కూడా. 

మా నాన్న మా చదువుల విషయంలో చాలా స్ట్రిక్ట్. గోలీకాయలు, బొంగరాలు, బచ్చాలు లాంటి ఆటలు ఆడనిచ్చేవాడు కాదు.  గాలిపటం ఎగరేసినందుకు నా తరువాతివాడు బాగా తన్నులు తినడం నాకు బాగా గుర్తు. 

మాకో సొంత స్కూలుండేది. దానికి మేనేజర్ అండ్ హెద్ మాస్టర్ రెండూ మా నాన్నే. నేను ఐదో తరగతి దాకా అక్కడే చదువుకున్నది. ఎప్పుడూ టైముకు స్కూలుకు పోయింది లేదు. మా నాన్న నా కన్నా లేటుగా వచ్చి ముందుగా వెళ్ళిపోయేవాడు. హెడ్ మాష్టర్ కదా! ఆ చిన్నఊళ్లో మంచి మర్యాదా- మన్ననా ఉండేది. మాకూ పంతులు గారి పిల్లలని  మంచి మన్నింపు దక్కేది. 

మాది పెంకుటిల్లు. వరండా పొడుగ్గా ఉండేది. పాతిక మంది పిల్లల దాకా కూర్చుని చదువుకోవచ్చు. ఎనిమిది తరగతుల వరకు ట్యూషన్లుండేవి. వాళ్లకు మా నాన్న ఎప్పుడో కాని చదువు చెప్పేవాడు కాదు. చెప్పడానికి కూర్చునప్పుడు మాత్రం ఆయన చేత చావుదెబ్బలు తింటుండేవాళ్ళు పిల్లలు. ఎంత బాగా దెబ్బలు పడితే అంత బాగా చదువొస్తుందన్న మూఢనమ్మకం పెద్దలలో కూడా బలంగా ఉండేది ఆ కాలంలో. అయినా చదువు మాత్రం సరిగ్గా అబ్బేది కాదు ఆ పిల్లలకు. వరండాలో వాళ్లకు పడే దెబ్బలు నట్టింట్లో ఉండే మా పిల్లలకు మా వీపుల మీద పడినట్లే ఉండేవి. అందుకని మా నాన్నంటే మాకు చచ్చే భయం.. ఎంత ప్రేమ ఉన్నా!

పద్దస్తమానం పిల్లలు అట్లా వాకిట్లో పడి ఘోష పెట్టే చదువులు వద్దన్నా మా చెవుల్లో పడతాయి కదా సహజంగా! బహుశా చదువులు అందుకే మాకు  సులువుగా వంటబట్టడం. మూడో తరగతిలో ఉన్నప్పుడే ఐదో తరగతి పాఠాలు వంటబట్టేవి. మా నాన్న ఇంట్లో లేనప్పుడు పిల్లలు గోలచేయకుండా వాళ్లేకేదైనా చెప్పమని అమ్మ నాకు పురమాయించేది. పై తరగతులవాళ్లక్కూడా డిక్టేషనిచ్చి.. తప్పులు రాస్తే అచ్చంగా మా నాన్న తరహాలో బెత్తంతో కొట్టేవాడిని. మా నాన్న చేతుల్లో నాకూ ఒకసారి చావుదెబ్బలు తప్పాయి కావు. 

చిన్నప్పుడు నాకు తొందరపాటు జాస్తిగా ఉండేది. ఆరో తరగతి ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయ్ అప్పట్లో. తెలుగు ప్రశ్నపత్రంలో మూడు వ్యాసాలు ఇచ్చి అందులో ఏదేని ఒకటి రాయమని ఛాయిస్ ఇచ్చారు. నేను తొందర్లో ఏదేని ఒకటి అని మాత్రమే చుసుకున్నాను గాని తొందరపాటు స్వభావం వల్ల కింద ఇచ్చిన వ్యాసాలు చూసుకోలేదు. నాకు నచ్చిన దీపావళి వ్యాసం రాసేశాను. తప్పు తెలుసుకొనే వేళకు టైము గడిచిపోయింది. ఆ రోజు చూశాను మా నాన్న ఉగ్ర నరసింహావతారం. 

ప్రశ్నపత్రం నా మొహాన కొట్టి వరండా మెట్ల మీద నుంచి కిందికి తొసేశాడు! బాధతో, అవమానంతో ఇంట్లోకి వెళ్లి ఓ మూల ముసుగు తన్ని పడుకుండిపోయాను ఏడుస్తో! పిల్లలు ఏడిస్తే ఇప్పట్లా అప్పట్లో ఎవరూ దగ్గరికొచ్చి సముదాయించడాలు గట్రా ఉండేవి కావు. ఏడ్చి ఏడ్చి వాళ్లే ఊరుకుంటారులెమ్మని పెద్దల పిడివేదాంతం. (అదే భవిష్యత్తులో కష్టం ఎదురయినప్పుడు స్వయంగా తట్టుకుని నిలదొక్కుకోవడానికి ఇచ్చే శిక్షణ.. అని ఎదిగిం తరువాత తెలిసింది సత్యం)

ఆ రాత్రంతా నిద్రలేదు. అన్నం తినమని అమ్మ కూడా అడగలేదు. మర్నాడు లెక్కల పరీక్ష. వెళ్లాలా? వద్దా? ఎవర్నడగాలో తెలీని శంక. తెల్లవారు ఝామున నిద్రపట్టింది. మెలుకువ వచ్చేసరికి బాగా పొద్దెక్కింది. 

'ఏవిఁట్రా ఆ మొద్దు నిద్ర? అవతల పరీక్ష టైము అవుతుంటేనూ!' అని అమ్మ గట్టిగా గదమాయించడంతో గభిక్కుమని లేచి కూర్చున్నాను. అక్కడే ఉన్న నాన్న వంక చుశా. 'ఈ సారైనా వళ్లు దగ్గరుంచుకుని రాయ్.. ఫో!' అన్నాడు. ఒక్క ఉదుటున లేచి తయారై పరీక్ష హాలు కేసి పరుగెత్తాను మహోత్సాహంగా! అంతకు ముందు పడ్డ ఇబ్బందులేవీ గుర్తే లేవు!

రిజల్ట్సు వచ్చాయని తెలియగానే పిల్లలందరం హైస్కూలుకు పరుగెత్తాం. ఉత్తీర్ణులైన అభ్యరుల పేర్లన్నీ ఒక తెల్ల కాగితం మీద పెద్దక్షరాలతో రాసి మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థుల నెంబర్లకు ఎదురుగా మాత్రం రంగు పేనాతో వారి వారి పేర్లు రాసి ఉంచారు. ప్యాసైన 103 మంది అబ్యర్థులందరిలో నా పేరు టాప్ న రాసి ఉంది! అదెట్లా సాధ్యం?! దీపావళి వ్యాసం సంగతేమిటి మరి?! 

ఇంటి కొచ్చిన తరువాత మాటల మధ్యలో చిరునవ్వులు చిందుస్తూ మా నాన్న వింత గొలిపే విశేషం  బైటపెట్టాడు. ముందు నా తెలుగు సమాధాన పత్రంలోని ఆ ప్రశ్నకు ఇచ్చింది సున్నా మార్కులేనుట! తతిమ్మా పేపర్లన్నిటినీ దిద్దిన తరువాత నాకు వచ్చిన మార్కులు చూసి తెలుగు పేపరులోని ఆ వ్యాసానికి మార్కులు వేయమన్నారుట హైస్కూలు హెడ్ మాస్టరుగారు.  మా నాన్నను పిలిచి  చిన్నబడిలో  ప్రవేశ పరీక్షకు ముందు నిర్వహించిన  ప్రీ-ఎగ్జామినేషన్ లోని సమాధాన పత్రాలలోని వ్యాసాలను పరిశీలించిన తరువాతే నాకు మొదటి ర్యాంకు ప్రకటించబడింది. అప్పట్లో ఇప్పట్లా ర్యాంకుల కోసమై అనారోగ్యకరమైన స్పర్థలు గట్రాలు ఉండేవి కాదు కానీ, సంతోషం సంతోషమేగా! 

ఆనందంతో ఇంటికి గెంతుకుంటూ తిరిగొస్తుంటే దారిలో సాములు స్టేషనరీ కొట్లో కూర్చోనున్న నాన్న కనిపించాడు. నా మొదటి ర్యాంకు విజయం తనూ అప్పుడే వింటున్నట్లు.. పొంగిపోతూ.. ప్రసాద్ కంపెనీ పెన్ను కొత్తది షాపు నుంచి తీయించి నా జేబులో పెట్టాడు. నాకిప్పటికీ గుర్తు ఆ నవ్వు మొహం.. అపురూపమైన మా నాన్న ఆ నవ్వు మొహం! షాపు యజమాని నా దోసిలి నిండా చాక్ లెట్లు పోసి 'మీ స్నేహితులకు పంచుకో బాబూ!' అనడమూ  గుర్తే!

నా బాల్యమంతా అట్లాగే తీపి చాక్లెట్ల రుచిలా నిర్విఘ్నంగా సాగింది. నాకు సినిమాల  జాస్తి ఒకటి ఎక్కువవా ఉండేది. చదువు విషయమై ఎంత స్ట్రిక్టుగా ఉన్నప్పటికీ పిల్లల సినిమాల పిచ్చి విషయంలో మాత్రం  ఇంట్లో ఎప్పుడూ పెద్దవాళ్ల కట్టడి  ఉండేది కాదు!

ఎట్లా మొదలయిందో తెలీదు.. పెద్దయింతరువాత పెద్ద డాక్టర్ అవ్వాలన్న  కాంక్ష నాలో ధృఢంగా బలపడింది.   'బాగా చదివేవాళ్లకు డాక్టర్ అవడం అంత కష్టమైన విషయమేం కాదు' అని ప్రోత్సహిస్తుండేవాడు నాన్న కూడా. 

అప్పట్లో ఇప్పట్లా ఇంటర్ మీడియట్ కోర్సు లేదు. ఎస్సెసల్సీ, తరువాత పి.యూ.సి అని ఉండేవి. ప్రత్యామ్నాయంగా  సెవెన్త్ ఫామ్(హైయ్యర్ సెకండరీ స్కూలులోని 12వ తరగతి). నాది ఆ పన్నేండో తరగతి చదువే! 

పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆ ఏడాదంతా  సినిమాలు చూడడం కూడా మానేశాను. రాత్రంబవళ్లు చదువే చదువు. వేరే ధ్యాస లేదు. ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. నా వాలకం చూసి మా అమ్మ కళ్ల నీళ్లు పెట్టుకునేది. చెల్లెళ్ళూ, తమ్ముళ్లూ దగ్గరకు రావడానికే జంకేవాళ్ళు. నా అసహనం గమనించి స్కూల్లో టీచర్లు కూడా చాలా సార్లు మందలించినట్లు గుర్తు. అప్పటో ఒక్క మాటైనా అననిది మా నాన్న ఒక్కడు మాత్రమే! ఆయన ఒక్క మాట పరుషంగా అన్నా నా కాన్సన్ ట్రేషన్ మొత్తం దెబ్బతిని ఉండేది. బహుశా తన మాటల ప్రభావం తెలిసే కాబోలు,  నా భవిష్యత్తు దృష్ట్యా ఆ  ఏడదంతా  మౌనంగా ఉండిపోయాడు. 

పరీక్షల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నాలో నెర్వస్ నెస్ పెరిగిపోసాగింది. ఒకరోజు నిద్రలో పాఠాలు వల్లెవేసుకుంటూ మెయిన్ రోడ్డు మీదకు వెళ్లిపోయానట. గస్తీ పోలీసులు తెచ్చి ఇంట్లో దించి పోయారు. ఆ రోజు నుంచి మా నాన్న నా మంచం పక్కనే మంచం మేసుకుని పడుకునుండేవాడు. 

ప్రత్యేకాంధ్రా ఉద్యమ ప్రభావంతో పరీక్షలు నెల రోజులు వాయిదా పడ్డాయ్! ఒక్కసారిగా నాలో నిస్సత్తువ ఆవరించేసింది. పుస్తక పట్టుకుంటే చాలు కళ్ళు గిర్రున తిరగడం! సాటి మనుషులతో మాట్లాడడం మానేశాను. నిత్యం నాలో నేనే గొణుక్కోవదం చూసి అమ్మ బెంబేలెత్తిపోయింది. 

పరీక్షల ప్రారంభానికి ఇంకో  వారం గడువుందనంగా ఓ రోజు మా నాన్న నా దగ్గరికొచ్చి కూర్చున్నాడు 'రాముడూ! ఇట్లా దిగులు పడుతూ కూర్చుంటే ఎట్లారా? నీకేం కాలేదు. బాగా చదివావు. బాగా రాస్తావు కూడా. ధైర్యం పోగొట్టుకుంటే పరీక్ష పోతుంది. చిన్నప్పట్నుంచి డాక్టర్ కావాలని కదరా నువ్వు కలలు కన్నది! మా వాడు మంచి మార్కులు తెచ్చుకుంటాడని ఊరంతా చెబుతున్నానే! నా పరువు తీస్తావా?' అంటూ నా తలను తన ఒళ్లోకి తీసుకుని ఏవేవో మాటలు లాలనగా చెప్పాడు మొదటిసారి. అదో కొత్త అనుభవం నాకు మా నాన్నతో. 

అప్పటి వరకు నాలో అదిమి పెట్టుకుని ఉంచిన దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకు పొంగింది. ఎంత సేపు అట్లా ఆయన ఒళ్లో తలపెట్టుకుని ఏడ్చానో! మనసంతా ఒక్కసారి తేలిక అయిపోయింది. వరదనీరు వచ్చి బురదనీటిని కొట్టేసినట్లయింది. మెదడు మునపట్లా చురుకుగా పనిచేయడం మొదలయింది. ఆ వారం రోజుల్లోనే మళ్లీ రివిజన్ అంతా పూర్తిచేశాను. పరీక్షలూ చాలా బాగా రాశాను. పరీక్షలు రాసే రొజుల్లో ప్రతీ రోజూ నాన్న నా కోసం హాలు బైట ఎదురుచుస్తూ నిలబడి ఉండేవాడు. 

ఆ నెలరోజుల్లో నేను నాన్నకు ఎంతో దగ్గరయ్యాను. ఇప్పటి దాకా ఆయన నన్నో అర్భకుడి కింద జమకట్టాడు. ఇప్పుడు మా మధ్య ఏదో కొత్త బంధం మొదలయింది. ఆయన నన్నో పెద్దవాడిగా భావించి సాధక బాధకాలు మాట్లాడుతుంటే మొదట్లో బిడియంగా అనిపించినా క్రమంగా అలవాటయింది. 

తండ్రి బాల్యంలో గురువుగా, యవ్వనంలో స్నేహితుడిలా ఉండాలన్న సూత్రాన్ని ఎంత సులువుగా మా నాన్న ఆచరణలో పెట్టాడో తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే! 

రిజల్ట్స్ వచ్చాయి. నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి. మా నాన్న ఆనందం అంతా ఇంతా కాదు. చిన్నపిల్లవాడిలా అందరికీ ఒకే మాట చెప్పటం 'మా వాడిని డాక్టర్ని చేస్తా' అని. ఎన్ని సార్లు అన్నాడో ఆ మాట నాకు తెలిసి ఆ నెల రోజుల్లో!

గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి అప్లికేషన్ తెప్పించాడు. ఇద్దరం కలసి కూర్చుని అప్లికేషన్ పూర్తిచేశాం. అప్పట్లో ఇప్పట్లోలా జిరాక్సు కాపీలు తీసే పద్ధతి లేదు. నకలు కాపీలు టైప్ చేయించి వాటి మీద గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్ట్ చేయించాలి. వాళ్లు ఒక పట్టాన ఆ సంతకాలు చేసేవాళ్లు కాదు. ఆ తంటాలన్నీ మా నాన్నే పడ్డాడు. ఒక మంచి ముహూర్తం చూసుకుని అప్లికేషన్ పోస్టు చేయించాడు నా చేతి మీదుగానే. 


ఆ రోజు రాత్రి వరండాలో పడుకున్న నేను నిద్ర పట్టక అటూ ఇటూ పొర్లుతున్నా. మధ్య గదిలో నుండి మా అమ్మానాన్నల మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ల మాటల్లో పదే పదే నా పేరే దొర్లుతుండటంతో సహజంగానే ఆసక్తి పెరిగి ఓ చెవి అటు వేశాను. 

అమ్మ అంటోంది 'దేనికండీ! పిచ్చి సన్నాసికి అన్ని ఆశలు కల్పిస్తారు! వాడికి గుంటూరులో సీటు వచ్చినా చదివించే తాహతు మనకుందీ? ఇల్లు చూస్తే ఈ తీరుగా ఉండె! ఇంకా ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలి. పెద్దాళ్లిద్దరికీ ఎట్లా ఉద్యాగయ్యాలో ..వీడికీ అట్లా అయితే చాలు! అదే గొప్ప మనకు ‘

'వీడిని ఎట్లాగైనా మెడిసన్ చదివించాలని ఉందే నాకు!' అంటున్నాడు నాన్న. 

'ఏం పెట్టి చదివిస్తారుట? ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే?'

'స్కాలర్ షిప్పుల కోసం ప్రయత్నం చేస్తే..'

'వచ్చినా అవేం చాలుతాయి? చక్కగా పెద్దాడి దగ్గరకు పంపించెయ్యండి! ఏదో డిగ్రీ చేయిస్తాడు. వీడిని పైకి చదివిస్తే మిగతా వాళ్లని కూడా చదివించాలి ఆ స్థాయి దాకా! అదంతా అయే పనేనా?'

'పొలం కొంత అమ్ముదామనుకుంటున్నానే! రేపొక సారి మా అన్నయ్య దగ్గర క్కూడా వెళ్లొస్తా!.. 'అంటున్నాడు నాన్న. 


నాలో ఆందోళన మొదలయింది. నా చదువుకేదో ఆటంకం కలగబోతున్నదని నా సిక్త్ సెన్స్ చెబుతోంది. 

మర్నాడు ఊరుకు వెళ్లిన నాన్న మూడు రోజుల తరువాత తిరిగొచ్చాడు. ఆ రోజు రాత్రి అమ్మానాన్నా ఎందుకో ఘర్షణ పడ్డారు. నా పాపిష్టి చదువును గురించేనేమో ఈ కలతలన్నీ! అనిపించింది నాకు కూడా!

మా నాన్నకు కోపం వస్తే ఇంట్లో ఉండడు. ఏ అర్థరాత్రో ఇంటి కొచ్చి నిశ్శబ్దంగా పడుకుంటాడు. తెల్లవారకుండానే లేచి వెళ్లిపోతాడు. ఇంట్లో ఏమీ తినడు. ఆయన తినలేదని అమ్మా పస్తుంటుంది. చిన్ననాటి నుంచి ఈ తరహా వాతావరణం మా పిల్లలకు అలవాటే. మరీ చిన్న పిల్లలకు ఇవి పట్టేవి కావు కాని, ఊహ తెల్సిన  మాకు చాలా కష్టంగా ఉండేది. 


మా నాన్న ఎప్పట్లానే ముభావంగా ఉంటున్నాడు మళ్లీ. అమ్మ ఊరికే కళ్ల నీళ్లు పెట్టుకోడం చూసి గుండె తరుక్కుపోయేది నాకు. అప్పుడు తెలిసొచ్చింది .. డబ్బులేనివాడు పెద్ద చదువులు చదువుకోవడం లోకంలో ఎంత బ్రహ్మ ప్రళయమో! మంచి చదువులకు ఉండవలసింది మంచి తెలివితేటలు ఒక్కటే కాదు.. మంచి ఆస్తిపాస్తులని కూడా అనుభవానికి వచ్చిందా లేత వయసులోనే నాకు.  


ఆ రోజు రాత్రి నన్ను మా నాన్న తన పక్కలో కూర్చోబెట్టుకున్నాడు. పక్కనే నేల మీద అమ్మ కొంగు పరుచుకుని పడుకునివుంది. తమ్ముళ్లు, చెల్లెళ్లు వళ్లు మరచి నిద్రపోతున్నారు. కరెంటు ఉండేది కాదు మా పెంకుటింట్లో. కిరసన్ దీపపు వెలుతురులో గోడ మీద మా నీడలే మాకు కనపడుతున్నాయి. అట్లా గోడ మీద పడిన దీపపు వెలుగు నీడల్లో మంచం మీద పడుకుని ఉన్న మా నాన్న అచ్చు భారతంలో అంపశయ్య మీద పడుకుని ఉన్న భీష్మాచార్యుడికి మల్లేనే కనిపించాడు నా కళ్లకు. చుట్టూ పేరుకుని ఉన్న నిశ్శబ్దంలో నుంచి మా నాన్న నోటి నుంచి వస్తున్న ఒక్కో మాటే నిశ్శబ్దంగా విన్నానా రాత్రి చీకట్లలో. 'రాముడూ! పొలం బేరానికి పెట్టాను, కానీ పడనీయలేదురా పెదనాన్న. పోనీ, డబ్బు కాస్త సాయం చెయ్యమన్నా, వాడు నిలదొక్కుకున్నాక తీరుస్తాడని నీ తరుఫున నేనే హామీ ఇచ్చా. లేదన్నాడు. ఉన్నా ఇవ్వనన్నాడు. ఒక్కడి కోసమే ఉన్న కాస్త ఆస్తిని అమ్మేస్తే మిగతా వాళ్లను ఏం చేస్తావని నిలదీశాడ్రా వాడు. మీ అన్నలదీ అదే పాట'

నేనేమీ మాట్లాదలేదు. ఏం మాట్లాడను అంత చిన్నపిల్లవాడిని! నన్ను దగ్గరకు తీసుకుని నా జుట్టులోకి తన వేళ్లు జొనిపి నిమురుతూ 'నువ్వెందుకురా ఈ ఇంట్లో పుట్టావూ?' అని కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఆనక భోరుమన్నాడు.

మా అమ్మ దిగ్గున లేచి వచ్చింది. 'మీరు వూరికే అట్లా ఇదై పోతే ఎట్లా?అయేదేదో అవుతుంది. ముందు మీరు లేచి కాసిని మంచినీళ్లయినా తాగండి. రాముడూ! నువ్వు పోయి పక్క గదిలో పడుకోరా! నిన్ను చూస్తున్నంత సేపూ మీ నాయన ఇట్లాగే హైరానా పడతాడు' అంటూ నా రెక్క పట్టుకుని లేపి పక్కగదిలోకి తోసేసింది. 

పడుకున్నానే గాని నిద్ర రావడం లేదు. ఏవేవో ఆలోచనలు. పిచ్చి ఆలోచనలు. రోడ్డు మీద నడుస్తుంటే పక్కనే ఉన్న కొండల మీద నుంచి బండరాళ్ల సైజులో ఉన్న పుస్తకాలు మీది మీదికి దొర్లుకొస్తున్నట్లు కలలు. నేను భయంతో అరుస్తూ పరుగెత్తుతున్నా. నన్నే తరుముకుంటూ వస్తున్నాయా బండరాళ్ల వంటి పుస్తకాలు. ఒకటా.. రెండా! వందలు.. వేలు.. లక్షలు! 

'రాముడూ! రాముడూ!!'అని అరుస్తోంది అమ్మ. ఉలిక్కిపడి లేచి కూర్చున్నా. అమ్మ అదే పనిగా ఏడుస్తోంది 'నాన్నకేమో అయిందిరా! పెద్దగా గురక పెడుతున్నారు. ఎంత లేపినా లేవడం లేదు' 

ఒక్క ఉదుటున నాన్న పక్కలోకి వెళ్లి పడ్డాను. 

'నాన్నా!.. నాన్నా!.. నాన్నా!' ఎంత పిలిచినా  నాన్న నుంచి బదులులేదు. సరికదా గురక అంతకంతకూ ఎక్కువయిపోతోంది. చేతులూ కాళ్లూ బిగుసుకుపోతోన్నాయి. ఫిట్స్ లాగా వచ్చిందనుకుంటా. నోటి నిండా నురుగు. ఆయనేదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు.  ఇంట్లోని పిల్లలు ఎప్పుడు లేచారు.. ఏడుస్తున్నారు. ఆ సమయంలో ఏడవని వాడిని నేనొక్కడినే!

ఎవరో వెళ్లి డాక్టరును పిలుచుకొచ్చినట్లున్నారు. కానీ, నాన్న డాక్టర్ని దగ్గరకు రానీయకుండా  తోసేశాడు.  అతి కష్టం మీద ఇంజెక్షన్ ఇవ్వాల్సొచ్చింది. 'హార్ట్ ఎటాకొచ్చింది సివియర్ గా! వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి' అన్నాడాయన కిట్ సర్దుకుని వెళ్లిపోతూ. ఉండమని అడిగా! అవసరం లేదు బాబూ! పెద్దాళ్లను పిలువు! నీ వల్ల ఏమవుతుంది? అని వెళ్లిపోయాడా డాక్టర్. 

నాకేం చెయ్యాలో తోచలేదు. నాన్నను ఆ స్థితిలో చూడగానే మెదడంతా మొద్దుబారిపోయింది. ఎవరెవరో వచ్చిపోతున్నారు. తెల్లారింతరువాత గాని అన్నయ్యలిద్దరూ రాలెకపోయారు. అప్పటికే నాన్న ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయ్! హైదరాబాద్ నుంచి రావాల్సిన అక్కయ్య కోసం ఆ రాత్రంతా నట్టింట నాన్నను చాపేసి పడుకోబెట్టారు. తల దగ్గర దీపం పెట్టారు. అది కొండెక్క కుండా ఆగి ఆగి ప్రమిదలో నూనె పోసే డ్యూటీ నాకప్పచెప్పారు.  నాన్న తలగడ వైపే  కూర్చుని ఆయన  మొహం వంకనే రాత్రంతా  చూస్తూ ఆ  జ్యోతి కొండెక్కకుండా తెల్లార్లూ నూనె పోస్తూ గడిపిన అన.. ఎప్పటికీ మర్చిపోలేను.

అక్కయ్యొచ్చే సరికి తెల్లారింది. 

ఏడుపులు పెడబొబ్బల మధ్య  నాన్న వెళ్లిపోయాడు పడమటి దిక్కు వైపుకు శాశ్వతంగా.. అన్నల భుజాల మీదుగా! 

మబ్బులు కమ్మిన ఆకాశంలా నిస్తేజమయిపోయింది నా  మనసంతా! 


మెడికల్ కాలేజి నుంచి వచ్చిన అడ్మిషన్ పేపర్లు నా కంట బడకుండా చింపేయించింది అమ్మ తరువాత. డిగ్రీ చదవడానికి నిశ్శబ్దంగా పెద్దన్నయ్యవాళ్ల  ఊరు వెళ్లిపోవడంతో ఆగిన కథ.. మళ్లా మరో  మొదలయింది పాతికేళ్ల తరువాత..  ఇలా!

***


అదే పనిగా టెలిఫోన్ మోగుతోంది. 

'చూడండీ! చిన్నాగాడేమో!' అంటోంది మా ఆవిడ. 

టైమ్ రాత్రి పదకొండున్నరయింది అప్పటికి. పడుతూ లేస్తూ వెళ్లి ఫోనందుకున్నా. 

ఎదో రాంగ్ నెంబర్..!

'వాడి దగ్గర్నుంచి ఫోనొచ్చి చాలా రోజులయిందండీ! ఒంట్లో కూడా బాగా లేదంటున్నాడీ మధ్య!' గొణుక్కుంటుంది శ్రీమతి. 

'మనకున్న ఆత్రం వాడి కెందుకుంటుందీ! ఉన్నా తీరిక దొరకద్దూ! మనకంటే.. బోలెడంత తీరిక'

'పోనీ మీరే ఒకసారి చేయరాదూ.. సంగతులన్నా తెలుస్తాయీ..'

నాకు మాత్రం వాడితో మాట్లాడాలనీ, వాడి గొంతు వినాలనీ ఉండదూ! అయినా అంత దూరంలో ఉన్నవాడితో ఓ ఐదు నిమిషాలు మాట్లాడితేనే బోలెడంత బిల్లవుతుంది. భరించద్దూ! పింఛన్ రాళ్ల మీద నెట్టుకున్న ముసిలిప్రాణాలం! 

ఆ సంగతి ఆవిడకు మాత్రం తెలియకనా! అయినా.. తల్లి ప్రాణం! వాడే వారానికోసారి ఫోన్ చేసి మాట్లాడితే బావుణ్ణు! 'తీరిక లేదం'టాడు. 

'తల్లిదండ్రులతో కూడా మాట్లాడలేనంత మహా ఉద్యోగమేంటో ఆ మహా సముద్రాల అవతల వాడు చేస్తున్నది!' అని నిట్టూర్చాను. అంతకు మించి చేయగలిగిందేముంది కనక! 

'దీనికంతటికీ కారణం మీరే' అని ఇప్పుడు దెప్పిపొడుస్తుంది మా ఆవిడ. 'వాడిని చిన్నతనం నుండి అట్లా రెచ్చగొట్టింది మీరే! వాడు డాక్టరే కావాలని మీరు పట్టు పట్టుక్కూర్చున్నారు. డాక్టరై వాడు ఇంచక్కా ఎక్కడికో ఎగిరిపోయాడు.' అని ఫిర్యాదు. ఆవిడ ఆరోపణల్లో నిజం పాలెంతో తెలీదు!

పెద్దలు తమ తీరని కోరికలను తమ కన్నసంతానం ద్వారా తీర్చుకోవాలని చూపే తాపత్రయం భారతీయుల మనస్తత్వంలో ఒక పాలు ఎక్కువే! అదెంత వరకో సబబో.. ఆ చర్చకు ఇప్పుదు అవసరం లేదు. కానీ.. నా విషయంలో మాత్రం జరిగింది అదే. 

మా నాన్న నన్ను డాక్టర్ని చేయలేకపోయాడు. నేనైనా మా చిన్నాని డాక్టర్ గా చూడాలని తపించాను. ఆ ఉద్దేశంతోనే వాడిని బలవంతంగా ఇంటర్ లో బైపిసి గ్రూప్ లో చేర్పించింది కూడా. నిజానికి వాడు ఫైనార్ట్స్ లో బ్రిలియెంట్! కానీ, నా కోరిక తీర్చడానికి ఎంత కఠోర పరిశ్రమ చేసేందుకయినా సిద్ధపడ్డాడు.. పిచ్చి సన్నాసి!

తెల్లావారక ముందే కోచింగ్ కని ట్యుటోరియల్ కు వెళ్లిన పిల్లవాడు మళ్లీ రాత్ర ఏడు దాటితే గాని ఇంటి ముఖం చూసేవాడు కాదు. 'కష్టపడనిదే సీటు రాదు నాన్నా!' అనేవాడు పైపెచ్చు నాతో మనసు ఉండబట్టలేక ఎప్పుడైనా ‘పాపం!’ అని జాలి చూపిస్తే. 

అంత కష్టపడి చదివినా ఫ్రీ సీటు వచ్చే ర్యాంకు రాలేదు మా వాడికి. అదృష్టం కూడా కలసిరావాలేమో? అని అనిపించింది మొదటిసారి.

మెడిసన్ లో సీట్లు తక్కువ. పోటీ ఎక్కువ. ఏ రిజర్వేషనుకూ అవకాశంలేని మా వాడి వంటి వాడికి ‘ఫ్రీ సీటు’ రావాలంటే లక్షల్లో అటెండయిన అభ్యర్థుల్లో కనీసం 800 ర్యాంకుల లోపయినా సాధించాల్సిన పరిస్థితి ఉండేది మా వాడు చదువుకునే కాలంలో. 

వాస్తవానికి మా వాడికి వచ్చింది పన్నెండు వందల ర్యాంక్. 'ఇది మంచి ర్యాంకే! ఇంత కన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన మా ఫ్రెండ్ దాసుకు సిటీలోనే ఫ్రీ సీటొచ్చింది. నాకే స్టేటులో కూడా ఎక్కడా రాలేదు' అని వాడు నిరాశ పడుతుంటే కడుపుతరుక్కుపోయింది. వాడి నిరాశను చూసి బెంబేలెత్తిపోయాను.. ఎక్కడ చేతులు ఎత్తేస్తాడేమోనని. 'ఇంకోసారి ట్రై చెయ్యరా! ఏమైనా నువ్వు డాక్టర్ అయి తీరాల్సిందే!' అన్నా మొండిగా. నా మాట కాదనే అలవాటు లేదేనాడు వాడికి. 

మళ్లీ కోచింగుకి వెళ్లడం మొదలుపెట్టాడు. కానీ, ఈసారి మునుపటంత పట్టుదల కనిపించలేదు పిల్లాడిలో. అవకతవకలు, అక్రమాలు, గందరగోళాలు ఎన్నింటి మధ్యనో కోర్టులో కేసులు ఈడ్చిన తరువాత డిక్లేరయిన రిజల్ట్సులో ముందు సారి కనా ఎక్కువ ర్యాంకు వచ్చిందీ సారి. 

ఫలితాలు వచ్చిన రోజున వాడి మొహం చూడాలంటే మొహం చెల్లిందికాదు నాకు. 

పిల్లాడు పూర్తిగా ఇంట్లో మాట్లాడడం మానేశాడు. ఏదైన ఒకటికి రెండు సార్లు గట్టిగా అడిగితేనే 'ఆఁ.. ఊఁ' అంటూ ముక్తుసరి సమాధానం. వాడిని కంప్యూటర్ కోర్సులో  చేర్పించాలని ఆలోచిస్తుండగా ఓ రోజు ఇంత లావు పెద్ద కవరు తెచ్చి నా ముందు పెట్టాడు. తెరిచి చూస్తే మణిపాల్ మెడికల్ కాలేజీ అప్లికేషన్! 

వాడికి ఆ ఎంట్రెన్సులో మంచి ర్యాంకే వచ్చింది. సంవత్సరానికి లక్షన్నర.. కోర్సు మొత్తం పూర్తయే సరికి సుమారు పది లక్షలు మిసిలేనియస్ ఖర్చులతో కూడా కలుపుకుని.. ఆ రోజుల్లో!  

'ఎక్కణ్నుంచీ తేనురా అంత సొమ్ము?' అనడిగాను బేజారైపోయి. 

'మా ఫ్రెండ్ వాళ్ళ  నాన్న బ్యాంకులో ఆఫీసర్. తానిప్పస్తానన్నాడు ఎడ్యుకేషన్ లోన్ ..  ఐదు లక్షలు..' వాడి సమాధానం. అంటే మిగిలింది నేను పెట్టుకోవాలని అన్యాదేశం. అంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని వచ్చిన మనిషి  కాదంటే వింటాడా? 

అయినా మొండిగా చేతులెత్తేశాను నేను కూడా. 

వాడు సత్యాగ్రహం మొదలుపెట్టాడు ఇంట్లో. 

అన్నం తినడు. నీళ్ళు తాగడు. స్నానం చెయ్యడు. ఒక్క మూడు రోజుల్లోనే వాడి మొహంలో ప్రేతకళ వచ్చిపడింది. వాడి అమ్మయితే ఒహటే ఏడుపు. వాడు మంకు పట్టు వదిలేటట్లు లేడు. దిగిరాక తప్పలేదు నాకు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాం ఇల్లు తాకట్టు పెట్టి. 

వాడు సంతోషంగా బండి ఎక్కిపోతుంటే.. ‘పోనీలే!.. బిడ్డల ఆనందమే పెద్దల అనందం కూడా!’ అని సర్దిచెప్పుకోవడం నా వంతయింది. 

నెల నెలా టంచనుగా డి.డి పంపించాలి వాడికి. ఎప్పుడైనా కాస్త ఆలస్యమయితే ఫోన్ లోనే గొడవ గొడవ చేసేవాడు. వాడు మాత్రం పరాయి చోట ఎట్లా ఉంటాడు చేతిలో డబ్బుల్లేకుండా!

ఆ అయిదున్నర సంవత్సరాలూ ఎంత భారంగా గడిచాయో!

వాడి రిజల్ట్స్ వచ్చినరోజున ఇంతకాలం పడ్డ శ్రమంతా దూది పింజలా తేలిపోయింది. 

'ఇకనైనా వాడు ఇంటిపట్టున ఉంటాడు. ఇక్కడే ఎదో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ముందు వాడికి పెళ్లి సంబంధాలు చూడండీ!' అంటూ వాళ్ల అమ్మ పడిన హైరానా అంతా ఇంతా కాదు. 

వాడు మాత్రం ఇంటి పట్టున ఒక్క క్షణమైనా ఉండేవాడు కాదు. ఇంట్లో ఉన్నంత సేపైనా ఆ ఫోనొకటి పట్టుకుని వదిలేవాడు కాదు. 

ఎడ్యుకేషన్  లోన్ తీర్చవలసిన గడువు దగ్గరపడింది. 

వీడేదైనా హాస్పిటల్లో కుదురుకుంటే కాస్త వెసులుబాటుగా ఉంటుందని నా ఆశ. ఈ విషయమై ఎట్లా కదిలిద్దామా అని నేనాలోచిస్తున్నాను. 

ఓ రోజు వాడే నా దగ్గరి కొచ్చి కూర్చున్నాడు. 'నాన్నా! నాకు బెనారస్ లో పి.జి చేసే అవకాశం వచ్చింది' అంటూ.  

'పి.జి కోసం అంత దూరమెందుకురా?' అంది వాళ్లమ్మ. 'నీకు తెలీదులేవే' అని విసుక్కున్నాడు వాళ్లమ్మ మీద, పాపం. నా వంక తిరిగి 'నేను వెళ్లాలి. మీరు కాస్త మనీ ఎడ్జస్ట్ చెయ్యాలి నాన్నా!' అన్నాడు కరాఖండిగా. 

'ఏం పెట్టి చేసేదిరా ఎడ్జస్ట్ మెంట్? ఎడ్యుకేషన్ లోన్ ఇంకా అట్లాగే ఉంది తెలుసు కదా! నా పరిస్థితి నీకు అర్థమవుతుందా?' అన్నా అక్కడికీ నిష్ఠురంగా.  ఎప్పుడూ వాడితో అట్లామాట్లాడి ఎరుగున ఈ పాతికేళ్లల్లో! నాకే బాధనిపించింది నేను కొని తెచ్చుకున్న చిక్కులకు. 

'పోనీ పెళ్లి చేసుకోరా! కట్నం సొమ్ము వాడుకో!  మాకొద్దు! ఇల్లు  అమ్మితే ఎట్లా?'  అని వాళ్లమ్మ మొత్తుకోలు.

'కట్నమా! ఏ జమానాలో ఉన్నారు మీరంతా? ' అని ఆమె వైపు ఓ పురుగును చూసినట్లు చూశాడు. నా వంక తిరిగి 'ఇల్లు అమ్మేసి బ్యాంకు లోన్ తీర్చేయండి నాన్నా! మిగిలిన సొమ్ముతో నేనే ఎట్లాగో అడ్జస్టవుతా!' అంటూ విసురుగా లేచి వెళ్లిపోయాడు మరి మాటల్లేవన్నట్లుగా!

ఇల్లు బేరం పెట్టక తప్పింది కాదు. ఎడ్యుకేషన్ లోన్ క్లోజ్ చేసి మిగిలిన సొమ్ములతో వాడు బెనారస్ చెక్కేశాడు. 


రెండేళ్ల చదువు. ఇట్టే తిరిగి రాదూ! అప్పుడు ప్రాక్టీసు పెట్టినా వచ్చే  సొమ్ముతో ఇంకిన్ని ఇళ్లు కొనుక్కోవచ్చు. పిల్లాడికి పేరొస్తుంటే సంతోషించాలి.. కానీ  కన్నవారమై ఉండీ మనం చేస్తున్నదేంటీ!' అని నేనే ఆవిడకు సర్దిచెప్పక తప్పింది కాదు. 

రెండేళ్లయితే ఇట్టే గిర్రున తిరిగిపోయాయ్!

నేనా ఏడాదే రిటైరయ్యాను. 

డాక్టర్ కిరణ్ కు ‘ఎమ్.డి’  తోక పెరిగింది!

ఏమైతేనేం! నా కోరిక నేరవేరింది. మా నాన్న కోరిక కూడా నెరవేర్చినట్లయింది. నాకు గొప్ప సంతృప్తి మిగిల్చింది అదొక్కటే ఆ క్షణంలో. 


చిన్నా ఇంటికి వచ్చిన తరువాత ఇది వరకటి కన్నా బిజీ అయిపోయాడు! 

ఇప్పుడు మేం అద్దె ఇంట్లో ఉంటున్నాం. 'చాలా ఇరుగ్గా ఉంది' అని వాడు చిరాకుపడ్డం చాలా సార్లు నా చెవుల్లో పడుతోంది. నవ్వొచ్చింది నాకు. 

ఆ మాటకొస్తే ఇండియానే ఇరుగ్గా  ఉంటుంది. ఇక్కడ ప్రతిభ ఉన్నా రాణించలేదు ఒక వర్గం. అసలు ప్రతిభ గురించి ఆలోచించే అవకాశమే ఉండనిది మరో వర్గం.  ఆర్థిక పరమైన అడ్డంకులు అడుగడుగునా ఒక వక వర్గానికి. అడ్డదారుల్లో చక చకా పైకెదిగిపోయే అవకాశాలు మరో వర్గానికి. 

గతంలో తరాలకు సర్దుకుపోయే తత్వం నేర్పించింది కాలం. ఈ తరాలకు అంతలా సర్దుకుపోయే అవసరం లేకపోవడంతో చూపులు పక్కకు మళ్ళిపోతున్నాయ్ ప్రతీ అంశంలో! 

'నేను ఎబ్రాడ్ కు ట్రై చేస్తున్నా!' అంటూ ఓ మాట విసిరాడు  భోజనాల దగ్గర ఈ మధ్య!

నా పక్కలో బాంబు పడ్డట్లయింది. 'ఇది అన్యాయం!' అని నా మనసు ఘోషించింది. ఎన్నడూ లేనిది కోపం నసాళానికి అంటింది కూడా!

 'ఇక్కడి పేదల శ్రమతో, మధ్య తరగతి జీవుల కష్టంతో పోగుపడ్డ వనరులు పుణ్యమా అని గడించిన ఆదాయంలో   సబ్సిడైజ్డ్  ఎడ్యుకేషన్ వంకన   ఏ బ్యాంకుల ద్వారానో సాయం పొంది ఎదిగి ప్రయోజకత్వం సాధించిన తరువాత ఆ  దిక్కుమాలిన పడమటి దేశాలకు  ముష్ఠి దోసెడు డాలర్ల కోసమై ఊడిగాలకు తయారవడం.. ఫక్త్ దేశ ద్రోహం!' అంతలా టెంపర్ ఎప్పుడూ కోల్పోడం లేదు! అదీ  వాడి ముందు. 

'ట్రాష్ !' అంటూ నిర్లక్ష్యంగా వాడు నవ్వి లేచి వెళ్లిపోతుంటె నివ్వెరపోవడం చివరికి నా వంతే అయింది. 

ఏర్పాట్లన్నీ ఎప్పుడో పూర్తయినట్లున్నాయ్.. కేలిఫోర్నియోలో అదేదో సూపర్ హాస్పిటల్ ఆఫర్ చేసే ఏదో కోర్సుకు 'మాచ్' అయిందని వెళ్లే హడావుడిలో పడిపోయాడు. వాడు ఇండియన్ సెంటిమెంటును  మన్నించే బోర్డర్ ఎప్పుడో దాటిపోయాడు. నేనే పసిగట్టటంలో ఎప్పట్లా ఫెయిలయ్యాను.  

'పోనీ! పెళ్లైనా చేసుకు పోరా!' అని వాళ్లమ్మ మొత్తుకున్నప్పుడు మాత్రం ఏ కళ నున్నాడో 'మీ ఇష్టం' అంటూ మొగ్గుచూపడం మాత్రం అబ్బురమనిపించింది నాకు. 

ఇహ మా ఆవిడ హడావుడికి పట్టపగ్గాల్లేవుంటాయ్! ఏదో పని మీద అటు  స్టేట్స్ వెళ్లగానే  వాడు తిరిగొచ్చే వేళకు పెళ్లికూతుళ్ల ఆల్బంతో తయారయిపోయుందీ పిచ్చి మనిషి. 

భోజనాలయిం తరువాత వాడి ముందు ఆ ఆల్బం పెడితే అట్టయినా ముట్టుకోలేదు ఆ భడవా! సరికదా.. 'జేబులో నుంచి ఓ ఫొటో బైటికి తీసి వాళ్లమ్మకు చూపిస్తూ 'నీ కోడలు ఎలాగుంది చెప్పవే!' అన్నాడు నవ్వుతూ!

నాకయితే నోట మాట రాలేదు. 

'ఈ అమ్మాయి ఫాదర్ కేలిఫోర్నియాలో పెద్ద పేరున్న సర్జన్. ఆయన చొరవ వల్లనే నాకీ  సారి 'మేచ్' క్లిక్ అయింది. ఆ అమ్మాయిని చేసుకుంటే నాకు గ్రీన్ కార్డ్ కూడా ఈజీగా దొరుకుతుంది. అక్కడే సెటిలయిపోవచ్చు హాయిగా 

పేరెంట్స్ తో ఉండ కూడదన్నది ఒక్కటే ఆ అమ్మాయి కండిషన్'!' అన్నాడు తాపీగా. 

'మరి మమ్మల్నేం చేద్దామనుకుంటున్నావురా?' వాళ్లమ్మ కళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాలే అయ్యాయి ఆ క్షణంలో. 

తల్లి హ్యుమిలిటేషన్ తగ్గించే ప్రయత్నం కూడా చెయ్యలేదీ బిడ్డడు 'అంత అవసరం వస్తే వచ్చి పోకుంటానే ఉంటానా.. మరీ అంత బండరాయిని చేసేశారే నన్నందరూ కలిసి?' అని చక్కా లేచెళ్లిపోయాడు  గారాబాల పట్టి.  


కొడుకు మీద, కొడుకు సంసారం మీద ఎన్నో ఎన్నో ఊహలు పెంచుకుంది వీడి పిచ్చి తల్లి ఎప్పట్నుంచో. ఒక్క ముక్కైనా ఆ తల్లితో పంచుకోకుండా ముందే ఫిక్స్ చేసుకున్న పెళ్లి  విషయం ఒక్కుదుటున అట్లా ఉదేసి  'ఇంతే సంగతులు' అనేస్తే తల్లికే కాదు తండ్రికీ గుండె బద్దలవక మానదు!

పుట్టిన గడ్డను వదిలి ఎక్కడో ఖండాంతరాలకు ఎగిరెళ్ళిపోయి చివరి మజిలీ అపరిచత పరిసరాలలో  గడపాలంటే  పెద్దతనంలో ఎన్నో వదులుకోవాలి పెద్దవాళ్ళు! ఆమె బాధ నేను అర్థం చేసుకోగలను; కానీ తల్లిని సముదాయించవలసిన పుత్రధర్మం ముందుగా పాటించవలసింది కన్నబిడ్డ కదా! బాధ్యతలకు అతీతమైన స్వలాభమే పరమావధిగా భావించే నేటి తరం ప్రతినిధిగా చిన్నా ఇప్పుడు నేను చింతిస్తూ కూర్చున్నందువల్ల  సమస్యకు పరిష్కారమైతే  లభించదు. ముందీమెను ఓదార్చడం ముఖ్యం నాకు.  

‘వాడు చేసే దాంట్లో మాత్రం విపరీతం ఏముందిలే! తరానికి తగ్గట్లు  నడుస్తున్న తెలివి వాడిది. ఆ ప్రాప్త కాలజ్ఞత కొరవడి కుములిపోతున్నది మనం.  ఇన్ని చదువులు చదివినవాడిని ముసలి తల్లిదండ్రుల దగ్గరే ఉండి పాదసేవ చేసుకోమనడానికి ఇదేమైనా రమాయణ శ్రవణుడి కాలమా? మనకు ఏ శ్రమా లేకుండా చక్కంగా  పిల్లను తానే వెదికి తెచ్చుకున్నాడు. రేప్పొద్దున మంచి చెడ్డలకు మనం మాట పడే శ్రమ తగ్గించాడు నీ కన్న కొడుకు. తనకిష్టమైన చోటికి వెళ్లి సంతోషంగా ఉండేందుకు.. కని పెంచిన వాళ్లం మనమే అడ్డంకనిపిస్తే మిగిలున్న ఆ కాస్త మన్ననా  మన్నుకొట్టుకుపోదా! పిల్లల అల్లరి భరించడంలోనే పెద్దరికం సార్థకత ఉంది' అని ఎంతగానో సర్దిచెప్పానామెకు.  

చిన్నా పెళ్లీ 'తూ.. తూ మంత్రంగానే జరిగిపోయింది. అదీ ఎట్లాగూ  రిజిస్ట్రేషన్ ఆఫీసు కెళ్లి సర్టిఫికేట్ తెచ్చుకునే తంతంగంలో  భాగం కాబట్టి. పిల్ల తరుఫు బంధు మిత్రులంతా అమెరికా సెటిలర్సట.. అక్కడి కెళ్లిన తరువాత తీరికగా గ్రాండ్ గా ఆ ముచ్చట జరిపించుకోవాలని కోడలమ్మ కోరికట. 

వాడు ప్రయాణమై వెళ్లే రోజున నేనూ, వాడి అమ్మా ముంబయ్ ఎయిర్ పోర్ట్ దాకా వెళ్లాం వీడ్కోలు ఇవ్వడానికని. 

చిట్టి చిట్టి చేతులతో తడబడుతూ నా చిటికెన వేలు పట్టుకుని నడకలు నేర్చుకున్న మా చిన్నా ఏ తడబాటు లేకుండా దడదడా అలా విమానమెక్కి వెళ్ళిపోతుంటే మళ్లీ యాభై ఏళ్ల కిందట  మా అన్నల భూజాల మీదుగా పడమటి కేసి వెళ్లిపోయిన   మా నాన్న గుర్తుకొచ్చాడు.. ఎంత తప్పని మనసుకు తోచినా.. ఆ ఆలోచన వదిలింది కాదు.

***

అదే పనిగా  మోగుతుంటే వణికే చేతులతో ఫోన్  అందుకున్నది మా ఆవిడ. 

చిన్నానే! గబగబా మాట్లాడేస్తున్నాడు.. ఫోన్ బిల్ ఎక్కువవుతుందని కాబోలు! 'అమ్మా!  మా  మీ కోడలు వాళ్ల పేరెంట్స్ కు వచ్చే నెల  వెడ్డింగ్ యానివర్శిరీ! మా అత్తగారు కంచిపట్టు చీర మీద బాగా మోజు పడుతున్నారీసారి. బాబాయ్ ఉండేది అక్కడేగదా!  ఓ అర డజను శారీస్  ఆర్డరిచ్చి అర్జంటుగా గరుడాలో తోసేయండి! బిల్లీసారికి మనమే పెట్టుకుందాం.. ఫస్ట్ టైం కదా!వాళ్ల చేత పెట్టిస్తే బాగుండదు..' .

'నాన్నతో మాట్లాడరా! ఇట్లాంటి వన్నీ నా కేం తెలుస్తాయ్!'  పాలిపోయిన మోహంతో ఈవిడ అంటుంటే మధ్యలోనే తుంచేసినట్లు 'మళ్లీ మొదట్నుంచీ సోదంటే బోలెడంతవుతుందే బిల్లు! మీ కేం తెలీదు.. చాదస్తం' అంటూ ఫోన్ కట చేశాడు కటిక్కిన  సుపుత్రుడు. 

ఈవిడిక్కడ మొహానికి కొంగు అడ్డం పెట్టేసుకుంది. కుళ్లి కుళ్లి ఏడిచే ఆవిడను ఏమని సముదాయించడం పద్దాకా! 'జగన్నాథం తెలుసుగా! మా ఆఫీసు కొలీగ్! నా కన్నా రెండేళ్లు ముందు రిటైరయ్యాడు.  ఉన్నదంతా దోచి కూతురు పెళ్లి చేశాడని కొడుకు  అలిగి  వేరేగా కాపురం వెళ్ళిపోయాడు. అన్ని చోట్లా ఉన్నదే ఈ బాగోతం. జగన్నాథమిప్పుడు  పెళ్లాంతో సహా ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్నాడు అనంతపురం లో. చాలా బాగుందట అక్కడ. పోనీ.. మనమూ.. అక్కడి కెళ్లిపోదామా!'

ఠక్కున తలెత్తి అంది ఆవిడ అంత ఏడుపులోనూ 'వద్దండీ! అట్లా వెళ్లిపోతే  ముందు  చిన్నానే ఆడిపోసుకుంటుందండీ లోకం. మనమే ఎట్లాగో సర్దుకుపోదాంలే! కష్టాలేమైనా మనక్కొత్తా!' అంది కళ్లు తుడుచుకుంటూ లేచి వంటింట్లోకి వెళ్లిపోయిందా తల్లి!

***

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రజ్యోతి వారపత్రిక 1 అక్టోబర్ 1999 నాటి సంచికలో ప్రచురితం)

 

 

 

 

 

 

 

 

  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...