వ్యాసం - గురించి ఓ వీసమెత్తు!
- కర్లపాలెం హనుమంతరావు
వ్యాసం అంటే శబ్దరత్నాకరం ప్రకారం - విషయాన్ని విస్తారంగా రాయడం. ఆ రాసేది ఏదో చరిత్రకు సంబంధించింది అయివుండాలని ఆంధ్రవాచస్పతం చెబుతోంది.
రాసే విషయం తెలిసి ఉండటమో, తెలియని పక్షంలో ఓపికగా తెలుసుకుని ఉండటమో అవసరం. ఆ పైన మాత్రమే అంశాల వారీగా వాటిని వివరించడానికి పూనుకోవాలి. అప్పుడే ఇంగ్లీషు వాళ్లు ఎస్సే అన్నదాన్ని మనం వ్యాసంగా చెప్పుకునే రచనకు ఒక సక్రమమైన రూపం వస్తుందని భా. స. వారి విజ్ఞానసర్వస్వం మరింత వివరణ ఇచ్చింది.
మనకు వ్యాసం అంటే ఒకటే రూపం.. హిందీ, బెంగాలీ, ఒడియా వాళ్లకు మల్లే నిబంధ, ప్రబంధ.. లాంటి రకరకాల పేర్ల బాధ లేదు.
ఈ ఎస్సే విషయంలో ఇంగ్లీషువాళ్లదీ తలో దారే. శామ్యూల్ జాన్సన్ ఇట్లా అన్నాడూ, ముర్రే అట్లా నిర్వచనం చేశాడూ .. అంటూ నిఘంటువులూ విజ్ఞాన సర్వస్వాలూ కోట్ చేసుకుంటూ కూర్చుని దీన్నో బోర్ కొట్టే క్లాస్ పాఠంలాగా మార్చేస్తే చెప్పదలుచుకున్న పిసరంత విషయమూ పక్కదారి మళ్లేస్తుంది. అందుచేత చరిత్రలోకి తొంగి చూసే చిన్న ప్రయత్నం చేసి చూద్దాం!
16వ శతాబ్దంలో ఫ్రెంచ్ రచయిత ఎస్సే అంటూ ఓ కొత్తప్రకియ సాహిత్యంలో మొదలపెట్టేదాకా వ్యాసరూపం ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలీదు. బేకన్, కౌలే, డ్రైడొన్ లాంటి ఇంగ్లీషు రైటర్స్ ఆ ప్రక్రియకు ఓ అందం, హంగు ఏర్పరిచినప్పటి బట్టే గద్యం పద్యంలాగా, ప్రశంస విమర్మకు మల్లే సరికొత్త ప్రయోజనాలు సాధించి పెట్టే సాహిత్య ప్రకియగా వ్యాసం విశ్వవ్యాపితమయింది .
18 వ శతాబ్దంలో స్టీల్ , టాట్లర్ అనే మిత్రులిద్దరు స్పెక్టేటర్ లాంటి పత్రికలు పెట్టి .. చమత్కారపూరితమైన వ్యాసాలకు శ్రీకారం చుట్టారు. మన తెలుగులో పానుగంటివారి 'సాక్షి' వ్యాసాలకు ఆ ధోరణే ప్రేరణ. పత్రికలు లేకపోతే వ్యాసాన్ని పట్టించుకునే వాడుండడు. వ్యాసాలు మీ పత్రికలు మనుగడ సాగించలేవు.. అప్పటికీ ఇప్పటికీ అదే పరిస్థితి.
గోల్డ్ స్మిత్ ' సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ ' ఆ చమత్కారానికి సమాజంలోని మంచి చెడ్డల సమీక్షనుకూడా జతచేసింది. లాంబ్ ' ఎస్సే ఆఫ్ ది ఇలియా' తో వ్యాస ప్రపంచంలో సృష్టించిన ప్రమాణాలే నేటికీ అనుసరణీయం. ఇలియా అతని కలం పేరు. చాలా మృదువుగా సాగే ఆయన వ్యాసాలను సంపుటాలుగా తెస్తూ హిల్లూ, హాల్ వర్డూ అనే విమర్మకులు వెలువరించిన పుస్తకం పీఠికలో. . ఇదిగో ఇప్పుడు మనం చేసే చర్చలాంటిదే చేశారు వ్యాస ప్రకియ మీద కూలంకషంగా.
మెకాలే, ఆర్నాల్డూ, లాయీస్, స్టీవెన్‌సన్, హడ్సన్, ఎమర్మన్ లాంటి గొప్ప వ్యాసరచయితలను తీర్చిదిద్దిన ఇంగ్లీషు 'ఎస్సే ' చరిత్రను గురించి ఎంత చెప్పుకున్నా ఇంకొంత మిగిలే ఉంటుంది. కాబట్టి ముందుకు కదులుదాం!
కవికి గద్యం ఎట్లాగో .. గద్యానికి వ్యాసం అట్లాంటిది - అన్నాడు ప్రముఖ హిందీ సాహిత్యవేత్త రామచంద్ర శుక్లా. వ్యాసమంటే సంక్షిప్తంగా ఉండాలి. సరళంగా సాగాలి. నాలుగయిదు పుటల వరకు సాగదీసే
' ఎస్సే ఆన్ 'అండర్ స్టాండింగ్' లాంటి వ్యాసాలు చూశాక హిల్లూ, హాల్ వర్డూ పెట్టిన షరతు ఇది. అయినా మన తెలుగు కలం వీరుల వ్యాస విజృంభణకు అడ్డంకి కాలేకపోయింది. ప్రతిభ అనే మాసపత్రికలో వందపుటల ' ఆంధ్ర మహాభారత విమర్శనము ' అందుకో ఉదాహరణ! ఆ మధ్యా ' వ్వాస వాజ్ఞ్మయ మంజరి' లో నూటయాభై పేజీల వ్యాసమొకటి ప్రత్యక్షమవడం ఎవరం మర్చిపోలేని విచిత్రం.
విషయ ప్రధానంగా ఉంటుంది కాబట్టి వ్యాసం సంక్షిప్తంగా ఉంటే చదవ బుద్ధవుతుంది. అంశం ఏదైనా కావచ్చు కానీ, కళావంతంగా, కమ్మని శైలిలో, చమత్కారం అద్దుతూ సమకాలీనత ప్రధానంగా సాగే వ్యాసాలకే ఆదరణ ఎక్కువ. రాసేవాడు తన భావాలను మన మీద బలవంతంగా రుద్దుతున్నాడన్న అనుమానం వచ్చిందో.. ఆ వ్యాసానికి నూకలు చెల్లినట్లే! సూటిగా, మనసుకు హత్తుకునే పద్ధతిలో రాసిన వ్యాసాలే కలకాలం సమాజాన్ని ప్రభావితం చేయగలిగేది! ' ది ట్రూ ఎస్సే ఈజ్ ఎస్సెన్షియల్లీ - అన్న హడ్సన్ సలహా గుర్తుంచుకుంటే చాలు.. ఆ ఆత్మాశ్రయ సాధన కోసం వ్యాసరచయితకు సృజనాత్మక ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి! వ్యాసరచనకు ఏ యోగాసనాలూ లేవు.
వ్యాసం ప్రధానంగా వచనంలో ఉండటమే రివాజు. పోప్ లాంటి మహాశయులు 'ఎస్సే ఆన్ క్రిటిసిజమ్' వ్యాసాలు పద్య రూపంలో రాశారని .. మనమూ ఆ దుస్సాహసానికి పూనుకుంటే పోపు మాడిన పప్పు తయారవడం ఖాయం. మనవాళ్లు గతంలో భూగోళం, గణితం కూడా పద్యాలల్లో రాసేవాళ్లు! వ్యాసం కూడా పద్యాల్లో రాసేసి మీసం మెలివేయలేదు. అక్కడికి అదృష్టమే!
అచ్చుయంత్రాలు వచ్చి పత్రికల ప్రగతికి బాటలు పడే క్రమంలో తెలుగులోనూ వ్యాసాల అక్కర ఎక్కువయింది. ఎవరెంత ప్రాగల్భ్య ప్రకటనలు చేసినప్పటికి భరత ఖండంలోనూ తతిమ్మా ఖండాల మాదిరే .. అచ్చుయంత్రాల ఆగమనం .. పత్రికల ఆవిర్భావం.. వ్యాసప్రక్రియ ఆవిష్కరణ వికాసాలు ఒక వరసలో సాగినవే! మన ప్రాచీన సాహిత్యంలోనే నేటి వ్యాసానికి బీజాలు ఉన్నాయన్న వాదనలో పస లేనేలేదు. శాసనాలు, వ్యాఖ్యానాలు వ్యాసాలు కాలేవు.
19వ శతాబ్దం పూర్వార్థం నాటికిగాని తెలుగు సాహిత్యంలో ' వ్యాసం ' ప్రభవించలేదు. 1840-50 ల నాటి ముద్దు నరసింహంగారి నుంచి తెలుగులో నిర్వచనానికి ఒదిగే వ్యాస రచన ప్రస్థానం ప్రారంభమయింది అనుకోవాలి. రచన, శైలి, భాషా ప్రయోగం లాంటి అంశాలలో నేటికీ తాజాదనపు సువాసనలు వెదజల్లే తొలి వ్యాస సంపుటి ముద్దు నరసింహంగారి హితసూచని. అభ్యుదయ భావాలతో కిక్కిరిసి ఉండే ఆయన వ్యాసాలు అందుకే వీరేశలింగం పంతులుగారికి శిరోధార్యాలయ్యాయి.
ఆర్ష విజ్ఞానం ప్రతిభావంతంగా ప్రదర్శించిన వ్యాసరచయిత కీ. శే పరవస్తు వేంకట రంగాచార్యులు ( 1822 - 1900 ) , విలువైన కాలాతీత వ్యాసపరంపర్ సృష్టికర్త కీ.శే.వీరేశలింగం పంతులుగారు, కొమర్రాజు వేంకట లక్ష్మీ నరసింహం, బండారు అచ్చమాంబ, పూండ్ల రామకృష్ణయ్య, వేదం వెంకటరాయి శాస్త్రి, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, జయంతి రామయ్య, చిలుకూరు వీరభద్రరావు, చిలకమర్తి వేంకట లక్ష్మీనరసింహం పంతులుగారు, ముట్నూరు కృష్ణారావు, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఒంగోలు వెంకటరంగయ్య, ఆచంట వేంకటరాయ సాంఖ్యాయనశర్మ, గిడుగు వెంకట రామ్మూర్తి, మారేపల్లి రామచంద్ర శాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, వేటూరి ప్రభాకరశాస్త్రి, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, పురాణం సూర్యనారాయణతీర్థులు, గొబ్బూరు వెంకటానంద రాఘవరావు, చిలుకూరి నారాయణరావు, కాశీనాధుని నాగేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, పానుగంటి లక్ష్మీనరసింహరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేలూరి శివరామశాస్త్రి, శ్రీవాత్సవ, కొంపెల్ల జనార్దనరావు వంటి ఎందరో నిష్ణాతులు వ్యాసప్రక్రియ పుష్టికి మూలకారకులు.
సాహిత్య వికాసానికి కాలనియమం ఉండదు. అభిరుచి, అభినివేశం ప్రధానం . అక్షర క్షేత్రంలో బీజమెత్తి మహావృక్షంగా పరిణమించిన అన్ని ప్రక్రియల దారిలోనే వ్యాసధారా నిరంతరాయంగా కొత్తపుంతలగుండా ఉరకలెత్తుతూనే ఉంది. రాళ్లపల్లి, పింగళి, విశ్వనాథ, తల్లావజ్ఝల, తాపీ, దీపాల, నార్ల, వేదం, చల్లా, గిడుగు, శ్రీ శ్రీ, , నోరి, దివాకర్ల, ఆరుద్ర, సినారె, నిడదవోలు, దేవులపల్లి, వడ్లమూడి, వడలి, వావిలాల, నాయని, సినారె, నాయిని, తూమాటి, జి.వి.కె, రమణారెడ్డి, రామరాజు, రావూరి, గుంటూరు, కొత్త, విద్వాన్ విశ్వం, చిలుకూరి, పుట్టపర్తి, పిల్లలమర్రి, వసంతరావు, ఆండ్ర, నటరాజా, దిగవల్లి .. ఇట్లా వ్యాసరథ చక్రాల నిరంతర గమనానికి ఎంతో మంది మహానుభావుల నిరంతరాయ కృషీవలత్వమే ప్రధాన ఇంధనం.
ఇంగ్లీషు ' ఎస్సే ' చరిత్రకు నాలుగు శతాబ్దాల చరిత్ర. కాకలుదీరిన 'కలం ' కారులు దీని వైభవానికి మూలకారణం, తెలుగు ' వ్యాసం 'ఒక్క శతాబ్దం అయినా నిండింది కాదు. వ్యాస కృషీవలుల నిత్య వ్యాసంగం వ్యాసరంగంలో కొదవ లేమి కారణం కాకపోయినా, నవల, నాటకం కథ, కవిత్వాది క్షేత్రాల మాదిరి కావలసినంత పరిపుష్టంగా వికాసం జరగడం లేదనే సత్యం గ్రహించక తప్పదు . ఆ సదవగాహన కలిగినప్పుడే భావికార్యాచరణకు సరితూగే ప్రణాళికలు రూపొందించుకుని, ఆచరించడం ద్వారా ఆ లోపం పూడ్చుకునే ఆస్కారం.
- కర్లపాలెం హనుమంతరావు
( సోర్స్ : సారస్వత వ్యాసములు - రెండవ సంపుటి పురిపండా అప్పలస్వామి తొలిపలుకులు)
09-09.2021
బోథెల్ ; యూ ఎస్.ఎ
No comments:
Post a Comment