సజీవ భాష
అనగా నేమి? నట్టింట్లో పొద్దస్తమానం తెగ వాగే టీ.వీ, అనుక్షణం చెవిలో మోగే సెల్ జోరీగ, కంటి ముందు
ఝిగేల్మని మెరిపించే వెండితెర బొమ్మ.. ఏ భాషలో సంభాషించునో అదియే సజీవ భాష నాబరగు. ఐతే ఆ లెక్కన అచ్చు తెలుగు
ఎప్పుడో చచ్చినట్లు లెక్క. అమంగళము ప్రతిహతమగు గాక.
మరి తెలుగు
మృతభాషయినచో అమృతభాష యేది గురువా?
ఆంగ్లాంధ్రములు
కలిపి పిసికిన సంకర బంకరా శిష్యా!
తలకట్టు ఒక్క మన తెలుక్కి మాత్రమే సొంతమైనట్టు ఆ నిక్కులు, నీలుగులు చాలించరా ఇంక! తెలుగుతల్లి తలకు 'కట్టు'మాత్రమే మిగిలిందని
తెలుసుకుంటే మేలురా కుంకా!
బళ్లల్లో
తెలుగుతల్లికి బడితెపూజలే కదా నాయనా సదా!
గుళ్లల్లో సుప్రభాతానికి బదులుగా 'గుడ్ మాణింగ్' అంటేనే ఆ గాడ్ ‘గుడ్ లుక్సు’లో భక్తుడు బుక్ సర్వదా!
వచ్చినా
వచ్చకున్నా ఆంగ్లంలో వాగితేనే భయ్యా.. దండాలు.. దస్కాలు.. సత్కారాలు! 'అ.. ఆ.. ఇ.. ఈ.. ఉ..ఊ'
లని మూలుగుతూ కూర్చుంటే అర దండాలు..
అరదండాలు.. ‘చీ.. పో’ అంటూ చీత్కారాలు! తెలుగుపంతుళ్ళకే
తెలుగులో సంతకాలంటే వాంతులయే వింతకాలంలో బాబూ ప్రస్తుతం తెలుగుతల్లి బతుకీడుస్తున్నది! ఉద్యోగం, ఉపాధి సంగతులానకరా జనకా! మనసుపడ్డ పాపను పడెయ్యడానికైనా ప్రేమలేఖ
ఆంగ్లంలోనే గిలకాలిరా మొలకా! ఇంకేం చూసి తెలుగుమీద మోజు పడాలిరా బళ్లకెళ్లే
భడవాయలంతా? మెడల్లో పలకలు గంగడోళ్ళలా వేలాడేసినా సరే
బిడ్డల్ని లార్డు మెకాలేకి నకిలీలుగా మార్చేసెయ్యమనే కదా మన తెలుగయ్యల అమ్మల వేడుకోలు! పులులు, పిచ్చుకలు అంతరించిపోతున్నాయన్నంత చింతైనా లేదంటారా తెలుగు అంతర్ధానమైపోతున్న
స్పీడుకు! దటీజ్ తెలుగు దుందుడుకు!
కాపాడే
కంటిరెప్ప గొప్పతనం కన్ను గుర్తుపడుతుందా? ఆదరించే అమ్మభాషకు అంతకుమించిన దశ గిడుతుందా?
క్రియాపదం
తెలుగువాక్యంలో చివరకు రావడమే అన్ని లోకువలకు
అసలు కారణం స్వామీ! అదే ఆంగ్లంలోనో? కర్తా కర్మల మధ్యలోకైనా సరే వచ్చి కూర్చునే దొరతనం.. యూ నో! 'పని'కి వెనకుండే
తెలుగుకి తోడుంటే శనికి జోడవుతామని జడుపు
తెలుగోడికి! ఎంత పద, లిపి సంపద తెలుగు నాలికచివర పలుకుతుంటేనేమయా.. ఆంగ్లంతో కలిపి కొట్టకపోతే ఉలిపికట్టెతో పోలికొస్తుందని
ఉలుకిపాటా భయ్యా?
గురజాడగారి
గిరీశానికీనాటికీ తెలుగ్గడ్డమీదెంత గ్లామరో తెలుసా? కారణం? పూనా ఢక్కన్ కాలేజీలో మూడు ఘంటలేకబిగిన బట్లరింగ్లీషులోనైనా సరే
బాదేయగల ఘటం కావడం! 'చాట్'లతో ఫట్ ఫట్ లాడించాల్సిన లేటెస్టు సెంచరీలోనూ
శ్రీనాథుడి చాటువులే వేపుకు తిందామనుకుంటే
చెవులకు చేటలు కడతారయ్యా కామయ్యా! బమ్మెర పోతనగారా
కమ్మదనం భ్రమలో పడి అమ్మభాషలో కాకుండా ఆంగ్లంలో
కుమ్మేసుంటే భాగవతం ఈపాటికి లాటిన్లో బైబిలుకి
పోటీకొచ్చుండేది సుబ్బయ్యా!
వాడుకభాషంటే
వేడుక భాషా? వ్యవహార భాషయ్యా బాషా!
ఇంద్రాసూయైనా సరే.. ఆంధ్రాలోనే
వ్యవహారం అని చంద్రబాబేనాడన్నా మొండికేసాడా?
కేసుంటే అన్ని కోట్ల పెప్సీప్లాంట్లకేసు పురిట్లోనే
సంధి కొట్టేసేదే కాదా? కేసీఆర్
ఎంతైనా మొనగాడవనీ ఒక్క తెలంగాణా యాసతోనే
కెసి కెనాలు పనులడ్డుకోగలడా జెసీ దివాకరం?
ఆదికవి నన్నయ ఆ సోది తెలుగుక్కలా అంకితమయిపోబట్టే ఒక్క రాజమండ్రికే
బైండయిపోయాడన్నా! అరసున్నాలు, బండిరాలు,
కాసిని సంధులు వదిలేసినందుకే
శ్రీరంగం శ్రీనివాసరావుకా యుగకవిగా
బిరుదులు.. గౌరవాలే! అక్షరాలు, హల్లులు, వత్తులు, సంధులని తేడా పాడా లేకుండా ఏకమొత్తంగా వర్ణమాలనుమొత్తం
గంగలో కలిపే మన గంగా విత్ కెమేరామన్
రాంబాబు మార్కు టీ. వీ యాంకర్లకు, రేడియో జాకీలకు, సినిమా రైటర్లకు, డాక్టర్లకు, కోర్టియర్లకు, సర్కారు సర్వెంట్లకు, ప్రజాబంట్లకు
ఇంకెంత గొప్ప గౌరవం దక్కాలప్పా? డిస్సెంటు పత్రం సమర్పించిన గురజాడ అప్పారావుజీ
గొప్పా? ఇండీసెంటుగా ఉంటుందని అసలు తెలుగు మొత్తాన్నేఏకమొత్తంగా చెత్తకుప్పలో వేసిన ప్రయివేటు బళ్ళు గొప్పా? బళ్ళకెళ్ళే
మన పిడుగుల తెలుగు మాటల ముందు గిడుగు రామ్మూర్తిగారి ప్రజ్ఞాపాటవాలెందుకు? బుడుంగుమని మునగాల్సిందే ఎంత పెద్ద విశ్వనాథ
సత్యనారాయణ శాస్త్రులుగారైనా సరే!
కర్ణాటక
సంగీతం ఆంగ్లంలో లేదు కాబట్టే తెలుగు చెవులకంత
కర్ణకఠోరం! ఆంగ్లవాసన సోకనందుకే అన్నమయ్య సంకీర్తనలకా కాలదోషం! బడేగులాం సాబ్ హీందీకి గులామైతే.. ఆంగ్లభాషకు మన తెలుగులందరం బడే బడే గులాములం
బాద్షా! ఫ్రెంచివాళ్ళు కనక బాలమురళి గానానికలా ఫిదా అయిపోయి.. కనకగండపెండేరాలు గట్రా కాలికి
తొడిగారు! ఈలపాటైనా సరే ఈ నేలమీద ఇంగ్లీషు ట్యూనుంటేనే తెలుగువాడి నోట్లో
ఒన్సుమోర్లు మోగేది!
తుమ్ము,
దగ్గులదాకా ఎందుకు? ఆవలింతలైనా ఆంగ్లయాసలో ఉండాలమ్మా ఇంగ్లీషు డాక్టర్లు
మందులు రాసేదివ్వడానికి.
ఆర్ద్రత, సరళత తెలుగుభాష సొంతమవడమే అసలు చిక్కంతా!
కాటికెళ్లే శవాలు కూడా 'క్యాచ్ మీ ఇఫ్ యూ కేన్' అంటూ లేటెస్టు ట్యూనులు కోరుకంటుంటే తెలుగు మృతభాషగానైనా బతికి బట్టకడుతుందా అన్నది లక్షడాలర్ల ప్రశ్న!
పొట్టకోసినా
తెలుగక్షరం ముక్కొక్కటైనా కనపించనోడే
తెలుగువాడికివాళ తలమానికంరా సోదరా! పచ్చడి
లేకుండా ఎన్నిడ్లీలైనా లాగించచ్చేమో గానీ ఆంగ్లం
లేకుండా తెలుగుముక్కంటే చచ్చే చావే
తెలుగోడికి! తెలుగిది కేవలం ప్రాచీన హాదానే
సుమా! ఆంగ్లానిది అధునాతన హోదా!
ఒకే
భాషవాళ్లంతా ఎన్ని దేశాల్లో ఉన్నా.. సొంతపనులన్నీ తల్లిభాషలో చేస్తే చాలంట.. అంతర్జాతీయస్థాయికి అదే మంచి చిట్కా అని క్లేర్ మోరనే
స్పానిష్ పెద్దాయాన సిద్దాంతం. తెలుగువాడు తెలివిగలవాడబ్బా! అంత
కష్టంకూడా పడ్డానికి ఇష్టపడడు.
సొంతగడ్డమీద ఉంటూనే సొంతభాషని ఆంగ్లంలా చడమడా వాడేసి ఆటోమేటిగ్గా
అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోగలడు.. సొంత కలల్లో!
తెలుగు ‘పుచ్చిపోయిందోచ్! చచ్చిపోతుందోచ్!’ అంటూ పద్దస్తమానం కన్నీళ్ళు పెట్టుకునే
తిక్కన్న వారసులకూ శుభవార్త! తిట్లున్నంత కాలం తెలుగుంటుంది. ప్రజాస్వామ్యమున్నంత కాలం తిట్లూ ఉంటాయి. తెలుగు చల్లగా పదికాలాలపాటీ తెలుగ్గడ్డలమీద వర్ధిల్లాలని ప్రార్థించే పెద్దలారా! సదా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని మొక్కుకోండి చాలు! తెలుగూ దానితో పాటే దివ్యంగా వెలుగుతూనే ఉంటుంది చట్టసభల్లో.. కనీసం తిట్లరూపంలోనైనా!
- కర్లపాలెం హనుమంతరావు
( సూర్య - దినపత్రిక - 20 -10-2019 - ప్రచురితం )
No comments:
Post a Comment