పున్నారావు ఫ్యామిలీ తిరుపతి
వెళ్లి తిరుగొచ్చే సరికి దొంగలు పడి ఇల్లు గుల్లయింది. పదిగ్రాముల బంగారం, పాతిక్కిలోల వెండి, పట్టుచీరలు, నగానట్రా అంతా కలిపి సుమారు ఐదు లక్షల వరకు
కరావడి అయిందని పున్నారావు అర్థాంగి కనకమ్మ ఒకటే గగ్గోలు.
'పోలీసు కంప్లయింట్ ఇద్దామండీ!' అని మొత్తుకుందా ఇల్లాలు. గయ్యిమన్నాడు పున్నారావు
'మతుండే మాట్లాడుతున్నావా? పోలీసులు ఆరాలు మొదలుపెడితే పోయేది ముందు
మన పరువే!'అంటూ.
పున్నారావు వాటర్ వర్క్స్ డిపార్డ్ మెంటులో
సీనియర్ అకౌంటంట్ హోదాలో ఉన్నాడు. సోదాలు మొదలుపెడితే ఆదాయానికి మించిన ఆస్తులు బైటకుపొక్కుతాయని
అతగాడి బెంగ.
ఈ ఘటన జరిగిన పదిరోజుల తరువాత కనకమ్మ సాయిబాబా
గుళ్లో శని వదిలించుకొనే పూజేదో చేయించడానికని వెళ్లినప్పుడు వెనక వీధి సూర్యారావుగారి పెళ్లాం మెళ్లో వేళ్లాడే గొలుసు
అచ్చం తన మెళ్లో ఉండేది లాంటిదే అనిపించిందిట. రొప్పుకుంటూ రోసుకుంటూ ఇంటికొచ్చి పడి
మొగుడి పీక పట్టుకుంది.. ఏదో ఒకటి చేసి తీరాల్సిందనంటూ.
కనకమ్మకు తనే వెళ్లి ఆరాలు తీద్దామనివుంది కానీ, వాళ్లెవరో కొత్తగా వచ్చినవాళ్లు. కాలనీలోకొచ్చి
నెలరోజులు కూడా కాలేదు. ఎట్లాంటి మొరటు మనుషులో బొత్తిగా తెలీదు.
పున్నారావు పూనుకుంటే కాని పని అయ్యే దారి
లేదు. ఆయనెందుకో ఈసారి బెల్లం కొట్టిన రాయికి మల్లే ఉండిపోయాడు!
ఆడవాళ్ల నోట నువ్వు గింజైనా నానదు కదా! ఆ
నోటా ఈ నోటా కాలనీ అంతా పాకిపోయింది దొంగతనం వ్యవహారం.. ఎవరో పనిగట్టుకుని మరీ ప్రచారంరం చేసినట్లు! సూర్యారావు
ఫ్యామిలీకి కష్టాలొచ్చిపడ్డాయి. సామాను కొనుక్కుని సూర్యారారావు తిరిగొచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చుట్టూ తరచి చూసుకుంటున్నాడు
కాలనీలోని పచారీ దుకాణంవాడు. గుళ్లో ఆయబ పెళ్లానికి శఠగోపం పెట్టేటప్పుడు హారతి పళ్లెం తగినంత దూరంలో
ఉండేటట్లు జాగ్రత్త పడుతున్నాడు పూజారిగారు. సూర్యారావు కొడుకును ప్రాక్టీస్ మ్యాచ్
కూడా ఆడనివ్వడానికి తటపటాయిస్తున్నది కాలనీ యువ క్రికెట్ టీమ్. ట్రెజరర్ గా ఎన్నుకొని నెలన్నర కూడా కాలేదు.. ఏదో
ఓ మిష మీద సూర్యారావును తొలగించాలనే ఆలోచనలో పడింది కాలనీ వెల్ఫేర్ సొసైటీ . ఇలాంటి పరిస్తితుల్లో సూర్యారావు కాలనీ నుంచి ఒకరాత్రి కాపురం ఎత్తేశాడు ఎవరికీ చెప్పాపెట్టకుండా.
ఏడాది గడిచింది.
పున్నారావు రిటైరయాడు. పెన్షన్ క్లియరెన్సు
కోసం తత్సంబంధిత ఆఫీసుల చుట్టూ తిరుగుళ్ళు
అయిన తరువాత చివరి అంచెకు ముందున్న టేబుల్ దగ్గరి కొచ్చింది ప్రస్తుతం ఫైల్. అక్కడ
ఉన్నది సూర్యారావే అయిపోయాడు.
నేరుగా వెళ్లి కలిసే ధైర్యం చాలక చిన్నప్పటి స్నేహితుడు కృష్టంమూర్తిని వెంట పెట్టుకుని
వెళ్ళాడు పున్నారావు. సూర్యారావు కాలనీలో ఉండి,
పోయిన
కిరాయి ఇల్లు కృష్ణమూర్తిదే. ఆ విధంగా ఆ ఇద్దరికి కావలసినవాడు కృష్ణమూర్తి.
పని అనుకున్న దానికన్నా ముందుగా పూర్తి చేసిపెట్టాడు
సూర్యారావు. కరిగి నీరైపోయాడు పున్నారావు. ఛాంబర్లోకి తనే స్వయంగా వెళ్లి బాస్ సంతకం
చేయించుకుని వచ్చి పున్నారావు చేతిలో పెన్షన్ ఆర్డర్ పెడుతున్నప్పుడు 'సూర్యారావుగారూ! మీతో ఒకసారి మాట్లాడాలి.
దయచేసి ఒకసారి అటు వస్తారా?' అంటూ క్యాంటిన్ కు తీసుకు వెళ్లాడు.
బిల్లు వచ్చే సమయంలో గభాలున సూర్యారావు చేతులు
రెండూ పట్టేసుకుని 'సారీ సర్! ఐ యామ్ ఎక్స్టీమ్లీ సారీ! ఆ రోజు
మీ ఫ్యామిలీ మీద అలాంటి అభాండం వేయాల్సి వచ్చింది. అట్ దట్ టైమ్ ఐ వాజ్ టోటల్లీ ఇన్
ఏ హెల్ప్ లెస్ కండిషన్!' అన్నడు వణికే గొంతుతో.
సూర్యారావు నిదానంగా అన్నాడు 'మీ ఇల్లు వీధికి అటు తూర్పు ముఖంలో ఉంది.
మా ఇల్లు పక్క వీధిలో ఇటు పడమటి వైపుకు ఫేస్ చేసి ఉంది. పెరట్లోని గోడ ఒక్కటే కదా మనకు
కామన్? అంత మాత్రానికే మీ ఇంట్లో
ఎవరూ లేని సమయం చూసుకుని గోడ దూకి దొంగతనం చెయ్యాల్సిన అగత్యం మాకు ఎందుకుంటుంది మాష్టారూ? చేయని నేరాన్ని చేసినట్లు ప్రచారం చేసి మేమక్కడ
ఉండలేని పరిస్థితి కలిపించారు ఎవరో.. ఎందుకో! నా భార్య మెడలోని గొలుసు పెళ్ళి నాడు
వాళ్లమ్మ తన మెడలో వేసింది. పాతికేళ్ల బట్టి ఆమె అది వేసుకు తిరుగుతోంది. దాని మీద
అంత రచ్చా? ఇంకా ముందు ముందు ఏమేమి
వినాల్సొస్తుందోనని భయపడి, నేనే వాలంటరీగా ఇల్లు
ఖాళీ చేసేశాను. కృష్ణమూర్తిగారు నైబర్ కనక సరిపోయింది. లేకపోతే లైఫ్ లో ఇలాంటి చేదు
ఎక్స్పీరియన్సెస్ ఎన్ని ఫేస్ చెయ్యాల్సొచ్చేదో హోల్ ఫ్యామిలీ! '
'మీరు నన్ను క్షమించాలి. క్షమించినా,
క్షమించకపోయినా
ఉన్న విషయం ఒకటి చెప్పేస్తాను. చేసిన పాపం చెబితే పోతుందంటారు. నిజానికి ఆ రోజు మా
ఇంట్లో ఏ దొంగతనం జరగనే లేదు. నేను ఏమరపాటుతో ఉండుంటే జరిగి ఉండేదేమో! సిగ్గు విడిచి
మీకు నిజం చెబుతున్నా సూర్యారావుగారూ! నా డాటర్, మీ
సన్ ఆ సొమ్ముతో ముంబయ్ చెక్కేసి పెళ్లిచేసుకుందామనే ప్లానులో ఉన్నారు అప్పట్లో! మా
తిరుపతి ప్రయాణానికి ఒక్క రోజు ముందు తెలిసింది నాకా సంగతి. మా వాళ్లను ముందు రైలు స్టేషనుకు పంపించి ఇంట్లోని సొమ్మును ఇదిగో
ఈ కృష్టమూర్తి గాడకి అప్పగించి, ఆ తరువాత వెళ్లి వాళ్లను
కలిశాను. సొమ్ము దొరకలేదు కాబట్టి మీ పిల్లవాడి లేచివెళ్ళిపోయి పెళ్లిచేసుకునే ప్లాన్
కేన్సిల్ అయిపోయింది. మా అమ్మాయికి ఫేక్ ప్రేమ
విలువ ఎట్లా ఉంటుందో అప్పుడు తెలిసొచ్చింది.'
అని
లేచాడు పున్నారావు.
'నిప్పు రవ్వంత మిగిలి
ఉన్నా ఎప్పటికైనా ప్రమాదమే' అని ఎరిగి ఉన్నవాడిని
కాబట్టి ఆ దొంగతనం నాటకం నిజంగానే కంటిన్యూ కానించా!'
సూర్యారావు మరింక మాటా పలుకూ లేకుండా లేచి
వెళ్లిపోయాడు.
'నా ఇంట్లో నాకు తెలీకుండానే
ఇంత కథ నడిచిందిట్రా?' అని అబ్బురపోయాడు అంతా
వింటున్న కృష్ణమూర్తి సగం దారిలో.
'అసలు కథ అది కాదురా కృష్టమూర్తీ!
సొమ్ము ఖర్చవుతుందన్న కాపీనంతో ఇక్ష్వాకుల కాలం నాటిదైనా నువ్వా కొంపను బాగు చేయించవు!
చిన్న చిన్న రిపేర్లైనా తెగించి చేయిస్తే ఇన్ని సమస్యలుండకపోను. మీ కిరాయి వాటా బాత్
రూము గోడలకు ఎన్ని కంతలున్నాయో నీకు తెలీదా?
మగవాళ్లం
మనకు పట్టింపేమీ ఉండదు కానీ, ఫ్యామిలీ లేడీసుకు ఎంత
అంబ్రాసింగుగా ఉంటుందో నీ కేం తెలుసు? ప్రవరాఖ్యుళ్లా ఇప్పుడు
పేద్ద ఫోజు పెట్టిన ఈ పెద్దమనిషి సూర్యారావు
ఏం చేసేవాడో తెలుసా? మా ఇంట్లోని ఆడపిల్లలు
స్నానానికని వెళ్లినప్పుడల్లా గోడకు అటువైపు నున్న వాళ్ల స్నానాల గదిలోకి దూరి కంతలకు
కళ్లప్పగించి చచ్చేవాడు. పెద్దది ఎట్లాగో భరించింది కానీ కొన్నాళ్లు, చిన్నది తట్టుకోలేక వాళ్లమ్మకు చెప్పి ఒహటే
ఏడుపు. నీ బాస్ రికమండేషన్ మీద నువ్వా పోర్షన్ వాడికి ఇవ్వక తప్పింది కాదని నాకు తెలుసనుకో! నీ
నిస్సహాయత తెలుసు కనకనే నీ సైడ్ నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నేనూ రిటైర్మెంటుకు
దగ్గర్లో ఉండినవాడినాయ. పెన్షన్ పేపర్లు క్లియర్
చేసే డ్యూటీలో ఉన్న ఈ సూర్యారావుతో నేరుగా సున్నం పెట్టుకుంటే ఎమవుతుందోనని భయం! కనకనే
ఇట్లా కాలనీ జనాలను అడ్డమేసుకుని రచ్చ చేసి వాడంతట వాడే కొంప ఖాళీ చేసి వెళిపోయే స్కెచ్ ఇంత
పకడ్బందీగా వేసింది నాయనా!'
'మరి వీడు చేసిన పనికి
పాపం ఆ పిల్లగాడిని ఎందుకురా అంతలా బద్నాం చేయడం?' అన్నాడు
కృష్ణమూర్తి నిష్ఠురంగా.
'వాడూ ఏమంత తక్కువ తినలా
బాబూ? పెరటి గోడ పక్కన పెరిగే
డొంకలో దూరి కూర్చుకుని పద్దస్తమానం ఫోనులో బూతు సినిమాలు చూస్తుండేవాడు. ఆ సౌండు గోలలు
పసిగట్టి నేనే రెండు, మూడు సార్లు గడ్డిపెట్టా! అయినా బుద్ధి రాలా అబ్బకు మల్లేనే' అన్నాడు పున్నారావు. కృష్ణమూర్తి మర్నాడే
పాత ఇంటికి మరమ్మత్తులు మొదలుపెట్టాడు.
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రభూమి వారపత్రిక-2౦ -10 -2008- ప్రచురితం)
***
No comments:
Post a Comment