Thursday, June 23, 2016

యమలీల

గీతాంజలి చిత్రం గుర్తు ఉందా? త్వరలో చనిపోతానని తెలిసీ నాగార్జున.. చివరి రోజులు ఉల్లాసంగా గడిపేందుకు తల్లిదండ్రులకు దూరంగా పోయి .. అక్కడి ఆహ్లాదకర వారావరణం నేపథ్యంగా కథానాయికతో కలసి ప్రేక్షకులను చివరికంటా   రొమాంటిక్ గా ఎంటర్ టైన్ చేస్తాడు.
మ‌నిషి మ‌ర‌ణానికి ముందు య‌మ‌ధ‌ర్మ రాజు  నాలుగు మృత్యు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ని  హిందువుల విశ్వాసం. పురాణ కాలంనాటికి సంబంధించిన ఓ కథ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. య‌మునానదీ తీరంలో అమృతుడు అనే   వ్యక్తికి ఒకానొక సంద‌ర్భంలో  మృత్యుభ‌యం ప‌ట్టుకుంది.   య‌ముడి గురించి ఘోర‌ త‌పస్సు చేస్తాడు.  య‌ముడు ప్ర‌త్య‌క్ష‌మై 'ఏం వ‌రం కావాలో కోరుకో!' అని అడ‌గితే గడుగ్గా  అమృతుడు  చ‌నిపోయేందుకు చాలా ముందే తనను ఒక్కసారి హెచ్చరించాలని కోరుకొంటాడు .  ముందు జాగ్రత్తలతో  త‌న  బరువు బాధ్యతలను సక్రమంగా వారసులకు అప్పగించి పోవాలని అమృతుడి ఆలోచన.  'ఒక్క సారి కాది.. నాలుగు పర్యాయాలు  సూచ‌న‌ల‌ను పంపుతాన‌' ని మాట ఇచ్చి మాయమైతాడు మృత్యుదేవుడు. కాగా చివ‌రికి ఒక రోజు య‌ముడు వ‌చ్చి 'ఆయువు తీరిందిప్రాణాల‌ను తీసుకుపోతాన‌'ని అమృతుడి ముందుకొచ్చి నిలబడతాడు.  'చావు సూచ‌న‌లు ఏవీ ఇవ్వకుండానే  ప్రాణాల‌ను తీసుకుపోతాను' అనడం వాగ్దానభంగం అవుతుందని ధర్మరాజుతో వాదనకు దిగుతాడు అమృతుడు.  'నా మాట ప్రకారం  నీకు నాలుగు సార్లూ   చావు సూచ‌న‌ల‌ను అందించాను. వెంట్రుక‌లు తెల్ల‌బ‌డ‌డం, ప‌ళ్లు ఊడిపోవ‌డం, చూపు మందగించడం, శరీరం సహకరించక పోవడం..రాబోయే చావుకు ముందు నేను పంపించే సూచనలే ! గ్రహించక పోవడం నీ గ్రహచారం!' అంటాడు యమధర్మరాజు.  ముందుగా సంభవించే అనారోగ్యాలే  మ‌ర‌ణాగమనానికి సూచనలు.  వంట్లో మెరుగుపడని రుగ్మత పెట్టుకుని.. తెలిసి కొంతమంది.. తెలియక కొంతమంది ఆఖరి శ్వాసవరకూ ఆరోగ్యవంతులకు మల్లేనే ఆడుతూ.. పాడుతూ.. గడిపే ఇటువంటి   ఇతివృత్తాలతో విశ్వసాహిత్యంలో  సినిమాలు.. కథలూ వంటి కళారూపాలు చాలానే వచ్చాయి.
జీవితం ఏమిటీ?.. వెలుతురూ చీకటీ..' అంటూ కృష్ణ దేవదాసు వాపోతూ  విలపిస్తే.. ' బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్, ఆ ఎరుకే నిశ్చలనాందమోయ్, బ్రహ్మానందమోయ్' అంటూ వేదాంతం ఒలికించాడు ఏ ఎన్నార్ దేవదాసు. 'జగమే మాయ.. బతుకే మాయ ' అంటూ వేదాలు ఎంత సారం పిండి బోధించినా.. 'తన దాకా వస్తే గాని తత్వం' తలకెక్కని పచ్చి నిజం జీవితం. 'మేక్ ఏ విష్' ఫౌండేషన్ స్థాపనలోని ఉద్దేశం గ్రహించగలిగేవారికి జీవితంలోని నికర సారం తెలిసి వస్తుంది. కేన్సరు వంటి ప్రాణాంతక వ్యాధులు వంటిని ఆవరించి భావిని  శూన్యంగా మార్చబోతున్నాయని ఆ చిన్నారులకు  తెలియదు.. తోటి పిల్లలకు మల్లేనే తోటలో అప్పుడే అరవిరిసే పూల మాదిరి అల్లరి చేయడం మినహా!  'పాపం, పుణ్యం, ప్రపంచమార్గం, కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ.. ఏమీ ఎరుగని ' పసిమొగ్గలు వారు. 
కూచిమంచి రవి అనే కవి ఒక మంచిచెడ్డ జీవిత సత్యాన్ని కవిత రూపంలో  వినిపించారు ఒకసందర్భంలో.
శైశవ గీతం దాని పేరు. చనిపోయిన పసికందు- బతికున్న మూన్నాళ్ళూ అమ్మ నాన్నలతో.. బంధుమిత్రులతో గల సంబంధ బాంధవ్యాలు నిష్క్రమణ వేళ ఎటువంటి భావనాత్మకమైన రూపాంతరాలకింద మార్పు చెందుతాయో కవితాత్మకంగా చెప్పే 'శిశు జ్ఞానం' అది.
'ఆపైన ఏం జరిగిందో/నాకంతగా గుర్తు లేదు కానీ/నిద్దురలోకి జారుకునేముందు/నేననుకునే ఉంటాను/మా అమ్మ చెక్కిట కన్నీటిని తుడిచి ముద్దిడిన వ్యక్తి/మా నాన్నే అయి ఉంటాడని/ఆ రాత్రే/మా ఇంటి ఇరుగు పొరుగు వచ్చి/నేను నిద్దురలోనే కనుమూస్తానని చెప్పినప్పుడు/నాకు గుర్తు లేదు గానీ/నేను మా అమ్మను ఊరడించడానికి ప్రయత్నించే ఉంటాను/“నాకేం ఫరవాలేదమ్మా/నువ్వేం ఏడవద్దమ్మా” అని ప్రయత్నించే ఉంటానూ అంటూ సాగే  మృతశిశువు అమృత స్మృతి గీతిక అది.
చావు పుట్టుకలకు పసిమితనం.. ముదిమితనం.. అని తేడా ఏమి ఉంటుంది? కన్ను తెరవడం జీవి స్పృహలో లేకపోవచ్చు. కన్ను మూసే వేళా అపస్మారకం లోతుల్లోకి జారిపోవచ్చు. కానీ ఊహ ముదిరిన పిదప మిట్ట మధ్యాహ్నం పూటే అసుర సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయని తెలిస్తే అలమటించని ప్రాణి అరుదుగానైనా ఉంటుందా లోకంలో? అలిసెట్టి ప్రభాకర్ ఒక  పొట్టి కవితలో - ఎంతో గట్టిదిగా మనం భావించే  ఈ దేహం ప్రాణదీపం నిలిచే ఒక మట్టిప్రమిదకన్నా ఓటిది సుమా! దీపశిఖ వెండికొండలా  వెలుగడానికి .. కొండెక్కి మలగడామికి  మధ్య  ఉండే  అంతరం.. కంటిరెప్పపరంగా చెప్పాలంటే.. కేవలం తెరవడం.. మూయడమంత' సునాయాసం అని  చెపుకొచ్చాడు.
'బతుకి ఉండేందుకు .. బతకు ఏటి ఆవలవైపుకు వెళ్ళి పడేటందుకు మధ్య పట్టేది  కేవలం కంటిరెప్ప పాటు కాలం' అన్న ఆ కవి మాటా కొట్టిపార వేయలేం.
కానీ అదంతా దంతవేదాంతం. ఒక ప్రాణి కంటిముందు జీవయాత్ర విరమించుకుని.. మహాప్రస్థానానికని బైలుదేరే వేళ  'ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నమూ' అనే భావోద్వేగం ముప్పిరిగొనవచ్చు. శ్మశానంలో కపాలభాతి  జరిగే వేళ  జనించే వైరాగ్యం  నెత్తిమీద పోసుకొన్న చన్నీటితో పాటే ఆవిరవకపోతే.. క్షణభంగురం అని  మునిపుంగవులు క్షణం క్షణం సెలవిచ్చే  ఈ బతుకుని చివరివరకు  హంగు పొంగులతో.. అంగరంగ వైభోగంగా   గడిపేందుకు మనిషి అన్నేసి ఆటు పోట్లు ఎందుకు పడుతున్నట్లు?
మహాభారతంలో యక్షుడు ధర్మరాజుని అడిగే వంద సందేహాలలో  అత్యంత గహ్యమైనది మృత్యు సంబంధమైనదే! ' మానవ మనస్తత్వంలో అత్యంత వింత గొలిపే లక్షణం ఏది?' అన్న ప్రశ్నకు ధర్మరాజు ఇచ్చే జవాబు సబబైనదే. యుధిష్ఠిరుడు  అభిప్రాయ పడ్డట్లు 'రేపు  మరణించే మనిషి ఈ రోజు  మరణించిన ఆప్తులను  చూసి శొకతప్తుడు అవడం' విశదంగా పరిశీలిస్తే  విచిత్రమైన విషయమే !
కానీ..  ఎవరి ప్రాణం  వారికి తీపి.  జీవితంమీదున్న  మమకారం  మామూలుదా? ఉప్పూ కారాలు తిన్నా తినకున్నా.. సప్లిమెంటరీ విటమిన్లతో  కాలం నెట్టుకొస్తున్నా .. చప్పగా సాగే  బతుకుబండిని  కాలుడి నోటికి చటుక్కుమని అందించేందుకు సిద్ధపడేది ఎవరు?సిద్దులని చెప్పుకొనేవారు సైతం ఏ రాద్ధాంతాలూ చేయకుండా చెయ్యలేని కార్యం ప్రాణత్యాగం.
పెనురోగాల ఉనికి వంట్లో  ఉందని పెందళాడే  పసిగట్టినప్పుడు ఆ చేదునిజం  రోగి చెవిలో వేయడం మంచిదా. .కాదా? అన్నచర్చ సీమదేశాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భం ప్రస్తుతానిది.  కాబట్టి  చావు బతుకుల ప్రస్తావనలు ఇప్పుడు ఇంత విస్తారంగా   చర్చించుకోవలసి  వస్తున్నది.
రోగి శరీరంలో జబ్బు ముదురుతోందని వైద్యులు ముందే  గుర్తించడం.. రోగికి ఆ సమాచారం అందిచడం-- రెండు వైపులా పదునున్న కత్తి వంటిదని  కొందరు మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
రుగ్మత  ముందే పసిగట్టి తెలియచేయడం  వైద్యపరంగా రోగికి అన్ని వేళలా మేలు చేసే చర్య కాకపోవచ్చన్నది ఆ మానసిక శాస్త్రవేత్తల ఆలోచన. ఈ తరహా మృత్యుజ్ఞానం చావు పుట్టుకుల మధ్య  సంఘర్షణను మరింతగా ప్రేరేపిస్తుందని.. ఆ ఘర్షణ అన్ని వేళలా మనం భావించిన రీతిలోనే రోగికి మేలు కలిగించాలని లేదన్నదీ  వైద్యుల అభిప్రాయంగా కూడా ఉన్నది. తన శరీర  క్షేత్రంలో  ప్రాణాంతకమైన రుగ్మతా బీజాలు వెదజల్లబడి ఉన్నాయని ముందే తెలుసుకొన్న రోగి మిగతా జీవితమంతా తతిమ్మా  ఆరోగ్యవంతులంత  సంతోషంగా గడుపుతాడన్న భరోసా లేదు. సరికదా  కొత్తగా బైటపడిన అనారోగ్య సమచారం రోగి మానసిక స్థైర్యంమీద  తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలే ఎక్కువని  మానస్థత్వ శాస్త్ర వేత్తలూ అభిప్రాయపడుతున్నారు. నార్వే విశ్వవిద్యాలయం - ట్రాన్ ధియమ్  విజ్ఞాన సాంకేంతిక  విభాగాల ప్రజా ఆరోగ్య   రంగంలో  పరిశోధనలు సాగించే జోర్గెన్సన్ వాదన ప్రకారం- ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన  రుగ్మత శరీరంలో బీజదశలో ఉందని తేలినప్పటికీ.. ఆ దురదృష్ట సమాచారం రోగిదాకా రాకుండా జాగ్రత్తపడడమే రోగి జీవితకాలం  మరింత కుచించుకుపోకుండా  ఉండేందుకు తీసుకొనే మంచి చర్యగా నిర్ధారిస్తున్నారు.

-కర్లపాలెం హనుమంతరావు 

Wednesday, June 1, 2016

అంత్యక్రియ- కౌముదిలోనా కథ



'నిన్నేమో మేమంతా చాలా కాలుక్యులేటేడ్ ఫెలోవని తెగ పొగుడుతుంటాం. నువ్వేమో ఈ చచ్చు పుచ్చు భూమిని ఇంత తగలేసి కొన్నావ్! అదీ ఆదరాబాదరాగా! అవతల అక్కడ హైదరాబాదులో బాబాయిని ఆసుపత్రికి వదిలేసి ఇప్పుడీ గత్తర పనులన్నీ ఎందుకో అర్థం కావడం లేదురా!' అని తగులుకొన్నాడు కుమారస్వామి అమ్మనబ్రోలు ల్యాండు రిజిస్ట్రేషనాఫీసునుంచి బైటికొచ్చీ రాగానే!
సమాధానంగా నవ్వి ఊరుకొన్నాడేగానీ.. పెదవి విప్పి ఒక్కముక్కన్నా బైటికి అనలేదు కమలాకరం. కొన్నభూమి దస్తావేజులను సేకరించుకొనే విషయం గురించి మాట్లాడుతున్నాడు అమ్మిన సుబ్బారాయుడితో ఒక పక్కకు తీసుకెళ్లి.
అమ్మనబ్రోలు భూములంటే ఎర్రమన్ను నేల. పొగాకు పండించీ పండించీ గుల్లబారిన భూమి. మరే పంటా పండేందుకు ప్రస్తుతానికైతే బొత్తిగా ఆస్కారం లేదు. గవర్నమెంటు పొగాకును అంతగా ప్రోత్సహించడం లేదుకూడా. వరస కరువు కాటకాలతో గిడసబారిని నేలను నమ్ముకోలేక అయినకాడికి అమ్మేసుకొని రైతులు తరలిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కమలాకరం వాస్తయినా సరిగ్గాలేని ఎత్తుమీది ఈ భూములను.. అందులోనూ నీటివసతి బొత్తిగా లేని సుబ్బారాయుడి మూడెకరాల కొండ్ర ఎకరా మూడులక్షలు రేటుకి కొనడమెందుకో ఎవరికీ అర్థం కాలేదు. రైతులు సుబ్బారాయుడికి పట్టిన అదృష్టానికి తెగ కుళ్ళుకొన్నారుకూడాను!

కమలాకరానికి అమ్మనబ్రోలుకి ఆట్టే సంబంధంలుకూడా ఏమీ లేవు. అతగాడు అక్కడ పుట్టిందీ లేదు. చదివిందీ లేదు. ఎప్పుడో ఒకసారి వేసవిసెలవులకని ఆ ఊరొచ్చి ఒక మూడు వారాలు ఉండిపోయాడు. అదీ ముళ్లమీదున్నట్లు.
కమలాకరం తండ్రి కాంతారావు బ్యాంకులో
పనిచేసిన రోజుల్లో  ఆ ఊర్లో ఒక మూడేళ్లపాటు కావురం ఉన్నాడు. అప్పుడైనా కుటుంబం హైదరాబాదులోనే!
ఆ మాత్ర్రం సంబంధానికే ఇంత రేటు పెట్టి ఇక్కడి భూములు కొనడానికి రావాలా కమలాకరం! అందునా మిత్రుడు కుమారస్వామి మొత్తుకొన్నట్లు ఆయన తండ్రి హైదరాబాదు అపోలోలో దాదాపు ఆఖరి గడియల్లో ఉన్నాడు! న్యూజిలాండునుంచి చెల్లెలు సుభద్ర రావడానికి కనీసం రెండు రోజులు తక్కువ పట్టదు. తండ్రిని వెంటిలేటరుమీద ఉంచి.. మిగతా పనులు భార్యకు పురమాయించి మరీ ఈ వ్యవహారంకోసం ఇంతదూరం ఇప్పుడు పరుగెత్తుకు రావడానికి పెద్ద కారణమేమైనా ఉందా?
కుమారస్వామిని కుమ్మరి పురుగులా తొలిచేస్తున్న ఈ సందేహానికి సమాధానం మర్నాటికిగానీ బైటపడలేదు,
అదీ అతగాడి భార్య సుగుణ కాల్ చేసి కంగారు పెట్టబట్టి! 'సుభద్రకూడా వచ్చేసిందండీ! అందరూ మిమ్మల్ని గురించే అడుగుతున్నారు రెండు రోజులబట్టీ! మీ నాన్నగారైతే ఒహటే కలవరింతలు.. అత్తయ్యగారికి సర్ది చెప్పలేక పోతున్నాను'
'వచ్చేస్తున్నా! వచ్చిన పని పూర్తయింది. రేప్పొద్దునకల్లా అక్కడుంటా.. సరా! అందాకా ఎలాగో మేనేజ్ చేయ్.. ప్లీజ్!' అని ఫోన్ పెట్టేసి కుమారస్వామితో సహా కొన్నపొలానికి బైలుదేరాడు కమలాకరం.
పొలంచుట్టూ దిట్టంగా కంచె ఉంది. పెద్దగేటుకి వేసిన తాళం తీసి.. నేరుగా ఓ మూల ఉన్న పెంకుటింటిలోకి స్వామిని తీసుకెళ్లాడు కమలాకరంలోపలి గోడలనిండా  సీతా..సీతా..’అని రామకోటిలా ఇంగ్లీషులో రాతలు.. అడుగడుగునా! జీడిపిక్కలతో రాసిన ఆ రాతల్లో సీత పేరుతో కలిసి కాంతారావుఅనిగాని లేక పోయుంటే కమలాకరానికి ఇప్పుడింత దూరం వచ్చి ఈ చచ్చుపుచ్చుభూముల్ని ఇంత ధరపెట్టి అర్జంటుగా కొనాల్సిన అవసరం తప్పుండేది!
'నువ్వేం చేస్తావో తెలీదురా! రేపు సాయంత్రానికల్లా ఈ  గుడిసె మొత్తాన్నీ   కూలదోసెయ్యాలి. మా నాన్నకు ఇక్కడే అంత్య క్రియలు! అదే మూడు రోజుల్నుంచి ఆయన కలవరింతలు! అమ్మకు చెల్లాయికి తెలిస్తే అల్లాడిపోతారు! పరువుకోసం పాకులాట్టం మాకు నేర్పిందీ ఈ  మహానుభావుడే కదా!' అన్నాడు కమలాకరం.
సీత ఎవర్రా?’ అని అడుగుదామనుకొని కమలాకరం కంట్లో నీళ్ళుచూసి ఆగిపోయాడు కుమారస్వామి 'డోంట్ వర్రీరా! నీ లాంటి కొడుకు ఉండటం మీ నాన్న చేసుకొన్న అదృష్టం' అని మిత్రుడి భుజం తట్టాడు అనునయంగా!

***
-కర్లపాలెం హనుమంతరావు 
(కౌముది అంఅర్జాల పత్రిక జూన్ 2016 సంచికలో మరీ చి.క గా ప్రచురితం)

Monday, May 9, 2016

కవిత్వం- విమర్శకత్వం


రచనకు ఒక పార్శ్వం రచయిత ఐతే రెండో పార్శ్వం రసాస్వాదన చేసే భావుకుడు.
అపారే కావ్య సంసారే కవిరేకః ప్రజాపతిః।
యథాస్మై రోచతే విశ్వం తథైవ పరివర్తతే- అని శ్లోకం॥
కవి తన ఇఛ్చానుసారం చిత్రించడమే కాదు.. ప్రజాపతి సృష్టించిన జగత్తు
పోకడలను కూడా మార్చగలడు-అని అర్థం.
కవిలోని ఆ సృజనశక్తి సహజమైనది. కొంత మందికి అది గురుకృప  ద్వారా సంక్రమిస్తుంది. కొంతమంది నిరంతర శాస్త్రాధ్యయనంతో మెరుగులు దిద్దుకుంటారు. ఎవరు  విధంగా సాధించినా పండితరాయలు సిద్ధాంతం  ప్రకారం కవికి ‘అనాయాసంగా, అప్రయత్నంగా శబ్దార్థాలు  స్ఫురించే ప్రతిభ పట్టుబడటం’ ప్రధాన
లక్షణం.
రాజశేఖరుడు అనే మరో  ఆలంకారికుడు ఈ ప్రతిభను  రెండు రకాలుగా విభజించాడు.
కారయిత్రిః కావ్యాన్ని సృజించే ప్రతిభ
భావయిత్రిః కావ్యసౌందర్యాన్ని ఆస్వాదించగలిగే సామర్థ్యం

కారయిత్రి అధికంగా ఉంటే కవి.. భావయిత్రి అధికమైతే సద్విమర్శకుడు.
రచన పూర్తయిన తరువాత  రచయితా విమర్శకుడి అవతారం ఎత్తవచ్చు. కాని అది తన రచనకే పరిమితం. సాధారణంగా ఏ కవీ తనకు పనిపడితే తప్ప పరాయివారి రచనల జోలికి పోయే పని పెట్టుకోడు.
రచనలను చదివి తార్కికంగా ఆలోచించి సహృదయంతో విమర్శ చేయగల సత్తా ఉన్నవాడినే అసలైన విమర్శకుల లెక్కలోకి తీసుకోవాలి.
సరే.. కవి గొప్పా? విమర్సకుడు గొప్పా? ని మీమాంస.
కవి సృజన చేస్తేనే కదా.. విమర్శకు భూమిక సిద్ధమయేది! కనుక కవే గొప్ప అని ఒక వాదం. కానీ చాలా సందర్భాల్లో కవికూడా ఉహించని చమత్కారాలను విమర్సకుడు తన విస్తృత పరిశీలనాపాటవం శక్తితో వెలికి తీస్తుంటాడు!.
ఇయం సంధ్యా, దూరాదహముపగతోహన్త! మలయా
దిహైకాన్తే గేహే తరుణి! తవనేష్యామి రజనీమ్,
సమీరేణోక్తైవం నవకుసుమితా చూతలతికా
ధునానా మూర్థానంనహి నహి నహీత్యేవ వదతి”-అని ఒక కవిగారి శ్లోకం.
ఎక్కడో మలయపర్వతంనుంచీ వస్తున్నాను. కనుచీకటి పడుతున్నది. తరుణీ! నీ గృహంలో ఈరాత్రి ఏకాంతంగా గడుపుతాను” అని సమీరం అడిగితే కొత్తగావికసించిన చూతలత  ‘వద్దు వద్దు వద్దు’(బిడియంతో కాబోలు)  అని ముమ్మారు తల డ్డంగా ఊపిందిట!
శ్లోకం రసవత్తరంగానే సాగింది. కానీ చివర్లో ఆ చూతలత మూడుసార్లు అలా వద్దు వద్దు వద్దు అని సాగదీయడం  దేనికీ?’ అని తర్కానికి   విమర్శక శిఖామణి అయినా తర్కానికి దిగితే.. ముక్కు మొహం తెలీని పరాయి పురుషుడు రాత్రంతా ఇంట్లో ఒంటరిగా గడుపుతాను అంటే.. ముగ్ధ యిన పుష్పానికి  మరి కంగారు పుట్టదా! ఆ తొట్రుపాటులో ‘వద్దు.. వద్దు’ అన్నది. తప్పేమున్నది? అని కవిగారి ఓట్రించినా  అది కవిగారి వట్టి బుకాయింపు మాత్రమే అని ఇట్టే తెలిసి పోతుంది.
బాగుందండీ.. మరి మూడోసారి కూడా వద్దుని అనడం ఎందుకో?” అని విమర్శకుడిగారు ఎదురు  సందేహం లేవదీస్తే కవిగారి దగ్గర సబబయిన సమాధానం ఉండాలి గదా!ఛందస్సుకోసం ఏదో అలా అనవలసి వచ్చింది  లేవయ్యా!” అని లోలోన గొణుక్కున్నా.. బైటికి అనలేడు గదా! ఛందస్సుల్లో ఇమడేందుకుటువంటి వ్యర్థప్రయోగాలకు పాల్పడం సాంప్రదాయిక సాహిత్యంలో సాధారణమే. కావచ్చు  కానీ అటువంటి వ్యర్థప్రయోగాలవల్ల రచన ఔన్నత్యం పల్చబడతుంది. కాలంనాటి కవులందరికీ ఈ విషయమై  మనసులో మథన న్నా  బైటికి ఒప్పుకోవడం  మేథోగౌరవానికి భంగకరమని భావించేవారు.
టువంటి సందర్భంలోనే విమర్శకుడి విశిష్టత బైటపడేది. ఇక్కడి శ్లోకం సంగతే చూసుకోండి! కవిగారిని ఇబ్బందినుంచీ విమర్శకుడు ఎంత తెలివిగా తప్పించాడో గమనించండి! ‘శ్లోకంలో కవిగారు సూచించింది వట్టి కుసుమితను కాదు.. నవ కుసుమితను. అంటే అప్పుడే పుష్పించిన కుసుమాన్ని. ఆ పూలబాలకు  పరపురుషుడితో మూడు రాత్రుల ఏకాంత వాసమంటే.. బెదురు  పుట్టదా! అందుకే అసంకల్పితంగా నవకుసుమిత నోటినుంచీ ‘  వద్దు.. వద్దు.. వద్దు’అన్న మాటలు అలా  మూడుసార్లు తన్నుకు వచ్చేసుంటాయి అంటూ విమర్శకుడు   సందర్భ సమన్వయం చేసాడనుకోండి.. కవిగారికి ఎలా ఉంటుంది? ఆనందం ఆపుకోలేక అమాంతం విమర్శకుడిని గాఢాలింగనం  చేసేసుకుని ఉంటాడేమో కూడా! అదీ సాహిత్య పరిశీలనలో విమర్శకుడి దృష్టి సామర్థ్యం. అలాగని కవిపాత్రను ఎంతమాత్రం తక్కువచేయడంగా భావించరాదు.  ఎవరి మేథోక్షేత్రంలో ప్రత్యేకత వారిదే!
గురూపదేశాదధ్యేతుం శాస్త్రం జడధియో౭ఫ్యలమ్
కావ్యంతు జాయతే జాతు కస్య చిత్ప్రతిభావతః’- మందబుద్ధులు సైతం  గురుశుశ్రూష చలవతో కొంత శాస్త్రపాండిత్యం సాధించవచ్చు. కావ్యసృజన  కదాచిత్  కాలం కనికరించినప్పుడు మాత్రమే చేయగలియేది. అదీ వందలాది ప్రతిభావంతులలో ఏ ఒక్కరి వల్లో సాధ్యమయేది- అని  భామహుడి మతం.
కావ్యం ప్రాథమికంగా మేలిమి బంగారమైనప్పుడే .. ఏ విమర్శకుడైనా సానపెట్టగలిగేది! చేమకూర వెంకటకవి ‘విజయవిలాసమే’ దీనికి చక్కని ఉదాహరణ.
సాధారణంగా కావ్యం మొత్తంలో పది పన్నెండు చమత్కారాలు ద్యోతకమైతేనే మనం ‘ఓహో..ఆహో’ అని కవి ప్రతిభను ఆకాశానికి ఎత్తేస్తుంటాం. రాసిన ప్రతి పద్యంలోనూ ఏదో ఒక విశేషాన్ని  చొప్పించిన చేమకూర వేంకటకవి ప్రతిభను మరింకేమని పొగడగలం! తాపీ ధర్మారావుగారు ‘హృదయోల్లాసం’ పేరుతో సవివరమైన వ్యాఖ్యానం వెలువరించిందాకా.. విజయ విలాసం కావ్యంలోని అందాలు  కొన్ని వందల ఏళ్ళవరకు   బయటపడనేలేదు. అందుకే అనేది.. కారయిత్రి ప్రతిభ ఒక్కటే చాలదు.. భావయిత్రి సామర్థ్య సహకారమూ కావాలి కావ్యగౌరరవం పండితలోకంలో పడి పండాలంటే!
కన్నె నగుమోము తోడం
బున్నమ చందురుని సాటిఁ బోలుప వచ్చున్
నెన్నెదురు తోడ మార్కొని
మున్నందఱు జూడ రేకమోవక యున్నన్- (1-197) అనే పద్యమే చూడండి!
గతంలో(చిత్రాంగద నుదురుతో పోటీపడిన సందర్భంలో) అపజయం పాలై ఉండకపోతే పున్నమి చంద్రుణ్ణి ఈ కన్నె నవ్వుమొహంతో పోలిక పెట్టవచ్చు- అని కవి భావన. పున్నమి చంద్రుడిని మించిన అందమైన నవ్వుమొహం ఆ అమ్మాయిదిఅని కవి ధ్వని. నాలుగో పాదంలోని ఆ ‘రేక మోవక’ అనే పదప్రయోగంతో ఎలా సమన్వయించాలో కొమ్ములు తిరిగిన పండితులకూ, పరిష్కర్తలకూ, వ్యాఖ్యాతలకుకూడా అంతు పట్టలేదు. జూలూరు అప్పయ్య గారు ‘చిన్నదాని నొసటితో పడ్డ పోటీలో ఓడిపోయి చంద్రుడు లేఖలు మోసే పని చేయవలసి వచ్చింది’ అని ఏదో పొసగని అర్థం చెప్పే ప్రయత్నం చేసారు. శబ్దరత్నాకరం ‘రేక అనే పదానికి ‘జాబు’ అని ఒక్కర్థం మాత్రమే చెప్పి ఊరుకోవడంతో  వచ్చిన చిక్కు ఇదంతా. దాదాపు 300ఏళ్ళ పాటు  చాలామంది ఇలాంటివే ఏవో అతకని పోలికలతో అన్వయించేందుకు నానా   హైరానా పడ్డారు. నోరివారి దగ్గర్నుంచీ వేదుల, బులుసువారిదాకా ఎంరో తమకు తోచిన ఏదో ఒక అర్థంతో సమన్వయం చేయబోయారు! కానీ.. కవిగారి అంతరంగంలోని అసలు భావం ఏమిటో  తాపీవారు తేల్చిన దాకా ఎవరికీ అంతుచిక్కనేలేదు.
‘రేక’ అంటే గాయంవల్ల శరీరంమీద మిగిలిపోయిన గీత’ అని చేమకూర వెంకటకవిగారి  భావం అని విజయ విలాసంలోని మరో పద్యం ఉదాహరణగా చూపించి మరీ ఒప్పించారు తాపీవారు. మూడో అధ్యాయంలో అర్జునుడు సుభద్రను ఎత్తుకుపోయే సందర్భంలో బలరాముని సేనలతో తలబడవలసి స్తుంది. సుభద్ర యుద్ధంలో  భర్తకు సాయం చేస్తుంది. కృతజ్ఞ్తతతో భార్యను ఆలింగనం చేసుకునే సమయంలో ఆమె నుదుటనున్న కుంకుమరేఖలు చెమటకు తడిసి అర్జునుడి వక్షస్థలంమీద కత్తిగాట్లులాగా పడతాయి. అర్జునుడు చమత్కారంగా
ఒక్కంచుక రేకమోవని నా యురఃస్థలంబున/ నీ కుచకుంకుమ రేఖ లంటించి మీ వారికి సూడు తీర్చితివంటూ  పరిహాసం చేస్తాడు. ఇక్కడ  రేకమోవని’ అనే పదానికి కత్తిగాయం అని మినహా వేరే అర్థం కుదరదు కదా!
శత్రువు ఒంటిమీద ఒక్క దెబ్బైనా వేయకుండా ఓడిపోవడం యోధులకు అవమానం. తన అన్నగారిమీద ఆ అపనింద పడకుండా తన కుంకుమరేఖలతో అర్జునుడి వక్షస్థలంమీద కత్తిగాయంలా చేసి పుట్టింటివారి గౌరవాన్ని సుభద్ర కాపాడిందని కవిగారి చమత్కారం’. తాపీవారి అన్వయం ఇదే. ఇదే అర్థాన్ని మునుపటి  పద్యానిక్కూడా అన్వయించుకుంటే చేమకూరకవిగారి చమత్కారం చక్కలిగింతలు  పుట్టించదూ! ‘చిత్రాంగదతో జరిగిన స్పర్థలో ఓడి వంటికి మచ్చతెచ్చుకోకుండా ఉండి ఉంటే పున్నమిచంద్రుడుకూడా ఈ కన్నెనగుమోముతో పోల్చుకొనేందుకు అక్కరకొచ్చేవాడు కదా!’ అని కవిగారి భావం. తాపీవారి పుణ్యమా అని చేమకూర వెంకటకవిగారి  పద్యంలోని శ్లేష ఉపమాలంకారంతో సహా వెలుగులోకి వచ్చి  ఎలా  మెరుపులీనిందో గమనించారు గదా! విమర్శకుని విశిష్టత ఇలాంటి సందర్భాలలోనే కొట్టొచ్చినట్లు బైటికొచ్చేది.
దేవదాసు సినిమాలో ’కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్’ అని ఒక పాట ఉంది. రాసినవారు మల్లాదివారే అయినా పలుకారణాలవల్ల రికార్డులమీద  సీనియర్ సముద్రాలవారి పేరు కనిపిస్తుంది. చాలా ప్రసిద్ధం అయింది ఆ రోజుల్లో ఆ పాట. చిత్రవిజయోత్సవం జరిగే  ఒక సందర్భంలో వేదికమీదన ఉన్న గీతకర్తని ఎవరో గట్టిగా నిలదీశారుట ’కుడి  ఎడమ వడమేంటండీ అసలు…అర్థమేమన్నా ఉందా ఆ చరణంలో?’ ఆవటా అంటూ. ‘నిజమే కదా’ అనిపిస్తుంది  మనకు కూడా. రాసిన రచయితకి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యతా ఉంటుంది కదా! కవిగారు  లేచి నిలబడి సముద్రమంత గంభీర స్వరంతో   ఇచ్చిన వివరణకు శ్రోతలు ఆగకుండా కరతాళధ్వనులు చేశారని ఆరుద్ర ఏదో ఒక సందర్భంలో
రాశారు. ‘కుడి ఎడమ వడమంటే right.. left గా తిరగబడటం అని కాదు అర్థం. కుడిభుజంలాంటి వ్యక్తి దూరంగా జరిగిపోవడం(ఎడంగా వెళ్ళిపోవడం)అనిట! ఇలాంటి వివరణలు ఇవ్వాలంటే కవిలో కారయిత్రి.. భావయిత్రి పాళ్ళు రెండూ సమపాళ్లలో కలసి ఉండాలి.
ఊహ, భావన, బుద్ధి కవికి సహజంగా సిద్దించే వరాలు. కవి తోచింది రాసేసి.. పదిమందిలోకి వదిలేసిన  తరువాత.. శల్యపరీక్షకు సిద్ధపడక తప్పదు. కొలిమిలో మండితేనే కదా బంగారానికైనా మెరుగు. విమర్శక సహిష్ణుత అలవాటు చేసుకుంటేనే ఏ కవికైనా రాణింపు. 
బహుగ్రంథపఠనం వల్ల నేపథ్య విజ్ఞానం, పాఠకులతో నిరంతర సంపర్కం చేత సామాజిక ధోరణులు, సహవిమర్శకులతో నిత్యసంపర్కం వల్ల తప్పొప్పులు పసిగట్టగలిగే సామర్థ్యం  వమర్శకుడి శక్తులు.  అన్నింటికీ మించి విశ్లేషణాత్మకమైన పరిశీలనా లక్షణం విమర్శకుడి   ముఖ్య లక్షణం. మెరుగు  పసిగడితే మెచ్చుకునే సుగుణం అవసరం . విమర్శకుడి నోటినుంచి వచ్చే ఒక్క ప్రశంసావాక్యం చాలు  సృజించిన కర్తను ఏనుగెక్కించి ఊరేగించేందుకు. తపు కనిపిస్తే సున్నితంగా విప్పి చెప్పి  కవి ముందు ముందు మరింత మెరుగైన సాహిత్యం సృజించేందుకు   తనవంతు సాయం చేయవలసిన బాధ్యతా  విమర్శకుడిమీద ఉంటుంది.
అసూయాలు, అలకలు, అభాండాలు.. అలౌకికులము అనుకునే తత్వం కవులకు, విమర్శకులు ఇద్దరికీ శోభనివ్వవు.
విమర్శకుల పాత్ర ఎంత విశిష్టమైనదో కవులు, కవుల సృషితత్వం ఎంత కష్టతరమైనదో విమర్శకులు..వగాహన చేసుకుంటారనే ఇంతగా చెప్పుకొచ్చింది.
***
-కర్లపాలెం హనుమంతరావు





Friday, May 6, 2016

అచ్చ తెలుగు ముచ్చట్లు


కాళిదాసు భోజరాజు కీర్తిని కొనియాడే ఓ సందర్భంలో
నీరక్షేరే గృహీత్వా నిఖిల.  ఖగతితీర్యాతి నాళీకజన్మా
తక్రం ధృత్వాతు సర్వా నటతి జలనిధీం శ్చక్రపాణి ర్ముకుందః  సర్వాంగనుత్తుంగశైలాన్ వహతి పశుపతిః ఫాలనేత్రేణ పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతే!  భోజరాజక్షితీంద్ర!”
అంటూ అతిశయోక్తులు పోతాడు!   ప్రభువుకీర్తి శ్వేతవర్ణంలో దశదిశలా వ్యాపించడంవల్ల పక్షులన్నీ హంసలవలె  భ్రాంతి గొలుపుతున్నాయిట!  బ్రహ్మదేవుడికి తన వాహనం ఏదో ఆనవాలు  పట్టేందుకు నీళ్లు కలిపిన పాలు పక్షులముందు పెట్టవలసి వచ్చిందని కాళిదాసు చమత్కారం! సర్వసముద్రాలూ పాలసముద్రం మాదిరి తెల్లబడటంవల్ల జగజ్జేతకు తన పడకగల పాలసముద్రం ఏదో తెలుసుకోడం వల్లగాక  మజ్జిగ  సాయం కోరవలసి వచ్చిందని మరో ముచ్చట! మజ్జిగచుక్క పడిన తరువాత  గడ్డకట్టిన సముద్రమే  తన పాలసముద్రమవుతుందని పరమాత్ముని  పరీక్ష!  పరమేశ్వరుడిదీ అదే పరిస్థితి.  తన కైలాసగిరి  విలాసమేదో తెలుసుకునేందుకు ఫాలనేత్రం తెరిచి మరీ మండించ వలసిన  పరిస్థితి! మండిన కొండే తన వెండికొండవుతుందని ఈశుని ఈ         విచిత్ర       పరీక్ష!  దీనబాంధవుల  స్థితిగతులనూ ఇంత దయనీయంగా మార్చివేసిందని భోజరాజు కీర్తికాంతులను  వర్ణించడం కొంత అతిగా అనిపించినా.. రాసింది కావ్యం.. రాసిన అక్షరసిరి  కాళిదాసు కనుక ఎంత  కల్పన అయితేనేమి.. అత్యంత రమ్యనీయంగా ఉందని ఒప్పుకోక తప్పదు కదా రసహృదయులందరికీ!

వేల్పుటేనికలయ్యె బోల్ప నేనుగు లెల్ల- గొండలన్నియు వెండి కొండలయ్యె
బలుకు చేడియ లైరి పొలతుక లందరు-జెట్టులన్నియు బెట్టు చెట్టు లయ్యె
బాల సంద్రములయ్యెనోలి నేర్లన్నియు-నలువ బాబాలయ్యె బులుగు లెల్ల
బుడమి దాలపులయ్యె బడగదార్లన్నియుమేటి సింగములయ్యె మెకము లెల్ల
బండు రేయెండ కన్నుల పండువగుచు
బిండి చల్లిన తెరగున మెండు మీరి
యొండు కడనైన నెడలేక యుండి యప్పు
డండ గొనగ జగంబెల్ల నిండుటయును”
అంటూ మన తెలుగు కవిసార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి సైతం   తెలుగులో  ఓ రామాయణం రచించే సందర్భంలో   అయోధ్యకాండ మధ్యలో ఈ హృద్యమైన  పద్యం చెప్పుకొచ్చాడు.. ‘శభాష్!’ అనిపించే మెచ్చుకోళ్ళెన్నో సాధించుకొచ్చాడు.
విస్తారంగా పరుచుకొన్న  పండువెన్నెల్లో నల్లటి ఏనుగులుకూడా దెవేంద్రుని ఐరావతంలాగా భ్రమింపచేస్తున్నాయనడం.. కాలవర్ణం కుప్ప పోసినట్లుండే  కొండలకూడా మహాశివుని రజితాలయాల మాదిరి ధగధగలతో వెలిగి  పోతున్నాయనడం.. శ్యామలవర్ణంతో నిగనిగలాడే స్త్రీల సొగసులన్నీ శారదమ్మ వంటితీరుతో పోటీకి దిగుతున్నాయనడం.. హరితవృక్షాలన్నీ కల్పవృక్షాలకు మల్లే తెలుపురంగుకి తిరిగి  ప్రకాశిస్తున్నాయని కల్పనలు చేయడం.. నదులు సర్వస్వం క్షీరసాగరాలకు మల్లే మల్లెపూల మాలల మాదిరి మతులు పోగొడుతున్నాయని అనడం.. వివిధ జాతుల  పక్షులన్నీ వర్ణాలతో నిమిత్తం లేకుండా శ్వేతహంసల మాదిరి  బారులు తీరి శోభాయమానంగా అలరారుతున్నాయని అనడం..  ఆహాఁ.. తిమ్మకవి కల్పనంతా  ఎంత కమ్మంగా ఉందో కదా!
పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది’ అని  ఒక్క వాక్యంలో అని ఊరుకుంటే అది కావ్యం ఎలాగవుతుంది? తిమ్మనకు కవిసార్వభౌమడన్న గుర్తింపు ఎలా వస్తుంది?  కనకనే ఈ కల్పనలన్నీ! నిజమే కావచ్చు కానీ.. అసలు విశేషం అందులో ఇసుమంతే ఉంది. నిశితంగా గమనించి చూడండి ఈ పద్యమంతా అచ్చమైన తెలుగులో కవి రసవంతంగా  రాయడంలోనే నిఖార్సైన విశేషం దాగి ఉంది!

రుచిగట్టగలిగే ప్రతిభ మన మనసుకు ఉండాలేగానీ.. తెలుగు పలుకుకి మాత్రం కలకండ పలుకుకు మించిన తీపిదనం లేదా! తెలుగు భాష సాధికారతను గురించి.. ప్రాచీనతను గురించి గత కొద్దికాలంగా చర్చోపచర్చలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.  చర్చలు ప్రాచీనతను గురించి.. అధికారిక హోదాను గురించి కాక.. వ్యావహారికతను గురించి.. అధునికతను గురించి సాగితే మరింత ప్రయోజనం సాధించినట్లవుతుందేమో! 
అవసరం లేకున్నా ఆంగ్లపదం లేకుండా  తేటతెలుగులో మాటలాడుకోవడం మొరటుతనమయి మనకు ఎన్ని దశాబ్దాలాయ! ఆధునిక మాద్యమాల పుణ్యమా అని  తెలుగు పదాలు పరాయిభాషకు మల్లే.. పరాయిభాష పలుకులు తెలుగుభాషకు మల్లె  దాదాపుగా స్థిరపడిపోయిన            దుస్థితి  ప్రస్తుతానిది. భాషాదినోత్సవాలు భేషజంగా జరుపుకుని ‘శభాషం’టూ జబ్బలు చరుచుకుంటే సరిపోతుందా?   పాలక మహాశయులే  చట్టసభల సాక్షిగా ప్రజల భాషమీద చూపించే చిన్నచూపు ప్రతి మాతృభాషాభిమానికి చివ్వుమనిపించడం లేదూ! 'మన తెలుగు' అన్న  పట్టింపు మనకే ఏ కోశానా లేనప్పుడు.. తెలుగులో చదువుకున్న వారికి కనీసం ప్రభుత్వాల  తరఫునుంచైనా ఒనగూడే అదనపు ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు  రవ్వంత కరవవుతున్నప్పుడు.. అమ్మభాషమీద ఎంత  అబిమానం పొంగిపొర్లుతుంటేనేమి..  ఆసాంతం  తెలుగులోనే విద్యాబోధన కొనసాగించడం  దుస్సాహసం అనిపించుకోదా!
తెలుగువాడికి మొదటినుంచి పరభాషా వ్యామోహం అధికమన్న అపప్రథ ఒకటి ఎలాగూ ఒకటి ఉండనే ఉంది!   ఆ లోపాల లోతులు తడముకొనే సందర్భం ఇది కాదు వదిలేద్దాం..  కానీ.. కనీసం తెలుగుభాష సాంకేతిక             సామర్థ్యంమీద .. వ్యావహారిక పదజాల            సమృద్ధిమీద .. అవగాహనా రాహిత్యం తొలగించుకోవాలా..  వద్దా!  ఇతరేతర అవసరాల ప్రలోభాలవల్ల ఒకవర్గం ప్రబలంగా సాగిస్తున్న తెలుగువ్యతిరేకతను అడ్డుకోవాలా.. వద్దా? కనీసం ఆ దిశగానైనా ప్రతి తెలుగు అభిమానిని  సమాయత్తం చేయవలసిన గత్తర ప్రస్తుతం గతకాలాలకన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంది.  ఉద్యోగ.. ఉపాధులాది నిత్యజీవితావసరాలకి  అవసరమయ్యే భాషమీద ఆధారపడటం ఎలగూ తప్పదు.. సరే! అలా ఆధారపడే ఉన్నతస్థాయికి సొంతభాషను చేదుకోవడం ఎలగూ లేదు! ఉన్నస్థాయినుంచికూడా మరింత పాతాళానికి తల్లిభాష జారుతుంటే తల్లడిల్లడే లక్షణాలు తెలుగువాడిలో   కల్లలవుతున్నాయి! అదీ కలవరం!   పుట్టిన నేల నేర్పించే మట్టిజ్ఞానాన్ని సైతం  కాలదన్నే అజ్ఞానం రోజురోజుకీ అధికమయి పోతున్నది! బుడత వయసునుంచే మెదడు మడతల్లో మనదికాని మరి దేన్నో బలవంతంగానైనా చొప్పించాలని ఆరాటం!  ఇంటభాషమీద సహజంగా ఉండే అభిమానాన్ని ఇంతప్పటినుంచే బిడ్డకు దూరం చేయాలనే దురాలోచన!
ఏ జాతికైనా తనదైన ఉనికి అంటూ ఒకటి ఉంటుందికదా!  ఉండాలి కూడా కదా! నలుగురిలో తను  ఏమిటో నోరు    విప్పకుండానే  చెప్పగలిగేది ఈ సంస్కారమే కదా!  దానికీ ఓ పెద్ద  ‘నమస్కారం’ పెట్టేసెయ్యడమే 'అల్ట్రా మోడరన్' నాగరీకంగా మన్ననలు పొందటమే ఆందోళన కలిగించే అంశం.
తెలుగు భాషాపరంగా తగినంతగా ఎదగలేదని కదూ ఆంగ్లమానస పుత్రుల అస్తమానం అభియోగం!  గతంలోకి ఓ సారి తొంగి చూస్తే తెలుస్తుంది.. సమర్థతగల గురుతుల్యుల మార్గదర్శకత్వంలోనైనా సరే! తెలుగుభాష చూపించే వన్నెచిన్నెలు ఎన్నెన్నో!  విస్తుగొల్పేస్తాయి మన తల్లిభాష విన్నాణస్థాయికి!
ఒకటో శతాబ్దిలోనే హాలుడు అచ్చుతెలుగులో ముచ్చటయిన కావ్యసంపదను పోగుచేసాడు. ప్రాచ్యభాషలెన్నింటిలోలాగానే తెలుగుమీదా సంస్కృతభాష ప్రభావం కాస్త అధికంగా ఉందన్న మాట వాస్తవమే కావచ్చు  కాదనేందుకేమీ  లేదు కానీ.. సంస్కృతమూ భారతీయుల సంస్కారానికి దర్పణీయమైనదే కదా!అయితేనేం.. పాలలో నీళ్లలాగా ఏ పరాయిభాష పదాన్నైనా తనలో పొదువుకొనే సమ్మిళితశక్తి తెలుగుభాషకున్నంతగా మరే ఇతర భారతీయభాషకూ లేదన్న ప్రత్యేకత గుర్తించాలి. గర్వించాలి. అన్నం.. పచ్చడి.. బట్టలు.. గుడిసె.. కుండలు.. పలక.. బలపం.. లాంటి ఎన్నో ముచ్చటైన అచ్చుతెలుగు పదాలతో  తెలుగు సంచీ నిండి ఉంది. ఆ వాడుక పదాలనైనా అవసరానికి వాడుకొంటున్నామాఅనవసరమైన ఆంగ్లపదాలతో  తెలుగుసంభాషణల బండిని తోలుకుపోవడమే దొరలతనమనే  భ్రమలో ఉన్నాం!

పొన్నగంటి తెలుగన్న  అచ్చమైన తెలుగు పదాలతో ముచ్చటైన కావ్యరచనకు శ్రీకారం చుట్టేస్తే.. ఆ స్ఫూర్తిని అందుకొని మరింత వడుపుగా ముందడుగులు వేసిన తెలుగు కవిమూర్తులెందరో!  ఆ విశేషాలు అన్నీ కాకపోయినా కొద్దిగానే అయినా తెలుగుబుద్ధికి తోచాలన్న సద్బుద్ధితో మచ్చుక్కి కూచిమంచి  తిమ్మకవి రాసిన అచ్చుతెలుగు రామాయణంలోని  ఈ ముచ్చటైన పద్యం మచ్చుక్కి ముచ్చటించింది!
                                         ***
 -కర్లపాలెం హనుమంతరావు

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...