గురువును పరబ్రహ్మగా గౌరవించే స్వర్ణయుగం
ఎన్నడో వెళ్లిపోయింది. బ్రహ్మానందంలాంటి హాస్యనటులిప్పుడు
గురువు పాత్రల్లో నవ్విస్తున్నారు.
గురువుని విష్ణువంటారు. ఆ దేవుడివి
పది అవతారాలే. అంతకు పదింతల అవతారాలు ఈనాటి గురువులు ప్రదర్శించేవి.
చీటీ పాటలనుంచి.. ప్రేమపాఠాల వరకు. టెక్స్టు బుక్కులెవరూ ముట్టుకోడంలేదు. టెక్స్టులు పెట్టుకోడంలోనే ఒజ్జలంతా బిజీ.. బిజీ!
సర్కార్ల పాలనా వాహనాలక్కూడా..పాపం..
పంతుళ్లే చక్రాలు. జనాభా లెక్కల్నుంచి.. ప్రభుత్వ పథకాల ప్రచారాల్దాకా ఏ గలభాకైనా దభాల్మని గురొచ్చేది గురువులే ప్రభుత్వాలకి. ఎవరికీ
ఏ పనీ తోచనప్పుడు మాత్రమే అయ్యవార్లు బళ్లకెళ్ళి పాఠాలు చెప్పుకొనే వీలు!
హిందీలో చదువును 'శిక్ష' అంటారుట! తెలుగు
చదువు' మాత్రం?! ఇంతుండడు.. బుడతడు! ఇంగిలిపింగిలీసులో తప్ప ఏడవడం తప్పు. దొరల
హుకూం! 'టెట్టు' టిక్కుల పరీక్షలో గట్టెక్కొచ్చిన గురువులేమైనా 'గుడ్ సామర్టిన్' తరహా బళ్లల్లో తర్ఫీదయొచ్చిన ‘రెన్ అండ్ మార్టిన్లా’?
నామినేటివ్ కేసు.. ఆబ్జెక్టివ్ కేసంటే. ‘అహో! అదోరకమైన సూట్ కేస’నుకునే చిలకమర్తివారి గణపతి తంతు అంతా. 'రామా కిల్డ్ రావణ' లో ‘రామా’ది ఏ కేసని అడిగితే బల్లగుద్ది మరీ 'మర్డర్ కేస’ని వాదించే జ్ఞానులెంతమంది
లేరూ?! తమకే అర్థం కానా పలుకురాయి భాషను.. బలవంతంగా కుక్కేందుకు బుడతల బుర్రలేమన్నా దూదిబేళ్లు తొక్కే నార బస్తాలా?
నేరుగా బెత్తం ఆడిస్తే నేరస్థుల ‘శిక్షా స్మృతి'! జానా బెత్తెడైనాలేని బొట్టికాయ నెత్తికొక్క మొట్టికాయ
తగలకుండా జ్ఞానసింధువై పోడానికి ఇదేమైనా ‘మహాకవి
కాళిదాసు’ సినిమా కథా?!
ఫురువంటే ‘గైడు’ట! సర్కార్లకీ.. పిల్లలకీ
మధ్య నలిగే ‘సర్'లకన్నా కృష్ణార్జునలమధ్య నలిగినా
ఆ గయుడే నయం. . పంతుళ్లంటే.. తుళ్లుతూ.. తూలుతూ .. పని బాధ్యతలు
పట్టకుండా తిరిగే సౌభాగ్యవంతులని 'పన్'చులు మళ్లా! బతకలేక చేసే గొడ్డుచాకిరీనా గతంలో
లాగా ఇవాళ్టి బడిపంతులుద్యోగం? బతకడం నేర్చిన గడుసుపిండాలు ఒడిసిపట్టుకొనే ఉపాధి ఉపాయం!
'అ' అంటే అలసత్వం. 'ఆ’ అంటే ఆలస్యం. 'ఇ' అంటే ఇస్పేటాసూ.. 'ఈ' అంటే ఈడు ఆడపిల్లల్ని
ఈలేసి ఏడిపించుడు! ఇవేగా ఇవాళ్టి అలగా పంతుళ్లు
పిల్లకాయల కెలాగ మెలగాలో నేర్పే ఆగామాగం చదువులు!
నైటవుట్లు.. కాఫీ కొట్లో కూర్చున్నా కాపీ కొట్టించి
మరీ పరీక్షలు గట్టెక్కించే నెట్లు కోట్లున్నప్పుడు.. టీలు.. బట్టీలంటూ పాతకాలంనాటి
మోటు పధ్ధతలుఅతో పంతుళ్ల కెందుకు పాట్లు ? ఈ కాలం గురువులీ తరహాలో యువతను తయారు చేస్తున్నారు.
కాబట్టే.. ఇంజనీర్లకు సున్నబట్టీల్లో కూడా ఉపాధి దొరక్క .. 'జిన్.. బీర్లు' అందించే బార్లల్లో
పనిక్కుదురుకుంటున్నారు. గురువులు లఘువులయితే శిశువులు పశువులక మోక్షగుండం విశ్వేశ్వరయ్యలవుతారా?
అని వెటకారాలు!
విసుర్లు చాలా ఆయ్యాయిగానీ.. అయ్యవార్ల
వైపు వాదానలుకూడా కాస్త కనికరించి వినండయ్యా
స్వాములూ!
గుమ్మడి కడివెడంతుంటేనేమి.. తుంటెంత
కత్తికి లోకువంట. చేత బెత్తంలేని గురువుముందు..
శిశువు సుదర్శన చక్రంలేని కృష్ణుడిముందు శిశుపాలుడయ్యలారా! అయ్యవారంటే.. ఇప్పుడు
మధ్యాహ్నం పూట భోజనం వండి వార్చి పెట్టే గాడిపొయ్యిముందట చేరిన వంటవాడయిపొయ్యాడయ్యా!
గురువంటే దేవుడే కదా? ఆ దైవానికి మల్లే
తనదైన శైలిలో ఒక్క హాజరుపట్టీలో మాత్రమే దర్శనమిస్తే చాలదా? తరగతి గదిలో సైతం ప్రతీ క్షణం ఆ గొంతు ఖంగుమంటూ మారుమోగాలా?
ఆన్ లైనులో గురువులు.. ఆఫ్ లైనులో కౌరవలని
అంతలేసి రవరవలు అవసరమా? జాతిపరువు బరువు ఒక్క
గురువులే మోయాలని ఏ పాఠ్యప్రణాళికల్లో రాసుందో.. రాళ్లేసేవాళ్లెవరైనా చూపిస్తారా?
గురజాడవారి గిరీశం తిరిగొచ్చినా సరే
.. ఏ అంటే యాప్.. బి అంటే బైక్.. సి అంటే సెల్.. అనే వెంకటేశానికి నూరిపోయాల్సిందేనండీ!
అప్పుడే సజావుగా నడిచేది బడిపంతుల
బతుకు బండి! ఈ-కాలంలో కూడా మీ కాలంలా చెట్టుకింద
చదువులా? ఉన్న కులాల క చాలకా.. ఈ గురుకులాల గోల? 'టీ' డబ్బులన్నా గిట్టుబాటవుతాయని కాకపోతే ఇంతలా కాకెక్కి పోయే టీచరుద్యోగానికి ఎవరండీ
‘ఠీక్ హైఁ’ అని మొగ్గు చూపేదీ? ఏ ప్రైవేట్లు.. ఫీజులు.. పుస్తకాలు.. వంకతోనో నాలుగంకెల గీతమైనా అదనంగా రాబట్టలేనప్పుడు..
ఈ తెల్లటి బట్టలేసుకునే తంటాలు పడ్డమెందుకంట? వీధికో ఏటిఎమ్ రాత్రింబవళ్లు వెలిగి పోతుంటుంది. వాచ్ మెన్
చేతికో వాచి తొడిగినా చాలు.. మాస్టర్ పాస్ వర్డుతో వేలు.. లక్షలు!
భీమ్ రావ్ అంబేద్కర్ (B.R.A) ఓపెన్
విశ్వవిద్యాలయాన్ని తెలివెక్కువైన తుంటరి గురువెవరో
'బ్రా' ఓపెన్ పెద్దబడి' అన్నాడని పడీ పడీ
నవ్వులా? హరి.. హరీ! మనమంతా ఎగబడి మరీ ఓట్లేసి గద్దెలెక్కించేసిన పెద్దమనుషుల 'ముద్దు' ముచ్చట్ల మాటేమిటో మరి?
ఏకలవ్యుడే మళ్లీ పుట్టొచ్చి ఎల్కేజీ
చదువుకోవాలన్నా ఏ అయ్యోరి చెయ్యో తడపకుండా ముందుకు సాగని ముదుర్రోజులయ్యా ఇవి!
బోర విరుచుకొని మరీ 'మాది
అధ్యాప'కుల'మని టాంటాం కొట్టుకుంటాం. బొక్కబోర్లా పడి మొక్కుకోడానికి మేం ఎవరికన్నా
తక్కువగా తిన్నాం? ముష్టి మూడు లక్షల ఫీజు. వేదవేదాంగాలు
మీ బిడ్డకి వంటబట్టించేసెయ్యాలని జులుములు!
చచ్చుపుచ్చు సందేహాలడిగినప్పుడు 'షటప్' అని అరవక పోవడమే షడంగాలని మించిన చదువులు మీ
బిడ్డలకు చెప్పినట్లు.
'లీకు వీరుల'మని లేకి మాటలేల? ఆ సందు
ఉందనే గదా లక్షలైనా లక్ష్యపెట్టకుండా సందు గొందుల్లో తెరిచిన బడులకైనా మీ కన్నవాళ్లలా ఎగబడేస్తున్నది? నిజంగా మేం చండామార్కు మార్కు మాష్టర్లవతారాలే
ఎత్తితే మీ అడ్డాలనాటి బిడ్డడు గడ్డాలు పెంచే
వయసుకొచ్చినా ఫస్టు గ్రేడు గడపైనా దాటలేడు.
చదువుకునే బళ్లకన్నా..చదువమ్ము'కొనే'
బళ్ళకే తమరంతా రాబళ్లెందుకు పెంచుతున్నారో.. ముందా రహస్యం తేల్చాలి. తరువాతే మా మీదే
ఔట్లన్నా పేల్చాలి.
ఉపాధ్యాయుడికి ప్రధానోపాధ్యాయుడంటే
భయం. ప్రధానోపాధ్యాయుడికి బడి నిర్వాహకుడంటే భయం. బడి నిర్వాహకుడికి బడి యాజమాన్యమంటే భయం. బడియాజమాన్యానికి తల్లిదండ్రులంటే భయం. తల్లిదండ్రులకి పిల్లలంటే
భయం. ఆ పిల్ల రాక్షసులకే ఏ దయ్యాల్ని చూసినా
భయం శూన్యం. అదే ఇవాళ్టి దైన్య విద్యావవస్థ నిజమైన అవస్థ.
'టిక్కు' పెట్టే 'టెట్'లు గట్టెక్కి
వచ్చిన వాళ్లంతా అచ్చమైన గురువుల పదవులకు
'ఫిట్' అవుతారనే!
చదువంటే ఆట. పాటగా సాగే జ్ఞానపు బాట. ఆ దారిలో చురుకుగా నడిపించే అచ్చమైన ఖేల్ రత్నలిప్పుడెక్కడో
తప్ప మెరవడం లేదే! 'స్పాట్ వాల్యూయేషన్'లాంటి సందర్భాలొచ్చినప్పుడు
తప్ప గురుస్థానం విలువ ప్రభువులకైనా గుర్తుకు
రావడం లేదే!
చెరువుల్ని పట్టించుకుంటునారు దొరలు.
సంతోషం. 'గురువుల్ని కూడా పట్టించుకుంటే మరింత సంతోషం. నదుల అనుసంధానంమీద దృష్టి పెడుతున్నారు ప్రభువులు. ఆనందం. గురుశిష్యుల అనుబంధాల పునస్సంధానంమీదా
శ్రద్ద పెడితే బ్రహ్మానందం.
మాష్టర్లంటే శిష్యుల మనసు రాతబల్లలమీది పిచ్చిగీతలను
చెరిపేసే డస్ఠర్లు. తరగత గదంటే వట్టి నల్లనల్ల..
తెల్ల సుద్ద.. చెక్క బెంచి.. పుస్తకాల సంచీనే కాదుగా! బిడ్డ కడుపుకి అమ్మ.. ఉడుపుకి నాన్న.. పూచీ
పడ్డట్లే.. గురువూ బిడ్డ ఆ రెండూ స్వయంగా జీవితంలో సాధించుకొనే వడుపుకు పూచీ
పడతాడు. పడాలి కూడా. గురువంటే తరగతి గదిలో విధ్యార్థి సమక్షంలో నిలబడ్డ తల్లి..తండ్రి..
విధాత.. కలగలపు రూపం.
రేపటి జాతి స్వర్ణయుగ భవన నిర్మాణానికి అవసరమైన బంగారు కణికలెను అందించే విశ్వకర్మ పనితనం
విధాత కేవలం ఒక గురుకులానికి మాత్రమే అప్పగించిన విధి. పిల్లలతో కలకలసి గురువు చేసే అల్లరిలోనూ
ఒక పరమార్థం ఉండటం తప్పనిసరి. తప్పుదారిన నడిస్తే.. విద్యార్థికేనా.. ఉపాద్యాయుడికి శిక్షలుండటం తప్పని
సరి. కుర్చీ ఇచ్చి గౌరవించిన సమాజమే గోడకుర్చీ వేసి మరీ శిక్షిస్తుంది.
శిలను శిల్పంగా మలిచే కళాకారుడు కదా
ఉపాద్యాయుడు.! చిత్తశుద్ధితో విధి నిర్వహించే ఆ అపర బ్రహ్మకి ప్రతీ విద్యార్థీ ఒక ప్రశ్నాపత్రమే.
శిష్యులతో గడిపే ప్రతీ క్షణమూ ఒక పరీక్షా సమయమే! ఆ పరీక్షలో ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం
పెరగాలంటే.. ముందుగా జరగాల్సింది ఈ-కాలం వంకన గురు-శిష్య అనుబంధాల్లో క్రమంగా పెరుగుతున్న
వంకర సంబంధాలు. ఆ దిశగా మార్పు చేయవలసిన పాఠ్యప్రణాళిక రూపకల్పనలో అటు ప్రభువులే కాదు..
ఇటు సమాజమూ అంతకు మించిన ఉత్ప్రేరక పాత్ర నిర్వహించాల్సుంది. వూరికే గురువుల
నిర్వాకంమీద ఊకదంపుడు విసుర్లతో శిష్యుల భవిష్యత్తులు
బాగు పడతాయా?!
-కర్లపాలెం హనుమంతరావు