“Government
of the people, by the people, for the people, shall not perish from the Earth” Abraham Lincoln
ప్రజల వలన..
ప్రజల కొరకు.. ప్రజల చేత - నడిచే పాలన 'ప్రజాస్వామ్యం' అని అబ్రహాం లింకన్ కాబోలు మొదటిసారి
సుపరిపాలన ఎలా ఉండాలో వివరించే ప్రయత్నంలో వ్యాఖ్యానించింది.
ఆ పెద్దమనిషి పుట్టిన దేశంలోనే ఇప్పుడు ప్రజాస్వామ్యం
ఎన్ని వన్నెచిన్నెలు పోతోందో? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని పద్దాకా మనం
గుండెలు గుద్దుకొంటుంటాంగా! మరీ అంత ప్రమాదకరమైన నెంబర్ వన్ స్థానంలో లేకపోయినా ..
అమెరికా టైపు ప్రజాస్వామ్యాన్నే ప్రపంచం ప్రమాణంగా తీసుకొంటూ వస్తున్నదిప్పటిదాకా! అక్కడి నేతల నైతిక స్థాయి ఎలా ఉన్నా.. ప్రజలమాత్రం .. అధికశాతం ప్రజాస్వామ్య ప్రియులే. ఆ విధంగానే
నిరూపణ అవుతూ వస్తున్నదిప్పటి వరకు.
స్వేఛ్చను
కాంక్షించడం.. వ్యక్తిగత విషయాలను బహిరంగ చర్చకు పెట్టడం గిట్టకపోవడం అమెరికన్ పౌరసమాజంలో
సాధారణంగా కనిపించే మంచి లక్షణాలు. సున్నితమైన విషయాలమీద అతిగా స్పందించడం బలమో.. బలహీనతో తెలియదు మనకు. మొత్తానికి.. అమెరికా దేశాన్ని మిగతా దేశాలకన్నా విభిన్నంగా ఉంచడానికి కారణభూతాలని
ఇప్పటి వరకూ అందరం అనుకుంటూ వస్తున్న వ్యక్తిగత విలువల్లో చాలా వరకు ఈ సారి అధ్యక్షపదవికి
జరుగుతున్న ఎన్నికల్లో తలకిందులైనట్లే అనిపిస్తున్నది.. రోజూ.. మీడియాలో వస్తున్న వార్తల
సరళిని గమనించే ఆసక్తి ఉన్నవాళ్లకి.
స్వేచ్చని ఒక విగ్రహంగా మలుచుకొని ప్రపంచానికి ప్రజాస్వామ్యమెంత విలువైనదో.. అవసరమైనదో.. చాటి చెబుతున్న దేశంలో.. ఈ సారి శ్వేత సౌధం మీద అధిపత్యానికని పోటీపడే అభ్యర్థుల్లో సభ్యత ఎంతగా దిగాజారిందో గమనిస్తుంటే.. మన భారతీయ ప్రజాస్వామ్యవాదులకు సంతోషం కలుగుతుంది. సంతోషం ఎందుకంటే.. మనకన్నా.. నీతిబాహ్య దారుల్లో అధికార దుర్గాలని చేరుకోవలనే యావగల దేశం మరోటున్నది కదా అని!
రిపబ్లికన్
పార్టీ కదా.. రహస్య వ్యవహారాలు ఎందుకు.. పబ్లిగ్గానే అంటే బావుంటుందని భావించాడో ఏమో.. ఆ పార్టీ అభ్యర్థిత్వానికి
పోటీ మఒదలైన మొదట్రోజునుంచి.. డొనాల్డ్ ట్రంప్.. అన్నీ బాహాటంగానే వాగడం మొదలు పెట్టాడు. రిబబ్లికన్లు
ఇప్పటి వరకు మరీ బైటకి అనడమెందుకులే.. అని మొహమాట పడే మాటలన్నీ.. డొనాల్డ్ ట్రంప్..
నిస్సంకోచంగా నిస్సిగ్గుగా బైటికి అంటూ వచ్చాడు. రిపల్లికన్ పార్టీ సభ్యత్వం దొరకబుచ్చుకున్నప్పట్నుంచీ ఇదే తంతు. సంచలనాలు సృష్టించి పోటీలో సీనియర్లను
దాటి ముందుకు దూసుకొచ్చేందుకు ఈ ఎత్తుగడే కొత్తగా పార్టీ తీర్థం పుచ్చుకున్న ట్రంపుకి బాగా కలసి వచ్చింది. మెక్సికన్లు దేశంలోకి అక్రమంగా వలస రాకుండా
గోడ కడతాననడం.. ముస్లిం మతస్థులను దేశంనుంధి తరిమి తరిమి కొడతాననడం, చిన్న.. పెద్ద ఉద్యోగాలను.. ఉపాధులను.. కొల్లగొడుతున్న చైనా.. భారత్ వంటి తూర్పు ఆసియా నాన్-ఇమ్మిగ్రెంట్స్ భరతం పడతాననడం..
ఇవన్నీ కచ్చితంగా ఎంత ఉదారవాదులుగా బైటికి కనిపించే సాదారణ అమెరికనుకయినా సంతోషం కలిగించే
విషయాలే అవుతాయి. అక్కడి సగటు మద్యతరగతి ఇంగ్లీషు పౌరుడి ఆలోచనలను అద్దం పట్టినట్టినట్లు మాట్లాడేవాడు మొదట్లో ట్రంప్. ఆ విధంగా ప్రైమరీ ఎన్నికల్లో సాటి అభ్యర్థులను వెనక్కి తోసేయడానికి
ఉపకరించిన ఎత్తుగడల మూలకంగా.. సగటు అమెరికను ఇప్పటి వరకు తగిలించుకుంటూ వస్తున్న 'జెంటిల్
మన్ షిప్' తొడుగును తొలగించి ప్రపంచానికి ఆ తెల్లతోలువాళ్ల అసలు స్వభావం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన పుణ్యాత్ముడయాడు ట్రంప్.
అమెరికా దేశానికి .. దానితో పోటీపడే చైనా.. రష్యా వంటి దేశాలకి మౌలికంగా చరిత్ర నిర్మాణంలోనే పెద్ద అంతరం ఉంది. చైనా లాగా ప్రాచీన సంస్కృతిగల దేశం కాదు అమెరికా. అమెరికా చరిత్ర అంతా కలుపుకున్నా రెండున్నర శతాబ్దాలకు మించి ఉండదు. రష్యా దేశంలాగా పలు పాలనా వ్యవస్థల మంచి చెడ్డలను అనుభవించి.. చివరికి సిసలైన సోషలిజమ్ వైపుకు మొగ్గిన పరిణతీ అమెరికాకు లేదు. అమెరికా దేశ నిర్మాణమంతా వలసపౌరుల రెక్కల కష్టం. ప్రపంచంలోని ఎన్నో దేశాలనుండి ప్రతిభావంతులు ఈ గడ్డమీదకు అడుగుపెట్టి తమ మేధోబలంతో కూడగట్టిన సంపదలనే మూల అమెరికనువాసులు నేటికీ అనుభవిస్తూ వస్తున్నది. అక్కడి భారీ నిర్మాణాలలో చాలా వంతు పలు పేదదేశాలనుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చిన వలస కూలీల కాయకష్టంనుంచి లేచినవే. ప్రపంచ మనీ మార్కెట్లో తన డాలర్ బలపడేందుకు ఆయిల్ దేశాలతో తెలివిగా ఆడిన పాచికలాటలో విజయం సాధించిన విదేశాంగ విధానం వల్ల మాత్రమే అమెరికన్లకు అగ్రరాజ్యస్థాయి దక్కేందుకు ప్రథమ.. ప్రముఖ కారణమయింది. అమెరికన్లను నిజంగా అభినందించవలసిన అంశం ఏదైనా ఉందంటే.. అది వాళ్ళ విదేశాంగ విధానం.. ఆ ఎత్తుగడల్లోని ముందుచూపు. ప్రపంచంలోని ఏ మూల రెండు దేశాల మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తినా.. పిలవని పేరంటానికి వెళ్లినట్లు.. అమెరికా.. వాళ్ల మధ్య దూరి.. తనకు లాభించే వర్గం కొమ్ము కాస్తూ రావడం వల్ల క్రమంగా ప్రపంచం మొత్తం దాదాపు ఆ దేశపు అదుపాజ్ఞలకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో లోబడవలసిన పరిస్థితి దాపురించింది. అగ్రరాజ్య హోదాని ఇంతదాకా సవాల్ చేస్తూ వచ్చిన యూ ఎస్ ఎస్ ఆర్.. చీలిక వల్లకూడా అమెరికాకు మరింత లాభించిందనుకోవాలి. ప్రస్తుతం దాని వెన్నులో చలి పుట్టించే చేవగల దేశం ఒక్క చైనా మాత్రమే! ప్రపంచ వస్తుమార్కెట్ ను తన సరుకులతో చైనా ఇప్పటికే దాదాపు ముంచెత్తి ఉంచడం.. అమెరికా ఆధిపత్యానికి పెద్ద అవరోధంగా ఉంది.
తాను ఎత్తుకున్న
ప్రపంచీకరణ సంస్కరణల పాటకు ప్రపంచమంతా వంత
పాడేందుకు ఒక్క చైనా మాత్రమే అవరోధంగా ఉంది ప్రస్తుతం అమెరికాకి. ఆర్థిక పరంగా లాభించిన సైనిక చర్యల ఎత్తుగడలే ఒక దశలో అమెరికా వదిలించుకోలేని గుదిబండలుగా మారాయి. బుష్ లిద్దరూ తలపెట్టి కొనసాగించిన ఇరాక్- ఆఫ్ఘనిస్తాన్ సమరాల ఖర్చు అమెరికా డాలరును అతలాకుతలం చేసిందన్నమాట వాస్తవం.
2008లో అమెరికాను కుదిపేసిన ఆర్థికమాంద్యం అటు పాలకులలోనే కాదు.. ఇటు పౌరుల మనస్తత్వంలోనూ గణనీయమైన మార్పుకు కారణమయింది. ఇంత వరకు తామనుకుంటున్నట్లు ప్రపంచానికి తామే రారాజులం కాదన్న తత్వం బాగా తలకెత్తింది. మెక్సికన్ దేశీయుల్లాగా కష్టించి పని చేసే మనస్తత్వం.. ఆసియా వలసవాదుల్లా ప్రతిబా పాటవాలను పెంపొదించుకొనే అబ్యాసాలకి అలవాటు పడకపోతే ముందొచ్చే కాలం మరింత చేదుగా ఉంటుదన్న సత్యమూ బోధపడింది మెల్లగా. ఆ నిజం తలకెక్కినందువల్ల మూల అమెరికన్లలో ఏర్పడ్డ అభద్రతాభావననే ట్రంప్ తొలి దశలో సొమ్ము చేసుకొని కాబోయే దేశాద్యక్షుడన్న ఇమేజిని ఖాయపర్చుకోగలిగింది. పోటీలో బాగా ముందుకు పుంజుకొచ్చింది. దురదృష్టవశాత్తూ హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ అభ్యర్థిత్వం ఖాయమయిన తరువాతా అతగాడు అదే తరహా ఎత్తుగడలకు పోకుండా.. వ్యక్తిగత స్థాయి దూషణ పర్వానికి తెగబడటంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల అధ్యాయంలో పూర్వమెన్నడూ లేని ఒక హేయమైన కొత్త పర్వానికి తెర లేపినట్లయింది.
2008లో అమెరికాను కుదిపేసిన ఆర్థికమాంద్యం అటు పాలకులలోనే కాదు.. ఇటు పౌరుల మనస్తత్వంలోనూ గణనీయమైన మార్పుకు కారణమయింది. ఇంత వరకు తామనుకుంటున్నట్లు ప్రపంచానికి తామే రారాజులం కాదన్న తత్వం బాగా తలకెత్తింది. మెక్సికన్ దేశీయుల్లాగా కష్టించి పని చేసే మనస్తత్వం.. ఆసియా వలసవాదుల్లా ప్రతిబా పాటవాలను పెంపొదించుకొనే అబ్యాసాలకి అలవాటు పడకపోతే ముందొచ్చే కాలం మరింత చేదుగా ఉంటుదన్న సత్యమూ బోధపడింది మెల్లగా. ఆ నిజం తలకెక్కినందువల్ల మూల అమెరికన్లలో ఏర్పడ్డ అభద్రతాభావననే ట్రంప్ తొలి దశలో సొమ్ము చేసుకొని కాబోయే దేశాద్యక్షుడన్న ఇమేజిని ఖాయపర్చుకోగలిగింది. పోటీలో బాగా ముందుకు పుంజుకొచ్చింది. దురదృష్టవశాత్తూ హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ అభ్యర్థిత్వం ఖాయమయిన తరువాతా అతగాడు అదే తరహా ఎత్తుగడలకు పోకుండా.. వ్యక్తిగత స్థాయి దూషణ పర్వానికి తెగబడటంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల అధ్యాయంలో పూర్వమెన్నడూ లేని ఒక హేయమైన కొత్త పర్వానికి తెర లేపినట్లయింది.
ఇహ హిల్లరీ క్లింటన్ వైపునుంచి చూద్దాం. గత ఎన్నికల్లో ఒబామాకి ప్రత్యర్థిగా ప్రైమరీ స్థాయిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా నిలబడిన వ్యక్తే. అప్పటి పోటీలో ప్రత్యర్థి ఒబామా మెజారిటీ ఓట్లు సాధించిన వెంటనే ప్రజాస్వామ్య స్ఫూర్తితో వైదొలిగారామె. ఆ సందర్భంలో హిల్లరీని బైటనుంచి సమర్థించిన వ్యాపారవేత్తల్లో డొనాల్డ్ ట్రంప్ పముఖుడు. ఈ సారి నేరుగా ఆమెతో తలపదవలసిన స్తితి వచ్చేసరికి అప్పటి మంచి ఇప్పుడు కామంచి అయిపోయింది! హిల్లరీ అల్లరి మనిషి.. అతిగా తిరిగే మహిళ.. భర్తను సంతృప్తి పరిచే సామర్థ్యం లేని ఇల్లాలయిపోయింది! హిల్లరీ ప్రైమరీ స్థాయిలో పోటి పడుతున్న సందర్బంలోనే ప్రయివేట్ సర్వర్లనుంచి ప్రభుత్వ విదేశాంగ సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించిన కేసును ఎఫ్ బి ఐ వెలికి తీసింది. విచారణ అనంతరం అభియోగాలు మోపదగినంత అభ్యంతరాలేవీ కనిపించలేదని అదే ఎఫ్ బి ఐ తదనంతరం ధృవీకరించింది కూడా. అయినా ఆ కేసునే పట్టుకొని డొనాల్డ్ ట్రంప్ చాలా కాలం.. హిల్లరీని జైలుకు పంపిస్తానంటూ అల్లరికి దిగేవాడు! ఇంకా దిగుతున్నాడు కూడా! ఇటీవల మళ్లీ వికీ లీక్స్ చలవవల్ల కొత్త కోణాలు వెలుగు చూసిన సందర్భంగా ఎఫ్ బి ఐ హిల్లరీ మీద మళ్లీ కేసు బుక్ చేసే ఆలోచనలో ఉందన్న వెంటనే హర్షాదామోదాలతో ఉబ్బి తబ్బుబ్బయిన వారిలో సహజంగానే ట్రంపు మొదటి వాడు. రెండు రోజుల కిందట హిల్లరీకి ఎఫ్ బి ఐ క్లీన్ చిట్ ఇచ్చింది కొత్త కేసులో కూడా. ఇప్పుడు ట్రంప్ మహాశ.యుడు హిల్లరీ.. ఎఫ్ బి ఐ కుమ్మక్కుని గురించి రచ్చ చేస్తున్నాడు! ఎఫ్ బి ఐ నిజాయితీని ప్రశ్నిస్తున్నాడు. ఇదే ఎఫ్ బి ఐ డొనాల్డ్ తన వ్యాపార లావాదేవీల పన్నుల విషయంలో చేసిన గిమ్మిక్కుని పరిశోధించి చట్టబద్ధంగా ఉందని సర్టిఫికేట్ ఇచ్చింది గతంలో. అప్పుడు ఆ అత్యున్నత నేర పరిశోధనా సంస్థను ఆకాశానికి ఎత్తేసిందీ మహానుభావుడే. తడవకో సారి మాట మార్చే నైజం అటు రాజ్యాంగ బద్ధ సంస్థల్లోనూ.. ఇటు చట్టబద్ధ పదవులకు పోటీ వ్యక్తులలోను వ్యక్తమవుతుండటం.. అమెరికా మార్కు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇన్నాళ్లూ ప్రపంచమంతా భావించినట్లు ఇరవై నాలుగు కేరెట్ల బంగారం కాదు.. పొట్టలో పురుగులున్న మేడిపండు మాదిరిదని తేల్చేస్తున్నది.
పోటీకి దిగుతున్నది దేశాద్యక్ష పదవికి. కాబట్టి చర్చకు రావలసినవి దేశానికి సంబంధమైన సమస్యలు.తుపాకీ సంస్కృతి.. విద్యావిధానం.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు.. మద్యతరగతి జీవుల బతుకుల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడాలు.. ఆరోగ్య, జీవిత బీమా పథకాల పునర్విచారణలు వంటివి ఎన్నో! అవన్నీ మొదటి అంచె చర్చల్లోనే గాలికి కొట్టుకెళ్లాయి! గాలి మాటలు మొదలయ్యాయి. ఆ స్థానే.. వ్యక్తిగత అంశాలు ముందుకు చొచ్చుకొచ్చేసాయి. హిల్లరీకి తరచూ జలుబు చేస్తుంది కాబట్టి.. ఆమె అత్యంత వత్తిళ్లతో కూడిన అధ్యక్ష పదవికి అనర్హురాలని ట్రంపు వాదన ఒకసారి. దానికి ఖండనగా హిల్లరీ వైద్యుల తాజా ఆరోగ్య ధృవీకరణ పత్రం సమర్పించుకోవాల్సి వచ్చింది. అయినా ట్రంప్ ఆరోపణలకు అడ్డుకట్ట పడనే లేదు. బహిరంగ వేదికలమీద బఫూన్ల స్థాయికి తగ్గకుండా.. ముక్కు ఎగబీలుస్తూ ఎగతాళిచేసే వరకూ వెళ్లింది అతగాడి వ్యవహార శైలి. పోటీ చేసే అభ్యర్థి గుణగణాలని.. సమాచార గ్రహణ సామర్థ్యం.. విశ్లేషణ.. వాటికి తగ్గ మేథోస్థాయి పరిమితులమీద చివరి అంచె మూడు డిబేటింగుల్లో వాదోపవాదాలు సాగడం అమెరికా అధ్యక్ష ఎన్నికల పూర్వ సాంప్రదాయం. వాటినీ గాలికి వదిలి.. హిల్లరీ క్లింటన్ కి సంబంధంలేని ఓ నాటి మాజీ అధ్యక్షుడు క్లింటన్ సెక్ స్కాండల్సుని తిరిగి తవ్వి తీసి వ్యక్తిశీలహననద్వారా పరువు తీసి పైచేయి సాధించే దుష్ట సాంప్రదాయం మొదటిసారి ట్రంపు ఎంచుకున్నాడు. విధిలేని పరిస్థితుల్లోమహిళైన హిల్లరీ సైతం ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని నమ్మి.. ట్రంప్ మహాశయుడి గతకాలపు శృంగార చాపల్యాన్ని పలు కోణాలలో.. ఉదాహరణలతో సహా ప్రదర్శించి చర్చను రక్తి కట్టించింది. ఎన్నికల మూడు డిబేటింగ్ దశల్లో రోజుకో సెక్స్ స్కాండల్ ఇరువైపులనుంచి. వ్యక్తిగత స్వేచ్చను.. శీలాన్ని ఓ హక్కుగా భావించే అమెరికన్ల దృష్టిలో ఇద్దరు అభ్యర్థులూ అథమస్థాయి వ్యక్తులుగా భావించేందుకు అవసరమైన ప్రహసనాలన్నీ అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఒక్క అమెరికానే కాకుండా.. ప్రపంచం మొత్తానికి అధ్యక్ష ఎన్నికల ప్రహసనం ఓ వినోద కార్యక్రమం కింద దిగజారి పోవడం మున్నెన్నడూ జరగని దుర్ఘటనే అనుకోవాలి.
హిల్లరీకి గతంలో అధ్యక్షుడుగా పనిచేసిన క్లింటన్ సహధర్మచారిణిగా వైట్ హౌస్ పాలనలో అనుభవం ఉంది. ఒబామా హయాంలో విదేంశాంగ మంత్రిగా గడించిన అనుభవమూ దానికి తోడయి ఉంది. ఆమెది రుజువయిన పాలనా సామర్థ్యం. మొదటిసారి ఎన్నికల్లో జనం ముందుకొచ్చిన అభ్యర్థి డొనాల్డ్ ట్రంపుకు అసలు రాజకీయాలే కొత్త. డొనాల్డ్ మాట తీరు.. గత వ్యక్తిగత చరిత్ర ఆయనకో పెద్ద ప్లస్.. అదే మైనస్సు. దేశం ఎదుర్కొనే సంక్షోబాల నివారణకి తన దగ్గర ఉన్న తారక మంత్రాది అంశాలతో సునిశిత ప్రజాస్వామ్య దృషిగల అమెరికన్ల మనసులను దోచుకోవాల్సుంది ఏ అభ్యర్థనా. చివరి గడియల్లో వెలువడ్డ ప్రత్యర్థి హిల్లరీ ఈ-మెయిల్స్ కుంభకోణాల వల్ల పొందవలసిన లాభం సైతం.. సహజ శత్రువైన రష్యాను పొగడడంతో స్వయంగా చేజార్చుకొన్నట్లయింది డొనాల్డుకి.
వాచాలత వల్ల.. వ్యక్తిగత నిజాయితీలోని డొల్లతనం వల్ల.. అనవసరమైన, నీచమైన లైంగిక ఆరోపణల వల్ల.. పరాయి దేశాలమీదవున్న మత్సరం వల్ల.. లౌక్య లేమి వల్ల.. రాజకీయ అనుభవ శూన్యత వల్ల.. ఒబామా సుదీర్ఘ పాలన వల్ల జనంలో ఉన్న అసంతృప్తిని సైతం సొమ్ము చేసుకోవడంలో డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యాడనే.. వెల్లువెత్తుతున్న సర్వేల సారాంశం తేట తెల్లం చేస్తోంది. ట్రంప్ మహాశయుడు ఎక్కడ విఫలమయ్యాడో.. హిల్లరీ క్లింటనుకి అక్కడ కలసి వచ్చినట్లుంది. ఫలితాల అనంతరం కూడా తన పోరు ఆగదు అనడంలోనే విలువలతో కూడుకొన్న అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని అతగాడు అవహేళన చేసినట్లయింది. రిగ్గింగ్ మాట ఇప్పుడు వినిపిస్తున్నంతాగా మునుపెన్నడు వినిపించ లేదు అధ్యక్ష ఎన్నికల్లో.
చూడాలి! ఇహ 48 గంటల్లో వచ్చి ఒక్క రోజులో ముగిసే ఎన్నికల తరువాత రోజు దాదాపుగా వచ్చే ముందస్తు ఫలితాల సరళే అసలు ఫలితం ఎలా ఉండబోతుందో తెలియ చేస్తుంది. మిగతా దేశాల మాదిరిగా కాదు.అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అనేక దేశాలమీద.. పలు రంగాల పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంటుంది. అందుకే ఇప్పుడు ఇంత పెద్ద చర్చ ఇక్కడ.
'ట్రంపు గెలిచినా..
ఓడినా.. సంచలనమే' అనుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. ఇప్పటి వరకు గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తితో
జరిగిన అన్ని ఎన్నికలకూ భిన్నంగా ఓటమి వచ్చి పడ్డా.. రిగ్గింగ్ వంటి ఆరోపణలతో అల్లరికి
దిగుతానన్న సంకేతాలు కూడా వెలువరిస్తున్నాడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.
ప్రపంచం దేశాలు ఇప్పటి వరకు గొప్పగా చెప్పుకుంటున్నది అమెరికా ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యాన్ని గురించి. సందర్బం తటస్థపడ్డప్పుడు వచ్చినప్పుడు .. ఆ అత్యంత ఉత్తమ ప్రజాపాలనావ్యవస్థా ఎంతటి అధమస్థాయికైనా దిగిజారిపోగలదు' అని నిరూపిస్తున్న ఈ 2016 ఎన్నికలను ఒక్క అమెరికానే కాదు.. ప్రపంచం మొత్తం ఒక విలక్షణమైన చారిత్రక సంఘటనగా గుర్తుంచుకోడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.
-కర్లపాలెం హనుమంతరావు
***
No comments:
Post a Comment