తండ్రుల పండుగ సందర్భంగా!
చిత్తూరు జిల్లా కలకడ మండలం
రాతిగుంటపల్లె గ్రామం. ధర్మం.. పుణ్యం తెలిసిన పెద్దమనిషి. రైతు. ఆయన పేరు శ్రీ కోట వెంకటయ్య నాయుడు. ఆయన
కుమారుడు కోట పురుషోత్తముడు. తండ్రి
తనకు నేర్పించిన జీవితపాఠాలని గుర్తు చేసుకునే స్మృతి దీపిక ఈ పుస్తకం.
బడికి వెళ్ళేందుకు వీలు లేక మూడవ తరగతి
తర్వాత బడిచదువు మానుకోవలసి వచ్చింది వెంకటయ్యగారికి. అయినా వెనుకంజ వేయలేదు. పంతంతో తనకు తానుగా చదువుకుని, పలు విషయాలు నేర్చుకొన్నారు. పండితుల్లాగా మాట్లాడేవారు. ఊరి ప్రజకు ఉపయోగమైన కార్యాలు చాలా చేశారు.
విద్యకు పెద్దపీట వేయడం ఆ గొప్ప పనులలలో అన్నిటికన్నా గొప్పది. పిల్లలకు సత్ప్రవర్తన.. మంచికి చెడ్డకి తేడాను విపులంగా వివరించడమే కాకుండా ఆచరించి చూపించేవారు.
మాదిగపల్లె దగ్గర విరిగిపోయిన
పరేందిమాను చుట్టూ ఉన్న పిలకల్ని పెళ్ళగించుదామని పిల్లతనంగా ఉత్సాహపడిన కొడుకుకి చెప్పిన మాటలే ఆ తండ్రి వ్యక్తిత్వాన్ని పట్టి చూపిస్తాయి. 'ఇతరులు నాటిన చెట్ల కాయల్ని నువ్వు
అనుభవించావు కదా! నువ్వు నువ్వుగా ఒక్క చెట్టును కూడా నాటలేదు. పాపం.. గాలి వచ్చి విరిగిపోయిన మాదిగపల్లోళ్ళ
పరేంది చెట్టు పిలకల్ని వేస్తే వాటిని పెరికి వినోదిద్దామని చూస్తున్నావు ఇది
దుర్మార్గం కాదా? వాళ్ళు పెంచిన చెట్టు పిలకల్ని ఇరిచేసి.. పెరికేసి మాదిగపల్లి పిలకాయలకు పరేందికాయలు
లేకుండా చేయటం చెడ్డపని కాదా?' తప్పు తెలుసుకున్న కుమారుడు మర్నాడు ఒక
నేరేడుచెట్టు, కొబ్బరి చెట్టు నాటాడు!
సత్కార్యాలతో, అమృతం కురిపించే వాక్కులతో ప్రతిరోజునీ ఒక మధురస్మృతిగా మార్చే మంచి తండ్రి ఆయన. రోజూ చేయగల, మధురస్మృతులు మిగిల్చే వందలాది సత్కార్యాలకి, కానీ ఖర్చు లేని గొప్ప పనులకి ఆయన
చెప్పిన ఉదాహరణలు కోకొల్లలు.
ఆవు గంగడొలును అరచేత్తో దువ్వు!
ఎదురింటి పిల్లాణ్ణి ఎత్తుకుని ఎగరేసి
ముద్దాడు!
గాటికాడ ఉన్న ఎద్దు నోటికి
పచ్చిగడ్డిని అందించు!
మంచిపద్యం నేర్చుకుని అప్పచెప్పు!
పిచ్చిక్కి బియ్యపునూక వెయ్యి!
పక్కింటి ముసలవ్వ చేతినుంచి
చేంతాడందుకుని నీళ్ళు తోడిపెట్టు!
పిల్లికి పాలూ కూడూ పెట్టు!
నాయనమ్మ చేతుల్ని చెంపకు ఆనించుకుని
తృప్తిపొందు!
మొక్క నాటి పెంచు!
పుస్తకానికి అట్ట వేసుకో!
వానొచ్చినప్పుడు మట్టి వాసనను రుచి
చూడు!
అరచేతిలో సంగటిముద్దేసుకుని గుంతలో
ఊరుబిండి పెట్టుకుని కూలీల మధ్య కూర్చుని తిను!
కానగాకుతో పీక చేసి ఊదు!
సంక్రాంతికి ఎద్దుకొమ్ములు జివిరి
రంగులేసి కొమ్ములకు ఊపిరిబుడ్డలు కట్టు!
చెరువు కొళ్ళబోయే రోజు పిలకాయల్తో
కలిసి చేపలు పట్టు!
కపిల తోలేటప్పుడు జిళ్ళ వెయ్యి!
చెట్టెక్కి చింతచిగురు కొయ్యి!
ఇసక నారవలో చెలమ తీసి వొంగి నోరు
పెట్టి ఆ నీళ్ళు తాగు!
మంచిపని ఎవరు చేసినా అదేపనిగా
ప్రశంసించు!
పెద్దలను గౌరవించు!'
మంచిగా జీవించటానికి, మంచితనం
పెంచటానికి కృషిచేసిన ఎవరికయినా
చేయెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అందుకే ఈసారి 'తండ్రుల పండుగ' కోసంగాను సేకరించింది ఈ వ్యాసం.
'తెలుగు పద్యం నిన్ను సమూహం నుంచి వేరుచేసి సింహాసనం మీద కూర్చోబెడుతుంది' అని చెప్పి పద్యం మీద అభిమానాన్ని, ఆసక్తిని, అనురక్తిని కలిగించి, రగిలించి పద్యాలు కంఠస్థం చేయించిన 'నాన్న' జ్ఙాపకంగా, ఇప్పటి బడిపిల్లలకీ, యువతకీ కానుకగా ఇవ్వాలని ఒక కొడుకు తెచ్చిన పుస్తకాన్ని గురించి ఈ సారి ‘నాన్న పండుగ ‘సందర్భంగా ఒక చిన్న వ్యాసం. అప్పుడెప్పుడో జంపాల చౌదరిగారు పుస్తకం.నెట్ లో చేసిన పరామర్శ ఈ వ్యాసానికి ఆధారం.
పుస్తక రచయిత శ్రీ కోట పురుషోత్తముడికి, జంపాల చౌదరిగారికి ధన్యవాదాలతో!
(పుస్తకం.నెట్ సౌజన్యంతో)
-కర్లపాలెం హనుమంతరావు
16 -06 -2018.
ఫుట్ నోట్ః
పురుషోత్తంగారు
విద్యార్థి దశలో ఏఐఎస్సెఫ్‌లో కార్యకర్త. ఉండి, పదేళ్ళు ఆర్థికశాస్త్రం
ఉపన్యాసకునిగా పనిచేసారు. తెలుగుభాషోద్యమంపట్ల ఆకర్షితులయి. తిరుపతి తెలుగు
భాషోద్యమ సమితిలో కార్యవర్గ సభ్యులయారు. వారి నాన్న స్ఫూర్తిగా ఆయన సేకరించిన
పిడికెడు మంచి పద్యాలతో ఈ పుస్తకాన్ని ప్రచురించి వీలైనంతమంది పిల్లల చేతుల్లోకి
చేర్చేమ్దుకు ప్రయత్నించారు.
మహాభారతం
నుంచి, నవీన నానీల వరకు, ప్రసిద్ధమైన
తెలుగు పద్యాలు, గీతాలు పుస్తకంలో కనిపిస్తాయి. తెలుగు భాష, తెలుగు నేలను
ప్రస్తుతించేవి, ప్రబోధాత్మకంగా ఉండే
సుభాషితాలు, ఇతరత్రా ప్రసిద్ధి చెందిన తెలుగు పద్యాలతో పుస్తకం నిండి ఉంటుంది.
ఒక్క నన్నయే కాదు.. నవీన ఉద్యమ కవి కత్తి పద్మారావుగారి రచనలూ కంటబడటం ఆశ్చర్యం
కలిగించే విషయం. కనిపిస్తారు. పుస్తకం చిన్నదే.. అయినా భద్రంగా దాచుకోదగ్గ
పెన్నిధి.
2006లో ప్రచురింపబడి, రెండు ముద్రణలు పొంది. రెండవ వెయ్యికి పైగా ప్రతులు
చెల్లిపోయాయంటేనే.. అయ్య బాబోయ్! అనిపిస్తుంది చదువరులు క్రమంగా తగ్గిపోతున్నారన్న
భ్రమలో ఉన్న మనకు!.
ఏమైనా
ఉత్తముడైన ఒక తండ్రికి కుమారుడు ప్రేమగా సమర్పించిన ఈ గొప్ప నివాళిని
'తండ్రుల పండుగ' రోజున స్మరించుకోవడం ఉత్తమ సాహిత్యసేవ అనిపింది.