Thursday, June 18, 2015

ఇదేనా కవిత్వమంటే?!- సాహిత్య గల్పికః



కరవీర కుసుమము, గులాబీ పువ్వు కళ్ళు తెరిచేదాకా దాదాపు ఒకే రూపు. మొగ్గలుగా ఉన్నప్పుడు మాత్రం ఒకటి గుడి, ఒకటి గోపురం. వీటి మూల రహస్యం ఏమిటో తేల్చుకుందామని కాచుక్కూచుంటే.. ఎపుడో ఒక నిశ్శబ్ద గడియలో రససెల్లానుంచి తొంగిచూసే  ముగ్ధవధువులా మిసమిసలాడుతూ ప్రఫుల్లనేత్రాంచలాలను  రెపరెపలాడిస్తాయి. సృజన జన్మరహస్యం మాత్రం అంతుచిక్కదు!

దారిన పోతోంటే కాలికి ముల్లు గుచ్చుకోవచ్చు. అపురూప సౌందర్యరాసి సందర్సనసౌభాగ్యమూ లభ్యమవచ్చు. విడివిడిగా రెండు విరుద్ధ సంఘటనలే! కాని సమన్వయించుకునే సామర్థ్యముంటే అవే ఓ అభిజ్ఞాన శాకుంతలాంకురాలు. సమన్వయశక్తికి పాదు ఎక్కడో తెలియదు!

పట్టుబట్టి ఎప్పుడో  కలం, కాగితాలు పట్టుక్కూర్చుంటే బుర్ర బద్దలవడం మినహా ఫలితం సున్న. పదాలనాశ్రయించీ, పాదాలను దిద్దీ, పర్వతం ప్రసవించినట్లు  పోగేసినా ఆ మాటలకుప్ప కవిత్వమనిపించుకోదు.  శ్రీరస్తు నుంచి శుభమస్తు దాకా సమస్త  శ్రీమదాంధ్ర మహాభాగవతాన్ని మహానుభావుడు  బమ్మెర పోతనామాత్య్డుడు  ఒక్క ఉదుటనే పద్యాలబండిలా  తోలుకెళ్ళాడన్నా నమ్మలేం. 
కావ్యాలేమన్నా శాసనాలాకాళిదాసు కుమారసంభవమేంటి.. ఆఖరుకి  సాక్షాత్తు ఆ శ్రీశంకరభగవత్పాదుల సౌందర్యలహరైనా సరే .. ఒక్కబిగినే 'ఇతిసమాప్తః' దాకా సంపూర్ణమవడం అసంభవం. ఒకవాక్యం ఒక్కసారే అతకదు. అర్థం ఒకసారే పొదగదు. భావం ఒకేసారి పొసగదు. సృజన- భావుకత స్థాయిభేదమా? దానికదే ఓ అంతిమ ఆత్మస్వరూపమా? ఉఛ్చరణమొదలు అంతిమభావపర్యంతం సర్వజీవశక్తులూ విభావాదుల్లా వివిదౌపచారికలు నిర్వహిస్తేనే కదా ఏ రసభావానికైనా ఓ అంతిమస్థాయి! అంతిమం సరే.. రసం  అసలు
ఆదికొస ఏదో  అంతుబట్టదు!  అది కదా అబ్బురం!


ఓ  కొబ్బరి చెట్టు. దాని వంపుకి సొంపు అమరేటట్లు వాలిన శాఖకు వరసగా తోరణాలు కట్టినట్లు ఆకులు.
వాటిమీద ఉదయభానుడి నునులేతకిరణాలు పడి కోమలమలయసమీర స్పర్శలకి ఒకటొకటే మృదువుగా  కదలాడుతోంటే  'తరుణాంగుళీచ్చాయ దంతపుసరికట్టు లింగిలీకపు వింత రంగులీనింది' అన్న భావాక్షర వీణాతంత్రి సాక్షాత్కరమవడం లేదూ!
శరద్రాతుల్లోఐతే గోపాలకృష్ణయ్య ఎక్కడో నక్కి వేణుదండంమీద గర్భకేతకీ దళంవంటి వెన్నెల వేళ్ళతో చాలనం చేస్తున్నట్లు ఓ సమ్మోహనోహ మనసును ఊయలలూగిస్తుంది . అక్కడితో  ఆగితే మంచిదే!  అవ్యక్తంగా ఆ
వేణుస్వరాలు మన కర్ణద్వయంలో నర్తించుతో గుండెలకు రెక్కలు తొడిగి ఏ గాంధర్వలోకాలకో ఎగరేసుకు పోవచ్చు. ఏ వరూధినో రత్నసానువుకోన భోగమంటపాన కనిపించి వాస్తవలోకాలకు దారే తోచనీయకుండా మీదమీద కమ్ముకొచ్చేయవచ్చు. మళ్ళీ కాళ్లు నేలకాని నిట్టూర్పుసెగలు చురుక్కుమనిపించేవరకూ సాగే ఆ భావాంబర విలాసవిహారం పేరేమిటో? నింగిని వదిలి నేలకు దిగిందాకా మనసున సాగే ఆ ఊహావిహంగ యానమంతా కవిత్వమేనా పాకం పడితే? మరైతే ఆ  పాకం పండేది ఎలా? ఆ అనుపాకం సమపాళ్ళు ఆరంభంలో  తెలిసింది ఏ పుంభావ సరస్వతికో?
 
చెరువు గట్టు కెళ్ళి కూర్చున్నామనుకోండి సరదాగా ఓ అందమైన సాయంకాలంపూట మిత్రబృందమంతా కలసి.  ప్రోషించబడ్డ  నాగసంతానమంతా సర్పయాగంలో ఆహుతి నిమిత్తం తరలిపోతున్నభ్రాంతి కలిగిస్తుంది మన వైపుకే వురికురికి వచ్చే అలలసందోహం! అవేతరంగాలు మరోమిత్రుడి కంటికి పరుగుపందెంలో గెలుపు కోసం ఉరకలెత్తే  చురుకు కురంగాలు అనిపించవచ్చు. ఇంకో నేస్తానికి దోస్తులంతా కలసిచేసే జలవినోదంలా తోచవచ్చు.
నాచన సోమన- 'హరివంశం' సత్యభామ హరికంటికొక రకంగా.. అరి కంటికింకో తీరుగా తోపించినట్లు..  ఒక్కవస్తువు సందర్శనంలోనే ఎన్ని భావభేదాలో!  కవి అయిన వాడికైతే గుండెల్లో బొండుమల్లెలచెండు వాసనలు గుబాళించిపోవూ!  చేతిలో రాతసాధనం లేనంత మాత్రాన ఊహలో పొంగులెత్తే రసగంగప్రవాహం భంగపడుతుందా?

మదిలో 'మా నిషాద' శ్లోకభావం కదలాడినప్పుడు  వాల్మీకికవి హస్తాన ఏ గంటముందంట?  'మాణిక్య వీణా ముపులాలయంతీ' అంటో  కాళిదాసు గళాన అలా  ఆశుకవితాజల సెలయేరులా   గలగలా పారినవేళా లేఖినేదీ   దాపునున్న దాఖలాల్లేవే!  పైసాపైసా కూడబెట్టే లుభ్ధుడికిమల్లే రసలుబ్ధుడైన కవీ రసాదికాలకు
ఆదిమూలమైన భావదినుసులను ఏ హృదయపేటికలో  పదిలపరుస్తాడోప్రయోగించే సందర్బరహస్యాన్ని ఎలా పసిగట్టగలడో?!

అలాగని ప్రతీమనిషీ ఇలాకనిపించిన ప్రతీదానిలోనల్లా  కవితామతల్లినేదో  భావించుకొని ఆమె రూపురేఖాదులను అల్లిబిల్లిగా అల్లుకుని పోతానంటే  'అనంతా వై వేదాః' అన్నట్లు ఈ పాటికీ ఈ భూమండలమంతా కవిలకట్టల్తో నిండి ఏడుసముద్రాలూ పూడిపోయుండేవి కావూ! ఆ దస్తరాల్లో చిక్కడిపోయే దుస్తరం తప్పింది. ఆనందమేనంటారా
మరి మిణుగురులా తటాల్మని తట్టి, సీతాకోకచిలుకమల్లే  మనోభావం చటుక్కుమని ఎటో ఎగిరిపోతేనో?   గుప్పెటపట్టి గూట్లోపెట్టే సాధనమంటూ ఏదో ఒకటుండటమూ అవసరమే కదాగాలిబ్ మహాశయుడికి ఏదైనా ఓ అందమైనభావం మదిలో కదలాడటం మొదలవంగానే  పాటగానో పద్యంగానో గుణించుకుంటో అందుబాటులో ఉన్న దస్తీతోనో.. అంగీఅంచుల పోగుతోనైనాసరే ముచ్చ్టటైన ముడులుగా మలుచుకునే అలవాటు. తీరిక దొరకబుచ్చుకొని మళ్ళా ఆ ముళ్ళను అలాగే విప్పుకుంటో చూచిరాతంత చక్కగా పద్యాలు చెక్కి వుండక పోతే మనకీ రోజుకి ఇన్నేసి చక్కని కైతలపాతర్లు   దక్కివుండేవా?

చింతచెట్టుచిగురు కంటబడంగానే 'చిన్నదాని పొగరు' పాట చటుక్కుమని గుర్తుకొస్తుంది. రెండింటికి సామ్యమేమిటోనల్లటి  బుర్రమీసాల ఆసామి ఎవరన్నా ముదురుపెదాల మరుగునుంచీ బలిష్ఠమైన లంకపొగాకు చుట్టపీకొకటి  లంకించుకుని గుప్పుగుప్పుమని పొగవదుల్తూ కనిపిస్తే రైలుబండే రోడ్డు మీదకొచ్చినట్లు అనిపిస్తుంది ఎంత జడ్డికైనా. అక్షరానికి అందకుండా అగరుధూపంలా అనుభవించి వదిలేసే ఊహావల్లరులను అలా వదిలేసినా.. ఎన్నటికీ అణగిపోని కొన్నిభావమణుల వెలుగుజిలుగులు అంతరంగం అడుగుల్లో మిగిలే ఉంటాయి. తెరవెనక్కి వెళ్లినట్లే వెళ్ళి ఆ దృశ్యమో.. సాదృశ్యమో తటస్థించినప్పుడు సరికొత్త సామ్యాలతో మళ్ళీ మనోయవనిక ముందు మెరుస్తుంటాయి! ఎందుకని అలా?!


కుసుమశరుడిలాగా భావసుందరీ మనసిజే. ఒక్కరుద్రుడికే మన్మథుడు దద్దరిల్లాడు. కాని ఏకాదశ రుద్రులెదురైనా భావసుందరి సిగకొసనయినా  కదలించలేరు. ఏ బంగారిమామ బెంగపడ్డాఏ బిచ్చగత్తె వొరుగులాంటి వడలిపోయిన కాయంతో చింపిరి తలా, చిరుగువలువల్తో నడవలేక నడుస్తూ వీధివాకిట్లో నిలబడ్డా,    మరకతాలు పరచినట్లున్న పచ్చని ఆకుమళ్ళ  గట్లమీద చేరి అన్నంమూటలు విప్పుకుంటో వర్షాభావంవల్ల వాలుమొహాలు వేసుకొన్న వరినారునుచూసి అన్నదాత కళ్ళు చెమ్మగిల్లినా,   నురుగులుకక్కే దేహంతో కష్టాలకావిళ్ళు మోసే కూలన్న మెలిబడ్డ నొసటిరేఖ కంటబడ్డా, ఎక్కడో దూరంగా ఉన్నప్రేయసి చూపులో  చూపుంచి ఆలపించే  అతిసుందర నిశ్శబ్ద మంద్ర కాకలీ స్వరం చెవిన బడ్డా, తళుక్కుమని మెరుస్తుందే మానసాంబరవీధిన భావతారాతోరణం!. ఏ సూత్రం ఆధారమో ఈ వింత పులకింతధారలకు?

కవిత్వమంటే ఇన్నిసాధక బాధకాలా
మబ్బుకు దివిటీపట్టే మెరుపువిద్యంటారే మరి దీన్ని  విజ్ఞులు?!  చూసిన చిత్రం.. చేసిన భావం మాటల్లోనో మనసుల్లోనో భద్రంచేసి,  సమయంచూసి సూటిగా  లక్ష్యాన్ని చేదించటమంటే మరి మాటలాకలానికి కాలానికి కట్టుబడి ఎలా ఉంటుందీ తత్వం? అలుగులు పారే సజీవకళతో ఉరకలెత్తే నిత్యచైతన్య  ప్రవాహోత్శి కదా కవిత్వం!  'నదీనాం సాగరో గతిః' చందంగా పొర్లుకునివచ్చే  భావవాహినికి ఆనకట్టలు కట్టి పంటకాలువలు తీసి పూలు, పండ్లు పెంచి లోకానికి  ఆ జీవప్రసాదాన్ని పంచే వనమాలి కదూ కవి!  ఉఛ్చృంబలంగా సాగే  జీవప్రవాహం  ఏ కొండో, బండో అడ్డగిస్తే.. వెనక్కి మళ్లటమూ,  ఉబికుబికి ముందుకు ఉరకటమూ,  ఏ లోయో పల్లమో సంప్రాప్తిస్తే.. హడిలి అంతెత్తు పై నుంచీ మోతలుపెట్టుకుంటో పాటుగా దూకిపడి  ముందుకు సాగటమో.. ఏ వంపో, ముంపో తగిలినప్పుడు  తలప్రాణం తోకకొచ్చినట్లు  సుళ్ళుతిరిగి ఊగటమో!
కవిత్వతత్వమూ అదేనేమో! అదే!


కవి జీవనయానంలో  అందమైన విఘాతాలు అప్పటికైతే విస్మృతిలోకి వెళ్ళిపోయినా.. మనసు అడుగు పొరల్లోనే ఎక్కడో పడుకుని ఉంటాయి. వాస్తవజీవితం ఏ కష్టంతోనో, ఇష్టంతోనో ముష్టియుద్దానికో, ముద్దులాటకో సిద్దమైన క్షణంలో.. పునరుత్తేజితమై జీవం పోసుకొని తెరముందుకు ఉరికి వచ్చేస్తుంటాయి.
అలా రావడమే అసలు సిసలు  కవిత్వతత్వ రహస్యమేమో!
మరి రససిద్ధులైన పెద్దలేమంటారో.. ఏమో!
-కర్లపాలెం హనుమంత రావు
 వాకిలి- అంతర్జాల పత్రిక- మే 2013లో ప్రచురితం




Wednesday, June 17, 2015

వేలం పాట- కథానిక



'యువర్ అటెంక్షన్ ప్లీజ్!'
జబర్దస్తీగా వినిపిస్తున్న ఆ గొంతుతో అప్పటివరకూ రకరకాల కబుర్లతో గందరగోళంగా ఉన్న సెకండ్ క్లాసు బోగీ కొద్దిగా సద్దుమణిగింది.
'లేడీస్ అండ్ జంటిల్మెన్!.. భాయియో ఔర్ బెహనో!.. అయ్యలారా అమ్మలారా!...'
మూడు భాషల్లోనూ ముచ్చటగా సంబోధిస్తున్న  మూడు పదులు నిండని ఆ యువకుడు చూపులకూ ముచ్చటగా ఉన్నాడు.
అప్పుడే ఐరన్ చేసి వేసుకున్నట్లున్న కాస్ట్లీ డ్రెస్, చెదరని హిప్పీ క్రాఫు, చిరుగడ్డం. చిరునవ్వుతో  పాఠంలా గడగడా చెప్పుకుపోతున్న అతని మాటల్ని ఎంత వద్దనుకున్నా వినకుండా ఉండలేక పోయాను.
'.. ఇది మా కంపెనీ ప్రచారంకోసం .. సేల్స్ ప్రమోషన్ కోసం పెట్టిన పథకం. ఇక్కడున్న ఈ డ్రెస్ మెటీరియల్లో ఒక్కో ఐటమ్ నే పాటకు పెడతాను. టెరీకాట్.. పాలిస్టర్..  ఊలెన్.. జపాన్.. అమెరికన్.. స్విట్జర్లాండ్.. ఎక్స్ పోర్టెడ్ బ్రాండ్స్.. ప్యాంటు పీసులు.. షర్టు పీసులు.. సూట్ మెటీరియల్.. మీటరు.. మీటరున్నర.. టూ మీటర్స్.. టూ అండ్ హాఫ్ మీటర్స్..  ఇప్పుడు ఆక్షన్లో పాడుకున్న అదృష్టవంతులకు దక్కుతాయి. ఇందులో మోసం.. దగా..  మాయా.. మిస్టరీ.. ఏవీ లేవు సార్! కంపెనీ ప్రచారంకోసం చేపట్టిన సేల్సు ప్రమోషన్ స్కీములు మాత్రమే ఇవన్నీ. అతి తక్కువ ధరలో అతిమన్నికైన బట్టలను వేలంపాటలో పాడి సొంతం చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏమీ లేదు. మోసం అసలే లేదు. ఆక్షన్లో ఎవరైనా పాల్గోవచ్చు. ఐతే రెడీక్యాష్ ఉండాలి. అదొక్కటె కండిషన్. పాడినవారందరికీ కంపెనీ తరుఫున ఏదో ఒక గిఫ్టు. బాల్ పెన్.. దువ్వెన.. సెంట్ బాటిలు.. సెల్ ఫోన్ కవరు.. నెయిల్ కట్టరు.. కంపెనీ కాంప్లిమెంటరీకింద ఉచితంగా ఇవ్వబడుతుంది…'
ఉచితం అనే మాట చెవినబడేసరికి చాలామంది దృష్టి ఇటు మళ్ళింది.
అనుమానం వదలని ఓ నడివయసాయన 'గుడ్డలు మంచివేనా?' అని సందేహం వెలిబుచ్చాడు.
'బాబాయిగారు మంచి ప్రశ్న వేసారు. మంచిరకం బట్టల్ని ఇలా ఊరూ వాడా తిప్పుకుంటూ అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మీలోనూ చాలామందికి అనుమానాలుండొచ్చు. లేడీస్ అండ్ జెంటిల్మెన్! ఇది లిపారియా మిల్సువారి తయారీ సరుకు. కేవలం ప్రచారంకోసం కమీషను పద్ధతిమీద ఇలా మేము అమ్ముతుంటాం. అంతేగానీ సరుకు నాసిరకం అయికాదు. ఒక్క సారి మీరే మీ కళ్ళతో చూడండి. కంపెనీ లేబుల్సుని పరీక్షించుకోండి. బజారులో దొరికే రేట్లతో కంపేరు కూడా చేసుకోవచ్చు…'
అంటూ ఆ వేలంపాట కుర్రాడు లైట్ బ్లూ కలర్ టెరీన్ షర్టు పీసు మడతలు విప్పి ప్రశ్న అడిగిన నడివయసు పెద్దాయన ఒళ్లో పరిచాడు.
పక్కనున్న జనం దాన్ని పరీక్షించడం మొదలుపెట్టారు. వేలంపాట కుర్రాడు పాట మొదలు పెట్టాడు.
'బాబాయిగారి వళ్ళో ఉన్న ఈ లైట్ బ్లూ కలర్ టెరీన్ షర్టు పీసు.. రెండు మీటర్లు.. కంపెనీవారి పాట యాభై రూపాయలు.. పచాస్ రూపయా.. ఫిఫ్టీ రూపీస్  ఓన్లీ..'
' ఫిఫ్టి ఫైవ్..' అన్నాడు విండో పక్కన కూర్చొన్నబట్టతల పెద్దమనిషి.
ఎటువైపునుంచి బదులు రాలేదు.
' ఫిఫ్టీ ఫైవ్.. యాభై ఐదు.. పచ్ పన్.. అమెరికన్ ఎక్స్ పోర్టెడ్.. టెరీన్.. షర్టు పీసు.. టూ మీటర్సు.. ఫర్.. ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ. ఇదే బట్ట  చీరాల గాంధీ క్లాత్ మార్కెట్లో టూ హండ్రెడ్ పెట్టినా దొరకదండి బాబులూ! అదృష్టవంతులు అవకాశం జార విడుచుకోవద్దు. పాటలో పాల్గొంటే పోయేదేమీ లేదు. వస్తే మంచి సరుకు. రాకపోయినా కంపెనీవారి కాంప్లిమెంటు.. దువ్వెన'
' ఫిఫ్టీ ఫైవ్.. ఒకటో సారి. ఫిఫ్టీ ఫైవ్.. రెండోసారి…'
బోగీలో అదే నిశ్శబ్దం!
'యభై ఐదుకి గిట్టుబాటు కాదు కాబట్టి కొట్టి పారేస్తున్నాం. పాడినందుకు  పాతిక రూపాయలు ఖరీదు చేసే దువ్వెన తాతగారికి కంపెనీ తరుఫునుంచి  కానుకగా ఇస్తున్నాం' అంటూ బట్టను వెనక్కి తీసుకుని ఒక దువ్వెన విండో పక్కనున్న బట్టతల పెద్దమనిషిమీదకు విసిరేసాడా  వేలంపాట కుర్రాడు.
బట్టతల మనిషి చేతికి నిజంగానే ఉచితంగా దువ్వెన వచ్చేసరికి కంపార్టుమెంటులో చాలామందికి హుషారు పెరిగినట్లుంది.  'జపాను బ్రాండు టెరీ కాటన్ షర్టింగు.. టూ అండ్ హాఫ్ మీటర్సు గులాబీ రంగు పీసు .. కంపెనీవారి పాట అరవై రూపాయలు. సిక్స్టీ రూపీస్.. సాఠ్ రుపయ్యే.. కేవలం అరవై రూపాయలు మాత్రమే..' అంటూ బట్టను గాలిలో ఎగరేసి ఎదురుగా ఉన్న కుర్రాడి భుజంమీద వేసాడో లేదో.. పరిశీలించడానికి పదిమందిదాకా అతగాడి చుట్టూ గుమికూడారు.
'ఓపెన్ మార్కెట్లో ఈ షర్టు పీసుడొందలకు తక్కువ గిట్టుబాటుకాదండీ సార్! కంపెనీవారి పాట సిక్స్టీ ఓన్లీ. అదృష్టవంతులు ఈ సారైనా అవకాశం జారవిడుచుకోవద్దు. పాడిన వాళ్ళందరికీ బాల్ పెన్ ఉచితం. సిక్స్టీ రూపీస్.. ఒకటో సారి.. సిక్స్టీ రూపీస్..'
పాట ఈ సారీ మందగొడిగా సాగినా పది నిమిషాల తరువాత యెనభై రూపాయలకో షావుకారుకు అనుకూలంగా కొట్టి వేయబడింది. పాడిన నలుగురు మనుషులకూ తలా ఓ బాల్ పెన్నుఉచితంగా దక్కింది.
'మాష్టారూ! ఈ రకం వ్యాపారంలో మాయేమీ లేదంటారా?' అని అడిగాడు అప్పటిదాకా  హిందూ పేపరు మొహానికి అడ్డం పెట్టుకుని తనకేమీ పట్టనట్లు కూర్చోనున్న నా పక్క పాసింజరు.
అతనేమో సూటూ బూటలటులో చూపులకే  దర్జాగా దొరబాబులా ఉన్నాడు. అంతమంది మధ్యలో నన్నే ఎన్నిక చేసినట్లు అడగడంతో కాస్తంత గర్వంగా అనిపించిన మాట వాస్తవం.
'ఏ మాయా మర్మం లేకుండా ఎందుకుంటుందండీ? ఏదో మతలబు లేకపోతే ఇంతింత ఖరీదుచేసే సరుకు ఇంత కారుచవుకగా ఎలా గిడుతుందండీ? కంపెనీ ప్రచారం.. సేల్స్ ప్రమోషన్.. అంతా ట్రాష్!' అన్నాను.
'అసలు సరుకెంత నాణ్యమో ఇంటికెళ్ళి దర్జీవాడికి చూపిస్తేగాని బండారం బైటపడదు!' అనేసాడు నాకిటువైపుగా కూర్చోనున్న మరో ప్రయాణీకుడు.
'నో.. సార్! నేనూ మీకులాగే అనుకునేవాడిని మొదట్లో! ఈ కోటు ఉంది చూసారూ! ఇలాగే ఇదివరకు బెనారస్ వెళ్ళినప్పుడు బండిలో వేలంపాటలో పాడి గెల్చిన బట్టతో కుట్టించిందే. నలభై రూపాయలకనుకుంటా  పాడింది. నాలుగేళ్ళయింది .. సరిగ్గా గుర్తు లేదు' అంటూ కౌంటరు ఆర్గ్యుమెంటుకు దిగాడిందాకటి సూటు మనిషి. అతగాడంత గట్టిగా బల్లగుద్దినట్లు తన ప్రత్యక్షానుభవం చెబుతుంటే   కాదనటానికి ఇంకెవరి దగ్గర మాత్రం మాటలేం మిగిలుంటాయి!'
'ఇహ బట్టల నాణ్యతంటారా! మాదిక్కడి తెనాలి దగ్గర రేపల్లే. ఏళ్ళ తరబడి చేసున్నామీ క్లాత్ బిజినెస్! ఆ  విండో బాబాయిగారి దగ్గరున్న క్లాతు ఎంతలేదన్నా మీటరు నూటేభైకి తక్కువుండదు ఓపెన్ మార్కెట్లో'. మరి ఇట్లా వేలంపాటలో అంత కారు చవగ్గా ఇచ్చేయడంలో మతలబేంటో మాత్రం అంతుబట్టటం లేదు.'
ఈ సారి పాటలో ఆ సూటు పెద్దమనిషే స్వయంగా  చైనా మోడల్ సిల్కు క్లాత్ గ్రే కలర్ ది పాటను నూటపాతికదాకా పెంచి మరీ సొంతం చేసుకున్నాడు. వస్తువు తీసుకునే సమయంలో అతగాడు వేలంపాట కుర్రాడితో ఆడుకున్న వైనం చూసిన తరువాత ఇంకెవ్వరికీ  ఏ ఐటమ్స్ మీదగాని.. వాటి రేట్ల విషయంలోగాని  అనుమానాలుం డక్కర్లేదనిపించింది. 
'సార్! మీలాంటోళ్ళు వెయ్యికి ఒక్కరున్నా చాలు.. మా వ్యాపారం చంకనాకి పోవాల్సిందే! కంపెనీ సరుకు. పరువుతో ముడిపడింది. ఒకసారి దిగింతరువాత  వెనక్కి తగ్గడం కుదరదు కనక సరిపోయింది. అదే నా పర్సనల్ బిజినెస్సయితేనా! అమ్మో!  సరుకు మొత్తం ఎత్తుకుని ఎప్పుడో ఉడాయించుండే వాణ్ణి' అంటూ  మొత్తుకుంటూనే  తన సామాను సర్దుకోసాగాడు.
 జాండ్రపేటలో ఆగటానికి కాబోలు బండి బాగా స్లో అవుతుండంగా  అడిగాడా సూటువాలా 'నీకీ వ్యాపారంలో ఏ మాత్రం కమీషను గిడుతుందోయ్?'
'గిట్టడం కాదండీ! చెప్పాగా! ఇది కమీషను వ్యాపారం. లిపారియా మిల్సు వాళ్ళకి ఏజెంట్లం మేం. సేల్స్ ప్రమోషను చేసే దాన్ని బట్టి ఉంటుందీ గిట్టుబాటెంతనేదీ' అని వేలంపాట కుర్రాడి సమాధానం.
'కమీషనెంతో?'
'ట్వంటీ టు ట్వంటీ ఫైవు మధ్యలో ఉంటుందండీ! సరుకును బట్టి రేటు'
'బాగా గిడుతుందా?'
'జనరల్ గా బాగానే ఉంటుందండీ! ఒక్కో చోటే.. ఇదిగో..ఇలా డల్ గా ఏడుస్తుంటుంది ..' అంటూ సరుకును ఎత్తుకోబోతున్న కుర్రాడిని నా ఎదురుగా కూర్చున్న ఆడమనిషి  ఆపేసింది 'డల్ గా ఉందంటావు. తట్ట పట్టుకుని వెళ్లి పోతావు. ఈ సారు చెప్పింతరువాత నాకు నమ్మకం కుదిరింది. ఆ పాలిస్టర్ బట్ట పాటకు పెట్టబ్బాయ్!.. మా పిలగాడికి ఎప్పట్నుంచో తీసుకుందామనుకుంటున్నా" అని మొదలు పెట్టింది.
మిగతా ప్యాసింజరర్సూ ఆమెకి వంత పాడడంతో వేలంపాట కుర్రాడికి మళ్ళీ తట్ట కిందకు దింపక తప్పింది కాదు. కానీ ఈ సారి సీను పూర్తిగా రివర్సుగా ఉంది.  ఆడమనిషి కోరుకున్న పాలిష్టరు పీసు రెండొందలకు పాడినా ఆమె సొంతం కాలేదు. పై బెర్తుమీద పడుకోనున్న కుర్రాడెవడో ఇంకో పది రూపాయల్ పై పాట పాడి సొంతం చేసుకున్నాడు.
మొదట్నుంచీ తనకేమీ పట్టనట్లు ఓ మూల పుస్తకం చదువుకంటూ కూర్చోనున్న పాపక్కూడా కిక్కొచ్చినట్లంది.. వాయిల్ క్లాత్ కోసం పోటీపడి మరీ నూటేభైకి దక్కించుకుంది.
కంపార్టుమెంట్లో మూడో వంతు మంది ఏదో ఒక ఐటమ్ చిన్నదో పొన్నదో వేలంపాటలో దక్కించుకున్న వాళ్లే. మిగిలిన వాళ్ల చేతులో కంపెనీ తాలూకు  కాంప్లిమెంటరీలు!
ఎన్నడూ లేనిది నేనే మూడు కాంప్లెమంటరీ గిఫ్టులు.. మా పిల్లదానికని ఓ మంచిరకం ఓణీ బట్ట తీసుకంటేనూ!
వేలంపాటలో సాధించిన వస్తువులు క్యారీబ్యాగులో సర్దుకంటుండంగా బండి చినగంజాం ఫ్లాట్ ఫారంమీదకొచ్చి ఆగింది.  చిన్ననాటి మిత్రుడు మౌళి అనుకోకుండా కనిపించడంతో వాడితో బాతాఖానీలో పడి బెల్ ఎప్పుడు మోగిందో కూడా గమనించలేదు. కదిలే బండిలో హడావుడిగా ఎక్కాల్సి రావడంటో ఎక్కిన బోగీ కూడా ఏదో పట్టించుకోలేదు.
అది ఇందాకటి కంపార్టుమెంటు కాదు. కానీ ఎలాగో ఓ మూల సీటైతే దక్కించుకోగలిగాను.
బండి స్పీడందుకుంది. అమ్మనబ్రోలు  స్టేషను దాటేసరికి కబుర్లలో ఉన్న కంపార్టుమెంటు ఖంగుమంటున్న గొంతుకి ఉలిక్కిపడి అటెంక్షనులోకొచ్చేసింది.

'యువర్ అటెన్షన్ ప్లీజ్!..'
'లేడీస్ అండ్ జంటిల్మెన్!.. భాయియో ఔర్ బెహనో!.. అయ్యలారా అమ్మలారా!...'
మరో సారి వేలంపాట!
ఈసారి వేలంపాట జరుపుతున్నది మూడుపదులు నిండిన ఆ ముచ్చటైన యువకుడు కాదు. పక్క బోగీలో నా పక్కన కూర్చొని బట్టల నాణ్యతను గురించి లెక్చర్లు దంచి అందరిచేత సరుకుని కొనిపించిన 'ది హిందు' న్యూస్ పేపర్ సూటు జెంటిల్మన్!
అదే హిందూ పేపరు చాటున మొహం దాచుకుని పాట డల్ గా ఉంటే లెక్చర్లు దంచడానికి ఆ మూడు పదుల ముచ్చటైన కుర్రాడు ఇక్కడే ఎక్కడో సుటూ బూటులో నక్కే ఉంటాడు.
ఆగిపోయిన వేలంపాటకు ఓ ఊపివ్వడానికి పిల్లాడికి పాలిష్టరు బిట్టు కొనాలనుకునే మహాతల్లీ
ఇక్కడే తన వంతు అభినయం కోసం ఎదురు చూస్తూండాలి నా అనుమానం నిజమైతే!
-కర్లపాలెం హనుమంతరావు



యూ . ట్యూబ్ ఛానెల్ లో వినదలుచుకున్నవారు ఇక్కడ నొక్కవచ్చు! 














Monday, June 15, 2015

పాముమంత్రం- కథానిక





'రెడ్డి ఆసుపత్రి' ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది. ఆలోచనలు గతంలోకి మళ్ళాయి.
ఇరవైయ్యేళ్ళ కిందటి మాట. అప్పుడు నేను ఇప్పుటి పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా చెరువుపల్లిలో బ్యాంకుమేనేజరుగా పని చేస్తుండేవాణ్ణి.
ఒక రోజు రాములమ్మ అనే ఆడమనిషి లోను కావాలంటూ పాముబుట్టతో సహా బ్యాంకుకొచ్చింది.'దొరగారు ఒక ఐదువేలిప్పిస్తే ఇంకో రెండు పాములు కొనుక్కుని ఆడించుకుంటానయ్యా!' అని ప్రాదేయపడింది.
రూల్సు ప్రకారం పాములు కొనుక్కోవడానికి లోను ఇవ్వడం కుదరదు. పోనీ.. ఇంకేదన్నా వేరే దారిలో సాయం చేద్దామన్నా.. రాములమ్మ పేరున ఇదివరకే తీసుకున్న లోను మొండిబకాయిల్లో ఉంది. 'ముందు పాతబాకీ చెల్లించు! అప్పుడు చూద్దాం' అన్నాను. ఇప్పుడిచ్చే అప్పులోనుంచే ఆ బాకీ చెల్లబెట్టుకోండయ్యా!' అంది గడుసుగా. బైటికి కనిపిస్తున్నంత అమాయకురాలు కాదనిపించింది. రెడ్డిచేత పాముబుట్ట లోపల పెట్టించి 'పాత కిస్తీలు వడ్డీతో సహా చెల్లించి బుట్ట పట్టుకు పో' అని బెదిరించి పంపించేసాను. 'రేపు బాషాను పంపిస్తా! లోనెట్లా ఇవ్వరో చూస్తా!' అని శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయింది రాములమ్మ.
'ఈ బాషా ఎవరు?!'
రెడ్డి చెప్పాడు ' హెడ్ కానిస్టేబులయ్యా! చాలా ఏళ్ళబట్టి ఈడనే ఉండాడు.' రెడ్డి గొంతులో తిరస్కారం.
చెరువుపల్లి చాలా చిన్నవూరు. నీళ్ళూ నిప్పులు సరిగ్గా ఉండవు. ఇక్కడ సర్వీసంటే పనిష్మెంటుకిందే లెక్క. ఏం బావుకుందామని బాషా ఈ ఊరినే అంటిపెట్టుకుని బల్లిలా వేల్లాడ్డం?!' ఆ మాటే అడిగితే రెడ్డినుంచి సరిగ్గా సమాధానం రాలేదు. మాట దాటేయడాన్నిబట్టి 'చెప్పటం ఇష్టం లేదేమోలే' అని వూరుకుండిపోయాను.
తరువాత క్యాషియర్ గుప్తా చెప్పాడు 'బాషా రాములమ్మని వదిలి ఉండలేడులే సార్! ఈ రాములమ్మ ఎవరో కాదు. మన రెడ్డి పెళ్ళామే.. ఇప్పుడాట్టే ఇద్దరికీ పొసగడం లేదు కానీ'.
నోరు వెళ్ళబెట్టడం నా వంతయింది. పాముబుట్ట లోపల పెడుతున్నప్పుడు చూడాలి.. రెడ్డి, రాములమ్మల మధ్య జరిగిన యుద్ధం. విడిపోయిన మొగుడూ పెళ్ళాలుతప్ప మరొకరు అంత ఘోరంగా కొట్లాడుకోరు.
బాషాని గురించి ఇంకొన్ని వివరాలు చెప్పాడు గుప్తా. 'బాషాకి ఇట్లాంటి యవ్వారాలు చాలానే ఉన్నాయి సార్ ఈ చుట్టు పక్కల ఊళ్ళలో! షాపుల్లో సరుకులు కొని డబ్బులు చెల్లించడు. హోటల్లో భోజనంచేసి బిల్లు కట్టడు. డబ్బడిగినవాళ్ళను ఏదో కేసులో ఇరికించి స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తాడు. ఎస్సైకూడా ఈయనెంతంటే అంతే. ‘ఎందుకొచ్చిన గొడవలే’ అని ఎవరూ ఈయన జోలికి వెళ్లరందుకే. మన రెడ్డి బాధా అదే!' అన్నాడు.
'పైవాళ్ళ కెవరికన్నా కంప్లైంట్ చేసి ఉండాల్సింది' అన్నాను.
''అదీ అయింది సార్! ఊళ్ళో రెండు గ్రూపులు. ప్రెసిడెంటుది. మాజీ ప్రెసిడెంటుది. ఒకళ్ళు ఎడ్డెమంటే.. రెండో వాళ్ళు తెడ్డెమంటారు'
'ఇదేం తిరకాసు? ఒక వంక మంచివాడు కాదంటుంటిరి. మరో వంక ట్రాస్ఫరాపుతుంటిరి!'
నా ఆశ్చర్యాన్ని అర్థంచేసుకున్నట్లుంది.. మరో కొత్త విషయం చెప్పుకొచ్చాడు గుప్తా 'బాషాకు పాముమత్రం వచ్చు సార్! ఎట్లాంటి పాము కొట్టినా వీడు మంత్రమేస్తే విషం విరుగుడై పోతుంది. ఊళ్లో చాలామంది వీడి చలవ్వల్లే లేఛి తిరుగుతున్నారు. ఎస్సై కొడుకుని బళ్ళో కట్లపాము కొడితే.. క్షణాల్లో ఆ విషాన్ని దించేసాడు బాషా. అందుకే ఈ ఎస్సై ఉన్నంత కాలం  ఎవరూ బాషా వెంట్రుక్కూడా కదప లేరు. అది మాత్రం గ్యారంటీ!' అని తేల్చేసాడు గుప్తా.
చెరువుపల్లి రేగడి ప్రాంతం. పొగాకు ప్రధాన పంట. అట్లాంటి చోట పాములు, తేళ్ళు తిరగడం సహజమే. అయితే అన్ని పురుగుల్లోనూ విషముండదు. ఇండియాలో ఉండే రెండువేల రకాల్లో విషంగలవి కేవలం తొమ్మిది జాతులే. విషంలేని పురుగు కుట్టినా మందో మాకో వేసి, చెవులో ఏదో మంత్రం ఊదేసి తగ్గించినట్లు నాటకాలాడే మాయగాళ్లూ మనదగ్గర తక్కువేం లేరు. చదువుకున్నవాళ్లూ అమాయకత్వం వల్లనో.. అజ్ఞానం వల్లనో ఇలాంటి దొంగమంత్రగాళ్లనే నమ్ముకుంటున్నారు! పాముకాటు మరణాల్లో అధికశాతం  కాటువల్ల సంభవిస్తున్నవి కాదు. పాము కాటేసిందన్న షాకువల్ల జరుగుతున్నవి. పాములకు పగ పట్టడం తెలీదనీ, పాలు ఆహారం కాదనీ, వినడానికి చెవుల్లాంటి ఏర్పాట్లేవీ ఉండవనీ చెబితే చదువుకున్నవాళ్ళైనా నమ్మని పరిస్థితి దాపురించివుందీ దేశంలో.

ఎక్కడ దాకానో ఎందుకు? ఇక్కడ ఈ గుప్తా లేడూ! 'ప్రెసిడెంటుని పంచాయితీ ఆఫీసులో పాము కాటేసినప్పుడు బాషా వచ్చి పాంమంత్రంతో లేపి కూర్చోబెట్టాడు సార్!  నా కళ్ళారా చూసాను. దానికేమంటారు?' అంటూ మొండివాదనకు దిగాడు ఈయన. ఏం చేస్తాం?
మర్నాడు బాషా నిజంగానే బ్యాంకు కొచ్చాడు. గుబురు మీసాలు.. బానబొర్ర.. మొహమంతా స్ఫోటకం గుంటలు. మాటా కరుకే. అంతకుముందున్న దురభిప్రాయం మరింత బలపడేటట్లుంది వాలకం. 'రాములమ్మ యాడికీ పోదు. నాదీ గ్యారంటీ. కావాలంటే  సంతకం తీసుకో! లోనుమాత్రం ఇచ్చితీరాలప్పా!'- అదీ అతగాడు అప్పు అడిగే తీరు!
మీ సంతకం కావాలంటే మీ పై వాళ్ళ పర్మిషనుండాలి గదా! ముందది తీసుకురండి. తరువాత చూద్దాం!' అన్నాను.
'అట్లాగా!' అంటూ గుడ్లురుముకుంటూ లేచి నిలబడ్డాడు బాషా. 'ఆడకూతురు పాంబుట్ట ఏ అథార్టీతో లోపల పెట్టుకున్నారప్పా! ముందది బైటకు తియ్యి!' అంటో పోలీసుజులుం ప్రదర్శించబోయాడు. 'బ్యాంకు డబ్బుల్తో కొన్న సరకది. అప్పు తీరిందాకా బ్యాంకుకు అధికారం ఉంటుంది. వాయిదాలు సక్రమంగా లేకపోతే సరుకు బిగపట్టుకునే అధికారం అప్పు తీసుకున్నప్పుడే రాములమ్మ బ్యాంకుకి రాసిచ్చింది. మీ కంత జాలిగా ఉంటే  బకాయిలు చెల్లించి బుట్ట పట్టుకుపోవచ్చు. మీరూ సంతకం చేసారుగదా అప్పుడు! మీకూ బాధ్యత ఉంటంది' అన్నాను. కాస్త వెటకారంకూడా ద్వనించిందేమో నా మాటల్లో.
బాషా కోపంగా బుసలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెనకాలే రాములమ్మ శాపనార్థాలు పెట్టుకుంటూ..
'లోనివ్వడానికి డబ్బుల్లేవనో.. రూల్సు ఒప్పుకోవనో చెప్పచ్చు కదా సార్! వాడసలే మంచోడు కాదు' అని భయపడ్డాడు రెడ్డి.
రెడ్డి భయానికి కారణం లేకపోలేదని తరువాత తెలిసింది. ఇంతకు ముందు మేనేజరుగా చేసిన శర్మ ఇలాగే లోను ఇవ్వనని మొండికేశాట్ట. తరువాత  రెండు రోజులపాటు వరసగా బ్యాంకు ఆవరణలో పాములే పాములు! 'లోనిచ్చి బాషాను చల్లబరిస్తేగానీ 'సర్ప దర్శనం' ఆగింది కాద'ని రెడ్డి చెప్పుకొచ్చాడు.
ఇయర్-ఎండింగ్ పనుల వత్తిడిలో పడి ఆ సంఘటనను అక్కడితో మర్చిపోయాను.
మార్చినెల చివరి వారం. బ్యాంకులో ఉన్నది నేనూ.. రెడ్డీనే! ఆదివారం కనక స్టాఫు ఎవరూ బ్యాంకువైపుకి రాలేదు.  రెగ్యులర్ అటెండర్లు డ్యూటీ ప్రకారమే పని చేస్తారు. రెడ్డిది ప్రొబేషనరీ జాబు. కాబట్టే నాకు తోడుగా బ్యాంకులో ఉంచడానికి వీలయింది.
పని ధ్యాసలో పడి ఎప్పుడు చీకటి పడిందో గమనించనే లేదు. వేసవికాలం. కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో ఎవరమూ చెప్పలేం. నూనె దీపాలు సిద్ధం చేసి పెట్టమని రెడ్డికి పురమాయించి నా పనిలో మునిగిపోయాను.

ఉన్నట్లండి కెవ్వున కేక! రెడ్డిదే ఆ వణికే గొంతు! స్టోరు రూమునుంచి! ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తాను. నురుగులు కక్కుతూ పడివున్నాడు రెడ్డి స్టోర్రూములో! బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. 'ఏమైంది రెడ్డీ?' అనడిగితే వేలితో పాముబుట్టవైపు చూపించాడు. బుట్టమూత సగం తెరిచివుంది! బుట్టలో ఉండాల్సిన రెండు పాములూ లేవు!
గభాలున వంగి రెడ్డి పాదాలవంక చూసాను.  రక్తపు బొట్టు! రెడ్డిని పాము కాటేసిందని అర్థమవడానికి ఆట్టే సమయం పట్టలేదు.
ఏం చేయాలో పాలుపోలేదు. నిజం చెప్పద్దూ! ఆ క్షణంలో నాకు ముందు గుర్తుకొచ్చింది బాషానే! ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. నిజమేగానీ.. ఇరవై కిలోమీటర్ల పైగానే ఉందది ఎక్కడో  ఆత్మకూరులో. బ్యాంకు బైకు రిపేరులో ఉంది. ట్రాక్టర్లాంటిదేమన్నా దొరకాలన్నా సమయం పడుతుంది.
రెడ్డి కండిషన్ చూస్తే నిమిష నిమిషానికీ దిగనాసిల్లిపోతోంది. ఏవైతే అదవుతుందని పోలీస్టేషనుకు ఫోను చేసా. రింగయీ.. రింగయీ.. చివరికో ఆడగొంతు వినిపించింది. నిద్రమత్తులో ఉన్నట్లుంది. ఎక్కడో విన్నట్లే ఉంది ఆ యాస.
ఠక్కుమని గుర్తుకొచ్చింది. రాములమ్మ గొంతు! అంత చీకటివేళ ఆ ఆడమనిషికి స్టేషన్లో  పనేమిటో?! అదీ స్టేషనుకొచ్చే ఇన్-కమింగ్ కాల్సు రిసీవ్ చేసుకునేటంత చొరవా! వెనకనుంచి ఎవరిదో మగగొంతు.. ప్రామ్టింగిస్తున్నట్లు!
విషయం చెప్పి ‘బాషా కావాల’ని అడిగాను గబగబా. 'లేడు. డూటీలో ఉన్నాడు' అని కట్ చేసింది అవతలి మనిషి. మళ్ళీ ఎన్నిసార్లు ప్రయత్నించినా రింగవడమేగానీ.. ఫోన్ ఎత్తలేదు! మనిషెవరన్నా దొరికితే స్టేషనుకు పంపిద్దామని బాంకు బైటికొచ్చాను. క్షణాల్లో బ్యాంకుముందు జనం పోగయ్యారు. తలా ఓ మాట. 'దాహం..దాహం' అని అంగలారుస్తున్నాడు రెడ్డి. ఎవరో నీళ్ళు ఇవ్వబోతే పెద్దశంకరయ్య అడ్డంగొట్టాడు 'పాంకాటు పడ్డోడికి నీళ్ళిస్తే ప్రమాదం. కడుపులోకేదీ పోకూడదు. కంటిరెప్ప కిందికి వాలకూడదు' అంటూ రెడ్డి పక్కనచేరి చెంపలమీద తడుతూ కూర్చొన్నాడా పెద్దాయన.
ఇంతలో బాషా రానే వచ్చాడు. వంటిమీద వట్టి లుంగీ. పైన బనీను. డ్యూటీలో ఉండే మనిషి యూనీఫాం ఇదేనా?! ఏదో ఒకటి. ముందు వచ్చాడు. అదే పది వేలు.
వచ్చీ రాగానే వైద్యం మొదలు పెట్టేసాడు బాషా. సంచీలోనుంచి ఏదో వేరులాంటిది తీసి బలవంతంగా రెడ్డి బుగ్గలో దోపాడు. కాటుపడ్డ చోటికి కాస్తపైన తాడుతో బలంగా కట్టేసి కాల్చిన కత్తితో గాయాన్ని బాగా పెద్దది చేసాడు. రక్తం బొటబొటా కారిపోతుంటే బాధతో రెడ్డి విలవిల్లాడిపోతున్నాడు.
మంత్రించిన పొడిని రెడ్డి పడున్న రూములో వలయంగా చల్లించి 'పురుగులు రెండూ ఈడనే ఏడనో నక్కుంటాయి. వెదకండి కానీ కర్రల్తో కొట్టద్దు. పాములు చస్తే రెడ్డి బతకడు' అంటూ హుకుం జారీ చేసాడు.
ఒక సుశిక్షణ పొందిన వైద్యుడిలాగా బాషా తన పని తాను చేసుకుంటూ పోతుంటే నమ్మబుద్ధి కాలేదు నాకు. 'వట్టి బూటకం అని కొట్టిపారేసే ఈ నాటువైద్యం వెనకకూడా ఇంత పెద్ద తతంగం ఉందా!'అని నా ఆశ్చర్యం. చుట్టూ చేరిన జనాన్ని దూరంగా
జరగమని రెడ్డి చెవులో పాముమంత్రం ఊదడం మొదలుపెట్టాడు బాషా. దగ్గరే ఉన్నాను కనుక నాకు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి '..మహావీర గరుడ.. సమస్త సర్ప.. నివారణా.. దుష్ట..  సర్పబంధన… కురు.. కురు.. ' అని ఇలాగే ఏవో గొణుకుళ్ళు!  ఇంకా ఏవేవో శబ్దాలు రణగొణగా వినిపిస్తున్నాయిగానీ వాటిని గురించి ఆలోచించే స్థితిలో లేను నేను.
ఎక్కడో చదివినట్లు గుర్తు.. పాముమత్రంలో బీజాక్షరాలు ఉండవంట! బాషా ఎంత మంత్ర తంత్రాలతో గింజుకుంటున్నా రెడ్డిమీద వాటి ప్రభావం సున్నా. క్షణక్షణానికీ దిగనాసిల్లుతున్న రెడ్డిపరిస్థితిని చూస్తూ దిగులుగా కూర్చోవడం మినహా నేను చేయగలిగింది ఏమీ లేదే అని నా దుగ్ధ. ఇప్పట్లోలాగా అప్పట్లో ‘ఒన్ నాట్ యైట్లు’ .. ‘ఒన్ నాట్ ఫోర్లు’ లేవు!
తెల్లవారుతుండంగా ఎవరో రావినూతలవారి ట్రాక్టర్ని పట్టుకొచ్చారు. దాంట్లో రెడ్డిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించేసరికే ఆలస్యమైపోయింది.
డాక్టర్లు ఎంత పోరాడినా రెడ్డి ప్రాణాన్ని కాపాడలేకపోయారు.
విషంకాటుతో నల్లబడ్డ రెడ్డిశవాన్ని చూడటానికి ఊరు ఊరంతా తరలి వచ్చారు. రెడ్డి పదేళ్ల కొడుకుచేత కర్మకాండ జరిపించింది రాములమ్మ.
*                     *                   *           
కులాచారం ప్రకారం జరగాల్సిన తంతులన్నీ అయిన తరువాత  పదిరోజులకు రెడ్డికుటుంబానికి బ్యాంకునుంచీ రావాల్సిన పరిహారం  ఇప్పించడంకోసం రాములమ్మను పిలిపించాను.
రాములమ్మ అవతారం చూసి ఆశ్చర్యపోయాను. ‘రెండువారాల కిందట లోనుకోసం వచ్చి యాగీచేసిన మనిషేనా ఈమే! ఈ కాలంలోకూడా ఇలా భర్త పోయినతరువాత శిరోముండనం చేయించుకునే భార్యలున్నారా!’ ఉసూరుమన్నది ప్రాణం.
పత్రాలమీద వేలుముద్రలేస్తూ భోరుమని ఏడ్చేసింది రాములమ్మ. ఇంత చిన్నవయసులో ఆమె కొచ్చిన కష్టం సామాన్యమైనదా!
మొగుడూ పెళ్లాలనుకున్న తరువాత అప్పుడప్పుడు ఏవో కీచులాటలు తప్పవు. కలసి ఏడడుగులు నడిచి జీవితంలో కొంతదూరం గడచివచ్చిన జంటలు ఏవేవో కారణాలవల్ల విడిపోతే విడిపోవచ్చు. కానీ మనస్సుల్లోని ఆ పాత మధురస్మృతి పరిమళాలను వదిలించుకోవడం అంత తేలికా!
రాములమ్మ సంగతి ఎలా ఉన్నా రెడ్డి మనస్తత్వం నాకు బాగా తెలుసు. చాలాకాలంగా దగ్గర్నుంచి పరిశీలించినవాణ్ణి.
ఆ రోజు రాములమ్మ పాముబుట్టను లోపల పెట్టమని పురమాయించినప్పుడు రెడ్డిముఖం  చూడాలి.  పెళ్ళాంమీద ఎంత ప్రేమ లేకపోతే అంతలా బాధపడతాడు!
'పాముల్ని ఆడించుకుంటూ పొట్టపోసుకునే ఆడదయ్యా అది! జీవనాధారాన్నట్లా లాగేసుకుంటే పిలగాడిని సాక్కునేదెట్లా సామీ? సారుకి మీరే ఎవరైనా చెప్పండి! పాముల్ని  తిరిగి ఇప్పించండ'ని బ్యాంకు స్టాఫు దగ్గర తెగ మొత్తుకున్నసంగతి అప్పట్లోనే చూచాయగా తెలిసింది నాకు.
రెండు మూడు కిస్తీలన్నా బాషాచేత కక్కించి పాముల్ని తిరిగిచ్చేద్దామని నా ఆలోచన. రాములమ్మ పేరుతో తీసుకున్న లోను డబ్బులు వాడుకుంది బాషానే అని రెడ్డి రెండు మూడుసార్లు నా దగ్గర వాపోయినట్లూ గుర్తు. ఇంతలోనె ఇలాగయింది! అసలు ఆడించుకునే పాములకి విషపు కోరలు తీసేస్తారని విన్నాను. మరి రెడ్డి పాముకాటువల్ల ఎలా చనిపోయినట్లు?
రాములమ్మే అడిగిందో? పెళ్లాంబిడ్డల బాధ చూడలేక తనే అనుకున్నాడో? పాముల్ని విడిపించాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు చాలాసార్లు స్టోరురూములో తచ్చాడాడు రెడ్డి. బుట్టలోని పాముల్ని చీకట్లో తప్పించి భార్యకి ఇచ్చేయాలనుకున్నట్లున్నాడు పిచ్చిరెడ్డి! కోరలింకా తీయని పాములు అవని తెలీక మొత్తానికి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడా ప్రేమికుడు.. పాపం!
రెడ్డి దుర్మరణానికి నేనూ ఒకరకంగా కారణమేనా? పాముమంత్రంతో ఎంతోమందిని గట్టెక్కిచ్చానని గొప్పలు చెప్పుకునే బాషా రెడ్డిని ఆ గండంనుంచి ఎందుకు బైటపడేయలేక పోయినట్లు? మంత్రగాడిగా బాషా సిన్సియారిటీని అనుమానించాల్సిన పని లేదు. ఒక్కఫోన్ కాల్ కే పక్కలోని రాములమ్మనికూడా పట్టించుకోకుండా పరుగెత్తుకొచ్చాడంత రాత్రి పూట! ఆ మంత్ర తంత్రాలు.. నాటు వైద్యం యాగదీక్షతో చేసాడు.
లోపం ప్రయత్నంలో ఎంతమాత్రం లేదు. ఏమన్నా ఉంటే గింటే.. ముందునుంచీ అనుమానిస్తున్నట్లు ఆ మంత్ర తంత్రాల్లోనే ఉండి ఉండాలి!
ఇన్ని తెలిసీ.. మరెందుకు రెడ్డిని పాము కాటేసిందని తెలియగానే నాకూ ముందు బాషా   మంత్ర తంత్రాలే గుర్తుకొచ్చాయి?! వెంటనే సరైన చికిత్స అందించే సౌకర్యం అందుబాటులో ఉండుంటే నేనీ బాషాను కనీసం బ్యాంకులోకి కూడా అడుగు పెట్టనిచ్చుండే వాణ్ణి కాదు. అందులో మాత్రం అనుమానం లేదు.
నాలాగా ఇంకెందరో? నమ్మకం లేకపోయినా ఇలాంటి మంత్రగాళ్ల చేతిలో విలువైన ప్రాణాలు పెట్టేవాళ్ల సంఖ్య తగ్గాలంటే  వెంటనే నేను చేయాల్సిన పనేమిటి? బాషాలాంటి మాయగాళ్లను తరిమి కొట్టాలి.
తరువాత?!
పదిరోజుల తరువాత బ్యాంకు కొచ్చిన బాషానే ఆ ప్రశ్నకు సమాధానం అందించాడు. రాములమ్మ పాతబాకీ పూర్తిగా చెల్లించి పోవడానికి వచ్చి  'పెనుగొండ బదిలీ అయింది సార్! ఫ్యామిలీ అక్కడే ఉంది. వెళ్ళిపోతున్నాను' అన్నాడు.
ఈసారి ఎవరూ ఆపే ప్రయత్నం చెయ్యలేదు కాబోలు!
'లేదు. నేనే రిక్వస్టు పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. నేను పోయినా నాలాంటి మాయగాడు ఇంకెవడో పుట్టుకొస్తాడు. జనం మళ్లా వాళ్లనే నమ్మి మోసపోతుంటారు. ఇట్లాంటివేవీ లేకుండా ఉండాలంటే ఇక్కడే ఒక మంచి ఆసుపత్రి రావాలి సార్! అదీ నా రిక్వెస్టు' అన్నాడు పోతూ  పోతూ.

ఇప్పుడు చెరువుపల్లిలో ప్రారంభమవుతున్న రెడ్డి ఆసుపత్రికి అలా అప్పట్లోనే ఆలోచనాబీజం పడింది.
‘ఆలోచన సరే! మారుమూల పల్లెల్లో లాభాపేక్ష లేకుండా వైద్యమందించే క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా ఈ వ్యాపారయుగంలో?
‘ఉన్నార’ని నిరూపించినవాడు రెడ్డి కొడుకు. స్కాలర్షిప్పులమీదైనా సరే  వైద్యం చదువుకుంటే తండ్రి పేరుమీదనే ఓ మంచి ‘ఆసుపత్రి’ పెట్టుకోవచ్చని అప్పట్నుంచీ అతగాడిని ప్రోత్సహించి సహకారమందించింది నేనే.
ఇప్పటికైనా ‘రెడ్డి ఆసుపత్రి’ కల సాకారమవుతున్నందుకు సంతోషంగా ఉంది.
   
                                                                                                                                       
-కర్లపాలెం హనుమంతరావు
















Sunday, June 14, 2015

తెలుగోడి తెలుగ్గోడు!- సరదా చర్చ



 తెలుగు కోతులు  
టెలుగు వినను
టెలుగు కనను
టెలుగు అనను


రుగ్వేదంలో ఆంధ్రులున్నారు. రామాయణంలో సీతకోసం ఆంధ్రదేశంలో వెదకడం ఉంది. పోతన భాగవతం ప్రకారం బలి సంతానంలో ఆఖరివాడు ఆంధ్రుడే. యుధిష్ఠిర చక్రవర్తి పట్టాభిషేకోత్సవానికి హాజరైన రాజులలో ఆంధ్రరాజూ ఒకడు. పురాణమో, పుక్కిటపురాణమో.. ఒక లెక్కప్రకారం ఆంధ్రులంతా విశ్వామిత్ర మహర్షి సంతానమే. విశ్వామిత్రుడు విశిష్టిమైన వ్యక్తి. గురువునుమించి ఎదగాలన్న తపన  ఆయనది. ఎన్నో ఉద్యమాలకు ఆయన  స్ఫూర్తిప్రదాత.  సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపరవిధాత. త్రిశంకుస్వర్గనిర్మాత. గాయత్రీమంత్ర ఆవిష్కర్త. వంకాయ, టెంకాయ, గోంగూరవంటి విడ్డూరాలన్నీ ఆయన ప్రసాదాలే.  తెలుగువాడికి అందుకే అవంటే అంత ప్రీతి. దీక్ష.. కక్ష తెలుగువాళ్లందరికీ విశ్వామిత్ర మహర్షినుంచే వారసత్వపు లక్షణాలుగా సంక్రమించాయేమోనని అనుమానం.  
రామాయణంలోని కిష్కింధ  ఆంధ్రదేశంలోని ఓ అంతర్భాగమేనని  వాదన ఉంది. ఆ లెక్కన మనమందరం కిష్కింధవాసులమే! అన్నదమ్ముల మత్సరం వాలిసుగ్రీవులనుంచి అబ్బిన జబ్బేమో! వాయుపుత్రుడి లక్షణాలూ తెలుగువాడికి ఎక్కువే మరి!
స్వామిభక్తి తెలుగువాడికి మరీ విపరీతం. స్వామికార్యం తరువాతే వాడికి ఏ స్వకార్యమైనా. ఆరంభశూరత్వం, అత్యుత్సాహం ఆంధ్రుల గుత్తసొత్తు. చూసి రమ్మంటే కాల్చి వస్తేనే వాడికి తృప్తి! కొమ్మ తెమ్మంటే కొండను  పెకలించుకొచ్చాడంటే వాడు కచ్చితంగా తెలుగువాడే. ఆ రావడంలోకూడా ఆలస్యమవడం వాడి ప్రత్యేక లక్షణం. కోటిలింగాలు తెమ్మని రాములువారు  ఆజ్ఞాపిస్తే ఆంజనేయులుగారు ఏమి చేసారు? ఒకటి తక్కువగా తెచ్చుకొచ్చారు! ఆర్భాటంగా మొదలుపెట్టి అసంపూర్తిగా చుట్టబెట్టడం తెలుగన్నకు  మొదట్నుంచీ అలవాటే!  స్వశక్తియుక్తులు మరొకడు పనిగట్టుకొని పొగిడితేగాని గుర్తెరగలేని బోళాతనం తెలుగువాడిది. సముద్రాలు లంఘించే శక్తిగలిగివుండీ ఏ స్వామివారి పాదాల చెంతో విశ్రాంతి కోరుకోవడం తెలుగువాడికి అనాదిగా వస్తున్న బలహీనత.
'తెలుగువాడివి అన్నీ అవలక్షణాలేనా?' అని ఉసూరుమనుకోవాల్సిన అవసరం లేదు.  వనవాసంలో రామసోదరులను ఆదరించిన శబరితల్లి తెలుగుతల్లే! చేసిన ఘనకార్యం  చెప్పుకొనే  సంప్రదాయం  అప్పట్లో లేదు. ఇంకెంతమంది కడుపునింపిందో  ఆ అన్నపూర్ణమ్మ తల్లి అందుకే మనకి తెలీదు. తెలుగుమహిళకు భోజనం వడ్డించడమంటే మహాసరదా కదా! పేరుకే అన్నపూర్ణమ్మ  కాశీనివాసి. అసలు మసలేదంతా మన తెలుగునేల నలుచెరగులే కదా! డొక్కా సీతమ్మలు, మంగళగిరి బాలాంబలు అడుగడుక్కీ తారసిల్లే పూర్ణగర్భలండీ తెలుగురాష్ట్రాలు రెండూ!
ఉద్యమమైనా సరే.. ఉప్పు సత్యాగ్రహమైనా సరే సొంతముద్రంటూ లేకుండా తెలుగువాడు ఒక్కడుగు ముందుకు కదలడు. బౌద్ధాన్ని సంస్కరించి మరీ ప్రచారం చేసిన నాగార్జునుడు మన  తెలుగువాడే! తెలుగువాడికి కొత్తొక వింత. పాతొక రోత. అందాకా నెత్తికెత్తుకొన్న జైనం శైవంరాకతో హీనం అయిపోయింది! ఆనక వాడు  వైదికం మోజులోపడ్డాక శైవం రాష్ట్రాల  శీవార్లలోకి పాతిపోయింది!
అటు ఆర్యులు.. ఇటు ద్రవిడులు! ఇద్దరూ ముద్దే మనకు! రెండు సంస్కృతుల పండుగలు  మనం సంబరంగా చేసుకొంటాం! పోతరాజు కృష్ణుణ్ణి తెలుగుదేవుడు చేసేసాడు. రామదాసు ఇక్ష్వాకులవాసిని సతీసోదరసమేతంగా భద్రగిరికి కట్టేసాడు.  కృష్ణరాయలు పాండిత్యప్రకర్షతో రంగధాముణ్ణి తెలుగుపెళ్ళికొడుకుగా తయారుచేసాడు. పాపయ్యశాస్త్రి భక్తిప్రవత్తులకు బద్ధుడైనట్లు బుద్ధభగవానుడు తెలుగు చిరునామా స్వీకరించాడు. అందరూ కావాలనుకొనే తత్వం తెలుగువాడిది. అయినా అతగాడే ఎవరికీ అక్కర్లేదు! భారతంలో తెలుగువాడి ఊసు ఆట్టే లేకపోయినా 'వింటే భారతమే వినాలి' అంటూ టాంటాం కొట్టుకొనే రకం తెలుగువాడు!
సాహసంలో మాత్రం? మనం వెనుకంజా? తైలంగ సామ్రాజ్యాన్ని స్థాపించాం. సుమిత్రా, జావా ద్వీపాల్లో వలస రాజ్యదీపాలను వెలిగించాం. సయాడోనిసిచయాల్లాంటి సుదూర ప్రాంతాల్లో నిబద్ధతతో బౌద్ధదర్మాన్ని ప్రచారం చేసి వచ్చాం. ఈజిప్టురాణికి చీనాంబరాలు కట్టబెట్టిన ఘనత మన  తెలుగువాడిదే! అజంతా, అమరావతి, సాంచి క్షేత్రాలలో అసమాన శిల్పకళావైభవాన్ని సృజించిన కళాతపస్వి మన తెలుగుయశస్వి. ధాన్యకటక విశ్వవిద్యాలయం స్థాపించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన గురువులు మన తెలుగువారు. మానవనాగరికత మణికిరీటంలో నిరంతరం వెలుగులు చిమ్మే కోహినూరు వజ్రాలు కదుటండీ మన తెలుగువారు!
మేధస్సులోమాత్రం మనమేమన్నా అధమస్థులమా? హైదవం క్షీణదశలో  దక్షిణాది గోదావరీతటంనుంచే మహాతత్త్వవేత్త శంకరాచార్యులు ప్రభవించించింది. స్వధర్మ పునరుత్థనార్థం జన్మించిన పుణ్యమూర్తి విద్యారణ్యుడూ తెలుగు పురుషుడే! ఆయన తోడాబుట్టిన సాయనుడు వేదాలకు  భాష్యం చెప్పిన ఉద్దండుడు.  ఉత్తరాది కావ్యాలకు  వ్యాఖ్యానాలు చేసిన మల్లినాథుడుది తెలుగునాడు. జగన్నాథ పండితరాయలు హస్తిన ఎర్రకోట  యవనసుందరి అంకపీఠంపైన తెలుగుప్రతిభను సుప్రతిష్ఠంచిన ఘనుడు.   దేశదేశాల తాత్వికకేతనం విజయవంతంగా ఎగురువేసిన తెలుగు జ్ఞాననికేతనం రాధాకృష్ణపండితుడు. అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలార్జించిన కోడి రామ్మూర్తి, సి.కె. నాయుడు, ఎల్లాప్రగడ సుబ్బారావు మన తెలుగువెలుగులేనంటే  తెల్లబోతాం మనం.
గొప్పవాళ్లెప్పుడూ తెలుగువాళ్లు కారనీ.. తెలుగువాళ్లయుంటే గొప్పవాళ్లే అవలేరనీ మన తెలుగువాళ్లకో గొప్ప నమ్మకం. బొంబాయి చేరితేగాని కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు నాలుగు కాసులు కళ్లచూడలేదు. తమిళదేశం చెప్పిందాకా  బాలమురళి గానగాంధర్వుడని  మనం ఒప్పుకోలేదు! తెలుగువాడు పైకిరావాలంటే పైకన్నా పోవాలి. దేశందాటి పైకన్నా పోయిరావాలి! ఎందుకిలా?
తెలుగువాడి వెటకారంవాడి మరీ అంత అత్యధికమా?! మహామాత  కాళీదేవత ప్రత్యక్షమయితే మరోడయితేసాగిలపడి మొక్కేవాడు. ఆమె అంగసౌష్టవంచూసి ఫక్కున నవ్వాడంటే తెనాలి రామలింగడు తెలుగువాడు కాబట్టేగా! వేలెడంత లేకపోయినా జానెడంతవాణ్ణి చూసి ‘మూరెడంతైనా లేడ’ని మూతి మూడువంకర్లు తిప్పాడంటే నిక్షేపంగా వాడు తెలుగువాడే అయివుండాలి.
.
పాకశాస్త్రంలో తెలుగింటి  ప్రావీణ్యమే వేరు. తెలుగు తాళింపు దినుసులు మరే ఇతర ప్రాంతాలలో కనిపించవు. తెలుగు వర్ణమాలా ఓ వంటింటి పోపుపెట్టె వంటిదే సుమా! సాతాళించగల చేవ ఉండాలేగాని.. తెలుగువంటకంలా తెలుగురచనా ఒక నవరసాల విందు.
గంగాజలం తెచ్చి కృష్ణ, గోదావరి, తుంగభద్రల్లో కలగలపడమే తెలుగుదనం కలివిడిదనం. తాగునీటినిసైతం ‘మంచి’నీరుగా పిలిచే మంచి నైజం తెలుగువాడి సొంతం! తెలుగుభాషకూ మంచినీరులా మేధోదాహార్తిని తీర్చే సత్తా ఉంది. శబ్దానికి  పూర్తిన్యాయంచేసే శక్తి ఇటాలియన్  తరువాత  ఒక్క తెలుగక్షరంలోనే ఉందిట! ఇది ఆధునిక భాషాశాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్న మాట. కంప్యూటర్ వేగాన్ని అందిపుచ్చుకోగల 'బైట్ స్(Bytes)' సామర్థ్యం తెలుగులిపికి అలంకారప్రాయం- అని  సాఫ్టువేరు నిపుణులు వెలిబుస్తున్న అభిప్రాయం.  ఏ పలుకునైనా తనలో మంచినీళ్ల ప్రాయంగా కలుపుకోగల కలివిడితనం తెలుగువర్ణమాలకు ప్రత్యేకం.
ద్రవిడ సంస్కారి చిన్నయసూరిచేత చక్కని వచన రచన చేయించిందీ తెలుగు పలుకుబడే! తెలుగుమాట తేటతనానికి దాసోహమయే బ్రౌన్ దొర నిఘంటువు నిర్మాణానికి పూనుకొన్నది!  జిజ్ఞాసకు తగ్గ ఉపజ్ఞ తెలుగుభాషామతల్లి  ప్రజ్ఞ.
'ఆంధ్రదేశపు మట్టి.. అది మాకు కనకంబు' అని ఆ మహామహులు తలవంచినే చోటుకే  ఇప్పుడు మనం తలవంపులు తెస్తున్నాం. అదీ విచారం!
పరాయితనం భుజానమోసే ఔదార్యంలోనే తెలుగువాడెందుకో ముందునుంచీ తరించిపోతున్నాడు?! సగటు తెలుగు నాలికకు తెలుగు పదాల మాధుర్యం వెగటు?! ఆదిలో  సంస్కృతం, మధ్యలో హిందూస్తానీ, ఇప్పుడు ఆంగ్లం! వట్టి తెలుగుమాత్రమే తెలిసుంటే అది  వాజమ్మతనానికి నిదర్శనం! ‘గొప్పోళ్ళు చాలామందికి తెలుగురాదు. కాబట్టి తెలుగురాకపోవడమే గొప్పదన’మనుకొనే తెలివితక్కువతనం రోజురోజుకీ ఎక్కువవ్తుతున్నదీ తెలుగునాట! ‘విజ్ఞానమంటే కేవలం ఇంగ్లీషుమాట. పాండిత్యమంటే కేవలం సంస్కృత పదాల ఊట’. ఇదీ  ప్రతి సగటు తెలుగునోటా నేడు వినిపిస్తున్న పాట! పరాయిభాషల రుచి నోటికి పట్టాలన్నా పసిదశలో బిడ్డకు ల్లిభాష పాలు పట్టాలా వద్దా! చావగొట్టినా సొంతభాషరాని చవటకి చావచితక్కొట్టినా పరాయి భాష వంటపట్టదని భాషాశాస్త్రవేత్తలే మొత్తుకొంటున్నారు!

భోజనాలయంలోకి వెళ్ళినప్పుడు 'వాటర్' 'చట్నీ' అంటేనేకానీ వడ్డించేవాడి తలకెక్కదా?! కొట్లాట్టానికి అక్కరకొచ్చే సొంతభాష న్యాయస్థానాల్లో ఫిర్యాదులిచ్చేందుకు ఎందుకు చేదో?! రోగాలకే కాదు.. వాటి నిదానానికి  వాడే మందులకూ  నోరుతిరగని లాటిన్ పేర్లు?! రైలు, రోడ్డు, పోస్టు, సైకిలు, ఫోను, సెల్ఫోను.. నిత్యవ్యవహారంలో నలిగే కొన్ని పదాలకు ప్రత్యామ్నాయం  లేక వాడుకలో ఉన్నాయంటే..ఏదో అర్థం చేసుకోవచ్చు. పుస్తకం, కలం, ప్రేక్షకుడు, సంతోషంవంటి పదాలకూ బుక్కు, పెన్ను, ఆడియను(నిజానికి ఆడియను అన్న మాటే తప్పు), హ్యాపీసు వంటి సంకర పదాలను వాడే తిక్కసంకరయ్యలు ఎక్కువయిపోతున్నారు! భేషజంకోసం, అతిశయంకోసం పరాయిభాషాపదాలను వేలంవెర్రిగా వాడే గురజాడ గిరీశాలు తలుగునాట రోజురోజుకూ ముదిరిపోతున్నారు!  ఆత్మగౌరవం ప్రాణప్రదంగా భావించే తెలుగువాడికెవడికైనా   ఇది చివుక్కుమనిపించే  అంశం.
తెలుగుగడ్డమీద తెలుగుబిడ్డ మెడలో తెలుగు పలకను' అంటూ పలకలా?! తెలుగులో ఏడ్చిన నేరానికి పసిదాని అరచేతికి వాతలా?!
పేరుకేనా మనది ప్రజాస్వామ్యం? పాలితుడి పలుకుమీద పాలకులకెందుకో ఇంత కోపం?!  జన్మతః జిహ్వమీద కొలువైన శబ్దదేవత కదా తల్లిభాష!  జంతుతతులకన్నా విలక్షణంగా బతుకును తీర్చిదిద్దే ఆ భాషామతల్లి  అంటే తెలుగువాడికి తగునా అంత చులకన?! తల్లిమీద, తల్లిభాషమీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి?!
***
కర్లపాలెం హనుమంతరావు
(డిసెంబరు 2012 'తెలుగు వెలుగు'లో ప్రచురితం)

(ఈ వ్యాసంలో ఉపయోగించుకొన్నవి సరసి, ఒన్ ఇండియావారి కార్టూనులు. వారికి ధన్యవాదాలు)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...